67. అరువది ఏడవ అధ్యాయము

అర్జునుడు విజయుడై రాజధానికి మరలుట.

వైశంపాయన ఉవాచ
తతో విజిత్య సంగ్రామే కురూన్ స వృషభేక్షణః।
సమానయామాస తదా విరాటస్య ధనం మహత్॥ 1
జనమేజయా! చక్కని విశాల నేత్రాలు కల అర్జునుడు యుద్ధంలో కౌరవులను జయించి విరాటునియొక్క గోధనాన్ని తిరిగి తీసుకొనివచ్చాడు. (1)
గతేషు చ ప్రభగ్నేషు ధార్తరాష్ట్రేషు సర్వతః।
వనాన్నిష్క్రమ్య గహనాద్ బహవః కురుసైనికాః॥ 2
భయాత్ సంత్రస్తమనసః సమాజగ్ముస్తతస్తతః।
ముక్తకేశాస్త్వదృశ్యంత స్థితాః ప్రాంజలయస్తదా॥ 3
క్షుత్పిపాసాపరిశ్రాంతాః విదేశస్థా విచేతసః।
పరాజితులైన కౌరవులు వెళ్ళిన తర్వాత ఎంతోమంది కురుసైనికులు గహనాలైన వనాలనుండి వివిధ ప్రదేశాల నుండి బయటకు వస్తున్నారు. వారంతా భయంతో కంపించి పోతున్నారు. వారి జుట్టు కకావికలయ్యింది. ఆకలి దప్పులతో అలసి పోయారు. చైతన్యం పూర్తిగా తిరిగిరాని వారందరూ చేతులు జోడించి బయటకు వస్తున్నారు. (2,3)
ఊచుః ప్రణమ్య సంభ్రాంతాః పార్థ కిం కరవామ తే॥ 4
(ప్రాణానంతర్మనోయాతాన్ ప్రయాచిష్యామహే వయమ్।
వయం చార్జున తే దాసాః హ్యమరక్ష్యా హ్యనాయకాః॥
వారందరూ అర్జునునికి నమస్కరించి కంగారు పడుతూనే అర్జునునితో ఇలా అన్నారు. 'పార్థ! మీకు మేము ఏవిధమైన సేవ చేయగలం? (4)
మేమంతా హృదయాంతరాళాల్లో దాగిన ప్రాణాలను నిలుపుకొన్నాము. ప్రాణరక్షణకై మిమ్ము యాచిస్తున్నాము. అర్జునా! మేము నీదాసులము. నీచే రక్షింప బడవలసినవారము!' అన్నారు.
అర్జున ఉవాచ
అనాథాన్ దుఃఖితాన్ దీనాన్ కృశాన్ వృద్ధాన్ పరాజితాన్।
న్యస్తశస్త్రాన్ నిరాశాంశ్చ నాహం హన్మి కృతాంజలీన్।)
స్వస్తి వ్రజత వో భద్రం న భేతవ్యమ్ కథంచన।
నాహమార్తాన్ జిఘాంసామి భృశమాశ్వాసయామి వః॥ 5
అర్జునుడు ఇలా అన్నాడు. 'సైనికులారా! విచారాన్ని వీడండి. అనాథులను, దుఃఖితులను, దీనులను, కృశించినవారిని, ముసలివారిని, పరాజితులను, శస్త్రపరిత్యాగం చేసినవారిని, నైరాశ్యంలో ఉన్నవారిని, నమస్కరిస్తున్న వారినీ నేను సంహరించను. మీకు శుభం కలుగుతుంది. సుఖంగా వెళ్ళండి. మీకి ఎంత మాత్రం భయం వద్దు. నేను బాధితులను చంపాలని భావించను. మిమ్మందరినీ అనునయిస్తున్నాను. (5)
వైశంపాయన ఉవాచ
తస్య తామభయాం వాచం శ్రుత్వా యోధాః సమాగతాః।
ఆయుః కీర్తియశోదాభిః తమాశీర్భిరనందయన్॥ 6
వైశంపాయను డిలా అన్నాడు. జనమేజయా! అర్జునుని నుండి అభయదానాన్ని పొందిన యోధు లందరూ అర్జునుని కాయుర్దాయం, కీర్తి, యశస్సు కలగాలని ఆశీర్వదిస్తూ ఆనందాన్ని కలిగించారు. (6)
తతోఽర్జునం నాగమివా ప్రభిన్నం
ఉత్సృజ్య శత్రూన్ వినివర్తమానమ్।
విరాటరాష్ట్రాభిముఖం ప్రయాంతం
నాశక్నువంస్తం కురవోఽభియాతుమ్॥ 7
అర్జునుడు శత్రువులను విడిచిపెట్టి, వారికి జీవనదానం చేశాడు. దెబ్బతిన్న గజంలా విరాటనగరాభిముఖంగా
ప్రయాణిస్తున్న అర్జునునిపై ఆక్రమణం చేయటానికి కౌరవులెవ్వరూ సాహసించలేకపోయారు. (7)
తతః స తన్మేఘమివాపతంతం
విద్రావ్య పార్థః కురుసైన్యబృందమ్।
మత్స్యస్య పుత్రం ద్విషతాం నిహంతా
వచోఽబ్రవీత్ సంపరిరభ్య భూయః॥ 8
శత్రువినాశకుడయిన అర్జునుడు మేఘాల్లా వచ్చిపడిన కురుసైన్యసమూహాన్ని పారద్రోలి, మత్స్యదేశరాజు కుమారుడైన ఉత్తరుని గాఢంగా కౌగలించుకొని, ఇలా అన్నాడు. (8)
పితుః సకాశే తవ తాత సర్వే
వసంతి పార్థా విదితం తవైవ।
తాన్ మా ప్రశంసే ర్నగరం ప్రవిశ్య
భీతః ప్రణశ్యేద్ధి స మత్స్యరాజః॥ 9
'నాయనా! నీతండ్రివద్దనే పాండవులందరూ కాలం గడుపుతున్నారు. ఈ విషయం నీకొక్కడికే తెలుసు. కనుక నీవు నగరంలోకి పోయి పాండవులను ప్రశంసించవద్దు. ఎందుకంటే మత్స్యరాజు విరాటుడు భయంతో ప్రాణత్యాగం చేసే ప్రమాదం ఉంది. (9)
మయా జితా సా ధ్వజినీ కురూణాం
మయా చ గావో విజితా ద్విషద్భ్యః।
పితుః సకాశం నగరం ప్రవిశ్య
త్వమాత్మనః కర్మకృతం బ్రవీహి॥ 10
ఉత్తరకుమారా! నీవు నగరంలో ప్రవేశించి తండ్రిని సమీపించి 'కురుసైన్యమంతా నాచేతనే జయించబడింది. నేనే గోసంపదను జయించి తీసుకివచ్చాను. యుద్ధంలో చేసిన ప్రతికార్యమూ నేను సాధించినదే" అని చెప్పుమన్నాడు అర్జునుడు. (10)
ఉత్తర ఉవాచ
యత్తే కృతం కర్మ న పారణీయం
తత్ తే కర్మ కర్తుం మమ నాస్తి శక్తిః।
న త్వాం ప్రవక్ష్యామి పితుః సకాశే
యావన్న మాం వక్ష్యసి సవ్యసాచిన్॥ 11
ఉత్తరకుమారుడిలా అన్నాడు. 'సవ్యసాచీ! నీవు చేసిన ఈ అద్భుతకార్యం మరొకరికి సాధ్యం కాదు. నీవు చేసిన పని చెయ్యగలిగే అద్భుతశక్తి నాకు లేదు. అయినా నీవు ఆజ్ఞాపించే వరకు నాతండ్రివద్ద నీకు సంబంధించిన విషయాలేవీ తెలియపర్చను.' (11)
వైశంపాయన ఉవాచ
స శత్రుసేనామవజిత్య జిష్ణుః
ఆచ్ఛిద్య సర్వం చ ధనం కురుభ్యః।
శ్మశానమాగత్య పునః శమీం తామ్
అభ్యేత్య తస్థౌ శరవిక్షతాంగః॥ 12
వైశంపాయనుడు ఇలా అన్నాడు. జనమేజయా! జయశీలుడైన అర్జునుడు శత్రుసేనను జయించి, కౌరవులనుండి సమస్త గోధనాన్ని తిరిగి సంపాదించి శ్మశానాన్ని చేరుకుని జమ్మిచెట్టువద్ద నిలబడ్డాడు. ఆ సమయంలో అర్జునుని శరీరం బాణపుగాయాలతో కకావికలై ఉంది. (12)
తతః స వహ్నిప్రతిమో మహాకపిః
సహైవభూతై ర్దివ ముత్పపాత।
తథైవ మాయా విహితా బభూవ
ధ్వజం చ సైంహం యుయుజే రథే పునః॥ 13
తరువాత అగ్నిసమానతేజస్కుడైన మహాకపి, భూత సమూహంతో పాటు ఆకసంలోకి ఎగిరిపోయాడు. అలాగే మాయచేసినట్లు సింహధ్వజం మళ్లీ రథాన్ని చేరింది. (13)
విధాయ తచ్చాయుధమాజివర్ధనం
కురూత్తమానామిషుధీః శరాంస్తథా।
ప్రాయాత్స మత్స్యో నగరం ప్రహృష్టః
కిరీటినా సారథినా మహాత్మనా॥ 14
కురుశ్రేష్ఠుల యుద్ధసామర్థ్యం పెంచి పోషించే గాండీవాన్ని అక్షయతూణీరాన్ని బాణాలను పూర్వం లాగే జమ్మిచెట్టుమీద దాచి, ఉత్తరుడు మహాత్ముడైన కిరీటి సారథిగా సంతోషంగా నగరాన్ని ప్రవేశించాడు. (14)
పార్థస్తు కృత్వా పరమార్యకర్మ
నిహత్య శత్రూన్ ద్విషతాం నిహంతా।
చకార వేణీం చ తథైవ భూయో
జగ్రాహ రశ్మీన్ పునరుత్తరస్య॥
వివేశ హృష్టో నగరం మహామనాః
బృహన్నలారూపముపేత్య సారథిః॥ 15
పార్థుడు శత్రుసమూహాన్ని జయించి, అద్భుతకార్యాన్ని నిర్వర్తించి, తిరిగి పూర్వం లాగే జడను అలంకరించుకొని, ఉత్తరుని రథం పగ్గాలను చేపట్టాడు. మనస్వియైన అర్జునుడు బృహన్నలరూపం స్వీకరించి సారథియై సంతోషంగా నగరంలో ప్రవేశించాడు. (15)
వైశంపాయన ఉవాచ
తతో నివృత్తాః కురవః ప్రభగ్నా వశమాస్థితాః।
హస్తినాపురముద్దిశ్య సర్వే దీనా యయుస్తదా॥ 16
పంథానముపసంగమ్య ఫాల్గునో వాక్యమబ్రవీత్॥ 17
వైశంపాయనుడిలా అన్నాడు. రాజా! తరువాత కౌరవులు యుద్ధంలో పరాభవం పాలై వివశులై దీనవదనాలతో హస్తినాపురంవైపు ప్రయాణం సాగించారు. ఇటు అర్జునుడు కూడా విరాటనగరంవైపి ప్రయాణిస్తూ దారిలో ఉత్తరునితో ఇలా అన్నాడు. (16,17)
రాజపుత్ర ప్రత్యవేక్ష సమానీతాణి సర్వశః।
గోకులాని మహాబాహో వీర గోపాలకైః సహ॥ 18
తతోఽపరాహ్ణే యాస్యామః విరాటనగరం ప్రతి।
ఆశ్వాస్య పాయయిత్వా చ పరిప్లావ్య చ వాజినః॥ 19
'రాజకుమారా! మహాబాహూ! చూడు! అన్నివైపుల నుండి గోగణమంతా గోపాలకులతో సహా తిరిగి వచ్చింది. కనుక అపరాహ్ణసమయంలో విరాటనగరానికి వెడదాము. ప్రస్తుతం గుర్రాలను నీళ్ళు త్రాగించి సేద తీరుద్దాము. (18,19)
గచ్ఛంతు త్వరితా శ్చేమే గోపాలాః ప్రేషితాస్త్వయా।
నగరే ప్రియమాఖ్యాతుం ఘోషయంతు చ తే జయమ్॥ 20
ఈ గోపాలురను నీవు శీఘ్రంగా నగరంలోనికి పంపు. వారు ప్రియమైన నీవిజయవార్తను నగరమంతా చాటిచెప్పాలి.' (20)
వైశంపాయన ఉవాచ
అథోత్తర స్త్వరమాణః స దూతాన్
ఆజ్ఞాపయద్ వచనాత్ ఫాల్గుణస్య।
ఆచక్షధ్వం విజయం పార్థివస్య
భగ్నాః పరే విజితాశ్చాపి గావః॥ 21
వైశంపాయనుడిలా అన్నాడు. జనమేజయా! వెంటనే ఉత్తరుడు పార్థుని సూచన మేరకు శీఘ్రంగా దూతల నాజ్ఞాపించాడు. 'వెళ్ళండి మహారాజుతో న విజయగాథను చెప్పండి. శత్రువులు పారిపోయారని గోసంపద విడిపింపబడిందని తెలియచేయండి.' (21)
ఇత్యేవం తౌ భారతమత్స్యవీరౌ
సమ్మంత్ర్య సంగమ్య తతః శమీం తామ్।
అభ్యేత్య భూయో విజయేన తృప్తౌ
ఉత్సృష్టమారోపయతాం స్వభాండమ్॥ 22
ఈవిధంగా అర్జునుడు ఉత్తరుడు సంప్రదించుకొని తరువాత జమ్మిచెట్టును సమీపించి, విజయంతో మళ్ళీ సంతోషాన్ని పొంది పూర్వం అచట పాత్రలో ఉంచబడిన అలంకారాన్ని శరీరానికి అలంకరించుకొన్నారు. (22)
స శత్రుసేనామభిభూయ సర్వాం
ఆచ్ఛిద్య సర్వం చ ధనం కురుభ్యః।
వైరాటిరాయాన్నగరం ప్రతీతః
బృహన్నలాసారథినా ప్రవీరః॥ 23
ఇలా శత్రుసైన్యాన్నంతా పరాభవించి, కౌరవుల నుండి సమస్త గోధనాన్ని లాగివేసి విరాట కుమారుడు, వీరుడు అయిన ఉత్తరుడు బృహన్నల సారథ్యంలో నగరంలో ప్రవేశించాడు. (23)
ఇతి శ్రీమహాభారతే విరాటపర్వణి గోహరణపర్వణి ఉత్తరాగమనే సప్తషష్టితమోఽధ్యాయః॥ 67 ॥
ఇది శ్రీమహాభారతమున విరాటపర్వమున గోహరణ పర్వమను ఉపపర్వమున
ఉత్తరాగమనమనే అరువది ఏడవ అధ్యాయము. (67)
(దాక్షిణాత్య అధిక పాఠము 2 1/2 శ్లోకములు కలిపి మొత్తము 25 1/2 శ్లోకములు.)
న సా సభా యత్ర న సంతి వృద్ధాః
న తే వృద్ధా యే న వదంతి ధర్మమ్।
నాఽసౌ ధర్మో యత్ర న సత్యమస్తి
న తత్ సత్యం యచ్ఛలేనానువిద్ధమ్॥