66. అరువది ఆరవ అధ్యాయము

కౌరవులందరు ఓడిపోయి వెనుదిరుగుట.

వైశంపాయన ఉవాచ
ఆహూయమానశ్చ స తేన సంఖ్యే
మహాత్మనా వై ధృతరాష్ట్రపుత్రః।
నివర్తితస్తస్య గిరాంకుశేన
మహాగజో మత్త ఇవాంకుశేన॥ 1
వైశంపాయనుడిలా అంటున్నాడు. జనమేజయా! మహాత్ముడైన అర్జునుడిలా యుద్ధానికి పిలుస్తుంటే, ధృతరాష్ట్రసుతుడైన దుర్యోధనుడు అంకుశంపోటు తిన్న మత్తగజంలా మాటలనే అంకుశంతో పీడింపబడి రణభూమికి మరలాడు. (1)
సోఽమృష్యమాణో వచసాభిమృష్టః
మహారథే నాతిరథస్తరస్వీ।
పర్యావవర్థాథ రథేన వీరః
భోగీ యథా పాదతలాభిమృష్టః॥ 2
మహారథుడు అర్జునుడు తనమాటలతో దుర్యోధనుని గాయపరిచాడు. కనుక వేగశాలి, అతిరథుడు, వీరుడు అయిన సుయోధనుడు సహించలేకపోయాడు. కనుకనే అరికాలి క్రింద పడిన సర్పం ప్రతీకారం కోసం తిరిగి వస్తున్నట్లు దుర్యోధనుడు రథారూఢుడై రణభూమికి తిరిగివచ్చాడు. (2)
తం ప్రేక్ష్య కర్ణః పరివర్తమానం
నివర్త్య సంస్తభ్య చ విద్ధగాత్రమ్।
దుర్యోధనస్యోత్తరతోఽభ్యగచ్ఛత్
పార్థం నృవీరో యుధి హేమమాలీ॥ 3
యుద్ధభూమికి మరలివస్తున్న దుర్యోధనుని చూసి అతనిని నివారించి, గాయపడిన తన దేహాన్ని సవరించుకొంటూ హేమమాలి, నరశ్రేష్ఠుడూ అయిన కర్ణుడు దుర్యోధనునికి ఉత్తరంగా బయలుదేరి పార్థునితో తలపడ్డాడు. (3)
భీష్మస్తతః శాంతనవో వివృత్య
హిరణ్య కక్షస్త్వరయాభిషంగీ।
దుర్యోధనం పశ్చిమతోఽభ్యరక్షద్।
పార్థాన్మహాబాహు రధిజ్యధన్వా॥ 4
తరువాత బంగారు భుజత్రాణాలు కల శంతనుకుమారుడయిన భీష్ముడు వేగంగా రథాన్ని మరల్చి అచటకు వచ్చాడు. మహాబాహువయిన అతడు విల్లు నెక్కుపెట్టి దుర్యోధనుని పార్థునినుండి రక్షించటానికై పశ్చిమానికి చేరాడు. (4)
ద్రోణః కృపశ్చైవ వివింశతిశ్చ
దుశ్శాసనశ్చైవ వివృత్య శీఘ్రమ్।
సర్వే పురస్తాద్ వితతోరుచాపాః
దుర్యోధనార్థం త్వరితాఽభ్యుపేయుః॥ 5
వెంటనే ద్రోణుడు, కృపుడు, వివింశతి, దుశ్శాసనుడు కూడా శీఘ్రంగా వచ్చారు, వారందరూ తమతమ ధనుస్సులను ధరించి దుర్యోధనునికోసం అతని ముందు భాగాన మోహరించారు. (5)
స తాన్యనీకాని నివర్తమానా
న్యాలోక్య పూర్ణౌఘనిభాని పార్థః।
హంసో యథా మేఘమివాపతంతం
ధనంజయః ప్రత్యతపత్తరస్వీ॥ 6
సూర్యుడు తనకభిముఖంగా వస్తున్న మేఘసమూహాన్ని తపింప చేసినట్లు వేగశాలి, కుంతీపుత్రు డయిన ధనంజయుడు నీటి ప్రవాహంవలె మరలి వస్తున్న సైన్య సమూహాలను తపింప చేయనారంభించాడు. (6)
తే సర్వతః సంపరివార్య పార్థం
అస్త్రాణి దివ్యాని సమాదదానాః।
వవర్షురభ్యేత్య శరైః సమంతాత్
మేఘా యథా భూధరమంబువర్షై॥ 7
దివ్యాస్త్రాలను ధరించిన అయోధులందరూ అన్ని వైపులనుండి పార్థుని ముట్టడించి మేఘాలు పర్వతాన్ని వర్షధారలతో ముంచెత్తినట్లు శరపరంపరలు కురిపించారు. (7)
తతోఽస్త్రమస్త్రేణ నివార్య తేషాం
గాండీవధన్వా కురుపుంగవానామ్।
సమ్మోహనం శత్రుసహోఽయదస్త్రం
ప్రాదుశ్చకారైంద్రిరపారణీయమ్॥ 8
అప్పుడు శత్రువేగాన్ని సహించే ఇంద్రపుత్రుడు, గాండీవధారి అయిన అర్జునుడు తన అస్త్రాలతో కౌరవముఖ్యుల అస్త్రాలను మరలించి, సమ్మోహనమనే పేరుగల మరొక(దాటరాని) అస్త్రాన్ని ప్రయోగించాడు. దాని ప్రభావాన్ని ఎవ్వరూ ఎదుర్కొనలేరు. (8)
తతో దిశశ్చానుదిశో వివృత్య
శరైః సుధారైర్నిశితైః సుపత్రైః।
గాండీవఘోషేణ మనాంసి తేషాం
మహాబలః ప్రవ్యథయాంచకార॥ 9
తరువాత వాడియంచులూ, చక్కని పుంఖాలూ గల వాడి బాణాలతో దిక్కులను దిగంతరాళాలను నింపి మహాబలుడైన అర్జునుడు గాండీవఘోషతో కౌరవ యోధుల మనస్సులను కలచి వేశాడు. (9)
తతః పున ర్భీమరవం ప్రగృహ్య
దోర్భ్యాం మహాశంఖముదారఘోషమ్।
వ్యనాదయత్ సప్రదిశో దిశః ఖం
భువం చ పార్థోద్విషతాం నిహంతా॥ 10
పిమ్మట శత్రునాశకుడైన పార్థుడు తన హస్తాలతో ఉదాత్తంగానూ, భయంకరంగానూ ఘోషించే శంఖాన్ని గైకొని; దిక్కులు, విదిక్కులు, భూమ్యాకాశాలు మారు మ్రోగే విధంగా శంఖనాదం చేశాడు. (10)
తే శంఖనాదేన కురుప్రవీరాః
సమ్మోహితాః పార్థసమీరితేన।
ఉత్సృజ్య చాపాని దురాసదాని
సర్వే తదా శాంతిపరా బభూవుః॥ 11
అర్జునుని ఆ శంఖనాదంతో కురువీరులందరూ సమ్మోహితులయ్యారు. అప్పుడందరూ తమతమ దుర్లభమైన ధనుస్సులను విడిచిపెట్టి ప్రశామ్తు లయ్యారు. (11)
వి॥తె॥ కౌరవ వీరులు పడేందుకు మాత్రమే సమ్మోహనాస్త్రం ప్రయోగించాడు అర్జునుడు ఏ దివ్యాస్త్రమో ప్రయోగించి చంపి వేయవచ్చును గదా! దానికి సమాధానం తెలుగులో తిక్కన చక్కగా చెప్పాడు. "తన తోడంబుట్టువుల ప్రతిజ్ఞ లూహించి యొండు సేయ నొల్లక సపరివారంబుగా ధార్తరాష్ట్రుల భంగపెట్టం దలంచి, యింద్రదైవత్యంబును, సత్యసంపాతంబును, నరాతిసైన్యదైన్యసంపాదనంబును నగు సమ్మోహనాస్త్రంబు ప్రయోగించిన"-(5-207)అని.
వి॥ అరణ్యపర్వంలో దిక్పాలకులు దివ్యాయుధాలు అర్జునుడికిచ్చారు. అపుడు కుబేరుడు ఈ సమ్మోహనాస్త్రం ఇచ్చాడు.
తథా విసంజ్ఞేషు చ తేషు పార్థః
స్మృత్వా చ వాక్యాని తథోత్తరాయాః।
నిర్యాహి మధ్యాదితి మత్స్యపుత్రం
ఉవాచ యావత్ కురవో విసంజ్ఞాః॥ 12
ఆచార్య శారద్వతయోస్సుశుక్లే
కర్ణస్య పీతం రుచిరం చ వస్త్రమ్।
ద్రౌణేశ్చ రాజ్ఞశ్చ తథైవనీల
వస్త్రే సమాదత్స్య వరప్రవీర॥ 13
కురువీరులందరూ అచేతనులై ఉండటం చూసి పార్థుడు ఉత్తరయొక్క వాక్యాన్ని స్మరించుకొని మత్స్యపుత్రుడైన ఉత్తరకుమారునితో ఇలా అన్నాడు.
'నరవీరా! కౌరవులందరూ ప్రస్తుతం మూర్ఛలో ఉన్నారు. కనుక నీవు సేనమధ్య నుండి వెళ్ళి ద్రోణ కృపాచార్యుల తెల్లని వస్త్రాలు, కర్ణుని పసుపువస్త్రం, అశ్వత్థామ సుయోధనుల నీలవస్త్రాలు తీసుకొని రా.' (12,13)
భీష్మస్య సంజ్ఞాం తు తథైవ మన్యే
జానాతి సోఽస్త్రప్రతిఘాతమేషః।
ఏతస్య వాహాన్ కురు సవ్యత స్త్వమ్
ఏవం హి యాతవ్యమమూఢ సంజ్ఞైః॥ 14
తాతగారైన భీష్ముడు మూర్ఛను పొందలేదని భావిస్తాను. ఎందుకంటే సమ్మోహనాస్త్రాన్ని ఎలా ప్రతిఘటించాలో ఆయనకు తెలుసు. భీష్ముని గుర్రాలు నీకు కుడివైపున ఉండేటట్లు వెళ్ళు. చైతన్యవంతులైన వీరుల సమీపం నుండి వెళ్ళేటపుడీ విధంగానే చేయాలి. (14)
రశ్మీన్ సముత్సృజ్య తతో మహాత్మా
రథాదవప్లుత్య విరాటపుత్రః।
వస్త్రాణ్యుపాదాయ మహారథానాం
తూర్ణం పునః స్వం రథమారురోహ॥ 15
తరువాత మహాత్ముడు, విరాటపుత్రుడు అయిన ఉత్తరుడు గుర్రపుపగ్గాలను విడిచిపెట్టి, రథం దిగి కౌరవ మహారథులయొక్క వస్త్రాలను తీసుకొని తిరిగి శీఘ్రంగా రథాన్ని ఎక్కాడు. (15)
తతోఽన్వశాస చ్చతురః సదశ్వాన్
పుత్రో విరాటస్య హిరణ్యకక్షాన్।
తే తద్ వ్యతీయు ర్ధ్వజినామనీకం
శ్వేతా వహంతోఽర్జునమాజిమధ్యాత్॥ 16
వెంటనే విరాటపుత్రుడు సువర్ణాభరణ భూషితాలైన నాలుగురథాశ్వాలను అదిలించాడు. అర్జునుని రథాన్ని వహించే ఆతెల్లని గుర్రాలు రణరంగమధ్యమందున్న సైన్యసమూహాలనుండి తరలి వెళ్ళాయి. (16)
తథానుయాంతం పురుషప్రవీరం
భీష్మః శరైరభ్యహనత్ తరస్వీ।
స చాపి భీష్మస్య హయాన్నిహత్య
వివ్యాథ పార్థో దశభిః పృషత్కైః॥ 17
అలా యుద్ధరంగంనుండి తరలిన పురుష ప్రవీరుడైన అర్జునుని చూసి, వేగశాలియైన భీష్ముడు అర్జునుని గాయపరిచాడు. అపుడర్జునుడు కూడా భీష్ముని రథాశ్వాలను చంపి, పది బాణాలతో భీష్ముని కూడా గాయపరిచాడు. (17)
తతోఽర్జునో భీష్మమపాస్య యుద్ధే
విద్ధ్వాస్య యంతారమరిష్టధన్వా।
తస్థౌ విముక్తో రథవృందమధ్యాత్
మేఘం విదార్యేవ సహస్రరశ్మిః॥ 18
దుర్భేద్యమైన ధనుస్సుకల అర్జునుడు యుద్ధ భూమిలో భీష్ముని విడిచిపెట్టి, భీష్మసారథిని గాయపరచి, రథ సమూహం నుండి బయటకు వచ్చాడు. ఆసమయంలో అర్జునుడు మేఘమండలాన్ని చీల్చుకుని ప్రకాశిస్తున్న సూర్యునివలె ప్రకాశించాడు. (18)
లబ్ధ్వా హి సంజ్ఞాం తు కురుప్రవీరాః
పార్థం నిరీక్ష్యాథ సురేంద్రకల్పమ్।
రణే విముక్తం స్థితమేకమాజౌ
సధార్తరాష్ట్రస్త్వరితం బభాషే॥ 19
కొంతసేపటికి తేరుకున్న కురువీరులు ఇంద్రసముడైన పార్థుని చూశారు. యుద్ధరంగంనుండి బయటపడి దూరంగా ఒంటరిగా ఉన్న అర్జునుని చూస్తూ దుర్యోధనుడు వెంటనే ఇలా అన్నాడు. (19)
అయం కథం వై భవతో విముక్తః
తథా ప్రమథ్నీత యథా న ముచ్యేత్।
తమబ్రవీత్ శాంతనవః ప్రహస్య
క్వ తే గతా బుద్ధిరభూత్ క్వ వీర్యమ్॥
శాంతిం పరాం ప్రాప్య యదాస్థితో భూః
ఉత్సృజ్య బాణాంశ్చ ధనుర్విచిత్రమ్॥ 20
తాతా! అర్జునుడు మీచేతినుండి ఎలా బయట పడ్డాడు? అర్జునుడు దాటిపోకుండా అతనిని మథించండి - అన్నాడు దుర్యోధనుడు. భీష్ముడు నవ్వుతూ దుర్యోధనునితో ఇలా అన్నాడు. 'రాజా! చిత్రమైన నీ ధనుస్సును బాణాలను విడిచిపెట్టి పూర్తిగా ప్రశాంతుడవై మూర్ఛపోయావుకదా! ఆ సమయంలో నీబుద్ధి వీర్యం ఎక్కడికి వెళ్ళాయి?' (20)
న త్వేష బీభత్సురలం నృశంసం
కర్తుం న పాపేఽస్య మనో విశిష్టమ్।
త్రైలోక్యహేతోర్న జహేత్ స్వధర్మం
సర్వే న తస్మాన్నిహతా రణేఽస్మిన॥ 21
క్షిప్రం కురూన్ యాహి కురుప్రవీర
విజిత్య గాశ్చ ప్రతియాతు పార్థః।
మా తే స్వకోఽర్థో నిపతేత మోహాత్
తత్ సంవిధాతవ్యమరిష్టబంధమ్॥ 22
ఈ అర్జునుడు ఎప్పుడూ నిర్దయగా వ్యవహరించేవాడు కాదు. ఇతని విశిష్టమైన మనస్సెప్పుడూ పాపకార్యాల్లో ప్రవర్తించదు. ఇతడు ముల్లోకాలను జయించటం కోసమైనా సరే అధర్మాన్ని చేయడు. కనుకనే మనమందరం యుద్ధంలో అర్జునునిచే చంపబడలేదు. కురువీరుడా! నీవు వెంటనే కురుదేశాలకు తరలివెళ్ళు. అర్జునుడు గోవులను విడిపించుకొని వెనక్కు చేసుకోవద్దు. అందరూ కల్యాణకరాలయిన తమతమ పనులను చూసుకోవటం మంచిది.' (21,22)
వి॥తె॥ ఇక్కడ తెలుగులో "సాహసించి మనం ఆలోచన లేకుండా అర్జునుని ఎదుర్కొంటే వాడు తనబాణాగ్నికి మనల నందరినీ పూర్ణాహుతి చేస్తాడు" అంటాడు భీష్ముడు. (5-218)
వైశంపాయన ఉవాచ
దుర్యోధన స్తస్య తు తన్నిశమ్య
పితామహస్యాత్మహితం వచోఽథ।
అతీతకామో యుధి సోఽత్యమర్షీ
రాజా వినిఃశ్వస్య బభూవ తూష్ణీమ్॥ 23
వైశంపాయనుడిలా అన్నాడు. జనమేజయా! తాతగారైన భీష్మునియొక్క హితవచనాలు విన్నాక ముక్కోపి దుర్యోధనుడు యుద్ధంపట్ల కోరికను విడిచిపెట్టాడు. పెద్దగా నిట్టూర్చి మౌనంగా ఉండిపోయాడు. (23)
తద్భీష్మవాక్యం హితమీక్ష్య సర్వే
ధనంజయాగ్నిం చ వివర్ధమానమ్।
నివర్తనాయైవ మనో నిదధ్యుః
దుర్యోధనం తే పరిరక్షమాణాః॥ 24
ఇతరయోధులకు కూడా భీష్మునిమాట హితమనిపించింది. యుద్ధంచేస్తే ధనంజయాగ్ని ప్రజ్వరిల్లే సూచనలే కానవస్తున్నాయి. ఇదంతా ఆలోచించి దుర్యోధనుని రక్షించుకొంటూ మరలి పోవటానికే యోధులందరూ నిశ్చయించారు. (24)
తాన్ ప్రస్థితాన్ ప్రీతమనాః స పార్థః
ధనంజయః ప్రేక్ష్య కురుప్రవీరాన్।
అభాషమాణోఽనునయం ముహూర్తం
వచోఽబ్రవీత్ సంపరిహృత్య భూయః॥ 25
పితామహం శాంతనవం చ వృద్ధం
ద్రోణం గురుం చ ప్రణిపత్య మూర్ధ్నా।
కౌరవవీరులందరూ తిరిగి వెళ్ళిపోతుండటాన్ని చూసిన ధనంజయుడు సంతోషించాడు. అర్జునుడు ఒక ముహూర్త కాలంపాటు అనునయభాషణం చేయకుండా మౌనంగా ఉండిపోయాడు. తరువాత తాతగారైన భీష్మునికీ, గురువైన ద్రోణునికీ శిరసుతో నమస్కరించి కుశలప్రశ్నలు చేశాడు. (25)
ద్రౌణిం కృపం చైవ కురూంశ్చ మాన్యాన్
శరైర్విచిత్రై రభివాద్యచైవ॥ 26
దుర్యోధనస్యోత్తమరత్న చిత్రం
చిచ్ఛేద పార్థో ముకుటం శరేణ।
తరువాత అశ్వత్థామకు, కృపాచార్యునికి, మాన్య కురువీరులకు(బాహ్లీకసోమదత్తాదులకు) విచిత్రాలైన బాణాలతో అభివాదనంచేసి పార్థుడు ఉత్తమ రత్నఖచితమైన దుర్యోధనుని కిరీటాన్ని ఒక బాణంతో ఛేదించాడు. (26 1/2)
వి॥సం॥ దుర్యోధనుని శిరస్సును అర్జునుడు ఖండించలేదు. "అది నాలక్ష్యం కాదు. భూభారాన్ని పరిహరించవలసిన వాసుదేవుని ప్రీతికొరకే ఇదంతా జరుగుతోంది చూడం"డని తెలిజేయటానికే కిరీటాన్ని మాత్రమే భేదించాడు అర్జునుడు. (చతు)
వి॥తె॥ తెలుగులో భీష్మ, ద్రోణ, కృపాచార్యులు ముగ్గురికీ నమస్కారబాణాలు వేసినట్లుంది. (5-221)
ఆమంత్ర్య వీరాంశ్చ తథైవ మాన్యాన్
గాండీవఘోషేణ వినద్య లోకాన్॥ 27
స దేవదత్తం సహసా వినాద్య
విదార్య వీరీ ద్విషతాం మనాంసి।
ఇదేవిధంగా ఇతర కురువీరులనుండి సెలవు తీసుకొని, గాండీవఘోషంతో లోకాలను పిక్కటిల్ల చేశాడు ధనంజయుడు, ఆ వీరుడు వెంటనే దేవదత్త శంఖాన్ని పూరించి శత్రువుల మనస్సులు బ్రద్దలు చేశాడు. (27 1/2)
ధ్వజేన సర్వానభిభూయ శత్రూన్
సహేమమాలేన విరాజమానః॥ 28
దృష్ట్వా ప్రయాతాంస్తు కురూన్ కిరీటీ
హృష్టోఽబ్రవీత్తత్ర స మత్స్యపుత్రమ్।
ఆవర్తయాశ్వాన్ పశవో జితాస్తే
యాతాః పరే యాహి పురం ప్రహృష్టః॥ 29
ఈవిధంగా శత్రువులందరినీ పరాభవించి, హేమ మాలాలంకృతమైన ధ్వజంతో ప్రకాశిస్తూ కిరీటి కురువీరులు మరలినట్లు నిర్ధారించుకొని మత్స్య పుత్రుడైన ఉత్తరునితో సంతోషంగా ఇలా అన్నాడు. 'ఉత్తరా! గుర్రాలను పశువులను మళ్ళించు. శత్రువులు జయింపబడ్డారు. మరలిపోయారు. కనుక ఆనందంగా పట్టణంలోకి ప్రవేశించు' అన్నాడు. (28,29)
వి॥తె॥ ఇక్కడ తెలుగులో అర్జునుడు చక్కని పద్యం చెపుతాడు.
పసులు మరలె, శత్రు బలములు పీనుంగు
పెంటలయ్యె, రాజుఁ బెద్ద దొరలు
చీర లొలువఁ బడిరి; సిగ్గఱి బిరుదులు
వైచి రింక మగుడ వలదె మనకు? (5-222)
"చీరలొలువ బడిరి" అనడంలో అర్జునుని కసి వ్యక్త మవుతుంది. ఇందులో ద్రౌపది వస్త్రాపహరణం అర్జునుడి మనస్సులో ఎంత ఘాటుగా నాటుకుందో తెలుస్తుంది.
దేవాస్తు దృష్ట్వా మహదద్భుతం తద్
యుద్ధం కురూణాం సహఫాల్గునేన।
జగ్ముర్యథాస్వం భవనం ప్రతీతాః
పార్థస్య కర్మాణి విచింతయంతః॥ 30
కౌరవవీరులతో అర్జునుడు చేసిన మహాద్భుతయుద్ధాన్ని చూసిన దేవతాసమూహం పరమానందాన్ని పొందింది. దేవతలందరూ అర్జునుని పరాక్రమాన్ని స్మరించుకొంటూ తమతమ నివాసాలకు తిరిగి వెళ్ళారు. (30)
ఇతి శ్రీమహాభారతే విరాటపర్వణి గోహరణ పర్వణి సమస్త కౌరవ పలాయనే షట్ షష్టితమోఽధ్యాయః॥ 66 ॥
ఇది శ్రీమహాభారతమున విరాటపర్వమున గోహరణ పర్వమను ఉపపర్వమున
సమస్త కౌరవపలాయన మను అరువది ఆరవ అధ్యాయము. (66)