18. పదునెనిమిదవ అధ్యాయము

ద్రౌపది భీముని ఎదుట తన దుఃఖమును వెల్లడించుట.

వైశంపాయన ఉవాచ
(సా లజ్జమానా భీతా చ అధోముఖముఖీ తతః।
నోవాచ కించిద్ వచనం బాష్పదూషితలోచనా॥
వైశంపాయనుడు చెప్పుతున్నాడు. ఆ సమయంలో లజ్జతో, భయంతో ద్రౌపది కన్నులలో నీరు పొంగి వచ్చింది. ఆమె ముఖం క్రిందికి దించుకొని మౌనంగా కూర్చుండిపోయింది. ఏమీ మాట్లాడ లేకపోయింది. (చూసికూడా ఏమి ఎరుగని వానిలా అడుగుతున్న భీముడు
తనకు జరిగిన అవమానానికి ప్రతీకారం చేయడేమో అని భీతి కలిగి ఆమెకు కళ్లల్లో నీళ్లు తిరిగాయి. అందుకే వెంటనే ఏమీ చెప్పలేక పోయింది.)
అథాబ్రవీద్ భీమపరాక్రమో బలీ
వృకోదరః పాండవముఖ్య సమ్మతః।
ప్రబ్రూహి కిం తే కరవాణి సుందరి
ప్రియం ప్రియే వారణఖేలగామిని॥)
అప్పుడు పాండవప్రవరుడైన యుధిష్ఠిరునికి పరమప్రియుడు, భయంకరపరాక్రమం కలిగినవాడు, మహాబలుడు అయిన భీముడు ఈ విధంగా అన్నాడు - "సుందరీ! గజరాజువలె లీలావిలాసంతో కూడిన మందగమనం గల ప్రియా! చెప్పు. నీకు ప్రీతి కలుగు నట్లుగా ఏమి చేయమంటావు?"
ద్రౌపద్యువాచ
అశోచ్యత్వం కుతస్తస్యాః యస్యా భర్తా యుధిష్ఠిరః।
జానన్ సర్వాణి దుఃఖాని కిం మాం త్వం పరిపృచ్ఛసి॥ 1
ద్రౌపది అన్నది. 'యుధిష్ఠిరుని భర్తగా పొందిన స్త్రీ శోకం లేనిది ఎలా అవుతుంది? నా దుఃఖాలన్నీ తెలిసికూడా నన్ను ఎలా అడుగుతున్నావు? (1)
వి॥ ధర్మరాజువలననే తన కన్నీ కష్టాలు కలిగాయని ద్రౌపది భావం.
యన్మాం దాసీప్రవాదేన ప్రాతికామీ తదానయత్।
సభాపరిషదో మధ్యే తన్మాం దహతి భారత॥ 2
దుర్యోధనుని దాసి అనే ప్రవాదంతో ప్రాతికామి ద్వారా నన్ను సభాభవనం మధ్యలో ఉన్న సభ్యులందరి లోకి తెచ్చిన ఆ అవమానం నేటికీ నన్ను దహిస్తూనే ఉంది. (2)
వి॥సం: దుర్యోధనుడు ప్రాతికామినే ముందుగా పంపాడు. ద్రౌపదిని దాసిగా తీసికొని రావటానికి. అవ్యుత్పన్నుడు కాబట్టి దుశ్శాసనుడి పేరుకూడా తలపెట్టలేదు ద్రౌపది. (విష)
(క్షత్రియై స్తత్ర కర్ణాద్యైః దృష్టా దుర్యోధనేన చ।
శ్వశురాభ్యాం చ భీష్మేణ విదురేణ చ ధీమతా॥
ద్రోణేన చ మహాబాహో కృపేణ చ పరంతప।
శత్రువులకు సంతాపం కలిగించే మహాబాహుడవైన భీమసేనా! ఆ సమయంలో అక్కడే ఉన్న కర్ణాదులు క్షత్రియులు, దుర్యోధనుడు, నా అత్తమామలు భీష్ముడు, బుద్ధిమంతుడైన విదురుడు, ఇంకా ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు కూడా నన్ను ఆ దురవస్థలో ఉండగా చూశారు కదా!
వి॥ద్రౌపది పూర్వపు అవమానాన్ని గూర్చి భీముడికి గుర్తు చేయడం అతనిలో రోషాన్ని రేకెత్తించడానికే.
సాహం శ్వశురయోర్మధ్యే భ్రాతృమధ్యే చ పాండవ।
కేశే గృహీత్వైవ సభాం నీతా జీవతి వై త్వయి॥)
పాండునందనా! నీవు బ్రతికిఉండగానే నాజుట్టు పట్టుకొని అతత మామలు, దుర్యోధనుడు మొదలుగాగల సోదరుల మధ్య రాజసభకు తీసుకొనివచ్చారు.
పర్థివస్య సుతా నామ కా ను జీవతి మాదృశీ।
అనుభూయేదృశం దుఃఖమ్ అన్యత్ర ద్రౌపదీం ప్రభో॥ 3
స్వామీ! ద్రుపదకన్యక నైన నేను తప్ప వేరే ఏరాజకుమారి ఇలాంటి బాధను అనుభవించి, జీవించి ఉంటుంది? (3)
వనవాసగతాయాశ్చ సైంధవేన దురాత్మనా।
పరామర్శో ద్వితీయో వై సోఢుముత్సహతే తు కా॥ 4
వనవాసం చేసే రోజుల్లో దుర్మార్గుడు సింధురాజు జయద్రథుడు నన్ను స్పృశించాడు. ఇది రెండవ అవమానం. దీన్ని ఎవరు సహించగలుగుతారు? (4)
(పద్భ్యాం పర్యచరం చాహం దేశాన్ విషమసంస్థితాన్।
దుర్గాన్ శ్వాపదసంకీర్ణాన్ త్వయి జీవతి పాండవ॥
పాండుకుమారా! మీరు బ్రతికి ఉండగానే క్రూరమృగాలతో నిండి చొరశక్యం కాని ఎగుడు దిగుడు ప్రాంతాల్లో కాలినడకతో తిరగవలసివచ్చింది.
తతోఽహం ద్వాదశే వర్షే వన్యమూలఫలాశనా।
ఇదం పురమనుప్రాప్తా సుదేష్ణాపరిచారికా॥
పరస్త్రియముపాతిష్ఠే సత్యధర్మపథస్థితా।
పండ్లు, కందమూలాలు ఆహారంగా తీసుకొంటూ అడవిలో పన్నెండు సంవత్సరాలు గడిచాక విరాట నగరానికి వచ్చి సుదేష్ణకు పరిచారిక నయ్యాను. సత్యధర్మమార్గంలో నడుస్తూనే నేడు వేరొక స్త్రీకి సేవ చేస్తున్నాను.
గోశీర్షకం పద్మకం చ హరిశ్యామం చ చందనమ్॥
నిత్యం పింషే విరాటస్య త్వయి జీవతి పాండవ।
సాహం బహూని దుఃఖాని గణయామి న తే కృతే॥
ద్రుపదస్య సుతా చాహం
ధృష్టద్యుమ్నస్య చానుజా।
అగ్నికుండాత్ సముద్భూతా
నోర్వ్యాం జాతు చరామి భోః॥)
పాండుపుత్ర! మీరు జీవించి ఉండగానే నేను ప్రతిదినమూ విరాటరాజుకోసం గోశీర్షం, పద్మకాష్ఠం, పరిశ్యామం అనే చందనాలను నూరుతున్నాను, అయినా మీ సంతోషం కోసం నేను ఇలాంటి ఎన్ని కష్టాలనైనా కొంచెం కూడా లెక్కచేయను. నేను ద్రుపదమహారాజు కూతుర్ని, ధృష్టద్యుమ్నుని చెల్లెలిని. అగ్నికుండంలోంచి పుట్టినదానిని. నేను ఎన్నడూ నేలమీద కాలు మోపి నడవలేదు. (కాని నేడు ఇక్కడ ఇలాటి దుర్దశను అనుభవిస్తున్నాను.)
మత్స్యరాజసమక్షం తు తస్య ధూర్తస్య పశ్యతః।
కీచకేన పరామృష్టా కాను జీవతి మాదృశీ॥ 5
మత్స్యదేశపురాజు విరాటుని సమక్షంలోనే ఆ జూదరి చూస్తుండగానే కీచకుడు తన్ని నన్ను అవమాన పరిచాడు. అది సహించి నాలాంటి ఏరాజకుమారి జీవించి ఉండగలదు? (5)
ఏవం బహువిథైః క్లేశైః క్లిశ్యమానాం చ భారత।
న మాం జానాపి కౌంతేయ కిం ఫలం జీవితేన మే॥ 6
భరతవంశానికి ఆభరణమైన కుంతీనందనా! ఇలాంటి ఎన్నో కష్టాల ద్వారా నేను నిరంతరం బాధపడుతూనే ఉన్నాను. నీకిది తెలియదా? అయినా నేను బ్రతికిఉండడం వలన లాభం ఏమిటి? (6)
యోఽయం రాజ్ఞో విరాటస్య కీచకో నామ భారత।
సేనానీః పురుషవ్యాఘ్ర శ్యాలః పరమదుర్మతిః॥ 7
స మాం సైరంధ్రివేషేణ వసంతీం రాజవేశ్మని।
నిత్యమేవాహ దుష్టాత్మా భార్యా మమ భవేతి వై॥ 8
భారతా! పురుష సింహమా! విరాటరాజు దగ్గర సేనాపతిగా ఉన్న కీచకుడు అతనికి బావమరిది అవుతాడు. అతని బుద్ధి చాలా దుష్టమైనది. రాజభవనంలో సైరంధ్రి వేషంతో నివసిస్తున్న నన్ను చూసి ఆ దుష్టుడు వచ్చి 'నాకు భార్యపు కమ్మని' ఎల్లప్పుడూ నన్ను అడుగుతూనే ఉన్నాడు. (7,8)
తేనోపమంత్ర్యమాణాయా వధార్హేణ సపత్నహన్।
కాలేనేవ ఫలం పక్వం హృదయం మే విదీర్యతే॥ 9
శత్రుదమనుడా! మట్టుపెట్టదగిన ఆ పాపాత్ముడు చేసే ఈ జుగుప్సాకరమైన ప్రస్తావన వినీవినీ నామనస్సు సమయానికి పక్వమైన పండువలె బ్రద్దలైపోతోంది. (9)
(విజానామి తవామర్షం బలం వీర్యం చ పాండవ।
తతోఽహం పరిదేవామి చాగ్రతస్తే మహాబల॥
మహాబలుడవైన పాండుపుత్రా! నేను నీకోపాన్ని, బలాన్ని, పరాక్రమాన్ని ఎరుగుదును, కనుకనే నేను నీముందు విలపిస్తున్నాను.
యథా యూథపతిర్మత్తః కుంజరః షష్టిహాయనః।
భూమౌ నిపతితం బిల్వం పద్భ్యామాక్రమ్య పీడయేత్॥
తథైవ చ శిరస్తస్య నిపాత్య ధరణీతలే।
వామేన పురుషవ్యాఘ్ర మర్ద పాదేన పాండవ॥
పురుషశ్రేష్ఠుడవైన పాండుపుత్రా! అరవై ఏళ్ల, మదించిన గజయూథానికి నాయకుడయిన గజరాజు నేలమీద రాలిన మారేడుపండును కాళ్లతో తొక్కి నుజ్జు నుజ్జు చేసినట్లుగా కీచకుని నేల రాల్చి అతని శిరస్సును ఎడమకాలితో మర్దించు.
స చే దుద్యంతమాదిత్యం ప్రాతరుత్థాయ పశ్యతి।
కీచకః శర్వరీం వ్యుష్టాం నాహం జీవితుముత్సహే॥)
కీచకుడు కనుక ఈరాత్రి గడిచాక ప్రాతఃకాలంలో లేచి ఉదయించే సూర్యుడిని చూశాడంటే నేను జీవించి ఉండను. (సూర్యోదయం అయ్యేలోపునే కీచకుడు చనిపోవాలను ద్రౌపది కోరిక.)
భ్రాతరం చ విగర్హస్వ జ్యేష్ఠం దుర్ద్యూతదేవినమ్।
యస్యాస్మి కర్మణా ప్రాప్తా దుఃఖమేతదనంతకమ్॥ 10
దూషింపదగిన ద్యూతక్రీడలో తగుల్కొన్న మీ ఆ పెద్దన్నను నిందించు. ఆయన చేసిన పనులవల్లనేకదా నేను ఈ అనంతమైన దుఆహాఖంలో కూరుకుపోయాను. (10)
కో హి రాజ్యం పరిత్యజ్య సర్వస్వం చాత్మనా సహ।
ప్రవ్రజ్యాయైవ దీవ్యేత వినా దుర్ద్యూతదేవినమ్॥ 11
తనతోపాటుగా రాజ్యాన్ని సర్వస్వాన్ని విడిచి వనవాసానికి వెళ్లాలనే నియమం పెట్టుకొని జూదమాడగలిగేవాడు ద్యూతక్రీడావ్యసనం గల ఆ జూదరికాక వేరొక డెవడుంటాడు? (11)
యది నిష్కసహస్రేణ యచ్చాన్యత్ సారవద ధనమ్।
సాయం ప్రాతరదేవిష్యత్ అపి సంవత్సరాన్ బహూన్॥ 12
రుక్మం హిరణ్యం వాసాంపి యానం యుగ్యమజావికమ్।
అశ్వాశ్వతర సంఘాంశ్చ న జాతు క్షయమావహేత్॥ 13
అతడు ప్రతిరోజూ సాయంకాలం, ప్రొద్దుటా కూడా వేయిబంగారు నాణాలతీ జూదమాడినా, లేదా ఇతరములైన విలువైన ధనాలు అంటే బంగారం, వెండి, వస్త్రాలు, రథాలు, బళ్లు, మేకలు, గొఱ్ఱెలు, గుర్రాలు మొదలైనవి ఏళ్లతరబడి పణంగాపెట్టి ఆడినా మనరాజ్యవైభవం ఎన్నటికీ క్షీణించేదికాదు. (12,13)
సోఽయం ద్యూత ప్రవాదేవ శ్రియః ప్రత్యవరోపితః।
తూష్ణీమాస్తే యథా మూఢః స్వాని కర్మాణి చింతయన్॥ 14
జూదంలో అతనికి ఉన్న ఆ వ్యసనమే సింహాసనం నుండి అతనిని క్రిందికి దింపివేసింది. ఈనాడు అతడు తాను చేసిన పనులను తలచుకొంటూ అజ్ఞానివలె ఉలుకూపలుకూ లేకుండా ఉన్నాడు. (14)
దశనాగసహస్రాణి
హయానాం హేమమాలినామ్।
యం యాంతమనుయాంతీహ
సోఽయం ద్యూతేన జీవతి॥ 15
ఎక్కడికయినా బయలుదేరేటపుడు పదివేల ఏనుగులు, బంగారు గొలుసులు ధరించిన వేల కొద్దీ గుఱ్ఱాలు వెన్నంటి బయలుదేరేవి. ఆ మహారాజే ఇప్పుడు జూదంతో జీవితం గడుపుకొంటున్నాడు. (15)
రథాః శతసహస్రాణి నృపాణామమితౌజసామ్।
ఉపాసంత మహారాజమ్ ఇంద్రప్రస్థే యుధిష్ఠిరమ్॥ 16
శతం దాసీసహస్రాణాం యస్య నిత్యం మహానసే।
పాత్రీహస్తం దివారాత్రమ్ అతిథీన్ భోజయంత్యుత॥ 17
ఏష నిష్కసహస్రాణి ప్రదాయ దదతాం వరః।
ద్యూతజేన హ్యనర్థేన మహతా సముపాశ్రితః॥ 18
ఇంద్రప్రస్థంలో అతడు ఎక్కడానికి ఒకలక్షరథాలు సిద్ధంగా ఉండేవి. ఆ మహారాజు యుధిష్ఠిరుని సేవించడానికి వేలకొద్దీ పరాక్రమవంతులైన రాజులు ఉండేవారు. అతని భోజనాలయంలో నిత్యము లక్షమంది దాసీలు బంగారుపాత్రలు చేతితో పట్టుకొని పగలు - రాత్రి అతిథులకు భోజనం పెడుతూ ఉండేవారు. దాతలలో ఉత్తముడైన యుధిష్ఠిరుడు రోజూ వేలకొద్దీ బంగారు నాణెములు దానంగా ఇస్తూ ఉండేవాడు. ఆ ధర్మరాజే నేడు జూదంలో సంపాదించిన అనర్థదాయకమైన ధనంతో జీవితం గడుపుతున్నాడు. (16-18)
ఏమం హి స్వరసంపన్నా బహవః సూతమాగధాః।
సాయం ప్రాతరుపాతిష్ఠన్ సుమృష్టమణికుండలాః॥ 19
ఇంద్రప్రస్థంలో విశుద్ధమణిమయ కుండలాలు ధరించిన అనేకులు సూతులు మాగధులు, మధురస్వరంతో మిళితమైన వాక్కులతో సాయంప్రాతఃకాలాలలో ఈ మహారాజును స్తుతిస్తూ ఉండేవారు. (19)
సహస్రమృషయో యస్య నిత్యమాసన్ సభాసదః।
తపఃశ్రుతోపసంపన్నాః సర్వకామైరుపస్థితాః॥ 20
తపస్సుతో, వేదవిజ్ఞానంతో నిండియున్న వేలకొద్దీ పూర్ణకాములైన ఋషులూ, మహర్షులూ ప్రతిదినమూ ఇతని రాజసభలో కొలువుతీరి ఉండేవారు. (20)
అష్టాశీతిసహస్రాణి స్నాతకా గృహమేధినః।
త్రింశద్దాసీక ఏకైకః యాన్ బిభర్తి యుధిష్ఠిరః॥ 21
ఒక్కొక్కరివద్ద సేవకోసం ప్రత్యేకంగా ముప్పదిమంది దాసీలను పెట్టి ఎనభైఎనిమిదివేలమంది స్నాతక గృహస్థ బ్రాహ్మణులు యుధిష్ఠిరుడు తనవద్ద ఉంచుకొని పోషించేవాడు. (21)
అప్రతిగ్రాహిణాం చైవ యతీనామూర్ధ్వరేతసామ్।
దశచాపి సహస్రాణి సోఽయమాస్తే నరేశ్వరః॥ 22
వారితోపాటే మహారాజు దానంపట్టని పదివేలమంది ఊర్ధ్వరేతులైన సన్యాసులనుకూడా స్వయంగా భరించి పోషిస్తూ ఉండేవాడు. అట్టివాడే ఇప్పుడీ అవస్థలో జీవిస్తున్నాడు. (22)
ఆనృశంస్యమనుక్రోశం సంవిభాగస్తథైవ చ।
యస్మిన్నేతాని సర్వాణి సోఽయమాస్తే నరేశ్వరః॥ 23
కోమలత్వం, దయ, అందరికీ అన్నవస్త్రాలు ఇవ్వడం మొదలైన సమస్తసద్గుణాలు ఉండే ఆ మహారాజే ఈనాడు ఇట్టి దురవస్థలో పడిపోయాడు. (23)
అంధాన్ వృద్ధాంస్తథా నాథాన్ బాలాన్ రాష్ట్రేషు దుర్గతాన్।
బిభర్తి వివిధాన్ రాజా ధృతిమాన్ సత్యవిక్రమః।
సంవిభాగమనా నిత్యమ్ అనృశంస్యాద్ యుధిష్ఠిరః॥ 24
ధైర్యసత్యపరాక్రమాలు కలిగి రాజైన యుధిష్ఠిరుడు తనకోమలస్వభావం కారణంగా అందరికీ భోజనాది సదుపాయాలు కల్పించడంలో మనసు లగ్నం చేస్తూండే వాడు. తన రాజ్యంలోని అంధులను, వృద్ధులను, అనాథులను, బాలకులను, దుర్గతికి లోనైన వారిని అనేకులను రక్షించి పోషిస్తూ ఉండేవాడు. (24)
స ఏష నిరయం ప్రాప్తః మత్స్యస్య పరిచారకః।
సభాయాం దేవితా రాజ్ఞః కంకో బ్రూతే యుధిష్ఠిరః॥ 25
ఆ యుధిష్ఠిర మహారాజే ఈనాడు మత్స్యరాజుకు సేవకుడై పరాధీనత అనే నరకంలో పడి ఉన్నాడు. సభలో రాజుతో జూదం ఆడుతూ తన్ను తాను కంకునిగా పరిచయం చేసుకొన్నాడు. (25)
వి॥సం॥ నిరయం = పరతంత్రత (నీల)
నిరయం = పాతకం (అర్జు)
నిరయం = దుఃఖం (సర్వ)
నిరయం = సేవ అనే నరకం. (విష)
ఇంద్రప్రస్థే నివసతః సమయే యస్య పార్థివాః।
ఆసన్ బలిభృతః సర్వే సోఽద్యాన్యైర్భృతిమిచ్ఛతి॥ 26
ఇంద్రప్రస్థంలో నివసించే సమయంలో రాజులందరూ అతనికి కానుకలు సమర్పించేవారు. ఈనాడు అతడే తన భరణ పోషణాల నిమిత్తం ఇతరులనుండి ధనాన్ని పొందాలని కోరుకొంటున్నాడు. (26)
పార్థివాః పృథివీపాలాః యస్యాసన్ వశవర్తినః।
స వశే వివశో రాజా పరేషామద్య వర్తతే॥ 27
ఈ భూమిని పాలించే అనేకులైన రాజులు అతనికి వశవర్తులై అతని ఆజ్ఞను పాటించేవారు. ఆ మహారాజే ఈనాడు వివశుడై ఇతరుల వశంలో ఉంటున్నాడు. (27)
ప్రతాప్య పృథివీం సర్వాం రశ్మిమానివ తేజసా।
సోఽయం రాజ్ఞో విరాటస్య సభాస్తారో యుధిష్ఠిరః॥ 28
సూర్యునివలె తన తేజస్సుచేత సంపూర్ణ భూమండలాన్ని వెలిగించిన ఆ ధర్మరాజు విరాటరాజు సభలో ఇపుడు ఒక సాధారణ సభ్యునిగ ఉన్నాడు. (28)
యముపాసంత రాజానః సభాయామృషిభిః సహ।
తముపాసీనమద్యాన్యం పశ్య పాండవ పాండవమ్॥ 29
పాండునందనా! చూడు. రాజసభలో ఋషులతో పాటుగా అనేకరాజులు ఆయనను ఉపాసిస్తూ ఉండేవారు. ఈనాడు ఆయనే ఇతరులను ఉపాసిస్తున్నాడు. (29)
సదస్యం యముపాసీనం పరస్య ప్రియవాదినమ్।
దృష్ట్వా యుధిష్ఠిరం కోపః వర్ధతే మామసంశయమ్॥ 30
ఒక సామాన్య సభ్యుని గౌరవంతో ఇతరుల యొక్క సేవలో ఉంటూ విరాటుని మనసునకు ప్రియం కలిగే మాటలు చెప్తూ ఉండే యుధిష్ఠిర మహారాజుయొక్క ఈ అవస్థను చూసి నామనసులో కోపం పెరిగిపోతూ ఉంది. (30)
అతదర్హం మహాప్రాజ్ఞం జీవితార్థేఽభిసంస్థితమ్।
దృష్ట్వా కస్య న దుఃఖం స్యాద ధర్మాత్మానం యుధిష్ఠిరమ్॥ 31
ధర్మాత్ముడు, మహాప్రాజ్ఞుడు, ఎప్పుడూ ఇట్టి దురవస్థను పొందతగనివాడు - ఈనాడు జీవిక కోసం ఇతరుల ఇళ్లల్లో ఉండవలసివచ్చింది. మహారాజు యుధిష్ఠిరుని ఇలాంటి స్థితిలో చూస్తే ఎవరికి బాధ కలుగకుండా ఉంటుంది? (31)
ఉపాస్తే స్మ సభాయాం యం కృత్స్నా వీర వసుంధరా।
తముపాసీనమప్యన్యం పశ్య భారత భారతమ్॥ 32
వీరుడా! మునుపు రాజసభలో సమస్త భూమండలంలోని ప్రజలు అన్నిదిక్కులనుండి వచ్చి అతనిని కొలిచేవారు. ఇప్పుడు ఆ భరతవంస శిరోమణియే మరియొక రాజు సభలో కూర్చుండడం చూడు మఱి. (32)
వి॥తె॥ ధర్మరాజు గొప్పదనం తెలుగులో తిక్క ఈపద్యంలో చెపుతాడు.
ఎవ్వాని వాకిట నిభమదపంకంబు
రాజభూషణరజోరాజి నడఁగు
ఎవ్వాని చారిత్ర మెల్ల లోకములకు
నొజ్జయై వినయంబు నొఱపు గ్ఱపు
ఎవ్వాని కడకంట నివ్వటిల్లెడు చూడ్కి
మానిత సంపద లీనుచుండు
ఎవ్వాని గుణలత లేడువారాశుల
కడపటికొండపై కలయఁ బ్రాకు
అతఁడు భూరిప్రతాప మహాప్రదీప
దూర విఘటిత గర్వాంధకారవైరి
వీరకోటీర మణిఘృణి వేష్టితాంఘ్రి
తలుఁడు కేవలఘృణి ధర్మసుతుఁడు. (2-191)
తెలుగులో యత్తదర్థక ప్రయోగాలను కూడ చక్కడా ప్రయోగించిన ఘనత తిక్కనకే దక్కింది.
ఏవం బహువిధైర్దుఃఖైః పీడ్యమానామనాథవత్।
శోకసాగరమధ్యస్థాం కిం మాం భీమ న పశ్యసి॥ 13
భీమసేనా! ఇలా అనేకకష్టాలతో అనాథవలె బాధపడుతున్న నేను శోకసాగరంలో మునిగిపోయాను. నీవు నా దుర్దశను గమనించ లేదా ఏమి?' (33)
ఇతి శ్రీమహాభారతే విరాటపర్వణి కీచకవధ పర్వణి ద్రౌపదీ భీమసంవాదే అష్టాదశోఽధ్యాయః॥ 18 ॥
ఇది శ్రీమహాభారతమున విరాట పర్వమున కీచకవధ పర్వమను ఉపపర్వమున ద్రౌపది భీమునిఎదుట
తన దుఃఖమును వెల్లడించుట అను పదునెనిమిదవ అధ్యాయము. (18)
(దాక్షిణాత్య అధికపాఠము 13 1/2 శ్లోకములతో కలిపి మొత్తము 46 1/2 శ్లోకాలు)