52. ఏబదిరెండవ అధ్యాయము

భీష్ముని అంగీకారము.

భీష్మ ఉవాచ
కలాః కాష్ఠాశ్చ యుజ్యంతే ముహూర్తాని దినాని చ।
అర్ధమాసాశ్చ మాసాశ్చ నక్షత్రాణి గ్రహాస్తథా॥ 1
ఋతవశ్చాపి యుజ్యంతే తథా సంవత్సరా అపి।
ఏవం కాలవీభాగేన కాలచక్రం ప్రవర్తతే॥ 2
భీష్ముడిట్లు చెప్పాడు. 'కాష్ఠలు (18 రెప్పపాట్ల కాలం), కళలు (ముప్పది రెప్పపాట్లకాలం), ముహూర్తాలు (48 నిమేషాలు), దినాలు, పక్షాలు, మాసాలు, నక్షత్రాలు, గ్రహాలు, ఋతువులు, సంవత్సరాలు - ఈవిధమైన విభాగంతో కాలచక్రం నడుస్తుంది. (1,2)
తేషాం కాలాతిరేకేణ జ్యోతిషాం చ వ్యతిక్రమాత్।
పంచమే పంచమే వర్షే ద్వౌమాసావుపజాయతః॥ 3
ఈ పక్షమాసాదుల కాలప్రమాణం పెరగటం వలన, నక్షత్రాల నడకలలోని హెచ్చు తగ్గుల వలన ప్రతి అయిదు సంవత్సరాలకూ రెండు మాసాలు అధికంగా వస్తాయి. (3)
ఏషామభ్యదికా మాసాః పంచ చ ద్వాదశక్షపాః।
త్రయోదశానాం వర్షాణామ్ ఇతి మే వర్తతే మతిః॥ 4
ఈ లెక్కన పదమూడు సంవత్సరాలపై ఐదునెలల పండ్రెండు రోజులు ఎక్కువగానే గడిపారని, అధికంగా వస్తాయని నా అభిప్రాయం. (4)
సర్వం యథావచ్చరితం యద్ యదేభిః ప్రతిశ్రుతమ్।
ఏవమేతద్ ధ్రువం జ్ఞాత్వా తతో బీభత్సురాగతః॥ 5
ఈ పాండవులు చేసిన ప్రతిజ్ఞలన్నీ యథాతథంగా పూర్తి చేశారు. ఈ విషయాన్ని స్పష్టంగా గ్రహించాకే అర్జునుడు ఇక్కడ బయటకు వచ్చాడు. (5)
సర్వే చైవ మహాత్మానః సర్వే ధర్మార్థకోవిదాః।
యేషాం యుధిష్ఠిరో రాజా కస్మాద్ ధర్మేఽపరాధ్నుయుః॥ 6
పాండవులందరూ మహాత్ములే. అందరూ ధర్మవేత్తలే. వారి ప్రభువు ధర్మరాజు. కాబట్టి ధర్మవిషయంలో వారు పొరపాటుపడే అవకాశమే లేదు. (6)
అలుబ్ధాశ్చైవ కౌంతేయాః కృతవంతశ్చ దుష్కరమ్।
న చాపి కేవలం రాజ్యమ్ ఇచ్ఛేయుస్తేఽనుపాయతః॥ 7
పాండవులు పేరాస గలవారు కాదు. తపస్సు మొదలయిన కఠినకర్మలను సైతం ఆచరించినవారు. అటువంటివారు అధర్మమో, అనుచితమో అయిన పద్ధతి ద్వారా రాజ్యాన్ని కోరే వారుకాదు. (7)
తదైవ తే హి విక్రాంతుమ్ ఈషుః కౌరవనందనాః।
ధర్మపాశనిబద్ధాస్తు న చేలుః క్షత్రియవ్రతాత్॥ 8
యచ్చానృత ఇతి ఖ్యాయాద్ యః స గచ్ఛేత్ పరాభవమ్।
వృణుయుర్మరణం పార్థా నానృతత్వం కథంచన॥ 9
కురువంశాన్ని ఆనందింపజేసే ఆ పాండవులు ఆనాడే విక్రమింపగలవారు. కానీ ధర్మపాశబద్ధులై క్షత్రియవ్రతాన్ని విడువలేదు. అర్జునుని అసత్యవాది అన్నవాడు తప్పనిసరిగ పరాభవాన్ని పొందుతాడు. పాండవులు మరణాన్ని అయినా వరిస్తారు. కానీ అసత్యమాడరు. (8,9)
ప్రాప్తకాలే తు ప్రాప్తవ్యం నోత్సృజేయుర్నరర్షభాః।
అపి వజ్రభృతా గుప్తం తథావీర్యా హి పాండవాః॥ 10
నరశ్రేష్ఠులైన పాండవులు తగిన సమయం ఆసన్న మైనవుడు తమకు రావలసిన దానిని, - ఇంద్రుడే దానిని దాచివుంచినా సరే- అణువంతయినా విడువరు. వారి పరాక్రమం అటువంటిది. (10)
ప్రతియుధ్యేమ సమరే సర్వశస్త్రభృతాం వరమ్।
తస్మాద్ యదత్ర కళ్యాణం లోకే సద్భిరనుష్ఠితమ్।
తత్ సంవిధీయతాం శీఘ్రం మావోహ్యర్థోఽభ్యగాత్ పరమ్॥ 11
ఇప్పుడు రణభూమిలో సర్వధనుర్ధరులలో మేటియైన అర్జునునితో పోరాడాలి. కాబట్టి లోకంలో సజ్జనులు పాటించిన శుభప్రదమయిన ఉపాయాన్ని ఆలోచించి దానిని ఆచరించాలి. మీ గోధనం శత్రువుల పాలు కాకూడదు. (11)
న హి పశ్యామి సంగ్రామే కదాచిదపి కౌరవ।
ఏకాంతసిద్ధిం రాజేంద్ర సంప్రాప్తశ్చ ధనంజయః॥ 12
కురురాజా! యుద్ధంలో ఏదో ఒక నిర్దిష్టపక్షమే తప్పని సరిగా గెలవటం నేనింతవరకు చూడలేదు. అదిగో! మరి అర్జునుడు రానేవచ్చాడు. (12)
సంప్రవృత్తే తు సంగ్రామే భావాభావౌ జయాజయౌ।
అవశ్యమేకం స్పృశతః దృష్టమేతదసంశయమ్॥ 13
యుద్ధం జరిగితే లాభమో, నష్టమో, గెలుపో, ఓటమో ఎవరికో ఒకరికి తప్పదు. అది కళ్ళకు కట్టిన సత్యం. అనుమానానికి అవకాశమే లేదు. (13)
తస్మాద్ యుద్ధోచితం కర్మ కర్మ వా ధర్మసంహితమ్।
క్రియతామాశు రాజేంద్ర సంప్రాప్తశ్చ ధనంజయః॥ 14
కాబట్టి రాజేంద్రా! యుద్ధానికి తగిన కర్తవ్యాన్ని పాటించు. లేదా ధర్మానుసారంగా ప్రవర్తించు. యుద్ధం లేకుండానే రాజ్యాన్ని తిరిగి యిచ్చి సంధిచేసుకో. ఏదైనా వెంటనే జరగాలి. అర్జునుడు వచ్చేశాడు. (14)
(ఏకోఽపి సమరే పార్థః పృథివీం నిర్దహేచ్ఛరైః।
భ్రాతృభిస్సహితస్తాత కిం పునః కౌరవాన్ రణే।
తస్మాత్ సంధిం కురుశ్రేష్ఠ కురుష్వ యది మన్యసే।)
కురుశ్రేష్ఠా! అర్జునుడు ఒంటరిగానైనా తన బాణాలతో భూమిని తగులబెట్టగలడు. ఇక సోదరులతో కూడా కలిసినచో కౌరవులను యుద్ధంలో సంహరించటం ఎంత పని? కాబట్టి నీకిష్టమైనచో సంధి చేసికొనవచ్చు.'
వి॥తె॥ దీనికి తిక్కన చక్కని తెలుగు చేశాడు. "వచ్చినవాడు అర్జునుడు. తప్పక గెలుస్తామని చెప్పలేము. రాజ్యలక్ష్మికోసం పెనగులాడిన బలాలు రెండూ గెలవలేవు కదా! జయం కలగవచ్చు. అపజయం కలగవచ్చు. ఏమయినా ఎదిరించడమూ ఏం వచ్చినా అనుభవించడమూ - అంతే! అదీగాక ఒకవిధంగా చూస్తే ఇప్పుడు సంధి చేసుకోవడం కూడా మంచిదే!" ఆపద్యం ఇది.
వచ్చినవాఁడు ఫల్గునుఁ, డవశ్యము గెల్తు మనంగరాదు, రా
లచ్చికినై పెనంగిన బలంబులు రెండును గెల్వవచ్చునే!
హెచ్చగుఁ గుందగుం; దొడరు టెల్లవిధంబుల కోర్చు; టట్లుగా
కిచ్చఁదలంచి యొక్కమెయి నిత్తఱి పొందరుచేతయుందగన్ (4-234)
సంప్రాప్తోహి ధనంజయః అనేదానికి తెలుగుసేత "వచ్చినవాడు ఫల్గునుడు" అనేది. చాలా ప్రసిద్ధమైన నానుడి అయింది. తప్పక పని సాధించేవాడిని "వచ్చినవాడు ఫల్గునుడు" అంటారు.
సంస్కృతంలో 'కర్మ వా ధర్మసంహితమ్' అన్నదానికి తిక్కన వ్యాఖ్యానం "పొందగుచేత" అనగా కలిసిమెలిసి ఉండటం.
దుర్యోధన ఉవాచ
నాహం రాజ్యం ప్రదాస్యామి పాండవానాం పితామహ।
యుద్ధోపచారికం యత్ తు తచ్ఛీఘ్రం ప్రవిధీయతామ్॥ 15
దుర్యోధనుడిలా అన్నాడు. 'పితామహా! నేను పాండవులకు రాజ్యమివ్వను. కాబట్టి యుద్ధానికి తగిన ఏర్పాట్లను వెంటనే చేయించాలి.' (15)
వి॥తె॥ దీనికి తెలుగులో తిక్కన సరసమైన వ్యాఖ్యానం చేశాడు.
ఆ॥వె॥ మనకు పాండురాజతనయవర్గమునకు
నెట్లు పొందు గలుగు? నేను రాజ్య
భాగ మీను; సమరభంగిక విక్రమ
నిరతి బూను టిదియ నిశ్చయంబు. (4-236)
భీష్మ ఉవాచ
అత్ర యా మామికా బుద్ధిః శ్రూయతాం యది రోచతే।
సర్వథా హి మయా శ్రేయః వక్తవ్యం కురునందన॥ 16
భీష్ముడిలా అన్నాడు. 'కురునందనా! నీకు నచ్చే టట్లయితే ఈ విషయంలో నా అభిప్రాయాన్ని చెబుతా విను. నేనెప్పుడైనా శ్రేయోమార్గాన్నే సూచిస్తాను. (16)
క్షిప్రం బలచతుర్భాగం గృహ్య గచ్ఛ పురం ప్రతి।
తతోఽపరశ్చతుర్భాగః గాః సమాదాయ గచ్ఛతు॥ 17
నీవు వెంటనే సేనలోని నాలుగవభాగాన్ని తీసికొని హస్తినకు బయలుదేరు. మరొక పావుభాగం సేన గోవులను తీసికొని బయలుదేరుతుంది. (17)
వయం చార్ధేన సైన్యస్య ప్రతియోత్స్యామ పాండవమ్।
అహం ద్రోణశ్చ కర్ణశ్చ అశ్వత్థామా కృపస్తథా॥
ప్రతియోత్స్యామ బీభత్సుమ్ ఆగతం కృతనిశ్చయమ్॥ 18
మిగిలిన సగభాగం సైన్యంతో మేము అర్జునుని ఎదిరిస్తాం.
నేను, ద్రోణుడు, కర్ణుడు, అశ్వత్థామ, కృపుడూ కలిసి యుద్ధంచేసి తీరాలని వచ్చిన అర్జునునితో పోరాడుతాం. (18)
మత్స్యం వా పునరాయాతమ్ ఆగతం వా శతక్రతుమ్।
అహమావారయిష్యామి వేలేన మకరాలయమ్॥ 19
మరలా మత్స్యరాజు విరాటుడే వచ్చినా, ఇంద్రుడే ఎత్తివచ్చినా చెలియలికట్ట సముద్రాన్ని ఆపినట్లు నేను నివారిస్తాను.' (19)
వైశంపాయన ఉవాచ
తద్ వాక్యం రురుచే తేషాం భీష్మేణోక్తం మహాత్మనా।
తథా హి కృతవాన్ రాజా కౌరవాణామనంతరమ్॥ 20
భీష్మః ప్రస్థాప్య రాజానం గోధనం తదనంతరమ్।
సేనాముఖ్యాన్ వ్యవస్థాప్య వ్యూహితుం సంప్రచక్రమే॥ 21
వైశంపాయను డిలా అన్నాడు. జనమేజయా! మహానుభావుడైన భీష్ముడు పలికిన మాటలు అందరికీ రుచించాయి. వెంటనే కౌరవరాజు ఆ రీతిగానే చేశాడు. భీష్ముడు ముందు దుర్యోధనుని, ఆ తర్వాత గోధనాన్ని పంపి సేనాపతులను నియమించి వ్యూహం పన్నటానికి ఉపక్రమించాడు. (20,21)
భీష్మ ఉవాచ
ఆచార్య మధ్యే తిష్ఠ త్వమ్ అశ్వత్థామా తు సవ్యతః।
కృపః శారద్వతో ధీమాన్ పార్శ్వం రక్షతు దక్షిణమ్॥ 22
భీష్ముడిలా అంటున్నాడు. 'ఆచార్యా! మీరు మధ్యలో నిలవండి. అశ్వత్థామ ఎడమవైపు నిలుస్తాడు. శరద్వంతుని కొడుకైన కృపుడు దక్షిణభాగానికి రక్షణగా నిలుస్తాడు. (22)
అగ్రతః సూతపుత్రస్తు కర్ణస్తిష్ఠతు దంశితః।
అహం సర్వస్య సైన్యస్య పశ్చాత్ స్థాస్యామి పాలయన్॥ 23
సూతపుత్రుడైన కర్ణుడు కవచాన్ని ధరించి ముందు నిలుస్తాడు. నేను సమస్తసైన్యానికీ వెనుకగా నిలిచి రక్షణగా ఉంటాను. (23)
(సర్వే మహారథాః శూరాః మహేష్వాసో మహాబలాః।
యుద్ధ్యంతు పాండవశ్రేష్ఠమ్ ఆగతం యత్నతో యుధి॥
మహాబలసంపన్నులు, మేటి విలుకాండ్రు, శూరులు, మహారథులంతా రణరంగానికి వచ్చిన అర్జునుని ప్రయత్నపూర్వకంగా నిలువరించాలి.'
వైశంపాయన ఉవాచ
అభేద్యం సర్వసైన్యానాం వ్యూహ్య వ్యూహం కురూత్తమః।
వజ్రగర్భం వ్రీహిముఖమ్ అర్ధచక్రాంతమండలమ్॥
తస్య వ్యూహస్య పశ్చార్ధే భీష్మశ్చాతోద్యతాయుధః।
సౌవర్ణం తాలముచ్ఛ్రిత్య రథే తిష్ఠన్నశోభత॥)
వైశంపాయనుడిలా అన్నాడు. జనమేజయా! ఆ తర్వాత భీష్ముడు సర్వసేనలతో అభేద్యవ్యూహాలను భావించి, వాటిని వజ్రగర్భ, వ్రీహిముఖ, అర్ధచక్రాంత మండలరూపంగా తీర్చాడు. వెనుక స్వర్ణమయమైన తాళధ్వజం ప్రకాశించే రథంపై ఆయుధాలు ధరించి తాను నిలిచాడు.
ఇతి శ్రీమహాభారతే విరాటపర్వణి గోహరణపర్వణి ఉత్తరగోగ్రహే భీష్మ సైన్యవ్యూహే ద్విపంచాశత్తమోఽధ్యాయః॥ 52 ॥
ఇది శ్రీమహాభారతమున విరాటపర్వమున గోహరణపర్వమను ఉపపర్వమున
భీష్ముడు వ్యూహమును పన్నుట అను ఏబదిరెండవ అధ్యాయము. (52)
(దాక్షిణాత్యప్రతిలోని అధికపాఠం 4 1/2 శ్లోకాలతో కలిసి మొత్తం 27 1/2 శ్లోకాలు.)