అంతట ఒకరోజున పతివియోగదుఃఖంచేత దీనురాలై మాసినవస్త్రంతో, చూడామణి మాత్రమే అలంకారంగా కలిగి, రాక్షస స్త్రీలచేత సేవించబడుతూ రాతినేలమీద కూర్చుని, ఏడుస్తున్న పతివ్రత అయిన సీత దగ్గరకు కామబాణ పీడితుడైన రావణుడు వెళ్లాడు. దేవతలు, దానవులు, గంధర్వులు, యక్షులు, కింపురుషులు ఎవరి చేతనూ ఎప్పుడూ యుద్ధంలో పరాజయమెరుగని ఆ రావణుడు అశోకవనాన్ని చేరుకొని సీతాదేవిని చూచి, మన్మథబాధతో ఆమెను సమీపించాడు. (1-3)
దివ్యాంబరధరః శ్రీమాన్ సుమృష్టమణికుండలః ।
విచిత్రమాల్యముకుటః వసంత ఇవ మూర్తిమాన్ ॥ 4
ఆ రావణుడు దివ్యవస్త్రాలు ధరించి, అందమైన మణిమయ కుండలాలు అలంకరించుకొని, విచిత్రమైన పూలమాలలతో, కిరీటంతో మూర్తీభవించిన వసంతునివలె శోభాసంపన్నుడై ఉన్నాడు. (4)
న కల్పవృక్షసదృశః యత్నాదపి విభూషితః ।
శ్మశానచైత్యద్రుమవద్ భూషితోఽపి భయంకరః ॥ 5
అతడు ప్రయత్నపూర్వకంగా అలంకరించుకొని కూడా అందమైన కల్పవృక్షంలా లేడు. అలంకరించుకొన్నప్పటికీ శ్మశానంలోని చైత్య వృక్షంగా భయంకరంగానే ఉన్నాడు. (5)
స తస్యాస్తనుమధ్యాయాః సమీపే రజనీచరః ।
దదృశే రోహీణీమేత్య శనైశ్చర ఇవ గ్రహః ॥ 6
ఆ నిశాచరుడు సన్నని నడుముగల సీతాదేవిని సమీపించగా శనిగ్రహం రోహిణీ నక్షత్రం చెంతచేరినట్లు కనిపించాడు. (6)
స తామామంత్య్ర సుశ్రోణీం పుష్పకేతుశరాహతః ।
ఇదమిత్యబ్రవీద్ వాక్యం త్రస్తాం రౌహీమివాబలామ్ ॥ 7
మన్మథబాణ హతుడైన రావణుడు ఆడులేడి వలె భయపడిపోయి అబల అయిన ఆ సీతను సంబోధించి ఇలా అన్నాడు. (7)
సీతే పర్యాప్తమేతావత్ కృతో భర్తురనుగ్రహః ।
ప్రసాదం కురు తన్వంగి క్రియతాం పరికర్మ తే ॥ 8
సీతా! ఇంతవరకు నీవు నీ భర్తమీద చూపిన అనుగ్రహం చాలినంత ఉంది. తన్వంగీ! ఇక శృంగారం చేయించుకొని నా మీద దయచూపు. (8)
భజస్వ మాం వరారోహే మాహార్హాభరణాంబరా ।
భవ మే సర్వనారీణామ్ ఉత్తమా వరవర్ణినీ ॥ 9
వరారోహా! అతి విలువైన వస్త్రాభరణాలు ధరించి నన్ను సేవించు. నా స్త్రీలందరిలోకీ శ్రేష్ఠురాలవు, అందగత్తెవు అగుము. (9)
సంతి మే దేవకన్యాశ్చ గంధర్వాణాం చ యోషితః ।
సంతి దానవకన్యాశ్చ దైత్యానాం చాపి యోషితః ॥ 10
నావద్ద దేవకన్యలు, గంధర్వస్త్రీలు, దానవకన్యలు, దైత్యస్త్రీలు కూడా ఉన్నారు. (10)
చతుర్దశ పిశాచానాం కోట్యో మే వచనే స్థితాః ।
ద్విస్తావత్ పురుషాదానాం రక్షసాం భీమకర్మణామ్ ॥ 11
పద్నాలుగు కోట్ల పిశాచులు నా ఆజ్ఞను పాటిస్తారు. నరభక్షకులు, భయంకర కృత్యాలు చేసే రాక్షసులు అంతకు రెట్టింపు మంది ఉన్నారు. (11)
తతో మే త్రిగుణా యక్షా యే మద్వచనకారిణః ।
కేచిదేవ ధన్యాధ్యక్షం భ్రాతరం మే సమాశ్రితాః ॥ 12
అంతకంటె మూడురెట్లు యక్షులు నా ఆజ్ఞను పాటిస్తారు. కొద్దిమంది మాత్రమే నా సోదరుడు అయిన ధనాధ్యక్షుని ఆశ్రయించుకొని ఉన్నారు. (12)
గంధర్వాప్సరసో భద్రే మామాపానగతం సదా ।
ఉపతిష్ఠంతి వామోరు యథైవ భ్రాతరం మమ ॥ 13
భద్రా! వామోరూ! మధుపానం చేసే నన్ను గంధర్వులు, అప్సరసలు సదా నా అన్నగారిని సేవించినట్లే సేవిస్తారు. (13)
పుత్రోఽహమపి విప్రర్షేః సాక్షాద్ విశ్రవసో మునేః ।
పంచమో లోకపాలానామ్ ఇతి మే ప్రథితం యశః ॥ 14
నేను కూడా (కుబేరుని వలెనే) సాక్షాత్తు బ్రహ్మర్షి అయిన విశ్రవసముని యొక్క కుమారుడను, ఇదవ లోకపాలునిగా (ఇంద్ర - యమ - వరుణ - కుబేరులు - నలుగురు - లోకపాలకులు) నా కీర్తి ప్రసిద్ధికెక్కింది. (14)
దివ్యాని భక్ష్యభోజ్యాని పానాని వివిధాని చ ।
యథైవ త్రిదశేశస్య తథైవ మమ భావిని ॥ 15
శుభాంగీ! దివ్యమైన భక్ష్యభోజ్యాలు, వివిధములైన పానీయాలు ఇంద్రునికివలనే నాకు కూడా లభిస్తాయి. (15)
క్షీయతాం దుష్కృతం కర్మ వనవాసకృతం తవ ।
భార్యా మే భవ సుశ్రోణి యథా మందోదరీ తథా ॥ 16
సుశ్రోణి! వనవాసం చేయడం వలన కలిగే కష్టాలనే దుష్కర్మలు నీకు తొలగిపోవాలి. మండోదరి వలెనే నీవు కూడా నా భార్యవు అగుము". (16)
ఇత్యుక్తా తేన వైదేహి పరివృత్య శుభాననా ।
తృణమంతరతః కృత్వా తమువాచ నిశాచరమ్ ॥ 17
అశివేనాతివామోరూః అజస్రం నేత్రవారిణా ।
స్తనావపతితౌ బాలా సంహతావభివర్షతీ ॥ 18
ఉవాచ వాక్యం తం క్షుద్రం వైదేహీ పతిదేవతా ।
అని అతడు పలుకగా, శుభానన అయిన వైదేహి ముఖం తిప్పుకొని గడ్డిపరకను మధ్యలో ఉంచుకొని ఆ రాక్షసునితో పలుకసాగింది. అతిసుందరమైన ఊరువులు కల్గి, భర్తనే దైవంగా భావించే ఆ వైదేహి అమంగళ సూచకమైన కన్నీటితో తన ఎత్తయిన స్తనాలను నిరంతరం తడుపుతూ నీచుడయిన ఆ రాక్షసునితో ఇలా అంది. (17,18 1/2)
ఆసకృద్ వదతో వాక్యమీదృశం రాక్షసేశ్వర ॥ 19
విషాదయుక్తమేతత్ తే మయా శ్రుతమభాగ్యయా ।
తద్ భద్రముఖ భద్రం తే మానసం వినివర్త్యతామ్ ॥ 20
"రాక్షసేశ్వరా! నీవు చాలాసార్లు ఇలాంటి దుఃఖపూరితమైన మాటలు చెప్పావు. అభాగ్యురాలనైన నేను వినవలసి వచ్చింది. భద్రముఖా! నీకు మేలు కలుగుతుంది. నీ మనసు మార్చుకో. (19,20)
పరదారాస్మ్యలభ్యా చ సతతం చ పతివ్రతా ।
న చైవోపయికీ భార్యా మానుషీ కృపణా తవ ॥ 21
నేను పరుని భార్యను. పతివ్రతను. ఎప్పటికీ నీకు లభించని దానిని. దీనురాలను, మానవకాంతను అయిన నేను నీకు భార్యగా తగను. (21)
వివశాం ధర్షయిత్వా చ కాం త్వం ప్రీతిమవాప్స్యసి ।
ప్రజాపతిసమో విప్రః బ్రహ్మయోనిః పితా తవ ॥ 22
వివశురాలయిన నన్ను అవమానిస్తే నీకు ఏమి ప్రీతి కలుగుతుంది? నీ తండ్రి బ్రాహ్మణుడు. బ్రహ్మనుండి ఉద్భవించినవాడు, ప్రజాపతి వంటివాడు. (22)
న చ పాలయసే ధర్మం లోకపాలసమః కథమ్ ।
భ్రాతరం రాజరాజానం మహేశ్వరసఖం ప్రభుమ్ ॥ 23
ధనేశ్వరం వ్యపదిశన్ కథం త్విహ న లజ్జసే ।
నీవు లోకపాలురతో సమానుడవై కూడా ధర్మాన్ని ఎలా పాటించకుండా ఉంటున్నావు? రాజరాజు, మహేశ్వరసఖుడు, ధనేశ్వరుడు అయిన ప్రభువు కుబేరుని నీ సోదరునిగా చెప్పుకొంటున్నావు. ఈ పనిచేయడానికి నీకు సిగ్గు కలగడం లేదా? (23 1/2)
ఇత్యు క్త్వా ప్రారుదత్ సీతా కంపయంతీ పయోధరౌ ॥ 24
శిరోధరాం చ తన్వంగీ ముఖం ప్రచ్ఛాద్య వాససా ।
అని పలికి తన్వంగి అయిన సీత ముఖాన్ని, మెడను బట్టతో కప్పుకొని పాలిండ్లు కదిలిపోయేలా వెక్కివెక్కి ఏడ్చింది. (24 1/2)
తస్యా రుదత్యా భావిన్యా దీర్ఘా వేణీ సుసంయతా 7॥ 25
దదృశే స్వసితా స్నిగ్ధా కాలీ వ్యాలీవ మూర్ధని ।
అలా ఏడుస్తున భామిని సీతాదేవియొక్క శిరసు మీది నల్లనై, నునుపై, గట్టిగా చుట్టబడిన దీర్ఘవేణి నల్లత్రాచుపాములా కనిపించింది. (25 1/2)
శ్రుత్వా తద్ రావణో వాక్యం సీతయోక్తం సునిష్ఠురమ్ ॥ 26
ప్రత్యాఖ్యాతోఽపి దుర్మేధాః పునరేవాబ్రవీద్ వచః ।
కామమంగాని మే సీతే దునోతు మకరధ్వజః ॥ 27
న త్వామకామాం సుశ్రోణీం సమేష్యే చారుహాసినీమ్ ।
సీత పలికిన అతినిష్ఠురమైన ఆ మాటలను విని రావణుడు పూర్తిగా తిరస్కరించబడినా దుర్బుద్ధియై మళ్లీ ఇలా అన్నాడు.
"సీతా! మన్మథుడు నా అవయవాలను మిక్కిలిగా పిండేస్తున్నాడు. కాని చక్కని నవ్వుతో అందంగా ఉన్నా కోరిక లేని నిన్ను పొందను. (26, 27 1/2)
కిం ను శక్యం మయా కర్తుం యత్ త్వమద్యాపి మానుషమ్ ॥ 28
ఆహారభూతమస్మాకం రామమేవానురుధ్యసే ॥ 29
మాకు ఆహారంగా అయ్యే మానవుడు అయిన రామునే ఇప్పటికీ నీవు ప్రేమిస్తున్నావు. నేను ఏమి చేయగలను?" (28,29)
ఇత్యుక్త్వా తామనింద్యాంగీం స రాక్షసమహేశ్వరః ।
తత్రైవాంతర్హితో భూత్వా జగామాభిమతాం దిశమ్ ॥ 30
చక్కని శరీరం కల ఆమెతో ఇలా అని ఆ రాక్షసరాజు అక్కడే అంతర్ధానమై తనకు అభీష్టమైన చోటికి వెళ్లాడు. (30)
రాక్షసీభిః పరివృతా వైదేహీ శోకకర్శితా ।
సేవ్యమానా త్రిజటయా తత్రైవ న్యవసత్ తదా ॥ 31
రాక్షసస్త్రీలు చుట్టూ ఉండగా దుఃఖం చేత కృశించిపోయిన వైదేహిని త్రిజట సేవిస్తూ ఉండగా అక్కడే నివసించసాగింది. (31)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి రామోపాఖ్యానపర్వణి సీతారావణసంవాదే ఏకాశీత్యధికద్విశతతమోఽధ్యాయః ॥ 281 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున రామోపాఖ్యానపర్వమను ఉపపర్వమున సీతారావణసంవాదమను రెండువందల ఎనుబది ఒకటవ అధ్యాయము. (281)