279. రెండువందల డెబ్బదితొమ్మిదవ అధ్యాయము

రావణుడు జటాయువుకు అగ్నిసంస్కారమును చేయుట - కబంధునికి శాపవిముక్తి.

మార్కండేయ ఉవాచ
సఖా దశరథస్యాసీద్ జటాయురరుణాత్మజః ।
గృధ్రరాజో మహావీరః పంపాతిర్యస్య సోదరః ॥ 1
మార్కండేయుడు చెపుతున్నాడు - మహావీరుడు, గృధ్రరాజు అయిన జటాయువు అరుణుని కొడుకు, దశరథుని స్నేహితుడు. సంపాతి అతనికి అన్నగారు. (1)
స దదర్శ తదా సీతాం రావణాంకగతాం స్నుషామ్ ।
సక్రోధోఽభ్యద్రవత్ పక్షీ రావణం రాక్షసేశ్వరమ్ ॥ 2
అప్పుడు అతడు రావణుని ఒడిలో ఉన్న కోడలు సీతను చూశాడు. క్రోధంతో ఆ పక్షి రాక్షసేశ్వరుడైన రావణునివైపు వేగంగా ఎగురుతూ వచ్చింది. (2)
అథైనమబ్రవీద్ గృధ్రః ముంచ ముంచేతి మైథిలీమ్ ।
ధ్రియమాణే మయి కథం హరిష్యసి నిశాచర ॥ 3
ఆ పక్షిరాజు అతనితో ఇలా అన్నాడు - "నిశాచరా! విడు. విడు. నేను ప్రాణాలతో ఉండగా మైథిలిని ఎలా అపహరించగలుగుతావు? (3)
న హి మే మోక్ష్యసే జీవన్ యది నోత్సృజసే వధూమ్ ।
ఉక్త్వైవం రాక్షసేంద్రం తం చకర్త నఖరైర్భృశమ్ ॥ 4
నీవు నా కోడలిని విడిచిపెట్టకపోతే ప్రాణాలతో నానుండి తప్పించుకోలేవు." ఇలా అని ఆ రాక్షసేంద్రుని గోళ్లతో బాగా గాయపరిచాడు. (4)
పక్షతుండప్రహారైశ్చ శతశో జర్జరీకృతమ్ ।
చక్షార రుధిరం భూరి గిరిః ప్రస్రవణైరివ ॥ 5
రెక్కలతో కొట్టి ముక్కుతో పొడవడం వలన వందలకొద్దీ గాయాలై రావణుని శరీరం శిథిలమయిపోయింది. సెలయేళ్లతో నిండిన పర్వతంలా అతని శరీరం నుండి అధికంగా రక్తం స్రవించసాగింది. (5)
స వధ్యమానో గృధ్రేణ రామప్రియహితైషిణా ।
ఖడ్గమాదాయ చిచ్ఛేద భుజౌ తస్య పతత్త్రిణః ॥ 6
రామునికి ప్రియం హితం చేయదలచుకొన్న ఆ పక్షిరాజు తన్ను చంపటానికి సిద్ధంగాకా, రావణుడు కత్తి తీసుకొని ఆ పక్షి యొక్క రెండు భుజాలూ (రెండు రెక్కలు) నరికి వేశాడు. (6)
నిహత్య గృధ్రరాజం స భిన్నాభ్రశిఖరోపమమ్ ।
ఊర్ధ్వమాచక్రమే సీతాం గృహీత్వాంకేన రాక్షసః ॥ 7
మేఘాలను భిన్నం చేయగలిగిన పర్వతశిఖరం వంటి ఆ గృధ్రరాజును పడగొట్టి రావణుడు సీతను ఒడిలో పెట్టుకొని ఆకాశమార్గాన వెళ్లిపోయాడు. (7)
యత్ర యత్ర తు వైదేహి పశ్యత్యాశ్రమమండలమ్ ।
సరో వా సరితో వాపి తత్ర ముంచతి భూషణమ్ ॥ 8
ఎక్కడెక్కడ ఆశ్రమవాటికలు, సరస్సులు, నదులు కనిపించాయో, అక్కడ వైదేహి తన నగలను పడవేయసాగింది. (8)
సా దదర్శ గిరిప్రస్థే పంచ వానరపుంగవాన్ ।
తత్ర వాసో మహద్దివ్యమ్ ఉత్ససర్జ మనస్వినీ ॥ 9
ఒకచోట ఒక కొండశిఖరం మీద ఐదుగురు వానరశ్రేష్ఠులను ఆమె చూచింది. బుద్ధిమతి అయిన ఆమె తన దివ్యమైన వస్త్రాన్ని అక్కడ పడవేసింది. (9)
తత్ తేషాం వానరేంద్రాణాం పపాత పవనోద్ధతమ్ ।
మధ్యే సుపీతం పంచానాం విద్యున్మేఘాంతరే యథా ॥ 10
చక్కని పీతవర్ణం కలిగిన ఆ వస్త్రం గాలికి ఎగురుతూ మేఘాల మధ్యలోకి మెఱుపు వచ్చినట్లుగా ఆ వానరుల మధ్యకు వచ్చి పడింది. (10)
అచిరేణాతిచక్రామ ఖేచరః ఖే చరన్నివ ।
దదర్శాథ పురీం రమ్యాం బహుద్వారాం మనోరమామ్ ॥ 11
ఆకాశంలో సంచరించే పక్షివలె అతి శీఘ్రంగా దారి అంతా కడచి అతడు బహుద్వారాలతో, మనోహరంగా ఉన్న అందమైన తన లంకా నగరాన్ని చూశాడు. (11)
ప్రాకారవప్రసంబాధాం నిర్మితాం విశ్వకర్మణా ।
ప్రవివేశ పురీం లంకాం ససీతో రాక్షసేశ్వరః ॥ 12
విశ్వకర్మ నిర్మించిన ప్రాకారాలతో అగడ్తలతో చుట్టూ ఆవరించబడిన ఆ లంకాపురిని సీతతోపాటుగా రాక్షసేశ్వరుడయిన రావణుడు ప్రవేశించాడు. (12)
ఏవం హృతాయాం వైదేహ్యాం రామో హత్వా మహామృగమ్ ।
నివృత్తో దదృశే ధీమాన్ భ్రాతరం లక్ష్మణం తథా ॥ 13
ఇలా సీత అపహరించబడినాక, ధీమంతుడయిన రాముడు ఆ మహామృగాన్ని చంపి, వెనుతిరిగి వస్తూ సోదరుడైన లక్ష్మణుని చూశాడు. (13)
కథముత్సృజ్య వైదేహీం వనే రాక్షససేవితే ।
ఇతి తం భ్రాతరం దృష్ట్వా ప్రాప్తోఽసీతి వ్యగర్హయత్ ॥ 14
"రాక్షసులు నిండి ఉండే అడవిలో వైదేహిని విడిచి ఎలా వచ్చావు" అని తన సోదరుని నిందించాడు. (14)
మృగరూపధరేణాథ రక్షసా సోఽపకర్షణమ్ ।
భ్రాతురాగమనం చైవ చింతయన్ పర్యతప్యత ॥ 15
మృగరూపధారి అయిన రాక్షసుడు తన్ను ఆశ్రమం నుండి దూరంగా తీసుకురావడం, తమ్ముడు కూడా ఇక్కడికి వచ్చెయ్యడం తలచుకొని రాముడు మనసులోనే తపించాడు. (15)
గర్హయన్నేవ రామస్తు త్వరితస్తం సమాసదత్ ।
అపి జీవతి వైదేహీ నేతి పశ్యామి లక్ష్మణ ॥ 16
రాముడు అలా నిందించుకొంటూనే త్వరత్వరగా వెళ్లి అతనిని కలుసుకొన్నాడు. "లక్ష్మణా! వైదేహి ఇప్పుడు బతికి ఉందో లేదో చూడాలి" అన్నాడు. (16)
తస్య తత్ సర్వమాచఖ్యౌ సీతయా లక్ష్మణో వచః ।
యదుక్తవత్యసదృశం వైదేహీ పశ్చిమం వచః ॥ 17
అప్పుడు లక్ష్మణుడు చివరలో సీత అన్న అనుచితమైన, అసంగతమైన మాటలన్నీ చెప్పాడు. (17)
దహ్యమానేవ తు హృదా రామోఽభ్యపతదాశ్రమమ్ ।
స దదర్శ తదా గృధ్రం నిహతం పర్వతోపమమ్ ॥ 18
శోకంతో దహించుకుపోతున్న మనసుతో రాముడు ఆశ్రమం వైపు బయలుదేరాడు. అప్పుడక్కడ పర్వతంలా ఉన్న గాయపడిన పక్షిని అతడు చూశాడు. (18)
రాక్షసం శంకమానస్తం వికృష్య బలవద్ ధనుః ।
అభ్యధావత కాకుత్ స్థః తతస్తం సహలక్ష్మణః ॥ 19
అతనిని రాక్షసునిగా శంకించి బలంగా ధనస్సును లాగిపట్టుకొని రాముడు లక్ష్మణసమేతుడై అతనివైపు పరుగుతీశాడు. (19)
స తావువాచ తేజస్వీ సహితౌ రామలక్ష్మణౌ ।
గృధ్రరాజోఽస్మి భద్రం వాం సఖా దశరథస్య వై ॥ 20
తేజస్వి అయిన జటాయువు కలిసి వచ్చిన ఆ రామలక్ష్మణులతో "మీకు మేలగు గాక! నేను పక్షిరాజును. దశరథునకు స్నేహితుడను" అన్నాడు. (20)
తస్య తద్ వచనం శ్రుత్వా సంగృహ్య ధనుషీ శుభే ।
కోఽయం పితరమస్మాకం నామ్నాఽఽహేత్యూచతుశ్చ తౌ ॥ 21
అతని ఆ మాటలను విని వారిద్దరు దివ్యమైన ఆ విండ్లను దించి, "మా తండ్రి గారి పేరును ఉచ్చరించావు నీవెవరవు?" అని అడిగారు. (21)
తతో దదృశతుస్తౌ తం ఛిన్నపక్షద్వయం ఖగమ్ ।
తయోః శశంస గృధ్రస్తు సీతార్థే రావణాద్ వధమ్ ॥ 22
అప్పుడు వారిద్దరు ఆ పక్షియొక్క రెక్కలు తెగి ఉండడం గమనించారు. సీతకోసం రావణుని చేతిలో తాను గాయపడడం గురించి ఆ పక్షి వారిద్దరికి చెప్పింది. (22)
అపృచ్ఛద్ రాఘవో గృధ్రం రావణః కాం దిశం గతః ।
తస్య గృధ్రః శిరఃకంపైః ఆచచక్షే మమార చ ॥ 23
రావణుడు ఏ దిక్కుకు వెళ్లాడని రాఘవుడు అడిగాడు. ఆ పక్షి తల ఊపడం ద్వారానే చెప్పి, ప్రాణాలు వదిలేసింది. (23)
దక్షిణామితి కాకుత్ స్థో విదిత్వాస్య తదింగితమ్ ।
సంస్కారం లంభయామాస సఖాయం పూజయన్ పితుః ॥ 24
'దక్షిణదిశ' అని దాని ఇంగితాన్ని గుర్తించాడు రాముడు. తండ్రికి స్నేహితుడని గౌరవించి అగ్ని సంస్కారం చేశాడు. (24)
తతో దృష్ట్వాఽఽశ్రమపదం వ్యపవిద్ధబృసీమఠమ్ ।
విధ్వస్తకలశం శూన్యం గోమాయుశతసంకులమ్ ॥ 25
అనంతరం ఆశ్రమానికి వెళ్లి చూశాడు. ఆశ్రమం అంతా చిందరవందరగా ఉంది. దర్భాసనం విసిరివేయబడి ఉంది. కలశాలు విరిగిపడి ఉన్నాయి. అంతా శూన్యంగా ఉంది. ఎన్నో నక్కలు అక్కడ గుమికూడి ఉన్నాయి. (25)
దుఃఖశోకసమావిష్టౌ వైదేహీహరణార్దితౌ ।
జగ్మతుర్దండకారణ్యం దక్షిణేన పరంతపౌ ॥ 26
సీతాపహరణానికి బాధపడుతూ, దుఃఖశోకాలతో నిండిపోయిన శత్రుమర్దనులైన ఆ రామలక్ష్మణులిద్దరూ దండ కారణ్యాన్నుండి దక్షిణదిక్కుగా బయలేర్దారు. (26)
వనే మహతి తస్మింస్తు రామః సౌమిత్రిణా సహ ।
దదర్శ మృగయూథాని ద్రవమాణాని సర్వశః ॥ 27
ఆ మహారణ్యంలో లక్ష్మణునితో కలిసి రాముడు జంతుజాలమంతా అన్నివైపులకు పరుగులు తీయడం చూశాడు. (27)
శబ్దం చ ఘోరం సత్త్వానాం దావాగ్నేరివ వర్ధతః ।
అపశ్యేతాం ముహూర్తాచ్ఛ కబంధం ఘోరదర్శనమ్ ॥ 28
దావాగ్నికి భయపడినట్లుగా జంతువుల ఘోరనాదాలన్నీ అంతకంతకు పెరుగుతున్నాయి. ముహూర్తమాత్రకాలంలో వారు భయంకరాకారం కల కబంధుని చూశారు. (28)
మేఘపర్వతసంకాశం శాలస్కంధం మహాభుజమ్ ।
ఉరోగతవిశాలాక్షం మహోదరమహాముఖమ్ ॥ 29
ఆ కబంధుడు మేఘంలా నల్లగా పర్వతంలా విశాలకాయం కలిగి ఉన్నాయి. మద్దిచెట్టులా పొడవైన భుజాలు కలిగి, వక్షః స్థలంలోనే వెడల్పైన కనులతో, పెద్ద పొట్టలో పెద్దనోటితో వికృతంగా ఉన్నాడు. (29)
వి॥సం॥ ఉరము మీద కళ్లూ, పొట్ట మీద ముఖమూ కలవాడు, కబంధుడనగా తల లేని పురుషుడు. (నీల)
యదృచ్ఛయాథ తద్ రక్షః కరే జగ్రాహ లక్ష్మణమ్ ।
విషాదమగమత్ సద్యః సైముత్రిరథ భారత ॥ 30
ఆ రాక్షసుడు అనుకోకుండా ఆకస్మాత్తుగా లక్ష్మణుని చేతిని పట్టుకొన్నాడు. భారతా! వెంటనే సుమిత్రానందనుడు విషాదం పొందాడు. (30)
స రామమభిసంప్రేక్ష్య కృష్యతే యేన తన్ముఖమ్ ।
విషణ్ణశ్చాబ్రవీద్ రామం పశ్యావస్థామిమాం మమ ॥ 31
ఆ రాక్షసుడు లక్ష్మణుని తన నోటివైపు లాగుకోసాగాడు. లక్ష్మణుడు విషణ్ణుడై రాముని వైపు చూచి ఇలా అన్నాడు - అన్నయ్యా! నా ఈ అవస్థను చూడు. (31)
హరణం చైవ వైదేహ్యా మమ చాయముపప్లవః ।
రాజ్యభ్రంశశ్చ భవతః తాతస్య మరణం తథా ॥ 32
సీతాదేవి అపహరణకు గురికావడం, నాకు ఇలాంటి ఉపద్రవం రావడం, నీవు రాజ్యభ్రష్టుడవు కావడం, తండ్రిగారు చనిపోవడం (ఇలా ఒకదాని మీద ఒకటి ఆపదలు వచ్చిపడుతున్నాయి. (32)
నాహం త్వాం సహ వైదేహ్యా సమేతం కోసలాగతమ్ ।
ద్రక్ష్యామి పృథివీరాజ్యే పితృపైతామహే స్థితమ్ ॥ 33
సీతతో కూడి నీవు కోసలదేశానికి వెళ్లి, తాత తండ్రుల నుండి సంక్రమించిన భూమండలరాజ్యాన్ని పొందడం నేను చూడలేనేమో! (33)
ద్రక్ష్యంత్యార్యస్య ధన్యా యే కుశలాజశమీదలైః ।
అభిషిక్తస్య వదనం సోమం శాంతఘనం యథా ॥ 34
కుశలతో, లాజలతో (పేలాలతో), శమీపత్రాలతో అభిషేకింపబడిన మీ యొక్క మేఘరహితమైన చంద్రుని వంటి ముఖాన్ని చూడగలిగిన వారు ధన్యులు". (34)
ఏవం బహువిధం ధీమాన్ విలలాప స లక్ష్మణః ।
తమువాచాథ కాకుత్ స్థః సంభ్రమేష్వప్యసంభ్రమః ॥ 35
ఇలా పలువిధాలుగా బుద్ధిమంతుడయిన ఆ లక్ష్మణుడు విలపిస్తూంటే కంగారుపడే సమయంలో కూడా కంగారు పడని ఆ రాముడు అతనితో ఇలా అన్నాడు. (35)
మా విషీద నరవ్యాఘ్ర నైష కశ్చిన్మయి స్థితే ।
ఛింధ్యస్య దక్షిణం బాహుం ఛిన్నః సవ్యో మయా భుజః ॥ 36
"నరశార్దూలా! విచారించకు. నేను ఉండగా ఇతడు లెక్కలోని వాడు కాడు.(ఏమీ చేయలేడు). నీవు ఈతని కుడిచేతిని ఖండించు. నేను ఎడమ చేతిని నరుకుతున్నాను." అన్నాడు. (36)
ఇత్యేవం వదతా తస్య భుజో రామేణ పాతితః ।
ఖడ్గేన భృశతీక్ష్ణేన నికృత్తస్తిలకాండవత్ ॥ 37
ఇలా అంటూనే రాముడు పదునైన కత్తితో తుంచివేయబడిన నువ్వు కాడలా అతని భుజాన్ని నరికిపారేశాడు. (37)
తతోఽస్య దక్షిణం బాహుం ఖడ్గేనాజఘ్నివాన్ బలీ ।
సౌమిత్రిరపి సంప్రేక్ష్య భ్రాతరం రాఘవం స్థితమ్ ॥ 38
పునర్జఘాన పార్శ్వే వై తద్ రక్షో లక్ష్మణో భృశమ్ ।
గతాసురపతద్ భూమౌ కబంధః సుమహాంస్తతః ॥ 39
బలవంతుడయిన సుమిత్రానందనుడు కూడా అప్పుడు అతని కుడిచేతిని ఖండించివేశాడు. తన అన్న రాఘవుడు నిల్చుని ఉండడం చూసి లక్ష్మణుడు మళ్లీ ఆ రాక్షసుని పక్కటెముకపై గట్టిగా వేటు వేశాడు. అంతట పెద్ద శరీరం కల ఆ కబంధుడు ప్రాణాలు కోల్పోయి నేలకు ఒరిగాడు. (38,39)
తస్య దేహాత్ వినిఃసృత్య పురుషో దివ్యదర్శనః ।
దదృశే దివమాస్థాయ దివి సూర్య ఇవ జ్వలన్ ॥ 40
అతని దేహం నుండి దివ్యరూపధారి అయిన ఒక పురుషుడు వెలువడి ఆకాశంలో సూర్యునిలా వెలుగొందుతూ, నిలిచి ఉండడం కనిపించింది. (40)
పప్రచ్ఛ రామస్తం వాగ్మీ కస్త్వం ప్రబ్రూహి పృచ్ఛతః ।
కామయా కిమిదం చిత్రమ్ ఆశ్చర్యం ప్రతిభాతి మే ॥ 41
మాటలలో నేర్పరి అయిన రాముడు అతనిని "నీవు ఎవరవు? నీకు ఇష్టమయితేనే అడుగుతున్న నాకు సమాధానం చెప్పు. ఇదంతా ఏదో అద్భుతంగానూ, చిత్రంగానూ అనిపిస్తోంది" అని అడిగాడు. (41)
తస్యాచచక్షే గంధర్వః విశ్వావసురహం నృప ।
ప్రాప్తో బ్రాహ్మణశాపేన యోనిం రాక్షససేవితామ్ ॥ 42
రావణేన హృతా సీతా రాజ్ఞా లంకాధివాసినా ।
సుగ్రీవమభిగచ్ఛస్వ స తే సాహ్యం కరిష్యతి ॥ 43
"రాజా! నేను విశ్వావసువనే గంధర్వుడిని. బ్రాహ్మణ శాపం వలన రాక్షస జన్మ ప్రాప్తించింది. లంకలో నివసించే రాక్షసరాజు రావణుడు, సీతను అపహరించాడు. సుగ్రీవుని కలుసుకో, అతడు నీకు సహాయం చేస్తాడు. (42,43)
ఏషా పంపా శివజలా హంసకారండవాయుతా ।
ఋష్యమూకస్య శైలస్య సంనికర్షే తటాకినీ ॥ 44
ఇదిగో దగ్గరలోనే హంసలతో, బెగ్గురు పక్షులతో కూడి, పవిత్రజలంతో నిండిన, పంపా సరోవరం ఉంది. ఆ చెరువు ఋశ్యమూక పర్వతానికి ఆనుకుని ఉంది. (44)
వసతే తత్ర సుగ్రీవః చతుర్భిః సచివైః సహ ।
భ్రాతా వానరరాజస్య వాలినో హేమమాలినః ॥ 45
అక్కడ సుగ్రీవుడు నలుగురు మంత్రులతో కలిసి నివసిస్తున్నాడు. అతడు సువర్ణమాలను ధరించి ఉంటాడు. వానరరాజయిన వాలికి సోదరుడు. (45)
తేన త్వం సహ సంగమ్య దుఃఖమూలం నివేదయ ।
సమానశీలో భవతః సాహాయ్యం స కరిష్యతి ॥ 46
నీవు అతనిని కలుసుకొని నీ దుఃఖానికి కారణాన్ని తెలియచేయి, నీతో సమానమైన శీలం కల అతడు నీకు సహాయం చేస్తాడు. (46)
ఏతావచ్ఛక్యమస్మాభిః వక్తుం ద్రష్టాసి జానకీమ్ ।
ధ్రువం వానరరాజస్య విదితో రావణాలయః ॥ 47
నేను ఇంతమాత్రం చెప్పగలను - నీవు జానకిని చూస్తావు. వానరరాజు సుగ్రీవునికి రావణుని నివాసం నిశ్చయంగా తెలుసు". (47)
ఇత్యుక్త్వాంతర్హితో దివ్యః పురుషః స మహాప్రభః ।
విస్మయం జగ్మతుశ్చోభౌ ప్రవీరౌ రామలక్ష్మణౌ ॥ 48
అనిచెప్పి మిక్కిలి ప్రకాశం కలిగిన ఆ దివ్యపురుషుడు అంతర్థానమయ్యాడు. మహావీరులైన రామలక్ష్మణులు ఇద్దరూ ఆశ్చర్యపడ్డారు. (48)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి రామోపాఖ్యానపర్వణి కబంధహననే ఏకోనాశీత్యధికద్విశతతమోఽధ్యాయః ॥ 279 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున రామోపాఖ్యానపర్వమను ఉపపర్వమున కబంధవధమను రెండువందల డెబ్బది తొమ్మిదవ అధ్యాయము. (279)