17. పదునేడవ అధ్యాయము

ద్రౌపది భీమసేనుని వద్దకు వెళ్లుట.

వైశంపాయన ఉవాచ
సా హతా సూతపుత్రేణ రాజపత్నీ యశస్వినీ।
వధం కృష్ణా పరీప్సంతీ సేనావాహస్య భామినీ॥ 1
వైశంపాయనుడు అన్నాడు. సూతపుత్రుడైన కీచకుడు తన్నినప్పటినుండి యశస్విని, రాజపత్ని, కోపన అయిన ద్రౌపది సేనాపతి అయిన అతని వధను గూర్చియే ఆలోచించసాగింది. (1)
జగామావాసమేవాథ సా తదా ద్రుపదాత్మజా।
కృత్వా శౌచం యథాన్యాయం కృష్ణా సా తనుమధ్యమా॥ 2
గాత్రాణి వాససీ చైవ ప్రక్షాల్య సలిలేన సా।
చింతయామాస రుదతీ తస్య దుఃఖస్య నిర్ణయమ్॥ 3
ఆమె తన నివాసస్థానానికి వెళ్లింది. (సన్నని నడుము గల ద్రుపదకుమారి) కృష్ణ అక్కడ తగిన రీతిగా శుద్ధిస్నానం చేసిన్ తన శరీరాన్ని, వస్త్రాన్ని జలంతో శుభ్రం చేసుకొంది. విలపిస్తూ తన ఆ దుఃఖానికి నివారణోపాయాన్ని ఆలోచించసాగింది. (2,3)
కిం కరోమి క్వ గచ్ఛామి కథం కార్యం భవేన్మమ।
ఇత్యేవం చింతయిత్వా సా భీమం వై మనసాగమత్॥ 4
'ఏం చేయను? ఎక్కడకు వెళ్లను? నా పని ఎలా నెరవేరుతుంది?' అని ఆలోచిస్తూ మనసులో భీమసేనుడిని తలచుకొంది. (4)
నాన్యః కర్తా ఋతే భీమాత్ మమాద్య మనసః ప్రియమ్।
తత ఉత్థాయ రాత్రౌ సా విహాయ శయనం స్వకమ్॥ 5
ప్రాద్రవన్నాథమిచ్ఛంతీ కృష్ణా నాథవతీ సతీ।
భవనం భీమసేనస్య క్షిప్రమాయతలోచనా॥ 6
దుఃఖేన మహతా యుక్తా మానసేన మనస్వినీ।
"భీమసేనుడు తప్ప వేరెవరూ నేడు నామనసుకు ప్రియం కలిగే పనిచేయలేరు" - అని నిశ్చయించుకొని ఆ విశాలనేత్ర, సాధ్వి, సనాథ అయిన కృష్ణ ఆ రాత్రి తన శయనం విడిచి లేచి, తన నాథుడిని(రక్షకుడిని) కలుసుకోవాలనే కోరికతో శీఘ్రంగా భీమసేనుని భవనానికి వెళ్లింది. ఆ సమయంలో మనస్విని అయిన ద్రౌపది గొప్ప మానసికదుఃఖంతో పీడింపబడుతోంది. (5,6 1/2)
వి॥ సామాన్యంగా స్త్రీ ప్రియుని దగ్గరకు వెడితే అభిసారిక అంటారు. ఈమె సనాథ అయి నాథుని చేరింది.
వి॥తె॥ భీముని దగ్గరకు వెళ్ళటంలో రెండు కారణాలు భావిస్తుంది ద్రౌపది. 1. ఈకార్యం తీర్చడానికి మల్లయుద్ధవిశారదుడైన భీముని బాహుబలమే పనిచేస్తుంది. 2. తప్పక అతనికి దైవబలం కూడా ఉంటుంది. ఏపనికైనా మానవుని బుద్ధిబల, అంగబలాలు చాలవు. దైవబలం కూడా ఉండాలని సూచన. (2-164)
సైరంధ్ర్యువాచ
తస్మిన్ జీవతి పాపిష్ఠే సేనావాహే మమ ద్విషి॥ 7
తత్ కర్మ కృతవానద్య కథం నిద్రాం నిషేవసే।
అక్కడికి వెళ్తూనే సైరంధ్రి ఇలా అంది. 'ఆర్యపుత్రా! నా శత్రువు, మహాపాపి అయిన సేనాపతి నాపట్ల అలా అవమానకరంగా ప్రవర్తించినా వాడు బ్రతికి ఉండగానే నేడు నీకు నిద్ర ఎలా పడుతోంది? (7 1/2)
వైశంపాయన ఉవాచ
ఏవముక్త్వాథ తాం శాలాం ప్రవివేశ మనస్వినీ॥ 8
యస్యాం భీమస్తథా శేతే మృగరాజ ఇవ శ్వసన్।
వైశంపాయనుడంటున్నాడు. ఇలా అంటూనే మనస్విని ద్రౌపది ఆ భవనంలో ప్రవేశించింది. అక్కడ సింహంవలె ఉచ్ఛ్వాసనిశ్వాసాలు తీస్తూ భీముడు నిద్రిస్తూ ఉన్నాడు. (8 1/2)
తస్యా రూపేణ సా శాలా భీమస్య చ మహాత్మనః॥ 9
సమ్మూర్ఛితేవ కౌరవ్య ప్రజజ్వాల చ తేజసా।
సా వై మహానసం ప్రాప్య భీమసేనం శుచిస్మితా॥ 10
సర్వశ్వేతేవ మాహేయీ వనే జాతా త్రిహాయణీ।
ఉపాతిష్ఠత పాంచాలీ వాసితేన నరర్షభమ్॥ 11
కురునందనా! ఆ ద్రౌపది యొక్క దివ్యరూపంచేత మహాత్ముడైన భీమునియొక్క పాకశాల శోభాసమృద్ధిని పొంది తేజస్సుతో ప్రకాశించింది. పవిత్రమైన చిరునవ్వు కల ద్రౌపది పాకశాలలో ప్రవేశించి జలములనుండి పుట్టి శరీరమంతా తెల్లదనం కలిగిన మూడేళ్ల గోవువలె శ్రేష్ఠుడైన భీమసేనుని దగ్గరకు వెళ్లింది. (9-11)
వి॥ ఇక్కడ మనోహరమైన ఉపమానం ఉంది. భీముని 'నరునిగా మరియు ఋషభు'నిగా (ఋషభం-ఎద్దు) పోల్చి, అతని వద్దకు వెళ్లిన ద్రౌపదిని 'మాహేయీ'(గోవు) గా పోల్చడం జరిగింది.
వి॥సం॥ త్రిహాయణీ = త్రీణి హ ఆయనాని ఆగమనాని
యస్యాస్సా = మూడు జన్మలు గలది.
కృతయుగే వేదవతీ త్రేతాయాం జనకాత్మజా।
ద్వాపరే ద్రౌపదీ జాతా తేన కృష్ణా త్రిహాయనీ॥
కృతయుగంలో వేదవతి, త్రేతాయుగంలో సీత, ద్వాపరయుగంలో ద్రౌపది కాబట్టి కృష్ణ మూడు జన్మలు గలది. (విష)
సా లతేవ మహాశాలం ఫుల్లం గోమతితీరజమ్।
పరిష్వజత పాంచాలీ మధ్యమం పాండునందనమ్॥ 12
గోమతి తీరంలో మొలిచి బాగా పెరిగిన ఉన్నతమైన సాలవృక్షాన్ని లత అల్లుకు పోయినట్లుగా పాంచాలి పాండవమధ్యముని ఆలింగనం చేసుకొంది. (12)
వి॥సం॥ మధ్యమమ్ = పాండుకుమారుడైన భీముని
పాండవులలో ధర్మజుడు జ్యేష్ఠుడు. నకులసహదేవులు కవలలు. కాబట్టి ఒక్కటిగానే పరిగణనం. వారు కనిష్ఠులు. ఇక మధ్యములు భీమార్జునులు. సందర్భాన్ని బట్టి ప్రస్తుతం అర్జునుడు బృహన్నలా రూపంలో వున్నవాడు కాబట్టి మిగిలిన భీమసేనుడే మధ్యముడు. (నీల)
మధ్యమమ్ = మధ్యవయస్కుని లేదా ధర్మరాజు అర్జునులమధ్య పుట్టినవానిని లేదా పేరు మధ్యలో మకారం గలవానిని. భీమసేనుని(అర్జు)
ద్రౌపది లతవలె భీమసేనుని అల్లుకొన్నది. లతావేష్టితక మన్నది ఆలింగన విశేషం. (నీల)
కొంతకాలంనుండి పాండవులకు దూరంగా ఉంది కాబట్టి కామాధిక్యంవలన, ప్రకృతమైన కీచకవధ పెద్దపని కాబట్టి దానికి ప్రేరకంగా, తీగలా కోమలమైనది కాబట్టి తత్సూచనగా ద్రౌపది గట్టిగా తీగ అల్లుకొన్నట్లు కౌగిలించుకొన్నదని చెప్పటం. (నీల)
బాహుభ్యాం పరిరభ్యైనం ప్రాబోధయదనిందితా।
సింహం సుప్తం వనే దుర్గే మృగరాజవధూరివ॥ 13
ఆమె అతనిని రెండుచేతులతో బిగించి పట్టుకొని దుర్గమమైన వనంలో నిద్రిస్తున్న సింహాన్ని ఆడసింహంవలె మేల్కొలిపింది. (13)
భీమసేనముపాశ్లిష్యత్ హస్తినీవ మహగజమ్।
వీణేవ మధురాలాపా గాంధారం సాధు మూర్ఛతీ।
అభ్యభాషత పాంచాలీ భీమసేనమనిందితా॥ 14
ఆడఏనుగు గజరాజును ఆలింగనం చేసుకొన్నట్లుగా అనిందితురాలైన పాంచాలరాజకుమారి భీమసేనుని కౌగిలించుకొని గాంధారంలో మధురధ్వనిని వినిపించే వీణవలె తీయని మాటలతో ఇలా అంది. (14)
ఉత్తిష్ఠోత్తిష్ఠ కిం శేషే భీమసేన యథా మృతః।
నామృతస్య హి పాపీయాన్ భార్యామాలభ్య జీవతి॥ 15
'భీమసేనా! లే లెమ్ము. ఏమిటిలా (దీర్ఘ నిద్ర పోతున్నావు?) శవంలా పడి ఉన్నావు! (నీవంటి వీరుడైన) పురుషుడు జీవించి ఉండగా అతని భార్యను స్పృశించిన మహా పాపాత్ముడైన వాడు జీవించి ఉండకూడదు కదా!' (15)
స సంప్రహాయ శయనం రాజపుత్ర్యా ప్రబోధితః।
ఉపాతిష్ఠత మేఘాభః పర్యంకే సోపసంగ్రహే॥ 16
అథాబ్రవీద్ రాజపుత్రీం కౌరవ్యో మహిషీం ప్రియామ్।
కేనాస్యర్థేన సంప్రాప్తా త్వరితేవ మమాంతికమ్॥ 17
న తే ప్రకృతిమాన్ వర్ణః కృశా పాండుశ్చ లక్ష్యసే।
అచక్ష్వ పరిశేషేణ సర్వం విద్యామహం యథా॥ 18
రాజకుమారి ద్రౌపది మేలుకొలుపగానే మేఘంవలె నల్లని వర్ణం కల కురునందనుడు భీమసేనుడు మెత్తగా పరచిన ప్రక్కమీది నుండి లేచి కూర్చున్నాడు. తనకు ప్రియమైన రాణితో ఇలా అన్నాడు. "దేవి! ఏ పనిమీద నీవింత తొందరపడి నాదగ్గరకు వచ్చావు? నీ శరీరకాంతి ఎప్పటివలె లేదు. నిరుత్సాహంగా కనిపిస్తున్నావు. నీవు పాలిపోయి చిక్కిపోయి కనిపిస్తున్నావు. నాకు విషయమంతా పూర్తిగా తెలిసేలా చెప్పు. (16-18)
వి॥తె॥ ఇక్కడ భీముడు ముందుగా ద్రౌపదిని "ఎవ్వరు కానకుండునట్లుగా చనుదెంచితే!" అని అడుగుతాడు. ఆవేశపరుడనుకొనే భీమునికి కూడా అజ్ఞాతవాస దృష్టి ఎంతగా ఉందో తెలుస్తుంది.
సుఖం వా యది దుఃఖం ద్వేష్యం వా యది వా ప్రియమ్।
యథావత్ సర్వమాచక్ష్వ శ్రుత్వా జ్ఞాస్యామి యత్ క్షమమ్॥ 19
నీవు సుఖమైనా, దుఃఖమైనా, కీడయినా, మేలయినా విషయమంతా ఉన్నదున్నట్లుగా చెప్పు. అదంతా విన్నాక నేను దానిని నిహరించడానికి తగిన ఉపాయాన్ని ఆలోచిస్తాను. (19)
అహమేవ హి తే కృష్ణే విశ్వాస్యః సర్వకర్మసు।
అహమాపత్సు చాపి త్వాం మోక్షయామి పునః పునః॥ 20
కృష్ణా! అన్ని పనులలోను నేనే నీకు విశ్వాసపాత్రుడను. నేనే అన్ని ఆపదలనుండి మాటిమాటికి సహాయపడి నిన్ను తప్పిస్తున్నాను. (20)
శీఘ్రముక్త్వా యథాకామం యత్ తే కార్యం వివక్షితమ్।
గచ్ఛ వై శయనాయైవ పురా నాన్యేన బుధ్యతే॥ 21
కాబట్టి నీకి ఇష్టమైన రీతిగా ఏపని గూర్చి ఏమి చెప్పదలచుకొన్నావో అది వెంటనే చెప్పి, ఇతరులెవరికీ తెలియకముందే నీ శయనగృహానికి వెళ్లిపో.' (21)
ఇతి శ్రీమహాభారతే విరాటపర్వణి కీచకవధ పర్వణి ద్రౌపదీ భీమసంవాదే సప్తదశోఽధ్యాయః॥ 17 ॥
ఇది శ్రీమహాభారతమున విరాటపర్వమున కీచకవధ పర్వమను ఉపపర్వమున
ద్రౌపదీ - భీముల సంభాషణ అను పదునేడవ అధ్యాయము. (17)