277. రెండు వందల డెబ్బది ఏడవ అధ్యాయము
రాముని వనవాసము - రాముడు ఖరదూషణులను సంహరించుట.
యుధిష్ఠిర ఉవాచ
ఉక్తం భగవతా జన్మ రామాదీనాం పృథక్ పృథక్ ।
ప్రస్థానకారణం బ్రహ్మన్ శ్రోతుమిచ్ఛామి కథ్యతామ్ ॥ 1
కథం దాశరథీ వీరౌ భ్రాతరౌ రామలక్ష్మణౌ ।
సంప్రస్థితౌ వనే బ్రహ్మన్ మైథిలీ చ యశస్వినీ ॥ 2
యుధిష్ఠిరుడు అడుగుతున్నాడు - "దేవా! రామాదుల యొక్క జనన వృత్తాంతం విడివిడిగా చెప్పారు. వారు అడవికి వెళ్లడానికి గల కారణాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాను" చెప్పండి. వీరులు, సోదరులు అయిన ఆ దశరథ పుత్రులు రామలక్ష్మణులు, యశస్విని అయిన సీత వనానికి ఎందుకు బయలుదేరారు? (1,2)
మార్కండేయ ఉవాచ
జాత పుత్రో దశరథః ప్రీతిమానభవన్నృప ।
క్రియారతిర్థర్మరతః సతతం వృద్ధసేవితా ॥ 3
రాజా! దశరథుడు సత్కర్మ నిరతుడు, ధర్మపరాయణుడు, ఎల్లప్పుడూ వృద్ధులను సేవిస్తూ ఉండేవాడు. పుత్రులు కలిగినందుకు అతడు ఎంతో సంతోషించాడు. (3)
క్రమేణ చాస్య తే పుత్రాః వ్యవర్ధంత మహౌజసః ।
వేదేషు సరహస్యేషు ధనుర్వేదేషు పారగాః ॥ 4
చరితబ్రహ్మచర్యాస్తే కృతదారాశ్చ పార్థివ ।
యదా తదా దశరథః ప్రీతిమానభవత్ సుఖీ ॥ 5
రాజా! మహా తేజస్వులయిన అతనియొక్క ఆ పుత్రులు దినదినాభివృద్ధి చెందారు. బ్రహ్మచర్యవ్రతులై వారు వేదాలలో ధనుర్వేదరహస్యములలో పారంగతులయ్యారు. వారికి వివాహం కాగానే దశరథుడు మిక్కిలి సంతోషించాడు. సుఖంగా ఉన్నాడు. (4,5)
జ్యేష్ఠో రామోఽభవత్ తేషాం రమయామాస హి ప్రజాః ।
మనోహరతయా ధీమాన్ పితుర్హృదయనందనః ॥ 6
వారిలో జ్యేష్ఠుడయిన రాముడు ప్రజలను రంజింపజేశాడు. తన మనోహరరూపంతో బుద్ధిమంతుడయిన అతడు తండ్రి హృదయానికి ఆనందం కలిగించేవాడయ్యాడు. (6)
తతః స రాజా మతిమాన్ మత్వాఽఽత్మానం వయోఽధికమ్ ।
మంత్రయామాస సచివైః ధర్మజ్ఞైశ్చ పురోహితైః ॥ 7
అభిషేకాయ రామస్య యౌవరాజ్యేన భారత ।
భారతా! బుద్ధిశాలి అయిన ఆ దశరథమహారాజు తనకు వయసుపై బడిందని తలచి రామునికి యువరాజ్యాభిషేకం చేయడానికి ధర్మజ్ఞులైన పురోహితులతో, మంత్రులతో ఆలోచించాడు. (7 1/2)
ప్రాప్తకాలం చ తే సర్వే మేనిరే మంత్రిసత్తమాః ॥ 8
లోహితాక్షం మహాబాహుం మత్తమాతంగగామినమ్ ।
కంబుగ్రీవం మహోరస్కం నీలకుంచితమూర్ధజమ్ ॥ 9
దీప్యమానం శ్రియా వీరం శక్రాదనవరం రణే ।
పారగం సర్వధర్మాణాం బృహస్పతిసమం మతౌ ॥ 10
సర్వానురక్తప్రకృతిం సర్వవిద్యావిశారదమ్ ।
జితేంద్రియమమిత్రాణామ్ అపి దృష్టిమనోహరమ్ ॥ 11
నియంతారమసాధూనాం గోప్తారం ధర్మచారిణామ్ ।
ధృతిమంతమనాధృష్యం జేతారమపరాజితమ్ ॥ 12
పుత్రం రాజా దశరథః కౌసల్యానందవర్థనమ్ ।
సందృశ్య పరమాం ప్రీతిమ్ అగచ్ఛత్ కురునందన ॥ 13
ఆ మంత్రిసత్తములందరూ సమయోచితమైన ఆ ప్రస్తావనను ఆమోదించారు. శ్రీరామచంద్రుడు కొద్దిగా ఎరుపైన కన్నులు కలవాడు. ఆజానుబాహుడు, మదగజం వలె ఠీవిగా నడిచేవాడు. శంఖం వంటి మెడ, విశాల వక్షః స్థలం, నల్లని గిరజాల జుట్టు, సౌందర్యంతో ప్రకాశించే శరీరమూ కలిగి ఉండేవాడు. యుద్ధంలో ఇంద్రునకు తక్కువ కాని వీరుడు, సర్వధర్మ పారగుడు, బుద్ధికి బృహస్పతివంటివాడు. అందరినీ అలరించే స్వభావం కలవాడు. సర్వవిద్యా విశారదుడు, జితేంద్రియుడు. శత్రువులకు కూడా కన్నులపండువైనవాడు. దుర్జనులను నియంత్రించ కలిగేవాడు. ధర్మచరితులను రక్షించేవాడు, ధైర్యవంతుడు, అనాధృష్యుడు, విజయశీలి, పరాజయమెరుగనివాడు, కురునందనా! కౌసల్యకు ఆనందం పెంపొందించే ఆ పుత్రుని చూచి దశరథమహారాజు మిక్కిలి సంతోషించాడు. (8-13)
చింతయంశ్చ మహాతేజా గుణాన్ రామస్య వీర్యవాన్ ।
అభ్యభాషత భద్రం తే ప్రీయమాణః పురోహితమ్ ॥ 14
అద్య పుష్యో నిశి బ్రహ్మన్ పుణ్యం యోగముపైష్యతి ।
సంభారాః సంభ్రియంతాం మే రామశ్చోపనిమంత్య్రతామ్ ॥ 15
రాజా! నీకు మేలగుగాక! మహాతేజస్వి, పరాక్రమశాలి అయిన దశరథుడు రాముని గుణాలను తలచుకొంటూ మురిసిపోతూ పురోహితునితో "బ్రహ్మజ్ఞా! ఈరోజు పుష్యమీ నక్షత్రం. రాత్రి వేళ మిక్కిలి పవిత్రమైన యోగం కలుగబోతోంది. మీరు సంభారాలన్నీ సమకూర్చండి. నా రామునికి కూడా ఈ వార్త తెలియచేయండి" అన్నాడు. (14,15)
ఇతి తద్ రాజవచనం ప్రతిశ్రుత్యాథ మంథరా ।
కైకేయీమభిగమ్యేదం కాలే వచనమబ్రవీత్ ॥ 16
రాజు యొక్క ఈ మాటలు విని మంథర తగిన సమయం చూసుకొని కైకేయిని సమీపించి ఇలా అంది. (16)
అద్య కైకేయి దౌర్భాగ్యం రాజ్ఞా తే ఖ్యాపితం మహత్ ।
ఆశీవిషస్త్వాం సంక్రుద్ధః చండో దశతు దుర్భగే ॥ 17
కైకేయీ! ఈ రోజు రాజు నీకు గొప్ప దౌర్భాగ్యమైన విషయాన్ని వెల్లడించాడు. అంతకంటె భయంకరంగా బుసకొట్టే విషసర్పం నిన్ను కాటువేయడం మంచిది. (17)
సుభగా ఖలు కౌసల్యా యస్యాః పుత్రోఽభిషేక్ష్యతే ।
కుతో హి తవ సౌభాగ్యం యస్యాః పుత్రో న రాజ్యభాక్ ॥ 18
పుత్రునికి పట్టాభిషేకం జరుగబోతున్న కౌసల్యయే అదృష్టవంతురాలు సుమా! రాజ్యార్హత లేని కొడుకు గల నీకు సౌభాగ్యం ఎక్కడిది"? (18)
సా తద్వచనమాజ్ఞాయ సర్వాభరణభూషితా ।
దేవీ విలగ్నమధ్యేవ బిభ్రతీ రూపముత్తమమ్ ॥ 19
వివిక్తే పతిమాసాద్య హసంతీవ శుచిస్మితా ।
ప్రణయం వ్యంజయంతీవ మధురం వాక్యమబ్రవీత్ ॥ 20
ఆ మాట విని ఆమె సర్వాభరణ భూషితురాలై, అత్యంత సుందరమైన రూపం దాల్చి ఏకాంతంలో భర్తను సమీపించింది, అందంగా నవ్వగల ఆమె ప్రేమ ఉట్టిపడేలా నవ్వుతున్నట్లుగా తీయగా ఇలా అంది. (19,20)
సత్యప్రతిజ్ఞ యన్మే త్వం కామమేకం నిసృష్టవాన్ ।
ఉపాకురుష్వ తద్ రాజన్ తస్మాన్ముచ్యస్వ సంకటాత్ ॥ 21
"ఆడినమాట తప్పని రాజా! నీవు పూర్వం నాకోరికను ఒకదానిని తీరుస్తానన్నావు. అది ఇప్పుడు నెరవేర్చు. అందువలన నీవు ఆ సంకటాన్నుండి విముక్తుడవు కాగలవు." (21)
రాజోవాచ
వరం దదాని తే హంత తద్ గృహాణ యదిచ్ఛసి ।
అబధ్యో బధ్యతాం కోఽద్య బధ్యః కోఽద్య విముచ్యతామ్ ॥ 22
ధనం దదాని కస్యాద్య హ్రియతాం కస్య వా పునః ।
బ్రాహ్మణస్వాదిహాన్యత్ర యత్ కించిద్ విత్తమస్తి మే ॥ 23
రాజు అన్నాడు - "ప్రియా! నీకు వరం ఇస్తున్నాను. నీకు ఇష్టమైనది తీసుకో. ఇప్పుడు బంధింపతగని వానిని ఎవరినైనా బంధించాలా? లేక బంధింపతగిన వానిని విడిచిపెట్టాలా? ఎవరికైనా ధనం ఇవ్వనా? లేక ఎవరి ధనమైనా అపహరించాలా? బ్రాహ్మణుల సొమ్ము కాక ఇక్కడగాని, మరొకచోటగాని నాకున ధనమంతా నీదే. (22,23)
పృథివ్యాం రాజరాజోఽస్మి చాతుర్వర్ణ్యస్య రక్షితా ।
యస్తేఽభిలషితః కామః బ్రూహి కల్యాణి మా చిరమ్ ॥ 24
ఈ భూమండలంలో రాజరాజును నేను. చతుర్వర్ణాల వారిని రక్షిస్తున్నాను. కల్యాణీ! నీకు ఇష్టమైన కోరిక ఏమిటో చెప్పు. ఆలస్యం చేయకు. (24)
సా తద్ వచనమాజ్ఞాయ పరిగృహ్య నరాధిపమ్ ।
ఆత్మనో బలమాజ్ఞాయ తత ఏనమువాచ హ ॥ 25
అతని మాటను విని ఆమె రాజును మాటకు కట్టుబడేలా చేసి తన బలం గుర్తెరిగి, తరువాత అతనితో ఇలా అంది. (25)
ఆభిషేచనికం యత్ తే రామార్థముపకల్పితమ్ ।
భరతస్తదవాప్నోతు వనం గచ్ఛతు రాఘవః ॥ 26
"మీరు రాముని కోసం ఏర్పాటు చేసిన అభిషేకసంభారాలన్నీ భరతునికి దక్కాలి. రాఘవుడు అడవికి వెళ్లాలి". (21)
స తద్ రాజా వచః శ్రుత్వా విప్రియం దారుణీదయమ్ ।
దుఃఖార్తో భరతశ్రేష్ఠ న కించిద్ వ్యాజహార హ ॥ 27
భరతశ్రేష్ఠా! అప్రియమైన దారుణమైన పరిణామం కల ఆమాటను విని రాజు దుఃఖార్తుడై ఏమీ మాటలాడలేకపోయాడు. (27)
తతస్తథోక్తం పితరం రామో విజ్ఞాయ వీర్యవాన్ ।
వనం ప్రతస్థే ధర్మాత్మా రాజ సత్యో భవత్వితి ॥ 28
తండ్రిమాట ఇచ్చాడని తెలుసుకొని పరాక్రమవంతుడు ధర్మాత్ముడు అయిన రాముడు రాజు సత్యవాక్కు కావాలని (ఆడిన మాట తప్పరాదని) అడవికి బయల్దేరాడు. (28)
తమన్వగచ్ఛల్లక్ష్మీవాన్ ధనుష్మాన్ లక్ష్మణస్తదా ।
సీతా చ భార్యా భద్రం తే వైదేహీ జనకాత్మజా ॥ 29
లక్ష్మీయుతుడు ధనుర్ధారి అయిన లక్ష్మణుడు; విదేహరాజు కూతురు, జనకాత్మజ అయిన సీతాదేవి కూడా అతనిని అనుసరించారు. (29)
తతో వనం గతే రామే రాజా దశరథస్తదా ।
సమయుజ్యత దేహస్య కాలపర్యాయధర్మణా ॥ 30
రాముడు అడవికి వెళ్లగా, దశరథమహారాజు కాలపర్యాయ ధర్మం చేత (రాముని వియోగంతో) దేహత్యాగం చేశాడు. (30)
రామం తు గతమాజ్ఞాయ రాజానం చ తథాగతమ్ ।
ఆనాయ్య భరతం దేవీ కైకేయీ వాక్యమబ్రవీత్ ॥ 31
రాముడు అడవికి వెళ్లడం, దశరథుడు ఆ రీతిగా మరణించడం చూసిన కైకేయీదేవి భరతుని పిలిపించి ఇలా అంది. (31)
గతో దశరథః స్వర్గం వనస్థౌ రామలక్ష్మణౌ ।
గృహాణ రాజ్యం విపులం క్షేమం నిహతకంటకమ్ ॥ 32
"దశరథుడు స్వర్గలోకానికి వెళ్లాడు. రామలక్ష్మణులు అడవిలో ఉన్నారు. విశాలము క్షేమకరము కంటకరహితమూ అయిన ఈ రాజ్యాన్ని నీవు గ్రహించు." (32)
తామువాచ స ధర్మాత్మా నృశంసం బత తే కృతమ్ ।
పతిం హత్వా కులం చేదమ్ ఉత్సాద్య ధనలుబ్ధయా ॥ 33
అయశః పాతయిత్వా మే మూర్ధ్ని త్వం కులపాంసనే ।
సకామా భవ మే మాతుః ఇత్యుక్త్వా ప్రరురోద హ ॥ 34
ధర్మాత్ముడైన ఆ భరతుడు - "కులకళంకినీ! తల్లీ! ధనలోభం చేత అయ్యో నీవు ఎంత క్రూరకృత్యం చేశావు? భర్తను చంపి, ఈ వంశాన్ని నశింపచేసి, అప్రతిష్ఠను నానెత్తిన రుద్ది నీవు నీ మనోరథాన్ని నెరవేర్చుకున్నావు." అని పలికి వెక్కి వెక్కి ఏడ్చాడు. (33,34)
స చారిత్రం విశోధ్యాథ సర్వప్రకృతిసంనిధౌ ।
అన్వయాద్ భ్రాతరం రామం వినివర్తనలాలసః ॥ 35
మంత్రులందరి సన్నిధిలో, ప్రజల ఎదుట తన నిజాయితినీ నిరూపించుకొని, అనంతరం సోదరుని తిరిగి తీసుకురావాలనే కోరికతో రాముని మార్గాన్ని అనుసరించాడు. (35)
కౌసల్యాం చ సుమిత్రాం చ కైకేయీం చ సుదుఃఖితః ।
అగ్రే ప్రస్థాప్య యానైః సః శత్రుఘ్నసహితో యయౌ ॥ 36
వసిష్ఠవామదేవాభ్యాం విప్రైశ్చాన్యైః సహస్రశః ।
పౌరజానపదైః సార్ధం రామానయనకాంక్షయా ॥ 37
వసిష్ఠవామదేవులతో, ఇతర విప్రులతో, వేలకొద్దీపౌర జానపదులతో కలిసి రాముని తీసుకొని రావాలనే కాంక్షతో... (37)
దదర్శ చిత్రకూటస్థం స రామం సహలక్ష్మణమ్ ।
తాపసానామలంకారం ధారయంతం ధనుర్దరమ్ ॥ 38
చిత్రకూట పర్వతంపై లక్ష్మణునితో కలిసి, ధనుర్ధరుడై, తాపసవేషాన్ని తాల్చి ఉన్న రాముని భరతుడు చూశాడు. (38)
(శ్రీరామ ఉవాచ
గచ్ఛ తాత ప్రజా రక్ష్యాః సత్యం రక్షామ్యహం పితుః । )
విసర్జితః స రామేణ పితుర్వచనకారిణా ।
నందిగ్రామేఽకరోద్ రాజ్యం పురస్కృత్యాస్య పాదుకే ॥ 39
అంతట శ్రీరాముడు "వెళ్లు నాయనా! ప్రజలను రక్షించు. నేను తండ్రి మాటను రక్షిస్తాను" అన్నాడు.
పితృవాక్యపరిపాలకుడైన రాముడు అతనిని వెనక్కి పంపగా అతడు అతని పాదుకలను ముందుంచుకొని నందిగ్రామంలో ఉంటూ రాజ్యం చేశాడు. (39)
రామస్తు పునరాశంక్య పౌరజానపదాగమమ్ ।
ప్రవివేశ మహారణ్యం శరభంగాశ్రమం ప్రతి ॥ 40
రాముడు పౌరజానపదులు తిరిగిరావచ్చని ఆశంకించి మహారణ్యంలోని శరభంగాశ్రమాన్ని చేరుకున్నాడు. (40)
సత్కృత్య శరభంగం స దండకారణ్యమాశ్రితః ।
నదీం గోదావరీం రమ్యామ్ ఆశ్రిత్య న్యపసత్ తదా ॥ 41
శరభంగమహామునిని సత్కరించి దండకారణ్యాన్ని చేరుకొన్నాడు. అక్కడ రమణీయమైన గోదావరీనదీ తీరంలో నివసించాడు. (41)
వసతస్తస్య రామస్య తతః శూర్పణఖాకృతమ్ ।
ఖరేణాసీన్మహద్ వైరం జనస్థాననివాసినా ॥ 42
అక్కడ నివసిస్తున్న రామునికి శూర్పణఖకారణంగా జనస్థాన నివాసి అయిన ఖరునితో గొప్పవైరం తటస్థించింది. (42)
రక్షార్థం తాపసానాం తు రాఘవో ధర్మవత్సలః ।
చతుర్దశ సహస్రాణి జఘాన భువి రక్షసామ్ ॥ 43
దూషణం చ ఖరం చైవ నిహత్య సుమహాబలౌ ।
చక్రే క్షేమం పునర్దీమాన్ ధర్మారణ్యం చ రాఘవః ॥ 44
ధర్మవత్సలుడైన రాఘవుడు మునులను రక్షించడానికి భూమిపై పద్నాలుగు వేలమంది రాక్షసులను సంహరించాడు. గొప్ప బలవంతులైన ఖరదూషణులనే రాక్షసులను సంహరించి బుద్ధిశాలి అయిన ఆ రాముడు తిరిగి ఆ ప్రాంతాన్ని క్షేమకరమైన ధర్మారణ్యంగా చేశాడు. (43,44)
హతేషు తేషు రక్షఃసు తతః శూర్పణఖా పునః ।
యయౌ నికృత్తనాసోష్ఠీ లంకాం భ్రాతుర్నివేశనమ్ ॥ 45
ఆ రాక్షసులందరూ చనిపోగా, ముక్కు, పెదవులు కోసివేయబడిన శూర్పణఖ తిరిగి తన సోదరుని ఇంటికి లంకకు వెళ్లింది. (45)
తతో రావణమభ్యేత్య రాక్షసీ దుఃఖమూర్ఛితా ।
పపాతా పాదయోర్భ్రాతుః సంశుష్కరుధిరాననా ॥ 46
అక్కడ రావణుని సమీపించి ఆ రాక్షసి దుఃఖంతో ఒళ్లు తెలియక, ఎండిపోయిన రక్తపు చారికలున్న ముఖంతో అన్నగారిపాదాలపై వాలిపోయింది. (46)
తాం తథా వికృతాం దృష్ట్వా రావణః క్రోధమూర్ఛితః ।
ఉత్పపాతాసనాత్ క్రుద్ధో దంతైర్దంతానుపస్పృశన్ ॥ 47
ఆ రీతిగా వికృతరూపంతో ఉన్న ఆమెను చూసి రావణుడు కోపంతో ఒళ్లు తెలియక, క్రుద్ధుడై పళ్లు పటపట కొరుకుతూ ఆసనం నుండి ఒక్క ఉదుటున లేచాడు. (47)
స్వానమాత్యాన్ విసృజ్యాథ వివిక్తే తామువాచ సః ।
కేనాస్యేవం కృతా భద్రే మామచింత్యావమన్య చ ॥ 48
తన మంత్రులందరినీ విడిచి, ఏకాంతంలో అతడు ఆమెతో "అమ్మాయీ! నన్ను కూడా లెక్కించక, అవమానించి ఎవరు నిన్ను ఇలా చేసినది?" (48)
కః శూలం తీక్ష్ణమాసాద్య సర్వగాత్రైర్నిషేవతే ।
కః శిరస్యగ్నిమాధాయ విశ్వస్తః స్వపతే సుఖమ్ ॥ 49
శరీరమంతటా తీక్ష్ణమైన శూలాన్ని గుచ్చుకోవాలనుకుంటున్న వాడెవడు? నెత్తిన నిప్పు పెట్టుకొని నిశ్చింతగా సుఖంగా నిద్రించాలనుకుంటున్న వాడెవడు? (49)
ఆశీవిషం ఘోరతరం సాదేన స్పృశతీహ కః ।
సింహం కేసరిణం కశ్చ దంష్ట్రాయాం స్పృశ్య తిష్ఠతి ॥ 50
మహాభయంకరమైన విషసర్పాన్ని కాలితో తొక్కుతున్నదెవరు? జూలుతో ఉన్న సింహం నోటిలోని కోరలను స్పృశించి నిశ్చింతగా ఉన్నవాడెవడు?" (50)
ఇత్యేవం బ్రువతస్తస్య స్రోతోభ్యస్తేజసోఽర్చిషః ।
నిశ్చేరుర్దహ్యతో రాత్రౌ వృక్షస్యేవ స్వరంధ్రతః ॥ 51
అని ఈ రీతిగా పలుకుతున్న రావణుని కన్నులు, ముక్కు, చెవుల నుండి రాత్రిపూట మండుతున్న చెట్టుయొక్క రంధ్రాల నుండి అగ్నిజ్వాలలు వెలువడినట్లుగా విస్ఫులింగాలు వెలికి వచ్చాయి. (51)
తస్య తత్ సర్వమాచఖ్యౌ భగినీ రామవిక్రమమ్ ।
ఖరదూషణసంయుక్తం రాక్షసానాం పరాభవమ్ ॥ 52
అంతట అతని సోదరి శూర్పణఖ, రాముని పరాక్రమాన్ని, ఖరదూషణ సహితంగా రాక్షసుల మరణాన్ని - అంతా అతనికి వర్ణించి చెప్పింది. (52)
స నిశ్చిత్య తతః కృత్యం స్వసారముపసాంత్వ్య చ ।
ఊర్ధ్వమాచక్రమే రాజా విధాయ నగరే విధిమ్ ॥ 53
అది విన్నాక రావణుడు తాను చేయవలసినది నిర్ణయించుకొని చెల్లెలిని ఓదార్చి, నగరానికి రక్షణ ఏర్పాటు చేసి ఆకాశమార్గాన సాగిపోయాడు. (53)
త్రికూటం సమతిక్రమ్య కాలపర్వతమేవ చ ।
దదర్శ మకరావాసం గంభీరోదం మహోదధిమ్ ॥ 54
త్రికూటాన్ని, కాలపర్వతాన్ని దాటి, మొసళ్లతో, లోతైన నీటితో నిండి ఉన్న మహాసాగరాన్ని చూశాడు. (54)
తమతీత్యాథ గోకర్ణమ్ అభ్యగచ్ఛద్ దశాననః ।
దయితం స్థానమవ్యగ్రం శూలపాణేర్మహాత్మనః ॥ 55
దానిని కూడా పైనుండే దాటి దశాననుడు పరమాత్మ, శూలపాణి అయిన శివునికి ప్రీతికరమైన, అవిచలమైన గోకర్ణక్షేత్రాన్ని చేరుకున్నాడు. (55)
తత్రాభ్యగచ్ఛన్మారీచం పూర్వామాత్యం దశాననః ।
పురా రామభయాదేవ తాపస్యం సముపాశ్రితమ్ ॥ 56
పూర్వమే రాముని వలన భయంతో మునివృత్తిని ఆశ్రయించిన, తన పూర్వపుమంత్రి అయిన మారీచుని దశాననుడు అక్కడ కలుసుకున్నాడు. (56)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి రామోపాఖ్యానపర్వణి రామవనాభిగమనే సప్తసప్తత్యధికద్విశతతమోఽధ్యాయః ॥ 277 ॥
ఇది శ్రీమహాభారతమున రామోపాఖ్యానపర్వమను ఉపపర్వమున రాముడు అడవికి వెళ్లుట అను రెండువందల డెబ్బది ఏడవ అధ్యాయము. (277)
(దాక్షిణాత్య అధికపాఠము 1/2 శ్లోకం కలుపుకొని మొత్తం 56 1/2 శ్లోకాలు)