275. రెండు వందల డెబ్బది అయిదవ అధ్యాయము

రావణకుంభకర్ణాదుల ఉత్పత్తి - కుబేరుడు రావణునకు శాపమునిచ్చుట.

మార్కండేయ ఉవాచ
పులస్త్యస్య తు యః క్రోధాద్ అర్థదేహోఽభవన్మునిః ।
విశ్రవా నామ సక్రోధః స వైశ్రవణమైక్షత ॥ 1
మార్కండేయుడు చెపుతున్నాడు - పులస్త్యుని క్రోధం వలన అతని అర్థదేహం నుండి పుట్టిన విశ్రవసుడనే ఆ ముని వైశ్రవణుని క్రోధదృష్టితో చూడసాగాడు. (1)
బుబుధే తం తు సక్రోధం పితరం రాక్షసేశ్వరః ।
కుబేరస్తత్ర్పసాదార్థం యతతే స్మ సదా నృప ॥ 2
రాజా! రాక్షసేశ్వరుడయిన కుబేరుడు - తండ్రి తనపట్ల క్రోధం కలిగిఉన్నాడని తెలిసినప్పటి నుండి అతనిని ప్రసన్నుని చేసుకోవడానికి సదా యత్నించసాగాడు. (2)
స రాజరాజో లంకాయాం న్యవసన్నరవాహనః ।
రాక్షసీః ప్రదదౌ తిస్రః పితుర్వై పరిచారికాః ॥ 3
నరవాహనుడు, రాజరాజు అయిన కుబేరుడు లంకలో నివసిస్తూ ఉన్నాడు. అతడు ముగ్గురు రాక్షసవనితలను తండ్రికి పరిచారికలుగా నియమించాడు. (3)
తాః సదా తం మహాత్మానం సంతోషయితుముద్యతాః ।
ఋషిం భరతశార్దూల నృత్యగీతవిశారదాః ॥ 4
భరతశ్రేష్ఠా! ఆ ముగ్గురు నృత్యగానాలలో ఆరితేరినవారు, వారు మహాత్ముడయిన ఆ ఋషిని ఎల్లప్పుడూ సంతోషంగా ఉంచడానికే ప్రయత్నిస్తూ ఉండేవారు. (4)
పుష్పోత్కటా చ రాకా చ మానినీ చ విశాంపతే ।
అవ్యోవ్యస్పర్థయా రాజన్ శ్రేయస్కామాః సుమధ్యమాః ॥ 5
మహారాజా! పుష్పోత్కట, రాక, మౌలిని అని వారిపేర్లు, ఆ సుందరీమణులు తమకు మేలు కలగాలని, పరస్పరం పొటీలు పడి ఆ మునిని సేవించారు. (5)
స తాసాం భగవాంస్తుష్టః మహాత్మా ప్రదదౌ వరాన్ ।
లోకపాలోపమాన్ పుత్రాన్ ఏకైకస్యా యథేప్సితాన్ ॥ 6
భగవంతుడైన ఆ మహాత్ముడు సంతుష్టి చెంది వారిలో ఒక్కొక్కరికి వారి వారి కోరిక ప్రకారం లోకపాలురతో సమానులైన పుత్రులు కలుగుతారని వరం ఇచ్చాడు. (6)
పుష్పోత్కటాయాం జజ్ఞాతే ద్వౌ పుత్రౌ రాక్షసేశ్వరౌ ।
కుంభకర్ణదశగ్రీవౌ బలేనాప్రతిమౌ భువి ॥ 7
పుష్పోత్కటకు ఇద్దరు కొడుకులు, రావణ కుంభకర్ణులు అనేవారు పుట్టారు. వారు రాక్షసేశ్వరులు. ఈ భూమండలంలో పరాక్రమంలో వారికి సాటి వచ్చేవారు లేరు. (7)
మాలినీ జనయామాస పుత్రమేకం విభీషణమ్ ।
రాకాయాం మిథునం జజ్ఞే ఖరః శూర్పణఖా తథా ॥ 8
మాలిన్కి విభీషణుడనే ఒక కొడుకు కలిగాడు. రాకకు ఖరుడనే కొడుకు, శూర్పణఖ అనే కూతురు ఇద్దరు కలిగారు. (8)
విభీషణస్తు రూపేణ సర్వేభ్యోఽభ్యధికోఽభవత్ ।
స బభూవ మహాభాగః ధర్మగోప్తా క్రియారతిః ॥ 9
విభీషణుడు వారందరి కంటె రూపంలో అధికుడు, అతడు సౌభాగ్యశాలి, ధర్మరక్షకుడు, కర్తవ్యపరాయణుడు. (9)
దశగ్రీవస్తు సర్వేషాం శ్రేష్ఠో రాక్షసపుంగవః ।
మహోత్సాహో మహావీర్యః మహాసత్త్వపరాక్రమః ॥ 10
రావణుడు, దశగ్రీవుడు అతడు అందరికీ శ్రేష్ఠుడైన రాక్షసరాజు, గొప్ప ఉత్సాహం, బలం కలవాడు. మహాధైర్యపరాక్రమాలు కలవాడు. (10)
కుంభకర్ణో బలేనాసీత్ సర్వేభ్యోఽభ్యధికో యుధి ।
మాయావీ రణశౌండశ్చ రౌద్రశ్చ రజనీచరః ॥ 11
కుంభకర్ణుడు శారీరకబలంతో యుద్ధంలో అందరినీ మించినవాడు, మాయావి, రణకుశలుడు. ఆ నిశాచరుడు మహాభయంకరుడు . (11)
ఖరో ధనుషి విక్రాంతః బ్రహ్మద్విట్ పిశితాశనః ।
సిద్ధవిఘ్నకరీ చాపి రౌద్రీ శూర్పణఖా తథా ॥ 12
ఖరుడు ధనుర్విద్యలో మహాపరాక్రమవంతుడు, బ్రహ్మద్వేషి మాంసాహారి.శూర్పణఖ మహారౌద్రంగా ఉంటుంది. సిద్ధపురుషులకు (మునులకు, ఋషులకు) విఘ్నాలు కలిగిస్తూ ఉంటుంది. (12)
సర్వే వేదవిదః శూరాః సర్వే సుచరితవ్రతాః ।
ఊషుః పిత్రా సహ రతా గంధమాదనపర్వతే ॥ 13
వారందరూ వేదవేత్తలు, శూరులు. అందరూ బ్రహ్మచర్యవ్రతాన్ని ఆచరించేవారు. తండ్రితో కలిసి గంధమాదన పర్వతంపై సుఖంగా ఉండసాగారు. (13)
తతో వైశ్రవణం తత్ర దదృశుర్నరవాహనమ్ ।
పిత్రా సార్థం సమాసీనమ్ ఋద్ధ్యా పరమయా యుతమ్ ॥ 14
ఇలా ఉండగా ఒకరోజున పరమైశ్వర్య యుక్తుడైన నరవాహనుడు వైశ్రవణుడు తండ్రితో కలిసి కూర్చుని ఉండగా వారు చూశారు. (14)
జాతామర్షాస్తతస్తే తు తపసే ధృతనిశ్చయాః ।
బ్రహ్మాణం తోషయామాసుః ఘోరేణ తపసా తదా ॥ 15
వారికి అసూయ కలిగి తపస్సు చేయడానికి దృఢంగా నిశ్చయించుకొన్నారు. మహాఘోరమైన తపస్సుతో బ్రహ్మదేవుని మెప్పించారు. (15)
అతిష్ఠదేకపాదేన సహస్రం పరివత్పరాన్ ।
వాయుభక్షో దశగ్రీవః పంచాగ్నిః సుసమాహితః ॥ 16
దశగ్రీవుడు వేల సంవత్సరాల పాటు ఒంటికాలి మీద నిలిచి, పంచాగ్ని మధ్యంలో, ఏకాగ్రచిత్తుడై, వాయుభక్షకుడై తపస్సు చేశాడు. (16)
అధఃశాయీ కుంభకర్ణః యతాహారో యతవ్రతః ।
విభీషణః శీర్ణపర్ణమ్ ఏకమభ్యవహారయన్ ॥ 17
కుంభకర్ణుడు ఆహారాన్ని పరిమితం చేసుకొని, నేలపై పడుకొంటూ, కఠోరనియమాలను పాటించాడు. విభీషణుడు కేవలం ఒక్క ఎండుటాకునే భుజిస్తూ ఉండిపోయాడు. (17)
ఉపవాసరతిర్ధీమాన్ సదా జప్యపరాయణః ।
తమేవ కాలమాతిష్ఠత్ తీవ్రం తప ఉదారధీః ॥ 18
బుద్ధిమంతుడయిన విభీషణుడు ఉపవాస ప్రియుడై సదా జపం చేస్తే ఉండేవాడు. ఉదారబుద్ధి గల అతడు కూడా అంతకాలమూ తపస్సు చేశాడు. (18)
ఖరః శూర్పణఖా చైవ తేషాం వై తప్యతాం తపః ।
పరిచర్యాం చ రక్షాం చ చక్రతుర్హృష్టమానసౌ ॥ 19
ఖరుడు, శూర్పణఖ ఇద్దరూ తపస్సు చేసుకొనే వారికి (తమ అన్నలకు) సంతోషంగా పరిచర్యలు చేస్తూ రక్షణ కల్పిస్తూ ఉండేవారు. (19)
పూర్ణే వర్షసహాస్రే తు శిరశ్ఛిత్త్వా దశననః ।
జుహోత్యగ్నౌ దురాధర్షః తేనాతుష్యజ్జగత్ర్పభుః ॥ 20
వేయి సంవత్సరాలు నిండిన తరువాత దుర్ధర్షుడైన దశాననుడు తన శిరసును ఖండించుకొని అగ్నిలో వేల్చాడు. దానికి లోకేశ్వరుడైన బ్రహ్మ ఆనందించాడు. (20)
తతో బ్రహ్మా స్వయం గత్వా తపసస్తాన్ న్యవారయత్ ।
ప్రలోభ్య వరదానేన సర్వానేవ పృథక్ పృథక్ ॥ 21
అంతట బ్రహ్మదేవుడు స్వయంగా వెళ్లి తపస్సు చేస్తున్న వారిని వారించాడు. వారందరికీ వేర్వేరుగా వరాలిస్తానని ప్రలోభపెట్టి (ఇలా అన్నాడు) (21)
బ్రహ్మోవాచ
ప్రీతోఽస్మి వో నివర్తధ్వం వరాన్ వృణుత పుత్రకాః ।
యద్ యదిష్టమృతే త్వేకమ్ అమరత్వం తథాస్తు తత్ ॥ 22
బ్రహ్మ అంటున్నాడు - "పుత్రులారా! మీపట్ల నేను ప్రసన్నుడిని అయ్యాను. తపస్సును చాలించండి. వరాలు కోరుకోండి. అమరత్వం తప్ప ఎవరెవరికి ఏమేమి ఇష్టమో అడగండి. అది అలాగే జరుగుతుంది. (22)
యద్ యదగ్నౌ హుతం సర్వం శిరస్తే మహదీప్సయా ।
తథైవ తాని తే దేహే భవిష్యంతి యథేప్సయా ॥ 23
(అనంతరం రావణుని ఉద్దేశించి) నీవు గొప్ప కోరికతో అగ్నిలో వేల్చిన నీ శిరస్సులన్నీ మళ్లీ అలాగే నీ దేహంలో యధేచ్ఛగా కలుగుతాయి. (23)
వైరూప్యం చ న తే దేహే కామరూపధరస్తథా ।
భవిష్యసి రణేఽరీణాం విజేతా న చ సంశయః ॥ 24
నీ శరీరంలో వైరూప్యం ఉండదు. కామరూపధరుడవు అవుతావు. యుద్ధంలో శత్రువుల మీద విజయం పొందుతావు. ఇందులో సంశయం లేదు. (24)
రావణ ఉవాచ
గంధర్వదేవాసురతః యక్షరాక్షతస్తథా ।
సర్పకిన్నరభూతేభ్యః న మే భూయాత్ పరాభవః ॥ 25
రావణుడు అన్నాడు - గంధర్వులు, దేవతలు, అసురులు, యక్షులు, సర్పాలు, కిన్నరులు, భూతాలు - వీరెవరివలనా నాకు పరాజయం ఉండకూడదు. (25)
బ్రహ్మోవాచ
య ఏతే కీర్తితాః సర్వే న తేభ్యోఽస్తి భయం తవ ।
ఋతే మనుష్యాద్ భద్రం తే తథా తద్ విహితం మయా ॥ 26
మనుష్యుల వలన తప్ప నీవు పేర్కొన్న వారివలన నీకు ఏమాత్రం భయం లేదు. నీకు మేలగుగాక! అది నేను విభించాను. (26)
మార్కండేయ ఉవాచ
ఏవముక్తో దశగ్రీవః తుష్టః సమభవత్ తదా ।
అవమేనే హి దుర్బుద్ధిః మనుష్యాన్ పురుషాదకః ॥ 27
మార్కండేయుడు చెపుతున్నాడు - బ్రహ్మ అలా అనగానే దశగ్రీవుడు సంతుష్టడయ్యాడు. దుర్బుద్ధి, నరభక్షకుడు అయిన అతడు మనుష్యులను చులకనగా తలచాడు. (27)
కుంభకర్ణమతోవాచ తథైవ ప్రపితామహః ।
స వవ్రే మహతీం నిద్రాం తమసా గ్రస్తచేతనః ॥ 28
బ్రహ్మ కుంభకర్ణుని కూడా అలాగే (వరం కోరుకోమని) అడిగాడు. మనస్సు తమోగుణంతో నిండిపోవడం వలన అతడు ఎక్కువ నిద్రను కోరుకొన్నాడు. (28)
తథా భవిష్యతీత్యుక్త్వా విభీషణమువాచ హ ।
వరం వృషీష్వ పుత్ర త్వం ప్రీతోఽస్మీతి పునః పునః ॥ 29
అలాగే జరుగుతుందని చెప్పి బ్రహ్మ విభిషణునితో - "నాయనా! నేను చాలా ఆనందించాను. వరం కోరుకో" అని పదే పదే పలికాడు. (29)
విభీషణ ఉవాచ
పరమాపద్గతస్యాపి నాధర్మే మే పతిర్భవేత్ ।
అశిక్షితం చ భగవన్ బ్రహ్మాస్త్రం ప్రతిభాతు మే ॥ 30
విభిషణుడు అన్నాడు - "భగవాన్! ఎంత గొప్ప ఆపద ఎదురు అయినప్పటికీ నా మనసు అధర్మం వైపు మొగ్గకూడదు. నేర్చుకోకపోయినా బ్రహ్మాస్త్రం నాకు స్ఫురించాలి. (30)
బ్రహ్మోవాచ
యస్మద్ రాక్షసయోనౌ తే జాతస్యామిత్రకర్శన ।
నాధర్మే దీయతే బుద్ధిః అమరత్వం దదాని తే ॥ 31
బ్రహ్మ అన్నాడు - "శత్రుసూదనా! రాక్షస యోని యందు పుట్టినా నీ బుద్ధి అధర్మంలో తగుల్కోదు. అందువలన నీకు అమరత్వం కూడా ప్రసాదిస్తున్నాను. (31)
మార్కండేయ ఉవాచ
రాక్షసస్తు వరం లబ్ధ్వా దశగ్రీవో విశాంపతే ।
లంకాయాశ్చ్యావయామాస యుధి జిత్వా ధనేశ్వరమ్ ॥ 32
మార్కండేయుడు చెపుతున్నాడు - రాజా! రాక్షసుడైన దశగ్రీవుడు వరాన్ని పొంది (మొట్టమొదటగా) ధనేశ్వరుని యుద్ధంలో జయించి, అతనిని లంక నుండి వెళ్లగొట్టాడు. (32)
హిత్వా స భగవా లంకామ్ ఆవిశద్ గంధమాదనమ్ ।
గంధర్వయక్షానుగతో రక్షఃకింపురుషైః సహ ॥ 33
భగవానుడైన కుబేరుడు లంకను విడిచి గంధర్వయక్ష రాక్షస కింపురుషులు వెంటరాగా వారితో పాటుగా గంధమాదన పర్వతాన్ని చేరుకొని అక్కడ నివసించసాగాడు. (33)
విమానం పుష్పకం తస్య జహారాక్రమ్య రావణః ।
శశాప తం వైశ్రవణః న త్వామేతద్ వహిష్యతి ॥ 34
యస్తు త్వాం సమరే హంతా తమేవైతద్ వహిష్యతి ।
అవమన్య గురుం మాం చ క్షిప్రం త్వం న భవిష్యసి ॥ 35
రావణుడు దురాక్రమణ చేసి అతని పుష్పకవిమానాన్ని కూడా అపహరించాడు. వైశ్రవణుడు కోపించి "ఇది నీకు వాహనంగా ఉండదు. యుద్ధంలో నిన్ను చంపినవానికే ఇది వాహనం అవుతుంది. నీకంటె పెద్దవాడినైన నన్ను అవమానించావు. నీవు ఎక్కువ కాలం ఉండబోవు" అని శపించాడు. (34,35)
విభీషణస్తు ధర్మాత్మా సతాం మార్గమానుస్మరన్ ।
అన్వగచ్ఛన్మహారాజ శ్రియా పరమయా యుతః ॥ 36
మహారాజా! ధర్మాత్ముడయిన విభీషణుడు సత్పురుషుల మార్గాన్నే సదా స్మరిస్తూ కుబేరుని అనుసరించి మహదైశ్వర్యాన్ని పొందాడు. (36)
తస్మై స భగవాంస్తుష్టః భ్రాతా భ్రాత్రే ధనేశ్వరః ।
సైనాపత్యం దదౌ ధీమాన్ యక్షరాక్షససేనయోః ॥ 37
బుద్ధిమంతుడయిన సోదరుడు కుబేరుడు తన సోదరుడు విభీషణుని పట్ల సంతుష్టుడై యక్షరాక్షససైన్యానికి అతనిని సేనాపతిగా చేశాడు. (37)
రాక్షసాః పురుషాదాశ్చ పిశాచాశ్చ మహాబలాః ।
సర్వే సమేత్య రాజానమ్ అభ్యషించన్ దశాననమ్ ॥ 38
నరభక్షకులైన రాక్షసులు, మహాబలవంతులయిన పిశాచులు అందరూ కలిసి దశాననుని రాజుగా అభిషేకించారు. (38)
దశగ్రీవశ్చ దైత్యానాం దేవానాం చ బలోత్కటః ।
ఆక్రమ్య రత్నాన్యహరత్ కామరూపీ విహంగమః ॥ 39
దశగ్రీవుడు కామరూపధరుడై, ఆకాశ సంచారియై బలమదంతో దేవతలపై, దైత్యులపై కూడా దాడి చేసి వారివద్దనున్న రత్నాలను, రత్నఖచితవస్తువులను అపహరించాడు. (39)
రావయామాస లోకాన్ యత్ తస్మాద్ రావణ ఉచ్యతే ।
దశగ్రీవః కామబలః దేవానాం భయమాదధత్ ॥ 40
అతడు సమస్తలోకాలను ఏడిపించాడు (అరిపించాడు) కాబట్టి "రావణుడు" అనిపించుకొన్నాడు. ఆ దశగ్రీవుడు కామబలుడు అంటే ఇచ్ఛానుసారంగా బలం వృద్ధి పొందేవాడు. కాబట్టి దేవతలకు భయం కలిగించాడు. (40)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి రామోపాఖ్యానపర్వణి పంచసప్తత్యధికద్విశతతమోఽధ్యాయః ॥ 275 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున రామోపాఖ్యానపర్వమను ఉపపర్వమున రావణాదులకు వరము ప్రాప్తించుట అను రెండు వందల డెబ్బదియైదవ అధ్యాయము. (275)