68. అరువది ఎనిమిదవ అధ్యాయము
విరాటుడు ఉత్తరుని గురించి చింతించుట - ఉత్తరుడు నగరప్రవేశము చేయుట.
వైశంపాయన ఉవాచ
ధనం చాపి విజిత్యాశూ విరాటో వాహినీపతిః।
వివేశ నగరం హృష్టః చతుర్భిః పాండవైః సహ॥ 1
వైశంపాయనుడు అన్నాడు. జనమేజయా! సేనాపతి అయిన విరాటరాజు (దక్షీణ గోష్ఠంలోని) గోవులను జయించి శీఘ్రంగా నలుగురు పాండవులతో కలిసి మిక్కిలి సంతోషంతో నగరంలో ప్రవేశించాడు. (1)
జిత్వా త్రిగర్తాన్ సంగ్రామే గాశ్చైవాదాయ సర్వశః।
అశోభత మహారాజ సహపార్థః శ్రియా వృతః॥ 2
మహారాజా! యుద్ధంలో త్రిగర్తులను ఓడించి, గోవులన్నీ మరల్చి, విజయలక్ష్మీ సంపన్నుడైన విరాటరాజు కుంతీ పుత్రులతో కలిసి మిక్కిలి శోభించాడు. (2)
తమాసనగతం వీరం సుహృదాం హర్షవర్ధనమ్।
ఉపాసాంచక్రిరే సర్వే సహపార్థైః పరంతపాః॥ 3
మిత్రులకు ఆనందాన్ని పెంచే వీరుడైన విరాటరాజు రాజసింహాసనంమీద ఆసీనుడయ్యాడు. శత్రువులకు సంతాపకారకులైన సమస్త శూరవీరులు కుంతీపుత్రులతో పాటు రాజును సేవిస్తూ సమీపంలోనే కూర్చున్నారు. (3)
ఉపతస్థుః ప్రకృతయః సమస్తా బ్రాహ్మణైః సహ।
సభాజితః ససైన్యస్తు ప్రతినంద్యాథ మత్స్యరాట్॥ 4
బ్రాహ్మణులతోసహా సమస్త ప్రకృతివర్గం కూర్చునిఉన్నారు. అందరూ సైన్యంతో సహా మత్స్యరాజును అభినందించి స్వాగతసత్కారాలు చేశారు. (4)
విసర్జయామాస తదా ద్విజాంశ్చ ప్రకృతీంస్తథా।
తథా స రాజా మత్స్యానాం విరాటో వాహినీపతిః॥ 5
ఉత్తరం పరిప్రచ్ఛ క్వ యాత ఇతి చాబ్రవీత్।
ఆచఖ్యుస్తస్య తత్ సర్వం స్త్రియః కన్యాశ్చ వేశ్మని॥ 6
అపుడు మత్స్యదేశపురాజూ, సేనాపతీ అయిన విరటుడు బ్రాహ్మణులను ప్రకృతివర్గాన్ని వీడుకొలిపి (అంతఃపురానికి వెళ్లి0 ఉత్తరునిగూర్చి "రాజకుమారుడు ఉత్తరుడు ఎక్కడకు వెళ్లాడు?" అని అడిగాడు. అప్పుడు ఆ గృహంలో ఉండే స్త్రీలు, కన్యలు అతనిని గూర్చి అన్ని విషయాలు చెప్పారు. (5,6)
అంతఃపురచరాశ్చైవ కురుభి ర్గోధనం హృతమ్।
విజేతుమభిసంరబ్ధః ఏక ఏవాతిసాహసాత్।
బృహన్నలాసహాయశ్చ నిర్గతః పృథివీంజయః॥ 7
అంతఃపురంలో తిరిగే స్త్రీలు కూడా చెప్పారు. "మన గోధనాన్ని కౌరవులు హరించారు. అందుకని కుమార భూమింజయుడు మిక్కిలి సాహసంతో కోపించి ఒక్కడూ గోవులను జయించి తీసుకురావడానికి బృహన్నలతో కలిసి బయలుదేరాడు. (7)
ఉపయాతానతిరథాన్ భీష్మం శాంతనవం కృపమ్।
కర్ణం దుర్యోధనం ద్రోణం ద్రోణపుత్రం చ షడ్రథాన్॥ 8
శంతనునందనుడైన భీష్ముడు, కృపాచార్యుడు, కర్ణుడు, దుర్యోధనుడు, ద్రోణాచార్యుడు, ద్రోణాచార్యుని కొడుకు అశ్వత్థామ - ఈ ఆరుగురు అతిరథవీరులు యుద్ధం చేయడానికి వచ్చారని తెలిసింది.' (8)
వైశంపాయన ఉవాచ
రాజా విరాటోఽథ భృశాభితప్తః
శ్రుత్వా సుతం త్వేకరథేన యాతమ్।
బృహన్నలాసారథిమాజివర్ధనం
ప్రోవాచ సర్వానథ మంత్రిముఖ్యాన్॥ 9
వైశంపాయనుడు చెప్పాడు. జనమేజయా! యుద్ధం అంటే ముందడుగు వేసే తన కొడుకు బృహన్నలను సారథిగా తోడ్కొని ఒక్కరథం సహాయంతోనే కౌరవులను ఎదిరించడానికి వెళ్లాడని విని విరాటరాజుకు మిక్కిలి సంతాపం కలిగింది. అతడు తన మంత్రి ముఖ్యులందరితో ఇలా అన్నాడు. (9)
సర్వథా కురవస్తే హి యే చాన్యే వసుధాధిపాః।
త్రిగర్తాన్ నిఃసృతాన్ శ్రుత్వా న స్థాస్యంతి కదాచన॥ 10
కౌరవులే కానీ ఇతరరాజులెవరైనా కానీ యుద్ధంలో త్రిగర్తులు వెన్నుచూపి పారిపోయారని వింటే వారు ఎప్పుడూ ఇక్కడ నిలువలేరు. (10)
తస్మాద్ గచ్ఛంతు మే యోధాః బలేన మహతా వృతాః।
ఉత్తరస్య పరీప్సార్థం యే త్రిగర్తైరవిక్షతాః॥ 11
కాబట్టి నా సైనికులలో త్రిగర్తులలో జరిగిన యుద్ధంలో గాయపడని వారంతా అధికమైన సైన్యంతో రాజకుమారుని రక్షణకోసం వెళ్లండి. (11)
హయాంశ్చ నాగాంశ్చ రథాంశ్చ శీఘ్రం
పదాతిసంఘాంశ్చ తతః ప్రవీరాన్।
ప్రస్థాపయామాస సుతస్య హేతోః
విచిత్రశస్త్రాభరణోపపన్నాన్॥ 12
అనంతరం అతడు కుమారుని రక్షణకోసం చిత్రవిచిత్రమైన ఆయుధాలు, ఆభరణాలు ధరించిన ఆశ్వికులను, గజారోహకులను, రథికులను, కాల్బలాన్ని మహావీరులైన వారిని ఎంచి పంపించాడు. (12)
ఏవం స రాజా మత్స్యానాం విరాటో వాహినీపతిః।
వ్యాదిదేశాథ తాం క్షిప్రం వాహినీం చతురంగిణీమ్॥ 13
కుమారమాశు జానీత యది జీవతి వా న వా।
యస్య యంతా గతః షండః మన్యేఽహం స న జీవతి॥ 14
అపుడు వాహినీపతి మత్స్యనరేశుడు అయిన విరాటరాజు తనయొక్క చతురంగబలాలనూ ఇలా ఆదేశించాడు - "వెళ్ళండి. కుమారుడు జీవించిఉన్నాడా లేడా వెంటనే జాడ తెలుసుకోండి. సారథిగా వెళ్లిన నపుంసకుడు నా ఉద్దేశ్యంలో అయితే ఇప్పటికి బ్రతికి ఉండడు" (13,14)
వైశంపాయన ఉవాచ
తమబ్రవీద్ ధర్మరాజో విహస్య
విరాటరాజం తు భృశాభితస్తమ్।
బృహన్నలా సారథిశ్చేన్నరేంద్ర
పరే న నేష్యంతి తవాద్య గాస్తాః॥ 15
సర్వాన్ మహీపాన్ సహితాన్ కురూంశ్చ
తథైవ దేవాసురసిద్ధయక్షాన్।
అలం విజేతుం సమరే సుతస్తే
స్వనుష్ఠితః సారథినా హి తేన॥ 16
వైశంపాయనుడు అన్నాడు. జనమేజయా! విరాటరాజు చాలా ఆందోళనగా ఉండడం చూసి ధర్మరాజు అతనితో నవ్వుతూ ఇలా అన్నాడు - 'రాజా! బృహన్నల సారథి అయితే శత్రువులు నేడు మీ గోవులను తీసుకు వెళ్లలేరని నమ్మవచ్చు. మీహితం కోరే ఆ సారథియొక్క సహకారం వలన అన్ని కార్యాలు చక్కబడతాయి. మీకుమారుడు యుద్ధంలో సమస్త రాజులతో వచ్చిన కౌరవులనే ఏమిటి, దేవతలను రాక్షసులను సిద్ధులను యక్షులను కూడ నిశ్చయంగా జయింపగలడు.' (15,16)
వైశంపాయన ఉవాచ
అథోత్తరేణ ప్రహితా దూతాస్తే శీఘ్రగామినః।
విరాటనగరం ప్రాప్య విజయం సమవేదయన్॥ 17
వైశంపాయను డన్నాడు. రాజా! అదే సమయంలో ఉత్తరుడు పంపించిన వేగవంతులైన దూతలు విరాటనగరానికి వచ్చి విజయవార్తను నివేదించారు. (17)
రాజ్ఞస్తత్ సర్వమాచఖ్యౌ మంత్రీ విజయముత్తమమ్।
పరాజయం కురూణాం చాప్యుపాయాంతం తథోత్తరమ్॥ 18
సర్వా వినిర్జితా గావః కురవశ్చ పరాజితాః।
ఉత్తరః సహ సూతేన కుశలీ చ పరంతపః॥ 19
మంత్రులు ఆ సమాచారమంతా మహారాజుకు వినిపించారు. మన పక్షానికి గొప్పవిజయం, కౌరవులకు పరాజయం లభించాయి. రాజకుమారుడు ఉత్తరుడు నగరానికి వస్తున్నాడు. గోవులన్నిటినీ జయించి తీసుకొని వస్తున్నాడు. కౌరవులు ఓడి పారిపోయారు. శత్రుసంతాపకుడు ఉత్తరకుమారుడు సారథిసహితంగా కుశలంగా ఉన్నాడు. (18,19)
యుధిష్ఠిర ఉవాచ
దిష్ట్వా వినిర్జిత గావః కురవశ్చ పలాయితాః।
నాద్భుతం త్వేవ మన్యేఽహం యత్తే పుత్రోఽజయత్కురూన్॥ 20
ధ్రువ ఏవ జయస్తస్య యస్య యంతా బృహన్నలా।
(దేవేంద్ర సారథిశ్చైవ మాతలిర్లఘువిక్రమః।
కృష్ణస్య సారథిశ్చైవ న బృహన్నలయా సమౌ॥)
యుధిష్ఠిరు డన్నాడు.' మహారాజా! గోవులను జయించి తీసుకిరావడం, కౌరవులు పారిపోవడం అదృష్టమే. మీ పుత్రుడు కౌరవుల మీద విజయం పొందడం ఆశ్చర్యకరమైన విషయమని నేను అనుకోవడంలేదు. బృహన్నల సారథిగా ఉంటే విజయం నిశ్చయమే. దేవతలకు రాజైన ఇంద్రునియొక్క సారథి వీరిద్దరూ కూడా బృహన్నలకు సాటిరారు. (20 1/2)
వైశంపాయన ఉవాచ
తతో విరాటో నృపతిః సంప్రహృష్టతనూరుహః॥ 21
శ్రుత్వా స విజయం తస్య కుమారస్యామితౌజసః।
ఆచ్ఛాదయిత్వా దూతాంస్తాన్ మంత్రిణం సోఽభ్యచోదయత్॥ 22
వైశంపాయనుడు అన్నాడు. జనమేజయా! అమిత పరాక్రమవంతుడైన తనకుమారుని విజయవార్తను విని విరాటరాజు మిక్కిలి ఆనందించాడు. అతని శరీరం గగుర్పొడిచింది. అతడు దూతలను వస్త్రాలతో ఆభరణాలతో సత్కరించాడు. మంత్రులను ఈ విధంగా ఆజ్ఞాపించాడు. (21,22)
రాజమార్గాః క్రియంతాం మే పతాకాభిరలంకృతాః।
పుష్పోపహారైరర్చ్యంతాం దేవతాశ్చాపి సర్వశః॥ 23
కుమారా యోధముఖ్యాశ్చ గణికాశ్చ స్వలంకృతాః।
వాదిత్రాణి చ సర్వాణి ప్రత్యుద్యాంతు సుతం మమ॥ 24
మన నగరవీథులన్నీ జెండాలతో అలంకరించి పుష్పోపహారాలతో దేవతలకు పూజలన్నీ జరిపించాలి. కుమారులను, ముఖ్యులైన యోధులను, అలంకరించుకొనిన గణికలను, అన్ని రకాల మేళతాళాలను నా పుత్రునికి స్వాగతం చెప్పడానికి పంపాలి. (23,24)
ఘంటావాన్ మానవః శీఘ్రం మత్తమారుహ్య వారణమ్।
శృంగాటకేషు సర్వేషు ఆఖ్యాతు విజయం మమ॥ 25
ఉత్తరా చ కుమారీభిః బహ్వీభిః పరివారితా।
శృంగారవేషాభరణా ప్రత్యుద్యాతు సుతం మమ॥ 26
ఒక మనిషి చేతితో గంట పట్టుకొని మదగజాన్ని ఎక్కి నగరంలోని అన్ని కూడళ్లలోను మా విజయవార్తను వినిపించాలి. రాజకుమారు ఉత్తరకూడా చక్కని అందమైన వేషభూషలను అలంకరించుకొని ఇతర రాజకుమారికలతో నా పుత్రునికి స్వాగతం చెప్పడానికి వెళ్ళాలి.' (25,26)
వైశంపాయన ఉవాచ
శ్రుత్వా చేదం వచనం పార్థివస్య
సర్వం పురం స్వస్తికపాణిభూతమ్।
భేర్యశ్చ తూర్యాణి చ వారిఝాశ్చ
వేషైః పరార్థ్యైః ప్రమదాః శుభాశ్చ॥ 27
తథైవ సూతైః సహ మాగధైశ్చ
నాందీవాద్యాః పణవాస్తూర్యవాద్యాః।
పురాద్ విరాటస్య మహాబలస్య
ప్రత్యుద్యయుః పుత్రమనంతవీర్యమ్॥ 28
వైశంపాయనుడు అన్నాడు. రాజా! రాజుయొక్క ఈ ఆజ్ఞను విని విలువైన వేషభూషలలంకరించుకొన్న సౌభాగ్యవతులైన తరుణీమణులు, సూతులు, మాగధులు, వందిజనులతో సహా పురవాసులెందరూ చేతులలో మంగళద్రవ్యాలతో భేరీతూర్యశంఖపణనాది మంగళ వాద్యాలతో మహాబలుడు, మిక్కిలి పరాక్రమవంతుడు అయిన ఉత్తరకుమారునికి స్వాగతం పలకడానికి నగరం వెలుపలికి బయలుదేరారు. (27,28)
ప్రస్థాప్య సేనాం కన్యాశ్చ గణికాశ్చ స్వలంకృతాః।
మత్స్యరాజో మహాప్రాజ్ఞః ప్రహృష్ట ఇదమబ్రవీత్॥ 29
రాజా! సైన్యాన్నీ, అందమైన వస్త్రభూషణాలతో అలంకరింపబడిన కన్యలనూ, గణికలనూ పంపి పరమబుద్ధిశాలి అయిన మత్స్యనరేశుడు హర్షోల్లాసంతో ఇలా అన్నాడు. (29)
అక్షానాహర సైరంధ్రి కంక ద్యూతం ప్రవర్తతామ్।
తం తథావాదినం దృష్ట్వా పాండవః ప్రత్యభాషత॥ 30
"సైరంధ్రీ! పాచికలు పట్టుకురా. కంకా! జూదం మొదలుపెడదాం." అతడు ఇలా అనడం చూసి పాండు నందనుడు యుధిష్ఠిరు డిలా అన్నాడు. (30)
న దేవితవ్యం హృష్టేన కితవేనేతి నః శ్రుతమ్।
తం త్వామద్య ముదా యుక్తం నాహం దేవితుముత్సహే।
ప్రియం తు తే చికీర్షామి వర్తతాం యది మన్యసే॥ 31
'జూదరి మిక్కిలి ఆనందంగా ఉన్నప్పుడు అతనితో జూదం ఆడకూడదని నేను వినిఉన్నాను. ఈ రోజు మీరు మిక్కిలి ఆనందంలో మునిగిఉన్నారు. కాబట్టి మీతో జూదం ఆడడానికి సాహసించలేను. అయినా మీకు ఇష్టమైనది చేయాలనే అనుకొంటున్నాను. కాబట్టి మీరు కావాలనుకుంటే ఆట ప్రారంభిద్దాం.' (31)
విరాట ఉవాచ
స్త్రియో గావో హిరణ్యం చ యచ్చాన్యద్ వసు కించన।
న మే కించిద్ త్వయా రక్ష్యమ్ అంతరేణాపి దేవితుమ్॥ 32
విరాటు డన్నాడు.' స్త్రీలు, గోవులు, సువర్ణం ఇంకా ఇతరమైన ధనం ఏదయినా సరే! సురక్షితంగా ఉన్నా జూదాన్ని మించి అవి ఏవీ నాకు రుచించవు. (నాకు జూదమే అన్నింటికంటె ఇష్టం). (32)
కంక ఉవాచ
కిం తే ద్యూతేన రాజేంద్ర బహుదోషేణ మానద।
దేవనే బహవో దోషాః తస్మాత్ తత్ పరివర్జయేత్॥ 33
కంకుడు అన్నాడు. 'అందరినీ మన్నించే రాజా! మీకు జూదం ఎందుకు? దీనిలో అనేక దోషాలు ఉన్నాయి. కాబట్టి దాన్ని విడిచి పెట్టాలి. (33)
శ్రుతస్తే యది వా దృష్టః పాండవేయో యుధిష్ఠిరః।
స రాష్ట్రం సుమహత్ స్ఫీతం భ్రాతౄంశ్చ త్రిదశోపమాన్॥ 34
రాజ్యం హారితవాన్ సర్వం తస్మాద్ ద్యూతం న రోచయే।
(నిఃసంశయం స కితవః పశ్చాత్ తప్యతి పాండవః।
వివిధానాం చ రత్నానాం ధనానాం చ పరాజయే।
అస్మిన్ క్షితివినాశశ్చ వాక్పారుష్యమనంతరమ్।
అవిశ్వాస్యం బుధైర్నిత్యమ్ ఏకాహ్నా ద్రవ్యనాశనమ్।)
అథవా మన్యసే రాజన్ దీవ్యామ యది రోచతే॥ 35
తమరు పాండుపుత్రుడయిన యుధిష్ఠిరుని చూసి ఉండవచ్చు. లేదా అతని పేరైనా తప్పక విని ఉంటారు. అతడు సమృద్ధమయిన తన దేశాన్ని, దేవతలతో సమానమైన తేజస్సు గల తమ్ముళ్లను, రాజ్యాన్ని కూడా జూదంలో ఓడిపోయాడు. కాబట్టి నేను జూదాన్ని ఇష్టపడను. అనేకరత్నాలను, ధనాన్ని ఓడి పోగొట్టుకొనిన కారణంగా ఆజూదరి యుధిష్ఠిరుడు తప్పకుండ ఇప్పుడు పశ్చాత్తాపపడుతూ ఉంటాడు. జూదంలో ఆసక్తుడైన వాడికి రాజ్యనాశం అవుతుంది. పైగా జూదరులు ఒకరినొకరు కటువచనాలతో నిందించుకుంటారు. జూదం ఒక్కరోజులోనే గొప్ప ధనరాశిని కూడా నాశనం చేయగలదు. కాబట్టి విద్వాంసులు దీనిని ఎప్పుడూ విశ్వసించకూడదు. రాజా! అయినా నీకు ఆడాలని ఉంటే నేను తప్పక ఆడతాను. (34,35)
వైశంపాయన ఉవాచ
ప్రవర్తమానే ద్యూతే తు మత్స్యః పాండవమబ్రవీత్।
పశ్య పుత్రేణ మే యుద్ధే తాదృశాః కురవో జితాః॥ 36
వైశంపాయనుడు అన్నాడు - జనమేజయా! జూదం మొదలయింది. ఆడుతూ మత్స్యరాజు పాండు నందనునితో ఇలా అన్నాడు. "చూడు. ఈ రోజు నాకొడుకు యుద్ధంలో ఆ ప్రసిద్ధులైన కౌరవులమీద విజయం సాధించాడు." (36)
తతోఽబ్రవీన్మహాత్మా సః ఏనం రాజా యుధిష్ఠిరః।
బృహన్నలా యస్య యంతా కథం స న జయేద్ యుధి॥ 37
అప్పుడు మహాత్ముడు రాజు అయిన యుధిష్ఠిరుడు విరాటునితో ఇలా అన్నాడు - 'బృహన్నల సారథిగా ఉంటే అతడు యుద్ధంలో జయించకుండా ఎలా ఉంటాడు?' (37)
ఇత్యుక్తః కుపితో రాజా మత్స్యః పాండవమబ్రవీత్।
సమం పుత్రేణ మే షండం బ్రహ్మబంధో ప్రశంససి॥ 38
ఈమాట వింటూనే మత్స్యరాజు కుపితుడై పాండునందనునితో ఇలా అన్నాడు - 'నీచబ్రాహ్మణుడా! నీవు నాపుత్రునితో సమానంగా ఒక నపుంసకుని పొగడుతున్నావు. (38)
వాచ్యావాచ్యం న జానీషే నూనం మామవమన్యసే।
భీష్మద్రోణముఖాన్ సర్వాన్ కస్మాన్న స విజేష్యతి॥ 39
వయస్యత్వాత్ తు తే బ్రహ్మన్ అపరాధమిమం క్షమే।
నేదృశం తు పునర్వాచ్యం యది జీవితుమిచ్ఛసి॥ 40
ఏది అనవచ్చునో ఏది అనకూడదో నీకు తెలియడం లేదు. నిశ్చయంగా నీవు నీమాటలతో నన్ను అవమాన పరుస్తున్నావు. మంచిది నాకొడుకు భీష్మద్రోణాదులయిన సమస్తవీరులను ఎందుకు జయించలేడు? బ్రాహ్మణుడా! మిత్రుడవు అయిన కారణంగా నిన్ను ఈ అపరాధానికి క్షమిస్తున్నాను. జీవించి ఉండాలనుకొంటే తిరిగి ఇలాంటి మాటలు మాట్లాడకు.' (39,40)
యుధిష్ఠిర ఉవాచ
యత్ర ద్రోణస్తథా భీష్మః ద్రౌణీర్వైకర్తనః కృపః।
దుర్యోధనశ్చ రాజేంద్రః తథాన్యే చ మహారథాః॥ 41
మరుద్గణైః పరివృతః సాక్షాదపి మరుత్పతిః।
కోన్యో బృహన్నలాయాస్తాన్ ప్రతియుధ్యేత సంగతాన్॥ 42
యుధిష్ఠిరుడు అన్నాడు. 'ద్రోణాచార్యుడు, భీష్ముడు, అశ్వత్థామ, కర్ణుడు, కృపాచార్యుడు, రాజైన దుర్యోధనుడు, ఇంకా ఇతర మహారథికులు ఎందరు ఉన్నా వారినందరిని ఒక్క బృహన్నల తప్ప ఆ దేవతాగణాలతో కూడిన ఇంద్రుడయినా సరే ఎదిరించగలుగుతాడా? (41,42)
యస్య బాహుబలే తుల్యః న భూతో న భవిష్యతి।
అతీవ సమరం దృష్ట్వా హర్షో యస్యోపజాయతే॥ 43
యోఽజయత్ సంగతాన్ సర్వాన్ ససురాసురమానవాన్।
తాదృశేన సహాయేన కస్మాత్ స న విజేష్యతే॥ 44
బాహుబలంలో ఎవరికి సాటి లేదో, ఉండబోదో, యుద్ధం వస్తోందని తెలిసి ఎవరు సంతోషిస్తాడో, దేవతలు, దానవులు, మానవులు అందరూ కూడినా అందరినీ ఎవరు జయించగలడో అట్టి బృహన్నల సహాయకుడుగా ఉండగా రాకుమారుడు ఉత్తరుడు విజయం పొందకుండా ఎలా ఉంటాడు?' (43,44)
విరాట ఉవాచ
బహుశః ప్రతిషిద్ధోఽసి న చ వాచం నియచ్ఛసి।
నియంతా చేన్న విద్యేత న కశ్చిద్ ధర్మమాచరేత్॥ 45
విరాటుడన్నాడు - 'కంకా! నేను ఎన్ని మారులు వారించినా నీవు నీ నాలుకను అదుపులో పెట్టుకోవడం లేదు. నిజమేలే. శాసించే రాజు లేకపోతే ఎవరూ ధర్మాన్ని ఆచరించరు.' (45)
వైశంపాయన ఉవాచ
తతః ప్రకుపితో రాజా తమక్షేణాహనద్ భృశమ్।
ముఖే యుధిష్ఠిరం కోపాత్ నైవమిత్యేవ భర్తృయన్॥ 46
వైశంపాయనుడు అన్నాడు - జనమేజయా! ఇలా అన్న తరువాత కోపంతో మండిపడుతూ విరాటరాజు "ఇంక ఎప్పుడూ ఇలాంటి మాటలు ఆడకు" అంటూ చేతిలో ఉన్న పాచికను యుధిష్ఠిరుని ముఖం మీదకు బలంగా విసిరికొట్టాడు. (46)
బలవత్ ప్రతివిద్ధస్య నస్తః శోణితమావహత్।
తదప్రాప్తం మహీమ్ పార్థః పాణిభ్యాం ప్రత్యగృహ్ణత॥ 47
అవైక్షత స ధర్మాత్మా ద్రౌపదీం పార్శ్వతః స్థితామ్।
సా జ్ఞాత్వా తమభిప్రాయం బర్తుశ్చిత్తవశానుగా॥ 48
పాత్రం గృహీత్వా సౌవర్ణం జలపూర్ణమనిందితా।
తచ్ఛోణితం ప్రత్యగృహ్ణాద్ యత్ ప్రసుస్రావ నస్తతః॥ 49
పాచికదెబ్బ గట్టిగా తగలడంతో అతని ముక్కు వెంట రక్తం ధారకట్టింది. ధర్మాత్ముడయిన యుధిష్ఠిరుడు ఆ రక్తం భూమిమీద పడకుండా ముందుగానే తన రెండుచేతులతో అదిమిపెట్టి ప్రక్కనే నిలబడి ఉన్న ద్రౌపదికేసి చూశాడు. ఆమె భర్త మనసు గుర్తించి తదనుగుణంగా నడుచుకునేది కాబట్టి అతని అభిప్రాయాన్ని గుర్తించింది. వెంటనే నీటితో నిండిన బంగారుపాత్రను తెచ్చి, యుధిష్ఠిరుని ముక్కునుండి కారే రక్తాన్ని అందులోకి పట్టింది. (47-49)
"కచ్ఛం సంచమసం వాఽన్నస్య పూరయిత్వా కృతస్యవాఽ కృతస్య ఫలానామేవైతం పూర్ణపాత్ర మాచక్షతే" అని సామవేదంలోని శోభిలసూత్రం పూర్ణపాత్రను నిర్వచించింది. అన్నంతో కానీ, బియ్యంతో కానీ, ఫలాలతోకానీ నింపబడినది పూర్ణపాత్రం. ఇక్కడ ద్రౌపది జలపూర్ణపాత్రలోనికి ధర్మజుని రక్తాన్ని పట్టింది. దేనిలోనుండి పుట్టింది దానిలోనే నశిస్తుంది. రక్తం నీటిద్వారా ఏర్పడుతుంది. కాబట్టి అది నీటిలోనే నశిస్తుంది. అందుకే జలపూర్ణపాత్రలోనికి నెత్తురు పట్టడం. (విష)
అథోత్తరః శుభైర్గంధైః మాల్యైశ్చ వివిధైస్తథా।
వికీర్యమాణః సంహృష్టః నగరం స్వైరమాగతః॥ 50
అదే సమయంలో రాజకుమారుడు ఉత్తరుడు మహాసంతోషంతో స్వేచ్ఛగా నగరంలో ప్రవేశించాడు. దారిలో అతనిమీద ఉత్తమమైన సువాసనగల పూలమాలలు కురియసాగాయి. (50)
సభాజ్యమానః పౌరైశ్చ స్త్రీభిర్జానపదైస్తథా।
ఆసాద్య భవనద్వారం పిత్రే సంప్రత్యవేదయత్॥ 51
మత్స్యదేశవాసులైన పౌరులు, జానపదులు, స్త్రీలు- అందరూ అతనికి స్వాగతం పలికారు. అలా అతడు రాజభవనద్వారం చేరుకుని తండ్రికి తన ఆగమనవార్తను పంపించాడు. (51)
తతో ద్వాఃస్థః ప్రవిశ్యైవ విరాటమిదమబ్రవీత్।
బృహన్నలాసహాయశ్చ పుత్రో ద్వార్యుత్తరః స్థితః॥ 52
అప్పుడు ద్వారపాలకుడు లోపలికి వెళ్లి, విరాట మహారాజుతో "ప్రభూ! బృహన్నలతో కూడా రాజకుమారుడు ఉత్తరుడు ద్వారం దగ్గర వేచియున్నాడు." అని చెప్పాడు. (52)
తతో హృష్టో మత్స్యరాజః క్షత్తారమిదమబ్రవీత్।
ప్రవేశ్యతాముఖౌ తూర్ణం దర్శనేప్సురహం తయోః॥ 53
ఈ వార్త విని ఆనందించిన మత్స్యరాజు విరాటుడు తన సేవకునితో "నేను వారిద్దరినీ చూడాలనుకొంటున్నాను. వారిని శీఘ్రంగా లోపలకు తీసుకురా" అన్నాడు. (53)
క్షత్తారం కురురాజస్య శనైః కర్ణ ఉపాజపత్।
ఉత్తరః ప్రవిశత్వేకః న ప్రవేశ్యా బృహన్నలా॥ 54
వెళ్లిపోతున్న సేవకుని చెవిలో యుధిష్ఠిరుడు నెమ్మదిగా "ముందు ఉత్తరుడిని ఒక్కడినే ఇక్కడకు ప్రవేశపెట్టు. బృహన్నలను వెంట రానీకు" అని చెప్పాడు. (54)
ఏతస్య హి మహాబాహో వ్రతమేతత్ సమాహితమ్।
యో మమాంగే వ్రణం కుర్యాత్ శోణితం వాపి దర్శయేత్।
అన్యత్ర సంగ్రామగతాత్ న స జీవేత కథంచన॥ 55
"వీరుడా! బృహన్నలకు ఒక నిశ్చితమైన వ్రతం ఉంది. యుద్ధభూమిలో కాకుండా ఎవరయినా సరే నా శరీరంలో గాయం చేసినా రక్తం కారేటట్లు చేసినా ఆ చేసినవాడు జీవించడు" (35)
న మృష్యాద్ భృశక్రుద్ధః మాం దృష్ట్వా తు సుశోణితమ్।
విరాటమిహ సామాత్యం హన్యాత్ సబలవాహనమ్॥ 56
నా శరీరం మీద రక్తాన్ని చూసి అతడు తీవ్రంగా కోపిస్తాడు. ఈ అపరాధాన్ని క్షమించడు. విరాటరాజును మంత్రి సైన్య వాహనాలతో సహితంగా చంపిపారేస్తాడు. (56)
వైశంపాయన ఉవాచ
తతో రాజ్ఞః సుతో జ్యేష్ఠః ప్రావిశత పృథివీంజయః।
సోఽభివాద్య పితుః పాదౌ కంకం చాప్యుపతిష్ఠత॥ 57
వైశంపాయనుడు అన్నాడు - జనమేజయా! తదనంతరం విరాటుని జ్యేష్ఠపుత్రుడు కుమార భూమింజయుడు లోపలికి వచ్చి తండ్రిపాదాలకు నమస్కరించి కంకునికి కూడా తలవంచి నమస్కరించాడు. (57)
తతో రుధిర సంయుక్తమ్ అనేకాగ్రమనాగసమ్।
భూమావాసీనమేకాంతే సైరంధ్ర్యా ప్రత్యుపస్థితమ్॥ 58
కంకభట్టు ఏకాంతంగా నేలమీద కూర్చుని ఉండడం, సైరంధ్రి అతనికి పరిచర్య చేయడం, అతడు వ్యగ్రమనస్కుడై ఉండడం, నిరపరాధి అయిన అతని శరీరం నుండి రక్తం కారడం చూశాడు ఉత్తరుడు. (58)
తతః పప్రచ్ఛ పితరం త్వరమాణ ఇవోత్తరః।
కేనాయం తాడితో రాజన్ కేన పాపమిదం కృతమ్॥ 59
అప్పుడతడు గొప్ప ఉద్వేగంతో తండ్రిని "రాజా! ఎవరీతనిని కొట్టినది? అంత పాపకర్మ చేసినవారెవరు?" అని అడిగాడు. (59)
విరాట ఉవాచ
మయాయం తాడితో జిహ్మః న చాప్యేతావదర్హతి।
ప్రశస్యమానే యచ్ఛూరే త్వయి షండం ప్రశంసతి॥ 60
విరాటుడన్నాడు - "కుమారా! నేనే ఈ కుటిలుని కొట్టాను. అతడంతటి గౌరవాని కెన్నటికీ అర్హుడు కాదు. చూడు మరి.. నేను నీ పరాక్రమాన్ని ప్రశంసిస్తూంటే.. అతడు ఆ పేడిని గురించి గొప్పగా చెప్తున్నాడు." (60)
ఉత్తర ఉవాచ
అకార్యం తే కృతం రాజన్ క్షిప్రమేవ ప్రసాద్యతామ్।
మా త్వాం బ్రహ్మవిషం ఘోరం సమూలమిహ నిర్దహేత్॥ 61
ఉత్తరుడన్నాడు - "రాజా! నీవు చాలా అనుచితమైన పని చేశావు. వెంటనే ఇతనిని ప్రసన్నం చేసుకో. లేదా బ్రాహ్మణుని యొక్క భయంకరమైన కోపమనే విషం నిన్ను సమూలంగా దహించివేస్తుంది. (61)
వైశంపాయన ఉవాచ
స పుత్రస్య వచః శ్రుత్వా విరాటో రాష్ట్రవర్ధనః।
క్షమయామాస కౌంతేయం భస్మచ్ఛన్నమివానలమ్॥ 62
వైశంపాయనుడు చెప్పాడు - రాజా! పుత్రుని ఈ మాటలు విని దేశాభివృద్ధిని కాంక్షించే విరాటమహారాజు నివురుగప్పిన నిప్పులా ఉన్న కుంతీనందనుడైన యుధిష్ఠిరుని క్షమాపణ అడిగాడు. (62)
క్షమయంతం తు రాజానం పాండవః ప్రత్యభాషత।
చిరం క్షాంతమిదం రాజన్ న మన్యుర్విద్యతే మమ॥ 63
క్షమాపణ అడిగిన రాజును చూచి పాండునందనుడు యుధిష్ఠిరుడు ఇలా అన్నాడు - 'రాజా! నేను చిరకాలంనుండి క్షమావ్రతాన్ని పాటిస్తున్నాను. కాబట్టి నీ ఈ అపరాధాన్ని అప్పుడే క్షమించేశాను. నాకు నీమీద ఇసుమంతయినా కోపం లేదు. (63)
యది హ్యేతత్ పతేద భూమౌ రుధిరం మమ నస్తథః।
సరాష్ట్రస్త్వం మహారాజ వినశ్యేథా న సంశయః॥ 64
మహారాజా! నా ముక్కునుండి కారిన రక్తం భూమిమీద పడినట్లయితే నీ రాజ్యంతో సహా నీవు నశించిపోయి ఉండేవాడవు. ఇందులో సందేహం ఏమీ లేదు. (64)
న దూషయామి తే రాజన్ యద్ వై హన్యాదదూషకమ్।
బలవంతం ప్రభుం రాజన్ క్షిప్రం దారుణమాప్నుయాత్॥ 65
రాజా! ఎవరినీ నిందించని ఏ అపరాధం చేయని వ్యక్తిని కొట్టడం అన్యాయం. అయినా నీవు చేసిన పనిని నేను నిందించను. ఎందుకంటే బలవంతుడైన రాజు తరచుగా తొందరపడి ఇటువంటి కఠినకర్మలు చేసే అవసరం వస్తుండి." (65)
వైశంపాయన ఉవాచ
శోణితే తు వ్యతిక్రాంతే ప్రవివేశ బృహన్నలా।
అభివాద్య విరాటం తు కంకం చాప్యుపతిష్ఠత॥ 66
వైశంపాయనుడు చెప్పాడు. రాజా! యుధిష్ఠిరుని ముక్కునుండి రక్తం కారడం ఆగొపోయాక బృహన్నల రాజసభలో ప్రవేశించి విరాట మహారాజుకు కంకభట్టుకు కూడా నమస్కరించాడు. (66)
క్షామయిత్వా తు కౌరవ్యం రణాదుత్తరమాగతమ్।
ప్రశశంస తతో మత్స్యః శృణ్వతః సవ్యసాచినః॥ 67
ఇటు మత్స్యనరేశుడు కురునందనుడైన యుధిష్ఠిరుని క్షమాపణ అడిగి, సవ్యసాచియైన అర్జునుని గూర్చి విని ఉన్నప్పటికీ యుద్ధభూమినుండి వచ్చిన ఉత్తరుని ప్రశంసించడం మొదలుపెట్టాడు. (67)
త్వయా దాయాదవానస్మి కైకేయీనందివర్ధన।
త్వయా మే సదృశః పుత్రః న భూతో న భవిష్యతి॥ 68
'కైకేయీ నందనా! నిన్ను పొంది నిజంగా నేను పుత్రవంతుడిని అయ్యాను. నీతో సమానుడైన వేరొక కొడుకు నాకు లేడు. ఉండబోడు. (68)
పదం పదసహస్రేణ యశ్చరన్ నాపరాధ్నుయాత్।
తేన కర్ణేన తే తాత కథమాసీత్ సమాగమః॥ 69
మనుష్యలోకే సకలే యస్య తుల్యో న విద్యతే।
తేన భీష్మేణ తే తాత కథమాసీత్ సమాగమః॥ 70
తండ్రీ! ఒకే లక్ష్యంతో పాటుగా వేయి లక్ష్యాలను కూడా ఛేదింప గలిగే బాణం వేస్తూకూడా ఎన్నడూ గురి తప్పని ఆ కర్ణునితో నీయుద్ధం ఎలా జరిగింది? బిడ్డా! ఈసమస్త మనుష్యలోకంలో సాటివచ్చేవారు ఎవరూ లేని ఆ భీష్మునితో నీవు ఎలా తలపడ్డావు? (69,70)
ఆచార్యో వృష్టివీరాణాం కౌరవాణాం చ యో ద్విజః।
సర్వక్షత్రస్య చాచార్యః సర్వశస్త్రభృతాం వరః।
తేన ద్రోణేన తే తాత కథమాసీత్ సమాగమః॥ 71
వృష్టివీరులు, కౌరవవీరులు - వీరిరువురికే కాక సమస్త క్షత్రియులకు ఆచార్యుడై, శస్త్రధారులలో అందరికంటె ఉన్నతమైన స్థానాన్ని పొందిన ఆ ద్రోణాచార్యునితో నీ యుద్ధం ఎలా సాగింది? (71)
ఆచార్యపుత్రో యః శూరః సర్వశస్త్రభృతామపి।
అశ్వత్థామేతి విఖ్యాతః తేనాసీత్ సంగరః కథమ్॥ 72
ఆచార్యునియొక్క పుత్రుడు, శస్త్రధారు లందరిలో శ్రేష్ఠుడు, అశ్వత్థామ పేరుతో ఖ్యాతికెక్కిన అతనితో నీ పోరు ఎలా సాగింది? (72)
రణే యం ప్రేక్ష్య సీదంతి హృతస్వా వణిజో యథా।
కృపేణ తేన తే తాత కథమాసీత్ సమాగమః॥ 73
ధనమంతా కోలుపోయి దుఃఖార్తులైన వర్తకులవలె ఎవరిని చూసి గొప్ప గొప్ప యోధులందరూ బింకాన్ని సడలించుకొంటారో ఆ కృపాచార్యునితో నీసంగ్రామం ఎలా జరిగింది? (73)
పర్వతం యోఽభివిధ్యేత రాజపుత్రో మహేషుభిః।
దుర్యోధనేన తే తాత కథమాసీత్ సమాగమః॥ 74
తన గొప్పబాణాలతో పర్వతాలను కూడా చీల్చగల ఆ దుర్యోధనుని నీవెలా ఎదుర్కొన్నావు? (74)
అవగాఢా ద్విషంతో మే సుఖో వాతోఽభివాతి మామ్।
యస్త్వం ధనమథాజైషీః కురుభిర్గ్రస్తమాహవే॥ 75
కుమారా! కౌరవులు యుద్ధంలో పట్టుకొన్న గోధనాన్ని వారిని జయించి నీవు తిరిగి తెచ్చావు. ఇది చాలా మెచ్చుకో దగినది. ఈనాడు మన శత్రువు ఓడిపోయాడు. అందుకని నాకు ఈ గాలి చాలా సుఖదాయకంగా ఉంది. (75)
తేషాం భయాభిపన్నానాం సర్వేషాం బలశాలినామ్।
నూనం ప్రకాల్య తాన్ సర్వాంన్ త్వయా యుధి నరర్షభ।
ఆచ్ఛిన్నం గోధనం సర్వం శార్దూలేనామిషం యథా॥ 76
నరోత్తమా! నీవు శత్రువులందరినీ యుద్ధంలో జయించి వారిని భయంలో పడవేశావు. పైగా ఆ సమస్త బలశాలుల చేతినుండి మన గోధనాన్ని పులి ఇతర జంతువులనుండి మాంసాన్ని లాగు కొన్నట్లుగా విడిపించి తీసుకొనివచ్చావు.' (76)
ఇతి శ్రీమహాభారతే విరాటపర్వణి గోహరణపర్వణి విరాటోత్తర సంవాదే అష్టషష్టితమోఽధ్యాయః॥ 68 ॥
ఇది శ్రీమహాభారతమున విరాటపర్వమున గోహరణపర్వమను ఉపపర్వమున
విరాట - ఉత్తర సంభాషణ అను అరువది ఎనిమిదవ అధ్యాయము. (68)
(దాక్షిణాత్య అధికపాఠం 3 శ్లోకాలతో కలిపి మొత్తం 79 శ్లోకాలు.)