71. డెబ్బదిఒకటవ అధ్యాయము

విరాటుడు మిగిలిన పాండవులను తెలిసికొనుట.

విరాట ఉవాచ
యద్యేష రాజా కౌరవ్యః కుంతీపుత్రో యుధిష్ఠిరః।
కతమోఽస్యార్జునో భ్రాతా భీమశ్చ కతమో బలీ॥ 1
నకులః సహదేవో వా ద్రౌపదీ వా యశస్వినీ।
యదా ద్యూతజితాః పార్థాః నప్రాజ్ఞాయంత తే క్వచిత్॥ 2
విరాటుడు అడిగాడు-ఇతడు కురుకులరత్నం, కుంతీనందనుడు, మహారాజు యుధిష్ఠిరుడు అయితే వీరిలో ఇతని సోదరుడు అర్జునుడు ఎవరు? మహాబలి భీముడెవరు? నకులసహదేవులు, యశస్విని ద్రౌపది ఏరీ? కుంతీపుత్రుడు జూదంలో ఓడిపోయినప్పటినుండి అతని జాడయే తెలియలేదు. (1,2)
అర్జున ఉవాచ
య ఏష వల్లనో బ్రూతే సూదస్తవ నరాధిప।
ఏష భీమో మహారాజ భీమవేగపరాక్రమః॥ 3
అర్జునుడు చెప్పాడు - 'మహారాజా! వల్లవుడు అనే పేరుతో మీవంటశాలలో ఉన్నవాడే భయంకర వేగమూ, పరాక్రమమూ కల భీమసేనుడు. (3)
ఏష క్రోధవశాన్ హత్వా పర్వతే గంధమాదనే।
సౌగంధికాని దివ్యాని కృష్ణార్థే సముపాహరత్॥ 4
గంధర్వ ఏష వై హంతా కీచకానాం దురాత్మనామ్।
వ్యాఘ్రానృక్షాన్ వరాహాంశ్చ హతవాన్ స్త్రీపురే తవ॥ 5
ఇతడే గంధమాదనపర్వతం మీద క్రోధవశ నామకులైన రాక్షసులను చంపి ద్రౌపదికోసం దివ్య సౌగంధికకమలాలను తెచ్చినవాడు. దురాత్ముడయిన కీచకుని చంపిన గంధర్వుడుకూడా ఇతడే. ఇతడే నీఅంతఃపురంలో ఎన్నో పులులను, ఎలుగులను, వరాహాలను చంపినవాడ్య్. (4,5)
(హత్వా నిష్కంటకం చక్రే అరణ్యం సర్వతః సుఖమ్।
హిడింబం చ బకం చైవ కిర్మీరం చ జటాసురమ్।)
ఇతడే హిడింబునీ, బకాసురునీ, కిర్మీరునీ, జటాసురునీ సంహరించి అడవిని అన్నివిధాలా నిష్కంటకం, సుఖమయం చేసినవాడు.
యశ్చాసీదశ్వబంధస్తే నకులోఽయం పరంతపః।
గోసంఖ్యః సహదేవశ్చ మాద్రీపుత్రౌ మహారథౌ॥ 6
శృంగారవేషాభరణౌ రూవవంతౌ యశస్వినౌ।
మహారథసహస్రాణాం సమర్థౌ భరతర్షభౌ॥ 7
ఇదిగో. ఇతడు శత్రువులను సంతాపింపచేయ గల నకులుడు. ఇంతవరకు నీఅశ్వశాలానిర్వాహకునిగా ఉన్నాడు. గోవులను సంరక్షించుచున్నవాడే సహదేవుడు. మాద్రీపుత్రులైన వీరు మహారథికులు వీరులు. చక్కని శృంగారవేషభూషణాలతో శోభిల్లే అన్నదమ్ములు ఇద్దరూ రూపవంతులు. కీర్తివంతులు. భరతవంశ శ్రేష్ఠులైన ఈ నకులసహదేవులు యుద్ధంలో వేలకొద్ధీ మహా రథికులను ఎదిరించగల సమర్థులు. (6,7)
ఏషా పద్మపలాశాక్షీ సుమధ్యా చారుహాసినీ।
సైరంధ్రీ ద్రౌపదీ రాజన్ యస్యార్థః కీచకా హతాః॥ 8
రాజా! వికసించిన కమలదళాలవంటి విశాల నేత్రాలు, చక్కని నడుమూ, మనొహరమైన చిరునవ్వు కల సైరంధ్రియే మహారాణి ద్రౌపది. ఈమె పతివ్రతాధర్మం రక్షించడం కొరకే కీచకులు వధింపబడ్డారు. (8)
అర్జునోఽహం మహారాజ వ్యక్తం తే శ్రోత్రమాగతః।
భీమాదవరజః పార్థః యమాభ్యాం చాపి పూర్వజః॥ 9
మహారాజా! నేనే అర్జునుడిని. నా పేరు వినే ఉంటారు. నేను కుంతీ పుత్రుడను. భీమసేనునికంటె చిన్నవాడిని. నకులసహదేవుల కంటె పెద్దవాడిని. (9)
వి॥ తెలుగులో తిక్కన ఇక్కడ ఈ విషయాన్ని భీముడు చెప్పినట్లుగా వ్రాశాడు. అందరి గురించీ అర్జునుడు పరిచయం చేస్తే అర్జునుని భీముడు పరిచయం చేస్తాడు.
ఉషితాః స్మో మహారాజ సుఖం తవ నివేశనే।
అజ్ఞాతవాసముషితాః గర్భవాస ఇవ ప్రజాః॥ 10
రాజా! సంతానం గర్భవాసంలో సురక్షితంగా ఉన్నట్లుగా మేమంతా మీ భవనంల్ఫ్ అజ్ఞాతవాస సమయాన్ని సుఖంగా గడిపాము. (10)
వైశంపాయన ఉవాచ
యదార్జునేన తే వీరాః కథితాః పంచ పాండవాః।
తదార్జునస్య వైరాటః కథయామాస విక్రమమ్॥ 11
వైశంపాయనుడు చెప్పాడు. రాజా! అర్జునుడు ఐదుగురు పాండవులను పరిచయం చేశాక ఉత్తరుడు అర్జునుని పరాక్రమంగూర్చి చెప్పడం మొదలు పెట్టాడు. (11)
పునరేవ చ తాన్ పార్థాన్ దర్శయామాస చోత్తరః॥ 12
తిరిగి అతడు పంచపాండవులను ఒక్కొక్కరిగా రాజుకు పరిచయం చేశాడు. (12)
ఉత్తర ఉవాచ
య ఏష జాంబూనదశుద్ధగౌర
తమర్మహాన్ సింహ ఇవ ప్రవృద్ధః।
ప్రచండఘోణః పృథుదీర్ఘనేత్రః
తామ్రాయతాక్షః కురురాజ ఏషః॥ 13
ఉత్తరుడు చెప్పాడు-తండ్రీ! విశుద్ధమైన బంగారంతో సమానమైన తెల్లని శరీరం కలవాడు, అందరికంటె ఉన్నతుడు, సింహంవలె హృష్టి వుష్టి కలవాడు, పొడవైన నాసిక,కొద్దిగా ఎఱ్ఱనై చెవులదాకా వ్యాపించిన పెద్దపెద్ద కన్నులు కల ఇతడే కురుకుల నరేశుడైన యుధిష్ఠిర మహారాజు. (13)
అయం పునర్మత్తగజేంద్రగామీ
ప్రతప్తచామీకరశుద్ధగౌరః।
పృథ్వాయతాంసో గురుదీర్ఘబాహుః
వృకోదరః పశ్యత పశ్యతైనమ్॥ 14
మదపుటేనుడు నడక, పుటం పెట్టబడిన బంగారంతో సమానమైన గౌరవర్ణపు శరీరం, వెడల్పయి బలిసిన భుజాలు, పెద్దవయి దీర్ఘమయిన బాహువులు కల ఇతడే భీమసేనుడు. చక్కగా తేరిపార చూడు ఇతనిని. (14)
యస్త్వేవ పార్శ్వేఽస్య మహాధనుష్మాన్
శ్యామో యువా వారణయూథపోపమః।
సింహోన్నతాంసో గజరాజగామీ
పద్మాయతాక్షోఽర్జున ఏష వీరః॥ 15
ఇతని ప్రక్కన కూర్చున్న మహాధనుర్ధరుడు, నల్లని వర్ణం కల తరుణవయస్కుడు వీరుడు, యూథపతి అయిన గజరాజులా శోభిల్లేవాడు, సింహంలా ఎత్తయినబుజాలు, మదపుటేనుగు నడక, కమలదళాలతో సమానమైన విశాలనేత్రాలు కల ఈ వీరవరుడే అర్జునుడు. (15)
రాజ్ఞః సమీపే పురుషోత్తమౌ తు
యమావిమౌ విష్ణుమహేంద్రకల్పౌ।
మనుష్యలోకే సకలే సమోఽస్తి
యయోర్న రూపే న బలే న శీలే॥ 16
మహారాజు యుధిష్ఠిరునికి సమీపంలో కూర్చున్న ఇంద్రోపేంద్రులతో సమానమైన ఈ నరశ్రేష్ఠులు ఇద్దరు మాద్రి కవలకొడుకులయిన నకులసహదేవులు. వీరితో సమానమైన రూపబలశీలాలు కలవారు ఈసమస్త ప్రపంచంలో వేరొకరు లేరు. (16)
ఆభ్యాం తు పార్శ్వే కనకోత్తమాంగీ
యైషా ప్రభా మూర్తిమతీవ గౌరీ।
నీలోత్పలాభా సురదేవతేన
కృష్ణా స్థితా మూర్తిమతీవ లక్ష్మీః॥ 17
ఈ ఇరువురిప్రక్కన తేజస్సుతో సాక్షాత్తూ గౌరీదేవివలె నిలబడి నల్లకలువల కాంతిని కూడా లజ్జింప చేసే కనులతో సువర్ణశరీరకాంతితో దేవతలకందరకు దేవి అయిన లక్ష్మీదేవితో సమానంగా శోభిల్లే ఈమెయే ద్రుపదుని కూతురు మహారాణి కృష్ణ. (17)
వైశంపాయన ఉవాచ
ఏవం నివేద్య తాన్ పార్థాన్ పాండవాన్ పంచ భూపతేః।
తతోఽర్జునస్య వైరాటః కథయామాస విక్రమమ్॥ 18
వైశంపాయనుడన్నాడు - రాజా! ఇలా ఆ ఐదుగురు పాండవులను మహారాజుకు పరిచయం చేసి విరాటకుమారుడు అర్జునుని పరాక్రమాన్ని వర్ణించడం ప్రారంభించాడు. (18)
ఉత్తర ఉవాచ
అయం స ద్విషతాం హంతా మృగాణామివ కేసరీ।
అచరద్ రథబృందేషు నిఘ్నంస్తాంస్తాన్ వరాన్ రథాన్॥ 19
ఉత్తరుడు చెప్పాడు.' తండ్రీ! సింహం మృగాలను వలె శత్రువులను వధించిన ఇతడే ఆ దేవపుత్రుడు. ఇతడే కౌరవుల రథసైన్యంలో సర్వ శ్రేష్ఠులయిన మహారథికులను గాయపరిచి నిర్భయంగా విహరించినవాడు. (19)
అనేన విద్ధో మాతంగః మహానేకేషుణా హతః।
సువర్ణకక్షః సంగ్రామే దంతాభ్యామగమన్మహీమ్॥ 20
యుద్ధంలో ఇతని ఒక్కబాణంతోనే గాయపడి వికర్ణునియొక్క పెద్దఏనుగు బంగారుకటిసూత్రంతో నేలకూలి రెండుదంతాలు విరిగి చనిపోయింది. (20)
అనేన విజితా గావః జితాశ్చ కురవో యుధి।
అస్య శంఖప్రణాదేవ కర్ణౌ మే బధిరీకృతౌ॥ 21
ఇతడే గోవులను జయించాడు. యుద్ధంలో కౌరవులను ఓడించాడు. ఇతని శంఖంయొక్క గంభీరనాదంచేత నాచెవులు వినపడకుండా పోయాయి. (21)
వైశంపాయన ఉవాచ
తస్య తద్వచనం శ్రుత్వా మత్స్యరాజః ప్రతాపవాన్।
ఉత్తరం ప్రత్యువాచేదమ్ అభిపన్నో యుధిష్ఠిరే॥ 22
ప్రసాదనం పాండవస్య ప్రాప్తకాలం హి రోచతే।
ఉత్తరాం చ ప్రయచ్ఛామి పార్థాయ యది మన్యసే॥ 23
వైశంపాయనుడు చెప్పాడు. 'రాజా! ఉత్తరుని ఈ మాటలను విని యుధిష్ఠిరుని పట్ల అపరాధభావం కల ప్రతాపశాలియైన మత్స్యనరేశుడు తనకొడుకితో ఇలా అన్నాడు.' పుత్రా! ఈ పాండవులను ఆనందింప చేయవలసిన సమయమిది. నాకు ఇలా చేయడం ఇష్టం. నీకు కూడా ఇష్టమయితే మనౌత్తరను కుంతీపుత్రుడయిన అర్జునునికి ఇచ్చి వివాహం చేద్దాం.' (22,23)
ఉత్తర ఉవాచ
ఆర్యాః పూజ్యాశ్చ మాన్యాశ్చ ప్రాప్తకాలం చ మే మతమ్।
పూజ్యంతాం పూజనార్హాశ్చ మహాభాగాశ్చ పాండవాః॥ 24
ఉత్తరుడంటున్నాడు. 'తండ్రీ! పాండవులు పూజ్యులు, సౌభాగ్యయోగ్యులు. నాఉద్దేశ్యంతో వీరిని సత్కరించడానికి మనకు అవకాశం లభించింది. కాబట్టి ఈ పూజనీయులైన పాండవులను తాము తప్పక పూజించాలి.' అన్నాడు. (24)
విరాట ఉవాచ
అహం ఖల్వసి సంగ్రామే శత్రూణాం వశమాగతః।
మోక్షితో భీమసేనేన గావశ్చాపి జితాస్తథా॥ 25
అపుడు విరాటుడు ఇలా అన్నాడు. 'నేను కూడా త్రిగర్తులతో యుద్ధంలో శత్రువులకు వశమయ్యాను. అపుడు భీముడే నన్ను విడిపించాడు. గోవులనూ అలాగే జయించాడు. (25)
ఏతేషాం బాహువీర్యేణ అస్మాకం విజయో మృధే।
ఏవం సర్వే సహామాత్యాః కుంతీపుత్రం యుధిష్ఠిరమ్।
ప్రసాదయామో భద్రం తే సామజం పాండవర్షభమ్।
ఈ పాండవుల బాహుబలంచేతనే యుద్ధంలో మనకు విజయం కలిగింది. కాబట్టి వత్సా! నీకు భద్రమగుగాక! మనమందరం మంత్రులతో కూడి వెళ్లి పాండవశ్రేష్ఠుడయిన యుధిష్టిరుని అతని తమ్ములతో సహా సంతోషపరచాలి. (26)
యదస్మాభిరజానద్భిః కించిదుక్తో నరాధిపః।
క్షంతుమర్హతి తత్సర్వం ధర్మాత్మా హ్యేష పాండవః॥ 27
అజ్ఞానంతో తెలియక వీరిపట్ల అనుచితంగా మనం పలికిన మాటలన్నీ ధర్మాత్ముడు. పాండుపుత్రుడు, అయిన యుధిష్ఠిరమహారాజు మన్నించునుగాక!' (27)
వైశంపాయన ఉవచ
తతో విరాటః పరమాభితుష్టః
సమేత్య రాజా సమయం చకార।
రాజ్యం చ సర్వం విససర్జ తస్మై
సదండకోశం సపురం మహాత్మా॥ 28
పాండవాంశ్చ తతః సర్వాన్ మత్స్యరాజః ప్రతాపవాన్।
ధనంజయం పురస్కృత్య దిష్ట్వా దిష్ట్యేతి చాబ్రవీత్॥ 29
వైశంపాయనుడు చెప్పాడు. 'రాజా! తరువాత విరాటమహారాజు మిక్కిలి ఆనందంతో తనపుత్రునితో కలిసి కొద్దిసేపు ఆలోచించి దండ కోశ నగరాదులతో సహితంగా తన సంపూర్ణరాజ్యాన్ని యుధిష్ఠిరునికి సమర్పించాడు. అంతేకాదు. ప్రతాపవంతుడైన ఆ మత్స్యరాజు అర్జునుని ముందుంచుకొని పాండవులందరిని కలిసి "మీదర్శనం అయింది. మాభాగ్యం. మాఅదృష్టం" అని అన్నాడు. (28,29)
వి॥సం॥ పాండవులనందరిని సత్కరించి అనిచెప్పి మరల ప్రత్యేకించి అర్జునుని గూర్చి చెప్పటం అర్జునునిపై విరటునకు గల ఆదరాధిక్యాన్ని ప్రకటించటం. (విరో)
సముపాఘ్రాయ మూర్ధానం సంశ్లిష్య చ పునః పునః।
యుధిష్ఠిరం చ భీమం చ మాద్రీపుత్రౌ చ పాండవౌ॥ 30
అతడు యుధిష్ఠిరుని, భీముని, అర్జునుని, నకులసహదేవులను శిరసుమూర్కొని హృదయానికి అత్తుకున్నాడు. (30)
నాతృప్యద్ దర్శనే తేషాం విరాటో వాహినీపతిః।
స ప్రీయమాణో రాజానం యుధిష్ఠిరమథాబ్రవీత్॥ 31
వాహినీపతి అయిన విరాటునికి పాండవులను ఎంతసేపు చూసినా (తృప్తి కలుగలేదు) తనివి తీరలేదు. ఆయన ప్రేమపూర్వకంగా యుధిష్ఠిరమహారాజుతో ఇలా అన్నాడు. (31)
దిష్ట్వా భవంతః సంప్రాప్తాః సర్వే కుశలినో వనాత్।
దిష్ట్వా సంపాలితం కృచ్ఛ్రమ్ అజ్ఞాతం వై దురాత్మభిః॥ 32
మీరంతా వనవాసంనుండి క్షేమంగా తిరిగిరావడం అదృష్టమే. దుర్మార్గులైన కౌరవులను తెలియకుండా మీరు ఈకష్టసాధ్యమైన అజ్ఞాతవాసనియమాన్ని పూర్తి చేయడం కూడా చాలా ఆనందింపదగినవిషయం. (32)
ఇదం చ రాజ్యం పార్థాయ యచ్చాన్యదపి కించన।
ప్రతిగృహ్ణంతు తత్ సర్వం పాండవా అవిశంకయా॥ 33
నా ఈ రాజ్యం కుంతీపుత్రునకు సమర్పించాడు. ఇంకా ఏదైనా నాదన్నది ఉంటే దానిని ఈపాండవు లందరూ నిస్సంకోచంగా తీసుకోవచ్చును. (33)
ఉత్తరాం ప్రతిగృహ్ణం తు సవ్యసాచో ధనంజయః।
అయం హ్యౌపయికో భర్తా తస్యాః పురుషసత్తమః॥ 34
సవ్యసాచి ధనంజయుడు నాకూతురు ఉత్తరను భార్యగా స్వీకరించునుగాక! ఈనరశ్రేష్ఠుడు ఆమెకు అన్నివిధాలా యోగ్యుడైన భర్త. (34)
ఏవముక్తో ధర్మరాజః పార్థమైక్షద్ ధనంజయమ్।
ఈక్షితశ్చార్జునో భ్రాత్రా మత్స్యం వచనమబ్రవీత్॥ 35
ప్రతిహ్ణామ్యహం రాజన్ స్నుషాం దుహితరం తవ।
యుక్తశ్చావాం హి సంబంధః మత్స్యభారతయోరపి॥ 36
విరాటరాజు ఇలా అన్నవెంటనే ధర్మరాజు అర్జునునివైపు చూశాడు. అన్నచూపును గ్రహించిన అర్జునుడు మత్స్యరాజుతో ఇలా అన్నాడు - 'రాజా! నేను మీకుమార్తెను కోడలిగా గ్రహిస్తున్నాను. మత్స్య భరతవంశాల మధ్య ఏర్పడే ఈసంబంధం అన్నివిధాలా తగినది.' (35,36)
ఇతి శ్రీమహాభారతే విరాటపర్వణి వైవాహికపర్వణి ఉత్తరావివాహప్రస్తావే ఏకసప్తతితమోఽధ్యాయః॥ 71 ॥
ఇది శ్రీమహాభారతమున విరాటపర్వమున వైవాహికపర్వమను ఉపపర్వమున ఉత్తర వివాహప్రస్తావము అను డెబ్బదిఒకటవ అధ్యాయము. (71)
(దాక్షిణాత్య అధికపాఠము 1 ఒక శ్లోకం కలుపుకొని మొత్తం 37 శ్లోకాలు)