63. అరువదిమూడవ అధ్యాయము
కౌరవులు యుద్ధమునందు వెన్నుచూపుట.
వైశంపాయన ఉవాచ
తతో దుర్యోధనః కర్ణః దుఃశాసనవివింశతీ।
ద్రోణశ్చ సహ పుత్రేణ కృపశ్చాపి మహారథః॥ 1
పునర్యయుశ్చ సంరబ్ధా ధనంజయజిఘాంసవః।
విస్ఫారయంత శ్చాపాని బలవంతి దృఢాని చ॥ 2
వైశంపాయను డిలా అన్నాడు. జనమేజయా! దుర్యోధనుడు, కర్ణుడు, దుశ్శాసనుడు, వివింశతి, ద్రోణుడు, అశ్వత్థామ, మహారథుడైన కృపాచార్యుడు, అందరూ కోపంతో అర్జునుని సంహరించాలన్న కోరికతో బలిష్ఠాలు, దృఢాలు అయిన తమ విండ్లను ఆకర్షిస్తూ మరల అర్జునునిపైకి వెళ్ళారు. (1,2)
తాన్ వికీర్ణపతాకేన రథేనాదిత్యవర్చసా।
ప్రత్యుద్యయౌ మహారాజ సమంతాద్ వానరధ్వజః॥ 3
మహారాజ! సూర్యతేజస్సుగల అర్జునుడు వానరధ్వజ పతాకం రెపరెపలాడుతుంటే అన్ని వైపుల నుండీ రథంతో ముందుకు దూసుకొనిపోయాడు. (3)
తతః కృపశ్చ కర్ణశ్చ ద్రోణశ్చ రథినాం వరః।
తం మహాస్త్రైర్మహావీర్యం పరివార్య ధనంజయమ్॥ 4
శరౌఘాన్ సమ్యగస్యంతః జీమూతా ఇవ వార్షికాః।
వవర్షుః శరవర్షాణి పాతయంతో ధనంజయమ్॥ 5
అంతట కృపుడు, కర్ణుడు, రథికశ్రేష్ఠుడైన ద్రోణుడూ పరాక్రమశాలి అయిన అర్జునుని చుట్టు ముట్టి, ఆయనను పడగొట్టాలన్న సంకల్పంతో వర్షాకాలపు మేఘాలవలె తమ మహాస్త్రాలతో అర్జునునిపై బాణవృష్టిని కురిపించారు. (4,5)
ఇషుభిర్బహుభిస్తూర్ణం సమరే లోమవాహిభిః।
అదూరాత్ పర్యవస్థాప్య పూరయామాసురాదృతాః॥ 6
వారు రణభూమిలో కొద్దిమీర అర్జునుని నిలువరించి ఈకలతో దూసుకొనిపోయే అనేకబాణాలతో అర్జునుని ముంచేశారు. (6)
తథా తైరవకీర్ణస్య దివ్యైరస్రైః సమంతతః।
న తస్య ద్వ్యంగులమపి వివృతం సంప్రదృశ్యతే॥ 7
దివ్యాస్త్రాలతో వారు ఆవిధంగా అర్జునుని చుట్టు ముట్టగా అర్జునుని శరీరంలో రెండు అంగుళాల మేర కూడా బాణాలు లేకుండా ఖాళీగా కనిపించలేదు. (7)
తతః ప్రహస్య బీభత్సుః దివ్యమైంద్రం మహారథః।
అస్త్రమాదిత్యసంకాశం గాండీవే సమయోజయత్॥ 8
అపుడు మహారథుడైన అర్జునుడు నవ్వి సూర్య తేజస్సుతోనున్న దివ్యమైన ఇంద్రాస్త్రాన్ని గాండీవంపై ఎక్కుపెట్టాడు. (8)
శరరశ్మిరివాదిత్యః ప్రతస్థే సమరే బలీ।
కిరీటమాలీ కౌంతేయః సర్వాన్ ప్రాచ్ఛాదయద్ కురూన్॥ 9
బలిష్ఠుడు, కిరీటి అయిన ఆ అర్జునుడు బాణాలే కిరణాలుగా ఉన్న సూర్యునివలె ఆ రణభూమిలో కౌరవులనందరినీ కప్పివేశాడు. (9)
యథా వలాహకే విద్యుత్ పావకో వా శిలోచ్చయే।
తథా గాండీవమభవత్ ఇంద్రాయుధమివానతమ్॥ 10
అర్జునుడెక్కుపెట్టిన ఆ గాండీవం మేఘంలో మెరుపులా, పర్వతంపై నిప్పులా ప్రకాశిస్తూ, వంగిన ఇంద్రధనుస్సులా కనిపించింది. (10)
యథావర్షతి పర్జన్యే విద్యుద్ విభ్రాజతే దివి।
ద్యోతయంతీ దిశః సర్వాః పృథివీం చ సమంతతః॥ 11
తథా దశ దిశః సర్వాః పతద్గాండీవమావృణోత్।
నాగాశ్చ రథినస్సర్వే ముముహుస్తత్ర భారత॥ 12
మేఘం వర్షిస్తున్నవేళ ఆకాశంలో మెరుపు మెరుస్తూ అన్నిదిక్కులనూ, భూమినీ ప్రకాశింపజేసినట్లు శరవర్షాన్ని కురిపిస్తూ గాండీవం పది దిక్కులను కప్పివేసింది. జనమేజయా! అప్పుడు గజబలం, రథబలం మొత్తమ్ మూర్ఛపోయింది. (11,12)
సర్వే శాంతిపరా యోధాః స్వచిత్తాని న ళేభిరే।
సంగ్రామే విముఖాః సర్వే యోధాస్తే హతచేతసః॥ 13
సైనికులందరూ శాంతించారు. ఎవ్వరికీ స్వస్థత దక్కలేదు. చైతన్యహీనులయిన వారందరూ యుద్ధ విముఖులయ్యారు. (13)
ఏవం సర్వాణి సైన్యాని భగ్నాని భరతర్షభ।
వ్యద్రవంత దిశః సర్వాః నిరాశాని స్వజీవితే॥ 14
జనమేజయా! ఇలా భంగపడిన ఆ సైనికులంతా జీవితంపై ఆశను వీడి అన్ని దిక్కులకూ పారిపోయారు. (14)
ఇతి శ్రీమహాభారతే విరాటపర్వణి గోహరణపర్వణి ఉత్తరగోగ్రహే అర్జునసంకులయుద్ధే త్రిషష్టితమోఽధ్యాయః॥ 63 ॥
ఇది శ్రీమహాభారతమున విరాటపర్వమున గోహరణ పర్వమను ఉపపర్వమున ఉత్తరగోగ్రహణమున అర్జున సంకులయుద్ధము అను అరువదిమూడవ అధ్యాయము. (63)