65. అరువది ఐదవ అధ్యాయము

అర్జునుడు దుర్యోధనునితో యుద్ధము చేయుట - దుర్యోధనుడు పారిపోవుట.

వైశంపాయన ఉవాచ
భీష్మేతు సంగ్రామశిరో విహాయ
పలాయమానే ధృతరాష్ట్రపుత్రః।
ఉత్సృజ్య కేతుం వినదన్ మహాత్మా
ధనుర్విగృహ్యార్జునమాససాద॥ 1
వైశంపాయనుడిలా అన్నాడు. జనమేజయా! భీష్ముడు యుద్ధంగాన్నుండి తొలగింపబడగానే మహామనస్వి అయిన దుర్యోధనుడు, తన రథపతాకాన్ని ఎగురవేసి, సింహనాదం చేస్తూ ధనుస్సును ఎక్కుపెట్టి, అర్జునుని సమీపించాడు. (1)
స భీమధన్వానముదగ్రవీర్యం
ధనంజయం శత్రుగణే చరంతమ్।
ఆకరణపూర్ణాయతచోదితేన
వివ్యాధ భల్లేన లలాటమధ్యే॥ 2
ఆ సమయంలో మహాపరాక్రమవంతుడైన ధనంజయుడు భయంకరమైన గాండీవంతో శత్రుగణంలో విహరిస్తున్నాడు. దుర్యోధనుడు భల్లమనే బాణాన్ని కర్ణాంతంవరకు లాగి అర్జునుడి నుదుటిపై గాయపరిచాడు. (2)
స తేన బాణేన సమర్పితేన
జాంబూనదాగ్రేణ సుసంహితేన।
రరాజ రాజన్ మహనీయకర్మా
యథైకపర్వా రుచిరైకశృంగః॥ 3
ఆ బాణం అర్జునుని ఫాలంమీద గుచ్చుకొన్నది. రాజా! మహాపరాక్రమవంతుడైన అర్జునుడు ఆ స్వర్ణాగ్రబాణంతో అందమైన శిఖరం మీద వెదురుచెట్టుతో శోభించే పర్వతంలా కనపడ్డాడు. (3)
అథాస్య బాణేన విదారితస్య
ప్రాదుర్బభూవాసృగజస్రముష్ణమ్।
స తస్య జాంబూనదపుంఖచిత్రః
భిత్వా లలాటం సువిరాజతే స్మ॥ 4
దుర్యోధనుని బాణంతో ఛేదింపబడిన అర్జునుని నుదుటినుండి వెచ్చని నెత్తురు నిరంతరంగా ప్రవహిస్తోంది. బంగరుపుంఖంగల ఆ బాణం పార్థుని ఫాలాన్ని భేదించి అందంగా అక్కడే ఉండిపోయింది. (4)
దుర్యోధనశ్చాపి తముగ్రతేజాః
పార్థశ్చ దుర్యోధనమేకవీరః।
అన్యోన్యమాజౌ పురుషప్రవీరౌ
సమౌ సమాజగ్మతురాజమీఢౌ॥ 5
తరువాత ఉగ్రతేజుడయిన పార్థుడు దుర్యోధనుని మీద, దుర్యోధనుడు పార్థుని మీద ఆక్రమణ చేశారు. అజమీఢవంశ ప్రముఖులైన వారిద్దరూ పురుషశ్రేష్ఠులే. ఈ విధంగా వారిద్దరూ అన్యోన్యం తలపడ్డారు. (5)
తతః ప్రభిన్నేన మహాగజేన
మహీధరాభేన పునర్వికర్ణః।
రథైశ్చతుర్భిర్గజపాదరక్షైః
కుంతీసుతం జిష్ణుమథాభ్యధావత్॥ 6
ఆ సమయంలో కుంభస్థలంనుండి స్రవిస్తున్న మదంతో పర్వతాకారమైన ఏనుగునెక్కి వికర్ణుడు జయశీలుడైన కుంతీసుతునితో తలపడ్డాడు. ఆ మహాగజానికి నాలుగువైపులా పాదరక్షకాలైన నాల్గు రథాలున్నాయి. (6)
త మాపతంతం త్వరితం గజేంద్రం
ధనంజయః కుంభవిభాగమధ్యే।
ఆకర్ణపూర్ణేన మహాయసేన
బాణేన వివ్యాథ మహాజవేన॥ 7
తీవ్రవేగంతో వస్తున్న గజరాజును చూసి ధనంజయుడు ఒక లోహబాణాన్ని చెవులవరకు లాగి వేగంగా కుంభస్థలమధ్యం మీద కొట్టాడు. (7)
పార్థేన సృష్టః సతు గార్ధ్రపత్రః
ఆపుంఖదేశాత్ ప్రవివేశ నాగమ్।
విదార్య శైలప్రవరం ప్రకాశం
యథాశనిః పర్వతమింద్రసృష్టః॥ 8
పార్థునిచే విడువబడిన గృధ్రపత్రనిర్మితమైన ఆ బాణం ఇంద్రునిచే ప్రయోగింపబడిన వజ్రాయుధం పర్వతాన్ని చీల్చినట్లు ఏనుగు కుంభస్థలంలో చివరివరకు దిగబడిపోయింది. (8)
శరప్రతప్తః స తు నాగరాజః
ప్రవేపితాంగో వ్యథితాంతరాత్మా।
సంసీదమానో నిపపాత మహ్యాం
వజ్రాహతం శృంగమివాచలస్య॥ 9
ఆ గజరాజు అర్జునుని బాణంతో తపించి పోయింది. దాని అంతరాత్మ వ్యథ చెందింది. శరీరం కంపించిపోయింది. వజ్రహతిచే పర్వతశిఖరం కూలినట్లు ఆ ఏనుగు భూమి మీద కుప్పకూలిపోయింది. (9)
నిపాతితే దంతివరే పృథివ్యాం
త్రాసాద్ వికర్ణః సహసావతీర్య।
తూర్ణం పదాన్యష్టశతాని గత్వా
వివింశతేః స్యందనమారురోహ॥ 10
గజరాజు నేలకూలగానే వికర్ణుడు భయంతో ఏనుగు దిగి, వేగంగా ఎనిమిదివందల అడుగుల దూరం నడిచి వివింశతియొక్క రథాన్ని ఎక్కాడు. (10)
నిహత్య నాగం తు శరేణ తేన
వజ్రోపమేనాద్రివరాంబుదాభమ్।
తథావిధేనైవ శరేణ పార్థః
దుర్యోధనం వక్షసి నిర్బిభేద॥ 11
వజ్రసమానమైన బాణంతో పర్వతం వంటి, మేఘం వంటి ఏనుగును సంహరించాక, అర్జునుడు అటువంటిదే అయిన మరొక బాణంతో దుర్యోధనుని వక్షఃస్థలాన్ని భేదించాడు. (11)
తతో గజే రాజని చైవ భిన్నే
భగ్నే వికర్ణే చ సపాదరక్షే।
గాండీవముక్తైర్విశిఖైః ప్రణున్నాః
తే యోధముఖ్యాః సహసాపజగ్ముః॥ 12
ఈవిధంగా గజరాజు కురురాజూకూడా గాయపడగా, పాదరక్షకులతో సహా వికర్ణుడు పలాయనం చిత్తగించాడు. గాండీవం నుండి వెలువడిన బాణాలచే పీడింపబడిన యోధముఖ్యులందరూ క్రమంగా రణరంగాన్ని విడిచిపెట్టారు. (12)
దృష్ట్వైవ పార్థేన హతం చ నాగం
యోధాంశ్చ సర్వాన్ ద్రవతో నిశమ్య।
రథం సమావృత్య కురుప్రవీరః
రణాత్ ప్రదుద్రావ యతో న పార్థః॥ 13
అర్జునునిచేత చంపబడిన ఏనుగును చూసి, యోధులంతా యుద్ధరంగాన్నుండి పారిపోవటాన్ని తెలుసుకుని, కురువీరుడైన దుర్యోధనుడు రథాన్ని మరలించి, అర్జునుడికి దూరంగా పారిపోయాడు. (13)
తం భీమరూపం త్వరితం ద్రవంతం
దుర్యోధనం శత్రుసహోఽభిషంగమ్।
ప్రస్ఫోటయద్ యోద్ధుమనాః కిరీటీ
బాణేన విద్ధం రుధిరం వమంతమ్॥ 14
అపుడు దుర్యోధనుని రూపం అతిభయంకరంగా ఉంది. పరాజయాన్ని చవిచూసి బాణపుదెబ్బతో రక్తం కక్కుకుంటూ పారిపోతున్నాడు. దీనిని చూసి కిరీటధారి అర్జునుడు యుద్ధ కాంక్షతోరణోత్సాహంతో దుర్యోధనునితో ఇలా అన్నాడు. (14)
అర్జున ఉవాచ
విహాయ కీర్తిం విపులం యశశ్చ
యుద్ధాత్ పరావృత్య పలాయసే కిమ్।
న తేఽద్య తూర్యాణి సమాహతాని
తథైవ రాజ్యాదవరోపితస్య॥ 15
యుధిష్ఠిరస్యాస్మి నిదేశకారీ
పార్థస్తృతీయో యుధి సంస్థితోఽస్మి।
తదర్థమావృత్య ముఖం ప్రయచ్ఛ
నరేంద్రవృత్తం స్మర ధార్తరాష్ట్ర॥ 16
అర్జునుడిలా అన్నాడు. 'దుర్యోధనా! యుద్ధం వదలి వెన్నుచూపించి ఎందుకు పారిపోతావు? ఇలా చేస్తే నీ కీర్తి, విశాలమైన యశస్సు నశించి పోతాయి. ఈరోజు నీవిజయదుందుభులు మ్రోగటం లేదు ఎందుకు? నీచేత రాజ్యం నుంచి తొలగించబడిన యుధిష్ఠిరుని సేవకుడను, పాండవులలో మూడవవాడిని, యుద్ధం చేయడానికి సిద్ధంగానే ఉన్నాను. కనుక నీవు పారి పోవటం ఆపి నాకు ముఖం చూపించు. రాజు ఎలా ఉండాలో ఒకసారి గుర్తు చేసుకో. (15,16)
వి॥సం॥ ఇచట కీర్తి - యశస్సు ఈరెండూ ఏకార్థాలుగా కనిపిస్తాయి. కాని కాదు. శౌర్యం ప్రశంసించడం కీర్తి అనీ శత్రువధకు సంబంధించింది యశస్సు అనీ వేరు పరుస్తాడు చతుర్భుజమిశ్రుడు. లేదా దానాదుల వల్ల కలిగేది కీర్తి అనీ, శౌర్యాదుల వల్ల కలిగేది యశస్సు అనీ చెప్పవచ్చు నంటాడు. పుణ్యశ్లాఘనం కీర్తి అనీ, విద్యాశిల్పాదుల శ్లాఘ యశస్సు అనీ అర్జున మిశ్రుడంటాడు. నరేంద్ర! వృత్తం అని విడదీసి నీలకంఠుడు వృత్త మనగా ద్యూతాదులలో జరిగిన అధర్మం అని అర్థం చెప్పాడు. కాని తెలుగులో తిక్కన నరేంద్రవృత్తం అని సమానంగా ఊహించాడు.
వి॥తె॥ యుద్ధంలో ఇలా మాట్లాడుకోవడం ఉపాలంభం అంటారు. ఇటువంటి ఉపాలంభాలు తెలుగుభారతంలో ఎక్కువగా కనిపిస్తాయి. యుద్ధపర్వాలకు దీప్తి నిచ్చినవి ఈ ఉపాలంభాలే.
వి॥తె॥ తెలుగులో ఈ ఉపాలంభం ఇంకా బాగుంది. క్షత్రియుడు యుద్ధానికి భయపడతాడా? కౌరవరాజా! దుర్యోధనా! ఈదైన్యం నీకు తగదు. నేను ఒంటరివాడిని. పైగా కుంతీ కుమారులలో చిన్నవాడిని, నిన్ను యుద్ధానికి పిలిస్తే అభిమానధనుణ్ణి అని ప్రసిద్ధి వహించి బలగర్వాలు ప్రదర్శించే నీవూ, నీమిత్రులూ ఇలా పారిపోతే ఎలా? ఎవరయినా మెచ్చుకుంటారా? పైగా రేపటినుండి నిన్ను కొలవటానికి సామంతరాజులు వస్తారా?
క్షత్రియుఁ డోడునే? తగదు కౌరవరాజ! యొకండ నే పృథా
పుత్రులలోన పిన్న; నినుఁ బోరికిఁ బిల్వఁగ మాని నాఁగ ని
ద్ధాత్రిఁ బ్రసిద్ధికెక్కి బలదర్పసమగ్రుఁడ వైన నీవు నీ
మిత్రులుగూడ నిట్లయిన మెత్తిరె?వత్తురె కొల్వ భూభుజుల్?
(5-203)
దుర్యోధనా! యుద్ధంలో ఓడిపోయి పారిపోతే నీవు ఏనుగు నెక్కి; రెండు వైపులా ఎన్నో ఏనుగులు వస్తుంటే హస్తినాపుర వీథుల్లో ఎలా ఊరేగగలవు? మణిమయభూషణాలు ధరించి సభలో ఎలా కూర్చుండగలవు? కాబట్టి నాసలహా విను. వెనక్కు తిరుగు. నాతో యుద్ధం చేస్తూ ఈ శరీరం విడచి వీరస్వర్గం అలంకరించు. వెనుకటి లాగా మా సంపదను అపహరించ డానికిక్కిక ఆడవలసింది జూదంకాదు సుమా!
సీ. ఏనుంగు నెక్కి పెక్కేనుంగు లిరుగడ
రా పురవీథులఁ గ్రాలఁ గలదె!
మణిమయంబయిన భూషణజాలముల నొప్పి
యొడ్డోలగంబున నుండఁ గలదె!
కర్పూర చందన కస్తూరికాదుల
నింపు సొంపార భోగింపఁ గలదె!
యతిమనోహరలగు చతురాంగనలతోడి
సంగతి వేడ్కలు సలుపఁ గలదె!
తే. కయ్యమున నోడి పాఱిన కౌరవేంద్ర!
వినుము నాబుద్ధి; మరలి యీతనువు విడిచి
సుగతి వడయుము; తొల్లింటి చూఱగలదె!
జూద మిచ్చట నాడంగ రాదు సుమ్ము. (5-204)
ఈ మాటలతో దుర్యోధనుడు తోక తొక్కిన త్రాచులా మళ్లీ యుద్ధానికి సిద్ధమవుతాడు. ఇది ఉపాలంభ ప్రయోజనం.
మోఘం తవేదం భువి నామధేయం
దుర్యోధనేతీహ కృతం పురస్తాత్।
న హీహ దుర్యోధనతా తవాస్తి
పలాయమానస్య రణం విహాయ॥ 17
అనవసరంగా నీకు దుర్యోధను డని పేరుపెట్టారు. నీవేమో యుద్ధం నుంచి పారిపోవుతున్నావు. కనుక నీలో దుర్యోధనత్వమనేది ఏకోశానా లేదు. (17)
వి॥ యుద్ధమున సులభముగా జయింప వీలుకానివాడు అని దుర్యోధన శబ్ధం యొక్క భావం.
న తే పురస్తాదథ పృష్టతో వా
పశ్యామ దుర్యోధన రక్షితారమ్।
అపేహి యుద్ధాత్ పురుషప్రవీర
ప్రాణాన్ ప్రియాన్ పాండవతోఽద్య రక్ష॥ 18
దుర్యోధనా! నీకు ముందుగానీ,వెనుకగానీ రక్షకులు ఎవ్వరూ కనబడటంలేదు. వీరపురుషుడా! నేడు ఈ పాండవమధ్యముని నుండి అత్యంతప్రియమైన ప్రాణాలను రక్షించుకో. (18)
ఇతి శ్రీమహాభారతే విరాటపర్వణి గోహరణపర్వణి దుర్యోధనాపయానే పంచషష్టితమోఽధ్యాయః॥ 65 ॥
ఇది శ్రీమహాభారతమున విరాటపర్వమున గోహరణ పర్వమను ఉపపర్వమున దుర్యోధనపలాయనమను అరువది అయిదవ అధ్యాయము. (65)