54. ఏబదినాల్గవ అధ్యాయము

కర్ణార్జునులయుద్ధము - కర్ణుడు ఓడి పారిపోవుట.

వైశంపాయన ఉవాచ
స శత్రుసేనాం తరసా ప్రణుద్య
గాస్తా విజిత్యాథ ధనుర్ధరాగ్ర్యః।
దుర్యోదనాయాభిముఖం ప్రయాతః
భూయో రణం సోఽభిచికీర్షమాణః॥ 1
వైశంపాయను డిట్లన్నాడు. జనమేజయా! ధనుర్ధరులలో శ్రేష్ఠుడైన అర్జునుడు తీవ్రవేగంతో శత్రుసేనను పారద్రోలి గోవులను స్వాధీనం చేసికొన్నాడు. కానీ మరలా యుద్ధం చేయాలనే కోరికతో దుర్యోధనునికి ఎదురుపోయాడు. (1)
గోషు ప్రయాతాసు జవేన మత్స్యాన్
కిరీటినం కృతకార్యం చ మత్వా।
దుర్యోధనాయాభిముఖం ప్రయాతం
కురుప్రవీరాః సహసా నిపేతుః॥ 2
గోవులు వేగంగా మత్స్యరాజధాని వైపు ప్రయాణించటాన్ని చూసిన కురువీరులు అర్జునుడు గోవులను మరలించి దుర్యోధనుని కెదురుపోతున్నాడని గ్రహించి వెంటనే అక్కడకు వచ్చిపడ్డారు. (2)
తేషా మనీకాని బహూని గాఢం
వ్యూఢాని దృష్ట్వా బహుళధ్వజాని।
మత్స్యస్య పుత్రం ద్విషతాం నిహంతా
వైరాటిమామంత్ర్య తతోఽభ్యువాచ॥ 3
దట్టంగా మోహరించి, ధ్వజపతాకాలతో ప్రకాశిస్తున్న కౌరవుల సేనాసమూహాలను చూసి శత్రుసంహర్త అయిన అర్జునుడు ఉత్తరునితో ఇలా అన్నాడు. (3)
ఏతేన తూర్ణం ప్రతిపాదయేమాన్
శ్వేతాన్ హయాన్ కాంచనరశ్మియోక్త్రాన్।
జవేన సర్వేణ కురు ప్రయత్నమ్
ఆసాదయేఽహం కురుసింహవృందమ్॥ 4
గజో గజేనేవ మయా దురాత్మా
యోద్ధుం సమాకాంక్షతి సూతపుత్రః।
తమేవ మాం ప్రాపయ రాజపుత్ర
దుర్యోధనాపాశ్రయజాతదర్పమ్॥ 5
'రాజకుమారా! బంగారుపగ్గాలు కూర్చిన ఈ నా తెల్లగుఱ్ఱాలను నీవు వెంటనే ఇక్కడ నుండి దారి మళ్ళించు. సంపూర్ణ వేగంతో దుర్యోధనునిసేనలను సమీపించేటట్లు ప్రయత్నం చేయి. ఇటు చూడు. ఏనుగు ఏనుగుతో తలపడటానికి సిద్ధపడినట్లు దురాత్మకుడైన కర్ణుడు నాతో తలపడటానికి సిద్ధపడుతున్నాడు. దుర్యోధనుడు చెడుప్రాపుతో అహంకరిస్తున్న ఆ కర్ణుని వైపే రథాన్ని నడిపించు.' (4,5)
స తైర్హయై ర్వాతజవైర్బృహద్భిః
పుత్రో విరాటస్య సువర్ణకక్షైః।
వ్యధ్వంసయత్ తద్ రథినామనీకం
తతోఽవహత్ పాండవమాజిమధ్యే॥ 6
అర్జునుని గుఱ్ఱాలు వాయువేగం కలవి, పెద్దవి. వాటి జీనుల అంచులలో బంగారుకుచ్చులున్నాయి. అటువంటి గుఱ్ఱాలతో ఉత్తరుడు ఆ రథికుల సేనను చీల్చి అర్జునుని రణభూమిమధ్యకు చేర్చాడు. (6)
తం చిత్రసేనో విశిఖాఇర్విపాఠైః
సంగ్రామజిత్ శత్రుసహో జయశ్చ।
ప్రత్యుద్యయుర్భారత మాపతంతం
మహారథాః కర్ణమభీప్సమానాః॥ 7
అంతలో మహారథులైన చిత్రసేనుడు, సంగ్రామజిత్తు, శత్రుసహుడు, జయుడు ఒక్కటై విపాఠాలనే పేరుగల బాణాలను వర్షిస్తూ కర్ణునకు తోడుగా అర్జునుని ఎదుట నిలిచారు. (7)
తతః స తేషాం పురుషప్రవీరః
శరాసనార్చిః శరవేగతాపః।
వ్రాతం రథానామదహత్ సమన్యుః
వనం యథాగ్నిః కురుపుంగవానామ్॥ 8
అప్పుడు కురుశ్రేష్ఠుడైన అర్జునుడు ధనుస్సే అగ్నిగా, శరవేగమే మంటగా దావాగ్ని వనాన్ని తగులబెట్టినట్లు ఆ కురుపుంగవుల రథాలను తగులబెట్టాడు. (8)
తస్మింస్తు యుద్ధే తుములే ప్రవృత్తే
పార్థం వికర్ణోఽతిరథం రథేన।
విపాఠవర్షేణ కురుప్రవీరః
భీమేన భీమానుజమాససాద॥ 9
అలా ఘోరమైన యుద్ధం జరుగుతుండగా కురువీరుడైన వికర్ణుడు ఉగ్రమైన విపాఠబాణవర్షాన్ని కురిపిస్తూ రథంతో అతిరథుడైన అర్జునుని ఆక్రమించాడు. (9)
తతో వికర్ణస్య ధనుర్వికృష్య
జాంబూనదాగ్ర్యోపచితం దృఢజ్యమ్।
అపాతయత్ తం ధ్వజమస్య మధ్య
చ్ఛిన్నధ్వజః సోఽప్యపయాజ్జవేన॥ 10
అప్పుడు అర్జునుడు బంగారు అంచులతో మెరుగు దిద్దబడి గట్టి అల్లెత్రాడు గలిగిన వికర్ణుని ధనుస్సును విరిచి, అతని ధ్వజాన్ని ముక్కలు చేసి పడగొట్టాడు. రథధ్వజం విరిగిపోగానే వికర్ణుడు వేగంగా పారిపోయాడు. (10)
తం శాత్రవానాం గణబాధితారం
కర్మాణి కుర్వంతమమానుషాణి।
శత్రుంతపః పార్థమమృష్యమాణః
సమార్దయచ్ఛరవర్షేణ పార్థమ్॥ 11
శత్రుసేనాసమూహాలను పీడిస్తూ అమానుష పరాక్రమాన్ని ప్రదర్శిస్తున్న అర్జునుని చూసి, దాన్ని సహింపక బాణవర్షంతో అర్జునుని ముంచెత్తుతూ శత్రుంతపుడు ఎదిరించాడు. (11)
స తేన రాజ్ఞాతిరథేన విద్ధః
విగాహమానో ధ్వజినీం కురూణామ్।
శత్రుంతపం పంచభిరాశు విద్ధ్వా
తతోఽస్య సూతం దశభిర్జఘాన॥ 12
కౌరవసేనలోనికి చొచ్చుకొనిపోయి విహరిస్తున్న అర్జునుడు అతిరథుడైన శత్రుంతపుని బాణాల తాకిడికి గాయపడి అయిదుబాణాలతో అతనిని, పదిబాణాలతో అతని సారథిని కొట్టాడు. (12)
తతః స విద్ధో భరతర్షభేణ
బాణేన గాత్రావరణాతిగేన।
గతాసురాజౌ నిపపాత భూమౌ
నగో నగాగ్రాదివ వాతరుగ్ణః॥ 13
అప్పుడు భరతశ్రేష్ఠుడైన అర్జునుని బాణం శత్రుంతపుని కవచాన్ని చీల్చి శరీరాన్ని తాకింది. ఆ దెబ్బతో ప్రాణాలు కోల్పోయిన శత్రుంతపుడు గాలిచే పెకలింపబడి కొండశిఖరంనుండి కూలిన చెట్టువలె యుద్ధభుమిలో పడిపోయాడు. (13)
నరర్షభాస్తేన నరర్షభేణ
వీరా రణే వీరతరేణ భగ్నాః।
చకంపిరే వాతవశేన కాలే
ప్రకంపితానీవ మహావనాని॥ 14
నరశ్రేష్ఠుడు, వీరవరుడు అయిన అర్జునునిచే దెబ్బతిన్న కౌరవసేనలలోని వీరులు ప్రళయకాలంలో ప్రచండవేగంగల గాలికి మహావనాలు కదలిపోయినట్లు కంపించి పోయారు. (14)
హతాస్తు పార్థేన నరప్రవీరాః
గతాసవోర్వ్యాం సుషువుః సువేషాః।
వసుప్రదా వాసవతుల్యవీర్యాః
పరాజితా వాసవజేన సంఖ్యే॥ 15
సుందరమైన వేషాలు గలిగిన ఎందరో వీరశ్రేష్ఠులు అర్జునుని దెబ్బతిని, ప్రాణాలు కోల్పోయి, రణభూమిలో దీర్ఘనిద్రపోయారు. ఇంద్రసమానమైన పరాక్రమం. దానశీలం గల మరెందరో వీరులు ఇంద్రసుతుడైన అర్జునునిచే యుద్ధంలో ఓడింపబడ్డారు. (15)
సువర్ణకార్ష్ణాయసవర్మనద్ధాః
నాగా యథా హైమవతాః ప్రవృద్ధాః।
తథా స శత్రూన సమరే వినిఘ్నన్
గాండీవధన్వా పురుషప్రవీరః॥ 16
చచార సంఖ్యే విదిశో దిశశ్చ
దహన్నివాగ్నిర్వనమాతపాంతే।
ఆ కౌరవసేనలో కొందరు బంగారు కవచాలను, మరికొందరు ఇనుపకవచాలను ధరించిన వారు. వారు రణభూమిపైబడి హిమాలయ ప్రదేశంలోని పెద్ద ఏనుగువలె కన్పడ్డారు. (16)
ఆ రీతిగా శత్రుసంహారం చేస్తున్న మహాపురుషుడు గాండీవి గ్రీష్మర్తువులో అగ్ని మొత్తం అరణ్యాన్ని దహిస్తున్నట్లు యుద్ధభూమిలో అన్ని దిక్కులా అన్ని మూలలా విహరించాడు.
ప్రకీర్ణపర్ణాని యథా వసంతే
విశాతయిత్వా పవనోఽంబుదాంశ్చ॥ 17
తథా సపత్నాన్ వికిరన్ కిరీటీ
చచార సంఖ్యేఽతిరథో రథేన।
వసంతర్తువులో రాలిపడిన ఆకులను, మేఘాలను గాలి చెదరగొట్టినట్టు అతిరథుడైన అర్జునుడు రణరంగంలో శత్రువులను చెదరగొట్టుతూ విహరించాడు. (17)
శోణాశ్వవాహస్య హయాన్ నిహత్య
వైకర్తనభ్రాతు రదీనసత్త్వః।
ఏకేన సంగ్రామజితః శరేణ
శిరో జహారాథ కిరీటమాలీ॥ 18
ఎఱ్ఱని గుఱ్ఱాలు గలిగిన కర్ణసోదరుడైన సంగ్రామజిత్తు యొక్కగుఱ్ఱాలను చంపి స్థిరచిత్తంలో అర్జునుడు మరొక్క బాణంతో వాని తలను కూడా త్రుంచాడు. (18)
తస్మిన హతే భ్రాతరి సూతపుత్రే
వైకర్తనో వీర్యమథాదదానః।
ప్రగృహ్యదంతావివ నాగరాజః
మహర్షభం వ్యాఘ్ర ఇవాభ్యధావత్॥ 19
తనసోదరుడు సంగ్రామజిత్తు మరణించగా సూత పుత్రుడు కర్ణుడు రెచ్చిపోయి రెండు కొండశిఖారలను ఢీకొన్న ఏనుగులాగా, ఆబోతుపై దూకిన పులిలాగా ఉత్తరార్జునులపై కురికాడు. (19)
స పాండవం ద్వాదశభిః పృషత్కైః
వైకర్తనః శీఘ్రమథో జఘాన।
వివ్యాధ గాత్రేషు హయాంశ్చ సర్వాన్
విరాటపుత్రం చ కరే నిజఘ్నే॥ 20
ఆ కర్ణుడు పంరెండు వాడిబాణాలతో వేగంగా అర్జునుని గాయపరిచాడు. అన్నిగుఱ్ఱాల శరీరాలకు గాయాలు చేశాడు. ఉత్తరుని చేతిని కూడా గాయపరిచాడు. (20)
తమాపతంతం సహసా కిరీటీ
వైకర్తనం వై తరసాభిపత్య।
ప్రగృహ్య వేగం న్యపతజ్జవేన
నాగం గరుత్మానివ చిత్రపక్షః॥ 21
వేగంగా మీదికి వస్తున్న కర్ణుని చూసి అర్జునుడు కూడా వేగంగా ఎదురునిలిచి, చిత్రమైన రెక్కలుగల గరుత్మంతుడు పామును పట్టుకొన్నట్లు ఒక్క ఊపున కర్ణునిపై పడ్డాడు. (21)
తావుత్తమౌ సర్వధనుర్ధరాణాం
మహాబలౌ సర్వసపత్నసాహౌ।
కర్ణస్య పార్థస్య నిశమ్య యుద్ధం
దిదృక్షమాణాః కురవోఽభితస్థుః॥ 22
కర్ణార్జును లిరువురూ విలుకాండ్రలో శ్రేష్ఠులు. మహాబలులు. శత్రువుల నెందరినైనా ఎదిరించి నిలువ గలవారు. ఆ ఇరువురి పోరును గురించి విని, దాన్ని చూడగోరి, కౌరవులంతా స్తబ్ధంగా నిలిచారు. (22)
స పాండవస్తూర్ణముదీర్ణకోపః
కృతాగసం కర్ణముదీక్ష్య హర్షాత్।
క్షణేన సాశ్వం సరథం ససారథిమ్
అంతర్దధే ఘోరశరౌఘవృష్ట్వా॥ 23
అప్పుడు అర్జునుడు కోపం హెచ్చరిల్లి, తమపట్ల తప్పుచేసియున్న కర్ణుని చూసి ఆనందించి, క్షణంలో తీవ్రబాణవృష్టితో అశ్వరథసారథులతో సహా కర్ణుని ముంచెత్తాడు. (23)
తతః సువిద్ధాః సరథాః సనాగాః।
యోధా వినేదుర్భరతర్షభాణామ్।
అంతర్హితా భీష్మముఖా సహాశ్వాః
కిరీటినా కీర్ణరథాః పృషత్కైః॥ 24
ఆ తరువాత కౌరవసేనలు రథగజాలతో పాటు దెబ్బతిని ఆక్రోశింపసాగాయి. అర్జునుని బాణాలలో మునిగిపోయి రథాశ్వాలతో సహా భీష్మాది యోధులు కూడా కనబడటం లేదు. (24)
స చాపి తానర్జునబాహుముక్తాన్
శరాన్ శరౌఘైః ప్రతిహత్య వీరః।
తస్థౌ మహాత్మా సధనుః సబాణః
సవిస్ఫులింగోఽగ్నిరివాశు కర్ణః॥ 25
అప్పుడు మహాత్ముడైన ఆ కర్ణుడు అర్జునుని బాహువుల నుండి వెలువడిన బాణాలను బాణ సమూహాలతో ఖండించి బాణధనుర్ధారియై నిలిచి నిప్పుతోకూడిన అగ్నిలాగా ప్రకాశించాడు. (25)
తతస్త్వభూద్ వై తలతాలశబ్దః
సశంఖభేరీపణవప్రణాదః।
ప్రక్ష్వేడిత జ్యాతలనిస్వనం తం
వైకర్తనం పూజయతాం కురూణామ్॥ 26
ఆ తరువాత కర్ణుడు తన అల్లెత్రాటిని పునఃపునః లాగి ధ్వనింపజేశాడు. దానితో కర్ణుని ప్రశంసిస్తూ కౌరవులు చేసిన కరతాళధ్వనులు శంఖ, భేరీ, పణవ నాదాలతోపాటు విస్తరించాయి. (26)
ఉద్ధూతలాంగూల మహాపతాక
ధ్వజోత్తమాంసాకుల భీషణాంతమ్।
గాండీవనిర్హ్రాదకృతప్రణాదం
కిరీటినం ప్రేక్ష్య ననాద కర్ణః॥ 27
అర్జునుని రథధ్వజంపైనున్న ఆంజనేయుని తోక పతాకంలా ప్రకాశిస్తోంది. ధ్వజాగ్రంలోని భూతాలు భయంకరంగా నినదిస్తున్నాయి. ఆ ధ్వనికి తోడు గాండీవ ధనుష్టంకారం పిడుగుపాటులా వినిపిస్తోంది. అటువంటి కిరీటిని చూచి కర్ణుడు సింహనాదం చేశాడు. (27)
స చాపి వైకర్తనమర్దయిత్వా
సాశ్వం ససూతం సరథం పృషత్కైః।
తమావవర్ష ప్రసభం కిరీటీ
పితామహం ద్రోణకృపౌ చ దృష్ట్వా॥ 28
అర్జునుడు కూడా అశ్వ సూత రథాలతోపాటు కర్ణుని బాణాలతో పీడించి భీష్మపితామహునీ, ద్రోణకృపులనూ చూస్తూ కర్ణునిపై బాణ వర్షం కురిపించాడు. (28)
స చాపి పార్థం బహుభిః పృషత్కైః
వైకర్తనో మేఘ ఇవాభ్యవర్షత్।
తథైవ కర్ణం చ కిరీటమాలీ
సంఛాదయామాస శితైః పృషత్కైః॥ 29
ఆ కర్ణుడూ మేఘంలాగా అర్జునునిపై బాణదృష్టిని కురిపించాడు. అదే విధంగా అర్జునుడూ వాడియైన బాణాలతో కర్ణుని కప్పివేశాడు. (29)
తయోః సుతీక్ష్ణాన్ సృజతోః శరౌఘాన్
మహాశరౌఘాస్త్రవివర్ధనే రణే।
రథే విలగ్నావివ చంద్రసూర్యౌ
ఘనాంతరేణానుదదర్శ లోకః॥ 30
ఆ విధంగా కర్ణార్జునులు మిక్కిలి వాడియైన శరసమూహాలను ఒకరిపై ఒకరు గుప్పించుకొంటూ శరప్రవాహాలతో యుద్ధాన్ని పెంచసాగారు. తమతమ రథాలపై నున్నవారిద్దరూ మేఘాలమాటున ప్రకాశించే సూర్యచంద్రులా కనిపించారు. (30)
అథాశుకారీ చతురో హయాంశ్చ
వివ్యాధ కర్ణో నిశితైః కిరీటినః।
త్రిభిశ్చ యంతారమమృష్యమాణః
వివ్యాధ తూర్ణం త్రిభిరస్య కేతుమ్॥ 31
కర్ణుడు అర్జునుని పరాక్రమాన్ని సహించలేక పోయాడు. అతడు వేగంగా బాణాలు ప్రయోగించ గల తన నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ అర్జునుని గుఱ్ఱాలను నాలుగింటిని గాయపరిచాడు. మూడు బాణాలతో సారథిని గాయపరిచాడు. వెంటనే మరో మూడు బాణాలతో ధ్వజాన్ని ధ్వంసంచేశాడు. (31)
తతోఽభివిద్ధః సమరావమర్దీ
ప్రబోధితః సింహ ఇవ ప్రసుప్తః।
గాండీవధన్వా ఋషభః కురూణామ్
అజిహ్మగైః కర్ణమియాయ జిష్ణుః॥ 32
కురుశ్రేష్ఠుడు, గాండీవధారి, జయశీలుడు, శత్రుపీడాకరుడు నైన అర్జునుని కర్ణుడు గాయపరిచాడు. అది నిదురిస్తున్న సింహాన్ని లేపినట్లు అయింది. దానితో అర్జునుడు సూటిగా శత్రువులను తాకే బాణాలతో కర్ణుని సమీపించాడు. (32)
శరాస్త్రవృష్ట్యా నిహతో మహాత్మా
ప్రాదుశ్చకారాతిమనుష్యకర్మ।
ప్రాచ్ఛాదయత్ కర్ణరథం పృషత్కైః
లోకానిమాన్ సూర్య ఇవాంశుజాలైః॥ 33
కర్ణుని బాణాస్త్రవృష్టిచే దెబ్బతిన్న అర్జునుడు అమానుష పరాక్రమాన్ని ప్రదర్శించాడు. సూర్యుడు తన కిరణాలతో లోకాలను కప్పివేసినట్లు అర్జునుడు బాణాలతో కర్ణరథాన్ని కప్పివేశాడు. (33)
స హస్తినేవాభిహతో గజేంద్రః
ప్రగృహ్య భల్లాన్ నిశితాన్ నిషంగాత్।
ఆకర్ణపూర్ణం చ ధనుర్వికృష్య
వివ్యాధ గాత్రేష్వథ సూతపుత్రమ్॥ 34
అప్పుడు అర్జునుడు ఏనుగువలె విజృభించి తన అమ్ములపొదినుండి వాడియైన బాణాలను తీసి, ఆకర్ణాంతం వింటినారిని లాగి సూతపుత్రుని శరీరాన్ని గాయపరిచాడు. (34)
అథాస్య బాహూరుశిరోలలాటం
గ్రీవాం వరాంగాని పరావమర్దీ।
శితైశ్చ బాణైర్యుధి నిర్బిభేద
గాండీవముక్తైరశనిప్రకాశైః॥ 35
యుద్ధంలో శత్రువుల పీచమణచగల అర్జునుడు గాండీవం నుండి వెలువడి వజ్రాయుధంలా ప్రకాశించే బాణాలతో ఆ కర్ణుని బాహువులను, తొడలను, శిరస్సును నుదుటిని, మెడను గాయపరిచాడు. (35)
స పార్థముక్తైరిషుభిః ప్రణున్నః
గజో గజేనేవ జితస్తరస్వీ।
విహాయ సంగ్రామశిరః ప్రయాతః
వైకర్తనః పాండవబాణతప్తః॥ 36
అర్జునుడు విడిచిన బాణాలచే గాయపడిన ఆ కర్ణుడు ఏనుగుచేత ఓడింపబడిన మరొక ఏనుగులాగా రణరంగాన్ని వీడి పారిపోయాడు. (36)
ఇతి శ్రీమహాభారతే విరాటపర్వణి గోహరణపర్వణి ఉత్తరగోగ్రహే కర్ణాపయానే చతుష్పంచాశత్తమోఽధ్యాయః ॥ 54 ॥
ఇది శ్రీమహాభారతమున విరాటపర్వమున గోహరణపర్వమను ఉపపర్వమున ఉత్తరగోగ్రహణమున కర్ణుని పలాయన మను ఏబదినాల్గవ అధ్యాయము.(54)