మార్కండేయుడు చెపుతున్నాడు - లంకయొక్క ఆ వనంలో అన్న పానీయాలు సమృద్ధిగా ఉన్నాయి. కందమూలఫలాలు చాలా లభ్యం అవుతున్నాయి. శ్రీరాముడు అక్కడే సైన్యాన్ని ఉంచి, విధిపూర్వకంగా దానిని రక్షిస్తున్నాడు. (1)
లంకలో రావణుడు యుద్ధశాస్త్రాన్ని అనుసరించి నిర్మించే యుద్ధసామగ్రిని (యంత్ర నిర్మిత శతఘ్నులు మొదలైనవి) సేకరించడం మొదలుపెట్టాడు. లంకయొక్క ప్రహరీగోడలు, నగర ద్వారాలు స్వతస్సిద్ధంగానే ఇతరులు ఎవరూ లోపలకు ప్రవేశించడానికి సాధ్యంకానంత బలిష్ఠమైనవి. (2)
నగరానికి నలువైపులా లోతైన నీటితో నిండిన ఏడు అగడ్తలు ఉన్నాయి. వాటిలో చేపలు, మొసళ్లు మొదలైనవి నిరంతరం తిరుగుతూ ఉంటాయి. (3)
ఆ పరిఖలు (అగడ్తలు) బలిష్ఠమైన తలుపులతో, రాళ్లు విసిరే యంత్రాలతోను కూడి ఉన్నాయి. అక్కడ కొమ్ములు, రాళ్లు గుట్టలుగా ఉన్నాయి. ఇంకా విషసర్పాలు, సైనికులు, లక్కరసం, ధూళి - ఇవన్నీ ఉండడం వలన అవి ఎవరికీ చొరశక్యం కాకుండా ఉన్నాయి. (4)
ముసలాలు, ఆలాతాలు, బాణాలు, తోమరాలు, కత్తులు, గండ్రగొడ్డళ్లు, శతఘ్నులు, మైనం పూసిన ముద్గరాలు మొదలైన వివిధ ఆయుధాలతో కూడి ఉండడం వలన కూడా అవి దుర్భేద్యంగా ఉన్నాయి. (5)
నగరద్వారాలన్నింటి యందు బురుజులున్నాయి. అందులో స్థిరంగా ఉండి కొందరు, అటు ఇటు తిరుగుతూ కొందరు కాపలా కాసే సైనికులున్నారు. వీటిని గుల్మములు అంటారు. అనేకమైన పత్తులు (సేనావిశేషం) ఉన్నాయి. అధికమైన గజ, అశ్వసైన్యం ఉంది. (6)
వి॥ గుల్మం, పత్తి, వాహిని, పృతన, గణం, అక్షౌహిణి - ఇవన్నీ సేనావిశేషాలు.
అంగదుడు ఇలాంటి లంకానగరం యొక్క ప్రవేశద్వారాన్ని సమీపించాడు. రాక్షసరాజు రావణునికి దూత వచ్చాడని తెలిసింది. అతని అనుమతితో నిర్భయుడై మహాబలుడైన అంగదుడు లోపలకు ప్రవేశించాడు. అసంఖ్యాకమైన రాక్షసకోటల మధ్య అతడు మేఘపంక్తుల నడుమ ఉన్న సూర్యునిలా శోభిల్లాడు. (7,8)
మంత్రులు పరివేష్టించి ఉండగా పులస్త్యనందనుడైన రావణుని సమీపించి, మంచి మాటకారి అయిన అంగదుడు రావణుని సంబోధించి శ్రీరామసందేశాన్ని చెప్పడానికి ఉపక్రమించాడు. (9)
ఆహ త్వాం రాఘవో రాజన్ కోసలేంద్రో మహాయశాః ।
ప్రాప్తకాలమిదం వాక్యం తదాదత్వ కురుష్వ చ ॥ 10
రాజా! కోసల దేశపు రాజు, మహాకీర్తిమంతుడూ అయిన రాఘవుడు సమయోచితంగా నీకు ఇలా చెపుతున్నాడు. విని, అలా చెయ్యి. (10)
అకృతాత్మానమాసాద్య రాజానమనయే రతమ్ ।
వినశ్యంత్యనయావిష్టాః దేశాశ్చ నగరాణి చ ॥ 11
తన్ను తాను అదుపులో ఉంచుకోలేని, అవినీతిపరుడైన రాజును ఆశ్రయించి ఉండే దేశాలు గాని, నగరాలు కాని అవినీతిమయములై నశించిపోతాయి. (11)
త్వయైకేనాపరాద్ధం మే సీతామాహరతా బలాత్ ।
వధాయానపరాద్ధానామ్ అన్యేషాం తద్ భవిష్యతి ॥ 12
నీవు సీతను బలవంతంగా అపహరించి నా పట్ల నీవు ఒక్కడివే అపరాధం చేశావు. కాని అది అపరాధం చేయని మిగిలిన వారి చావుకు కూడా కారణమవుతుంది. (12)
యే త్వయా బలదర్పాభ్యామ్ ఆవిష్టేన వనేచరాః ।
ఋషయో హింసితాః పూర్వం దేవాశ్చాప్యవమానితాః ॥ 13
రాజర్షయశ్చ నిహతాః రుదత్యశ్చ హృతాః స్త్రియః ।
తదిదం సమనుప్రాప్తం ఫలం తస్యానయస్య తే ॥ 14
నీవు బలంతో దర్పంతో ఉన్మత్తుడవై పూర్వం అడవులలో నివసించే మునులను హింసించావు. దేవతలను అవమానించావు. రాజర్షులను చంపివేశావు. ఏడుస్తున్న స్త్రీలను అపహరించావు. ఈ నీ అవినయానికి తగినఫలం ఇప్పుడు నీకు ప్రాప్తించబోతోంది. (13,14)
హన్తాస్మి త్వాం సహామాత్యైః యుధ్యస్వ పురుషో భవ ।
పశ్య మే ధనుషో వీర్యం మానుషస్య నిశాచర ॥ 15
నిన్ను నీ మంత్రులతో సహితంగా చంపుతాను. పౌరుషం గలవాడివై యుద్ధం చేయి. నిశాచరా! మానవుడినే అయినా నా వింటిబలం చూడు. (15)
ముచ్యతాం జానకీ సీతా న మే మోక్ష్యసి కర్హిచిత్ ।
అరాక్షసమిమం లోకం కర్తాస్మి నిశితైః శరైః ॥ 16
జనకనందిని అయిన సీతను విడిచిపెట్టు. లేకపోతే నా నుండి ఏవిధంగానూ తప్పించుకోలేవు. వాడి బాణాలతో లోకంలో రాక్షసులే లేకుండా చేస్తాను. (16)
ఇతి తస్య బ్రువాణాస్య దూతస్య పరుషం వచః ।
శ్రుత్వా న మమృషే రాజా రావణః క్రోధమూర్ఛితః ॥ 17
అని చెపుతున్న దూతయొక్క ఆ పరుషవాక్యాలను విని రాజయిన రావణుడు సహించలేకపోయాడు. క్రోధంతో అతనికి ఒళ్లు తెలియలేదు. (17)
ఇంగితజ్ఞాస్తతో భర్తుః చత్వారో రజనీచరాః ।
చతుర్ష్వంగేషు జగృహుః శార్దూలమివ పక్షిణః ॥ 18
ప్రభువు యొక్క ఇంగితాన్ని గుర్తించిన నలుగురు రాక్షసులు పక్షులు పెద్దపులిని పట్టుకొన్నట్లుగా అంగదుని రెండుకాళ్లను, రెండు చేతులను నాలిగింటిని పట్టుకొన్నారు. (18)
తాంస్తథాంగేషు సంసక్తాన్ అంగదో రజనీచరాన్ ।
ఆదాయైవ ఖముత్పత్య ప్రాసాదతలమావిశత్ ॥ 19
ఆ రీతిగా తన కాళ్లుచేతులను పట్టుకొన్న ఆ రాక్షసులను తీసుకొనే అంగదుడు ఆకాశంలోకి ఎగిరి భవనాగ్రాన్ని చేరుకొన్నాడు. (19)
వేగేనోత్పతతస్తస్య పేతుస్తే రజనీచరాః ।
భువిః సంభిన్నహృదయాః ప్రహారవరపీడితాః ॥ 20
పైకి ఎగురుతున్న అతని వేగానికి ఆ రాక్షసులు నలుగురు నేలపై పడిపోయారు. వారి గుండెలు పగిలిపోయాయి. గట్టి దెబ్బలకు వారు విలవిలలాడిపోయారు. (20)
సంసక్తో హర్మ్యశిఖరాత్ తస్మాత్ పునరవాపతత్ ।
లంఘయిత్వా పురీం లంకాం సువేలస్య సమీపతః ॥ 21
మేడపై నిలిచిన అంగదుడు తిరిగి ఆ భవనశిఖరం నుండి భూమిపైకి దూకాడు. లంకాపురిని దాటుకొని సువేల పర్వత సమీపానికి చేరుకొన్నాడు. (21)
కోసలేంద్రమథాగమ్య సర్వమావేద్య వానరః ।
విశశ్రామ స తేజస్వీ రాఘవేణాభినందితః ॥ 22
కోసలరాజయిన రాఘవుని వద్దకు వచ్చి ఆ వానరుడు జరిగినదంతా చెప్పాడు. అతడు అభినందించాడు. ఆపై ఆ పరాక్రమశాలి విశ్రాంతి తీసుకొన్నాడు. (22)
తతః సర్వాభిసారేణ హరీణాం వాతరంహసామ్ ।
భేదయామాస లంకాయాః ప్రాకారం రఘునందనః ॥ 23
ఆ తరువాత రఘునందనుడు శ్రీరామచంద్రుడు గాలితో సమానమైన వేగం కల వానరసైన్యం అంతటితో కలిసి లంకానగరం యొక్క ప్రాకారాలను భేదించివేశాడు. (23)
విభీషణర్ క్షాధిపతీ పురస్కృత్యాథ లక్ష్మణః ।
దక్షిణం నగరద్వారమ్ అవామృద్గాద్ దురాసదమ్ ॥ 24
లక్ష్మణుడు విభీషణ జాంబవంతులను ముందుంచుకొని అభేద్యమైన దక్షిణనగరద్వారాన్ని మట్టిలో కలిపేశాడు. (24)
కరభారుణపాండూనాం హరీణాం యుద్ధశాలినామ్ ।
కోటీశతసహస్రేణ లంకామభ్యపపత్ తదా ॥ 25
అనంతరం అరచేతి వర్ణంలా ఎఱ్ఱగా తెల్లగా ఉన్న యుద్ధకుశలులు అయిన శతసహస్రకోట్ల వానరులతో రాముడు లంకలో ప్రవేశించాడు. (25)
ప్రలంబ బాహూరుకరజంఘాంతరవిలంబినామ్ ।
ఋక్షాణాం ధూమ్రవర్ణానాం తిస్రః కోట్యో వ్యవస్థితాః ॥ 26
బాగా పొడవుగా ఉన్న బాహువులు, ఊరువులు, చేతులు, పిక్కలు అన్నీ విశాలంగా ఉన్న, ధూమ్రవర్ణంలో ఉన్న ఋక్షవీరులు మూడుకోట్లమంది అతనితో పాటు లంకలో ప్రవేశించి యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు. (26)
ఉత్పతద్భిః పతద్భిశ్చ నిపతద్భిశ్చ వానరైః ।
నాదృశ్యత తదా సూర్యః రజసా నాశితప్రభః ॥ 27
వానరులు ఎగురుతూ, గంతులు వేస్తూంటే రేగిన ధూళిచేత కాంతి నశించి సూర్యుడు కనపడలేదు. (27)
శాలిప్రసూనసదృశైః శిరీషకుసుమప్రభైః ।
తరుణాదిత్యసదృశైః శణగౌరైశ్చ వానరైః ॥ 28
ప్రాకారం దదృశుస్తే తు సమంతాత్ కపిలీకృతమ్ ।
రాక్షసా విస్మితా రాజన్ సస్త్రీవృద్ధాః సమంతతః ॥ 29
ఆ వానరులు శాలిధాన్యపు పూలరంగులో, శిరీషపుష్పకాంతుల ఉదయసూర్యులవలె, శణముల వలె తెలుపురంగులో ఉండి ప్రాకారాలన్నింటినీ అన్నివైపుల నుండి కపిలవర్ణంలా కనిపింపచేశారు. రాజా! స్త్రీలు, వృద్ధులతో సహితంగా రాక్షసులందరూ అన్నివైపుల నుండి వారిని ఆశ్చర్యచకితులై చూశారు. (28,29)
బిభిదుస్తే మణిస్తంభాన్ కర్ణాట్టశిఖరాణి చ ।
భగ్నోన్మథితశృంగాణి యంత్రాణి చ విచిక్షిపుః ॥ 30
వారు మణిస్తంభాలను, భవనగోపురాలను, విరుగకొట్టారు. రాళ్లను విసిరే యంత్రాల కొమ్ములను విరుగకొట్టి విసిరివేశారు. (30)
వి॥సం॥ కర్ణాట్టమ్ దిక్కోణ చతురస్త్రాల మీద విదిక్కోడొ చతురస్రం, దానిపై మరల దిక్కోడొ చతురస్రం, ఆపై విదిక్కోణ చతురస్రం - ఈ క్రమంలో కల్పోక్త రీతిలో చతురస్త్రాలతో పాషాదులతో నిర్మించే గృహం - (నీల)
పరిగృహ్య శతఘ్నీశ్చ సచక్రాః సహుడోపలాః ।
చిక్షిపుర్భుజవేగేన లంకామధ్యే మహాస్వనాః ॥ 31
చక్రాలతో కూడిన శతఘ్నులను, కొమ్ములను, గోళాలను పట్టుకొని భీకరధ్వనులు చేస్తూ వానరులు తమ చేతులసత్తువ కొద్దీ వాటిని లంకమధ్యలోకి విసిరివేశారు. (31)
ప్రాకారస్థాశ్చ యే కేచిత్ నిశాచరగణాస్తథా ।
ప్రదుద్రువుస్తే శతశః కపిభిః సమభిద్రుతాః ॥ 32
అప్పుడు ప్రాకారాల మీద రక్షకులుగా ఉన్న వందలకొద్దీ నిశాచరులు వానరులు తరుమగా పారిపోయారు. (32)
తతస్తు రాజవచనాద్ రాక్షసాః కామరూపిణః ।
నిర్యయుర్వికృతాకారాః సహస్రశతసంఘశః ॥ 33
అనంతరం రాజాజ్ఞపై కామరూపధారులయిన లక్షలమంది రాక్షసులు వికృతాకారంతో ఉన్నవారు గుంపులుగుంపులుగా నగరం బయటకు వచ్చారు. (33)
శస్త్రవర్షాణి వర్షంతో ద్రావయిత్వా వనౌకసః ।
ప్రాకారం శోభయంతస్తే పరం విక్రమమాస్థితాః ॥ 34
ప్రాకారశోభను ఇనుమడింపచేస్తూ శస్త్రవర్షాన్ని కురిపిస్తున్న వారు వనౌకసులయిన వానరులను తరిమి తరిమి కొట్టి, తమ పరాక్రమాన్ని ప్రదర్శించారు. (34)
స మాషరాశిసదృశైః బభూవ క్షణదాచరైః ।
కృతో నిర్వానరో భూయః ప్రాకారో భీమదర్శనైః ॥ 35
మినుములరాశిలా నల్లగా, చూడడానికి భయం కొలుపుతున్న రాక్షసులు తిరిగి ఆ ప్రాకారాన్ని వానరులు లేకుండా చేసివేశారు. (35)
పేతుః శూలవిభిన్నాంగాః బహవో వానరర్షభాః ।
స్తంభతోరణభగ్నాశ్చ పేతుస్తత్ర నిశాచరాః ॥ 36
రాక్షసులు ప్రయోగించిన శూలాలతో శరీరాలు ముక్కలయిపోయి వానరశ్రేష్ఠులు ఎంతోమంది నశించిపోయారు. వానరులు స్తంభాలను తోరణాలను భగ్నం చేయడం వలన ఎంతోమంది నిశాచరులు వాటికింద పడి నశించారు. (36)
కేశాకేశ్యభవద్ యుద్ధం రక్షసాం వానరైః సహ ।
నఖైర్దంతైశ్చ వీరాణాం ఖాదతాం వై పరస్పరమ్ ॥ 37
రాక్షసులు వానరులు జుట్లు జుట్లు పట్టుకొని యుద్ధం చేశారు. ఆ వీరులు పరస్పరం గోళ్లతో పళ్లతో రక్కుకొన్నారు. (37)
నిష్టనంతో హ్యుభయతః తత్ర వానరరాక్షసాః ।
హతా నిపతితాం భూమౌ న ముంచతి పరస్పరమ్ ॥ 38
రెండువైపుల నుండి వానరరాక్షసవీరులు గర్జిస్తూ యుద్ధం చేస్తూ చేస్తూ చచ్చి భూమిపై పడికూడా ఒకరినొకరు విడిచిపెట్టలేదు. (38)
రామస్తు శరజాలాని వవర్ష జలదో యథా ।
తాని లంకాం సమాసాద్య జఘ్నస్తాన్ రజనీచరాన్ ॥ 39
మేఘుడు నీటిని వర్షించినట్లుగా రాముడు బాణాలను కురిపించాడు. అవి లంకను చేరుకొని అక్కడ ఉండే రాక్షసులను చంపివేశాయి. (39)
సౌమిత్రిరపి నారాచైః దృఢధన్వా జితక్లమః ।
ఆదిశ్యాదిశ్య దుర్గస్థాన్ పాతయామాస రాక్షసాన్ ॥ 40
క్లేశం, అలసటలను జయించిన లక్ష్మణుడు గట్టి ధనుస్సును చేతపట్టుకొని దుర్గంలో ఉన్న రాక్షసులను చెప్పి మరీ బాణాలతో పడగొట్టాడు. (40)
తతః ప్రత్యవహారోఽభూత్ సైన్యానాం రాఘవాజ్ఞయా ।
కృతే విమర్దే లంకాయాం లబ్దలక్ష్యో జయోత్తరః ॥ 41
ఈ రీతిగా లంకను బాగా అతలాకుతలం చేసిన తరువాత లక్ష్యాన్ని సిద్ధింపచేసుకొని, విజయాన్ని పొందిన వానరసైన్యం రాముని ఆజ్ఞమేరకు వెనక్కు మరలింది. (41)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి రామోపాఖ్యానపర్వణి లంకాప్రవేశే చతురశీత్యధికద్విశతతమోఽధ్యాయః ॥ 284 ॥
ఇది శ్రీమహాభారతమున రామోపాఖ్యానపర్వమను ఉపపర్వమున లంకను ప్రవేశించుట అను రెండువందల ఎనుబది నాల్గవ అధ్యాయము. (284)