274. రెండువందల డెబ్బది నాలుగవ అధ్యాయము
శ్రీరామాదుల జననము - కుబేరోత్పత్తి.
మార్కండేయ ఉవాచ
ప్రాప్తమప్రతిమం దుఃఖం రామేణ భరతర్షభ ।
రక్షసా జానకీ తస్య హృతా భార్యా బలీయసా ॥ 1
ఆశ్రమాద్ రాక్షసేంద్రేణ రావణేన దురాత్మనా ।
మాయామాస్థాయ తరసా హత్వా గృధ్రం జటాయుషమ్ ॥ 2
మార్కండేయుడు చెపుతున్నాడు. భరతశ్రేష్ఠా! శ్రీరామచంద్రుడు ఇటువంటి మహాదుఃఖాన్ని పొందాడు. అతని భార్య జానకిని రాక్షసరాజు, మహాబలవంతుడు, దుర్మార్గుడు అయిన రావణుడు మాయలు పన్ని ఆశ్రమం నుండి ఎత్తుకు పోయాడు. ఆ సమయంలో జటాయువు అనే పక్షి అడ్డురాగా దెబ్బకొట్టి వేగంగా ఎత్తుకెళ్ళాడు. (1,2)
ప్రత్యాజహార తాం రామః సుగ్రీవబలమాశ్రితః ।
బద్ ధ్వా సేతుం సముద్రస్య దగ్ధ్వా లఙ్కౌం శితైః శరైః ॥ 3
రాముడు సుగ్రీవునియొక్క సైన్యాన్ని సహాయంగా తీసుకొని సముద్రానికి సేతువును నిర్మించి, తన నిశిత బాణాలతో లంకను దగ్ధం చేసి ఆమెను తిరిగి తీసుకొని వచ్చాడు. (3)
యుధిష్ఠిర ఉవాచ
కస్మిన్ రామః కులే జాతః కింవీర్యః కింపరాక్రమః ।
రావణః కస్య పుత్రో వా కిం వైరం తస్య తేన హ ॥ 4
యుధిష్ఠిరుడు అడుగుతున్నాడు. రాముడు ఏ వంశంలో పుట్టాడు? అతని బలపరాక్రమాలు ఎటువంటివి? రావణుడు ఎవరి కొడుకు? వారిద్దరి మధ్య ఎటువంటి వైరం ఉంది? (4)
ఏతన్మే భగవన్ సర్వం సమ్యగాఖ్యాతుమర్హసి ।
శ్రోతుమిచ్ఛామి చరితం రామస్యాక్లిష్టకర్మణః ॥ 5
మహాత్మా! ఈ వృత్తాంతాన్ని అంతా నాకు పూర్తిగా చెప్పాలి. అద్భుతకృత్యాలు చేసిన రాముని యొక్క చరిత్రను వినాలనుకుంటున్నాను. (5)
మార్కండేయ ఉవాచ
అజో నామాభవద్ రాజా మహానిక్ష్వాకువంశజః ।
తస్య పుత్రో దశరథః శశ్వత్స్వాధ్యాయవాన్ శుచిః ॥ 6
మార్కండేయుడు చెపుతున్నాడు - ఇక్ష్వాకు వంశీయుడైన అజుడనే మహారాజు ఉన్నాడు. అతని కొడుకు దశరథుడు. అతడు ఎల్లప్పుడూ స్వాధ్యాయం చేస్తూ శుచియై ఉండేవాడు. (6)
అభవంస్తస్య చత్వారః పుత్రా ధర్మార్థకోవిదాః ।
రామలక్ష్మణశత్రుఘ్నాః భరతశ్చ మహాబలః ॥ 7
అతనికి ధర్మార్థకోవిదులైన నలుగురు కొడుకులు కలిగారి. వారు రామలక్ష్మణ, శత్రుఘ్నులు, మహాబలి అయిన భరతుడు. (7)
రామస్య మాతా కౌసల్యా కైకేయీ భరతస్య తు ।
సుతౌ లక్ష్మణశత్రుఘ్నౌ సుమిత్రాయాః పరంతపౌ ॥ 8
రాముని తల్లి కౌసల్య. భరతునికి తల్లి కైకేయి, పరంతపులయిన లక్ష్మణ శత్రుఘ్నులు సుమిత్ర యొక్క కొడుకులు. (8)
విదేహరాజో జనకః సీతా తస్యాత్మజా విభో ।
యాం చకార స్వయం త్వష్టా రామస్య మహిషీమ్ ప్రియామ్ ॥ 9
రాజా! విదేహరాజు జనకుడు. అతని కూతురు సీత. రామునికి భార్యగా ఆమెను స్వయంగా బ్రహ్మదేవుడే సృష్టించాడు. (9)
ఏతద్ రామస్య తే జన్మ సీతాయశ్చ ప్రకీర్తితమ్ ।
రావణస్యాపి తే జన్మ వ్యాఖ్యాస్యామి జనేశ్వర ॥ 10
జనేశ్వరా! సీతారాముల జన్మవృత్తాంతం చెప్పాను. ఇక రావణుని పుట్టుకనుగూర్చి నీకు చెపుతాను. (10)
పితామహో రావణస్య సాక్షాద్ దేవః ప్రజాపతిః ।
స్వయంభూః సర్వలోకానాం ప్రభుః స్రష్టా మహాతపాః ॥ 11
సమస్తలోకములకూ నిర్మాత, ప్రభువు, మహా తపస్వి. స్వయంభువు, సాక్షాత్తు భగవంతుడూ అయిన బ్రహ్మదేవుడు రావణునికి పితామహుడు. (11)
పులస్తో నామ తస్యాసీత్ మానసో దయితః సుతః ।
తస్య వైశ్రవణో నామ గవి పుత్రోఽభవత్ ప్రభుః ॥ 12
ఆ బ్రహ్మదేవునికి ఇష్టుడయిన పులస్త్యుడు అనే మానస పుత్రుడు ఉన్నాడు. అతనికి ఒక గోవు నందు శక్తి సంపన్నుడయిన వైశ్రవణుడు అనే కొడుకు పుట్టాడు. (12)
పితరం స సముత్సృజ్య పితామహముపస్థితః ।
తస్య కోపాత్ పితా రాజన్ ససర్జాత్మానమాత్మవా ॥ 13
స జజ్ఞే విశ్రవా నామ తస్యాత్మార్థేన వై ద్విజః ।
ప్రతీకారాయ సక్రోధః తతో వైశ్రవణస్య వై ॥ 14
! వైశ్రవణుడు తండ్రిని విడిచి పితామహుని సేవించసాగాడు. ఆ కోపంతో తండ్రి తనను తాను మరియొక రూపంలో సృష్టించుకొన్నాడు. పులస్త్యుని అర్థశరీరంతో పుట్టిన ఆ ద్విజుడు విశ్రవసుడు. అతడు వైశ్రవణునిపై ప్రతీకారంకోసం కోపంతో ఉండేవాడు. (13,14)
పితామహస్తు ప్రీతాత్మా దదౌ వైశ్రవణస్య హ ।
అమరత్వం ధనేశత్వం లోకపాలత్వమేవ చ ॥ 15
పితామహుడు మాత్రం వైశ్రవణుని పట్ల ప్రీతుడై అతనికి ధనేశత్వాన్ని, అమరత్వాన్ని, లోకపాలత్వాన్ని ప్రసాదించాడు. (15)
ఈశానేన తథా సఖ్యం పుత్రం చ నలకూబరమ్ ।
రాజధానీనివేశం చ లంకాం రక్షో గణాన్వితామ్ ॥ 16
ఇంకా అతనికి మహాదేవునితో మైత్రిని కలిగించి నలకూబరుడనే కొడుకును, నివసించడానికి రాక్షస గణాలతో కూడిన లంకను రాజధానిగాను ప్రసాదించాడు. (16)
విమానం పుష్పకం నామ కామగం చ దదౌ ప్రభుః ।
యక్షాణామాధిపత్యం చ రాజరాజత్వమేవ చ ॥ 17
ఇచ్ఛానుసారంగా తిరిగే పుష్పకం అనే విమానాన్ని ప్రసాదించాడు. యక్షులకు అధిపతిగా చేశాడు. 'రాజురాజు' పదవిని ఇచ్చాడు. (17)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి రామోపాఖ్యానపర్వణి రామరావణయోర్జన్మకథనే చతుఃసప్తత్యధికద్విశతతమోఽధ్యాయః ॥ 274 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున రామోపాఖ్యానపర్వమను ఉపపర్వమున రామరావణ జన్మకథనమను రెండువందల డెబ్బది నాల్గవ అధ్యాయము. (274)