20. ఇరువదియవ అధ్యాయము

ద్రౌపది తన కష్టమును భీమునకు తెలుపుట.

ద్రౌపద్యువాచ
అహం సైరంధ్రివేషేణ చరంతీ రాజవేశ్మని।
శౌచదాస్మి సుదేష్ణాయాః అక్షధూర్తస్య కారణాత్॥ 1
ద్రౌపది చెపుతోంది. 'పరంతపా! జూదంలో ఆసక్తికల మీఅన్నగారి కారణంగా ఈనాడు నేను రాజభవనంలో సైరంధ్రీ వేషంలో సుదేష్ణాదేవికి స్నానానికి కావలసిన వస్తువులు సమకూర్చి సేవిస్తున్నాను. (1)
విక్రియాం పశ్య మే తీవ్రాం రాజపుత్ర్యాః పరంతప।
ఆత్మకాలముదీక్షంతీ సర్వం దుఃఖం కిలాంతవత్॥ 2
రాజకుమారిని అయిఉండి కూడా ఎంత నీచమయిన పని చేయవలసివచ్చిందో చూడు. కాని కష్టాలు వచ్చినపుడు, అవి ఎప్పటికైనా తీరుతాయని అనుకూలసమయంకోసం ఎదురుచూస్తూ ఉన్నాను. (2)
వి॥సం॥ సుఖస్యానంతరం దుఃఖం దుఃఖస్యానంతరం సుఖమ్।
సుఖం తర్వాత దుఃఖం, దుఃఖం తర్వాత సుఖం సహజం. ద్రౌపది దుఃఖావసానసమయానికై ఎదురుచూస్తున్నది. (విష)
అనిత్యా కిల మర్త్యానామ్ అర్థసిద్ధిర్జయాజయౌ।
ఇతి కృత్వా ప్రతీక్ష్యామి భర్తౄణాముదయం పునః॥ 3
మానవులకు పురుషార్థసిద్ధి, జయ పరాజయాలు అనిత్యాలు. ఇది తలచుకునే నేను నా భర్తల అభ్యుదయానికై ఎదురుచూస్తున్నాను. (3)
చక్రవత్పరివర్తంతే హ్యార్థాశ్చ వ్యసనాని చ।
ఇతి కృత్వా ప్రతీక్ష్యామి భర్తౄణాముదయం పునః॥ 4
ధనంకాని, వ్యసనంకాని(సంపత్తి-విపత్తి) ఎప్పుడూ బండి చక్రంలా తిరుగుతూనే ఉంటాయి. ఇది ఆలోచించే నేను నా భర్తల పునరభ్యుదయం కోసం ఎదురుచూస్తున్నాను. (4)
య ఏవ హేతుర్భవతి పురుషస్య జయావహః।
పరాజయే చ హేతుశ్చ స ఇతి ప్రతిపాలయే।
కిం మాం న ప్రతిజానీషే భీమసేన మృతామివ॥ 5
మనిషికి విజయాన్ని చేకూర్చి పెట్టే కాలమే పరాజయానికీ కారణమవుతుంది. ఇది తెలిసే నేను నా పక్షానికి విజయం
కలిగే దారిని ప్రతీక్షిస్తున్నాను. భీమసేనా! ఈ దుఃఖాల తాకిడితో నేను జీవచ్ఛవంలా ఉన్నానని నీకు తెలియదా? (5)
దత్వా యాచంతి పురుషాః హత్వా వధ్యంతి చాపరే।
పాతయిత్వా చ పాత్యంతే పరైరితి చ మే శ్రుతమ్॥ 6
దానం చేసినవారే ఎప్పటికయినా యాచకులుగా మారతారని, ఇతరులను చంపేవారు ఎందరో ఇతరుల చేతిలో చస్తూఉంటారు అని, ఎదుటివారిని దుర్దశకు తెచ్చినవారు స్వయంగా శత్రువులవలన దుర్దశకు లోనవుతారు అనీ నేను విన్నాను. (6)
న దైవస్యాతిభారోఽస్తి న చైవాస్యాతివర్తనమ్।
ఇతి చాప్యాగమం భూయః దైవస్య ప్రతిపాలయే॥ 7
కాబట్టి దైవం చేయలేనిది ఏదీ లేదు. విధి విధానాన్ని ఉల్లఘించడం అసంభవం. కనుకనే నేను దైవప్రాధాన్యాన్ని చాటిచెప్పే శాస్త్రవాక్యాల పట్ల ఆదరం చూపుతూ ఉంటాను. (7)
స్థితం పూర్వం జలం యత్ర పునస్తత్రైవ గచ్ఛతి।
ఇతి పర్యాయమిచ్ఛంతీ ప్రతీక్షే ఉదయం పునః॥ 8
నీరు మొదట ఉన్న చోటికే చేరుతుంది. ఈ క్రమాన్ని కోరే నేను తిరిగి అభ్యుదయకాలాన్ని గూర్చి ప్రతీక్షిస్తున్నాను. (8)
దైవేన కిల యస్యార్థః సునీతోఽపి విపద్యతే।
దైవస్య చాగమే యత్నః తేన కార్యో విజానతా॥ 9
ఉత్తమమైన పద్ధతిద్వారా సురక్షితమైన పదార్థం కూడా దైవం ప్రతికూలించినపుడు దాని ద్వారానే నష్ట మవుతుంది. కాబట్టి విజ్ఞుడైన పురుషుడు దైవాన్ని అనుకూలంగా మార్చుకొనేందుకే ప్రయత్నం చేయాలి. (9)
యత్ తు మే వచనస్యాస్య కథితస్య ప్రయోజనమ్।
పృచ్ఛ మాం దుఃఖితాం తత్త్వం పృష్టా చాత్ర బ్రవీమి తే॥ 10
నేను ఇప్పుడు చెప్పిన మాటలవలన ప్రయోజనం ఏమిటి? దుఃఖపడుతున్న నన్ను అడిగితే అసలు సంగతి చెప్తాను. (10)
మహిషీ పాండుపుత్రాణాం దుహితా ద్రుపదస్య చ।
ఇమామవస్థాం సంప్రాప్తా మదన్యా కా జిజీవిషేత్॥ 11
పాండవుల పట్టమహిషిని, ద్రుపదమహారాజు కూతురిని అయిఉండి కూడా ఇటువంటి దుర్దశను అనుభవిస్తున్నాను. నేను తప్ప వేరే ఏ స్త్రీ కూడా ఇలాంటి స్థితిలో జీవించాలని అనుకోదు. (11)
కురూన్ పరిభవేత్ సర్వాన్ పాంచాలానపి భారత।
పాండవేయాంశ్చ సంప్రాప్తః మమ క్లేశో హ్యరిందమ॥ 12
భరతవంశీయుడా! శత్రుసంహారకుడా! నాకు కలిగిన ఈ కష్టం సమస్తకౌరవులకు, పాంచాలురకు, పాండవులకు కూడా అవమానకరమే. (12)
భ్రాతృభిః శ్వశురైః పుత్రైః బహుభిః పరివారితా।
ఏవం సముదితా నారీ కా త్వన్యా దుఃఖితా భవేత్॥ 13
ఎంతోమంది సోదరులు, అత్త మామలు, పుత్రులు అందరూ అన్ని విధాలా ఉచ్చస్థితిలో ఉండికూడా ఇట్టి పరిస్థితిలో నేను తప్ప వేరే ఏ స్త్రీ దుఃఖాన్ని అనుభవిస్తుంది? (13)
నూనం హి బాలయా ధాతుః మయా వై విప్రియం కృతమ్।
యస్య ప్రసాదాత్ దుర్నీతం ప్రాప్తాస్మి భరతర్షభ॥ 14
భరతవంశ శ్రేష్ఠుడా! తప్పకుండా నేను చిన్నతనంలో విధిపట్ల ఏదో గొప్ప అపచారమే చేసి ఉంటా ననిపిస్తోంది. తత్ఫలితంగానే ఈనాడు ఈ దుర్దశను అనుభవిస్తున్నాను. (14)
వర్ణావకాశమపి మే పశ్య పాండవ యాదృశమ్।
తాదృశో మే న తత్రాసీద్ దుఃఖే పరమకే తదా॥ 15
పాండునందనా! చూడు. నా శరీరకాంతి ఎలా తరిగిపోయిందో! ఇప్పుడు నగరంలో నేను పడుతున్న అవస్థ ఆ రోజులలో అత్యమ్తదుఃఖపూర్ణమైన వనవాసంలో కూడా పడలేదు. (15)
వి॥సం॥ వనాలలో సాధారణమైన ఆహారం తిని సాధారణమైన నారచీరలే కట్టినా స్వాతంత్ర్యానికి లోటు లేదు. ప్రస్తుతం దివ్యాహార, దివ్యవస్త్రాలు సమకూరినా పారతంత్ర్యం తప్పలేదు. అరణ్యంలో ఆ స్వేచ్ఛతో జీవిస్తున్నపుడు ఇప్పటిలా కళాహీనత లేదు. (నీల) ఇంద్రప్రస్థంలో గానీ ద్యూతసమయంలో హస్తినాపురంలో కానీ మహాదుఃఖాన్నీ అనుభవించినా ఇంతగా కళ తప్పలేదు. (విష)
త్వమేవ భీమ జానీషే యన్మే పార్థ సుఖం పురా।
సాహం దాసీత్వమాపన్నా న శాంతిమవశా లభే॥ 16
నాదైవికమహం మన్యే యత్ర పార్థో ధనంజయః।
భీమధన్వా మహాబాహుః ఆస్తే ఛన్న ఇవానలః॥ 17
భీమసేనా! నీకూ తెలుసు.. ఇంతకు ముందు నేనెంత సుఖాన్ని అనుభవించానో. ఇక్కడకు వచ్చి దాసీగా మారినప్పటినుండి పరాధీనం కారణంగా నాకు ఏ మాత్రం కూడా శాంతి లభించడం లేదు. ఇది నేను దైవలీల అనుకొంటున్నాను. ఎందుకంటే ప్రచండమైన ధనుస్సు ధరించి ఉండే ఆజానుబాహువు అర్జునుడు కూడా నివురుగప్పిన నిప్పులా అంతఃపురంలో మరుగునపడి ఉన్నాడు. (16,17)
వి॥సం॥ 'న దైవికమిదం మన్యే' అన్న పాఠంలో 'ఇది కేవలం దైవికం కాదు. ధర్మరాజు పాడుజూదం పేర చేసిన దుష్ప్రయత్నం వలన కూడా ఏర్పడినది' అని భావం. (విష)
అశక్యా వేదితుం పార్థ ప్రాణినాం వై గతిర్నరైః।
వినిపాతమిమం మన్యే యుష్మాకం హ్యవిచింతితమ్॥ 18
కుంతీనందనా! దైవాధీనాలైన ప్రాణులు ఎప్పుడు ఏగతి పొందుతాయో మనుష్యులు తెలుసుకోలేరు. మీకు కలిగిన ఈ అవమానం ఎవరి మనసులలోనూ ఊహించి కూడా ఉండరని నేను అనుకొంటున్నాను. (18)
యస్యా మమ ముఖప్రేక్షాః యూయమింద్రసమాః సదా।
సా ప్రేక్షే ముఖమన్యాసామ్ అవరాణాం వరా సతీ॥ 19
ఒకప్పుడు ఇంద్రునితో సమానమైన పరాక్రమం గల మీ సోదరులంతా నా ముఖాన్ని చూసి ఎప్పుడూ పొగడుతూ ఉండేవారు. అట్టి శ్రేష్ఠురాలనైన నేనే ఈనాడు నికృష్టలైన వేరే స్త్రీలముఖాలను పొగడవలసి వస్తోంది. (19)
పశ్య పాండవ మేఽవస్థాం యథా నార్హామి వై తథా।
యుష్మాసు ధ్రియమాణేషు పశ్య కాలస్య పర్యయమ్॥ 20
యస్యాః సాగరపర్యంతా పృథివీ వశవర్తినీ।
ఆసీత్ సాద్య సుదేష్ణాయాః భీతాహం వశవర్తినీ॥ 21
పాండునందనా! చూడు. మీరిందరూ జీవించి ఉండగానే నేను పొందకూడని ఇలాంటి దురవస్థను పొందాను. కాలవిపర్యయం చూడు. ఒకనాడు సముద్రంవరకూ వ్యాపించిన భూమి అంతా అధీనంలో ఉన్న నేను సుదేష్ణ కనుసన్నలలో మెలగుతూ ఆమెకు భయపడుతున్నాను. (20,21)
యస్యాః పురఃసరా ఆసన్ పృష్ఠతశ్చానుగామినః।
సాహమద్య సుదేష్ణాయాః పురః పశ్చాచ్చ గామినీ॥ 22
ముందువెనుకల అనేకులైన పరిచారికలు సేవిస్తూ ఉండే నేను ఈనాడు రాణి సుదేష్ణకు ముందూ, వెనుకా నడుస్తున్నాను. (22)
ఇదం తు దుఃఖం కౌంతేయ మమాసహ్యం నిబోధ తత్॥
యా న జాతు స్వయం పింషే గాత్రోద్వర్తనమాత్మనః।
అన్యత్ర కుంత్యా భద్రం తే సా పినష్మ్యద్య చందనమ్॥ 23
పశ్య కౌంతేయ పాణీ మే నైవాభూతాం హి యౌ పురా॥
కుంతీకుమారా! ఇదే కాకుండా నాకు మరొక సహించలేని కష్టం కూడా ఉంది. చూడు, ఇంతకు ముందు కుంతీదేవికి తప్ప(ఇతరుల మాట చెప్పేదేమిటి) స్వయంగా నాకోసం కూడా నేను నలుగుపిండి నీరలేదు. పార్థా! ఇవిగో నాచేతులు రెండూ చూడు. కాయలు కాశాయి. ఇంతకు ముందు ఇలా లేవు.' (23 1/2)
వి॥తె॥ నాకు పని చెప్పేటప్పుడు కుంతీదేవి జంకుతూ, పని నేర్పుతున్నట్లు ఆజ్ఞాపించేది. నీవెరుగవూ! అంటుంది ద్రౌపది తెలుగు భారతంలో. (2-219)
ఇత్యస్య దర్శయామాస కిణవంతౌ కరవుభౌ॥ 24
అని చెప్పి ద్రౌపది భీమసేనునికి తన రెండు చేతులనూ చూపింది. చందనం అరగతీయడంలో నల్లని కాయలు ఏర్పడ్డాయి ఆచేతులలో. (24)
బిభేమి కుంత్యా యా నాహం యుష్మాకం వా కదాచన।
సాద్యాగ్రతో విరాటస్య భీతా తిష్ఠామి కింకరీ॥ 25
'ఇంతకు ముందు ఎప్పుడూ పూజ్యురాలైన కుంతికి గాని, మీకు గాని నేను భయపడలేదు. అలాంటి నేను ఈనాడు దాసీగా విరాటరాజు ఎదుట భయపడుతూ ఉంటున్నాను. (25)
కిం ను వక్ష్యతి సమ్రాణ్మాం వర్ణకః సుకృతో న వా।
నాన్యపిష్టం హి మత్స్యస్య చందనం కిల రోచతే॥ 26
ఆ సమయంలో "మహారాజు ఏమంటాడో? ఈ నలుగుపిండిని సరిగ్గా తయారుచేశానో లేదో" అని ఆలోచిస్తూ ఉంటాను. నేను తప్ప వేరెవరు సిద్ధం చేసినా ఆ గంధం మత్స్యరాజుకు నచ్చదు. (26)
వైశంపాయన ఉవాచ
సా కీర్తయంతీ దుఃఖాని భీమసేనస్య భామినీ।
రురోద శనకైః కృష్ణా భీమసేనముదీక్షతీ॥ 27
వైశంపాయనుడు అంటున్నాడు. ద్రౌపది ఈ రీతిగా భీమసేనునికి తన దుఃఖాన్ని గూర్చి చెప్పి, అతని ముఖంవైపు చూస్తూ మెల్లమెల్లగా ఏడుస్తోంది. (27)
సా బాష్పకలయా వాచా నిఃశ్వసంతీ పునః పునః।
హృదయం భీమసేనస్య ఘట్టయంతీదమబ్రవీత్॥ 28
ఆమె మాటిమాటికీ దీర్ఘంగా నిట్టూరుస్తూ కన్నీళ్లతో గద్గదస్వరంతో భీమసేనుని హృదయం కంపించి పోయేలా ఇలా అంది. (28)
నాల్పం కృతం మయా భీమ దేవానాం కిల్బిషం పురా।
అభాగ్యా యత్ర జీవామి కర్తవ్యే సతి పాండవ॥ 29
'పాండునందనా! భీమసేనా! నేను పూర్వకాలంలో దేవతలపట్ల చిన్న అపరాధం కూడా చేయలేదు. అందుకే అభాగ్యురాలను అయిన నేను చచ్చిపోవలసిన స్థితిలో కూడా బ్రతుకుతున్నాను.' (29)
వైశంపాయన ఉవాచ
తతస్తస్యః కరౌ సూక్ష్మౌ కిణబద్ధౌ వృకోదరః।
ముఖమానీయ వై పత్న్యా రురోద పరవీరహా॥ 30
వైశంపాయనుడు అన్నాడు - అనంతరం శత్రుమర్దనుడైన భీముడు - చిక్కిపోయి, కాయలు కాచిన ఆ చేతులను తన ముఖానికి ఆనించి విలపించాడు. (30)
తౌ గృహీత్వా చ కౌంతేయః బాష్పముత్స్యజ్య వీర్యవాన్।
తతః పరమదుఃకార్తః ఇదం వచనమబ్రవీత్॥ 31
పరాక్రమవంతుడైన భీముడు ఆ చేతులను పట్టుకొని కన్నీళ్లు విడుస్తూ, దుఃఖంతో బాధపడుతూ ఇలా అన్నాడు. (31)
ఇతి శ్రీమహాభారతే విరాటపర్వణి కీచకవధ పర్వణి ద్రౌపదీ భీమసంవాదే వింశోఽధ్యాయః॥ 20 ॥
శ్రీమహాభారతమున విరాటపర్వమున కీచకవధ పర్వమను ఉపపర్వమున ద్రౌపది తన కష్టములను భీమునకు తెలుపుట అను ఇరువదియవ అధ్యాయము. (20)