21. ఇరువది ఒకటవ అధ్యాయము
భీముడు ద్రౌపదిని ఓదార్చుట.
భీమసేన ఉవాచ
ధిగస్తు మే బాహుబలం గాండీవం ఫాల్గునస్య చ।
యత్ తే రక్తౌ పురా భూత్వా పాణీ కృతకిణావిమౌ॥ 1
భీముడిలా అన్నాడు. పూర్వం కోమలములై, ఎఱ్ఱగా ఉండే నీ యీ చేతులు రెండూ నేడు నల్లగా కాయలు కాసి పోవడంవలన నాభుజబలమూ, అర్జునుని గాండీవమూ రెండూ పనికిరానివే అయ్యాయి. (1)
సభాయాం తు విరాటస్య కరోమి కదనం మహత్।
తత్ర మే కారణం భాతి కౌంతేయో యత్ ప్రతీక్షతే॥ 2
నేను అపుడే విరాటుని సభలో పెద్దమారణకాండ జరిపి ఉందును. కాని అలా చేయకపోవడానికి కారణం యుధిష్ఠిరమహారాజు చూపే. (అజ్ఞాతవాసం బయట పడుతుందనే భయాన్ని సూచిస్తూ నాకేసి చూశాడు.) (2)
అథవా కీచకస్యాహం పోథయామి పదా శిరః।
ఐశ్వర్యమదమత్తస్య క్రీడన్నివ మహాద్విపః॥ 3
లేకపోతే ఐశ్వర్యమదాంధుడైన ఆ కీచకుని తలను ఏనుగు ఆటలాడుతూ వెదురు బొంగును తొక్కి వేసినట్లుగా కాళ్లతో మట్టికరిపించేవాడిని. (3)
అపశ్యం త్వాం యదా కృష్ణే కీచకేన పదా హతామ్।
తదైవాహం చికీర్షామి మత్స్యానాం కదనం మహత్॥ 4
ద్రౌపదీ! కీచకుడు నిన్ను కాలితో తన్నినపుడు నేను అక్కడే ఉండి నాకళ్లతో ఆ దృశ్యాన్ని చూశాను. నాకు అప్పుడే ఈ మత్స్యదేశవాసుల నందరినీ చంపేయాలి అనిపించింది. (4)
తత్ర మాం ధర్మరాజస్తు కటాక్షేణ న్యవారయత్।
తదహం తస్య విజ్ఞాయ స్థిత ఏవాస్మి భామిని॥ 5
కాని ధర్మరాజు అక్కడ నన్ను కళ్లతోనే సైగచేసి ఆపని చేయకుండా వారించాడు. భామినీ! నేను కూడా ఆసైగను గ్రహించాను. కనుకనే నిశ్శబ్దంగా ఉండిపోయాను. (5)
యచ్చ రాష్ట్రాత్ ప్రచ్యవనం కురూణామవధశ్చ యః।
సుయోధనస్య కర్ణస్య శకునేః సౌబలస్య చ॥ 6
దుఃశాసనస్య పాపస్య యన్మయా నాహృతం శిరః।
తన్మే దహతి గాత్రాణి హృది శల్యమివార్పితమ్।
మా ధర్మం జహి సుశ్రోణి క్రోధం జహి మహామతే॥ 7
మనం రాజ్యం కోల్పోయిన నాడే కౌరవులవధ జరిగిఉండాల్సింది. దుర్యోధనుడు, కర్ణుడు, శకుని, దుశ్శాసనుడు - వీరందరి శిరసుల్ని నరికి ఉండాల్సింది. ఇదంతా ఆలోచిస్తే నామనసులో ముల్లు గుచ్చుకొన్నట్లుంటుంది. శరీరంలో మంటలు రేగుతున్నాయి. సుశ్రోణీ! నీవు చాల బుద్ధిమంతురాలివి. ధర్మాన్ని విడిచిపెట్టకు. క్రోధాన్ని విడిచిపెట్టు. (6,7)
ఇమం తు సముపాలంభం త్వత్తో రాజా యూధిష్ఠిరః।
శ్రుణుయాద్ వాపి కల్యాణి కృత్స్నం జహ్వాత్ స జీవితమ్॥ 8
కళ్యాణి! ఒకవేళ యుధిష్ఠిరుడు నీ ఈ నిందను పూర్తిగా వింటే అతడు తప్పక మరణించేవాడు. (8)
ధనంజయో వా సుశ్రోణి యమౌ వా తనుమధ్యమే।
లోకాంతరగతేష్వేషు నాహం శక్ష్యామి జీవితుమ్॥ 9
సుశ్రోణీ! అర్జునుడు గాని నకులసహదేవులుగాని నీవు చేసిన నిందను వింటే వారు తప్పక మరణిస్తారు. వారు మరణిస్తే నేను బ్రతకలేను. (9)
పురా సుకన్యా భార్యా చ భార్గవం చ్యవనం వనే।
వల్మీకభూతం శామ్యంతమ్ అన్వపద్యత భామినీ॥ 10
నారాయణీ చేంద్రసేనా రూపేణ యది తే శ్రుతా।
పతిమన్వచరద్ వృద్ధం పురా వర్షసహస్రిణమ్॥ 11
పూర్వం భృగుమహర్షి యొక్క కొడుకు చ్యవనుడనే ఋషి ఉండేవాడు. అతడు తపస్సు చేసి చేసి పుట్టగా మారిపోయాడు. అతని భార్య సుకన్య భర్తకు సేవలు చేసి సుఖాలు పొందింది. నారాయణి అయిన ఇంద్రసేన - రూపవతి అని నీవు వినే ఉంటావు - వేల సంవత్సరాల ముసలివాడైన తన మగడు మద్గలమహర్షికి సేవలు చేసి తరించింది ఆమె. (10,11)
దుహితా జనకస్యాపి వైదేహీ యది తే శ్రుతా।
పతిమన్వచరత్ సీతా మహారణ్యనివాసినమ్॥ 12
జనకుని కూతురైన సీత గురించికూడ నీవు వినే ఉంటావు. ఆమె దండకారణ్యంలో కూడా పతిని అనుసరించింది. (12)
రక్షసా నిగ్రహం ప్రాప్య రామస్య మహిషీ ప్రియా।
క్లిశ్యమానాపి సుశ్రోణి రామమేవాన్వపద్యత॥ 3
రాక్షసుడైన రావణుడు ఆమెను లంకకు తీసుకుపోయాడు. రామునికి ప్రియమైన ఆమె అక్కడ ఎన్నో బాధలనుభవించి చివరకు రాముణ్ణి చేరుకుంది. (అంతే గాని ధర్మాన్ని తప్పలేదు.) (13)
లోపాముద్రా తథా భీరు వయోరూపసమన్వితా।
అగస్తిమన్వయాద్ధిత్వా కామాన్ సర్వానమానుషాన్॥ 14
పిరికిదానా! సౌందర్యవతి, యౌవనవతి అయిన లోపాముద్రకూడ సమస్త సుఖాల్ని విడిచిపెట్టి అగస్త్యమహర్షిని అనుసరించింది. (14)
ద్యుమత్సేనసుతం వీరం సత్యవంతమనిందితా।
సావిత్ర్యనుచచారైకా యమలోకం మనస్వినీ॥ 15
అలాగే పరమ పతివ్రత, అభిమానవతియైన సావిత్రి ద్యుమత్సేనుని కుమారుడు వీరుడు అయిన సత్యవంతుని ప్రాణాలు కాపాడుకోవడానికి యమ ధర్మరాజును అనుసరించి ఒంటరిగానే యమలోకానికి కూడా వెళ్ళింది. (15)
యథైతాః కీర్తితా నార్యః రూపవత్యః పతివ్రతాః।
తథా త్వమపి కల్యాణి సర్వైః సముదితా గుణైః॥ 16
కల్యాణీ! పతివ్రతలు, రూపవతులు, గుణవతులు అయిన పైవారివలె నీవు కూడా సద్గుణవంతురాలవు. (16)
మాదీర్ఘం క్షమ కాలం త్వం మాసమర్ధం చ సమ్మితమ్।
పూర్ణే త్రయోదశే వర్షే రాజ్ఞాం రాజ్ఞీ భవిష్యసి॥ 17
కొద్దికాలం ఓపికపట్టు. ఒక్క పదిహేను రోజులు. పదమూడోఏడు నిండగానే నీవు రాణులందఱకు రాణివౌతావు. (17)
అర్ధేన సంమితం(తక్కువైనది) మాసం = అర్ధసంమితమ్ = మాసార్ధం = పదిహేను రోజులు. (విష)
(సత్యేన తే శపే చాహం భవితా నాన్యథేతి హ।
సర్వాసాం పరమస్త్రీణాం ప్రామాణ్యం కర్తుమర్హసి॥
దేవి! నేను ఒట్టివేసి చెబుతున్నా. నామాటనిజం. నీవు స్త్రీలందఱిలో కెల్ల ఆదర్శవతిగా పేరుపొందుతావు.
సర్వేషాం చ నరేంద్రాణాం మూర్ధ్ని స్థాస్యసి భామిని।
భర్తృభక్త్యా చ వృత్తేన భోగాన్ ప్రాప్స్యసి దుర్లభాన్॥)
భామిని! నీవు నీపతిభక్తి వల్ల రాజులందరికంటె ఉన్నతస్థానం పొంది వారందఱు నిన్ను శిరసావహించే విధంగా సకలభోగాలు అనుభవిస్తావు.'
ద్రౌపద్యువాచ
ఆర్తయైతన్మయా భీమ కృతం బాష్పప్రమోచనమ్।
అపారయంత్యా దుఃఖాని న రాజానముపాలభే॥ 18
ద్రౌపది ఇలా అంది. భీమా! నేను దుఃఖాన్ని భరించలేక దీనత్వంతో నీ ముందు కంటనీరు పెట్టాను గాని యుధిష్ఠిరుని నిందించడంలేదు. (18)
కిముక్తేన వ్యతీతేన భీమసేన మహాబల।
ప్రత్యుపస్థితకాలస్య కార్యస్యానంతరో భవ॥ 19
మహాబలుడవైన భీమసేనా! జరిగినదాని గురించి మాట్లాడుకోవడం వల్ల ఏమీ ప్రయోజనం లేదు. ఈ విషయంలో నీవు చేయవలసిన పనిగురించి ఆలోచించు. (19)
మమేహ భీమ కైకేయీ రూపాభిభవశంకయా।
నిత్యముద్విజతే రాజా కథం నేయాదిమామితి॥ 20
భీమా! కేకయరాజకుమారి తనకంటే అందమైన నన్ను చూసి తన భర్త విరాటమహారాజు నాయందెక్కడ ఆసక్తి చూపుతాడో నని నిత్యం కలతచెందుతోంది. (20)
తస్యా విదిత్వా తం భావం స్వయం చానృతదర్శనః।
కీచకోఽయం సుదుష్టాత్మా సదా ప్రార్థయతే హి మామ్॥ 21
ఆ కీచకుణ్ణి చూస్తేనే పాపం చుట్టుకొంటుంది. అటువంటి కీచకుడు రాణిషుదేష్ణ యొక్క భావాన్ని గుర్తించి స్వయంగా నావద్దకు వచ్చి పదేపదే అడగడం మొదలుపెట్టాడు. (21)
తమహం కుపితా భీమ పునః కోపం నియమ్య చ।
అబ్రువం కామసమ్మూఢమ్ ఆత్మానం రక్ష కీచక॥ 22
భీమా! అతని అభిప్రాయాన్ని తెలుసుకొన్న నాకు చాలాకోపం వచ్చింది. కాని కోపాన్ని నిగ్రహించుకొన్నాను. 'కామాంధుడా! కీచకా! నిన్ను నీవు రక్షించుకో' అన్నాను. (22)
గంధర్వాణామహం భార్యా పంచానాం మహిషీ ప్రియా।
తే త్వాం నిహన్యుః కుపితాః శూరాః సాహసకారిణః॥ 23
నే నైదుగురు గంధర్వులకు ప్రియపత్నిని. వాళ్లు శూరులు. సాహసం గలవాళ్లు. వాళ్లకు కోపం వస్తే నిన్ను తప్పక చంపేస్తారు. (23)
ఏవముక్తః సుదుష్టాత్మా కీచకః ప్రత్యువాచ హ।
నాహం బిభేమి సైరంధ్రి గంధర్వాణాం శుచిస్మితే॥ 24
కీచకునితో అలా అనగానే వాడు నన్ను చూసి నీ భర్తలు గంధర్వులకు నేను భయపడ నన్నాడు. (24)
శతం శతసహస్రాణి గంధర్వాణా మహం రణే।
సమాగతం హనిష్యామి త్వం భీరు కురు మే క్షణమ్॥ 25
పిరికిదానా! గంధర్వులు వందలకొద్ది లక్షలకొద్ది వచ్చినా నేనొక్కణ్ణే వాళ్ళందర్ని చంపెయ్య గలను గాని నీవు నాకోరిక తీర్చు. (25)
ఇత్యుక్తే చాబ్రువం మత్తం కామాతురమహం పునః।
న త్వం ప్రతిబలశ్చైషాం గంధర్వాణాం యశస్వినామ్॥ 26
నేను కామాతురుడైన కీచకుడితో ఇలా అన్నాను. నీవు కీర్తికల ఆ గంధర్వులతో సమానం కావు. (26)
ధర్మే స్థితాస్మి సతతం కులశీలసమన్వితా।
నేచ్ఛామి కంచిద్ వధ్యంతం తేన జీవసి కీచక॥ 27
కీచకా! నేను ఉన్నతకులంలో పుట్టాను. శీలం కలదాన్ని. పాత్రివ్రత్యధర్మంతో ఉన్నాను. నా కారణంగా ఎవరూ చావ కూడదు. అందువల్లనే నీవింకా బ్రతికిఉన్నావు. (27)
ఏవముక్తః స దుష్టాత్మా ప్రాహసత్ స్వనవత్ తదా।
అథ మాం తత్ర కైకేయీ ప్రైషయత్ ప్రణయేన తు॥ 28
తేనైవ దేశితా పూర్వం భ్రాతృప్రియచికీర్షయా।
సురామానయ కల్యాణి కీచకస్య నివేశనాత్॥ 29
నేనలా అన్నాక కీచకుడు బిగ్గరగా నవ్వాడు. ఆ తర్వాత సుదేష్ణ కీచకుడికి మేలు చెయ్యాలనుకొంది. 'కల్యాణీ'! నీవు కీచకుని ఇంటికి వెళ్ళి సురను తెచ్చిపెట్టుము, అని నన్ను పంపించింది. (28,29)
సూత పుత్రస్తు మాం దృష్ట్వా మహత్ సాంత్వమవర్తయత్।
సాంత్వే ప్రతిహతే క్రుద్ధః పరామర్శమనాభవత్॥ 30
నే నక్కడకు వెళ్లాను. ఆ కీచకుడు నన్ను చూసి అనేకవిధాలుగా బ్రతిమాలాడు. నేనతనికోరిక కాదన్నాను. వాడు కోపంతో నన్ను బలవంతంగా లోబరుచుకోడానికి ప్రయత్నించాడు. (30)
విదిత్వా తస్య సంకల్పం కీచకస్య దురాత్మనః।
తథాహం రాజశరణం జవేనైవ ప్రధావితా॥ 31
నేను దురాత్ముడైన ఆ కీచకుడు అభిప్రాయాన్ని తెలుసుకొని రక్షణకోసం విరాటరాజున్న చోటికి వేగంగా పరుగెత్తాను. (31)
సందర్శనే తు మాం రాజ్ఞః సూతపుత్రః పరామృశత్।
పాతయిత్వా తు దుష్టాత్మా పదాహం తేన తాడితా॥ 32
దుర్మార్గుడు సూతపుత్రుడు అయిన ఆ కీచకుడు రాజు చూస్తుండగానే నన్ను క్రింద పడేసి కాలితో తన్నాడు. (32)
ప్రేక్షతే స్మ విరాటస్తు కంకస్తు బహవో జనాః।
రథినః పీఠమర్దాశ్చ హస్త్యారోహాశ్చ నైగమాః॥ 33
అది విరాటరాజు చూస్తున్నాడు. కంకుభట్టు ఇంకా చాలామంది జనం చూస్తున్నారు. రథికులూ, రాజుకు ఇష్టమయిన వారూ, నాగరికులూ చూస్తూనే ఉన్నారు. (33)
ఉపాలబ్ధో మయా రాజా కంకశ్చాపి పునః పునః।
తతో న వారితో రాజ్ఞా న తస్యావినయః కృతః॥ 34
నేను రాజును, కంకుభట్టును చాలసార్లు నిందించాను. అయినా రాజు కీచకుని దుర్మార్గాన్ని దండించలేకపోయాడు. (34)
యోఽయం రాజ్ఞో విరాటస్య కీచకో నామ సారథిః।
త్యక్తధర్మా నృశంసశ్చ నరస్త్రీసమ్మతః ప్రియః॥ 35
కీచకుడనే పేరుగల వీడు విరాటునకు సహాయకుడు, సారథి. ధర్మాన్ని విడిచి పెట్టినవాడు. క్రూరుడు. అయినప్పటికి విరాటుడు, సుదేష్ణ ఇద్దరూ ఇతనిని అభిమానిస్తూ ఉంటారు. (35)
శూరోఽభిమానీ పాపాత్మా సర్వార్థేషు చ ముగ్ధవాన్।
దారామర్శీ మహాభాగ లభతేఽర్థాన్ బహూనపి॥ 36
వీడు శూరుడు. తన శూరత్వంపై అభిమానం కలవాడు. పాపాత్ముడు. పరస్త్రీలను చెరబట్టేవాడు. ఇతరుల నుంచి ధనరాసుల్ని సంపాదిస్తూ ఉంటాడు. (36)
అహరేదపి విత్తాని పరేషాం క్రోశతామపి।
న తిష్ఠతి స్మ సన్మార్గే న చ ధర్మం బుభూషతి॥ 37
ప్రజలు ఏడ్చిమొత్తుకుంటున్నా వీడు వాళ్ళనుంచి ధనం కాజేస్తూనే ఉంటాడు. మంచిమార్గంలో ఎప్పుడూ నిలవడు. ధర్మం అనుసరించడు. (37)
పాపాత్మా పాపభావశ్చ కామబాణవశానుగః।
అవినీతశ్చ దుష్టాత్మా ప్రత్యాఖ్యాతః పునః పునః॥ 38
వీడి పాపాత్ముడు. పాపపుటాలోచనలు కలవాడు. కామానికి వశుడయ్యాడు. నీతిలేనివాడు. దుష్టుడు. ఎన్నోసార్లు వీణ్ణి నేను కాదన్నాను. (38)
దర్శనే దర్శనే హన్యాద్ యది జహ్యాం చ జీవితమ్।
తద్ ధర్మే యతమానానాం మహాన్ ధర్మో నశిష్యతి॥ 39
వీడు నేను కనిపించినప్పుడల్లా హింసిస్తే భయంతో నేను ఏనాడైనా చచ్చిపోవచ్చు. ఈస్థితిలో ధర్మం కోసం ప్రయత్నించే మీకు ధర్మహాని కలగవచ్చు. (39)
సమయం రక్షమాణానాం భార్యా వో న భవిష్యతి।
భార్యాయాం రక్ష్యమాణాయాం ప్రజా భవతి రక్షితా॥ 40
ఒకవేళ మీరు మీ ప్రతిజ్ఞకోసం పదమూడేళ్లు వేచి ఉండాలనుకొంటే మీ భార్య బ్రతకదు. భార్యను రక్షిస్తేనే సంతానానికి రక్ష. (40)
ప్రజాయాం రక్ష్యమాణాయామ్ ఆత్మా భవతి రక్షితః।
ఆత్మాహి జాయతే తస్యాం తేన జాయాం విదుర్బుధాః॥ 41
సంతానాన్ని రక్షిస్తేనే తనక్కూడా రక్షణ కల్గుతుంది. ఎందుకంటే మనిషి తానే స్వయంగా భార్య ద్వారా సంతానంగా పుడుతున్నాడు. కదా! అందువల్లే పండితులు భార్యను జాయ అంటున్నారు. (41)
భర్తా తు భార్యయా రక్ష్యః కథం జాయాన్మమోదరే।
వదతాం వర్ణధర్మాంశ్చ బ్రాహ్మణానామితి శ్రుతః॥ 42
వర్ణధర్మాలగురించి బ్రాహ్మణులు చెప్తుంటే విన్నాను. తనచేత రక్షింపదగిన భర్త తన గర్భంలో ఎలా పుడతాడా.. అని భార్య అనుకొంటూ ఉంటుందట. (42)
క్షత్రియస్య సదా ధర్మః నాన్యః శత్రునిబర్హణాత్।
పశ్యతో ధర్మరాజస్య కీచకో మాం పదావధీత్॥ 43
తవ చైవ సమక్షే వై భీమసేన మహాబల।
త్వయాహ్యహం పరిత్రాతా తస్మాద్ ఘోరాజ్జటాసురాత్॥ 44
మహాబలశాలివైన భీమసేనా! క్షత్రియుడికి శత్రువుల్ని చంపడంకంటే వేరే ధర్మం లేదు. ధమరాజూ నీవూ చూస్తుండగానే ఆ కీచకుడు నన్ను తన్నాడు. నీవే కదా ఒకప్పుడు భయంకరుడైన జటాసురుని బారినుండి నన్ను రక్షించావు. (43,44)
జయద్రథం తథైవ త్వామ్ అజైషీర్భ్రాతృభిః సహ।
జహీమమపి పాపిష్ఠం యోఽయం మామవమన్యతే॥ 45
అలాగే జయద్రథుడు నన్నవమానించినపుడు నీ అన్నదమ్ములతో కలిసి అతనిని జయించావు. అలాగే ఇప్పుడు కూడా నన్నవమానించిన ఆ పాపాత్ముడైన కీచకుణ్ణి చంపు. (45)
కీచకో రాజవాల్లభ్యాత్ శోకకృన్మమ భారత।
తమేవం కామసమ్మత్తం భింధి కుంభమివాశ్మని॥ 46
భరతకులశ్రేష్ఠుడా! ఆ కీచకుడంటే రజుకు చాల ఇష్టం. ఆ అండతో నన్ను బాధపెడుతున్నాడు. కామంతో కళ్లు
మూసుకుపోయిన ఆ కీచకుణ్ణి రాతిపై కుండను పడేసి కొట్టినట్లుగా కొట్టి చంపు. (46)
యో నిమిత్తమనర్థానాం బహూనాం మమ భారత।
తం చేజ్జీవంతమాదిత్యః ప్రాతరభ్యుదయిష్యతి॥ 47
విషమాలోడ్య పాస్యామి మా కీచకవశం గమమ్।
శ్రేయో హి మరణమ్ మహ్యం భీమసేన తవాగ్రతః॥ 48
భరతకులతిలకా! నాకిన్ని కష్టాలు కల్గించిన ఆ కీచకుణ్ణి రేపు సూర్యుడుదయించే లోపుగా చంపకపోతే నేను విషం త్రాగి చచ్చిపోతాను. కాని వాడికి మాత్రం చిక్కను. భీమా! ఆ కీచకుడికి లొంగిపోయేకన్నా నీయెదుట చచ్చిపోవడమే మిన్న.' (47,48)
వైశంపాయన ఉవాచ
ఇత్యుక్త్వా ప్రారుదత్ కృష్ణా భీమస్యోరః సమాశ్రితా।
భీమశ్చ తాం పరిష్వజ్య మహత్ సాంత్వం ప్రయుజ్య చ॥ 49
వైశంపాయనుడు అన్నాడు. ద్రౌపది అలా అని భీమునిగుండెలపై వాలి ఏడ్చింది. భీముడు ఆమెను కౌగిలించుకుని ఎంతో ఓదార్చాడు. (49)
ఆశ్వాసయిత్వా బహుశఃః భృశమార్తాం సుమధ్యమామ్।
హేతుతత్త్వార్థసంయుక్తైః వచోభిర్ద్రుపదాత్మజామ్॥ 50
ప్రమృజ్య వదనం తస్యాః పాణినాశ్రుసమాకులమ్।
కీచకం మనసాగచ్ఛత్ సృక్విణీ పరిసంలిహన్।
ఉవాచ చైనాం దుఃఖార్తాం భీమః క్రోధసమన్వితః॥ 51
మిక్కిలి దుఃఖించే ద్రౌపదిని భీముడు ఎన్నో విధాల హేతుబద్ధమైన మాటలతో ఓదార్చాడు. కన్నీటితో నిండిన ఆమె ముఖం తనచేతితో తుడిచి ఒక్కసారి కీచకుని స్మరించాడు. కోపం ముంచుకొని వచ్చింది. పెదవుల ప్రక్క నుండి జారే నీటిని నాలుకతో తుడుచుకొంటూ, దుఃఖార్తురాలయిన ద్రౌపదితో భీముడిలా అన్నాడు. (50,51)
ఇతి శ్రీమహాభారతే విరాటపర్వణి కీచకవధపర్వణి ద్రౌపదీసాంత్వనే ఏకవింశోఽధ్యాయః॥ 21 ॥
ఇది శ్రీమహాభారతమున విరాటపర్వమున కీచకవధ పర్వమను ఉపపర్వమున
ద్రౌపదిని ఓదార్చుట అను ఇరువది ఒకటవ అధ్యాయము. (21)
(దాక్షిణాత్య అధికపాఠము 2 శ్లోకాలు కలుపుకొని మొత్తం 53 శ్లోకాలు.)