64. అరువది నాలుగవ అధ్యాయము
అర్జునుడు భీష్మునితో యుద్ధము చేయుట, భీష్ముడు ఓడిపోయి తొలగుట.
వైశంపాయన ఉవాచ
తతః శాంతనవో భీష్మః భరతానాం పితామహః।
వధ్యమానేశ్హు యోధేశ్హు ధనంజయముపాద్రవత్॥ 1
జనమేజయా! తరువాత భరతవంశంలో సుప్రసిద్ధుడు, శంతనుని కుమారుడు, కురుపితామహుడు అయిన భీష్ముడు, తనపక్షాన నున్న వీరుల సంహారం చూసి, అర్జునునివైపు తరలాడు. (1)
ప్రగృహ్య కార్ముకశ్రేష్ఠం జాతరూపపరిష్కృతమ్।
శరానాదాయ తీక్ష్ణాగ్రాన్ మర్మభేదాన్ ప్రమాథినః॥ 2
భీష్ముడు శ్రేష్ఠమైన బంగారు ధనుస్సును ధరించి, మర్మభేదకాలయి, శత్రువులను కలచివేసే వాడికొనలు కల బాణాలను గైకొన్నాడు. (2)
పాండురేణాతపత్రేణ ధ్రియమాణేన మూర్ధని।
శుశుభే స నరవ్యాఘ్రః గిరిః సూర్యోదయే యథా॥ 3
అతని శిరస్సుపై తెల్లని గొడుగు అమరి ఉంది. దానిచే నరశ్రేష్ఠుడయిన భీష్ముడు సూర్యోదయకాలంలో ఉదయాచలం వలె ప్రకాశించాడు. (3)
ప్రధ్మాయ శంఖం గాంగేయః ధార్తరాష్ట్రాన్ ప్రహర్షయన్।
ప్రదక్షిణ ముపావృత్య బీభత్సుం సమవారయత్॥ 4
భీష్ముడు శంఖాన్ని పూరించి, ధృతరాష్ట్ర కుమారులకు ఆనందాన్ని కలిగిస్తూ కుడివైపుగా తిరిగివచ్చి అర్జునుని పురోగమనాన్ని అడ్డుకొన్నాడు. (4)
తముదీక్ష్య సమాయాంతం కౌంతేయః పరవీరహా।
ప్రత్యగృహ్ణాత్ ప్రహృష్టాత్మా ధారాధరమివాచలః॥ 5
శత్రువీరులను సంహరించే అర్జునుడు తనమీదికి వస్తున్న భీష్ముని చూసి సంతసించి భీష్ముని కెదురు వెళ్ళాడు. ఆ సమయంలో అర్జునుడు చలించని పర్వతం వర్షధారలను కురిస్తే మేఘాన్ని నిలువరిస్తున్నట్లున్నాడు. (5)
తతో భీష్మః శరానష్టౌ ధ్వజే పార్థస్య వీర్యవాన్।
సమార్పయన్మహావేగాన్ శ్వసమానానివోరగాన్॥ 6
శూరుడయిన భీష్ముడు పార్థుని ధ్వజంపై బుసలుకొట్టే సర్పాలవంటి మహావేగంకల ఎనిమిది బాణాలను విడిచాడు. (6)
తే ధ్వజం పాండుపుత్రస్య సమాసాద్య పతత్రిణః।
జ్వలంతం కపిమాజఘ్నుః ధ్వజాగ్రనిలయాంశ్చ తాన్॥ 7
ఆ బాణాలు పాండునందనుని ధ్వజంమీద వెలిగే వానరుని, ఇతర భూతాలనూ పీడించాయి. (7)
తతో భల్లేన మహతా పృథుధారేణ పాండవః।
ఛత్రం చిచ్ఛేద భీష్మస్య తూర్ణం తదపతద్ భువి॥ 8
అర్జునుడు దృఢమైన అంచు కల భల్లంతో భీష్ముని గొడుగును ఖండించాడు. వెంటనే అది భూమిపై విరిగిపడింది. (8)
ధ్వజం చైవాస్య కౌంతేయః శరైరభ్యహనద్ భృశమ్।
శీఘ్రకృద్ రథవాహాంశ్చ తథోభౌ పార్ష్ణిసారథీ॥ 9
కుంతీనందనుడు వేగంగా బాణాలతో భీష్ముని ధ్వజాన్నీ, పార్శ్వరక్షకునీ, సారథినీ మిక్కిలి బాధించాడు. (9)
అమృష్యమాణస్తద్ భీష్మః జానన్నపి స పాండవమ్।
దివ్యేనాస్త్రేణ మహతా ధనంజయమవాకిరత్॥ 10
తన పరివారంపై అర్జునుడు చేసే దాడిని భీష్ముడు సహించలేకపోయాడు. పాండునందను డయిన ధనంజయుని శక్తి నెరిగికూడా దివ్యాస్త్రాన్ని ప్రయోగించి అతడు బాణవర్షం కురిపించాడు. (10)
తథైవ పాండవో భీష్మ దివ్య మస్త్రముదీరయన్।
ప్రత్యగృహ్ణాదమేయాత్మా మహామేఘమివాచలః॥ 11
కాని అమేయమైన ఆత్మబలం కల పాండునందనుడు పర్వతం మహామేఘాన్ని ఎదుర్కొన్నట్లు భీష్ముని ఎదిరించాడు. తానుకూడ దివ్యాస్త్రంతో బాణవర్షం కురిపించాడు. (11)
తయో స్తదభవద్ యుద్ధం తుములం లోమహర్షణమ్।
భీష్మస్య సహ పార్థేవ బలివాసవయోరివ॥ 12
అపుడు భీష్మార్జునులకు గగుర్పాటును కలిగించే సంకులసమరం జరిగింది. ఆ యుద్ధం బలి వాసవుల యుద్ధాన్ని తలపించింది. (12)
ప్రేక్షంతః కురవః సర్వే యోధాశ్చ సహసైనికాః।
భల్లై ర్భల్లాః సమాగమ్య భీష్మపాండవయోర్యుధి॥ 13
అంతరిక్షే వ్యరాజంత ఖద్యోతాః ప్రావృషీవ హి।
కౌరవయోధులందరూ తమతమ సైనికులతో కూడి యుద్ధాన్ని చూడసాగారు. రణభూమిలో భీష్మపాండునందనులు ప్రయోగించిన భల్లములు ఒకదానితోనొకటి ఢీకొని వర్షాకాలంలో ఆకసంలో విహరించే మిణుగురులవలె భాసించాయి. (13)
అగ్నిచక్రమివావిద్ధం సవ్యదక్షిణమస్యతః।
గాండీవమభవద్ రాజన్ పార్థస్య సృజతః శరాన్।
తతః సంఛాదయామాస భీష్మం శరశతైః శితైః।
పర్వతం వారిధారాభిః ఛాదయన్నివ తోయదః॥ 15
రాజా! కుడి ఎడమలనుండి శరాలను ప్రయోగించే పార్థుని గాండీవం అగ్నిచక్రం వలె ప్రకాశించింది. మేఘం జలధారలతో పర్వతాన్ని కప్పి వేసినట్లు, అర్జునుడు వందలకొలది బాణాలతో భీష్ముని కప్పివేశాడు. (14,15)
తాం సవేలామివోద్భూతాం శరవృష్టిం సముత్థితామ్।
వ్యధమత్ సాయకై ర్భీష్మః పాండవం సమవారయత్॥ 16
సముద్రంనుండి ఉప్పెనలా పొంగి వస్తున్న శరపరం పరను భీష్ముడు తన బాణవర్షంతో ఛిన్నాభిన్నంచేసి అర్జునుని వారించాడు. (16)
తతస్తాని నికృత్తాని శరజాలాని భాగశః।
సమరే చ వ్యశీర్యంత ఫాల్గునస్య రథం ప్రతి॥ 17
రణభూమిలో తునాతునకలు చేయబడిన బాణపు ముక్కలు అర్జునుని రథంపై పడసాగాయి. (17)
తతః కనకపుంఖానాం శరపృష్టిం సముత్థితామ్।
పాండవస్య రథాత్తూర్ణం శలభానామివాయతిమ్।
వ్యధమత్ తాం పునస్తస్య భీష్మః శరశతైః శితైః॥ 18
వెంటనే పాండుపుత్రుడయిన అర్జునుడు రథము నుండి తిరిగి బంగారు పుంఖాలుకల బాణ పరంపర మిడతలదండువలె వెలువడింది. కాని భీష్ముడు దానిని కూడ వందలకొలది వాడి బాణాలతో ప్రశాంత పరిచాడు. (18)
తతస్తే కురవ స్సర్వే సాధు సాధ్వితి చాబ్రువన్।
దుష్కరం కృతవాన్ భీష్మః యదర్జునమయోధయత్॥ 19
అపుడు కురుసైనికులంతా సాధువాదాలతో "భీష్ముడు గొప్ప సాహసం చేశాడు. అర్జునునితో యుద్ధం చేసి" అని భీష్ముని ప్రశంసించారు. (19)
బలవాం స్తరుణో దక్షః క్షిప్రకారీ ధనంజయః।
కోఽన్యః సమర్థః పార్థస్య వేగం ధారయితుం రణే॥ 20
ఋతే శాంతనవాద్ భీష్మాద్ కృష్ణాద్వా దేవకీసుతాత్।
ఆచార్యప్రవరాద్వాపి భారద్వాజా న్మహాబలాత్॥ 21
అర్జునుడు బలవంతుడు, యువకుడు, సమర్థుడు. వేగంగా బాణాలు ప్రయోగిస్తాడు. శంతనునందనుడైన భీష్ముడు, దేవకీ పుత్రుడయిన శ్రీకృష్ణుడు, ఆచార్యశ్రేష్ఠుడు భరద్వాజకుమారుడు అయిన ద్రోణుడు మాత్రమే అర్జునుని వేగాన్ని నిలువరింప గలరు. వేరెవ్వరిట్లు చేయగలరు? (20,21)
అస్రై రస్త్రాణి సంవార్య క్రీడంతౌ భరతర్షభౌ।
చక్షూంషి సర్వభూతానాం మోహయంతౌ మహాబలౌ॥ 22
భరతవంశశ్రేష్ఠులయిన వీరిద్దరే మహాబలవంతులు. ఒకరి అస్త్రాలతో మరొకరి అస్త్రాలను వారిస్తూ సమస్త ప్రాణుల నేత్రాలనూ మోహింపచేస్తూ క్రీడిస్తున్నారు. (22)
ప్రాజాపత్యం తథై వైంద్రమ్ ఆగ్నేయం రౌద్రదారుణమ్।
కౌబేరం వారుణం చైవ యామ్యం వాయవ్యమేవ చ।
ప్రయుంజానౌ మహాత్మానౌ సమరే తే విచేరతుః॥ 23
ప్రాజాపత్యం, ఐంద్రం, ఆగ్నేయం, భయంకర మైన రౌద్రం, కౌబేరం, వారుణం, యామ్యం, వాయవ్యం అనే అస్త్రాలను ప్రయోగిస్తూ వీరిద్దరు మహాపురుషులూ యుద్ధరంగంలో విహరిస్తున్నారు. (23)
విస్మితాన్యథ భూతాని తే దృష్ట్వా సంయుగే తదా।
సాధు పార్థ మహాబాహో సాధు భీష్మేతి చాబ్రువన్॥ 24
ఆ సమయంలో యుద్ధరంగంలో వారిద్దరిని చూస్తున్న ప్రాణిసమూహం ఆశ్చర్యంతో ఇలా అంది. పార్థా! మహాబాహూ! సాధువాదాలు, భీష్మా! మహాబాహూ! సాధువాదాలు. (24)
(భేష్ అర్జునా! భేష్ భీష్మా)
నాయం యుక్తో మనుష్యేషు యోఽయం సందృశ్యతే మహాన్।
మహాస్త్రాణాం సంప్రయోగః సమరే భీష్మపార్థయోః॥ 25
భీష్మపార్థుల యుద్ధంలో గొప్ప గొప్పదివ్యాస్త్రాల సంప్రయోగం కన్పడుతోంది. ఇట్టిది మనుష్యలోకంలో ఇంకెక్కడా చూడలేము. (25)
వైశంపాయన ఉవాచ
ఏవం సర్వాస్త్రవిదుషోః అస్త్రయుద్ధమవర్తత।
అస్త్రయుద్ధే తు నిర్వృత్తే శరయుద్ధమవర్తత॥ 26
వైశంపాయనుడిట్లు అన్నాడు! ఈవిధంగా అన్ని అస్త్రాల ప్రయోగంలో పండితులైన భీష్మార్జునులకు అస్త్రయుద్ధం జరిగింది. తరువాత బాణాలతో యుద్ధం ప్రారంభమైనది. (26)
అథ జిష్ణు రపావృత్య క్షురధారేణ కార్ముకమ్।
చకర్త భీష్మస్య తదా జాతరూపపరిష్కృతమ్॥ 27
తర్వాత విజయశీలుడగు అర్జునుడు, సమీపించి కత్తివలె పదునైన అంచుకల బాణం ప్రయోగించి, బంగారంతో నగిషీ చేయబడిన భీష్మునియొక్క ధనుస్సును త్రుంచివేశాడు. (27)
నిమేషాంతర మాత్రేణ భీష్మోఽన్యత్ కార్ముకం రణే।
సమాదాయ మహాబాహుః సజ్యం చక్రే మహారథః।
శరాంశ్చ సుబహూన్ క్రుద్ధః ముమోచాశు ధనంజయే॥ 28
క్షణాల్లోనే మహారథుడు మహాబాహువు ఐన భీష్ముడు మరొక ధనుస్సును తీసికొని అల్లెత్రాటితో బిగించాడు. కోపంతో శీఘ్రంగా ధనంజయుని మీద అనేకబాణాలను సంధించాడు. (28)
అర్జునోఽపి శరాం స్తీక్ష్ణాన్ భీష్మాయ నిశితాన్ బహూన్।
చిక్షేప సుమహాతేజాః తథా భీష్మశ్చ పాండవే॥ 29
మహాతేజుడయిన అర్జునుడు కూడ తీవ్రమైన వాడి బాణాల్ని అసంఖ్యాకంగా భీష్మునిపై ప్రయోగించాడు. అదే విధంగా భీష్ముడు కూడ అర్జునునిపై బాణాల్ని ప్రయోగించాడు. (29)
తయో ర్దివ్యాస్త్రవిదుషోః అస్యతో ర్నిశితాన్ శరాన్।
న విశేషస్తదా రాజన్ లక్ష్యతే స్మ మహాత్మనోః॥ 30
రాజా! దివ్యాస్త్రపండితులయిన భీష్మార్జునులు వాడి బాణాల్ని పరస్పరం ప్రయోగించుకొంటూంటే, ఆ మహాత్ములిద్దరిలో భేదం ఏమాత్రం కనపడటంలేదు. (30)
అథావృణోద్ దశదిశః శరై రతిరథస్తదా।
కిరీటమాలీ కౌంతేయః శూరః శాంతనవస్తథా॥ 31
కిరీటమాలి అర్జునుడు, శంతనుకుమారుడు భీష్ముడు ఇద్దరూ అతిరథులే, మహావీరులే వారిద్దరూ తమ బాణాలతో పది దిక్కులను మూసివేశారు. (31)
అతీవ పాండవో భీష్మం భీష్మశ్చాతీవ పాండవమ్।
బభూవ తస్మిన్ సంగ్రామే రాజన్ లోకే తదద్భుతమ్॥ 32
రాజా! జనమేజయా! ఆ యుద్ధంలో ఒకసారి అర్జునుడు భీష్ముని మించిపోతారు. మరోసారి భీష్ముడు అర్జునుని మించి పోతాడు. ఈయుద్ధం లోకంలో చాలా ఆశ్చర్యకరం. (32)
పాండవేన హతాః శూరాః భీష్మస్య రథరక్షిణః।
శేరతే స్మ తదా రాజన్ కౌంతేయస్యాభితో రథమ్॥ 33
రాజా! భీష్ముని రథాన్ని రక్షించే శూరులైన్ సైనికులు కుంతీనందనుడయిన అర్జునునిచే చంపబడి రథానికి అన్నివైపులా పడి ఉన్నారు. (33)
తతో గాండీవనిర్ముక్తాః నిరమిత్రం చికీర్షవః।
ఆగచ్ఛన్ పుంఖసంశ్లిష్టాః శ్వేతవాహనపత్రిణః॥ 34
తరువాత శ్వేతవాహనుడైన అర్జునుని గాండీవం నుండి వెల్వడిన వాడిబాణాలు శత్రువులను నిశ్శేషం చేయడానికి అన్ని వైపులా వ్యాపించాయి. (34)
నిష్పతంతో రథాత్తస్య ధౌతా హైరణ్యవాససః।
ఆకాశే సమదృశ్యంత హంసానామివ పంక్తయః॥ 35
అర్జునుని రథంనుండి బయలుదేరిన స్వర్ణ పరిష్కృతాలైన తెల్లని బాణాలు ఆకాశంలో హంసల బారుల్లా కనపడసాగాయి. (35)
తస్య తద్ దివ్యమస్త్రం హి విగాఢం చిత్రమస్యతః।
ప్రేక్షంతే స్మాంతరిక్షస్థాః సర్వే దేవాః సవాసవాః॥ 36
అర్జునుడు మర్మభేదకాలైన దివ్యాస్త్రాలను చిత్ర విచిత్రంగా ప్రయోగిస్తున్నాడు. ఆకాశంలో ఉన్న ఇంద్రాది సమస్త దేవతలు ఆశ్చర్యంతో చూస్తున్నారు. (36)
తం దృష్ట్వా పరమప్రీతః గంధర్వశ్చిత్రమద్భుతమ్।
శశంస దేవరాజాయ చిత్రసేనః ప్రతాపవాన్॥ 37
ఆ సమయంలో ప్రతాపవంతుడైన చిత్రసేనుడనే గంధర్వుడు అర్జునుని చూస్తూ పరమానందంతో అతని చిత్రాద్భుతమయిన రణకౌశలాన్ని ప్రశంసిస్తూ ఇంద్రునితో ఇలా అంటున్నాడు. (37)
పశ్యేమాన్ పార్థనిర్ముక్తాన్ సంసక్తానివ గచ్ఛతః।
చిత్రరూపమిదం జిష్ణోః దివ్యమస్త్రముదీర్యతః॥ 38
దేవరాజా! చూడండి. పార్థుడు విడిచిన బాణాలు ఒకదానితో మరొకటి కలిసి ఎలా ప్రయాణిస్తున్నాయో! దివ్యాస్త్రప్రయోగం చేస్తున్న విజయుని నేర్పు పరమాశ్చర్యకరంగా ఉంది. (38)
నేదం మనుష్యాః సందధ్యుః న హీదం తేషు విద్యతే।
పౌరాణానాం మహాస్త్రాణాం విచిత్రోఽయం సమాగమః॥ 39
మరొక మనుష్యుడెవ్వడూ ఇలాంటి దివ్యాస్త్ర ప్రయోగం చెయ్యలేడు. ఎందుచేతనంటే ఇలాంటి అస్త్రాలు ఏ మానవుడి వద్దా లేవు. ఇది అత్యంత ప్రాచీనా లైన గొప్పగొప్ప అస్త్రాలకు చిత్రమైన కలయిక! (39)
ఆదదానస్య హి శరాన్ సంధాయ చ విముంచతః।
వికర్షతశ్చ గాండీవం నాంతరం సమదృశ్యత॥ 40
అర్జునుడు ఎప్పుడు బాణాన్ని తీస్తున్నాడో, ఎప్పుడు బాణాన్ని సంధిస్తున్నాడో, ఎపుడు విడుస్తున్నాడో తెలియదు. అసలీ క్రియలకు మధ్య విరామం ఉన్నట్లు కనపడదు. (40)
మధ్యందినగతం సూర్యం ప్రతపంతమివాంబరే।
నాశక్నువంత సైన్యాని పాండవం ప్రతివీక్షితుమ్॥ 41
మిట్ట మధ్యాహ్నం ప్రచండకిరణాలతో తపింప చేసే సూర్యుడిని ఎవరూ చూడలేనట్లు కౌరవసైనికులు పాండుకుమారుని కన్నెత్తి చూడలేకపోతున్నారు. (41)
తథైవ భీష్మం గాంగేయం ద్రష్టుం నోత్సహతే జనః॥ 42
ఆ విధంగానే గంగాపుత్రుడయిన భీష్ముని కూడా చూడటానికి జనం సాహసించలేక పోతున్నారు. (42)
ఉభౌ విశ్రుతకర్మాణౌ ఉభౌ తీవ్రపరాక్రమౌ।
ఉభౌ సదృశకర్మాణౌ ఉభౌ యుధి సుదుర్జయౌ॥ 43
ఇద్దరూ లోకంలో సాహసకార్యాలకు ప్రసిద్ధులే. ఇద్దరూ గొప్ప పరాక్రమం కలవారే. ఇద్దరూ సమానంగా పోరాడే వారే. ఇద్దరూ యుద్ధంలో ఎవరిచేతనూ జయించబడేవారు కాదు! (43)
ఇత్యుక్తో దేవరాజస్తు పార్థభీష్మసమాగమమ్।
పూజయామాస దివ్యేన పుష్పవర్షేణ భారత॥ 44
జనమేజయా! చిత్రసేనుడిలా చెప్పగానే దేవేంద్రుడు దివ్యమైన పూలజల్లుతో అర్జునభీష్ముల సంగర సమాగమాన్ని అభినందించాడు. (44)
తతః శాంతనవో భీష్మః వామం పార్శ్వమతాడయత్।
పశ్యతః ప్రతిసంధాయ విధ్యతః సవ్యసాచినః॥ 45
తరువాత శంతనుపుత్రుడైన భీష్ముడు కౌరవ సైన్యాన్ని బాధిస్తున్న సవ్యసాచియొక్క ఎడమ పార్శ్వాన్ని బాణంతో బాధించాడు. (45)
తతః ప్రహస్య బీభత్సుః పృథుధారేణ కార్ముకమ్।
చిచ్ఛేద గార్ధ్రపత్రేణ భీష్మస్యాదిత్యతేజసః॥ 46
అప్పుడర్జునుడు నవ్వి, విశాలమైన అంచుకల గారుడ పత్రాలు కల బాణంతో సూర్యసమానతేజుడైన భీష్ముని ధనుస్సును విరగగొట్టాడు. (46)
అథైనం దశభి ర్బాణైః ప్రత్యవిధ్యత్ స్తనాంతరే।
యతమానం పరాక్రాంతం కుంతీపుత్రో ధనంజయః॥ 47
వెంటనే కుంతీసుతుడైన ధనంజయుడు విక్రమిస్తున్న భీష్ముని వక్షఃస్థలాన్ని పదిబాణాలతో వేధించి గాయపరిచాడు. (47)
స పీడితో మహాబాహుః గృహీత్వా రథకూబరమ్।
గాంగేయో యుద్ధదుర్ధర్షః తస్థౌ దీర్ఘమివాంతరమ్॥ 48
అర్జునుని బాణాలతో బాధింపబడి మహాభుజుడైన గాంగేయుడు రథకూబరాన్ని పట్టుకొని చాలాసేపు నిశ్చేష్టుడై ఉండిపోయాడు. (48)
తం విసంజ్ఞమపోవాహ సంయంతా రథవాజినామ్।
ఉపదేశ మనుస్మృత్య రక్షమాణో మహారథమ్॥ 49
భీష్ముడు మూర్ఛపోయాడు. 'ఇలాంటి సందర్భంలో సారథి రథిని రక్షించవలసియున్నది' అనే ఉపదేశాన్ని తలచుకొని, భీష్ముని రక్షించే ఉద్దేశ్యంతో రథాన్ని గుర్రాలను రక్షించే సారథి భీష్ముని యుద్ధ భూమినుండి దూరంగా కొనిపోయాడు. (49)
ఇతి శ్రీమహాభారతే విరాటపర్వణి గోహరణపర్వణి భీష్మాపయానే చతుఃషష్టితమోఽధ్యాయః॥ 64 ॥
ఇది శ్రీమహాభారతమున విరాటపర్వమున గోహరణపర్వమను ఉపపర్వమున
భీష్ముడు యుద్ధమునుండి తొలగుట అను అరువదినాలుగవ అధ్యాయము. (64)