69. అరువది తొమ్మిదవ అధ్యాయము

గెలుపును గూర్చి విరాటోత్తరుల సంభాషణ.

ఉత్తర ఉవాచ
న మయా నిర్జితా గావః న మయా నిర్జితాః పరే।
కృతం తత్ సకలం తేన దేవపుత్రేణ కేనచిత్॥ 1
'తండ్రీ! నేను గోవులనూ జయించలేదు. శత్రువుల మీద విజయాన్నీ సాధించలేదు. ఈసమస్త కార్యాన్నీ ఎవరో ఒక దేవకుమారుడు చేశాడు. (1)
స హి భీతం ద్రవంతం మాం దేవపుత్రో న్యవర్తయత్।
స చాతిష్ఠద్ రథోపస్థే వజ్రసంహననో యువా॥ 2
నేను భయంతో పారిపోయి తిరిగి వస్తూంటే వజ్రం వలె బలిష్ఠమైన శరీరంగల తరుణుడైన దేవపుత్రుడు నన్ను మరలించి అతడు స్వయంగా రథంపై రథికుడై కూర్చున్నాడు. (2)
తేన తా నిర్జితా గావః కురవశ్చ పరాజితాః।
తస్య తత్కర్మ వీరస్య న మయా తాత తత్కృతమ్॥ 3
అతడే గోవులను జయించి తెచ్చాడు. కౌరవులను ఓడించాడు. తండ్రీ! ఇదంతా ఆ వీరుని పనే. నేను ఏమీ చేయలేదు. (3)
స హి శారద్వతం ద్రోణం ద్రోణపుత్రం చ షడ్ రథాన్।
సూతపుత్రం చ భీష్మం చ చకార విముఖాంచ్ఛరైః॥ 4
దుర్యోధనం వికర్ణం చ సనాగమివ యూథపమ్।
ప్రభగ్నమబ్రవీద్ భీతం రాజపుత్రం మహాబలః॥ 5
కృపాచార్యుడు, ద్రోణాచార్యుడు, అశ్వత్థామ, కర్ణుడు, భీష్ముడు, దుర్యోధనుడు - ఈ ఆరుగురు మహారథికులను అతడే తన బాణాలతో యుద్ధ విముఖులను చేశాడు. యూథపతి అయిన గజరాజు తన ఏనుగుల గుంపుతో పారిపోయినట్లు దుర్యోధనుడు, వికర్ణుడు మొదలయిన రాజకుమారులు భయంతో పారిపోసాగారు. అప్పుడు ఆ మహాబలుడు దేవపుత్రుడు దుర్యోధనునితో ఇలా అన్నాడు. (4,5)
న హాస్తినపురే త్రాణం తవ పశ్యామి కించన।
త్ర్యాయామేన పరీప్సస్వ జీవితం కౌరవాత్మజ॥ 6
"ధృతరాష్ట్రకుమారా! ఇపుడు హస్తినాపురంలో నీ ప్రాణరక్షణకు తగిన ఉపాయమేదీ నాకు కనిపించడం లేదు. కాబట్టి దేశ దేశాంతరాలలో తిరిగి నీ ప్రాణాలు రక్షించుకో. (6)
న మోక్ష్యసే పలాయంస్త్వం రాజన్ యుద్ధే మనః కురు।
పృథివీం భోఖ్ష్యసే జిత్వా హతో వా స్వర్గమాప్స్యసి॥ 7
రాజా! పారిపోయినా నీవు బతకలేవు. యుద్ధం మీద మనసుపెట్టు. జయించావా ఈ పృథ్వీరాజ్యాన్ని అనుభవిస్తావు. లేక మరణిస్తే స్వర్గం లభిస్తుంది. (7)
స నివృత్తో నరవ్యాఘ్రః ముంచన్ వజ్రనిభాంచ్ఛరాన్।
సచివైః సంవృతో రాజా రథే నాగ ఇవ శ్వసన్॥ 8
మహారాజా! ఈ మాట విన్నాడంతే. నరశ్రేష్ఠుడైన దుర్యోధనుడు సర్పంలా నుసకొడుతూ రథాన్ని మళ్లించుకొని వచ్చి మంత్రులందరూ చుట్టూ చేరి ఉండగా ఆ దేవపుత్రుని మీద వజ్రనిభమైన బాణవర్షాన్ని కురిపించాడు. (8)
తం దృష్ట్వా రోమహర్షోఽభూత్ ఊరుకంపశ్చ మారిష।
స తత్ర సింహసంకాశమ్ అనీకం వ్యధమచ్ఛరైః॥ 9
మారిషా! ఆ సమయంలో దాన్ని చూసిన నాకు భయంతో రోమాలు నిక్కపొడుచుకొన్నాయి. కాళ్లు వణకసాగాయి. కాని ఆ దేవపుత్రుడు తన బాణాలతో సింహసమాన పరాక్రమం కల దుర్యోధనునీ, అతని సైన్యాన్నీ తపింపచేశాడు. (9)
తత్ ప్రణుద్య రథానీకం సింహసంహననో యువా।
కురూంస్తాన్ ప్రహసన్ రాజన్ సంస్థితాన్ హృతవాససః॥ 10
ఏకేన తేన వీరేణ షడ్ రథాః పరినిర్జితాః।
శార్దూలేనేవ మత్తేన యథా వనచరా మృగాః॥ 11
సింహంతో సమానమైన దృఢమైన శరీరం కల ఆ తరుణవయస్కుడైన వీరుడు రథాలను అధిరోహించిన సైన్యాన్ని అంతటినీ ఛిన్నభిన్నం చేసి నవ్వుతూ ఆ కౌరవులను కూడా నేలమీద పడవేశాడు. వాళ్ల బట్టలు అపహరించబడ్డాయి. మదించిన సింహం అడవిలో తిరిగే జంతువులను పరాభవించినట్లుగా ఆ వీరుడైన దేవపుత్రుడు ఒంటరిగానే ఆ ఆరుగురు మహారథికులను ఓడించాడు.' (10,11)
విరాట ఉవాచ
క్వ స వీరో మహాబాహుః దేవపుత్రో మహాయశాః।
యే మే ధనమథాజైషీత్ కురుభిర్గ్రస్తమాహవే॥ 12
ఇచ్ఛామి తమహం ద్రష్టుమ్ అర్చితుం చ మహాబలమ్।
యేన మే త్వం చ గావశ్చ రక్షితా దేవసూనువా॥ 13
విరాటుడు అడిగాడు - 'కుమారా! యుద్ధంలో కౌరవులను వశపరుచుకొని మన ఆవులను గెలుచుకొని నిన్ను, మన ఆవులనుకూడా రక్షించిన ఆ మహాయశస్వి, మహాపరాక్రమశాలి, వీరుడు అయిన దేవపుత్రుడు ఎక్కడ ఉన్నాడు? నే నా వీరుడిని, పరాక్రమవంతుడిని చూడాలని, సత్కరించాలని కోరుకొంటున్నాను.' (12,13)
ఉత్తర ఉవాచ
అంతర్ధానం గతస్తత్ర దేవపుత్రో మహాబలః।
స తు శ్వో వా పరశ్వో వా మన్యే ప్రాదుర్భవిష్యతి॥ 14
ఉత్తరుడు చెప్పాడు. 'తండ్రీ! ఆ మహా బలవంతుడైన దేవపుత్రుడు అక్కడే అంతర్ధానం అయిపోయాడు. కాని అతడు రేపో, ఎల్లుండో తిరిగి ప్రత్యక్షమవుతాడని అనుకుంటున్నాను. (14)
వైశంపాయన ఉవాచ
ఏవమాఖ్యాయమానం తు ఛన్నం సత్రేణ పాండవమ్।
వసంతం తత్ర నాజ్ఞాసీద్ విరాటో వాహినీపతిః॥ 15
వైశంపాయనుడు చెప్పాడు - జనమేజయా! ఈ రీతిగా సంకేతపూర్వకంగా చెప్పినప్పటికీ సర్వసేనాధిపతి అయిన విరాటరాజు ప్రచ్ఛన్నంగా ఉన్న అర్జునుని గుర్తుపట్టలేకపోయాడు. (15)
తతః పార్థోఽభ్యనుజ్ఞాతః విరాటేన మహాత్మనా।
ప్రదదౌ తాని వాసాంసి విరాటదుహితుః స్వయమ్॥ 16
తరువాత మహాత్ముడైన విరాటుని అనుమతితో బృహన్నలారూపంలో ఉన్న అర్జునుడు యుద్ధంలో మహారథులనుండి తీసుకున్న ఆ వస్త్రాలనన్నింటిని స్వయంగా విరాటకన్య ఉత్తరకు ఇచ్చాడు. (16)
ఉత్తరా తు మహార్హాణి వివిధాని నవాని చ।
ప్రతిగృహ్యాభవత్ ప్రీతా తాని వాసాంసి భామినీ॥ 17
మంత్రయిత్వా తు కౌంతేయ ఉత్తరేణ మహాత్మనా।
ఇతికర్తవ్యతాం సర్వాం రాజన్ పార్థే యుధిష్ఠిరే॥ 18
తతస్తథా తద్ వ్యదధాత్ యథావత్ పురుషర్షభ।
సహ పుత్రేణ మత్స్యస్య ప్రహృష్టా భరతర్షభాః॥ 19
వివిధవర్ణాలుకల, మిక్కిలి విలువైన ఆ నూతనవస్త్రాలను తీసుకుని ఉత్తర చాలా ఆనందించింది. జనమేజయా! కుంతీనందనుడు అర్జునుడు మహాత్ముడైన ఉత్తరునితో రాజయిన యుధిష్ఠిరుని వెల్లడిచేసే విషయం ఆలోచించి, ఏమేమి చేయాలో నిశ్చయించుకొన్నాడు. నరోత్తమా! అనంతరం అతడు ఆ నిర్ణయం అనుసరించి అన్నికార్యాలు చక్క బెట్టాడు. భరతకుల శిరోమణులైన పాండవులు మత్స్యరాజు కుమారుడైన ఉత్తరునితో కలిపి ఆ ఏర్పాట్లన్నీ చేసి మిక్కిలి సంతోషించారు. (17-19)
వి॥సం॥ ఇతికర్తవ్యతాం = చేయదలచిన పనిని. యుధిష్ఠిరుని రాజసింహాసనంపై ఆసీనుని చేయుట మొదలయిన పనిని (నీల)
వి॥తె॥ తెలుగులో ఇక్కడ మరోచిన్న సన్నివేశం కల్పించబడింది. ఆరోజు అందరూ కలుసుకొనటానికి నిశ్చయించుకొని ధర్మజుని నివాసంలో కలిశారు. విషయమంతా చెప్పుకొన్నాక అర్జునుడు ధర్మరాజు ప్రవర్తనగురించి భీమునితో ఇలా అన్నాడు. "ఈరోజు మధ్యాహ్నం నన్ను చూడటానికి ఎందుకో అన్నగారికి మొగ మొప్పలేదు" అన్నాడు. అపుడు ధర్మరాజు" ఏమీలేదు. విరాటుడు ఉత్తరుని పొగడుతూ ఉంటే బృహన్నల ఉంటే లోటేమిటి?" అన్నాను. అపుడతడు నన్ను సారెతో కొట్టాడు. నెత్తురు వచ్చింది. అది నీకు కనపడకుండా గుడ్డతో కప్పుకొన్నాను. అంతే గాని నీమీద అసంతృప్తితో కాదు" అని ఆ దెబ్బ చూపించాడు. చూసి అర్జునుడు "ఈమనుజాధముని ఇపుడే మర్దిస్తా" అంటూ లేచాడు. అపుడు ధర్మరాజు "మనం ఎవరమో విరాటునికి తెలియదు. ఆయన చాటున మనం అజ్ఞాతవాసం చేశాము. ఇపుడతనికి అపకారం చేయదగదు. మనమెవరమో తెలిసే విధంగా ప్రయత్నిద్దాము. అపుడు కూడా అతడు పొగరుబోతుతనం ప్రదర్శిస్తే అప్పుడు చూద్దాం" అని సముదాయించాడు. ఇందులో అర్జునునికి ధర్మరాజు మీదున్న గౌరవభావం, భక్తిభావం ప్రస్ఫుటమవుతాయి. మరునాడు పాండవులు సింహాసనం మీద కూర్చుండటానికి భూమిక కూడా అయింది.
ఇతి శ్రీమహాభారతే విరాటపర్వణి గోహరణపర్వణి విరాటోత్తర సంవాదే ఏకోన సప్తతితమోఽధ్యాయః॥ 69 ॥
ఇది శ్రీమహాభారతమున విరాట పర్వమున గోహరణపర్వమను ఉప పర్వమున విరాట ఉత్తర సంభాషణ అను అరువది తొమ్మిదవ అధ్యాయము. (69)