26. ఇరువది ఆరవ అధ్యాయము

దుర్యోధనుడు పాండవుల ఉనికిని గూర్చి సభాసదులతో ఆలోచించుట.

వైశంపాయన ఉవాచ
తతో దుర్యోధనో రాజా జ్ఞాత్వా తేషాం వచస్తదా।
చిరమంతర్మనా భూత్వా ప్రత్యువాచ సభాసదః॥ 1
వైశంపాయనుడు అన్నాడు. జనమేజయా! దుర్యోధన మహారాజు ఆ సమయంలో దూతల మాటలను గూర్చి తనమనస్సులో చాలా సేపు ఆలోచించాడు. తరువాత సభాసదులలో ఇలా చెప్పాడు. (1)
సుదుఃఖం ఖలు కార్యాణాం గతిర్విజ్ఞాతుమంతతః।
తస్మాత్ సర్వే నిరీక్షధ్వం క్వ ను తే పాండవా గతాః॥ 2
కార్యగతి, పర్యవసానం సరిగా తెలుసుకోవడం మిక్కిలి కష్టం. మీరందరూ కూడా పాండవులెక్కడకు వెళ్ళారో ఆలోచించి చూడండి. (2)
అల్పావశిష్టకాలస్య గతభూయిష్ఠమంతతః।
తేషామజ్ఞాతచర్యాయామ్ అస్మిన్ వర్షే త్రయోదశే॥ 3
ఈ పదుమూడవ సంవత్సరంలో పాండవుల అజ్ఞాతవాసంలో ఎక్కువ భాగం అయిపోయింది. కొద్ది రోజులు మిగిలి ఉన్నాయి. (3)
అస్య వర్షస్య శేషం చేద్ వ్యతీయురిహ పాండవాః।
నివృత్తసమయా స్తే హి సత్యవ్రతపరాయణాః॥ 4
క్షరంత ఇవ నాగేంద్రాః సర్వే హ్యాశీవిషోపమాః।
దుఃఖా భవేయుః సంరబ్ధాః కౌరవాన్ ప్రతి తే ధ్రువమ్॥ 5
మిగిలిన సమయం పాండవు లిలా గడిపితే వారు ప్రతిజ్ఞాపాలన భారాన్నుండి విడివడుతారు. సత్యవ్రతులయిన పాండవులు మదధారలను స్రవించే గజరాజుల వలె, విషం కక్కే సర్పాల వలె కోపంతో కౌరవులకు దుఃఖం కలిగించే వారౌతారు. ఇది నిశ్చయం. (4,5)
సర్వే కాలస్య వేత్తారః కృచ్ఛ్రరూపధరాః స్థితాః।
ప్రవిశేయుర్జితక్రోధాః తావదేవ పునర్వనమ్॥ 6
తస్మాత్ క్షిప్రం బుభూషధ్వం యథా తేఽత్యంతమవ్యయమ్।
రాజ్యం నిర్ద్వంద్వమవ్యగ్రం నిఃసపత్నం చిరం భవేత్॥ 7
వారందరు అజ్ఞాతవాసం అవధిని ఎరుగుదురు. కాబట్టి గుర్తించడానికి వీలుకాని మారువేషంలో ఉంటారు. మీరు వారిని తొందరగా గుర్తించడానికి ప్రయత్నించండి. వారు కోపాన్ని అణచుకొని మరల పన్నెండు సంవత్సరాలు వనవాసం చేయడానికి అడవికి వెళ్లాలి. అలా అయిన తరువాత నా యీ రాజ్యం చిరకాలం మరో సమ్రాట్టు లేనిదీ, వ్యగ్రత లేనిదీ, శత్రువు లేనిదీ అవుతుంది.' (6,7)
అథాబ్రవీత్ తతః కర్ణః క్షిప్రం గచ్ఛంతు భారత।
అన్యే ధూర్తా నరా దక్షాః నిభృతాః సాధుకారిణః॥ 8
ఇది విని కర్ణుడిలా అన్నాడు. 'భరతనందనా! కార్యకుశలు లయిన ఇతర గూఢచారులను తొందరగా పంపు. వారు మాయావులు, దక్షులు అయి తమ కార్యాన్ని బాగా చేయగలగాలి. (8)
చరంతు దేశాన్ సంవీతాః స్ఫీతాన్ జనపదాకులాన్।
తత్ర గోష్ఠీషు రమ్యాసు సిద్ధప్రవ్రజితేషు చ॥ 9
పరిచారేషు తీర్థేషు వివిధేష్వాకరేషు చ।
విజ్ఞాతవ్యా మనుష్యై స్తైః తర్కయా సువినీతయా॥ 10
వారు మారువేషంతో ధనధాన్యాలతో సమృద్ధిమై జనసమూహాలతో నిండిన దేశాలకు వెళ్ళాలి. అక్కడ అందమైన సభలలో; సిద్ధులు, సన్యాసులు, మహాత్ములు ఉండే ఆశ్రమాలలో; రాజనగరాలలో, నానావిధాలయిన తీర్థాలలో, సర్వోత్తమ స్థానాలలో నివసించే మనుష్యులను వినయపూర్వకంగా యుక్తితో అడిగి ఊహతో పాండవులుండే తావును గుర్తించాలి. (9,10)
వివిధైః తత్పరైః సమ్యక్ తజ్ఞైః నిపుణసంవృతైః।
అన్వేష్టవ్యాః సునిపుణైః పాండవాశ్ఛన్నవాసినః॥ 11
నదీకుంజేషు తీర్థేషు గ్రామేషు నగరేషు చ।
ఆశ్రమేషు చ రమ్యేషు పర్వతేషు గుహాసు చ॥ 12
పాండవులు మారువేషంతో రహస్యస్థానంలో నివసిస్తూంటారు. కాబట్టి కార్యసాధన తత్పరులూ, వారిని బాగా గుర్తించిన గలిగిన బుద్ధిమంతులూ మారువేషాలు ధరించి, మిక్కిలి నిపుణంగా ప్రవర్తించాలి. ఇలా పలువురు గూఢచారులు నదుల ఒడ్డున ఉండే పొదరిళ్ళలో, తీర్థాలలో, గ్రామాలలో, నగరాలలో, అందమైన ఆశ్రమాలలో, పర్వతాలలో, గుహలలో వారిని వెదకండి. (11,12)
అథాగ్రజానంతరజః పాపభావానురాగవాన్।
జ్యేష్ఠం దుశ్శాసనస్తత్ర భ్రాతా భ్రాతర మబ్రవీత్॥ 13
తరువాత పాపభావమందనురక్తి కలవాడు. దుర్యోధనుని పెద్ద తమ్ముడూ అయిన దుశ్శాసనుడు తన అన్నయ్యతో ఇలా అన్నాడు. (13)
యేషు నః ప్రత్యయో రాజన్ చారేషు మనుజాధిప।
తే యాంతు దత్తదేయా వై భూయస్తాన్ పరిమార్గితుమ్॥ 14
రాజా! మనకు బాగా విశ్వాసంగల గూఢచారులకు ఇవ్వదగిన సాధనాలన్నీ ఇచ్చి మరల పాండవులను వెదకడానికి పంపండి. (14)
ఏతచ్చ కర్ణో యత్ ప్రాహ సర్వ మీహామహే తథా।
యథోద్దిష్టం చరాస్సర్వే మృగయంతు యతస్తతః॥ 15
కర్ణుడు చెప్పిన దంతా మనం చేద్దాం. అతడు చెప్పిన స్థానాలన్నింటిలో గూఢచారులు సంచరించి పాండవులను వెదకాలి. (15)
ఏతే చాన్యే చ భూయాంసః దేశాద్ దేశం యథావిధి।
న తు తేషాం గతిర్వాసః ప్రవృత్తి శ్చోపలభ్యతే॥ 16
వారూ, ఇంకా ఇతరులూ ఒక దేశాన్నుండి మరొక దేశం వెళ్ళి యథావిధిగా వెదకాలి. ఇంతవరకు పాండవులు చేరదగిన చోటు, నివాసం, వారిప్రవర్తన కొంచెం కూడా తెలియలేదు. (16)
అత్యంతం చ నిగూఢాస్తే పారం చోర్మిమతో గతాః।
వ్యాలైశ్చాపి మహారణ్యే భక్షితాః శూరమానివః॥ 17
పాండవులు మిక్కిలి రహస్యస్థానంలో ఉన్నారో! సముద్రానికి ఆవలితీరానికి వెళ్ళారో! లేదా ఆ మహావనంలోనే మిక్కిలి శూరవీరుల మనుకునే ఆ పాండవులను కొండచిలువలు మింగాయేమో! (17)
అథవా విషమం ప్రాప్య వినష్టాః శాశ్వతీస్సమాః।
తస్మాన్మానసమవ్యగ్రం కృత్వా త్వం కురునందన।
కురు కార్యం మహోత్సాహం మన్యసే యన్నరాధిప॥ 18
లేదా చాలాకాలం విషమ పరిస్థితిలో పడి వారు శాశ్వతంగా నశించిపోయారో! కురునందనా! మనుజేశ్వరా! మీరు మనస్సును స్వస్థపరచుకొని సరైన దానిని నిండు ఉత్సాహంతో చెయ్యండి. (18)
ఇతి శ్రీమహాభారతే విరాటపర్వణి గోహరణపర్వణి కర్ణదుశ్శాసనవాక్యే షడ్వింశోఽధ్యాయః॥ 26 ॥
ఇది శ్రీమహాభారతమున విరాటపర్వమున గోహరణ పర్వమను ఉపపర్వమున చారులను పంపుటలో కర్ణదుశ్శాసనుల అభిప్రాయము అను ఇరువది ఆరవ అధ్యాయము. (26)