రావణుని రాకను చూచిన మారీచుడు ఆశ్చర్యంతో తొట్రుపడుతూ అతనిని ఫలమూలాదులతో సత్కరించి గౌరవించాడు. (1)
రావణుడు విశ్రాంతంగా కూర్చున్నాక అతనివద్ద తాను కూడా కూర్చుని మాటలాడడంలో నేర్పరి అయిన మారీచ రాక్షసుడు మాటలలోని మర్మాన్ని గుర్తించిగలిగిన రావనాసురునితో వినయంగా ఇలా అన్నాడు. (2)
"రావణా! నీ శరీరపు రంగు సహజంగా లేదు. (పాలిపోయినట్లున్నావు) నీ నగరమంతా క్షేమమే కదా! నీ ప్రజలు, మంత్రులు అందరూ నిన్ను ఎప్పటిమాదిరిగానే సేవిస్తున్నారా? (3)
రాక్షసరాజా! నీవు ఇక్కడికి రావలసినంత పనేమిటి? నేను చేయగలిగితే ఎంత దుష్కరకార్యమయినా అది నెరవేరినట్లే అనుకో?" అని అడిగాడు. (4)
క్రోధాసూయలతో నిండిపోయిన రావణుడు రాముడు చేసినదంతా, సంక్షిప్తంగా (అతని కార్యాలను), మారీచునకు చెప్పాడు. (5)
మారీచుడు అదంతా విని క్లుప్తంగా రావణునితో "నీవు రామునితో వైరం పెట్టుకోకు. అతని పరాక్రమం తెలిసిన వాడిని నేను." (6)
ఆ మహాత్మునియొక్క బాణవేగాన్ని తట్టుకోవడం ఎవరికి సాధ్యమవుతుంది? నేను సన్యసించడానికి ఆ పురుషశ్రేష్ఠుడే కారణం కదా! రామునితో వైరం వినాశానికి దారితీస్తుంది. ఏ దురాత్ముడు దీనిని నీకు చెప్పాడు?" అని ఉపదేశించాడు. (7 1/2)
అది విని రావణుడు మరింత క్రోధంతో అతనిని బెదిరిస్తూ - "నీవు నామాట పాటించకపోతే నీకు మృత్యువు తప్పదు" అన్నాడు. (8 1/2)
మారీచుడు తనలో "మరణం ఎలాగూ తప్పనప్పుడు విశిష్టమైన వ్యక్తులచేతిలో చావే శ్రేష్ఠమైనది. కనుక ఇతనికి ఏది ఇష్టమో అలాగే చేస్తాను" అని ఆలోచించుకొన్నాడు. (9 1/2)
అనంతరం మారీచుడు ఆ రాక్షస శ్రేష్ఠునికి - "నీకు నేను చేయవలసిన సహాయం ఏమిటి? అది నావలన కాకపోయినా చేస్తాను." అని బదులిచ్చాడు. (10 1/2)
దశగ్రీవుడు - "నీవు రత్నమయమైన కొమ్ములు, రత్నకాంతులు, విచిత్రమైన రోమాలు గల లేడిగా మారి సీతను ప్రలోభపెట్టు. వెళ్లు. నిన్ను చూసి సీత తప్పకుండా రాముని పంపిస్తుంది. (పట్టుకోవడానికి) (11,12)
"రాముడు దూరంగా వెళ్లిపోగానే సీత వశమైపోతుంది. ఆమెను ఆశ్రమం నుండి అపహరించి తీసుకొనివచ్చేస్తాను. దుర్బుద్ధి అయిన రాముడు భార్యావియోగంతో జీవించలేడు. ఈ సాహాయ్యం నాకు చేసిపెట్టు" అన్నాడు. (13 1/2)
రావణుడు ఇలా చెప్పగానే మారీచుడు తనకు నీళ్లు వదలుకొని, అత్యంతమూ దుఃఖితుడై రావణుడు ముందు నడుస్తూ ఉండగా అతనిని అనుసరించాడు. (14 1/2)
చక్రతుస్తద్ తథా సర్వమ్ ఉభౌ యత్ పూర్వమంత్రితమ్ ।
అనంతరం వారిద్దరూ అవలీలగా పనులు చక్కపెట్టగల ఆ రాముని ఆశ్రమానికి వెళ్లి, పూర్వం తాము అనుకొన్న రీతిగా సర్వమూ నిర్వహించారు. (15 1/2)
రావణస్తు యతిర్భూత్వా ముండః కుండీ త్రిదండధృక్ ॥ 16
మృగశ్చ భూత్వా మారీచః తం దేశముపజగ్మతుః ।
దర్శయామాస మారీచో వైదేహీం మృగరూపధక్ ॥ 17
బోడితలతో, భిక్షాపాత్రతో, త్రిదండంతో రావణుడు సన్యాసిగానూ, మారీచుడు మృగంగానూ మారి ఆప్రదేశాన్ని సమీపించారు. మృగరూపాన్ని ధరించిన మారీచుడు సీతకు కనిపించాడు. (16,17)
చోదయామాస తస్యార్థే సా రామం విధిచోదితా ।
రామస్తస్యాః ప్రియం కుర్వన్ ధనురాదాయ సత్వరః ॥ 18
రక్షా ర్థే లక్ష్మణం న్యస్య ప్రయయౌ మృగలిప్సయా ।
విధిప్రేరణతో సీతాదేవి ఆ మృగంకోసం రాముని పంపింది. రాముడు కూడా ఆమెకు ప్రియం చేయదలచి సత్వరంగా ధనుస్సు తీసుకొని, ఆమెకు రక్షణగా లక్ష్మణుని ఉంచి మృగాన్ని పట్టుకోవాలని బయలుదేరాడు. (18 1/2)
స ధన్వీ బద్ధతూణీరః ఖడ్గగోధాంగులిత్రవాన్ ॥ 19
అన్వధావన్మృగం రామః రుద్రస్తారామృగం యథా ।
అతడు చేతిలో విల్లు ధరించి, అమ్ములపొదిని వీపున కట్టుకొని, నడుమున కత్తి, చేతికి గోధాంగుళిత్రము (ఉడుము చర్మంతో చేసిన తొడుగు) ధరించి శివుడు మృగశిరా నక్షత్రం వెంట పడినట్లుగా ఆ మృగం వెంట పరుగు తీశాడు. (19 1/2)
సోఽంతర్హితః పునస్తస్య దర్శనం రాక్షసో వ్రజన్ ॥ 20
చకర్ష మహదధ్వానం రామస్తం బుబుధే తతః ।
నిశాచరం విదిత్వా తం రాఘవః ప్రతిభానవాన్ ॥ 21
అమోఘం శరమాదాయ జఘాన మృగరూపిణమ్ ।
ఆ రాక్షసుడు అంతర్ధానుడవుతూ, తిరిగి కనిపిస్తూ ఆశ్రమం నుండి రాముని చాలాదూరం వచ్చేలా చేశాడు. అప్పుడు రాముడు తెలుసుకొన్నాడు. అతనిని రాక్షసునిగా తెలుసుకొని ప్రతిభాశాలి అయిన రాముడు అమోఘమైన ఒక బాణాన్ని సంధించి మృగరూపధారియైన అతనిని సంహరించాడు. (20, 21 1/2)
స రామబాణాభిహతః కృత్వా రామస్వరం తదా ॥ 22
హా సీతే లక్ష్మణేత్యేవం చుక్రోశార్తస్వరేణ హ ।
రాముని బాణం తగిలిన అతడు అప్పుడు రాముని కంఠంతోనే "హాసీతా! హా లక్ష్మణా!" అని దీనస్వరంతో ఆక్రోశించాడు. (22 1/2)
శుశ్రావ తస్య వైదేహీ తతస్తాం కరుణాం గిరమ్ ॥ 23
సా ప్రాద్రవద్ యతః శబ్ధః తామువాచాథ లక్ష్మణః ।
అలం తే శంకయా భీరు కో రామం ప్రహరిష్యతి ॥ 24
ముహుర్తాద్ ద్రక్ష్యసే రామం భర్తారం త్వం శుచిస్మితే ।
అతనియొక్క దీనమైన ఆ వాక్కును వైదేహి విన్నది. ఆమె ఆ శబ్దం వచ్చినవైపుగా పరుగుతీసింది. ఆమెతో లక్ష్మణుడు - "భీరూ! నీవు శంకించవలసిన పని లేదు. రాముని చంపగలిగిన వారెవరు ఉన్నారు? శుచిస్మితా! ఒక్క ముహూర్తకాలంలోనే నీవు నీ భర్త రాముని చూడగలుగుతావు" అన్నాడు. (23, 24 1/2)
ఇత్యుక్తా సా ప్రరుదతీ పర్యశంకత లక్ష్మణమ్ ॥ 25
హతా వై స్త్రీ స్వభావేన శుక్లచారిత్రభూషణా ।
సా తం పరుషమారబ్ధా వక్తుం సాధ్వీ పతివ్రతా ॥ 26
అది విని ఆమె ఏడుస్తూ లక్ష్మణుని శంకించింది. సదాచారమే భూషణంగా గలిగి సాధ్వి, పతివ్రత అయిన ఆమె స్త్రీ స్వభావం వలన అతనిని పరుషంగా మాటలాడసాగింది. (25,26)
నైష కామో భవేన్మూఢ యం త్వం ప్రార్థయసే హృదా ।
అప్యహం శస్త్రమాదాయ హన్యామాత్మానమాత్మనా ॥ 27
పతేయం గిరిశృంగాద్ వా విశేయం వా హుతాశనమ్ ।
రామం భర్తారముత్సృజ్య న త్వహం త్వాం కథంచన ॥ 28
నిహీనముపతిష్ఠేయం శార్దూలీ క్రోష్టుకం యథా ।
"మూఢుడా! నీవు నీ మనసులో కోరుకొంటున్నది ఎప్పటికీ జరుగదు. కత్తి తీసుకొని నన్ను నేను చంపుకొంటాను. కొండ కొమ్ము నుండి దూకి చస్తాను. లేదా అగ్నిలో దూకుతాను. అంతేకాని రామునివంటి భర్తను వదిలి నీవంటి నీచుని పొందను. పులిపిల్ల నీచమైన నక్కను చేరనట్లుగా నేను నిన్ను చేరను" అన్నది. (27,28 1/2)
ఏతాదృశం వచః శ్రుత్వా లక్ష్మణః ప్రియరాఘవః ॥ 29
పిధాయ కర్ణౌ సద్వృత్తః ప్రస్థితో యేన రాఘవః ।
స రామస్య పదం గృహ్య ప్రససార ధనుర్ధరః ॥ 30
అవీక్షమాణో బింబోష్ఠీం ప్రయయౌ లక్ష్మణస్తదా ।
అటువంటి మాటలు విని అన్నగారి పట్ల ప్రేమ కల లక్ష్మణుడు చెవులు మూసుకొన్నాడు. సదాచారి అయిన అతడు అన్నగారు వెళ్లిన వైపు బయలుదేరాడు. ధరుర్ధరుడై కాలిగుర్తులవెంట సాగాడు. సీతాదేవి వైపు కన్నెత్తి కూడా చూడకుండానే అక్కడి నుండి బయలుదేరాడు. (29, 30 1/2)
ఏతస్మిన్నంతరే రక్షో రావణః ప్రత్యదృశ్యత ॥ 31
అభవ్యో భవ్యరూపేణ భస్మచ్ఛన్న ఇవానలః ।
యతివేషప్రతిచ్ఛన్నః జిహీర్షుస్తామనిందితామ్ ॥ 32
ఈ అవకాశం చూసుకొని రాక్షసుడైన రావణుడు, భయానకరూపుడైనా అందమైన ఆకారం దాల్చి నివురు కప్పిన నిప్పులా సన్యాసివేషంలో తన్ను తాను మరుగుపరచుకొని ఆ సీతాసాధ్విని అపహరించడానికి అక్కడ ప్రత్యక్షమయ్యాడు. (31,32)
సా తమాలక్ష్య సంప్రాప్తం ధర్మజ్ఞా జనకాత్మజా ।
నియంత్రయామాస తదా ఫలమూలాశనాదిభిః ॥ 33
ధర్మజ్ఞురాలయిన జానకి ఆశ్రమానికి వచ్చిన అతనిని చూచి అప్పుడు పళ్లు, దుంపలు మొదలైన భోజనంతో అతిథి సత్కారం చేయడానికి భోజనానికి పిలిచింది. (33)
అవమన్య తతః సర్వం స్వరూపం ప్రత్యపద్యత ।
సాంత్వయామాస వైదేహీమ్ ఇతి రాక్షసపుంగవః ॥ 34
ఆమె చేసిన ఆ సత్కారాన్నంతటినీ తృణీకరించి, రాక్షసరాజు తన అసలురూపం పొంది, వైదేహిని ఇలా బుజ్జగించసాగాడు. (34)
సీతే రాక్షసరాజోఽహం రావణో నామ విశ్రుతః ।
మమ లంకా పురీ నామ్నా రమ్యా పారే మహోదధేః ॥ 35
"సీతా! నేను రాక్షసరాజును. రావణుడనే పేరుతో ప్రసిద్ధికెక్కినవాడను. సముద్రానికి ఆవలివైపున రమణీయమైన లంక అనే పేరుగల నా రాజధాని ఉంది. (35)
తత్ర త్వం నరనారీషు శోభిష్యసి మయా సహ ।
భార్యా మే భవ సుశ్రోణి తాపనం త్యజ రాఘవమ్ ॥ 36
అక్కడ స్త్రీ పురుషుల మధ్య నీవు నన్ను కూడి శోభిల్లగలవు. సుశ్రోణీ! నీవు నాకు భార్యగా ఉండు. తాపసి అయిన ఆ రాఘవుని వదిలిపెట్టు" అన్నాడు. (36)
ఏవమాదీని వాక్యాని శ్రుత్వా తస్యాథ జానకీ ।
పిధాయ కర్ణో సుశ్రోణీ మైవమిత్యబ్రవీద్ వచః ॥ 37
ప్రపతేద్ ద్యౌః సనక్షత్రా పృథివీ శకలీభవేత్ ।
శైత్యమగ్నిరియాన్నాహం త్యజేయం రఘునందనమ్ ॥ 38
అతని యొక్క ఈ రకమైన మాటలను విని సీత చెవులు మూసుకొని ఇలా అంది. "అలా ఎన్నటికీ కాదు. నక్షత్రసహితంగా మిన్ను విరిగిపడినా, భూమి ముక్కలయినా, అగ్ని చల్లబడినా రాముని నేను విడువను. (37,38)
కథం హి భిన్నకరటం పద్మినం వనగోచరమ్ ।
ఉపస్థాయ మహానాగం కరేణుః సూకరం స్పృశేత్ ॥ 39
మదజలం స్రవిస్తున్న గండస్థలం కలిగి, పద్మమాలికలు ధరించిన, అడవిలో ఉన్న మదపుటేనుగును పొందిన ఆడ ఏనుగు పందిని ఎలా స్పృశిస్తుంది? (39)
కథం హి పీత్వా మాధ్వీకం పీత్వా చ మధుమాధవీమ్ ।
లోభం సౌవీరకే కుర్యాత్ నారీ కాచిదితి స్మరేత్ ॥ 40
పూలతేనె తాగి, పట్టుతేనెను క్రోలిన ఏ స్త్రీ అయినా రేగుపండ్లమీద ఎలా లోభపడగలుగుతుంది? (40)
ఇతి సా తం సమాభాష్య ప్రవివేశాశ్రమం తతః ।
క్రోధాత్ ప్రస్ఫురమాణౌష్ఠీ విధిన్వానా కరౌ ముహుః ॥ 41
అని అతనిని ఉద్దేశించి చెప్పి, ఆమె క్రోధంతో పెదవులు అదురుతూండగా, మాటిమాటికీ చేతులు దులుపుతూ, ఆశ్రమం లోపలికి వెళ్లిపోయింది. (41)
తామభిద్రుత్య సుశ్రోణీం రావణః ప్రత్యషేధయత్ ।
భర్త్సయిత్వా తు రూక్షేణ స్వరేణ గతచేతనామ్ ॥ 42
వెన్నంటి పరుగెత్తి రావణుడు ఆమెను అడ్డగించాడు. కఠోరమైన కంఠంతో ఆమెను భయపెట్టసాగాడు. ఆమె మూర్ఛపోయింది. (42)
మూర్ధజేషు నిజగ్రాహ ఊర్ధ్వమాచక్రమే తతః ।
తాం దదర్శ తతో గృధ్రః జటాయుర్గిరిగోచరః ।
రుదతీం రామ రామేతి హ్రియమాణాం తపస్వినీమ్ ॥ 43
ఆమెను జుట్టుపట్టుకొన్నాడు. వెంటనే ఆకాశంలోకి ఎగిరిపోయాడు. రావణుడు ఆమెను అపహరించి తీసుకొని పోతూండగా ఆమె దీనురాలై "రామా!రామా!" అని విలపిస్తోంది. అటువంటి ఆమెను పర్వతగుహలో నివసించే జటాయువు అనే గద్ద చూచింది. (43)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి రామోపాఖ్యానపర్వణి మారీచవధే సీతాహరణే చ అష్టసప్తత్యధికద్విశతతమోఽధ్యాయః ॥ 278 ॥
ఇది శ్రీమహాభారతమున రామోపాఖ్యానపర్వమను ఉపపర్వమున మారీచవధ-సీతాహరణము అను రెండువందల డెబ్బది యెనిమిదవ అధ్యాయము. (278)