28. ఇరువది ఎనిమిదవ అధ్యాయము
భీష్ముడు ధర్మరాజు మహిమను చెప్పుట.
వైశంపాయన ఉవాచ
తత శ్శాంతనవో భీష్మః భరతానాం పితామహః।
శ్రుతవాన్ దేశకాలజ్ఞః తత్త్వజ్ఞః సర్వధర్మవిత్॥ 1
ఆచార్య వాక్యోపరమే తద్వాక్య మభిసందధత్।
హితార్థం సమువాచైనాం భారతీం భారతాన్ ప్రతి॥ 2
వైశంపాయనుడు అన్నాడు.
తరువాత భరత వంశీయులకు తాత, దేశకాలాల నెరిగిన వేదశాస్త్ర విద్వాంసుడు, తత్త్వజ్ఞాని, సంపూర్ణంగా ధర్మాల నెరిగినవాడు, శంతసుకుమారుడు అయిన భీష్ముడు ద్రోణుని మాటలు విని ఆయన మాటలతో సొందు పడేరీతిగా, కౌరవుల హితం కోసం వారితో ఇలా చెప్పాడు. (1,2)
యుధిష్ఠిరే సమాసక్తాం ధర్మజ్ఞే ధర్మసంవృతామ్।
అసత్సు దుర్లభాం నిత్యం సతాంచాభిమతాం సదా॥ 3
ధర్మరాజుకు సంబంధించిన ఈ పలుకులు ధర్మంతో కూడినవి. అవి దుష్టపురుషులకు దుర్లభాలు. సత్పురుషులకు ఎల్లపుడూ ఇష్టమయినవి. (3)
భీష్మః సమవదత్తత్ర గిరం సాధుభిరర్చితామ్।
యశ్చైష బ్రాహ్మణః ప్రాహ ద్రోణః సర్వార్థతత్త్వవిత్॥ 4
భీష్ముడు సత్పురుషులు ప్రశంసించే మంచి వాక్యాలిలా చెప్పాడు. 'అన్ని విషయాల తత్త్వం తెలిసిన బ్రాహ్మణ శ్రేష్ఠుడు ద్రోణాచార్యుడు. ఆయన చెప్పినది సరియైనది. (4)
సర్వలక్షణసంపన్నాః సాధువ్రతసమన్వితాః।
శ్రుతవ్రతోపపన్నాశ్చ నానాశ్రుతిసమన్వితాః॥ 5
వృద్ధానుశాసనే యుక్తాః సత్యవ్రతపరాయణాః।
సమయం సమయజ్ఞాస్తే పాలయంతః శుచివ్రతాః॥ 6
వాస్తవానికి పాండవులు సమస్తశుభలక్షణాలతో కూడినవారు, సత్పురుషులకు తగిన నియమాలను వ్రతాలను పాలించడంలో తత్పరులు, వేదోక్తవ్రతాలను పాటించేవారు. వివిధ వేదాల నెరిగినవారు, పెద్దవారి ఉపదేశాలను, ఆదేశాలను తలదాల్చేవారు. సత్యవ్రత పరాయణులు, శుద్ధవ్రతాన్ని ధరించేవారు, వా రజ్ఞాతవాసానికి గడువు ఎరుగుదురు. కాబట్టి దానిని పాలిస్తారు. (5,6)
క్షత్రధర్మరతా నిత్యం కేశవానుగతాస్సదా।
ప్రవీరపురుషాస్తేవై మహాత్మానో మహాబలాః॥
నావసీదితు మర్హంతి ఉద్వహంతః సతాం ధురమ్॥ 7
పాండవులు క్షత్రియధర్మంలో నిత్యానురక్తులై భగవంతుడయిన శ్రీకృష్ణుని సదా అనుసరిస్తూ ఉంటారు. వా రుత్తమవీరులు, మహాత్ములు, మహాబలవంతులు, సాధుపురుషులకు తగిన ధర్మభారాన్ని వహించే వారు క్షీణించిపోరు. (7)
ధర్మతశ్చైవ గుప్తాస్తే సువీర్యేణ చ పాండవాః।
న నాశమధిగచ్ఛేయుః ఇతి మే ధీయతే మతిః॥ 8
పాండవులు తమ ధర్మంచేతనూ, ఉత్తమ పరాక్రమం చేతనూ సురక్షితులు. కాబట్టి వారు నశించరని నా నిశ్చయం. (8)
తత్ర బుద్ధిం ప్రవక్ష్యామి పాండవాన్ ప్రతి భారత।
న తు నీతిః సునీతస్య శక్యతేఽన్వేషితుం పరైః॥ 9
భరతనందనా! పాండవుల విషయంలో నాబుద్ధి నిశ్చయం చెపుతాను. ఉత్తమనీతికలవాని నీతిని ఇతరు లన్వేషించ లేరు. (9)
యత్తు శక్య మిహాస్మాభిః తాన్ వై సంచింత్య పాండవాన్।
బుద్ధ్యా ప్రయుక్తం న ద్రోహాత్ ప్రవక్ష్యామి నిబోధ తత్॥ 10
పాండవుల విషయంలో మనబుద్ధితో బాగా ఆలోచించి మనకు శక్యమైన ఉపాయాన్ని మనం ఆచరించాలి. వారికి ద్రోహం చేయడం కోసం కాదు, నీమంచి కోసం చెపుతాను. ఏకాగ్రంగా విను. (10)
న త్వియం మాదృశైర్నీతిః తస్య వాచ్యా కథంచన।
సా త్వియం సాధు వక్తవ్యా న త్వనీతిః కథంచన॥ 11
యుధిష్ఠిరుని నీతిని నావంటి వారు నిందింప రాదు. అది మంచినీతి అనే చెప్పాలి. అది నీతి కాదని చెప్పడం ఏవిధంగానూ సరికాదు. (11)
వృద్ధానుశాసనే తాత తిష్ఠతా సత్యశాలినా।
అవశ్యం త్విహ ధీరేణ సతాం మధ్యే వివక్షతా॥ 12
యథార్థమిహ వక్తవ్యం సర్వథా ధర్మలిప్సయా।
నాయనా! పెద్దల మాటను పాటించేవాడు, సత్యశాలి అయిన ధీరుడు సజ్జనసమాజంలో ఏదైనా చెప్పదలిస్తే, ధర్మకాంక్షతో సత్యమూ, ఉచితమూ అయిన మాటనే చెప్పాలి. (12 1/2)
తత్ర నాహం తథా మన్యే యథాయమితరో జనః।
నివాసం ధర్మరాజస్య వర్షేఽస్మిన్ వై త్రయోదశే॥ 13
కాబట్టి యీ పదమూడవ సంవత్సరంలో ధర్మరాజు నివాసం విషయంలో ఇతరులు బావిస్తున్నట్లు నేను భావించడం లేదు. (13)
తత్ర తాత న తేషాం హి రాజ్ఞాం భావ్యమసాంప్రతమ్॥ 14
పురే జనపదే చాపి యత్ర రాజా యుధిష్ఠిరః॥
దానశీలో వదాన్యశ్చ నిభృతో హ్రీనిషేవకః।
జనో జనపదే భావ్యః యత్ర రాజా యుధిష్ఠిరః॥ 15
నాయనా! యుధిష్ఠిరుడు నివసిస్తున్న నగరంలో కానీ గ్రామంలో కానీ, రాజులకు అశుభం కలగదు. ధర్మరాజు ఉన్న జనపదంలో నివసించే జనానికి దానశీలం, ప్రియవాదిత్వం, జితేంద్రియత్వం, ఔదార్యం, వినయం, లజ్జాశీలం ఉంటాయి. (14,15)
ప్రియవాదీ సదా దాంతః భవ్యః సత్యపరో జనః।
హృష్టః పుష్టః శుచిర్దక్షః యత్ర రాజా యుధిష్ఠిరః॥ 16
ధర్మరాజున్నచోట మనుష్యులు సదా ప్రియం పలికేవారు, జితేంద్రియులు, కల్యాణభాజనులు, సత్యపరాయణులు, సంతోషమూ, పుష్టి కలవారు, పవిత్రులు, కార్యకుశలులూ అవుతారు. (16)
నాసూయకో నచాపీర్షుః నాభిమానీ న మత్సరీ।
భవిష్యతి జనస్తత్ర స్వయం ధర్మమనువ్రతః॥ 17
అక్కడ ఇతరుల దోషాలను చూసేవారు, ఈర్ష్యాళువులూ, దురభిమానమూ, మాత్సర్యమూ కలవారూ ఉండరు. అచ్చట జనులంతా స్వయంగా ధర్మతత్పరులౌతారు. (17)
బ్రహ్మఘోషాశ్చ భూయాంసః పూర్ణాహుత్యస్తథైవ చ।
క్రతవశ్చ భవిష్యంతి భూయాంసో భూరిదక్షిణాః॥ 18
అక్కడ ఎక్కువగా వేదధ్వని వినబడుతుంది. యజ్ఞాలలో పూర్ణాహుతులు ఇస్తూ ఉంటారు. గొప్ప దక్షిణలు గల యజ్ఞాలు జరుగుతుంటాయి. (18)
సదా చ తత్ర పర్జన్యః సమ్యగ్వర్షీ న సంశయః।
సంపన్నసస్యా చ మహీ నిరాతంకా భవిష్యతి॥ 19
అక్కడ ఎప్పుడూ మేఘం సరిగా సకాలంలో వర్షిస్తుంది. దీనిలో సంశయంలేదు. అక్కడ భూమి సస్యసంపన్నంగా క్షోభరహితంగా ఉంటుంది. (19)
గుణవంతి చ ధాన్యాని రసవంతి ఫలాని చ।
గంధవంతి చ మాల్యాని శుభశబ్దా చ భారతీ॥ 20
అక్కడ ధాన్యాలు గుణవంతంగా ఉంటాయి. పళ్ళు రసంతో ఉంటాయి. పూలదండలు సుగంధంతోను, వాక్కులు మంగళ శబ్దాలతోను నిండి ఉంటాయి. (20)
వాయుశ్చ సుఖసంస్పర్శః నిష్ప్రతీపం చ దర్శనమ్।
న భయం త్వావిశే త్తత్ర యత్ర రాజా యుధిష్ఠిరః॥ 21
అక్కడి గాలి సుఖస్పర్శ నిస్తుంది. దర్శనం ఋజువుగా ఉంటుంది./వక్రదృష్టి ఉండదు./ధర్మబ్రహ్మ స్వరూప విచారణ ఉంటుంది. ధర్మరాజున్నచోట భయం ప్రవేశించదు. (21)
గావశ్చ బహులా స్తత్ర న కృశా న చ దుర్బలాః।
పయాంసి దధిసర్పీంషి రసవంతి హితాని చ॥ 22
అక్కడ ఆవులు ఎక్కువగా ఉంటాయి. అవి బక్కగా బలహీనంగా ఉండవు. వాటి పాలు, పెరుగు, నెయ్యి, బాగా రుచిగా హితకరంగా ఉంటాయి. (22)
గుణవంతి చ పేయాని భోజ్యాని రసవంతి చ।
తత్ర దేశే భవిష్యంతి యత్ర రాజా యుధిష్ఠిరః॥ 23
ధర్మరాజున్నచోట సద్గుణాలు కల పానీయాలు. రసవంతమయిన భోజన పదార్థాలు లభిస్తాయి. (23)
రసాః స్పర్శాశ్చ గంధాశ్చ శబ్దాశ్చాపి గుణాన్వితాః।
ద్రవ్యాని చ ప్రసన్నాని యత్ర రాజా యుధిష్ఠిరః॥ 24
యుధిష్ఠిరరాజున్నచోట రసం, స్పర్శ, గంధం, శబ్దం అన్ని విషయాలు గుణం కలిగి ఉంటాయి. మనసు ప్రసన్నమయ్యే దృశ్యాలు కనబడతాయి. (24)
ధర్మాశ్చ తత్ర సర్వైస్తు సేవితాశ్చ ద్విజాతిభిః।
స్వైః స్వైర్గుణైశ్చ సంయుక్తాః అస్మిన్ వర్షే త్రయోదశే॥ 25
ఈ పదమూడవ సంవత్సరంలో ధర్మరాజున్న చోట బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు తమ తమ ధర్మాలను పాలిస్తారు. ధర్మం కూడా తన గుణాలతో ప్రభావంతో కూడి ఉంటుంది. (25)
దేశే తస్మిన్ భవిష్యంతి తాత పాండవసంయుతే।
సంప్రీతిమాన్ జనస్తత్ర సంతుష్టః శుచిరవ్యయః॥ 26
నాయనా! పాండవులున్న దేశంలో అన్ని విశేషాలూ ఉంటాయి. అక్కడి జనం ప్రసన్నులు, సంతుష్టులు, పవిత్రులు, వికారహితులూ(అకాలమరణం లేనివారు) అవుతారు. (26)
దేవతాతిథిపూజాసు సర్వభావానురాగవాన్।
ఇష్టదానో మహోత్సాహః స్వస్వధర్మపరాయణః॥ 27
దేవతలకు, అథిథులకు చేసే పూజలలో సర్వాత్మనా అనురాగం ఉంటుంది. జనులందరికీ దాన మందు ఇష్టం. అందరిలో బాగా ఉత్సాహం ఉంటుంది. అంతా తమ తమధర్మాన్ని పాలించడంలో ఆసక్తులై ఉంటారు. (27)
అశుభాద్ధి శుభప్రేప్సుః ఇష్టయజ్ఞః శుభవ్రతః।
భవిష్యతి జన స్తత్ర యత్ర రాజా యుధిష్ఠిరః॥ 28
ధర్మరాజున్నచోట ప్రజలు అశుభాన్ని వదిలి శుభాన్ని కోరతారు. యజ్ఞాలను ఆచరించడం వారికి అభీష్టకార్యం అవుతుంది. శ్రేష్ఠవ్రతాలను పాటిస్తారు. (28)
త్యక్తవాక్యానృతస్తాత శుభకల్యాణమంగళః।
శుభార్థేప్సుః శుభమతిః యత్ర రాజా యుధిష్ఠిరః॥ 29
ధర్మరాజున్నచోట అసత్యభాషణం లేనివారు, శుభాన్ని, కల్యాణాన్ని, శుభ వస్తువులను కోరేవారు, శుభంపై మనస్సు లగ్నం చేసేవారు ఉంటారు. (29)
భవిష్యతి జన స్తత్ర నిత్యం చేష్టప్రియవ్రతః।
ధర్మాత్మా శక్యతే జ్ఞాతుం నాపి తాత ద్విజాతిభిః॥ 30
కింపునః ప్రాకృతౌస్తాత పార్థో విజ్ఞాయతే క్వచిత్।
యస్మిన్ సత్యం ధృతిర్దానం పరా శాంతి ర్ధువా క్షమా॥ 31
హ్రీః శ్రీః కీర్తిః పరం తేజ ఆనృశంస్యమథార్జవమ్।
యుధిష్ఠిరుడు ధర్మాత్ముడు. ఎల్లప్పుడు ఇష్టజనులకు ప్రియం కలిగించడం అతని వ్రతం. సత్యం, ధైర్యం, దానం, పరమశాంతి, స్థిరమయిన ఓరిమి, సిగ్గు, సంపద, కీర్తి, తేజస్సు, దయాళుత్వం, సరళత్వం మొదలయిన గుణాలు ధర్మరాజుకున్నాయి. ద్విజులు కూడా పాండవులను గుర్తించలేరు కాబట్టి సాధారణ మనుషుల మాట చెప్పేదేమిటి? (30,31)
తస్మాత్ తత్ర నివాసం తు ఛన్నం యత్నేన ధీమతః।
గతిం చ పరమాం తత్ర నోత్సహే వక్తు మన్యథా॥ 32
కాబట్టి పై సులక్షణాలు కలిగిన చోటు బుద్ధిమంతుడయిన యుధిష్ఠిరుడు ప్రయత్నపూర్వకంగా దాగిన నివాసస్థానం. అదే అతని ఉత్కృష్టమయిన ఆశ్రమం. దీనికి విరుద్ధంగా నేనేమాటా చెప్పలేను. (32)
ఏవ మేతత్ తు సంచింత్య యత్కృతే మన్యసే హితమ్।
తత్ క్షిప్రం కురు కౌరవ్య యద్యేవం శ్రద్దధాసి మే॥ 33
కురునందనా! నామాటపై నీకు నమ్మకముంటే ఈ విషయం ఆలోచించి, ఏపని చేస్తే నీకు హితం కలుగుతుందని అనుకుంటావో ఆ పని వెంటనే చెయ్యి. (33)
ఇతి శ్రీమహాభారతే విరాటపర్వణి గోహరణ పర్వణి చారప్రత్యాచారే భీష్మవాక్యే అష్టావింశోఽధ్యాయః॥ 28 ॥
ఇది శ్రీమహాభారతమున విరాటపర్వమున గోహరణ పర్వమను ఉపపర్వమున భీష్ముని అభిప్రాయమను ఇరువదియెనిమిదవ అధ్యాయము. (28)