280. రెండువందల ఎనుబదియవ అధ్యాయము
రామసుగ్రీవుల మైత్రి - వాలివధ - లంకలో సీతను త్రిజట ఓదార్చుట
మార్కండేయ ఉవాచ
తతోఽవిదూరే నలినీం ప్రభూతకమలోత్పలామ్ ।
సీతాహరణదుఃఖార్తః పంపాం రామః సమాసదత్ ॥ 1
సీతాపహరణం వలన దుఃఖార్తుడైన రాముడు కొద్ది దూరంలోనే ఉన్న పంపాసరోవరాన్ని చేరుకున్నాడు. ఆ సరస్సులోని తీగలకు తామరలు, కలువలు పూచి ఉన్నాయి. (1)
మారుతేన సుశీతేన సుఖేనామృతగంధినా ।
సేవ్యమానో వనే తస్మిన్ జగామ మనసా ప్రియామ్ ॥ 2
చల్లని, సుఖకరమైన, అమృతపు సువాసనతో కూడిన గాలిని అనుభవిస్తూ ఆ వనంలో రాముడు మనసులోనే తన ప్రియురాలిని తలచుకొన్నాడు. (2)
విలలాప స రాజేంద్రః తత్ర కాంతామనుస్మరన్ ।
కామబాణాభిసంతప్తః సౌమిత్రిస్తమథాబ్రవీత్ ॥ 3
ఆ రాజేంద్రుడు అక్కడ భార్యను తలచుకొంటూ కామబాణ సంతప్తుడై విలపించాడు. అంతట సౌమిత్రి అతనితో ఇలా అన్నాడు. (3)
న త్వామేవంవిధో భావః స్ప్రష్టుమర్హతి మానద ।
ఆత్మవంతమివ వ్యాధిః పురుషం వృద్ధశీలినమ్ ॥ 4
"మానదా! మనసును స్వాధీనంలో ఉంచుకోగలిగిన, వృద్ధులకు వలె నియమనిగ్రహాలు కలిగిన వ్యక్తిని వ్యాధి తాకలేనట్లే నిన్ను ఈ రకమైన భావం స్పృశించకూడనిది. (4)
ప్రవృత్తిరుపలబ్ధా తే వైదేహ్యా రావణస్య చ ।
తాం త్వం పురుషకారేణ బుద్ధ్యా చైవోపపాదయ ॥ 5
వైదేహియొక్క, రావణుని యొక్క సమాచారం నీకు తెలిసింది. నీవు నీ పౌరుషం చేతనూ, బుద్ధిబలం చేతనూ సీతను పొందు. (5)
అభిగచ్ఛావ సుగ్రీవం శైలస్థం హరిపుంగవమ్ ।
మయి శిష్యే చ భృత్యే చ సహాయే చ సమాశ్వస ॥ 6
కొండ మీద ఉన్న వానరశ్రేష్ఠుడు సుగ్రీవుని గురించి వెళదాం. నీకు శిష్యునిగా, భృత్యునిగా, సహాయకునిగా నేను ఉన్నాను. ఊరడిల్లు". (6)
ఏవం బహువిధైర్వాక్యైః లక్ష్మణేన స రాఘవః ।
ఉక్తః ప్రకృతిమాపేదే కార్యే చానంతరోఽభవత్ ॥ 7
ఈ రీతిగా అనేకరకాలుగా లక్ష్మణుడు ఓదార్చగా రాముడు స్వస్థచిత్తుడయ్యాడు. అనంతరం చేయవలసిన పనిలో లగ్నమయ్యాడు. (7)
నిషేవ్య వారి పంపాయాః తర్పయిత్వా పితౄనపి ।
ప్రతస్థతురుభౌ వీరౌ భ్రాతరౌ రామలక్ష్మణౌ ॥ 8
వీరులు అన్నదమ్ములు అయిన ఆ రామలక్ష్మణులు ఇద్దరూ పంపానదిలో స్నానమాడి పితరులకు తర్పణం చేసి బయల్దేరారు. (8)
తావృష్యమూకమభ్యేత్య బహుమూలఫలద్రుమమ్ ।
గిర్యగ్రే వానరాన్ పంచ వీరౌ దదృశతుస్తదా ॥ 9
అధికమైన ఫలమూలాలతో చెట్లతో నిండి ఉన్న ఆ ఋశ్యమూక పర్వతాన్ని చేరుకుని ఆ వీరులిద్దరూ కొండశిఖరాన ఉన్న ఐదుగురు వానరులను చూశారు. (9)
సుగ్రీవః ప్రేషయామాస సచివం వానరం తయోః ।
బుద్ధిమంతం హనూమంతం హిమవంతమివ స్థితమ్ ॥ 10
సుగ్రీవుడు హిమవంతంలా గంభీరంగా కూర్చుని, బుద్ధిమంతుడు, మంత్రి అయిన వానరుని హనుమంతుని వారివద్దకు పంపాడు. (10)
తేన సంభాష్య పూర్వం తౌ సుగ్రీవమభిజగ్మతుః ।
సఖ్యం వానరాజేన చక్రే రామస్తదా నృప ॥ 11
ముందుగా అతనితో మాటలాడి వారు సుగ్రీవుని వద్దకు చేరుకున్నారు. రాజా! రాముడు అప్పుడు వానరరాజుతో చెలిమి చేశాడు. (11)
తద్ వాసో దర్శయామాసుః తస్య కార్యే నివేదితే ।
వానరాణాం తు యత్ సీతా హ్రియమాణా వ్యపాసృజత్ ॥ 12
రాముడు తన పని గురించి చెప్పగానే, అపహరణకు గురి అయిన సమయంలో సీత వానరుల మధ్య పడవేసిన ఆ వస్త్రాన్ని వారు అతనికి చూపించారు. (12)
తత్ ప్రత్యయకరం లబ్ధ్వా సుగ్రీవం ప్లవగాధిపమ్ ।
పృథివ్యాం వానరైశ్వర్యే స్వయం రామోఽభ్యషేచయత్ ॥ 13
విశ్వసించదగిన ఆ గుర్తును పొంది రాముడు వానర నాయకుడైన సుగ్రీవుని భూమండలంలోని వానరులకు సమ్రాట్టుగా స్వయంగా అభిషేకించాడు. (13)
ప్రతిజజ్ఞే చ కాకుత్ స్థః సమరే వాలినో వధమ్ ।
సుగ్రీవశ్చాపి వైదేహ్యాః పునరానయనం నృప ॥ 14
రాజా! రాముడు యుద్ధంలో వాలిని చంపుతానని, సుగ్రీవుడు వైదేహిని వెదికి తెస్తానని ప్రతిజ్ఞ చేశారు. (14)
ఇత్యుక్త్వా సమయం కృత్వా విశ్వాస్య చ పరస్పరమ్ ।
అభ్యేత్య సర్వే కిష్కింధాం తస్థుర్యుద్ధాభికాంక్షిణః ॥ 15
ఇలా అనుకొని పరస్పరం విశ్వాసంతో ప్రతిజ్ఞలు చేసుకొని అందరూ కిష్కింధను చేరుకొని యుద్ధకాంక్షులై నిలిచారు. (15)
సుగ్రీవః ప్రాప్య కిష్కింధాం ననాదౌఘనిభస్వనః ।
వాస్య తన్మమృషే వాలీ తారా తం ప్రత్యషేధయత్ ॥ 16
సుగ్రీవుడు కిష్కింధకు వెళ్లి, అక్కడ పెక్కుమంది అరచినట్లుగా పెద్దగా సింహనాదం చేశాడు. వాలి దానిని సహించలేకపోయాడు. కాని తార అతనిని వారించింది. (16)
యథా నదతి సుగ్రీవః బలవానేష వానరః ।
మన్యే చాశ్రయవాన్ ప్రాప్తః న త్వం నిష్క్రాంతుమర్హసి ॥ 17
"సుగ్రీవుడు తాను బలవంతుడైన వానరుని వలె గర్జిస్తున్నాడు, అతనికి ఎవరిదో ఆశ్రయం లభించి ఉంటుందని నేను అనుకొంటున్నాను. కాబట్టి నీవు ఇప్పుడు వెళ్లడానికి వీలుకాదు" అని అన్నది. (17)
హేమమాలీ తతో వాలీ తారాం తారాధిపాననామ్ ।
ప్రోవాచ వచనం వాగ్మీ తాం వానరపతిః పతిః ॥ 18
అప్పుడు చంద్రముఖి అయిన తారతో సువర్ణమాలా ధారి, మాటలలో నేర్పరి, వానరపతి అయిన భర్త వాలి ఇలా అన్నాడు. (18)
సర్వభూతరుతజ్ఞా త్వం పశ్య బుద్ధ్యా సమన్వితా ।
కేన చాశ్రయవాన్ ప్రాప్తః మమైష భ్రాతృగంధికః ॥ 19
"నీవు సమస్త ప్రాణుల యొక్క అరపులను తెలుసుకోగలవు. తెలివైనదానివి. చూడు! నాకు పేరుకు మాత్రమే సోదరుడైన ఇతడు ఎవరి ఆశ్రయాన్ని పొంది ఉన్నాడో చెప్పు". (19)
చింతయిత్వా ముహూర్తం తు తారా తారాధిపప్రభా ।
పతిమిత్యబ్రవీత్ ప్రాజ్ఞా శృణు సర్వం కపీశ్వర ॥ 20
చంద్రునితో సమానమైన కాంతిగల, ప్రాజ్ఞురాలయిన తార ముహూర్తకాలం ఆలోచించి భర్తతో ఇలా అన్నది - "కపీశ్వరా! అంతా చెప్తాను విను". (20)
హృతదారో మహాసత్త్వో రామో దశరథాత్మజః ।
తుల్యారిమిత్రతాం ప్రాప్తః సుగ్రీవేణ ధనుర్ధరః ॥ 21
దశరథుని కొడుకయిన రాముడు మహాబలవంతుడు. అతని భార్య అపహరింపబడింది. అతడు సుగ్రీవునితో మైత్రి చేసుకొన్నాడు. వారిద్దరూ పరస్పరం ఒకరి శత్రువులను శత్రువులుగానూ, ఒకరి మిత్రులను మిత్రులనుగానూ పరిగణిస్తున్నారు. ఆ రాముడు గొప్ప విలుకాడు. (21)
భ్రాతా చాస్య మహాబాహుః సౌమిత్రిరపరాజితః ।
లక్ష్మణో నామ మేధావీ స్థితః కార్యార్థసిద్ధయే ॥ 22
ఆ రాముని యొక్క తమ్ముడు, సుమిత్రానందనుడు, లక్ష్మణుడనే పేరుగలవాడు. అతడు కూడా మహాబాహువు, పరాజయమెరుగనివాడు, మేధావి. అన్నగారి కార్యసిద్ధికోసమే ఉన్నవాడు. (22)
మైందశ్చ ద్వివిదశ్చాపి హనూమాంశ్చానిలాత్మజః ।
జాంబవానృక్షరాజశ్చ సుగ్రీవసచివాః స్థితాః ॥ 23
ఇంకా మైందుడు, ద్వివిదుడు, పవనసుతుడయిన హనుమంతుడు, ఋక్షరాజు అయిన జాంబవంతుడు - సుగ్రీవుని మంత్రులయిన ఈ నలుగురు ఉన్నారు. (23)
సర్వ ఏతే మహాత్మానో బుద్ధిమంతో మహాబలాః ।
అలం తవ వినాశాయ రామవీర్యబలాశ్రయాత్ ॥ 24
వీరంతా మహామనస్వులు, బుద్ధిమంతులు, మహాబలవంతులు, రాముని బలపరాక్రమాలను ఆశ్రయంగా పొంది నీ వినాశనానికి సమర్థులై ఉన్నారు". (24)
తస్యాస్తదాక్షిప్య వచో హితముక్తం కపీశ్వరః ।
పర్యశంకత తామీర్షుః సుగ్రీవగతమానసామ్ ॥ 25
తన మేలుకోరి చెప్పిన ఆమె మాటలను వాలి తోసిపుచ్చాడు. పైగా ఈర్ష్యాళువై ఆమెకు సుగ్రీవునిపై మనసుందని అనుమానించాడు. (25)
తారాం పరుషముక్త్వా తు నిర్జగామ గుహాముఖాత్ ।
స్థితం మాల్యవతోఽభ్యాశే సుగ్రీవం సోఽభ్యభాషత ॥ 26
అసకృత్ త్వం మయా పూర్వం నిర్జితో జీవితప్రియః ।
ముక్తో జ్ఞాతిరితి జ్ఞాత్వా కా త్వరా మరణే పునః ॥ 27
నేను నిన్ను పూర్వం ఎన్నోసార్లు ఓడించాను. నీవు ప్రాణాల మీది ఆశతో పారిపోయి తిరుగుతున్నావు. నేను కూడా నిన్ను సోదరుడవని భావించి విడిచిపెడుతున్నాను. ఇప్పుడు మరల చనిపోవడానికి ఇంత తొందరెందుకు పడుతున్నావు? (27)
ఇత్యుక్తః ప్రాహ సుగ్రీవో భ్రాతరం హేతుమద్ వచః ।
ప్రాప్తకాలమమిత్రఘ్నః రామం సంబోధయన్నివ ॥ 28
వాలి ఇలా అనగానే శత్రుహంతకుడైన సుగ్రీవుడు రామునికి తెలియచేస్తున్నట్లుగా సమయానుకూలంగా సోదరునితో ఇలా అన్నాడు. (28)
హృతరాజ్యస్య మే రాజన్ హృతదారస్య చ త్వయా ।
కిం మే జీవితసామర్థ్యమ్ ఇతి విద్ధి సమాగతమ్ ॥ 29
"రాజా! నీవు నా రాజ్యాన్ని అపహరించావు. నా భార్యను నీ అధీనంలో ఉంచుకొన్నావు. ఇక నాకు జీవించే సామర్థ్యం ఎక్కడిది? నిన్ను కలుసుకోవడానికి వచ్చిన నన్ను అలాగే అనుకో (మరణించడానికే వచ్చానని తెలుసుకో)". (29)
ఏవముక్త్వా బహువిధం తతస్తౌ సంనిపేతతుః ।
సమరే వాలిసుగ్రీవౌ శాలతాలశిలాయుధౌ ॥ 30
ఇలా పలువిధాలుగా అనుకొని వారిద్దరూ అప్పుడు కలియబడ్డారు. యుద్ధంలో వాలి సుగ్రీవులు మద్దిచెట్లను, తాటిచెట్లను, రాళ్లను ఆయుధాలుగా చేసుకున్నారు. (30)
ఉభౌ జఘ్నతురన్యోన్యమ్ ఉభౌ భూమౌ నిపేతతుః ।
ఉభౌ వవల్గతుశ్చిత్రం ముష్టిభిశ్చ నిజఘ్నతుః ॥ 31
ఇద్దరూ పరస్పరం కొట్టుకొంటున్నారు. ఇద్దరూ నేలపై పడుతున్నారు. ఇద్దరూ చిత్రవిచిత్రంగా పాదవిన్యాసాలు చేస్తున్నారు. పిడికిళ్లతో పాడుచుకుంటున్నారు. (31)
ఉభౌ రుధిరసంసిక్తౌ నఖదంతపరిక్షతౌ ।
శుశుభాతే తదా వీరౌ పుష్పితావివ కింశుకౌ ॥ 32
ఇద్దరూ గోళ్లతో కోరలతో గాయపడి రక్తసిక్తులయ్యారు. అప్పుడు వారు పూచిన మోదుగుచెట్లవలె ప్రకాశించారు. (32)
న విశేషస్తయోర్యుద్ధే యదా కశ్చన దృశ్యతే ।
సుగ్రీవస్య తదా మాలాం హనుమాన్ కంఠ ఆసజత్ ॥ 33
యుద్ధం జరిగేటపుడు ఇద్దరిలో ఏమీ తేడా కనిపించలేదు. అప్పుడు హనుమంతుడు సుగ్రీవుని మెడలో ఒక మాలను వేశాడు. (33)
స మాలయా తదా వీరః శుశుభే కంఠసక్తయా ।
శ్రీమానివ మహాశైలః మలయో మేఘమాలయా ॥ 34
వీరుడయిన సుగ్రీవుడు మెడలో పడిన మాలచేత మేఘపంక్తులచేత శోభిల్లే మలయ మహాపర్వతం వలె శోభించాడు. (34)
కృతచిహ్నం తు సుగ్రీవం రామో దృష్ట్వా మహాధనుః ।
విచకర్ష ధనుః శ్రేష్ఠం వాలి ముద్దిశ్య లక్ష్యవత్ ॥ 35
విస్ఫారస్తస్య ధనుషో యంత్రస్యేవ తదా బభౌ ।
వితత్రాస తద వాలీ శరేణాభిహతోరసి ॥ 36
మహాధనుర్ధరుడయిన రాముడు మాలను గుర్తుగా ధరించిన సుగ్రీవుని చూచి వాలిని లక్ష్యంగా నిర్దేశించి శ్రేష్ఠమయిన వింటిని ఎక్కుపెట్టాడు. యంత్రధ్వనిలా అనిపించిన ఆ ధనుష్టంకారానికి అప్పుడు వాలి చాలా భయపడ్డాడు. ఇంతలోనే అతని రొమ్మున బాణం తగిలి గాయపడ్డాడు. (35,36)
స భిన్నహృదయో వాలీ వక్త్రాచ్ఛోణితముద్ధమన్ ।
దదర్శావస్థితం రామం తతః సౌమిత్రిణా సహ ॥ 37
(బాణం తగిలి) గుండెలు చీలిపోయిన వాలి నోటినుండి రక్తాన్ని కక్కుకుంటూ, లక్ష్మణునితో కలిసి అక్కడ నిలిచి ఉన్న రాముని అప్పుడు చూశాడు. (37)
గర్హయిత్వా స కాకుత్ స్థం పపాత భువి మూర్చ్ఛితః ।
తారా దదర్శ తం భూమౌ తారాపతిసమౌజసమ్ ॥ 38
అతడు రాముని నిందించి మూర్ఛితుడై నేలమీద పడిపోయాడు. భూమిపై పడిఉన్న చంద్రునివంటి కాంతి గలిగిన అతనిని తార చూచింది. (38)
హృతే వాలిని సుగ్రీవః కిష్కింధాం ప్రత్యపద్యత ।
తాం చ తారాపతిముఖీం తారాం నిపతితేశ్వరామ్ ॥ 39
వాలి చనిపోగానే నాథుడు లేని కిష్కింధానగరాన్ని, చంద్రముఖి అయిన తారను కూడా సుగ్రీవుడు పొందాడు. (39)
రామస్తు చతురో మాసాన్ పృష్ఠే మాల్యవతః శుభే ।
నివాసమకరోద్ ధీమాన్ సుగ్రీవేణాభ్యుపస్థితః ॥ 40
బుద్ధిశాలి అయిన రాముడు మాల్యవంతపర్వతం మీది అందమైన లోయలలో నాలుగునెలల పాటు నివసించాడు. సుగ్రీవుడు అతని సమక్షానికి అప్పుడప్పుడు వస్తూ ఉండేవాడు. (40)
రావణోఽపి పురీం గత్వా లంకాం కామబలాత్కృతః ।
సీతాం నివేశయామాస భవనే నందనోపమే ॥ 41
అశోకవనికాభ్యాశే తాపసాశ్రమసంనిభే ।
భర్తృస్మరణతన్వంగీ తాపసీవేషధారిణీ ॥ 42
ఇటు రావణుడు కూడా కామవశీభూతుడై లంకానగరికి వెళ్లి, అశోకవన సమీపంలో తాపసాశ్రమం వలె ప్రశాంతంగా ఉండే నందనవనం వంటి భవనంలో సీతను ఉంచాడు. ఆమె తాపసీవేషం ధరించి పతినే నిరంతరం స్మరిస్తూ కృశించిపోయింది. (41,42)
ఉపవాసతపఃశీలా తత్రాస పృథులేక్షణా ।
ఉవాస దుఃఖవసతిం ఫలమూలకృతాశనా ॥ 43
విశాలమైన కన్నులు కల సీత ఉపవాసం, తపస్సు తన స్వభావంగా మలచుకొంది. ఫలమూలాలు మాత్రమే ఆహారంగా తీసుకొంటూ దుఃఖంతో కాలం గడుపుతోంది. (43)
దిదేశ రాక్షసీస్తత్ర రక్షణే రాక్షసాధిపః ।
ప్రాసాసిశూలపరశుముద్గరాలాతధారిణీః ॥ 44
రాక్షసరాజు రావణుడు సీతయొక్క రక్షణకు బల్లెములు, కత్తులు, శూలాలు, పరశువులు, ముద్గరాలు, కొరకంచులు ధరించిన రాక్షస స్త్రీలను నియోగించాడు. (44)
ద్వ్యక్షీం త్య్రక్షీం లలాటాక్షీం దీర్ఘజిహ్వామజిహ్వికామ్ ।
త్రిస్తనీమేకపాదాం చ త్రిజటామేకలోచనామ్ ॥ 45
వారిలో కొందరికి రెండు కన్నులు, కొందరికి మూడు కన్నులు ఉంటే, కొందరికి నుదుటియందు కన్నులున్నాయి. కొందరికి పొడవైన నాలుక ఉంటే కొందరికి నాలుకలే లేవు. మూడు వక్షోజాలు కలవారు. ఒకే కాలు కలవారు కొందరున్నారు. ఒకతెకు మూడు జటలు, ఒకతెకు ఒకే కన్ను ఉన్నాయి. (45)
ఏతాశ్చాన్యాశ్చ దీప్తాక్ష్యః కరభోత్కటమూర్ధజాః ।
పరివార్యాసతే సీతాం దివారాత్రమతంద్రితాః ॥ 46
వీరూ ఇంకా ఇతర స్త్రీలూ నిద్రగాని, ఏమరుపాటుగాని లేకుండా రాత్రింబవళ్లు సీతకు చుట్టూ చేరి ఉంటున్నారు. వారందరూ ఎఱ్ఱగా అగ్నిగోళాలవలె ఉండే కన్నులతో, పొట్టిగా బిరుసుగా ఉన్న తలవెండ్రుకలతో ఉన్నారు. (46)
తాస్తు తామాయతాపాంగీం పిశాచ్యో దారుణస్వరాః ।
తర్జయంతి సదా రౌద్రాః పరుషవ్యంజనస్వరాః ॥ 47
ఆ పిశాచస్త్రీలు భయంకరమైన గొంతులతో, పరుషమైన స్వరవ్యంజనాలతో (అక్షరాలతో), రౌద్రంగా దీర్ఘమైన కన్నులు కల సీతను ఎప్పుడూ ఇలా భయపెడుతూనే ఉన్నారు. (47)
ఖాదామ పాటయామైనాం తిలశః ప్రవిభజ్య తామ్ ।
యేయం భర్తారమస్మాకమ్ అవమన్యేహ జీవతి ॥ 48
"మన స్వామిని అవమానించి ఈమె ఇక్కడ జీవించి ఉంది. ఈమెను ముక్కలు ముక్కలుగా నరికి తినివేద్దాం. (48)
ఇత్యేవం పరిభర్త్సంతీః త్రాస్యమానా పునః పునః ।
భర్తృశోకసమావిష్టా నిఃశ్వస్యేదమువాచ తాః ॥ 49
అని ఈ రీతిగా కఠినమైన బెదిరింపులతో మాటిమాటికీ ఆ రాక్షస స్త్రీలు భయపెడుతున్నారు. భర్తయొక్క వియోగం చేత దుఃఖితురాలై ఉన్న సీతాదేవి దీర్ఘంగా నిట్టూర్చి వారితో ఇలా అంది. (49)
ఆర్యాః ఖాదత మాం శీఘ్రం న మే లోభోఽస్తి జీవితే ।
వినా తం పుండరీకాక్షం నీలకుంచితమూర్ధజమ్ ॥ 50
అప్యేవాహం నిరాహారా జీవితప్రియవర్జితా ।
శోషయిష్యామి గాత్రాణి వ్యాలీ తాలగతా యథా ॥ 51
న త్వన్యమభిగచ్ఛేయం పుమాంసం రాఘవాదృతే ।
ఇతి జానీత సత్యం మే క్రియతాం యదనంతరమ్ ॥ 52
"అమ్మలారా! నన్ను తొందరగా తినివేయండి. నాకు జీవితం మీద ఆశలేదు. తెల్లతామరల వంటి కన్నులు, నల్లని గిరజాల జుట్టు గల ఆ నాస్వామి లేని కారణంగా నేను నిరాహారినై జీవితేచ్ఛను వదిలేశాను. తాటిచెట్టుమీది నాగినివలె నేను నా శరీరాన్ని శుష్కింప చేసుకుంటాను గాని రాఘవుని కంటె ఇతర పురుషుని నేను ఎన్నటికీ పొందను. నా మాట నిజమని నమ్మండి. ఆపై మీరు చేయవలసినది చేసుకోండి". (50-52)
తస్యాస్తద్ వచనం శ్రుత్వా రాక్షస్యస్తాః ఖరస్వనాః ।
అఖ్యాతుం రాక్షసేంద్రాయ జగ్ముస్తత్ సర్వమాదృతాః ॥ 53
సీతయొక్క ఆ మాటలను విని కటువైన కంఠాలు గల ఆ రాక్షసస్త్రీలు ఈ వృత్తాంతమంతా ఆదరపూర్వకంగా రాక్షస రాజునకు విన్నవించడానికి వెళ్లారు. (53)
గతాసు తాసు సర్వాసు త్రిజటా నామ రాక్షసీ ।
సాంత్వయామాస వైదేహీం ధర్మజ్ఞా ప్రియవాదినీ ॥ 54
వారందరూ వెళ్లాక ధర్మజ్ఞురాలు, ప్రియవాదిని అయిన త్రిజట అనే పేరు గల రాక్షసి వైదేహిని ఊరడించసాగింది. (54)
సీతే వక్ష్యామి తే కించిద్ విశ్వాసం కురు మే సఖి ।
భయం త్వం త్యజ వామోరు శృణు చేదం వచో మమ ॥ 55
"సీతా! నీకు నేను ఒకటి చెపుతాను. చెలీ! నా యందు విశ్వాసం ఉంచు. వామోరూ! నీవు భయం విడిచిపెట్టు. నేను చెప్పే ఈ మాటలు కూడా విను. (55)
అవింధ్యో నామ మేధావీ వృద్ధో రాక్షసపుంగవః ।
స రామస్య హితాన్వేషీ త్వదర్ధే హి స మావదత్ ॥ 56
అవింధ్యుడనే రాక్షస శ్రేష్ఠుడు మేధావి, వయసులో పెద్దవాడు. అతడు రాముని మేలునే కాంక్షిస్తూ ఉంటాడు. నీ కోసమే (నీతో చెప్పమని) నాతో ఇలా అన్నాడు. (56)
సీతా మద్వచనాద్ వాచ్యా సమాశ్వాస్య ప్రసాద్య చ ।
భర్తా తే కుశలీ రామో లక్ష్మణానుగతో బలీ ॥ 57
సఖ్యం వానరరాజేన శక్రప్రతిమతేజసా ।
కృతవాన్ రాఘవః శ్రీమాన్ త్వదర్థే చ సముద్యతః ॥ 58
మా చ తేఽస్తు భయం భీరు రావణాల్లోకగర్హితాత్ ।
నలకూబరశాపేన రక్షితా హ్యసి నందిని ॥ 59
శప్తో హ్యేష పురా పాపః వధూం రంభాం పరామృశన్ ।
న శక్నోత్యవశాం నారీమ్ ఉపైతుమజితేంద్రియః ॥ 60
క్షిప్రమేష్యతి తే భర్తా సుగ్రీవేణాభిరక్షితః ।
సౌమిత్రిసహితో ధీమాన్ త్వాం చేతో మోక్షయిష్యతి ॥ 61
"సీతను ఓదార్చి, సంతుష్టపరచి ఆమెకు నామాటగా చెప్పు. బలవంతుడైన నీ భర్తరాముడు లక్ష్మణుడు వెంటనంటి ఉండగా కుశలుడై ఉన్నాడు. ఇంద్రునితో సమానమైన పరాక్రమం కల వానరరాజుతో చెలిమి చేసుకొని, ఆ సుందరుడు నీకోసం ప్రయత్నం చేస్తున్నాడు. లోకనింద్యుడైన రావణుని వలన నీకు భయం అక్కరలేదు. నందినీ! నలకూబర శాపం వలన రావణుని నుండి నీవు రక్షించబడినావు. పూర్వం పాపాత్ముడయిన వీడు కోడలు రంభను స్పృశించి శాపాన్ని పొందాడు. ఇంద్రియనిగ్రహం లేని ఇతడు తనకు వశంకాని స్త్రీని పొందడానికి శక్తుడు కాడు. సుగ్రీవుని చేత సురక్షితుడై, లక్ష్మణ సహితుడై ధీమంతుడయిన నీ భర్త త్వరలోనే వస్తాడు. నిన్ను ఇక్కడి నుండి విడిపిస్తాడు" అని చెప్పాడు. (57-61)
స్వప్నా హి సుమహాఘోరాః దృష్టా మేఽనిష్టదర్శనాః ।
వినాశాయాస్య దుర్బుద్ధేః పౌలస్త్యకులఘాతినః ॥ 62
పౌలస్త్య వంశఘాతకుడు, దుర్బుద్ధి అయిన ఈ రావణుని యొక్క వినాశనాన్ని, అనిష్టాలను సూచించే మిక్కిలి భయంకరమైన కలలు నాకు వచ్చాయి. (62)
దారుణో హ్యేష దుష్టాత్మా క్షుద్రకర్మా నిశాచరః ।
స్వభావాచ్ఛీలదోషేణ సర్వేషాం భయవర్ధనః ॥ 63
దారుణుడు, దుష్టాత్ముడు, క్షుద్రకర్మ అయిన ఈ నిశాచరుడు స్వభావం వలన, శీలదోషం వలన అందరికీ భయాన్ని ఇనుమడింప చేసేవాడు అయ్యాడు. (63)
స్పర్ధతే సర్వదేవైర్యః కాలోపహతచేతనః ।
మయా వినాశలింగాని స్వప్నే దృష్టాని తస్య వై ॥ 64
విధి చేత క్షీణించిన బుద్ధితో సమస్త దేవతలతో స్పర్థపూనిన ఇతని వినాశనాన్ని సూచించే గుర్తులను నేను స్వప్నంలో దర్శించాను. (64)
తైలాభిషిక్తో వికచః మజ్జన్ పంకే దశాననః ।
అసకృత్ ఖరయుక్తే తు రథే నృత్యన్నివ స్థితః ॥ 65
దశాననుడు ఒంటినిండా నూనె పూసుకొని జుట్టు విరబోసుకొని బురదలో మునుగుతూ గాడిదలు కట్టిన రథం మీద నాట్యం చేస్తున్నట్లుగా ఉండడం చాలాసార్లు కలలో కన్పించింది. (65)
కుంభకర్ణాదయశ్చేమే నగ్నాః పతితమూర్ధజాః ।
గచ్ఛంతి దక్షిణామాశాం రక్తమాల్యానులేపనాః ॥ 66
కుంభకర్ణుడు మొదలైన వీరందరూ జుట్టు రాలిపోయి, ఎఱ్ఱనిపూలమాలలు, రక్తచందనం ధరించి నగ్నంగా దక్షిణదిక్కుకు వెళ్తున్నారు. (66)
శ్వేతాతపత్రః సోష్ణీషః శుక్లమాల్యానులేపనః ।
శ్వేతపర్వతమారూఢః ఏక ఏవ విభీషణః ॥ 67
ఒక్క విభీషణుడు మాత్రమే శ్వేతచ్ఛత్రాన్ని ధరించి, కిరీటంతో, తెల్లని పూలమాలలు, తెల్లని గంధం తాల్చి, శ్వేతపర్వతారూఢుడై ఉన్నాడు. (67)
సచివాశ్చాస్య చత్వారః శుక్లమాల్యానులేపనాః ।
శ్వేతపర్వతమారూఢాః మోక్ష్యంతేఽస్మాన్మహాభయాత్ ॥ 68
అతని యొక్క నలుగురు మంత్రులూ కూడా తెల్లని మాల్యాలు, తెల్లని గంధం ధరించి, శ్వేతపర్వతారూఢులై ఈ మహాభయం నుండి విడుదల పొందారు. (68)
రామస్యాస్త్రేణ పృథివీ పరిక్షిప్తా ససాగరా ।
యశసా పృథివీం కృత్స్నాం పూరయిష్యతి తే పతిః ॥ 69
రాముని అస్త్రం చేత సాగరసహితంగా భూమి అంతా కప్పివేయబడింది. నీ భర్త ఈ సమస్త భూమండలాన్ని కీర్తిచేత నింపి వేయగలడు. (69)
అస్థిసంచయమారూఢః భుంజానో మధుపాయసమ్ ।
లక్షణశ్చ మయా దృష్టో దిధక్షుః సర్వతో దిశమ్ ॥ 70
లక్షణుడు ఎముకలగుట్టను ఎక్కి తీయని పాయసాన్ని తింటూ అన్నివైపుల నుండి దిక్కులను దగ్ధం చేయాలని కోరుకొంటున్న వానిలా నాకు కనబడ్డాడు. (70)
రుదతీ రుధిరార్ద్రాంగీ వ్యాఘ్రేణ పరిరక్షితా ।
అసకృత్ త్వం మయా దృష్టా గచ్ఛంతీ దిశముత్తరామ్ ॥ 71
రక్తంతో తడిసిన శరీరంతో ఏడుస్తూ, ఒక పెద్దపులి చేత రక్షింపబడుతూ ఉత్తరదిశగా వెళ్తున్న నిన్ను నేను చాలాసార్లు చూశాను. (71)
హర్షమేష్యసి వైదేహి క్షిప్రం భర్తా సమన్వితా ।
రాఘవేణ సహ భ్రాత్రా సీతే త్వమచిరాదివ ॥ 72
వైదేహీ! శీఘ్రంగా భర్తను కలుసుకొని నీవు సంతోషాన్ని పొందగలవు. సీతా! నీవు త్వరలోనే తమ్మునితో కూడిన రాగవుని కలుసుకోగలవు". (72)
ఇత్యేతన్మృగశావాక్షీ తచ్ఛ్రుత్వా త్రిజటావచః ।
బభూవాశావతీ బాలా పునర్భర్తృసమాగమే ॥ 73
జింకపిల్ల కన్నులున్న ఆ సీతకు త్రిజట యొక్క ఆ మాటలతో తిరిగి భర్తను కలుసుకోగలననే ఆశ కలిగింది. (73)
యావదభ్యాగతా రౌద్రాః పిశాచ్యస్తాః సుదారుణాః ।
దదృశుస్తాం త్రిజటయా సహాసీనాం యథా పురా ॥ 74
భయంకరులు క్రూర స్వభావులు అయిన ఆ పిశాచినులు తిరిగివచ్చి, త్రిజటతో కలిసి సీత యథాపూర్వకంగా కూర్చుని ఉండడం చూశారు. (74)
ఇతి శ్రీమహా భారతే వనపర్వణి రామోపాఖ్యానపర్వణి త్రిజటాకృతసీతాసాంత్వనే అశీత్యధికద్విశతతమోఽధ్యాయః ॥ 280 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున రామోపాఖ్యానపర్వమను ఉపపర్వమున త్రిజటసీతాదేవిని ఓదార్చుట అను రెండువందల ఎనుబదియవ అధ్యాయము. (280)