25. ఇరువది అయిదవ అధ్యాయము
(గోహరణ పర్వము)
దుర్యోధనుని వేగులు పాండవుల జాడతెలియక, తిరిగివచ్చుట.
వైశంపాయన ఉవాచ
(కీచకే తు హతే రాజా విరాటః పరవీరహ।
శోక మాహారయత్తీవ్రం సామాత్యః సపురోహితః॥)
వైశంపాయనుడు అన్నాడు. రాజా! కీచకుడు మరణించిన తరువాత శత్రువీరులను సంహరించే విరాట మహారాజు మంత్రిపురోహితులతోకలిసి చాలా దుఃఖించాడు.
కీచకస్య తు ఘాతేన సానుజస్య విశాంపతే।
అత్యాహితం చింతయిత్వా వ్యస్మయంత పృథగ్జనాః॥ 1
సోదరసహితంగా కీచకుడు చంపబడడం చేత నగరంలోని సామాన్య జనులంతా దీనిని పెద్ద దుర్ఘటనగా చాలా దుస్సాహసంతో కూడిన పనిగా తలచి ఆశ్చర్యపోయారు. (1)
తస్మిన్ పురే జనపదే సంజల్పోఽభూచ్చ సంఘశః।
శౌర్యాద్ధి వల్లభో రాజ్ఞః మహాసత్త్వః స కీచకః॥ 2
ఆ నగరంలోను, దేశంలోనూ కూడా జనం గుంపులు గుంపులుగా గుమికూడి మహాబలవంతుడయిన కీచకుడు తన శౌర్యంచేత మహారాజుకు చాలా ప్రియమయిన వాడు అనుకొంటున్నారు. (2)
ఆసీత్ ప్రహర్తా సైన్యానాం దారామర్శీ చ దుర్మతిః।
స హతః ఖలు పాపాత్మా గంధర్వైర్దుష్టపూరుషః॥ 3
అతడు ఎన్నో శత్రుసైన్యాలను నాశనం చేశాడు. కాని అతనిది దుర్బుద్ధి. వాడు పరస్త్రీలను బలాత్కారం చేసే పాపాత్ముడు, దుష్టుడు. కాబట్టి గంధర్వులతనిని సంహరించారు. (3)
ఇత్యజల్పన్ మహారాజ పరానీకవినాశనమ్।
దేశే దేశే మనుష్యాశ్చ కీచకం దుష్ప్రధర్షణమ్॥ 4
జనమేజయా! శత్రుసంహారం చేసే దుర్ధర్ష వీరుడయిన కీచకుని గూర్చి దేశదేశాల్లో జనం ఇలా మాట్లాడుకుంటున్నారు. (4)
అథ వై ధార్తరాష్ట్రేణ ప్రయుక్తా యే బహిశ్చరాః।
మృగయిత్వా బహూన్ గ్రామాన్ రాష్ట్రాణి నగరాణి చ॥ 5
సంవిధాయ యథాదృష్టం యథాదేశప్రదర్శనమ్।
కృతకృత్యా న్యవర్తంత తే చరా నగరం ప్రతి॥ 6
దుర్యోధనుడు పంపిన చారులు పాండవులను గుర్తించడం కోసం ఇతరదేశాలలో సంచరిస్తూ ఎన్నో గ్రామాలు, నగరాలు, దేశాలు వెదికారు. వారన్ని ప్రదేశాలలో అంతటా వెదకి ఆ విషయం వెల్లడించడానికి మరల హస్తినాపురానికి తిరిగి వచ్చారు. (5,6)
తత్ర దృష్ట్వా తు రాజానం కౌరవ్యం ధృతరాష్ట్రజమ్।
ద్రోణ కర్ణ కృపైః సార్దం భీష్మేణ చ మహాత్మనా॥ 7
సంగతం భ్రాతృభిశ్చాపి త్రిగర్తైశ్చ మహారథైః।
దుర్యోధనం సభామధ్యే ఆసీనమిదమబ్రువన్॥ 8
వారక్కడ ధృతరాష్ట్రకుమారుడు, కురురాజు అయిన దుర్యోధనుని కలిశారు. ద్రోణుడు, కర్ణుడు, కృపాచార్యుడు, మహాత్ముడయిన భీష్ముడు, తనసోదరులందరీ, మహారథికుడయిన త్రిగర్తుడూ ఆసీనులయిన రాజసభలో అతడు కూర్చొని ఉన్నాడు. అతనితో గూఢచారు లిలా చెప్పారు. (7,8)
చరా ఊచుః
కృతోఽస్మాభిః పరో యత్నః తేషామన్వేషణే సదా।
పాండవానాం మనుష్యేంద్ర తస్మిన్ మహతి కాననే॥ 9
గూఢచారులన్నారు.' నరేంద్రా! ఆ విశాలారణ్యంలో పాండవుల్ని వెదకడం కోసం సదా గొప్ప ప్రయత్నం చేశాం.
నిర్జనే మృగసంకీర్ణే నానాద్రుమలతాకులే।
లతాప్రతానబహులే నానాగుల్మసమావృతే॥ 10
న చ విద్మో గతా యేన పార్థాః సుదృఢవిక్రమాః।
మార్గమాణాః పదన్యాసం తేషు తేషు తథా తథా॥ 11
అనేక వృక్షాలతో, లతలతో వ్యాపించి పొదలతోనూ, మృగాలతోనూ, నిండిన నిర్జనవనంలో సుదృఢ విక్రమం కల పాండవుల పాదాల గుర్తులు వెదికాము. అయినా వారేమార్గంలో వెళ్ళారో తెలియలేదు. (10,11)
గిరికూటేషు తుంగేషు నానాజనపదేషు చ।
జనాకీర్ణేషు దేశేషు ఖర్వటేషు పురేషు చ॥ 12
నరేంద్ర బహుశోఽన్విష్టాః నైవ విద్మశ్చ పాండవాన్।
అత్యంతం వా వినష్టా స్తే భద్రం తుభ్యం నరర్షభ॥ 13
మహారాజా! ఎత్తైన పర్వత శిఖరాల మీద, వేరు వేరు దేశాలలో, జనం గుంపులుగా ఉన్నచోట్ల, కొండలోయ గ్రామాలలో, పట్టణాలలో చాలా వెదికాము. ఎక్కడా పాండవుల జాడ తెలియలేదు. నరశ్రేష్ఠా! మీకు శుభం కలుగుగాక! వాళ్ళు పూర్తిగా నశించి పోయి ఉంటారు. (12,13)
వర్త్మన్యన్వేష్యమాణా వై రథినాం రథిసత్తమ।
న హి విద్మో గతిం తేషాం వాసం హి నరసత్తమ॥ 14
రథికులలో శ్రేష్ఠుడా! మేము రథాలు వెళ్ళే బాటలో కూడా అన్వేషించాము. పాండవు లెలా వెళ్ళారో, ఎక్కడ ఉన్నారో మాకు తెలియలేదు. (14)
కించిత్కాలే మనుష్యేంద్ర సూతానామనుగా వయమ్।
మృగయిత్వా యథాన్యాయం వేదితార్థాః స్మ తత్త్వతః॥ 15
మానవేంద్రా! కొంతకాలం మేము వారి రథ సారథుల వెంట వెళ్ళాము. బాగా వెదికాము. ఒక యథార్థ విషయాన్ని తెలుసుకొన్నాము. (15)
ప్రాప్తా ద్వారవతీం సూతా వినా పార్థైః పరంతప।
న తత్ర కృష్ణా రాజేంద్ర పాండవాశ్చ మహావ్రతాః॥ 16
ఆ పాండవరథసారథులు ద్వారకానగరానికి వెళ్ళారు. రాజేంద్రా! అక్కడ ద్రౌపదిగాని, మహావ్రతాన్ని పూనిన పాండవులు గాని లేరు. (16)
సర్వథా విప్రణష్టాస్తే నమస్తే భరతర్షభ।
న హి విద్మో గతిం తేషాం వాసం వాపి మహాత్మనామ్॥
పాండవానాం ప్రవృత్తిం చ విద్మః కర్మాసి కిం కృతమ్॥ 17
స నః శాధి మనుష్యేంద్ర అత ఊర్ధ్వం విశాంపతే॥ 18
వారన్ని విధాలా నశించి ఉంటారు. భరత శ్రేష్ఠా! మీకు నమస్కారం. మహాత్ములయిన పాండవుల మార్గంకాని, నివాస స్థానం కాని, ప్రవర్తన కాని, వాళ్ళు చేసిన పనిని గూర్చి కాని తెలియలేదు. మానవేంద్రా! ఈపైన మేము చెయ్యవలసిన పనిని ఆజ్ఞాపించు. (17,18)
అన్వేషణే పాండవానాం భూయః కిం కరవామహే।
ఇమాం చ నః ప్రియాం వీర వాచం భద్రవతీం శృణు॥ 19
పాండవులను వెదకడం కోసం మేం మళ్ళీ ఏం చేయాలి? వీరా! మా యీ మాట వినండి. ఇది మీకు ప్రియమైనది. దీనిలో మీకు మంగళకరమయిన సమాచారముంది. (19)
యేన త్రిగర్తా నిహతాః బలేన మహతా నృప।
సూతేన రాజ్ఞో మత్స్యస్య కీచకేన బలీయసా॥ 20
స హతః పతితః శేతే గంధర్వైర్నిశి భారత।
అదృశ్యమానై ర్దుష్టాత్మా భ్రాతృభి స్సహ సోదరైః॥ 21
రాజా! మత్స్యరాజుకు మహాబలవంతుడు, సూత పుత్రుడు, అయిన సేనాని కీచకుడున్నాడు. అతడు త్రిగర్తదేశాన్ని, ఆ దేశవాసులను ఓడించాడు. భారతా! గంధర్వులు గుప్తరూపంలో రాత్రివేళ కీచకుని, అతని సోదరులను చంపివేశారు. (20,21)
(శ్యాలో రాజ్ఞో విరాటస్య సేనాపతిరుదారధీః।
సుదేష్ణాయాః స వై జ్యేష్ఠః శూరో వీరో గతవ్యథః॥
ఉత్సాహవాన్ మహావీర్యః నీతిమాన్ బలవానపి।
యుద్ధజ్ఞో రిపువీరఘ్నః సింహతుల్యపరాక్రమః॥
ఉదారబుద్ధిగల కీచకుడు విరాటరాజుసేనాపతి, బావమఱిది సుదేష్ణాదేవికి పెద్దన్నయ్య, కీచకుడు శూరుడు, వీరుడు, వ్యథలేనివాడు, ఉత్సాహం, మహాపరాక్రమం కలవాడు, నీతిమంతుడు, బలవంతుడు, యుద్ధకళ నెరిగినవాడు, శత్రువీరులను సంహరించే సమర్థుడు, సింహసమానమైన పరాక్రమం కలవాడు.
ప్రజారక్షణదక్షశ్చ శత్రుగ్రహణశక్తిమాన్।
విజితారిర్మహాయుద్ధే ప్రచండో మానవత్ పరః॥
నరనారీ మనోహ్లాదీ ధీరో వాగ్మీ రణప్రియః।
అతడు ప్రజారక్షణలో కుశలుడు, శత్రువులను బంధించగలవాడు. గొప్ప గొప్ప యుద్ధాల్లో శత్రువుల నోడించి విజయం పొందేవాడు, మిక్కిలి క్రోధం కలవాడు, అభిమానవంతుడు, స్త్రీ పురుషుల మనస్సుల కాహ్లాదం కలిగించేవాడు, ధీరుడు, మాట్లాడడంలో చతురుడు, రణప్రియుడు.
స హతో నిశి గంధర్వైః స్త్రీనిమిత్తం నరాధిప।
అమృష్యమాణో దుష్టాత్మా నిశీథే సహ సోదరైః॥
సుహృదశ్చాస్య నిహతాః యోధాశ్చ ప్రవరా హతాః।)
అసహనం కలవాడు దుర్మార్గుడు అయిన కీచకుడు తమ్ములతో సహా ఒక స్త్రీ కారణంగా అర్ధరాత్రి గంధర్వులచేత చంపబడ్డాడు. అతని ప్రియమిత్రులు, శ్రేష్ఠయోధులూ కూడా మరణించారు.
ప్రియమేతదుపశ్రుత్య శత్రూణాం చ పరాభవమ్।
కృతకృత్యశ్చ కౌరవ్య విధత్స్వ యదనంతరమ్॥ 22
కురునందనా! శత్రుపరాభవాన్ని తెలిపే యీ ప్రియవిషయాన్ని విని కృతకృత్యులై తరువాత చేయవలసిన దానిని చేయండి. (22)
ఇతి శ్రీమహాభారతే విరాట పర్వణి గోహరణ పర్వణి చారప్రత్యాగమనే పంచవింశోఽధ్యాయః॥ 25 ॥
ఇది శ్రీమహాభారతమున విరాటపర్వమున గోహరణపర్వమను ఉపపర్వమున చారులు తిరిగివచ్చుట అను ఇరువది అయిదవ అధ్యాయము. (25)
(దాక్షిణాత్య ప్రతి అధికపాఠం 6 శ్లోకాలు కలిపి 28 శ్లోకాలు)