307. మూడువందల ఏడవ అధ్యాయము

కుంతి గర్భవతి అగుట.

వైశంపాయన ఉవాచ
సా తు కన్యా బహువిధం బ్రువంతీ మధురం వచః ।
అనునేతుం సహస్త్రాంశుం న శశాక మనస్వినీ ॥ 1
వైశంపాయనుడిలా అన్నాడు.
మనస్వినియైన ఆ కన్య అనేకవిధాలుగా మధురంగా మాటాడినా కూడా సూర్యుని ఒప్పించలేకపోయింది. (1)
వ శశాక యదా బాలా ప్రత్యాఖ్యాతుం తమోనుదమ్ ।
భీతా శాపాత్ తతో రాజన్ దధ్యౌ దీర్ఘమథాంతరమ్ ॥ 2
రాజా! సూర్యుని తిరస్కరించటానికి శక్తిలేక ఆ బాల శాపానికి భయపడి చాలాసేపు జరుగబోయే దానిని గూర్చి ఆలోచించింది. (2)
అనాగసః పితుః శాపః బ్రాహ్మణస్య తథైవ చ ।
మన్నిమిత్తః కథం న స్యాత్ క్రుద్ధాదస్మాద్ విభావసోః ॥ 3
నా కారణంగా కోపించిన ఈ సూర్యుని వలన నిరపరాధి అయిన నా తండ్రికి, ఆ బ్రాహ్మణునకు శాపం తప్పిపోయే మార్గమేది? (3)
బాలేనాపి సతా మోహాద్ భృశం పాపకృతాన్యపి ।
నాభ్యాసాదయితవ్యాని తేజాంసి చ తపాంసి చ ॥ 4
సజ్జన బాలుడయినా సరే తీవ్రమోహంతో పాపరహితమైన తేజస్సునకూ, తపస్సునకూ దగ్గరగా వెళ్ళకూడదు. (4)
సాహమద్య భృశం భీతా గృహీతా చ కరే భృశమ్ ।
కథం త్వకార్యం కుర్యాం వై ప్రదానం హ్యాత్మనః స్వయమ్ ॥ 5
కానీ నేను చాలా భయపడుతున్నాను. సూర్యదేవుని చేతికి చిక్కాను. అయినా సరే స్వయంగా ఆత్మప్రదానమనే అకృత్యాన్ని ఎలా చేయగలను? (5)
వైశంపాయన ఉవాచ
సా వై శాపపరిత్రస్తా బహు చింతయతీ హృదా ।
మోహేనాభిపరీతాంగీ స్మయమానా పునః పునః ॥ 6
తం దేవమబ్రవీత్ భీతా బంధూనాం రాజసత్తమ ।
వ్రీడావిహ్వలయా వాచా శాపత్రస్తా విశాంపతే ॥ 7
వైశంపాయనుడిలా అన్నాడు.
రాజసత్తమా! ఆ పృథ శాపానికి భయపడుతూ మనస్సులో పరిపరివిధాలుగా ఆలోచించింది. ఆమె శరీరమంతా మోహం క్రమ్మింది. మాటిమాటికి విస్మయానికి లోనవుతోంది. ఒకవైపు శాపభయం. మరొక వైపు బంధువులను గూర్చిన భయం. రాజా! ఈ స్థితిలో ఆమె సిగ్గుతో తడబడుతున్న మాటలతో సూర్యునితో ఇలా అన్నది. (6,7)
కుంత్యువాచ
పితా మే ధ్రియతే దేవ మాతా చాన్యే చ బాంధవాః ।
న తేషు ధ్రియమాణేషు విధిలోపో భవేదయమ్ ॥ 8
దేవా! నాతండ్రి జీవించియున్నాడు. నాతల్లి, ఇతర బంధువులూ బ్రతికియున్నారు. వారు జీవించియుండగా ఈ ధర్మలోపం జరుగకూడదు. (8)
త్వయా తు సంగమో దేవ యది స్యాద్ విధివర్జితః ।
మన్నిమిత్తం కులస్యాస్య లోకే కీర్తిర్నశేత్ తతః ॥ 9
దేవా! తమరితో సమాగమం ధర్మహీనమయితే నా కారణంగా మావంశానికి కీర్తిలోపం కలుగుతుంది. (9)
అథవా ధర్మమేతం త్వం మన్యసే తపతాం వర ।
ఋతే ప్రదానాద్ బంధుభ్యః త్వ కామం కరోమ్యహమ్ ॥ 10
సూర్యదేవా! బంధువులు కన్యాదానం చేయకపోయినా మన సమాగమాన్ని తమరు ధర్మసమ్మతమని భావిస్తే తమకోరిక తీరుస్తాను. (10)
ఆత్మప్రదానం దుర్ధర్ష తవ కృత్వా సతీ త్వహమ్ ।
త్వయి ధర్మో యశశ్చైవ కీర్తిరాయుశ్చ దేహినామ్ ॥ 11
దుర్ధర్షా! దేహార్పణం చేసికూడా నేను సాధ్విగానే ఉండగలనా? ప్రాణుల ధర్మం, యశస్సు, కీర్తి, ఆయుస్సు అన్నీ నీయందే ప్రతిష్ఠితమై ఉన్నాయి. (11)
సూర్య ఉవాచ
న తే పితా న తే మాతా గురవో వా శుచిస్మితే ।
ప్రభవంతి వరారోహే భద్రం తే శృణు మే వచః ॥ 12
సూర్యుడిలా అన్నాడు.
శుచిస్మితా! నీకు మేలు జరుగుతుంది. వరారోహా! నామాటవిను. నీ తండ్రి కానీ, తల్లికానీ, ఇతరగురువులు కానీ దీనిని ఆపలేరు. (12)
సర్వాన్ కామయతే యస్మాత్ కమేర్ధాతోశ్చ భావిని ।
తస్మాత్ కన్యేహ సుశ్రోణి స్వతంత్రా వరవర్ణిని ॥ 13
భావినీ! కమ్ ధాతువు నుండి కన్యాశబ్ధం పుట్టింది. తనకు నచ్చినవానిని స్వతంత్రంగా కోరుకుంటుంది. సుందరీ! సుశ్రోణీ! అందువలననే ఆమె కన్య. (13)
నాధర్మశ్చరితః కశ్చిత్ త్వయా భవతి భావిని ।
అధర్మం కుత ఏవాహం వరేయం లోకకామ్యయా ॥ 14
భావినీ! నా సమాగమంతో నీవు అధర్మం చేసినట్టు కాదు.లౌకిక కామానికై నేను అధర్మాన్ని ఎలా స్వీకరిస్తాను? (14)
అనావృతాః స్త్రియః సర్వాః నరాశ్చ వరవర్ణిని ।
స్వభావ ఏష లోకానాం వికారోఽన్య ఇతి స్మృతః ॥ 15
వరవర్ణినీ! నాకు సంబంధించి స్త్రీపురుషులందరూ ఆవరణశూన్యులే. ఇతరవికారాలన్నీ లౌకికమానవ స్వభావానికి సంబంధించినవి. (15)
సా మయా సహ సంగమ్య పునః కన్యా భవిష్యసి ।
పుత్రశ్చ తే మహాబాహుః భవిష్యతి మహాయశాః ॥ 16
కాబట్టి నాతో సంగమించినా మరల కన్యగానే మిగలగలవు. మహాబాహువు, మహాయశస్వి అయిన కొడుకు నీకు పుడతాడు. (16)
కుంత్యువాచ
యది పుత్రో మమ భవేత్ త్వత్తః సర్వతమోనుద ।
కుండలీ కవచీ శూరః మహాబాహుర్మహాబలః ॥ 17
కుంతి ఇలా అన్నది.
చీకట్టు తొలగించే సూర్యదేవా! తమ వలన నాకు పుట్టే కొడుకు సహజకవచకుండలాలతో మహాబాహువు, మహాబలుడు అయి ఉండాలి. (17)
సూర్య ఉవాచ
భవిష్యతి మహాబాహుః కుండలీ దివ్యవర్మభృత్ ।
ఉభయం చామృతమయం తస్య భద్రే భవిష్యతి ॥ 18
సూర్యుడిలా అన్నాడు.
కళ్యాణీ! నీ కొడుకు దివ్యకవచాన్నీ, కుండలాలను ధరించి మహాబాహువు కాగలడు. ఆ కవచకుండలాలు అమృతమయాలుగా అతనికుంటాయి. (18)
కుంత్యువాచ
యద్యేతదమృతాదస్తి కుండలే వర్మ చోత్తమమ్ ।
మమ పుత్రస్య యం వై త్వం మత్త ఉత్పాదయిష్యసి ॥ 19
అస్తు మే సంగమో దేవ యథోక్తం భగవంస్త్వయా ।
త్వద్వీర్యరూపసత్త్వౌజాః ధర్మయుక్తోభవేత్ స చ ॥ 20
కుంతి ఇలా అన్నది.
తమ వలన నాకు కలుగబోయే కొడుకుకు అమృతం నుండి పుట్టిన కుండలాలు, ఉత్తమకవచమూ ఉండేటట్లయితే దేవా! భగవాన్! తమరు చెప్పినట్లు తమతో సంగమిస్తాను. ఆ కొడుకు నీ పరాక్రమ, రూప, సత్త్వ, తేజస్సులతో ధర్మాత్ముడు కావాలి. (19,20)
సూర్య ఉవాచ
అదిత్యా కుండలే రాజ్ఞి దత్తే మే మత్తకాశిని ।
తేఽస్య దాస్యామి వై భీరు వర్మ చైవేదముత్తమమ్ ॥ 21
సూర్యుడిలా అన్నాడు.
మత్తకాశినీ! రాజకుమారీ! పిరికిదానా! అదితి నాకు కుండలాల నిచ్చింది. వాటినీ, ఈ ఉత్తమ కవచాన్నీ నీ కొడుకున కిస్తాను. (21)
కుంత్యువాచ
పరమం భగవన్నేవం సంగమిష్యే త్వయా సహ ।
యది పుత్రో భవేదేవం యథా వదసి గోపతే ॥ 22
కుంతి ఇలా అన్నది.
స్వామీ! సూర్యదేవా! ఇది చాలు. తమరు చెప్పిన లక్షణాలతో కొడుకు పుట్టేటట్లయితే తమతో నేను సంగమిస్తాను. (22)
వైశంపాయన ఉవాచ
తథేత్యుక్త్వా తు తాం కుంతీమ్ ఆవివేశ విహంగమః ।
స్వర్భానుశత్రుర్యోగాత్మా నాభ్యాం పస్పర్శ చైవ తామ్ ॥ 23
వైశంపాయనుడిలా అన్నాడు. 'అలాగే' అని రాహు శత్రువు అయిన సూర్యుడు యోగరూపంతో కుంతిలో ప్రవేశించి ఆమె నాభిని స్పృశించాడు. (23)
తతః సా విహ్వలేవాసీత్ కన్యా సూర్యస్య తేజసా ।
పపాత చాథ సా దేవీ శయనే మూఢచేతనా ॥ 24
అప్పుడు ఆ రాజకన్య సూర్యతేజస్సుతో కంపించిపోతూ స్పృహకోల్పోయినట్లు పక్కపై పడిపోయింది. (24)
సూర్య ఉవాచ
సాధయిష్యామి సుశ్రోణి పుత్రం వై జనయిష్యసి ।
సర్వశస్త్రభృతాం శ్రేష్ఠం కన్యా చైవ భవిష్యసి ॥ 25
సూర్యుడిలా అన్నాడు.
సుశ్రోణి! సర్వయోధులలో శ్రేష్ఠుడైన కొడుకును కంటావు. అయినా కన్యగానే ఉంటావు. దానికి తగినట్లు నేను ప్రవర్తిస్తాను. (25)
తతః సా వ్రీడితా బాలా తదా సూర్యమథాబ్రవీత్ ।
ఏవమస్త్వితి రాజేంద్ర ప్రస్థితం భూరివర్చసమ్ ॥ 26
రాజేంద్రా! సంగమసన్నద్ధుడైన మహాతేజస్విని సూర్యుని చూసి ఆ కన్య సిగ్గుపడి "అలాగే కానీ" అని సూర్యునితో అన్నది. (26)
వైశంపాయన ఉవాచ
ఇతి స్మో క్తా కుంతిరాజాత్మజా సా
వివస్వంతం యాచమానా సలజ్జా ।
తస్మిన్ పుణ్యే శయనీయే పపాత
మోహావిష్టా భజ్యమానా లతేవ ॥ 27
వైశంపాయనుడిలా అన్నాడు.
అలా పలికి కుంతీకుమారి కుమారునికై సూర్యుని యాచిస్తూ సిగ్గుతో, మోహంతో వ్రాలిన తీగవలె పవిత్రశయ్యపై పడిపోయింది.(27)
తిగ్మాంశుస్తాం తేజసా మోహయిత్వా
యోగేనావిశ్యాత్మసంస్థాం చకార ।
న చైవైనాం దూషయామాస భానుః
సంజ్ఞాం లేభే భూయ ఏవాథ బాలా ॥ 28
సూర్యుడు తన తేజస్సుతో ఆమెను మోహింపజేసి, యోగశక్తితో ఆమెలో ప్రవేశించి వీర్యస్థాపన చేశాడు. ఆమె కన్యాభావం కలుషితం కాలేదు. అప్పుడు ఆ పృథ చైతన్యాన్ని పొంది లేచింది. (28)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి కుండలాహరణపర్వణి సూర్యకుంతీ సమాగమే సప్తాధికత్రిశతతమోఽధ్యాయః ॥ 307 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున కుండలాహరణపర్వమను ఉపపర్వమున సూర్యకుంతీసమాగమమను మూడువందల యేడవ అధ్యాయము. (307)