19. పందొమ్మిదవ అధ్యాయము
పాండవుల కష్టములను తలచుకొని ద్రౌపది దుఃఖించుట.
ద్రౌపద్యువాచ
ఇదం తు తే మహద్ దుఃఖం యత్ ప్రవక్ష్యామి భారత।
న మేఽభ్యసూయా కర్తవ్యా దుఃఖాదేతద్ బ్రవీమ్యహమ్॥ 1
ద్రౌపది అన్నది. 'భారతా! నేనీ మాటలు దుఃఖం భరింపలేక అంటున్నానే గాని నిన్నాక్షేపించటానికి గాదు. కావున నాపై కోపం చెందకూడదు. (1)
సూదకర్మణి హీనే త్వమ్ అసమే భరతర్షభ।
బ్రువన్ వల్లవజాతీయః కస్య శోకం న వర్ధయేః॥ 2
భరతకులశ్రేష్ఠుడా! నీవు అతినీచమైన పాచకవృత్తిని చేపట్టి వల్లవజాతికి చెందిన వానిగా పరిచయం చేసుకొన్నప్పుడు అది వింటే ఎవరి మనసు కలత చెందదు? (2)
సూపకారం విరాటస్య వల్లవం త్వాం విదుర్జనాః।
ప్రేష్యత్వం సమనుప్రాప్తం తతో దుఃఖతరం ను కిమ్॥ 3
లోకులు నిన్ను విరాటరాజు వంటలవాడైన వల్లవుడుగానే అనుకొంటున్నారు. నీవు ప్రభువయి ఉండి కూడా సేవకునిగా ఉన్నావు. ఇంతకు మించిన గొప్ప కష్టం మరేమిటి ఉంటుంది. నాకు? (3)
యదా మహానసే సిద్ధే విరాటముపతిష్ఠసి।
బ్రువాణో బల్లవః సూదః తదా సీదతి మే మనః॥ 4
పాకశాలలో వంటలు చేసి విరాటమహారాజు దగ్గరకు వచ్చి నీవు "మహారాజా! వంటవాడు వల్లవుడు మిమ్మల్ని భోజనానికి రమ్మని పిలవడానికి వచ్చాడు" అని చెప్తూ ఉంటే అది విని నా మనసుకు చాలా కష్టం కలుగుతూ ఉంటుంది. (4)
యదా ప్రహృష్టః సమ్రాట్ త్వాం సంయోధయతి కుంజరైః।
హసంత్యంతఃపురే నార్యః మమ తూద్విజతే మనః॥ 5
విరాటమహారాజు ఆనందంగా ఉన్నపుడు నిన్ను ఏనుగులతో పోరిస్తూఉంటే, ఆ సమయంలో రాణివాసపు స్త్రీలందరూ నవ్వుతూ ఉంటారు. నాకైతే మనసంతా దుఃఖంతో నిండిపోతూ ఉంటుంది. (5)
శార్దూలైర్మహిషైః సింహైః ఆగారే యోధ్యసే యదా।
కైకేయ్యాః ప్రేక్షమాణాయాః తదా మే కశ్మలం భవేత్॥ 6
రాణి సుదేష్ణాదేవి ప్రేక్షకురాలిగా విచ్చేసి కూర్చున్నపుడు నీవు భవనప్రాంగణంలో పులులతో, సింహాలతో, దున్నలతో పోరాడుతూ ఉన్నపుడు నామనసు మిక్కిలి వ్యథ చెందుతూ ఉంటుంది. (6)
తత ఉత్థాయ కైకేయీ సర్వాస్తాః ప్రత్యభాషత।
ప్రేష్యాః సముత్థితాశ్చాపి కైకేయీం తాః స్త్రియోఽబ్రువన్॥ 7
ప్రేక్ష్య మామనవద్యాంగీం కశ్మలోపహతామివ।
ఇలా ఉండగా ఒకసారి ఆ జంతువులతో నీ పోరాటం ముగిశాక లేచివెళ్తూ శోకపీడితురాలనై ఉన్న నన్ను చూచి కేకయరాజపుత్రి సుదేష్ణ ఆమెతో పాటు వస్తున్న దాసీలు పరస్పరం ఇలా చెప్పుకోసాగారు. (7 1/2)
స్నేహాత్ సంవాసజాత్ ధర్మాత్ సూదమేషా శుచిస్మితా॥ 8
యోద్ధ్యమానం మహావీర్యమ్ ఇయం సమనుశోచతి।
కళ్యాణరూపా సైరంధ్రీ వల్లవశ్చాపి సుందరః॥ 9
అందమైన చిరునవ్వుతో ఉండే ఈ సైరంధ్రి పూర్వం ఒకేచోట(యుధిష్ఠిరుని దగ్గర) ఉండడం కారణంగా కలిగిన స్నేహభావంవల్లనో, మానవధర్మంవల్లనో వల్లవుడు జంతువులతో పోరుతూఉంటే అతనికోసం మాటిమాటికి విచారిస్తోంది. సైరంధ్రి అందగత్తె. వల్లవుడూ అందగాడే మరి. (8,9)
స్త్రీణాం చిత్తం చ దుర్ జ్ఞేయం యుక్తరూపౌ చ మే మతౌ।
సైరంధ్రీ ప్రియసంవాసాత్ నిత్యం కరుణవాదినీ॥ 10
స్త్రీలమనసులు తెలుసుకోవడం చాలా కష్టం. నాకయితే ఈ ఇద్దరి జంట బాగుందనిపిస్తోంది. సైరంధ్రి తన ప్రేమ కారణంగా వంటలవాడు ఏనుగులు మొదలైన వాటితో పోరాడే ప్రసక్తి వచ్చినపుడల్లా(దీనురాలై) ఎప్పుడూ కరుణాయుక్తంగానే మాటలాడుతుంది. (10)
అస్మిన్ రాజకులే చేమౌ తుల్యకాలనివాసినౌ।
ఇతి బ్రువాణా వాక్యాని సా మాం నిత్యమతర్జయత్॥ 11
ఈ రాజపరివారంలోకి కూడా వీరిద్దరూ ఒకే సమయంలో వచ్చి చేరారు" ఈ విధమైన మాటలతో రాణి సుదేష్ణ తరచుగా నేను ఉలికిపడేలా చేస్తోంది. (11)
క్రుధ్యంతీం మాం చ సంప్రేక్ష్య సమశంకత మాం త్వయి।
తస్యాం తథా బ్రువత్యాం తు దుఃఖం మాం మహదావిశత॥ 12
పైగా నేను కోపించడం చూసి, నీపట్ల నాకు గూఢమైన ప్రేమ ఉన్నట్లు శంకిస్తూ ఉంటారు. వారు ఇలాంటి మాటలు అన్నప్పుడల్లా నాకు చాలా దుఃఖం కలుగుతూ ఉంటుంది. (12)
త్వయ్యేవం నిరయం ప్రాప్తే భీమే భీమపరాక్రమే।
శోకే యౌధిష్ఠిరే మగ్నా నాహం జీవితుముత్సహే॥ 13
భీమా! భయంకరమైన పరాక్రమం గల నీవు ఈ రీతిగా సేవ అనే నరకాన్ని అనుభవిస్తూ ఉంటే, యుధిష్ఠిరునివల్ల కలిగినశోకంలో మునిగిన నాకు ఇప్పుడు ఉండాలనే ఉత్సాహం ఏకోశానా లేదు. (13)
యః స దేవాన్ మనుష్యాంశ్చ సర్వాంశైకరథోఽజయత్।
సోఽయం రాజ్ఞో విరాటస్య కన్యానాం నర్తకో యువా॥ 14
తరుణవీరుడైన ఆ అర్జునుడు ఒంటరి రథికుడై మనుష్యులను దేవతలను కూడా జయించినవాడు, ఈనాడు విరాటుని కన్యలకు నాట్యం నేర్పుతున్నాడు. (14)
యోఽతర్పయదమేయాత్మా ఖాండవే జాతవేదసమ్।
సోఽంతఃపురగతః పార్థ కూపేఽగ్నిరివ సంవృతః॥ 15
అమేయబలసంపన్నుడై, ఖాండవవనంలో సాక్షాత్తుగా అగ్నిదేవుడినే తృప్తి పరచిన ఆ అర్జునుడు నేడు నూతిలోని అగ్నిలా అంతఃపురంలో దాగి ఉన్నాడు. (15)
యస్మాద్భయ మమిత్రాణాం సదైవ పురుషర్షభాత్।
స లోకపరిభూతేన వేషేణాస్తే ధనంజయః॥ 16
పురుషపుంగవుడూ, సదా శత్రుభయంకరుడూ అయిన అర్జునుడు లోకులు హీనంగా చూసే నపుంసకవేషంతో ఉన్నాడు. (16)
యస్య జ్యాక్షేపకఠినౌ బాహూ పరిఘసన్నిభౌ।
స శంఖపరిపూర్ణాభ్యాం శోచన్నాస్తే ధనంజయః॥ 17
ఇనుపగుదియలవంటి బలిష్ఠమైన బాహువులు వింటినారిని లాగి కాయలు కాచాయి. ఆ చేతులకే శంఖవలయాలు గాజులుగా ధరించి అర్జునుడు దుఃఖం అనుభవిస్తున్నాడు. (17)
యస్య జ్యాతలనిర్ఘోషాత్ సమకంపంత శత్రవః।
స్త్రియో గీతస్వనం తస్య ముదితాః పర్యుపాసతే॥ 18
తన ధనుష్టంకారంతోనే శత్రువులను హడలెత్తించే ఆ అర్జునుడు నేడు స్త్రీలకు మధురగీతాలు వినిపిస్తూ వారిని సేవిస్తున్నాడు. (18)
కిరీటం సూర్యసంకాశం యస్య మూర్ధన్యశోభత।
వేణీవికృతకేశాంతః సోఽయమద్య ధనంజయః॥ 19
శిరస్సుపై సూర్యకాంతితో వెలుగొందే కిరీటాన్ని ధరించి శోభించిన అర్జునుడు నేడు జడవేసుకొని వికృతంగా కన్పిస్తున్నాడు. (19)
తం వేణీకృతకేశాంతం భీమధన్వానమర్జునమ్।
కన్యాపరివృతం దృష్ట్వా భీమ సీదతి మే మనః॥ 20
భీమా! భయంకరమైన గాండీవధనుస్సు ధరించి ఉండే అర్జునుడు ఈనాడు జడ అల్లుకొని ఉండటం, కన్యలు చుట్టూచేరి ఉండడం చూస్తే నాహృదయం విషాదంతో కుంగిపోతోంది. (20)
యస్మిన్నస్త్రాణి దివ్యాని సమస్తాని మహాత్మని।
ఆధారః సర్వవిద్యానాం స ధారయతి కుండలే॥ 21
సంపూర్ణదివ్యాస్త్రాలు ధరించి సమస్తవిద్యలకు ఆధారభూతుడైన మహాత్ముడు ఈనాడు (స్త్రీలవలె) చెవులకు కమ్మలు ధరించాడు. (21)
స్ప్రష్టుం రాజసహస్రాణి తేజసాప్రతిమాని వై।
సమరే నాభ్యవర్తంత వేలామివ మహార్ణవః॥ 22
సోఽయం రాజ్ఞో విరాటస్య కన్యానాం నర్తకో యువా।
ఆస్తే వేషప్రతిచ్ఛన్నః కన్యానాం పరిచారకః॥ 23
మహాసాగరం చెలియలికట్టను అతిక్రమించలేనట్లుగా వేలకొలది రాజులు సాటిలేని పరాక్రమవంతులు అతనిని తాకడానికి ముందుకు రాలేకపోయేవారు. అలాంటి అర్జునుడు ఈవేళ విరాటుని కన్యలకు నాట్యం నేర్పుతూ, నపుంసక వేషంలో తన్ను మరుగుపరుచుకొని, ఉన్నాడు. (22,23)
యస్య స్మ రథఘోషేణ సమకంపత మేదినీ।
సపర్వతవనా భీమ సహస్థావరజంగమా॥ 24
యస్నిన్ జాతే మహాభాగే కుంత్యాః శోకో వ్యనశ్యత।
స శోచయతి మామద్య భీమసేన తవానుజః॥ 25
భీమసేనా! ఎవరి రథచక్రఘోషచేత కొండలు, అడవులు, చరాచరప్రాణులతో కూడిన ఈ భూమండలమంతా కంపిస్తుందో, ఏ మహాభాగ్యశాలిని పుత్రునిగా పొంది కుంతీమాత తన దుఃఖాన్నంతా పోగొట్టుకుందో, ఆ నీ తమ్ముడు అర్జునుడు తన దురవస్థ కారణంగా నాకు శోకాన్ని కలిగిస్తున్నాడు. (24,25)
భూషితం తమలంకారైః కుండలైః పరిహాటకైః।
కంబుపాణినమాయాంతం దృష్ట్వా సీదతి మే మనః॥ 26
అర్జునుడు స్త్రీజనోచితమైన ఆభరణాలు, బంగారుకుండలాలు, చేతులకు శంఖవలయాలు ధరించి రావడం చూస్తే నా హృదయం దుఃఖంతో కుంగిపోతూ ఉంటుంది. (26)
యస్య నాస్తి సమో వీర్యే కశ్చిదుర్వ్యాం ధనుర్ధరః।
సోఽద్య కన్యాపరివృతః గాయన్నాస్తే ధనంజయః॥ 27
అర్జునునితో పోటీపడగల వీరుడైన ధనుర్ధరుడు ఈ భూమిమీద లేడు. అటువంటి అర్జునుడు ఈనాడు కన్యకలమధ్య కూర్చుని పాటలు పాడుతున్నాడు. (27)
ధర్మే శౌర్యే చ సత్యే చ జీవలోకస్య సమ్మతమ్।
స్త్రీవేషవికృతం పార్థం దృష్ట్వా సీదతి మే మనః॥ 28
ధర్మంలో, పరాక్రమంలో, సత్యభాషణంలో జీవజగత్తుకే ఆదర్శంగా నిలిచినవాడు అర్జునుడు. అలాంటి వాడు ఈనాడు స్త్రీవేషంలో వికృతంగా ఉండడం చూసి నామనసు దుఃఖంలో మునిగిపోతోంది. (28)
యదహ్యేనం పరివృతం కన్యాభిర్దేవరూపిణమ్।
ప్రభిన్నమివ మాతంగం పరికీర్ణం కరేణుభిః॥ 29
మత్స్యమర్థపతిం పార్థం విరాటం సముపస్థితమ్।
పశ్యామి తూర్యమధ్యస్థం దిశో నశ్యంతి మే తదా॥ 30
చెక్కిళ్ళనుండి మదజలం కారుతున్న మదపుటేనుగును చుట్టుముట్టిన ఆడుఏనుగుల్లా, వాద్యయంత్రాల మధ్య కూర్చున్న దేవరూపధారి అయిన అర్జునుని కన్యకలు పరివేష్టించి ఉన్నారు. అట్టి అతడు ధనపతి అయిన మత్స్యరాజు విరాటుని సేవిస్తూ ఉండడం చూసి నా కన్నులు చీకట్లు కమ్ముతాయి. నాకు దిక్కులు కనబడవు. (29,30)
నూనమార్యా న జానాతి కృచ్ఛ్రం ప్రాప్తం ధనంజయమ్।
అజాతశత్రుం కౌరవ్యం మగ్నం దుర్ద్యూతదేవినమ్॥ 31
తన కొడుకు అర్జునుడు ఇలాంటి సంకటస్థితిలో పడతాడనికాని; కురువంశశ్రేష్ఠుడు, అజాతశత్రువు అయిన యుధిష్ఠిరుడు దుర్ద్యూతం ఆడి శోకమగ్నుడవుతాడని కాని నిశ్చయంగా మా అత్త కుంతికి తెలిసి ఉండదు. (31)
(ఐంద్రవారుణ వాయవ్య బ్రాహ్మాగ్నేయైశ్చ వైష్ణవైః।
అగ్నీన్ సంతర్పయన్ పార్థః సర్వాంశ్చైకరథోఽజయత్॥
దివ్యైస్త్రైరచింత్యాత్మా సర్వశత్రునిబర్హణః॥
దివ్యం గాంధర్వమస్త్రమ్ చ వాయవ్యమథ వైష్ణవమ్।
బ్రాహ్మం పాశుపతం చైవ స్థూణాకర్ణం చ దర్శయన్॥
పౌలోమాన్ కాలకేయాంశ్చ ఇంద్రశత్రూన్ మహాసురాన్।
నివాతకవచైః సార్ధం ఘోరానేకరథోఽజయత్।
సోఽంతఃపురగతః పార్థః కూపేఽగ్నిరివ సంవృతః॥
కుంతీకుమారుడు అర్జునుడు ఇంద్ర, వారుణ, వాయవ్య, బ్రాహ్మ, ఆగ్నేయ, వైష్ణవ అస్త్రాలద్వారా అగ్నిదేవుడిని తృప్తిపరుస్తూ ఒక్క రథం సహాయంతోనే సమస్త దేవతలను జయించాడు. తన దివ్యాస్త్రాలద్వారా సమస్త శత్రువులను నాశనం చేయడంలో సమర్థుడైన అతని ఆత్మబలం అచింత్యమైనది. అతడొక్కడే రథాన్ని ఎక్కి దివ్యమైన, గాంధర్వ, వాయవ్య, వైష్ణవ, బ్రాహ్మ, పాశుపత, స్థూణాకర్ణాది అస్త్రాలు ప్రదర్శించి ఇంద్రునికి శత్రువులైన నివాతకవచులను, భయంకరులైన పౌలోమకాలకేయులను ఓడించాడు. అలాంటి అర్జునుడు ఈనాడు అంతఃపురంలో నూతిలో దాగిన అగ్నిలాగ అలా మరుగున పడి ఉన్నాడు.
కన్యాపురగతం దృష్ట్వా గోష్ఠేష్వివ మహర్షభమ్।
స్త్రీ వేషవికృతం పార్థం కుంతీం గచ్ఛతి మే మనః॥)
గొప్పఎద్దు గోశాలలో కట్టివేయబడినట్లు స్త్రీవేషంతో వికృతంగా ఉన్న అర్జునుని కన్యాంతఃపురంలో చూస్తే నాకు మాటిమాటికి కుంతీదేవి జ్ఞాపకం వస్తోంది.
తథా దృష్ట్వా యవీయాంసం సహదేవం గవాం పతిమ్।
గోషు గోవేషమాయాంతం పాండుభూతాస్మి భారత॥ 32
అలాగే నీ చిన్నతమ్ముడు సహదేవుడు గోపాలుడుగా మారి గోవుల మధ్యలో గోవులకాపరి వేషంతో ఉండడం చూస్తే నాకు శరీరం పాలిపోయినట్లుగా అయిపోతుంది. (32)
సహదేవస్య వృత్తాని చింతయంతీ పునఃపునః।
న నిద్రామభిగచ్ఛామి భీమసేన కుతో రతిమ్॥ 33
భీమసేనా! సహదేవుని దుర్దశను మాటిమాటికి తలచుకుంటే నాకు కంటికి నిద్రే రాదు. ఇక సుఖం ఎక్కడినుండి వస్తుంది? (33)
న విందామి మహాబాహో సహదేవస్య దుష్కృతమ్।
యస్మిన్నేవం విధం దుఃఖం ప్రాప్నుయాత్ సత్యవిక్రమః॥ 34
మహాబలీ! నాకు తెలిసినంతవరకు సహదేవుడు ఎప్పుడూ ఏ పాపమూ చేయలేదు. కాని ఈ సత్యవిక్రముడు ఇలాంటి దుఃఖం అనుభవించవలసి వచ్చింది. (34)
దూయామి భరతశ్రేష్ఠ దృష్ట్వా తే భ్రాతరం ప్రియమ్।
గోషు గోవృషసంకాశం మత్స్యేనాభినివేశితమ్॥ 35
గిత్తలాగ తుష్టిగా పుష్టిగా ఉన్న నీ ప్రియసోదరుడైన సహదేవుడిని విరాటుడు గోరక్షణకు నియోగించడం చూసి నాకు చాలా దుఃఖం కలుగుతూ ఉంది. (35)
సంరబ్ధం రక్తనేపథ్యం గోపాలానాం పురోగమమ్।
విరాటమభినందంతమ్ అథ మే భవతి జ్వరః॥ 36
ఎఱ్ఱనిరంగుగల అందమైన గోపాలుర అంగరఖా ధరించిన సహదేవుడిని చూస్తే ఆనందం కలిగినా, అతడు విరాటరాజును అభినందించడం చూసినప్పుడు మాత్రం నాకు జ్వరం వచ్చినట్లుగా ఉంటుంది. (36)
సహదేవం హి మే వీర నిత్యమార్యా ప్రశంసతి।
మహాభిజనసంపన్నః శీలవాన్ వృత్తవానితి॥ 37
వీరుడా! పూజ్యురాలు కుంతి నాతో ఎప్పుడూ సహదేవుని గూర్చి గొప్ప వంశంలో పుట్టాడనీ, శీలవంతుడనీ, సదాచార సంపన్నుడనీ ప్రశంసిస్తూ ఉండేది. (37)
హ్రీనిషేవో మధురవాక్ ధార్మికశ్చ ప్రియశ్చ మే।
స తేఽరణ్యేషు వోఢవ్యః యాజ్ఞసేని క్షపాస్వపి॥ 38
సుకుమారశ్చ శూరశ్చ రాజానం చాప్యనువ్రతః।
జ్యేష్ఠాపచాయినం వీరం స్వయం పాంచాలి భోజయేః॥ 39
ఇత్యువాచ హి మాం కుంతీ రుదతీ పుత్రగృద్ధినీ।
ప్రవ్రజంతం మహారణ్యం తం పరిష్వజ్య తిష్ఠతీ॥ 40
నాకింకా జ్ఞాపకం ఉంది. సహదేవుడు వనవాసానికి వచ్చేటపుడు పుత్రవాత్సల్యంతో కుంతీమాత అతడిని హృదయానికి అత్తుకొని ఏడుస్తూ నాతో "యాజ్ఞసేనీ! సహదేవుడు సిగ్గుపడుతూ ఉంటాడు, మధురంగా మాట్లాడుతాడు. ధార్మికుడు, వీడంటే నాకు చాలా ఇష్టం. ఇతడిని అడవులలో రాత్రిళ్ళు నీవే స్వయంగా జాగ్రత్తగా (చేయిపట్టుకుని) చూసుకో. ఎందుకంటే వీడు చాలా సుకుమారుడు,(అలసిపోతే నడవలేడేమో). నాకొడుకు సహదేవుడు పరాక్రమవంతుడు. పెద్దన్నగారికి భక్తుడు. అన్నలను పూజించేవాడు. పాంచాలీ! ఇతనికి నీ చేతులతోనే అన్నం తినిపించు. (38-40)
తం దృష్ట్వా వ్యావృతం గోషు వత్సచర్మక్షపాశయమ్।
సహదేవం యథా శ్రేష్ఠం కిం ను జీవామి పాండవ॥ 41
పాండునందనా! యోధులలో శ్రేష్ఠుడయిన ఆ సహదేవుడు గోసేవలో మునిగిఉండడం, దూడలచర్మాల మీద రాత్రిళ్లు పడుకోవడం చూస్తున్న నేను ఎలా బ్రతికి ఉండగలను? (41)
యస్త్రిభిర్నిత్యసంపన్నః రూపేణాస్త్రేణ మేధయా।
సోఽశ్వబంధో విరాటస్య పశ్య కాలస్య పర్యయమ్॥ 42
అలాగే అందమైన రూపం, అస్త్రబలం, మేధాశక్తి- ఈమూడూ నిత్యసంపదలుగా గల వీరవరుడు నకులుడు నేడు విరాటుని దగ్గర గుఱ్ఱాలను సాకేవాడుగా ఉన్నాడు. చూడు. కాలవైపరీత్యం ఎలా ఉందో? (42)
అతీతార్థే స్మృతిర్మేధా బుద్ధిస్తాత్కాలికీ స్మృతా।
శుభాశుభవిచారజ్ఞా సా ప్రాజ్ఞైర్ధీరుదాహృతా।
అతీతార్థ విషయస్మరణకు హేతువు మేధ, తాత్కాలికవిషయ విచారణకు హేతువు బుద్ధి. శుభాశుభవిచారం చేయగల శక్తి ధీ(విష)
అభ్యకీర్యంత వృందాని దామగ్రంథిముదీక్ష్య తమ్।
వినయంతం జవేనాశ్వాన్ మహారాజస్య పశ్యతః॥ 43
ఎవ్వరిని చూసి శత్రువుల సమూహం దూరంగా చెల్లచెదరై పారిపోతుందో ఆ నకులుడు అశ్వశిక్షకుడై గుఱ్ఱాల మంకుతనాన్ని పోగొట్టి వాటిని కళ్లెములతో అదుపుచేస్తూ, మహారాజుఎదుట వాటికి వేగంగా పరిగెత్తే శిక్షణ ఇవ్వవలసి వచ్చింది. (43)
అపశ్యమేనం శ్రీమంతం మత్స్యం భ్రాజిష్ణుముత్తమమ్।
విరాటముపతిష్ఠంతం దర్శయంతం చ వాజినః॥ 44
శోభాసంపన్నుడు, తేజస్వి, ఉత్తమరూపవంతుడు అయిన నకులుడు, ఆ మత్స్యనరేశునికి రకరకాల గుఱ్ఱాలను చూపుతూ అతనిని సేవిస్తూ ఉండడం నాకళ్లారా చూశాను. (44)
కిం ను మాం మన్యసే పార్థ సుఖినీతి పరంతప।
ఏవం దుఃఖశతావిష్టా యుధిష్ఠిరనిమిత్తట్తః॥ 45
కుంతీనందనా! శత్రుతాపనా! ఇదంతా చూస్తూ నేను సుఖంగానే ఉన్నానని నీవు అనుకొంటున్నావా? ధర్మరాజు కారణంగానే ఇన్నివందల కష్టాలు నన్ను చుట్టుముడుతున్నాయి. (45)
అతః ప్రతివిశిష్టాని దుఃఖాన్యన్యాని భారత।
వర్తంతే మయి కౌంతేయ వక్ష్యామి శృణు తాన్యపి॥ 46
భారతా! కౌంతేయా! ఇన్నిటిని మించిన మరొక పెద్దకష్టం నాకు వచ్చిపడింది. అదీ చెప్తాను విను. (46)
యుష్మాసు ధ్రియమాణేషు దుఃఖాని వివిధాన్యుత।
శోషయంతి శరీరం మే కిం ను దుఃఖమతః పరమ్॥ 47
మీరందరూ జీవించి ఉండగానే నానారకాల కష్టాలు నా శరీరాన్ని శుష్కింపచేస్తున్నాయి. ఇంతకంటె మించిన దుఃఖం మరొకటి ఏమి ఉండగలదు? (47)
ఇతి శ్రీమహాభారతే విరాటపర్వణి కీచకవధపర్వణి ద్రౌపదీభీమసంవాదే ఏకోనవింశోఽధ్యాయః॥ 19 ॥
ఇది శ్రీమహాభారతమున విరాటపర్వమున కీచకవధ పర్వమను ఉపపర్వమున
ద్రౌపది పాండవుల కష్టాలను తలచుకొని దుఃఖించుట అను పందొమ్మిదవ అధ్యాయము. (19)
(దాక్షిణాత్య అధికపాఠము 5 శ్లోకాలు కలుపుకొని మొత్తం 52 శ్లోకాలు.)