285. రెండువందల ఎనుబది ఐదవ అధ్యాయము

రామరావణ సైనికుల ద్వంద్వయుద్ధము.

మార్కండేయ ఉవాచ
తతో నివిశమానాంస్తాన్ సైనికాన్ రావణానుగాః ।
అభిజగ్ముర్గణానేకే పిశాచక్షుద్రరక్షసామ్ ॥ 1
పర్వణః పతనో జంభః ఖరః క్రోధవశో హరిః ।
ప్రరుజశ్చారుజశ్చైవ ప్రఘసశ్చైవమాదయః ॥ 2
ఆ రీతిగా శిబిరాలలోకి చేరిన వానరసైనికులపై రావణుని అనుచరులైన పర్వణుడు, పతనుడు, జంభుడు, ఖరుడు, క్రోధవశుడు, హరి, ప్రరుజుడు, అరుజుడు, ప్రఘసుడు మొదలైన పిశాచులూ, క్షుద్రరాక్షసులూ దాడి చేశారు. (1,2)
తతోఽభిపతతాం తేషామదృశ్యానాం దురాత్మనామ్ ।
అంతర్ధానవధం తజ్ జ్ఞః చకార స విభీషణః ॥ 3
ఆ దుర్మార్గులు అదృశ్యులై వచ్చి దాడి చేశారు. ఆ విషయం తెలుసుకొన్న విభీషణుడు, దాని గురించి తెలిసి ఉండడంతో ఆ అదృశ్యశక్తిని రూపుమాపాడు. (3)
తే దృశ్యమానా హరిభిః బలిభిర్దూరపాతిభిః ।
నిహతాః సర్వశో రాజన్ మహీం జగ్ముర్గతాసవః ॥ 4
అప్పుడు వారందరూ వానరులకు కనబడసాగారు. ఆ వానరవీరులు బలవంతులు, చాలాదూరం వరకు గెంతగలిగినవారు. రాజా! కాబట్టి వారి చేతిలో ఆ రాక్షసులందరూ ప్రాణాలు కోల్పోయి నేలకు ఒరిగారు. (4)
అమృష్యమాణః సబలః రావణో నిర్యయావథ ।
రాక్షసానాం బలైర్ఘోరైః పిశాచానాం చ సంవృతః ॥ 5
దీనితో బలవంతుడైన రావణాసురుడు మండిపడ్డాడు. అతడు పిశాచులు, రాక్షసులతో కూడిన భయంకర దళాలను వెంటబెట్టుకొని నగరం వెలుపలికి వచ్చాడు. (5)
యుద్ధశాస్త్రవిధానజ్ఞః ఉశనా ఇవ చాపరః ।
వ్యూహ్య చౌశనసం వ్యూహం హరీవభ్యవహారయత్ ॥ 6
అపర శుక్రాచార్యునిలా అతడు యుద్ధశాస్త్రవిధానాలు తెలిసినవాడు. కనుక శుక్రాచార్యుని మతాన్ని అనుసరించి అతడు వ్యూహరచన చేసి, వానరులందరిని చుట్టుముట్టాడు. (6)
రాఘవస్తు వినిర్యాంతం వ్యూఢానీకం దశాననమ్ ।
బార్హస్పత్యం విధిం కృత్వా ప్రత్యవ్యూహన్నిశాచరమ్ ॥ 7
నగరం వెలువడి వ్యూహాకారంలో ఉన్న సైన్యంతో వస్తున్న దశాననుడైన రావణుని చూచి రాఘవుడు కూడా బృహస్పతి మతాన్ని అనుసరించి ప్రతివ్యూహాన్ని రచించాడు. (7)
సమేత్య యుయుధే తత్ర తతో రామేణ రావణః ।
యుయుధే లక్ష్మణశ్చాపి తథైవేంద్రజితా సహ ॥ 8
అనంతరం అక్కడకు చేరుకొని రావణుడు రామునితో యుద్ధం చేయసాగాడు. అలాగే లక్ష్మణుడు కూడా ఇంద్రజిత్తుతో యుద్ధం చేయసాగాడు. (8)
విరూపాక్షేణ సుగ్రీవః తారేణ చ నిఖర్వటః ।
తుండేన చ నలస్తత్ర పటుశః పనసేన చ ॥ 9
సుగ్రీవుడు విరూపాక్షునితో, తారుడు నిఖర్వటునితో, వలుడు తుండునితో, పనసుడు పటుశునితో యుద్ధం చేయసాగారు. (9)
విషహ్యం యం హి యో మేనే స స తేన సమేయివాన్ ।
యుయుధే యుద్ధవేలాయాం స్వబాహుబలమాశ్రితః ॥ 10
యుద్ధసమయంలో ఎవరెవరు ఎవరికెవరికి తగినవారని భావించారో వారు వారు వారివారితో తమ భుజబలం కొద్దీ యుద్ధం చేయసాగారు. (10)
స సంప్రహారో వవృధే భీరూణాం భయవర్ధనః ।
లోమసంహర్షణో ఘోరః పురా దేవాసురే యథా ॥ 11
రోమాంచం కలిగేటట్లు పూర్వం దేవాసురుల మధ్య జరిగిన యుద్ధం మాదిరిగా ఆ యుద్ధం పిరికివాళ్లకి మరింత భయాన్ని కలిగిస్తూ క్రమక్రమంగా తీవ్రం కాసాగింది. (11)
రావణో రామమానర్ఛత్ శక్తిశూలాసివృష్టిభిః ।
నిశితైరాయసైస్తీక్ష్ణైః రావణం చాపి రాఘవః ॥ 12
తథైవేంద్రజితం యత్తం లక్ష్మణో మర్మభేదిభిః ।
ఇంద్రజిచ్చాపి సౌమిత్రిం బిభేద బహుభిః శరైః ॥ 13
రావణుడు శక్తి శూలఖడ్గ ఆయుధాలను వర్షించి రాముని బాధించాడు. రాముడు కూడా వాడియైన ఇనుపబాణాలతో రావణుని బాధించాడు. అలాగే లక్ష్మణుడు మర్మభేదులైన బాణాలతో ఆ ఇంద్రజిత్తును బాధించాడు. ఇంద్రజిత్తు కూడా అనేక బాణాలతో సౌమిత్రిని తూట్లు పొడిచాడు. (12,13)
విభీషణః ప్రహస్తం చ ప్రహస్తశ్చ విభీషణమ్ ।
ఖగపత్రైః శరైస్తీక్ష్ణైః అభ్యవర్షద్ గతవ్యథః ॥ 14
విభీషణుడు ప్రహస్తునిపై ప్రహస్తుడు విభీషణుని పై వాడియైన బాణాలను వర్షించుకొన్నారు. అయినా వారిరువురూ ఏ మాత్రం చలించలేదు. (14)
తేషాం బలవతామాసీద్ మహాస్త్రాణాం సమాగమః ।
వివ్యథుః సకలా యేన త్రయో లోకాశ్చరాచరాః ॥ 15
మహాస్త్రధారులై, బలవంతులైన ఆ వీరుల యొక్క సంగ్రామం వలన ముల్లోకాలలోని చరాచరప్రాణులు అన్నీ బాధపడ్డాయి. (15)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి రామోపాఖ్యానపర్వణి రామరావణయుద్ధే పంచాశీత్యధికద్విశతతమోఽధ్యాయః ॥ 285 ॥
ఇది శ్రీమహాభారతమున రామోపాఖ్యానపర్వమను ఉపపర్వమున రామరావణ ద్వంద్వ యుద్ధమను రెండువందల ఎనుబది అయిదవ అధ్యాయము. (285)