276. రెండు వందల డెబ్బది ఆరవ అధ్యాయము
బ్రహ్మ ఆజ్ఞానుసారముగా దేవతలు ఋక్షవానరుల యందు పుట్టుట.
మార్కండేయ ఉవాచ
తతో బ్రహ్మర్షయః సర్వే సిద్ధా దేవర్షయస్తథా ।
హన్యవాహం పురస్కృత్య బ్రహ్మాణం శరణం గతాః ॥ 1
మార్కండేయుడు చెపుతున్నాడు - అంతట బ్రహ్మర్షులు, సిద్ధులు, దేవర్షులు అగ్నిని పురస్కరించుకొని బ్రహ్మను శరణు చొచ్చారు. (1)
అగ్నిరువాచ
యోఽసౌ విశ్రవసః పుత్రః దశగ్రీవో మహాబలః ।
అవధ్యో వరదానేన కృతో భగవతా పురా ॥ 2
స బాధతే ప్రజాః సర్వాః విప్రకారైర్మహాబలః ।
తతో వస్త్రాతు భగవన్ నాన్యస్త్రాతా హి విద్యతే ॥ 3
అగ్ని ఇట్లన్నాడు - భగవాన్! పూర్వం తమరు ఇచ్చిన వరదానం వలన మహాబలుడు అయిన విశ్రవసుని పుత్రుడు దశగ్రీవుడు అవధ్యుడు అయినాడు. ఆ మహాబలుడు అనేక రకాలుగా ప్రజలను అందరినీ బాధిస్తున్నాడు. కాబట్టి మీరు మమ్ము కాపాడాలి. మీకంటె వేరు రక్షకుడెవరూ లేరు. (2,3)
బ్రహ్మోవాచ
న స దేవాసురైః శక్యః యుద్ధే జేతుం విభావసో ।
విహితం తత్ర యత్ కార్యమ్ అభితస్తస్య నిగ్రహః ॥ 4
అగ్నీ! దేవాసురులు అతనిని యుద్ధంలో జయించడం సాధ్యం కాదు. అతని చావుకు అన్నివైపుల నుండి చేయవలసినదంతా ఏర్పాటు అయింది. (4)
తదర్థమవతీర్ణోఽసౌ మన్నియోగాచ్చతుర్భుజః ।
విష్ణుః ప్రహరతాం శ్రేష్ఠః స తత్ కర్మ కరిష్యతి ॥ 3
చతుర్భుజుడు అయిన విష్ణువు నా నియోగం వలన అతని కొరకే అవతరించాడు. అతడు ఆ పనిని నెరవేర్చగలడు. (5)
మార్కండేయ ఉవాచ
పితామహస్తతస్తేషాం సంనిధౌ శక్రమబ్రవీత్ ।
సర్వై ర్దేవగణైః సార్థం సంభవ త్వం మహీతలే ॥ 6
మార్కండేయుడు చెపుతున్నాడు - అని చెప్పిన తరువాత పితామహుడు వారందరి సమక్షంలో ఇంద్రునితో - "సమస్త దేవాగణాలతో సహా నీవు భూమి మీద పుట్టు. (6)
విష్ణోః సహాయానృక్షీషు వానరీషు చ సర్వశః ।
జనయధ్వం సుతాన్ వీరాన్ కామరూపబలాన్వితాన్ ॥ 7
ఋక్ష (ఎలుగుబంటి) వానర స్త్రీలు అందరియందు వీరులై, కామరూపం ధరించగలిగిన, బలిష్ఠులైన కొడుకులను విష్ణువుకు సహాయకులుగా పుట్టించండి" అని చెప్పాడు. (7)
తతో భాగానుభాగేన దేవగంధర్వపన్నగాః ।
అవతర్తుం మహీం సర్వే మంత్రయామాసురంజసా ॥ 8
అనంతరం దేవతలు, గంధర్వులు, నాగులు అందరూ తమ తమ అంశలతో, అంశాంశలతో శీఘ్రంగా భూమి మీద అవతరించడానికి తమలో తాము సంప్రదించుకున్నారు. (8)
తేషాం సమక్షం గంధర్వీం దుందుభీం నామ నామతః ।
శశాస వరదో దేవో గచ్ఛ కార్యార్థసిద్ధయే ॥ 9
వరదుడైన బ్రహ్మదేవుడు వారందరి ఎదుటనే దుందుభి అనే పేరు గల గంధర్వ స్త్రీని "నీవు కూడా దేవతల కార్యం సిద్ధింప చేయడానికి భూలోకానికి వెళ్లు" అని ఆజ్ఞాపించాడు. (9)
పితామహవచః శ్రుత్వా గంధర్వీ దుందుభీ తతః ।
మంధరా మానుషే లోకే కుబ్జా సమభవత్ తదా ॥ 10
అనంతరం బ్రహ్మదేవుని మాట విని అప్పుడు దుందుభి అనే ఆ గంధర్వ స్త్రీ మానవలోకంలో మంధర అనే కుబ్జస్త్రీగా (మరుగుజ్జు) పుట్టింది. (10)
శక్రప్రభృతయశ్చైవ సర్వే తే సురసత్తమాః ।
వానర ర్ క్షవరస్త్రీషు జనయామాసురాత్మజాన్ ॥ 11
తేఽన్వవర్తన్ పితౄన్ సర్వే యశసా చ బలేన చ ।
భేత్తారో గిరిశృంగాణాం శాలతాలశిలాయుథాః ॥ 12
ఇంద్రుడు మొదలైన ఆ దేవతా శ్రేష్ఠులందరూ ఋక్ష వానరుల యొక్క కులీనస్త్రీల యందు పుత్రులను కలిగించారు. వారంతా కీర్తిలోను, బలంలోనూ కూడా తండ్రులనే తలపిస్తున్నారు. వారు పర్వత శిఖరాలను పగులగొట్ట కలిగినవారు. సాలవృక్షాలను, తాటిచెట్లను, రాళ్లను ఆయుధాలుగా కలిగినవారు. (11,12)
వజ్రసంహననాః సర్వే సర్వే చౌఘబలాస్తథా ।
కామవీర్యబలాశ్చైవ సర్వే యుద్ధవిశారదాః ॥ 13
వారందరూ వజ్రసదృశ దేహులు. సముదాయ బలం కలవారు. కోరినంత బలపరాక్రమాలు కలవారు. అందరూ యుద్ధవిద్యలో ఆరితేరినవారు. (13)
నాగాయుతసమప్రాణాః వాయువేగసమా జవే ।
యత్రేచ్ఛకనివాసాశ్చ కేచిదత్ర వనౌకసః ॥ 14
పదివేల ఏనుగుల బలం కలిగినవారు. వేగంలో వాయువుతో సమానులైనవారు. ఎక్కడ కావాలనుకుంటే అక్కడ నివసించేవారు. కొంతమంది అడవులలోనే నివసించేవారు. (14)
ఏవం విధాయ తత్ సర్వం భగవాన్ లోకభావనః ।
మంథరాం బోధయామాస యద్యత్ కార్యం యథా యథా ॥ 15
ఈవిధంగా మొత్తం ఏర్పాటంతా చేసి సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు ఏదేది ఎలా ఎలా చేయాలో మంథరకు బోధించాడు. (15)
సా తద్వచః సమాజ్ఞాయ తథా చక్రే మనోజవా ।
ఇతశ్చేతశ్చ గచ్ఛంతీ వైరసంధుక్షణే రతా ॥ 16
మనోవేగం కలిగిన ఆమె ఆ మాటలన్నీ బాగా ఆకళింపు చేసుకొని, అటు ఇటు తిరుగుతూ వైరం పురికొల్పడంలో నిమగ్నమయింది. (16)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి రామోపాఖ్యానపర్వణి వానరాద్యుత్పత్తౌ షట్ సప్తత్యధికద్విశతతమోఽధ్యాయః ॥ 276 ॥
ఇది శ్రీమహాభారతమున రామోపాఖ్యానపర్వమను ఉపపర్వమున వానరాదుల ఉత్పత్తి అను రెండువందల డెబ్బది ఆరవ అధ్యాయము. (276)