27. ఇరువది ఏడవ అధ్యాయము

ద్రోణుని అభిప్రాయము.

వైశంపాయన ఉవాచ
అథాబ్రవీన్మహావీర్యః ద్రోణస్తత్త్వార్థదర్శివాన్।
న తాదృశా వినశ్యంతి న ప్రయాంతి పరాభవమ్॥ 1
శూరాశ్చ కృతవిద్యాశ్చ బుద్ధిమంతో జితేంద్రియాః।
ధర్మజ్ఞాశ్చ కృతజ్ఞాశ్చ ధర్మరాజమనువ్రతాః॥ 2
వైశంపాయనుడు అన్నాడు.
జనమేజయా! తత్త్వార్థాన్ని దర్శించేవాడు, మహాపరాక్రమవంతుడు అయిన ద్రోణాచార్యుడిలా అన్నాడు. 'పాండవులు వీరులు, విద్వాంసులు, బుద్ధిమంతులు, జితేంద్రియులు, ధర్మజ్ఞులు, కృతజ్ఞులు, తమ పెద్దన్న అయిన ధర్మరాజు ఆజ్ఞను పాటించేవారు, అతనియెడ భక్తిభావం కలవారు. ఇలాంటి మహా పురుషులు నశించరు, పరాభవాన్ని పొందరు. (1,2)
నీతి ధర్మార్థ తత్త్వజ్ఞం పితృవచ్చ సమాహితమ్।
ధర్మే స్థితం సత్యధృతిం జ్యేష్ఠం జ్యేష్ఠానుమయాయినః॥ 3
అనువ్రతా మహాత్మానం భ్రాతరో భ్రాతరం నృప।
అజాతశత్రుం శ్రీమంతం సర్వభ్రాతౄననువ్రతమ్॥ 4
వారిలో ధర్మరాజు నీతి, ధర్మం, అర్థం వీటి తత్త్వం ఎరిగినవాడు, సోదరులతనిని తండ్రివలె గౌరవిస్తారు. ధర్మమార్గమందుండేవాడు, సత్యపరాయణుడు, సోదరులందరిలో పెద్దవాడు. రాజా! అతని సోదరులు కూడా తమ అన్నల ననుసరించేవారు. మహాత్ముడు, శ్రీమంతుడు, అజాతశత్రువు అయిన యుధిష్ఠిరుని పట్ల సోదరులకు భక్తి ఉంది. ధర్మరాజు కూడా సోదరుల పట్ల మిక్కిలి స్నేహంతో ఉంటాడు. (3,4)
తేషాం తథా విధేయానాం నిభృతానాం మహాత్మనామ్।
కిమర్థం నీతిమాన్ పార్థః శ్రేయో నైషాం కరిష్యతి॥ 5
ధర్మరాజు ఎందుకు శ్రేయస్సు కలిగించడు? (5)
తస్మాత్ యత్నాత్ ప్రతీక్షంతే కార్యస్యోదయమాగతమ్।
న హి తే నాశమృచ్ఛేయుః ఇతి పశ్యామ్యహం ధియా॥ 6
'పాండవులు నశించరు, వారనుకూల సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటా'రని నాబుద్ధి, అనుభవాలను బట్టి నేను తలుస్తున్నాను. (6)
సంప్రతం చైవ యత్కార్యం తచ్చ క్షిప్రమకాలికమ్।
క్రియతాం సాధు సంచింత్య వాసశ్చైషాం ప్రచింత్యతామ్॥ 7
యథావత్ పాండుపుత్రాణాం సర్వార్థేషు ధృతాత్మనామ్।
దుర్ జ్ఞేయాః ఖలు శూరాస్తే దురాపాస్తపసా వృతాః॥ 8
ఈ సమయంలో చేయవలసినపని బాగా ఆలోచించి తొందరగా చేయాలి. ఆలస్యం చేయడం సరికాదు. అన్ని విషయాల్లో ధైర్యంగా ఉండే ఆ పాండవుల నివాసస్థానం చాలా సరిగా గుర్తించాలి. వారందరూ శూరులు, వీరులు. వారి తపశ్శక్తి గొప్పది. కాబట్టి వారిని తెలుసుకోవడమే కాదు, సమీపించడం కూడా చాలా కష్టం. (7,8)
శుద్ధాత్మా గుణవాన్ పార్థః సత్యవాన్ నీతిమాన్ శుచిః।
తేజోరాశిరసంఖ్యేయః గృహ్ణీయాదపి చక్షుషా॥ 9
కుంతీపుత్రుడయిన ధర్మరాజు శుద్ధచిత్తం కలవాడు, గుణవంతుడు, సత్యవంతుడు, నీతిమంతుడు, పవిత్రుడు. అతడు తేజోరాశి. అతనిని గుర్తించడం అసంభవం. కంటితో అతడు మనుషులకు మోహాన్ని కలిగించగలడు. అతనిని గుర్తించలేరు. (9)
విజ్ఞాయ క్రియతాం తస్మాద్ భూయశ్చ మృహయామహే।
బ్రాహ్మణైశ్చారకైః సిద్ధైః యే చాన్యే తద్విదో జనాః॥ 10
కాబట్టి మనం బాగా ఆలోచించి ఏదైనా పని చేయాలి. బ్రాహ్మణులు, గూఢచారులు, సిద్ధపురుషులు, ఇంకా వారిని గుర్తించగల జనుల ద్వారా మరల వెదికించాలి.' (10)
ఇతి శ్రీమహాభారతే విరాటపర్వణి గోహరణపర్వణి ద్రోణవాక్యే చారప్రత్యాచారే సప్తవింసోఽధ్యాయః॥ 27 ॥
ఇది శ్రీమహాభారతమున విరాటపర్వమున గోహరణ పర్వమను ఉపపర్వమున ద్రోణునిఅభిప్రాయమను ఇరువది ఏడవ అధ్యాయము. (27)