308. మూడువందల ఎనిమిదవ అధ్యాయము
కర్ణపరిత్యాగము.
వైశంపాయన ఉవాచ
తతో గర్భః సమభవత్ పృథాయాః పృథివీపతే ।
శుక్లే దశోత్తరే పక్షే తారాపతిరివాంబరే ॥ 1
వైశంపాయనుడిలా అన్నాడు.
రాజా! అప్పుడు పృథ గర్భవతి అయినది. ఆకాశంలో చంద్రుడు ఉదయించినట్లు పదకొండవనెల శుక్లపక్షప్రతిపత్తున ఆమె గర్భాన్ని ధరించింది. (1)
వి॥ 'దశోత్తరే' అంటే పదకొండవ నెల అని అర్ధం. చైత్రంతో ప్రారంభిస్తే మాఘమాసం పదకొండవనెల అవుతుంది. ఒకప్పుడు మార్గశీర్షంతో సంవత్సర గణన ప్రారంభమయ్యేదన్న అభిప్రాయమొకటుంది. ఆ లెక్కన పదకొండవనెల అంటే ఆశ్వయుజమాసం.
సా బాంధవభయాద్ బాలా గర్భం తం వినిగూహతీ ।
ధారయామాస సుశ్రోణీ న చైనాం బుబుధే జనః ॥ 2
బంధువుల భయం వలన సుశ్రోణి అయిన ఆ పృథ గర్భాన్ని కప్పిపుచ్చుకొంటూ ధరించింది. జనులు దానిని గమనించలేదు. (2)
న హి తాం వేద నార్యన్యా కాచిద్ ధాత్రేయికామృతే ।
కన్యాపురగతాం బాలాం నిపుణాం పరిరక్షణే ॥ 3
ఒక దాది తప్ప మరే స్త్రీ కూడా ఆ గర్భాన్ని గుర్తించలేదు. ఆమె ఎప్పుడూ కన్యల అంతఃపురంలోనే గడుపుతూ నేర్పుగా రహస్యాన్ని కప్పిపెట్టేది. (3)
తతః కాలేన సా గర్భం సుషువే వరవర్ణినీ ।
కన్యైవ తస్య దేవస్య ప్రసాదాదమరప్రభమ్ ॥ 4
కొంతకాలానికి ఆ సుందరి సూర్యదేవుని అనుగ్రహం వలన కన్యగా ఉంటూనే దేవతల వలె తేజస్వి అయిన కొడుకును కన్నది. (4)
తథైవాబద్ధకవచం కనకోజ్జ్వలకుండలమ్ ।
హర్యక్షం వృషభస్కంధం యథాస్య పితరం తథా ॥ 5
ఆ శిశువు తండ్రివలె కవచాన్ని ధరించియున్నాడు. చెవులపై బంగారు కుండలాలు ప్రకాశిస్తున్నాయి. ఆ శిశువు కళ్ళు సింహం కళ్ళవలె ఉన్నాయి. భుజం ఎద్దుమూపురంలా ఉన్నది. (5)
జాతమాత్రం చ తం గర్భం ధాత్య్రా సమ్మంత్య్ర భావినీ ।
మంజూషాయాం సమాధాయ స్వాస్తీర్ణాయాం సమంతతః ॥ 6
మధూచ్ఛిష్టస్థితాయాం సా సుఖాయాం రుదతీ తథా ।
శ్లక్ష్ణాయాం సుపిధానాయామ్ అశ్వనద్యామవాసృజత్ ॥ 7
విచారణశీల యిన పృథ శిశువు పుట్టగానే దాదితో సంప్రదించి ఒక పెట్టెలోపలంతా చక్కగా పక్కపరచి, నీరు ప్రవేశించకుండా లోపల మైనాన్ని పూసి, సుఖాస్పదంగా తయారుచేసి, శిశువును పడుకొనబెట్టి, సున్నితమైన మూతను బిగించి ఏడుస్తూ ఆ పెట్టెను అశ్వనదిలో విడిచింది. (6,7)
జానతీ చాప్యకర్తవ్యం కన్యాయా గర్భధారణమ్ ।
పుత్రస్నేహేన సా రాజన్ కరుణం పర్యదేవయత్ ॥ 8
రాజా! కన్య గర్భాన్ని ధరించటం నిషిద్ధమని తెలిసి కూడా పుత్రస్నేహంతో ఆమె దీనంగా విలపించింది. (8)
సముత్సృజతీ మంజూషామశ్వనద్యాం తదా జలే ।
ఉవాచ రుదతీ కుంతీ యాని వాక్యాని తచ్ఛృణు ॥ 9
అప్పుడు అశ్వనదీ జలంలో ఆ పెట్టెను వదలుతూ, విలపిస్తూ కుంతి పలికిన మాటలను విను. (9)
స్వస్తి తే చాంతరిక్షేభ్యః పార్థివేభ్యశ్చ పుత్రక ।
దివ్యేభ్యశ్చైవ భూతేభ్యః తథా తోయచరాశ్చ యే ॥ 10
బిడ్డా! జలచర, భూచర, గగనచర, దివ్యప్రాణుల ద్వారా నీకు శుభం కలుగుగాక! (10)
శివాస్తే సంతు పంథానః మా చ తే పరిపంథినః ।
ఆగతాశ్చ తథా పుత్ర భవంత్వద్రోహచేతసః ॥ 11
దారి నీకు శుభప్రదం అగుగాక! నీకు శత్రువులు లేకుందురుగాక! ఒకవేళ ఉన్నా వారు నీకు ద్రోహం చేయకుందురు గాక! (11)
పాతు త్వాం వరుణో రాజా సలిలే సలిలేశ్వరః ।
అంతరిక్షేఽంతరిక్షస్థః పవనః సర్వగస్తథా ॥ 12
జలాధిపతి అయిన వరుణుడు నీటిలో నిన్ను కాపాడుగాక! ఆకాశంలో అక్కడున్న సర్వతోగతి అయిన వాయుదేవుడు నిన్ను రక్షించుగాక! (12)
పితా త్వాం పాతు సర్వత్ర తపనస్తపతాం వరః ।
యేన దత్తోఽసి మే పుత్ర దివ్యేన విధినా కిల ॥ 13
బిడ్డా! దివ్యవిధానంలో నిన్ను నాకిచ్చిన నీతండ్రి - తపనశ్రేష్ఠుడు - సూర్యుడు నిన్ను సర్వత్ర కాపాడుగాక! (13)
ఆదిత్యా వసవో రుద్రాః సాధ్యా విశ్వే చ దేవతాః ।
మరుతశ్చ సహేంద్రేణ దిశశ్చ సదిగీశ్వరాః ॥ 14
రక్షంతు త్వాం సురాః సర్వే సమేషు విషమేషు చ ।
వేత్స్యామి త్వాం విదేశేఽపి కవచేనాభిసూచితమ్ ॥ 15
ఆదిత్యులు, వసువులు, రుద్రులు, సాద్యులు, విశ్వేదేవతలు, మరుత్తులు, ఇంద్రుడు, దిక్కులు, దిక్పాలురు, సమస్తదేవతలు నిన్ను సమవిషమస్థానాలన్నింటా రక్షించుదురుగాక! నీవు ఎక్కడున్నా సహజకవచం కారణంగా నిన్ను గుర్తించగలను. (14,15)
ధన్యస్తే పుత్ర జనకః దేవో భానుర్విభావసుః ।
యస్త్వాం ద్రక్ష్యతి దివ్యేన చక్షుషా వాహినీగతమ్ ॥ 16
భువనభాస్కరుడైన నీ తండ్రి భానుదేవుడు ధన్యుడు. నీవు నదిలో ఉన్ననూ దివ్యనేత్రంతో నిన్ను చూడగలడు. (16)
ధన్యా సా ప్రమదా యా త్వాం పుత్రత్వే కల్పయిష్యతి ।
యస్యాస్త్వం తృషితః పుత్ర స్తనం పాస్యసి దేవజ ॥ 17
బిడ్డా! దేవకుమారా! నిన్ను పుత్రునిగా కల్పించుకొనబోవు ఆ తల్లి ధన్యురాలు. నీవు దప్పికతో ఆ తల్లి స్తన్యాన్నే గ్రోలుతావు. (17)
కో ను స్వప్నస్తయా దృష్టః యా త్వామాదిత్యవర్చసమ్ ।
దియవర్మసమాయుక్తం దివ్యకుండలభూషితమ్ ॥ 18
పద్మాయతవిశాలాక్షం పద్మతామ్రదలోజ్జ్వలమ్ ।
సులలాటం సుకేశాంతం పుత్రత్వే కల్పయిష్యతి । 19
ఆమె ఎంత మంచి కలలు గన్నదో! సూర్యతేజస్సు గలిగి, దివ్యకవచంతో కూడి, దివ్యకుండలాలచే అలంకరింపబడి, తామరవలవంటి విశాలనేత్రాలతో ఎర్రతామరరేకులవంటి కాంతితో, మంచి నుదుటితో, చక్కని జుట్టుతో నున్న నిన్ను కుమారునిగా కల్పించుకొనగలదు. (18,19)
ధన్యా ద్రక్ష్యంతి పుహ్ర త్వాం భూమౌ సంసర్పమాణకమ్ ।
అవ్యక్తకలవాక్యాని వదంతం రేణుగుంఠితమ్ ॥ 20
నీవు నేలపై ప్రాకుతున్న సమయంలో, అవ్యక్తమధురంగా మాటాడుతున్న సమయంలో మట్టిలో ఆడుకొంటూ దుమ్ముకొట్టుకున్న సమయంలో నిన్ను చూసేవారు ఎంత ధన్యులో! (20)
ధన్యా ద్రక్ష్యంతి పుత్ర త్వాం పునర్యౌవనగోచరమ్ ।
హిమవద్వనసంభూతం సింహం కేసరిణం యథా ॥ 21
బిడ్డా! యౌవనంలో హిమాలయప్రాంతాల అరణ్యంలో పుట్టిన కేసరి అయిన సింహం వలె కనిపిస్తున్న నిన్ను చూసేవారెంత ధన్యులో! (21)
ఏవం బహువిధం రాజన్ విలప్య కరుణం పృథా ।
అవాసృజత మంజూషామ్ అశ్వనద్యాస్తదా జలే ॥ 22
రాజా! ఆ విధంగా పలురీతుల దీనంగా విలపించి పృథ అప్పుడు అశ్వనదీజలంలో ఆ పెట్టెను విడిచింది. (22)
రుదతీ పుత్రశోకార్తా నిశీథే కమలేక్షణా ।
ధాత్య్రా సహ పృథా రాజన్ పుత్రదర్శనలాలసా ॥ 23
రాజా! కమలేక్షణ అయిన ఆ పృథ పుత్రశోకంతో దీనురాలై ధాత్రితో పాటు చాలాసేపు ఏడ్చింది. (23)
విసర్జయిత్వా మంజూషాం సంబోధనభయాత్ పితుః ।
వివేశ రాజభవనం పునః శోకాతురా తతః ॥ 24
పెట్టెను వదలి తండ్రి ఎప్పుడైనా పిలవవచ్చునన్న భయంతో శోకాతురయై మరల రాజభవనంలో ప్రవేశించింది. (24)
మంజూషా త్వశ్వనద్యాః సా యయౌ చర్మణ్వతీం నదీమ్ ।
చర్మణ్వత్యాశ్చ యమునాం తతో గంగాం జగామ హ ॥ 25
ఆ పెట్టె అశ్వనది నుండి చర్మణ్వతీనదిలోనికి దాని నుండి యమునలోనికి, యమున నుండి గంగలోనికి చేరింది. (25)
గంగాయాం సూతవిషయం చంపామనుయయౌ పురీమ్ ।
స మంజూషాగతో గర్భః తరంగైరుహ్యమానకః ॥ 26
పెట్టెలోనికి ఆ శివువు అలల మీద తేలుతూ గంగాతీరంలోని చంపాపురికి దగ్గరగానున్న సూతరాజ్యానికి చేరింది. (26)
అమృతాదుత్థితం దివ్యం తనువర్మ సకుండలమ్ ।
ధారయామాస తం గర్భం దైవం చ విధినిర్మితమ్ ॥ 27
అమృతం నుండి పుట్టిన దివ్యకవచం, కుండలాలు విధాత సృష్టి అయిన ఆ దైవకుమారుని రక్షించాయి. (27)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి కుండలాహరణపర్వణి కర్ణపరిత్యాగే అష్టాధికత్రిశతతమోఽధ్యాయః ॥ 308 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున కుండలాహరణపర్వమను ఉపపర్వమున కర్ణపరిత్యాగమను మూడువందల యెనిమిదవ అధ్యాయము. (308)