53. ఏబదిమూడవ అధ్యాయము
అర్జునుడు కౌరవసైన్యమును ఆక్రమించి గోవులను మరల్చుట.
వైశంపాయన ఉవాచ
తథా వ్యూఢేష్వనీకేషు కౌరవేయేషు భారత।
ఉపాయాదర్జునస్తూర్ణం రథఘోషేణ నాదయన్॥ 1
దదృశుస్తే ధ్వజాగ్రం వై శుశ్రువుశ్చ మహాస్వనమ్।
దోధూయమానస్య భృశం గాండీవస్య చ నిస్వనమ్॥ 2
వైశంపాయనుడిలా అన్నాడు. జనమేజయా! కౌరవ సేనల వ్యూహరచన ఆ రీతిగా జరిగిన తరువాత రథఘోషతో దిక్కులను మారుమ్రోగిస్తూ అర్జునుడు సమీపించాడు. సేనలు అర్జునుని పతాకాన్ని చూశాయి. రథఘోషను విన్నాయి. మిక్కిలిగా ధ్వనిస్తున్న గాండీవ ధనుష్టంకారాన్ని కూడా విన్నాయి. (1,2)
తతస్తు సర్వమాలోక్య ద్రోణో వచనమబ్రవీత్।
మహారథమనుప్రాప్తం దృష్ట్వా గాండీవధన్వినమ్॥ 3
ఆపై ద్రోణుడు అంతా గమనించి, గాండీవ ధనుర్ధారియై సమీపించిన మహారథుడైన అర్జునుని చూసి ఇలా అన్నాడు. (3)
ద్రోణ ఉవాచ
ఏతద్ ధ్వజాగ్రం పార్థస్య దూరతః సంప్రకాశతే।
ఏష ఘోషః సరథజః రోరవీతి చ వానరః॥ 4
ద్రోణుడు ఇలా అన్నాడు. 'ఇదిగో! అర్జునుని పతాకపు అంచు దూరంనుండియే ప్రకాశిస్తోంది. ఇప్పుడు వినిపిస్తున్నదిఅర్జునుని రథఘోషయే. ధ్వజంపై నున్న ఆంజనేయుడు కూడా గర్జిస్తున్నాడు. (4)
ఏష తిష్ఠన్ రథశ్రేష్ఠే రథే చ రథినాం వరః।
ఉత్కర్షతి ధనుఃశ్రేష్ఠం గాండీవమశనిస్వనమ్॥ 5
ఇదిగో! రథిశ్రేష్ఠుడైన అర్జునుడు ఉత్తమరథంపై నిలిచి ఉత్తమధనుస్సు అయిన గాండీవాన్ని లాగుతున్నాడు. ఆ ధ్వని పిడుగుపాటు శబ్దంలా వినిపిస్తోంది. (5)
ఇమౌ చ బాణా సహితౌ పాదయోర్మే వ్యవస్థితౌ।
అపరౌ చాప్యతిక్రాంతౌ కర్ణౌ సంస్పృశ్య మే శరౌ॥ 6
ఇవిగో! ఈ రెండుబాణాలూ కలిసి నాపాదాలపై పడ్డాయి. మరో రెండు బాణాలు నాచెవుల ప్రక్కగా దూసికొనిపోయాయి. (6)
నిరుధ్య హి వనే వాసం కృత్వా కర్మాతిమానుషమ్।
అభివాదయతే పార్థః శ్రోత్రే చ పరిపృచ్ఛతి॥ 7
అర్జునుడు వనవాసం పూర్తి చేసి, అక్కడ్ అమానుష పరాక్రమాన్ని ప్రదర్శించే నేడు బయటపడ్డాడు. నాపాదాలకు నమస్కరించి, నను కుశలప్రశ్న వేస్తున్నాడు. (7)
చిరదృష్టోఽయమస్మాభిః ప్రజ్ఞాసాన్ బాంధవప్రియః।
అతీవ జ్వలితో లక్ష్మ్యా పాండుపుత్రో ధనంజయః॥ 8
బంధుజనప్రియుడు, ప్రజ్ఞావంతుడు అయిన అర్జునుడు చాలాకాలానికి కనిపించాడు. ఇప్పుడు తన దివ్యకాంతితో ఎంతో వెలిగిపోతున్నాడు. (8)
రథీ శరో చారుతలీ నిషంగీ
శంఖీ పతాకీ కవచీ కిరీటీ।
ఖడ్గీ చ ధన్వీ చ విభాతి పార్థః
శిఖీ వృతః స్రుగ్భిరివాజ్యసిక్తః॥ 9
అర్జునుడు రథంపై బాణాలు, అందమైన చేతి తొడుగులు, అమ్ములపొదులు, శంఖం, పతాక, కవచం, కిరీటం, కత్తి, ధనుస్సులు ధరించి చక్కగా ప్రకాశిస్తున్నాడు. కిరీటి ఇపుడు యజ్ఞసామగ్రితో చుట్టబడి, నేతితో ప్రజ్వలించే అగ్నివలె వెలిగిపోతున్నాడు.' (9)
(వైశంపాయన ఉవాచ
తమదూరముపాయాంతం దృష్ట్వా పాండవమర్జునమ్।
నారయః ప్రేక్షితుం శేకుః తపంతం హి యథా రవిమ్॥
స తం దృష్ట్వా రథానీకం పార్థః సారథిమబ్రవీత్।)
(వైశంపాయనుడిలా అన్నాడు. జనమేజయా! జ్వలిస్తున్న సూర్యుడిలా పాండుకుమారుడు అర్జునుడు సమీపించటాన్ని గమనించిన శత్రువులు అతనివైపు తేరిపారచూడలేక పోయారు. ఎదురుగానున్న శత్రుసేనల రథాలను పరిశీలించి అర్జునుడు సారథి ఉత్తరునితో ఇలా అన్నాడు.)
అర్జున ఉవాచ
ఇషుపాతే చ సేనాయాః హయాన్ సంయచ్ఛ సారథే।
యావత్ సమీక్షే సైన్యేఽస్మిన్ క్వాసౌ కురుకులాధమః॥ 10
సర్వానేతాననాదృత్య దృష్ట్వా తమతిమానినమ్।
తస్య మూర్ధ్ని పతిష్యామి తత ఏతే పరాజితాః॥ 11
అర్జునుడిలా అన్నాడు. 'సారథీ! కౌరవసేనకు అమ్ముపాటు దూరంలో గుఱ్ఱాలను నియంత్రించి రథాన్ని నిలుపు. దానితో కురుకులాధముడైన ఆ దుర్యోధను డెక్కడున్నాడో నేను గమనిస్తాను. ఆ దురభిమాని కనిపించగానే మిగిలిన ఈ యోధుల నందరినీ విడిచి అతని తలపై పడతాను. సుయోధనుడు ఓడిపోతే వీరంతా ఓడిపోయినట్లే. (10,11)
ఏష వ్యవస్థితో ద్రోణః ద్రౌణిశ్చ తదనంతరమ్।
భీష్మః కృపశ్చ కర్ణశ్చ మహేష్వాసాః సమాగతాః॥ 12
అడుగో! ముందున్న వాడు ద్రోణాచార్యుడు. వారి తర్వాత అశ్వత్థామ. అటువైపు పితామహుడైన భీష్ముడు, కృపాచార్యుడు. కర్ణుడు కనిపిస్తున్నారు. సమర్థులైన విలుకాండ్రు సన్నద్ధులై వచ్చారు. (12)
రాజానం నాత్ర పశ్యామి గాః సమాదాయ గచ్ఛతి।
దక్షిణం మార్గయాస్థాయ శంకే జీవపరాయణః॥ 13
ఇక్కడ దుర్యోధనుడు కనపడటంలేదు. గోవులను తీసికొని దక్షిణదిక్కుగా ప్రయాణిస్తూ ఉండవచ్చు. ప్రాణాలపై ప్రీతితో పారిపోతున్నాడనిపిస్తోంది. నాకు. (13)
ఉత్సృజ్యైతద్ రథానీకం గచ్ఛ యత్ర సుయోధనః।
తత్రైవ యోత్స్యే వైరాటే నాస్తి యుద్ధం నిరామిషమ్।
తం జిత్వా వినివర్తిష్యే గాః సమాదాయ వై పునః॥ 14
ఉత్తరా! అందువలన ఈ రథాలనన్నింటినీ వదిలి సుయోధను డెక్కడున్నాడో అక్కడికే రథాన్ని నడుపు. అక్కడే యుద్ధం చేద్దాం. మిగిలినవారితో యుద్ధం చేయటం నిష్ప్రయోజనం. సుయోధనుని ఓడించి గోవులను తీసికొని మరలివద్దాం.' (14)
వైశంపాయన ఉవాచ
ఏవముక్తః స వైరాటిః హయాన్ సంయమ్య యత్నతః।
నియమ్య చ తతో రశ్మీన్ యత్ర తే కురుపుంగవాః।
అచోదయత్ తతో వాహాన్ యత్ర దుర్యోధనో గతః॥ 15
వైశంపాయనుడిలా అన్నాడు. అర్జునుడు ఆ రీతిగా ఆదేశించగానే ఉత్తరుడు ప్రయత్నపూర్వకంగా నిలిపి, పగ్గాలు బిగించి, కురుపుంగవులున్న దిక్కునుండి రథాన్ని మరలించి, దుర్యోధనుడు పోయిన దారివైపు గుఱ్ఱాలను నడిపించాడు. (!5)
ఉత్సృజ్య రథవంశం తు ప్రయాతే శ్వేతవాహనే।
అభిప్రాయం విదిత్వా చ కృపో వచనమబ్రవీత్॥ 16
ఎదురుగానున్న రథసేనను వదిలి, అర్జునుడు మరోదారి పట్టడం చూసి, అర్జునుని అభిప్రాయాన్ని గుర్తించిన కృపాచార్యుడు ఇలా అన్నాడు. (16)
నైషోఽంతరేణ రాజానం బీభత్సుః స్థాతుమిచ్ఛతి।
తస్య పార్ష్ణిం గ్రహీష్యామః జవేనాభిప్రయాస్యతః॥ 17
అర్జునుడు దుర్యోధనుని వీడి మరెక్కడా నిలవాలను కోవటం లేదు. కాబట్టి మనం కూడా వేగంగా అర్జునుని వెంబడించాలి. (17)
న హ్యేనమతిసంక్రుద్ధమ్ ఏకో యుధ్యేత సంయుగే।
అన్యో దేవాత్ సహస్రాక్షాత్ కృష్ణాద్ వా దేవకీసుతాత్।
ఆచార్యాచ్చ సపుత్రాద్వా భారద్వాజాన్మహారథాత్॥ 18
అర్జునుడీసమయంలో తీవ్రకోపంతో ఉన్నాడు. ఇప్పుడితనిని ఒంటరిగా ఎదిరించడం సహస్రాక్షుడైన ఇంద్రునకో, దేవకీనందనుడైన కృష్ణునకో, భరద్వాజగోత్రుడై మహారథుడైన ద్రోణునకో తప్ప మరొకరికి సాధ్యం కాదు. ఆచార్యునకైనా అశ్వత్థామ తోడు కూడినప్పుడే. (18)
కిం నో గావః కరిష్యంతి ధనం వా విపులం తథా।
దుర్యోధనః పార్థజలే పురా నౌరివ మజ్జతి॥ 19
ఈ గోవులూ, విస్తారమైన ఈ ధనమూ మనకు ఏం సాధించి పెట్టగలవు. అర్జునుడనే నీటిలో దుర్యోధనుడు పాత ఓడలా మునిగిపోబోతున్నాడు. (19)
తథైవ గత్వా బీభత్సుః నామ విశ్రావ్య చాత్మనః।
శలభైరివ తాం సేనాం శరైః శీఘ్రమవాకిరత్॥ 20
అలా అర్జునుడు దుర్యోధనుని సమీపించి, తన పేరు వినిపించి, వెంటనే ఆ సేనపై మిడతలదండలా బాణవర్షాన్ని కురిపించాడు. (20)
కీర్యమాణాః శరౌఘైస్తు యోధాస్తే పార్థచోదితైః।
నాపశ్యన్నావృతాం భూమిం నాంతరిక్షం చ పత్రిభిః॥ 21
అర్జునుడు కురిపించిన ఆ బాణసమూహాలలో కౌరవసేనలు మునిగిపోయాయి. బాణాలతో కప్పబడని భూప్రదేశం కానీ, గగనతలంకానీ వారికి కనిపించలేదు. (21)
తేషామాపతతాం యుద్ధే నాపయానేఽభవన్మతిః।
శీఘ్రత్వమేవ పార్థస్య పూజయంతి స్మ చేతసా॥ 22
కౌరవసేనలు రణరంగంలో కూలిపోతున్నాయి. అయినా వారికి పారిపోవాలన్న ఆలోచన కూడా కలగటం లేదు. కేవలం అర్జునుని చేతివేగాన్ని మాత్రమే మనసా అభినందిస్తున్నారు. (22)
తతః శంఖం ప్రదధ్మౌ సః ద్విషతాం లోమహర్షణమ్।
విస్ఫార్య చ ధనుః శ్రేష్ఠం ధ్వజే భూతాన్యచోదయత్॥ 23
ఆ తర్వాత అర్జునుడు శత్రువుల రోమాలు నిక్కబొడుచుకొనేటట్లు తన శంఖాన్ని పూరించాడు. ధనుష్టంకారం చేసి ధ్వజాన్ని అధివసించియున్న భూతాలను ప్రేరేపించాడు. (23)
తస్య శంఖస్య శబ్దేన రథనేమిస్వనేన చ।
గాండీవస్య చ ఘోషేణ పృథివీ సమకంపత॥ 24
అమానుషాణాం భూతానాం తేషాం చ ధ్వజవాసినామ్।
ఊర్ధ్వం పుచ్ఛాన్ విధున్వానా రేభమాణాః సమంతతః।
గావః ప్రతిన్యవర్తంత దిశమాస్థాయ దక్షిణామ్॥ 25
అర్జునుని శంఖనాదంతో, రథగోషంతో, గాండీవ టంకారంతో, ధ్వజంపై నున్న భూతాల కోలాహలంతో భూమి కంపించింది. గోవులు తోకలను పైకెత్తికొని అంబారవాలు చేస్తూ దక్షిణదిక్కుగా మరలసాగాయి. (24,25)
ఇతి శ్రీమహాభారతే విరాటపర్వణి గోహరణపర్వణి ఉత్తరగోగ్రహే గోనివర్తనే త్రిపంచాశత్తమోఽధ్యాయః॥ 53 ॥
ఇది శ్రీమహాభారతమున విరాటపర్వమున గోహరణపర్వమను ఉపపర్వమున ఉత్తరగోగ్రహణమున గోవుల మరలించుట అను ఏబదిమూడవ అధ్యాయము. (53)
(దాక్షిణాత్య ప్రతి అధికపాఠం 1 1/2 శ్లోకం కలిపి మొత్తం శ్లోకాలు 26 1/2.)