251. రెండు వందల ఏబది ఒకటవ అధ్యాయము

శకుని దుర్యోధనుని అనునయించుట దుర్యోధనుడు రసాతలమునకు కొనిపోబడుట.

వైశంపాయన ఉవాచ
ప్రాయోపవిష్టం రాజానం దుర్యోధనమమర్షణమ్ ।
ఉవాచ సాంత్వయన్ రాజన్ శకునిః సౌబలస్తదా ॥ 1
వైశంపాయనుడిలా అన్నాడు.
రాజా! ఆపై అసహనానికి గురి అయి, ప్రాయోపవేశానికి సిద్ధపడిన దుర్యోధననరపతిని అనునయిస్తూ, సౌబలుడైన శకుని ఇలా అన్నాడు. (1)
శకునిరువాచ
సమ్యగుక్తం హి కర్ణేన తచ్ఛ్రుతం కౌరవ త్వయా ।
మయా హృతం శ్రియం స్ఫీతాం తాం మోహాదపహాయ కిమ్ ॥ 2
శకుని ఇలా అన్నాడు.
కౌరవా! కర్ణుడు చక్కగా చెప్పాడు. నీవు అది విన్నావు. నేను సమృద్ధమైన పాండవరాజ్యలక్ష్మిని అపహరించాను. నీవు మోహంతో దానిని పరిత్యజిస్తున్నావు. (2)
త్వమల్పబుద్ధ్యా నృపతే ప్రాణానుత్స్రష్టుమర్హసి ।
అథవాప్యవగచ్ఛామి న వృద్ధాః సేవితాస్త్వయా ॥ 3
రాజా! నీవు నీ మందమతిత్వం వలన ప్రాణాలను వీడదలచుకొన్నావు. అసలు నీవెప్పుడూ పెద్దలను సేవించలేదని నాకు అనిపిస్తోంది. (3)
యః సముత్పతితం హర్షం దైన్యం వా న నియచ్ఛతి ।
స నశ్యతి శ్రియం ప్రాప్య పాత్రమామమివాంభసి ॥ 4
మీదపడుతున్న ఆనందాన్ని కానీ, దుఃఖాన్ని కానీ నియంత్రించుకొనలేనివాడు సంపదలను పొందినా పచ్చికుండ నీళ్లలో కరిగిపోయినట్లు ఆ సంపద నశిస్తుంది. (4)
అతిభీరుమతిక్లీబం దీర్ఘసూత్రం ప్రమాదినమ్ ।
వ్యసనాద్ విషయాక్రాంతం న భజంతి నృపం ప్రజాః ॥ 5
రాజు మరీ పిరికివాడైనా, శక్తిహీనుడైనా, అలసత్వం కల వాడైనా, ఏమరుపాటు కలవాడైనా, వ్యసనంలో, విషయాలలో చిక్కుపడిపోయినా ఆ రాజును ప్రజలు సేవించరు. (5)
సత్కృతస్య హి తే శోకః విపరీతే కథం భవేత్ ।
మా కృతం శోభనం పార్థైః శోకమాలంబ్య నాశయ ॥ 6
పాండవులు నిన్ను ఆదరిస్తేనే ఇలా కుమిలిపోతున్నావు. వారు తిరస్కరించి ఉంటే ఏమయ్యేదో? కౌంతేయులు పాటించిన మర్యాదను నీ శోకంతో నశింపజేసికొనవద్దు. (6)
యత్ర హర్షస్త్వయా కార్యః సత్కర్తవ్యాశ్చ పాండవాః ।
తత్ర శోచసి రాజేంద్ర విపరీతమిదం తవ ॥ 7
రాజేంద్రా! నీవు ఆనందించి పాండవులను సత్కరించవలసిన సందర్భంలో బాధపడుతున్నావు. ఈ నీ ప్రవృత్తి విపరీతంగా ఉంది. (7)
ప్రసీద మా త్యజాత్మానం తుష్టశ్చ సుకృతం స్మర ।
ప్రయచ్ఛ రాజ్యం పార్థానాం యశో ధర్మమవాప్నుహి ॥ 8
ప్రసన్నుడవుకమ్ము, ప్రాణాలు తీసికొనవద్దు. ఆనందంగా ఉండు. వారి మంచితనాన్ని తలచుకొంటూ పాండవులకు రాజ్యాన్ని ఇచ్చి కీర్తినీ, ధర్మాన్నీ పొందు. (8)
క్రియామేతాం సమాజ్ఞాయ కృతజ్ఞస్త్వం భవిష్యసి ।
సౌభ్రాత్రం పాండవైః కృత్వా సమవస్థాప్య చైవ తాన్ ॥ 9
పిత్య్రం రాజ్యం ప్రయచ్ఛైషాం తతః సుఖమవాప్స్యసి ।
నా మాటను గ్రహించి ఆ విధంగా చేస్తే నిన్ను కృతజ్ఞుడంటారు. పాండవులతో సౌభ్రాత్రాన్ని పాటించి వారికి పైతృకమైన రాజ్యాన్ని సమర్పించి సింహాసనంపై నిలుపు. దానితో నీవు సుఖంగా ఉండవచ్చు. (9 1/2)
వైశంపాయన ఉవాచ
శకునేస్తు వచః శ్రుత్వా దుఃశాసనమవేక్ష్య చ ॥ 10
పాదయోః పతితం వీరం వికృతం భ్రాతృసౌహృదమ్ ।
బాహుభ్యాం సాధుజాతాభ్యాం దుఃశాసనమరిందమమ్ ॥ 11
ఉత్థాప్య సంపరిష్యజ్వ ప్రీతాజిఘ్రిత మూర్ధని ।
వైశంపాయనుడిలా అన్నాడు. రాజా! శకుని చెప్పిన మాటలు విని, సుయోధనుడు ఖిన్నవదనంతో పాదాలపైబడిన వీరుడు, శత్రుసంహర్త, భ్రాతృప్రేమి అయిన దుశ్శాసనునివైపు చూసి తన సుందర బాహువులతో పైకి లేపి, కౌగిలించుకొని, ప్రేమతో శిరస్సు మూర్కొన్నాడు. (10, 11 1/2)
కర్ణసౌబలయోశ్చాపి సంశ్రుత్య వచనాన్యాసౌ ॥ 12
నిర్వేదం పరమం గత్వా రాజా దుర్యోధనస్తదా ।
వ్రీడయాభిపరీతాత్మా నైరాశ్యమగమత్ పరమ్ ॥ 13
కర్ణశకునుల మాటలు విని కూడా దుర్యోధననరపతి తీవ్రనిర్వేదానికి లోనయి, సిగ్గుతో కుంచించుకొనిపోయి, పరమనైరాశ్యాన్ని పొందాడు. (12,13)
తచ్ఛ్రుత్వా సుహృదశ్చైవ సమన్యురిదమబ్రవీత్ ।
న ధర్మధనసౌఖ్యేన నైశ్వర్యేణ న చాజ్ఞయా ॥ 14
నైవ భోగైశ్చ మే కార్యం మా విహన్యత గచ్ఛత ।
నిశ్చితేయం మమ మతిః స్థితా ప్రాయోపవేశనే ॥ 15
గచ్ఛధ్వం నగరం సర్వే పూజ్యాశ్చ గురవో మమ ।
మిత్రులందరి మాటలు విని దుర్యోధనుడు కోపంగా ఇలా అన్నాడు. 'నాకు ధర్మం, ధనం, సౌఖ్యం, అధికారం, అనుశాసనం, భోగాలు ఏవీ అవసరం లేదు. నన్ను బాధించకండి. వెళ్ళండి. ప్రాయోపవేశం చేయాలనే నాకు నిశ్చితబుద్ధి కలిగింది. మీరంతా నగరానికి వెళ్ళండి. మన గురుజనులనందరినీ ఆదరించండి.' (14,15 1/2)
త ఏవముక్తాః ప్రత్యూచుః రాజానమరిమర్దనమ్ ॥ 16
యా గతిస్తవ రాజేంద్ర సాస్మాకమపి భారత ।
కథం వా సంప్రవేక్ష్యామః త్వద్విహీనాః పురం వయమ్ ॥ 17
దుర్యోధనుడు అలా అనగానే వారంతా శత్రుసంహారకుడైన దుర్యోధనరాజుతో ఇలా అన్నారు -
'రాజేంద్రా! భారతా! నీ మార్గమే మాకు కూడా మార్గం. నీవు లేకుండా మేము నగరానికి ఎలా వెళ్ళగలం?' (16,17)
వైశంపాయన ఉవాచ
స సుహృద్భిరమాత్యైశ్చ భ్రాతృభిః స్వజనేన చ ।
బహుప్రకారమప్యుక్తః నిశ్చయాన్న విచాల్యతే ॥ 18
వైశంపాయనుడిలా అన్నాడు.
మిత్రులు, అమాత్యులు, సోదరులు, బంధువులు ఎన్ని రకాలుగా చెప్పినా దుర్యోధనుడు తన నిర్ణయం నుండి మరల లేదు. (18)
దర్భాస్తరణమాస్తీర్య నిశ్చయాన్న విచాల్యతే ।
సంస్పృశ్యాపః శుచిర్భూత్వా భూతలే సముపస్థితః ॥ 19
కుశచీరాంబరధరః పరం నియమమాస్థితః ।
వాగ్యతో రాజశార్దూలః స స్వర్గగతికామ్యయా ॥ 20
మనసోపచితం కృత్వా నిరస్య చ బహిఃక్రియాః ।
రాజశ్రేష్ఠుడైన ఆ దుర్యోధనుడు తన నిర్ణయం నుండి వెనుదిరగక ఆచమించి, పవిత్రుడైన దర్భాసనాన్ని నేలపై పరచి, దర్భలను నారబట్టలను ధరించి, కూర్చున్నాడు. స్వర్గగమన కాంక్షతో మౌనాన్ని వహించి, ఉత్తమనియమాలను ఆశ్రయించి, స్నానభోజనాది బాహ్యక్రియలను విసర్జించి, ప్రాణత్యాగానికి గట్టిగా నిర్ణయించుకొన్నాడు. (19, 20 1/2)
అథ తం నిశ్చయం తస్య బుద్ ధ్వా దైతేయదానవాః ॥ 21
పాతాలవాసినో రౌద్రౌః పూర్వం దేవైర్వినిర్జితాః ।
తే స్వపక్ష క్షయం తం తు జ్ఞాత్వా దుర్యోధనస్య వై ॥ 22
ఆహ్వానాయ తదా చక్రుః కర్మ వైతానసంభవమ్ ।
బృహస్పత్యుశనోక్తైశ్చ మంత్రైర్మంత్రవిశారదాః ॥ 23
అథర్వవేదప్రోక్తైశ్చ యాశ్చోపనిషది క్రియాః ।
మంత్రజప్యసమాయుక్తాః తస్తదా సమవర్తయన్ ॥ 24
దుర్యోధనుని ఆ నిర్ణయం పాతాళవాసులయిన దైతేయులకు, దానవులకు తెలిసింది. వారు అసలే రౌద్రులు. ఇంతకుముందే దేవతలచే ఓడింపబడినవారు. దుర్యోధనుని ఆ నిర్ణయం తమ పక్షానికి నష్టమని భావించి వారు దుర్యోధనుని తమ చెంతకు రప్పించుకొనటానికి ఉద్యమించారు. మంత్రవిశారదులయిన వారు బృహస్పతి, శుక్రాచార్యుడు చెప్పిన మంత్రాలను, అధర్వవేదంలో, ఉపనిషత్తులలో చెప్పిన యజ్ఞకర్మలను, ఉపనిషత్తులలో చెప్పిన మంత్రజపాది క్రియలను ప్రారంభించారు. (21-24)
వి॥ సం॥ అగ్నివిస్తారసాధ్యమైన నవకుండాదిహోమ విధానం అధర్వణవేదంలోనిది. ఋగ్యజుస్యామవేదాలలోనిది కాదు. (నీల)
జుహ్వత్యగ్నౌ హవిః క్షీరం మంత్రవత్ సుసమాహితాః ।
బ్రాహ్మణా వేదవేదాంగపారగాః సుదృఢవ్రతాః ॥ 25
వేదవేదాంగపారంగతులు, దృఢవ్రతులు అయిన బ్రాహ్మణులు నిశ్చలదీక్షతో మంత్రపూర్వకంగా అగ్నిహోత్రంలో నేతిని, పాలను ఆహుతి చేయసాగారు. (25)
కర్మసిద్ధౌ తదా తత్ర జృంభమాణా మహాద్భుతా ।
కృత్యా సముత్థితా రాజన్ కిం కరోమితి చాబ్రవీత్ ॥ 26
రాజా! యజ్ఞకర్మ సిద్ధించగా ఆ అగ్నిహోత్రం నుండి ఒక అద్భుతకృత్య ఆవులిస్తూ లేచి "ఏం చేయాలి?" అని అడిగింది. (26)
ఆహుర్దైత్యాశ్చ తాం తత్ర సుప్రీతేనాంతరాత్మనా ।
ప్రాయోపవిష్టం రాజానం ధార్తరాష్ట్రమిహానయ ॥ 27
అప్పుడు దైత్యులు మనసా పరమానందపడి "ప్రాయోపవిష్టుడైన దుర్యోధనమహారాజును ఇక్కడకు తీసుకొనిరా" అని దానితో అన్నారు. (27)
తథేతి చ ప్రతిశ్రుత్య సా కృత్యా ప్రయయౌ తదా ।
నిమేషాదగమచ్చాపి యత్ర రాజా సుయోధనః ॥ 28
'అలాగే' అని అంగీకరించి ఆ కృత్య బయలుదేరి నిమేషకాలంలో సుయోధనుడున్న చోటికి వచ్చింది. (28)
సమాదాయ చ రాజానం ప్రవివేశ రసాతలమ్ ।
దానవానాం ముహూర్తాచ్చ తమానీతం న్యవేదయత్ ।
తమానీతం నృపం దృష్ట్వా రాత్రౌ సంగత్య దానవాః ॥ 29
ప్రహృష్టమనసః సర్వే కించిదుత్ఫుల్లలోచనాః ।
సాభిమానమిదం వాక్యం దుర్యోధనమథాబ్రువన్ ॥ 30
రాజును తీసికొని క్షణకాలంలో పాతాళానికి వెళ్ళింది. సుయోధనుని తెచ్చినట్టు దానవులకు తెలిపింది. కొనిరాబడిన దుర్యోధనుని చూసి దానవులంతా రాత్రివేళ గుమిగూడి మనస్సులు ఆనందించగా, కళ్ళు వికసించగా ప్రేమపూర్వకంగా దుర్యోధనునితో ఇలా అన్నారు. (29,30)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి ఘోషయాత్రాపర్వణి దుర్యోధనప్రాయోపవేశే ఏకపంచాశదధికద్విశతతమోఽధ్యాయః ॥ 251 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున ఘోషయాత్రా పర్వమను ఉపపర్వమున దుర్యోధనప్రాయోపవేశమను రెండు వందల యేబది యొకటవ అధ్యాయము. (251)