306. మూడువందల ఆరవ అధ్యాయము

కుంతి సూర్యుని ఆవాహన చేయుట - కుంతీ సూర్యసంవాదము.

వైశంపాయన ఉవాచ
గతే తస్మిన్ ద్విజశ్రేష్ఠే కస్మింశ్చిత్ కారణాంతరే ।
చింతయామాస సా కన్యా మంత్రగ్రామబలాబలమ్ ॥ 1
వైశంపాయనుడిలా అన్నాడు.
ఆ ద్విజశ్రేష్ఠుడు వెళ్ళిపోయిన తరువాత ఏదో కారణం చేత ఆ పృథ మంత్రబలాబలాలను గురించి ఆలోచించింది. (1)
అయం వై కీదృశస్తేన మమ దత్తో మహాత్మనా ।
మంత్రగ్రామో బలం తస్య జ్ఞాస్యే నాతిచిరాదితి ॥ 2
ఆ మహాత్ముడు నా కిచ్చిన ఈ మంత్ర మెటువంటిదో! వెంటనే దాని బలమెంతో తెలిసికోవాలి. (2)
ఏవం సంచింతయంతీ సా దదర్శర్తుం యదృచ్ఛయా ।
వ్రీడితా సాభవద్ బాలా కన్యాభావే రజస్వలా ॥ 3
ఈవిధంగా ఆలోచిస్తున్న ఆమె హఠాత్తుగా తనలో ఋతులక్షణాలు గమనించింది. కన్యావస్థయందే రజస్వల కావటంతో ఆమె సిగ్గుపడింది. (3)
తతో హర్మ్యతలస్థా సా మహార్హశయనోచితా ।
ప్రాచ్యాం దిశి సముద్యంతం దదర్శాదిత్యమండలమ్ ॥ 4
తరువాత ఒకరోజు మేడపై విలువైన శయ్యపై శయనించియున్న ఆమె తూర్పుదిక్కున ఉదయిస్తున్న ఆదిత్యమండలాన్ని చూసింది. (4)
తత్ర బద్ధమనోదృష్టిః అభవత్ సా సుమధ్యమా ।
న చాతప్యత రూపేణ భానోః సంధ్యాగతస్య సా ॥ 5
ఆ సుమధ్యమ దృష్టీ, మనస్సు సూర్యునిపై లగ్నమయ్యాయి. ప్రాతస్సంధ్యలో సూర్యుని చూస్తున్నా ఆమె దృష్టికి అవి గ్రుచ్చుకొనలేదు. (5)
తస్యా దృష్టిరభూద్ దివ్యా సాపశ్యద్ దివ్యదర్శనమ్ ।
ఆముక్తకవచం దేవం కుండలాభ్యాం విభూషితమ్ ॥ 6
ఆమె దివ్యదృష్టిని పొందింది. దివ్యదర్శనాన్ని చూసింది. ఆ సూర్యుడు కవచాన్ని ధరించి కుండలాల నలంకరించుకొని ఉన్నాడు. (6)
తస్యాః కౌతూహలం త్వాసీద్ మంత్రం ప్రతి నరాధిప ।
ఆహ్వానమకరోత్ సాథ తస్య దేవస్య భావినీ ॥ 7
రాజా! మంత్రవిషయంలో ఆమెకు కుతూహలంగానే ఉంది. అప్పుడు ఆ భావిని సూర్యదేవుని ఆహ్వానించింది. (7)
ప్రాణానుపస్పృశ్య తదా హ్యాజుహావ దివాకరమ్ ।
ఆజగామ తతో రాజన్ త్వరమాణో దివాకరః ॥ 8
అప్పుడు ప్రాణాయామం చేసి దివాకరుని ఆవాహన చేసింది. ఆపై సూర్యుడు త్వరపడుతూ వచ్చాడు. (8)
మధుపింగో మహాబాహుః కంబుగ్రీవో హసన్నివ ।
అంగదీ బద్ధముకుటః దిశః ప్రజ్వాలయన్నివ ॥ 9
తేనెవన్నెతో, దీర్ఘబాహువులతో, శంఖం వంటి మెడతో నవ్వుతూ కనిపించాడు సూర్యుడు, అంగదాలు, తలపై కిరీటం ధరించి దిక్కులను వెలిగింపజేస్తున్నాడు. (9)
యోగాత్ కృత్వా ద్విధాఽఽత్మానమ్ ఆజగామ తతాప చ ।
ఆబభాషే తతః కుంతీం సామ్నా పరమవల్గునా ॥ 10
యోగశక్తితో తనను రెండుగా చేసికొని ఒక శరీరంతో వచ్చాడు. రెండవశరీరంతో గగనంలో తపిస్తున్నాడు. మధురమైన సామవచనంతో కుంతితో ఇలా అన్నాడు. (10)
ఆగతోఽస్మి వశం భద్రే తవ మంత్రబలాత్కృతః ।
కిం కరోమి వశో రాజ్ఞి బ్రూహి కర్తా తదస్మి తే ॥ 11
భద్రా! నీ మంత్రబలం వలన ఆకర్షింపబడి నీ అధీనంలోనికి వచ్చాను. రాజకుమారీ! నీ వశంలో ఉండి నేనేం చేయాలి? చెప్పు? ఆ పని చేస్తాను. (11)
కుంత్యువాచ
గమ్యతాం భగవంస్తత్ర యత ఏవాగతో హ్యసి ।
కౌతూహలాత్ సమాహూతః ప్రసీద భగవన్నితి ॥ 12
స్వామీ! తమరు వచ్చిన చోటుకే వెళ్ళండి. కుతూహలం కొద్దీ ఆవాహన చేశాను. భగవాన్! ప్రసన్నులుకండి. (12)
సూర్య ఉవాచ
గమిష్యేఽహం యథా మాం త్వం బ్రవీషి తనుమధ్యమే ।
న తు దేవం సమాహూయ న్యాయ్యం ప్రేషయితుం వృథా ॥ 13
సూర్యుడిలా అన్నాడు.
తనుమధ్యమా! నీవు చెప్పినట్లు వెళ్ళిపోతాను. కానీ దేవుని ఆవాహనచేసి వ్యర్థంగా పంపించటం న్యాయసమ్మతం కాదు. (13)
తవాభిసంధిః సుభగే సూర్యాత్ పుత్రో భవేదితి ।
వీర్యేణాప్రతిమో లోకే కవచీ కుండలీతి చ ॥ 14
సుభగా! సహజ కవచకుండలాలతో లోకంలో సాటిలేని పరాక్రమం గల కొడుకు సూర్యుని ద్వారా కలగాలని నీ మనస్సంకల్పం. (14)
సా త్వమాత్మప్రదానం వై కురుష్వ గజగామిని ।
ఉత్పత్స్యతి హి పుత్రస్తే యథాసంకల్పమంగనే ॥ 15
కాబట్టి గజగామినీ! నీవు నీ శరీరాన్ని నాకు సమర్పించుకో. నీ సంకల్పానికి అనుగుణంగా నీకు కొడుకు పుడతాడు. (15)
అథ గచ్ఛామ్యహం భద్రే త్వయా సంగమ్య సుస్మితే ।
యది త్వం వచనం నాద్య కరిష్యసి మమ ప్రియమ్ ॥ 16
శపిష్యే త్వామహం క్రుద్ధః బ్రాహ్మణం పితరం చ తే ।
త్వత్కృతే తాన్ ప్రధక్ష్యామి సర్వానపి న సంశయః ॥ 17
భద్రా! సుస్మితా! నీతో సంగమించి నా దారిన నేను పోతాను. నామాట మన్నించి నేడు నా ముచ్చట తీర్చకపోతే కోపంతో నిన్ను, ఆ బ్రాహ్మణుని, నీ తండ్రిని కూడా శపిస్తాను. నీ కారణంగా వారినందరినీ నిస్సంశయంగా దహించివేస్తాను. (16,17)
పితరం చైవ తే మూఢం యో న వేత్తి తవానయమ్ ।
తస్య చ బ్రాహ్మణస్యాద్య యోఽసౌ మంత్రమదాత్ తవ ॥ 18
శీలవృత్తమవిజ్ఞాయ ధాస్యామి వినయం పరమ్ ।
నీ అవినీతినెరుగక మూఢుడైన నీతండ్రినీ, నీ శీలవృత్త నియమాల నెరుగక మంత్రప్రదానం చేసిన ఆబ్రాహ్మణుని పూర్తిగా దహిస్తాను. (18 1/2)
ఏతే హి విబుధాః సర్వే పురందరముఖా దివి ॥ 19
త్వయా ప్రలబ్ధం పశ్యంతి స్మయంత ఇవ భావిని ।
పశ్య చైనాన్ సురగణాన్ దివ్యం చక్షురిదం హి తే ।
పూర్వమేవ మయా దత్తం దృష్టవత్యసి యేన మామ్ ॥ 20
భావినీ! దేవేంద్రుడు మొదలుగా గల దేవతలంతా ఆకాశంలో నిలిచి నీచే మోసగింపబడిన నన్ను చూచి నవ్వుతున్నారు. నీకు నేను ఇంతకు ముందే దివ్య దృష్టినిచ్చాను. ఆ దృష్టితోనే నన్ను చూడగలిగావు. ఆ దృష్టితోనే ఆ దేవగణాలను కూడా చూడు. (19,20)
వైశంపాయన ఉవాచ
తతోఽపశ్యత్ త్రిదశాన్ రాజపుత్రీ
సర్వానేవ స్వేషు ధిష్ణ్యేషు స్వస్థాన్ ।
ప్రభావంతం భానుమంతం మహాంతం
యథాఽఽదిత్యం రోచమానాంస్తథైవ ॥ 21
వైశంపాయనుడిలా అన్నాడు.
అప్పుడు రాజకుమారి గగనంలో తమ తమ విమానాలలో కూర్చొనియున్న దేవగణాలను చూచింది. కాంతికిరణాలతో గొప్పగా వెలుగుతున్న సూర్యునివలె వారు కనిపిస్తున్నారు. (21)
సా తాన్ దృష్ట్వా వ్రీడమానేవ బాలా
సూర్యం దేవీ వచనం ప్రాహ భీతా ।
గచ్ఛ త్వం వై గోపతే స్వం విమానం
కన్యాభావాద్ దుఃఖ ఏవాపచారః ॥ 22
వారినందరినీ చూచి సిగ్గుపడి, భయపడి పృథ సూర్యునితో ఇలా అన్నది. "స్వామీ! తమరు తమ విమానంలోనికి వెళ్ళండి. నా కన్యాభావం వలన ఈ దుఃఖదాయకమైన అపచారం జరిగింది. (22)
పితా మాతా గురవశ్చైవ యేఽన్యే
దేహస్యాస్య ప్రభవంతి ప్రదానే ।
నాహం ధర్మం లోపయిష్యామి లోకే
స్త్రీణాం వృత్తం పూజ్యతే దేహరక్షా ॥ 23
నా తండ్రి,తల్లి, ఇతర గురుజనులు మాత్రమే నన్ను ప్రదానం చేయదగినవారు. నేను ధర్మలోపం చేయలేను.
ఈ లోకంలో స్త్రీల నడవడి దేహాన్ని పవిత్రంగా రక్షించుకొంటేనే ప్రశంసార్హ మవుతుంది. (23)
మయా మంత్రబలం జ్ణాతుమ్ ఆహూతస్త్వం విభావసో ।
బాల్యాద్ బాలేతి తత్ కృత్వా క్షంతుమర్హసి మే విభో ॥ 24
సూర్యదేవా! మంత్రబలాన్ని తెలిసికోవాలని నేను తమరిని ఆవాహించాను. స్వామీ! అమాయక బాలికగా నన్ను భావించి క్షమించవలసినది. (24)
సూర్య ఉవాచ
బాలేతి కృతానునయం తవాహం
దదాని నాన్యానునయం లభేత ।
ఆత్మప్రదానం కురు కుంతికన్యే
శాంతిస్తవైవం హి భవేశ్చ భీరు ॥ 25
సూర్యుడిలా అన్నాడు.
కుంతీకుమారీ! బాలికవని భావించియే నిన్ను ఇంతగా అనునయిస్తున్నాను. మరొక స్త్రీనెవ్వరినీ ఇట్లు అనునయించను. పిరికిదానా! నీవు నీ శరీరాన్ని నాకు సమర్పించు. అలా చేసినప్పుడే నీకు ప్రశాంతి. (25)
న చాపి గంతుం యుక్తం హి మయా మిథ్యాకృతేన వై ।
అసమేత్య త్వయా భీరుమంత్రాహుతేన భావిని ॥ 26
గమిష్యామ్యనవద్యాంగి లోకే సమవహాస్యతామ్ ।
సర్వేషాం విబుధానాం చ వక్తవ్యః స్యాం తథా శుభే ॥ 27
భావినీ! అనవద్యాంగీ! నీవు నన్ను మంత్రాలతో ఆవాహన చేశావు. నీతో సంగమింపక నేను వెళ్ళటం ఆ ఆవాహనను వ్యర్థం చేయటమే. అలా జరిగితే నేను లోకంలో పరిహాసాస్పదుడను కాగలను. శుభా! దేవతలందరిలో నేను ఎత్తిచూపబడతాను. (26,27)
సా త్వం మయా సమాగచ్ఛ లప్స్యసే మాదృశం సుతమ్ ।
విశిష్టా సర్వలోకేషు భవిష్యసి న సంశయః ॥ 28
అందువలన నాతో సంగమించు. నావంటి కొడుకు పుడతాడు. లోకంలో విశిష్టస్త్రీవి కాగలవు. సందేహం లేదు. (28)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి కుండలాహరణపర్వణి సూర్యాహ్వానే షడధికత్రిశతతమోఽధ్యాయః ॥ 36 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున కుండలాహరణపర్వమను ఉపపర్వమున సూర్యాహ్వానమను మూడువందల ఆరవ అధ్యాయము. (306)