283. రెండువందల ఎనుబది మూడవ అధ్యాయము
అంగదుని రాయబారము.
మార్కండేయ ఉవాచ
తతస్తత్రైవ రామస్య సమాసీనస్య తైః సహ ।
సమాజగ్ముః కపిశ్రేష్ఠాః సుగ్రీవవచనాత్ తదా ॥ 1
మార్కండేయుడు చెపుతున్నాడు - అనంతరం మాల్యవంత పర్వతం మీద లక్ష్మణుడు మొదలైన వారితో కూడి ఉన్న రామునివద్దకు సుగ్రీవుని ఆజ్ఞప్రకారం వానరశ్రేష్ఠులు చేరుకున్నారు. (1)
వృతః కోటిసహస్రేణ వానరాణాం తరస్వినామ్ ।
శ్వశురో వాలినః శ్రీమాన్ సుషేణో రామమభ్యయాత్ ॥ 2
వాలియొక్క మామగారైన సుషేణుడు వేగవంతులైన వేయికోట్ల వానరులతో కూడి రాముని చేరుకున్నాడు. (2)
కోటీశతవృతో వాపి గజో గవయ ఏవ చ ।
వానరేంద్రౌ మహావీర్యౌ పృథక్ ఫృథగదృశ్యతామ్ ॥ 3
గజగవయులనే మహాపరాక్రమవంతులైన వానరముఖ్యులు ఒక్కొక్కరు వందకోట్ల వానరసైన్యంతో కూడి వేర్వేరుగా రావడం కనిపించింది. (3)
షష్టికోటిసహస్రాణి ప్రకర్షన్ ప్రత్యదృశ్యత ।
గోలాంగూలో మహారాజ గవాక్షో భీమదర్శనః ॥ 4
మహారాజా! గోలాంగుల జాతికి చెంది భయంకరంగా ఉండే గవాక్షుడనే వానరవీరుడు అరవై వేల కోట్ల వానర సైన్యంతో అట్టహాసంగా రావడం కనిపించింది. (4)
గంధమాదనవాసీ తు ప్రథితో గంధమాదనః ।
కోటీశతసహస్రాణి హరీణాం సమకర్షత ॥
గంధమాదన పర్వతం మీదనే నివసించే గంధమాదనుడనే ప్రసిద్ధుడైన వానరుడు లక్షకోట్ల వానరవీరులతో చేరుకొన్నాడు. (5)
పనసో నామ మేధావీ వానరః సుమహాబలః ।
కోటీర్దశః ద్వాదశ చ త్రింశత్ పంచ ప్రకర్షతి ॥ 6
మేధావి అయిన పనసుడనే బలవంతుడయిన వానరుడు ఏభై ఏడుకోట్ల వానరసైన్యంతో చేరుకొన్నాడు. (6)
శ్రీమాన్ దధిముఖో నామ హరివృద్ధోఽతివీర్యవాన్ ।
ప్రచకర్ష మహాసైన్యం హరీణాం భీమతేజసామ్ ॥ 7
వానరులలో వృద్ధుడు, మిక్కిలి బలవంతుడు అయి శ్రీమాన్ దధిముఖుడనే వానరుడు గొప్ప సైన్యాన్ని తీసుకొనివచ్చాడు. (7)
కృష్ణానాం ముఖపుండ్రాణామ్ ఋక్షాణాం భీమకర్మణామ్ ।
కోటీశతసహస్రేణ జాంబవాన్ ప్రత్యదృశ్యత ॥ 8
నుదుటిపై ఊర్ధ్వపుండ్రాలు ధరించి; భయంకరమైన పరాక్రమం కల; నల్లని ఋక్షవీరులను లక్షకోట్లమందిని తీసుకొని జాంబవంతుడు రావడం కనిపించింది. (8)
ఏతే చాన్యే చ బహవో హరియూథపయూథపాః ।
అసంఖ్యేయా మహారాజ సమీయూ రామకారణాత్ ॥ 9
మహారాజా! వీరే కాక ఇంకా ఇతరులైన అసంఖ్యాక వానరసేనానాయకులు వానరవీరులతో కలిసి రాముని పని మీద అక్కడకు చేరుకున్నారు. (9)
గిరికూటనిభాంగానాం సింహానామివ గర్జతామ్ ।
శ్రూయతే తుములః శబ్దః తత్ర తత్ర ప్రధావతామ్ ॥ 10
పర్వతశిఖరాలవంటి శరీరాలతో వారు సింహాల వలె గర్జిస్తూ అటు ఇటు పరుగులు తీస్తున్నారు. ఆ శబ్దం మహాభయంకరంగా వినిపిస్తోంది. (10)
గిరికూటవిభాః కేచిత్ కేచిన్మహిషసంనిభాః ।
శరదభ్రప్రతీకాశాః కేచిద్ధింగులకాననాః ॥ 11
వారిలో కొంతమంది పర్వతశిఖరాల వంటి శరీరాలు కలవారు, కొంతమంది అడవిదున్నల వంటి శరీరాలు కలవారు. శరత్కాలమేఘాలవలె తెల్లని శరీరాలు కలవారు కొందరున్నారు. కొంతమంది సిందూరం వలె ఎర్రనైన ముఖాలతో ఉన్నారు. (11)
ఉత్పతంతః పతంతశ్చ ప్లవమానాశ్చ వానరాః ।
ఉద్దున్వంతోఽపరే రేణూన్ సమాజగ్ముః సమంతతః ॥ 12
ఆ వానరులు ఎగురుతూ, గంతులు వేస్తూ, దూకుతూ దుమ్మురేపుతూ అన్నివైపుల నుండి వచ్చి చేరుకున్నారు. (12)
స వానరమహాసైన్యః పూర్ణసాగరసంనిభః ।
నివేశమకరోత్ తత్ర సుగ్రీవానుమతే తదా ॥ 13
ఆ వానరమహాసైన్యం మహాసముద్రంలా ఉంది. సుగ్రీవుని ఆజ్ఞపై వారికి ఆ పర్వతం చుట్టుపక్కలే నివాసం ఏర్పాటు చేయబడింది. (13)
తతస్తేషు హరీంద్రేషు సమావృత్తేషు సర్వశః ।
తిథౌ ప్రశస్తే నక్షత్రే ముహూర్తే చాభిపూజితే ॥ 14
తేన వ్యూఢేన సైన్యేన లోకానుద్వర్తయన్నివ ।
ప్రయయౌ రాఘవః శ్రీమాన్ సుగ్రీవసహితస్తదా ॥ 15
ఆ వానరవీరులందరూ అన్నివైపుల నుండి వచ్చి చేరుకొన్న తరువాత ఒకరోజున శుభతిథి, శుభనక్షత్రం చూసుకొని మంచిముహూర్తంలో సుగ్రీవునితో కలిసి రాముడు సైన్యాన్ని వ్యూహప్రకారం నడిపిస్తూ లోకాలను తల్లక్రిందులు చేసేవాడిలా బయలుదేరాడు. (14,15)
ముఖమాసీత్ తు సైన్యస్య హనూమాన్ మారుతాత్మజః ।
జఘనం పాలయామాస సౌమిత్రిరకుతోభయః ॥ 16
ఆ సైన్యానికి ముందుభాగంలో మారుతాత్మజుడైన హనుమంతుడున్నాడు. వెనుకభాగాన్ని భయమంటే ఎరుగుని లక్ష్మణుడు రక్షిస్తున్నాడు. (16)
బద్ధగోధాంగులిత్రాణౌ రాఘవౌ తత్ర జగ్మతుః ।
వృతౌ హరిమహామాత్రైః చంద్రసూర్యౌ గ్రహైరివ ॥ 17
రామలక్ష్మణులు గోధాంగుళి త్రాణాలు ధరించి గ్రహాలతో కూడిన సూర్యచంద్రులవలె వానరసచివులతో కలిసి బయలుదేరాడు. (17)
ప్రబభౌ హరిసైన్యం తత్ సాలతాలశిలాయుధమ్ ।
సుమహచ్ఛాలిభవనం యథా సూర్యోదయం ప్రతి ॥ 18
మద్దిచెట్లు, తాటి చెట్లు, రాళ్లు ఆయుధాలుగా ధరించిన ఆ వానరసైన్యం సూర్యోదయసమయంలో పండిన పంట చేనులా ప్రకాశించింది. (18)
నలనీలాంగదక్రాథమైందద్వివిదపాలితా ।
యయౌ సుమహతీ సేనా రాఘవస్యార్థసిద్ధయే ॥ 19
నలుడు, నీలుడు, అంగదుడు, క్రథుడు, మైందుడు, ద్వివిదుడు సంరక్షిస్తున్న ఆ మహాసైన్యం రాముని కార్యం నెరవేర్చడానికి బయలుదేరింది. (19)
వివిధేషు ప్రశస్తేషు బహుమూలఫలేషు చ ।
ప్రభూతమధుమూలేషు వారిమత్సు శివేషు చ ॥ 20
నివసంతీ నిరాబాధా తథైవ గిరిసానుషు ।
ఉపాయాద్ధరిసేనా సా క్షారోదమథ సాగరమ్ ॥ 21
ప్రశస్తమైన వివిధ కందమూలఫలాలు, తేనె నీరు లభించే; శుభకరమైన కొండ చరియలలో ఆగుతూ ఎటువంటి ఆటంకమూ లేకుండా ముందుకుసాగుతూ ఆ వానరసైన్యం లవణసాగరాన్ని చేరుకొంది. (20,21)
ద్వితీయసాగరనిభం తద్ బలం బహులధ్వజమ్ ।
వేలావనం సమాసాద్య నివాసమకరోత్ తదా ॥ 22
అనేక ధ్వజపతాకాలతో కూడిన ఆ సైన్యం రెండవ సాగరమూ అన్నట్లుంది. ఆ బలమంతా సాగరతీరంలోని వనం చేరుకొని అక్కడ డేరాలు వేసింది. (22)
తతో దాశరథిః శ్రీమాన్ సుగ్రీవం ప్రత్యభాషత ।
మధ్యే వానరముఖ్యానాం ప్రాప్తకాలమిదం వచః ॥ 23
పిమ్మట వానరయోధముఖ్యులమధ్య ఉన్న సుగ్రీవునితో ప్రాప్తకాలజ్ఞుడు అయిన దాశరథి ఇలా అన్నాడు. (23)
ఉపాయః కో ను భవతాం మతః సాగరలంఘనే ।
ఇయం హి మహతీ సేనా సాగరశ్చాతిదుస్తరః ॥ 24
"ఈ సేన చూస్తే చాలా విస్తృతమైనది. సాగరమేమో తరింపశక్యం కానిది. ఈ దశలో సాగరం దాటడానికి ఏమైనా ఉపాయం ఉన్నదా? (24)
తత్రాన్యే వ్యాహరంతి స్మ వానరా బహుమానినః ।
సమర్థా లంఘనే సింధోః న తు తత్ కృత్స్నకారకమ్ ॥ 25
అప్పుడు మిక్కిలి గర్వించిన వానరులు కొంతమంది "మేము సముద్రం దాటగలము. కాని అది అందరికీ సాధ్యమయ్యేది కాదు" అన్నారు. (25)
కేచిన్నౌభిర్వ్యవస్యంతి కేచిచ్చ వివిధైః ప్లవైః ।
నేతి రామస్తు తాన్ సర్వాన్ సాంత్వయన్ ప్రత్యభాషత ॥ 26
కొంతమంది నౌకలతో దాటవచ్చని తమ నిశ్చయాన్ని ప్రకటించారు. కొంతమంది పడవలతో దాటవచ్చునన్నారు. కాని రాముడు వారందరినీ కాదని, వారిని సముదాయిస్తూ ఇలా అన్నాడు. (26)
శతయోజనవిస్తారం న శక్తాః సర్వవానరాః ।
క్రాంతుం తోయనిధిం వీరాః నైషా వో నైష్ఠికీ మతిః ॥ 27
వీరులారా! శతయోజనవిస్తారమైన జలనిధిని దాటడానికి వానరులందరూ సమర్థులు కారు. కాబట్టి మీరు చెప్పినది సర్వసమ్మతమైన నిర్ణయం కాదు. (27)
నావో న సంతి సేనాయా బహ్వ్యస్తారయితుం తథా ।
వణిజాముపఘాతం చ కథమస్మద్విధశ్చరేత్ ॥ 28
మనసేన చాలా విస్తారమైనది కనుక దానినంతటిని దాటించడానికి తగినన్ని నౌకలు మనవద్ద లేవు. (ఒకవేళ వర్తకుల వద్ద తీసుకోవచ్చు కదా అంటే) మావంటివారు వర్తకుల పనికి భంగం కలిగించేలా ఎలా నడచుకొంటారు? (28)
విస్తీర్ణం చైవ నః సైన్యం హవ్యాచ్ఛిద్రేణ వై పరః ।
ప్లవోడుపప్రతారశ్చ నైవాత్ర మమ రోచతే ॥ 29
అంతేకాదు. మనది విశాలమైన సైన్యం కనుక అటు ఇటు విడిపోతే శత్రువు సమయం చూసి దెబ్బతీయవచ్చు. కాబట్టి పడవలు, తెప్పలు మొదలైన సాధనాలతో సముద్రాన్ని దాటడం నాకు ఇష్టం లేదు. (29)
అహం త్విమం జలనిధిం సమారప్స్యామ్యుపాయతః ।
ప్రతిశేష్యామ్యుపవసన్ దర్శయిష్యతి మాం తతః ॥ 30
నేను ఏదో ఒక ఉపాయంతో ఈ సముద్రాన్ని ఆరాధించడం మొదలుపెడతాను. ఈ తీరంలోనే ఉపవాసాన్ని పూని కదలకుండా పడుకుంటాను. అప్పుడు అతడే నాకు మార్గం చూపుతాడు. (30)
న చేద్ దర్శయితా మార్గం ధక్ష్యామ్యేనమహం తతః ।
మహాస్త్రైరప్రతిహతైః అత్యగ్నిపవనోజ్జ్వలైః ॥ 31
అతడు నాకు మార్గం చూపకపోతే అగ్నికంటె, వాయువు కంటె కూడా తీక్ష్ణమైన ఎదురులేని మహాదివ్యాస్త్రాలతో నేను అతనిని కాల్చివేస్తాను. (31)
ఇత్యుక్త్వా సహ సౌమిత్రిః ఉపస్పృశ్యాథ రాఘవః ।
ప్రతిశిశ్యే జలనిధిం విధివత్ కుశసంస్తరే ॥ 32
అని పలికి రాఘవుడు లక్ష్మణునితో కలిసి ఆచమించి శాస్త్రానుసారంగా సముద్రతీరంలో దర్భశయనం మీద కదలకుండా పడుకొన్నాడు. (32)
సాగరస్తు తతః స్వప్నే దర్శయామాస రాఘవమ్ ।
దేవో నదనదీభర్తా శ్రీమాన్ యాదోగణైర్వృతః ॥ 33
సమస్త నదీనదాలకు స్వామి అయిన సాగరుడు జలచరాలతో కూడి స్వప్నంలో రాఘవునికి సాక్షాత్కరించాడు. (33)
కౌసల్యామాతరిత్యేవమ్ ఆభాష్య మధురం వచః ।
ఇదమిత్యాహ రత్నానామ్ ఆకారైః శతశో వృతః ॥ 34
అతడు వందలకొద్దీ రత్న నిధులతో ఆవరింపబడి ఉన్నాడు. "కౌసల్యానందనా!" అని అతనిని సంబోధించి మధురమైన వాక్కులతో ఇలా అన్నాడు. (34)
బ్రూహి కిం తే కరోమ్యత్ర సాహాయ్యం పురుషర్షభ ।
ఐక్ష్వాకో హ్యస్మి తే జ్ఞాతిరితి రామస్తమబ్రవీత్ ॥ 35
పురుషోత్తమా! (సగరకుమారుల వలన ఏర్పడ్డాను కాబట్టి), నేను కూడా ఇక్ష్వాకువంశీయుడనే. నీ జ్ఞాతి బంధువును. నేను నీకు ఇప్పుడేమి సహాయం చేయగలను? చెప్పు". అనగానే రాముడు అతనితో ఇలా అన్నాడు. (35)
మార్గమిచ్ఛామి సైన్యస్య దత్తం నదనదీపతే ।
యేన గత్వా దశగ్రీవం హన్యాం పౌలస్త్యపాంసనమ్ ॥ 36
"నదీనదాలకు ప్రభువైన సాగరుడా! నీవు నా సైన్యానికి దారిని ఇవ్వాలని కోరుకొంటున్నాను. ఆ మార్గం ద్వారా వెళ్లి పులస్త్యవంశంలో నీచుడిగా జన్మించిన దశగ్రీవుని చంపగలను. (36)
యద్యేవం యాచతో మార్గం న ప్రదాస్యతి మే భవాన్ ।
శరైస్త్వాం శోషయిష్యామి దివ్యాస్త్రప్రతిమంత్రితైః ॥ 37
నేను ఇలా యాచించినా మీరు నాకు మార్గం ఇవ్వకపోతే దివ్యాస్త్రాలతో అభిమంత్రించిన బాణాలతో నిన్ను శోషింపచేస్తాను." (37)
ఇత్యేవం బ్రువతః శ్రుత్వా రామస్య వరుణాలయః ।
ఉవాచ వ్యథితో వాక్యమితి బద్ధాంజలిః స్థితః ॥ 38
ఇలా అంటున్న రాముని మాటలను విని వరుణాలయుడైన సాగరుడు దుఃఖితుడై చేతులు జోడించి నిలిచి ఇలా అన్నాడు. (38)
నేచ్ఛామి ప్రతిఘాతం తే నాస్మి విఘ్నకరస్తవ ।
శృణు చేదం వచో రామ శ్రుత్వా కర్తవ్యమాచర ॥ 39
శ్రీరామా! నిన్ను ఎదిరించాలని నేను కోరడం లేదు. నీ మార్గానికి అడ్డురావాలని కూడా నేను అనుకోవడం లేదు. నేను చెప్పే ఈ మాట విను. విన్నాక ఏది కర్తవ్యమో అది చేయి. (39)
యది దాస్యామి తే మార్గం సైన్యస్య వ్రజతోఽఽజ్ఞయా ।
అన్యే ఽప్యాజ్ఞాపయిష్యంతి మామేవం ధనుషో బలాత్ ॥ 40
నీ ఆజ్ఞప్రకారం లంకకు వెళ్తున్న నీ సైన్యానికి నేను దారి ఇచ్చినట్లయితే, ఇతరులు కూడా వింటిబలంతో నన్ను ఇలాగే ఆజ్ఞాపిస్తారు. (40)
అస్తి త్వత్ర నలో నామ వానరః శిల్పిసమ్మతః ।
త్వష్టుర్దేవస్య తనయః బలవాన్ విశ్వకర్మణః ॥ 41
ఇక్కడ నీ సైన్యంలో నలుడనే వానరుడు ఉన్నాడు కదా! అతడు శిల్పులలో మన్నింపదగినవాడు. ఆ బలవంతుడు దేవశిల్పి అయిన విశ్వకర్మయొక్క కుమారుడు. (41)
స యత్ కాష్ఠం తృణం వాపి శిలాం వా క్షేప్స్యతే మయి ।
సర్వం తద్ ధారయిష్యామి స తే సేతుర్భవిష్యతి ॥ 42
అతడు ఏ కట్టెగాని, గడ్డిపరకగాని, రాయినిగాని నా యందు పడవేసినా, దానిని నేను పైకి తేల్చి ఉంచుతాను. అదే నీకు సేతువు కాగలదు." (42)
ఇత్యుక్త్వాంతర్హితే తస్మిన్ రామో నలమువాచ హ ।
కురు సేతుం సముద్రే త్వం శక్తో హ్యసి మతో మమ ॥ 43
అని చెప్పి అతడు అంతర్ధానం కాగానే రాముడు నలునితో - "సముద్రంలో నీవు సేతువును నిర్మించు. నీవు సమర్థుడవని నాకు తెలుసు" అన్నాడు. (43)
తేనోపాయేన కాకుత్ స్థః సేతుబంధమకారయత్ ।
దశయోజనవిస్తారమ్ ఆయతం శతయోజనమ్ ॥ 44
ఆ ఉపాయంతోనే కకుత్స్థవంశీయుడైన రాముడు సేతునిర్మాణం చేయించాడు. అది పదియోజనాల వెడల్పు; వంద యోజనాల పొడవు ఉంది. (44)
నలసేతురితి ఖ్యాతో యోఽద్యాపి ప్రథితో భువి ।
రామస్యాజ్ఞాం పురస్కృత్య నిర్యాతో గిరిసంనిభః । 45
అది ఈనాటికీ భూమిపై "నలసేతువు" అనే పేరుతో ప్రసిద్ధంగా ఉంది. రాముని ఆజ్ఞను పురస్కరించుకొని కొండవంటి ఆ సేతువును సముద్రుడు ధరించాడు. (45)
తత్రస్థం స తు ధర్మాత్మా సమాగచ్ఛద్ విభీషణః ।
భ్రాతా వై రాక్షసేంద్రస్య చతుర్భిః సచివైః సహ ॥ 46
సముద్రం ఒడ్డునే ఉన్న శ్రీరామచంద్రుని వద్దకు ధర్మాత్ముడూ రాక్షసరాజు తమ్మూడూ అయిన విభీషణుడు తన నలుగురు మంత్రులతో కలిసి వచ్చాడు. (46)
ప్రతిజగ్రాహ రామస్తం స్వాగతేన మహామనాః ।
సుగ్రీవస్య తు శంకాభూత్ ప్రణిధిః స్యాదితి స్మ హ ॥ 47
మహామనస్వి అయిన రాముడు అతనికి స్వాగతం చెప్పి స్వీకరించాడు. కాని సుగ్రీవునికి "ఇతడు గూఢచారి అయి ఉండవచ్చును" అనే శంక కలిగింది. (47)
రాఘవః సత్యచేష్టాభిః సమ్యక్ చ చరితేంగితైః ।
యదా తత్త్వేన తుష్టోఽభూత్ తత ఏనమపూజయత్ ॥ 48
కాని రాఘవుడు అతని చేతలలోని నిజాయితీని; చక్కని నడతను, హావభావాలను చక్కగా ఆకళింపు చేసుకొని సంతుష్టుడై అతనిని బాగా ఆదరించాడు. (48)
సర్వరాక్షసరాజ్యే చాప్యభ్యషించద్ విభీషణమ్ ।
చక్రే చ మంత్రసచివం సుహృదం లక్ష్మణస్య చ ॥ 49
పైగా అతనిని సమస్త రాక్షసరాజ్యానికి రాజుగా అభిషేకించాడు. తనకు మంత్రాంగం నెరపే మంత్రిగా, లక్ష్మణునికి స్నేహితునిగా చేసుకొన్నాడు. (49)
విభీషణమతే చైవ సోఽత్యక్రామన్మహార్ణవమ్ ।
ససైన్యః సేతునా తేన మాసేనైవ నరాధిప ॥ 50
నరేశ్వరా! విభీషణుని యొక్క సలహా ప్రకారం రాముడు ఆ సేతువు ద్వారా ఒక్క నెలలోనే ఆ మహాసాగరాన్ని ససైన్యంగా దాటాడు. (50)
తతో గత్వా సమాసాద్య లంకోద్యానాన్యనేకశః ।
భేదయామాస కపిభిః మహాంతి చ బహూనిచ ॥ 51
అలా వెళ్లి లంకలోని ఉద్యానవనాలను చేరుకొని, అనేకమైన ఉద్యానవనాలను వానరుల చేత ఛిన్నాభిన్నం చేయించాడు. (51)
తతస్తౌ రావణామాత్యౌ మంత్రిణౌ శుకసారణౌ ।
చరౌ వానరరూపేణ తౌ జగ్రాహ విభీషణః ॥ 52
ఆ సమయంలో రావణుని మంత్రులు శుకసారణులు గూఢచారులై వానరరూపంలో అక్కడ తిరుగుతూండగా వారిని విభీషణుడు పట్టుకొన్నాడు. (52)
ప్రతిపన్నౌ యదా రూపం రాక్షసం తౌ నిశాచరౌ ।
దర్శయిత్వా తతః సైన్యం రామః పశ్చాదవాసృజత్ ॥ 53
ఆ నిశాచరులిద్దరూ తమ రాక్షసరూపాన్ని ధరించగానే రాముడు వారికి తనసైన్యమంతటినీ చూపి, అనంతరం వదిలివేశాడు. (53)
నివేశ్యోపవనే సైన్యం తత్ పురః ప్రాజ్ఞవానరమ్ ।
ప్రేషయామాస దౌత్యేన రావణస్య తతోఽంగదమ్ ॥ 54
ఆ రీతిగా సైన్యాన్ని లంక యొక్క ఉపవనంలో విడిది చేయించి శ్రీరాముడు ప్రాజ్ఞుడైన అంగదుని దూతగా రావణుని వద్దకు పంపాడు. (54)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి రామోపాఖ్యానపర్వణి సేతుబంధనే త్య్రశీత్యధికద్విశతతమోఽధ్యాయః ॥ 283 ॥
ఇది శ్రీమహాభారతమున రామోపాఖ్యానపర్వమను ఉపపర్వమున సేతు బంధనమను రెండువందల ఎనుబది మూడవ అధ్యాయము. (283)