252. రెండు వందల యేబది రెండవ అధ్యాయము
దానప్రబోధము - కర్ణుని పట్టుదలతో దుర్యోధనుడు దీక్ష విరమించుట.
దానవా ఊచుః
భోః సుయోధన రాజేంద్ర భరతానాం కులోద్వహ ।
శూరైః పరివృతో నిత్యం తథైవ చ మహాత్మభిః ॥ 1
అకార్షీః సాహసమిదం కస్మాత్ ప్రాయోపవేశనమ్ ।
ఆత్మత్యాగీ హ్యధో యాతి వచ్యతాం చాయశస్కరీమ్ ॥ 2
దానవులిలా అన్నారు.
భరతవంశశ్రేష్ఠా! సుయోధన రాజేంద్రా! శూరులు, మహాత్ములు ఎప్పుడూ నీ చుట్టూ ఉంటారు. ప్రాయోపవేశన రూపమైన ఈ సాహసాన్ని ఎందుకు చేశావు? ఆత్మత్యాగం చేసినవాడు అధోలోకాలకు పోతాడు. నిందకు లోనవుతాడు. అపకీర్తికి ఆశ్రయమవుతాడు. (1,2)
న హి కార్యవిరుద్ధేషు బహుపాపేషు కర్మసు ।
మూలఘాతిషు సజ్జంతే బుద్ధిమంతో భవిద్విధాః ॥ 3
అభీష్టకార్యానికి విరుద్ధమై, పాపహేతువై, మూలనాశనం చేసే పనులలో నీవంటి బుద్ధిమంతులు తగులుకొనతగదు. (3)
నియచ్ఛైనాం మతిం రాజన్ ధర్మార్థసుఖనాశినీమ్ ।
యశః ప్రతాపవీర్యఘ్నీం శత్రూణాం హర్షవర్ధనీమ్ ॥ 4
రాజా! ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకో! ఇది ధర్మార్థసుఖాలను నాశనం చేస్తుంది. కీర్తినీ, పరాక్రమాన్నీ హతం చేస్తుంది. శత్రువులకు ఆనందాన్ని పెంపొదిస్తుంది. (4)
శ్రూయతాం తు ప్రభో తత్త్వం దివ్యతాం చాత్మనో నృప ।
నిర్మాణం చ శరీరస్య తతో ధైర్యమవాప్నుహి ॥ 5
స్వామీ! రాజా! తత్త్వాన్ని విను. నీ దివ్యత్వాన్ని గ్రహించు. శరీరనిర్మాణాన్ని ఆకళింపు చేసుకో. ఆపై ధైర్యాన్ని తెచ్చుకో. (5)
పురా త్వం తపసాస్మాభిః లబ్ధో రాజన్ మహేశ్వరాత్ ।
పూర్వకాయశ్చ పూర్వస్తే నిర్మితో వజ్రసంచయైః ॥ 6
రాజా! గతంలో మేము తపః ఫలంగా మహేశ్వరుని ద్వారా నిన్ను పొందగలిగాము. నీ శరీరంలోని పూర్వభాగం వజ్రసమూహంతో తయారయినది. (6)
అస్త్రైరభేద్యః శస్త్రైశ్చాప్యధః కాయశ్చ తేఽనఘ ।
కృతః పుష్పమయో దేవ్యా రూపతః స్త్రీమనోహరః ॥ 7
అనఘా! అది శస్త్రాలతో గానీ, అస్త్రాలతో గానీ భేదింపరానిది. నీ శరీరంలో అధోభాగాన్ని పార్వతీదేవి పుష్పమయంగా చేసింది. అది అందమై అతివలమనస్సుల నపహరింపగలది. (7)
ఏవమీశ్వరసంయుక్తః తవ దేహో నృపోత్తమ ।
దేవ్యా చ రాజశార్దూల దివ్యస్త్వం హి న మానుషః ॥ 8
రాజోత్తమా! ఈ విధంగా నీదేహం పార్వతీదేవితో కలిసి పరమేశ్వరుడు నిర్మించినది. రాజశ్రేష్ఠా! నీవు మానవుడవు కాదు. దివ్యపురుషుడవు. (8)
క్షత్రియాశ్చ మహావీర్యాః భగదత్తపురోగమాః ।
దివ్యాస్త్రవిదుషః శూరాః క్షపయిష్యంతి తే రిపూన్ ॥ 9
మహాపరాక్రమశాలులు, దివ్యాస్త్రవేత్తలు, శూరులు అయిన భగదత్తాది క్షత్రియులు నీ శత్రువులను నశింపజేయగలరు. (9)
తదలం తే విషాదేన భయం తవ న విద్యతే ।
సాహాయ్యార్థం చ తే వీరాః సంభూతా భువి దానవాః ॥ 10
కాబట్టి నీవు బాధపడనవసరం లేదు. భయపడనవసరం లేదు. నీకు సహకరించటానికే దానవవీరులు భూలోకంలో జన్మించారు. (10)
భీష్మద్రోణకృపాదీంశ్చ ప్రవేక్ష్యంత్యపరేఽసురాః ।
యైరావిష్టా ఘృణాం త్యక్త్వా యోత్స్యంతే తవ వైరిభిః ॥ 11
ఇతర రాక్షసులు భీష్మద్రోణకృపాదులను కూడా ఆవేశిస్తారు. దానితో వారు జాలిలేకుండా నీ శత్రువులతో పోరాడుతారు. (11)
నైవ పుత్రాన్ న చ భ్రాతౄన్ న పితౄన్ న చ బాంధవాన్ ।
నైవ శిష్యాన్ న చ జ్ఞాతీన్ న బాలాన్ స్థవిరాన్ న చ ॥ 12
యుధి సంప్రహరిష్యంతః మోక్ష్యంతి కురుసత్తమ ।
నిః స్నేహా దానవావిష్టాః సమాక్రాంతేఽంతరాత్మని ॥ 13
కురుశ్రేష్ఠా! దానవులు ఆవేశించినందువలన భీష్మాదులకు కూడా తమ అంతరాత్మలపై అదుపు ఉండదు. దానితో స్నేహాన్ని కూడా లెక్కచేయక పుత్రులను, సోదరులను, తండ్రులను, బంధువులను, శిష్యులను, దాయాదులను, బాలురను, వృద్ధులను ఎవ్వరినీ వదల కుండా యుద్ధంలో సంహరిస్తారు. (12,13)
ప్రహరిష్యంతి వివశాః స్నేహముత్సృజ్య దూరతః ।
దృష్టాః పురుషశార్దూలాః కలుషీకృతమానసాః ।
అవిజ్ఞానవిమూఢాశ్చ దైవాశ్చ విధినిర్మితాత్ ॥ 14
పురుషోత్తములయిన భీష్మాదుల మనస్సులు కలుషితమవుతాయి. వారు అజ్ఞానమోహంలో పడి వివశులై స్నేహాన్ని దూరంగా వదలి అందరినీ చంపుతారు. ఇది విధివిలాసం, దైవికం కూడా. (14)
వ్యభాషమాణాశ్చాన్యోన్యం న మే జీవన్ విమోక్ష్యసే ।
సర్వే శస్త్రాస్త్రమోక్షేణ పౌరుషే సమవస్థితాః ॥ 15
శ్లాఘమానాః కురుశ్రేష్ఠ కరిష్యంతి జనక్షయమ్ ।
కురుశ్రేష్ఠా! "నేను నిన్ను ప్రాణాలతో విడువను" అని ఒకరినొకరు రెచ్చగొడుతూ, పరాక్రమంతో అందరూ ఒకరిపైఒకరు శస్త్రాలను ప్రయోగిస్తూ, తమను తాము పొగడుకొంటూ జననాశనం చేస్తారు. (15 1/2)
తేఽపి పంచ మహాత్మానః ప్రతియోత్స్యంతి పాండవాః ॥ 16
వధం చైషాం కరిష్యంతి దైవయుక్తా మహాబలాః ।
దైవసహకారంతో మహాబలులైన ఆ మహాత్ములు - పాండవులు - భీష్మాదుల కెదురునిలిచి పోరాడి వారిని చంపివేస్తారు. (16 1/2)
దైత్యరక్షో గణాశ్చైవ సంభూతాః క్షత్రయోనిషు ॥ 17
యోత్స్యంతి యుధి విక్రమ్య శత్రుభిస్తవ పార్థివ ।
గదాభిర్ముసలైః శూలైః శస్త్రైరుచ్చావచైస్తథా ॥ 18
(ప్రహరిష్యంతి తే వీరాః తవారిషు మహాబలాః ।)
రాజా! క్షత్రియులలో పుట్టి ఉన్న దైత్య, రాక్షసగణాలు యుద్ధంలో పరాక్రమించి నీ శత్రువులతో పోరాడుతారు. మహాబలులయిన ఆ వీరులు గదలతో, రోకళ్ళతో, శూలాలతో ఇంకా చిన్న- పెద్ద ఆయుధాలతో నీ శత్రువులను కొడతారు. (17,18)
యచ్చ తేఽంతర్గతం వీర భయమర్జునసంభవమ్ ।
తత్రాపి విహితోఽస్మాభిః వధోపాయోఽర్జునస్య వై ॥ 19
వీరుడా! నీ మనస్సులో అర్జునుడంటే భయముంది. ఆ అర్జునసంహారం కోసం కూడా మేము ఉపాయం ఆలోచించాము. (19)
హతస్య నరకస్యాత్మా కర్ణమూర్తిముపాశ్రితః ।
తద్ వైరం సంస్మరన్ వీర యోత్స్యతే కేశవార్జునౌ ॥ 20
మరణించిన నరకుని ఆత్మ కర్ణుని శరీరంలో ప్రవేశించింది. వీరా! ఆ వైరాన్ని తలచుకొంటూ కర్ణుడు కృష్ణార్జునులతో పోరాడుతాడు. (20)
స తే విక్రమశౌటీరః రణే పార్థం విజేష్యతి ।
కర్ణః ప్రహరతాం శ్రేష్ఠః సర్వాంశ్చారీన్ మహారథః ॥ 21
ఆ కర్ణుడు మహారథి. పరాక్రమగర్వం గలవాడు. యోధులలో శ్రేష్ఠుడు. అతడు యుద్ధంలో అర్జునుని, ఇతర శత్రువుల నందరినీ జయిస్తాడు. (21)
జ్ఞాత్వైతచ్ఛద్మనా వజ్రీ రక్షార్థం సవ్యసాచినః ।
కుండలే కవచం చైవ కర్ణస్యాపహరిష్యతి ॥ 22
ఇది గ్రహించి ఇంద్రుడు అర్జునుని రక్షింపగోరి, మోసంతో కర్ణుని కవచాన్నీ, కుండలాలనూ అపహరిస్తాడు. (22)
తస్మాదస్మాభిరప్యత్ర దైత్యాః శతసహస్రశః ।
నియుక్తా రాక్షసాశ్చైవ యే తే సంశప్తకా ఇతి ॥ 23
ప్రఖ్యాతాస్తేఽర్జునం వీరం హనిష్యంతి చ మా శుచః ।
అసపత్నా త్వయా హీయం భోక్తవ్యా వసుధా నృప ॥ 24
అందుకోసమే మేము కూడా సంశప్తకులనే పేర లక్షమంది దైత్యులనూ, రాక్షసులనూ ఏర్పాటు చేశాము. వారు ప్రఖ్యాతవీరులు. వీరుడయిన అర్జునుని సంహరిస్తారు. నీవు దుఃఖించవద్దు. రాజా! ఈ భూమిని నీవు శత్రురహితంగా అనుభవించాలి. (23,24)
మా విషాదం గమస్తస్మాద్ నైతత్త్వయ్యుపపద్యతే ।
వినష్టే త్వయి చాస్మాకం పక్షో హీయేత కౌరవ ॥ 25
కాబట్టి బాధపడవద్దు. నీకిది తగదు. కౌరవా! నీవు మరణిస్తే మా పక్షం బలహీనమవుతుంది. (25)
గచ్ఛ వీర న తే బుద్ధిః అన్యా కార్యా కథంచన ।
త్వమస్మాకం గతిర్నిత్యం దేవతానాం చ పాండవాః ॥ 26
వీరుడా! వెళ్ళు. నీవు ఏ రీతిగానూ మరొక ఆలోచన చేయవద్దు. మాకెప్పుడూ నీవే దిక్కు. పాండవులు దేవతలకు దిక్కు. (26)
వైశంపాయన ఉవాచ
ఏవముక్త్వా పరిష్వజ్య దైత్యాస్తం రాజకుంజరమ్ ।
సమాశ్వాస్య చ దుర్ధర్షం పుత్రవద్ దానవర్షభాః ॥ 27
స్థిరాం కృత్వా బుద్ధిమస్య ప్రియాణ్యుక్త్వా చ భారత ।
గమ్యతామిత్యనుజ్ఞాయ జయమాప్నుహి చేత్యథ ॥ 28
వైశంపాయనుడిలా అన్నాడు.
భారతా! దైత్యులు ఎదిరించరాని వీరుడూ, రాజశ్రేష్ఠుడూ అయిన దుర్యోధనుని కౌగిలించుకొని, పుత్రునివలె అనునయించి, ప్రియవచనాలతో అతని బుద్ధిని కుదుటపరచి "ఇకవెళ్ళు. నీదే గెలుపు" అని ఆజ్ఞాపించారు.
తైర్విసృష్టం మహాబాహుం కృత్యా సైవానయత్ పునః ।
తమేవ దేశం యత్రాసౌ తదా ప్రాయముపావిశత్ ॥ 29
వారు విడిచిపెట్టగానే ఆ కృత్యయే మరల సుయోధనుని అంతకుముందు ప్రాయోపవేశం చేయబూనిన ప్రదేశానికే తీసికొని వచ్చింది. (29)
ప్రతినిక్షిప్య తం వీరం కృత్యా సమభిపూజ్య చ ।
అనుజ్ఞాతా చ రాజ్ఞా సా తథైవాంతరధీయత ॥ 30
వీరుడైన దుర్యోధనుని అక్కడ నిలిపి, సత్కరించి, ఆ రాజు అనుమతిని పొంది, కృత్య అక్కడే అంతర్ధానమైంది. (30)
గతాయామథ తస్యాం తు రాజా దుర్యోధనస్తదా ।
స్వప్నభూతమిదం సర్వమ్ అచింతయత భారత ॥ 31
(సమ్మృశ్యతాని వాక్యాని దానవోక్తాని దుర్మతిః ।)
విజేష్యామి రణే పాండూన్ ఇతి చాస్యాభవస్మతిః ।
భారతా! ఆ కృత్య అలా వెళ్ళిపోగానే దుర్యోధనునకు అదంతా కలలా అనిపించింది. దానవులు పలికిన మాటలను తలచుకొని ఆ దుర్మతి "నేను యుద్ధంలో పాండవులపై గెలుస్తాను" అని సంకల్పించుకొన్నాడు. (31 1/2)
కర్ణం సంశప్తకాంశ్చైవ పార్థస్యామిత్రఘాతినః ॥ 32
అమన్యత వధే యుక్తాన్ సమర్థాంశ్చ సుయోధనః ।
కర్ణుడూ, సంశప్తకులూ శత్రుసంహర్త అయిన అర్జునునికి యుద్ధంలో తగినవారూ, సమర్థులూ అని సుయోధనుడు భావించాడు. (32 1/2)
ఏవమాశా దృఢా తస్య ధార్తరాష్ట్రస్య దుర్మతేః ॥ 33
వినిజయే పాండవానామ్ అభవద్ భరతర్షభ ।
భరతశ్రేష్ఠా! దుర్మతి అయిన దుర్యోధనునకు ఆ రీతిగా పాండవులను గెలవటంపై ఆశ గట్టిపడింది. (33 1/2)
కర్ణోఽప్యావిష్టచిత్తాత్మా నరకస్యాంతరాత్మనా ॥ 34
అర్జునస్య వధే క్రూరాం కరోతి స్మ తదా మతిమ్ ।
నరకుని ఆత్మ తనలో ప్రవేశించటం చేత కర్ణుడు కూడా అర్జునుని చంపాలను క్రూరంగా సంకల్పించసాగాడు. (34 1/2)
సంశప్తకాశ్చ తే వీరాః రాక్షసావిష్టచేతసః ॥ 35
రజస్తమోభ్యామాక్రాంతాః ఫాల్గునస్య వధైషిణః ।
వీరులయిన సంశప్తకులు కూడా రాక్షసులు వారి మనస్సులలో ప్రవేశించటం వలన అర్జునుని చంపగోరుతూ రజస్తమోగుణాలకు లోనయ్యారు. (35 1/2)
భీష్మద్రోణకృపాద్యాశ్చ దానవాక్రాంతచేతసః ॥ 36
న తథా పాండుపుత్రాణాం స్నేహవంతో విశాంపతే ।
రాజా! భీష్మద్రోణకృపాదుల మనస్సులను కూడా దానవులు ఆక్రమించారు. దానితో పాండుకుమారులపై వారంతగా స్నేహాన్ని ప్రదర్శించలేకపోయారు. (36 1/2)
(కృత్యయాఽఽవాయుకధితం యత్ తస్యాం విశి దానవైః ।)
న చాచచక్షే కస్మైచిద్ ఏతద్ రాజా సుయోధనః ॥ 37
కృత్య ద్వారా కొనిపోయి ఆ రాత్రి దానవులు తనకు చెప్పిన విషయాలను దుర్యోధనరాజు ఎవ్వరికీ చెప్పలేదు. (37)
దుర్యోధనం విశాంతే చ కర్ణో వైకర్తవోఽబ్రవీత్ ।
స్మయన్నివాంజలిం కృత్వా పార్ధివం హేతుమద్ వచః ॥ 38
సూర్యసుతుడైన కర్ణుడు ఆ వేకువజామున చేతులు జోడించి, చిరునవ్వుతో దుర్యోధనునితో హేతుబద్ధమ్గా ఇలా చెప్పాడు. (38)
వ మృతో జయతే శత్రూన్ జీవన్ భద్రాణి పశ్యతి ।
మృతస్య భద్రాణి కుతః కౌరవేయ కుతో జయః ॥ 39
'కౌరవనందనా! మరణించినవాడు శత్రువులను జయించలేడు. బ్రతికిఉంటే శుభాలు కలుగుతాయి. మరణించినవాడికి శుభాలూ ఉండవు. విజయాలూ ఉండవు. (39)
వ కాలోఽద్య విషాదస్య భయస్య మరణస్య వా ।
పరిష్వజ్యాబ్రవీచ్ఛైనం భుజాభ్యాం స మహాభుజః ॥ 40
విషాదానికి కానీ, భయానికి కానీ, మరణానికి కానీ ఇది సమయం కాదు, అని చెప్పి మహాభుజుడైన ఆ కర్ణుడు భుజాలతో దుర్యోధనుని కౌగిలించి, మరలా ఇలా అన్నాడు. (40)
ఉత్తిష్ఠ రాజన్ కిం శేషే కస్మాచ్ఛోచసి శత్రుహన్ ।
శత్రూన్ ప్రతాప్య వీర్యేణ స కథం మృత్యుమిచ్ఛసి ॥ 41
రాజా! లే! ఎందుకు పడుకొంటావు? శత్రుసంహార్తా! ఎందుకు దుఃఖిస్తావు? పరాక్రమంతో శత్రువులను తపింపజేసి ఇప్పుడు మరణాన్ని ఎందుకు కోరుకొంటావు? (41)
అథవా తే భయం జాతం దృష్ట్వార్జునపరాక్రమమ్ ।
సత్యం తే ప్రతిజానామి వధిష్యామి రణేఽర్జునమ్ ॥ 42
లేకపోతే అర్జునుడి పరాక్రమాన్ని చూసి నీవు భయపడ్డావా? నేను నీకు ఒట్టువేసి చెప్తున్నాను. యుద్ధంలో అర్జునుని నేనే చంపుతాను. (42)
గతే త్రయోదశే వర్షే సత్యేనాయుధమాలభే ।
ఆనయిష్యామ్యహం పార్థాన్ వశం తవ జనాధిప ॥ 43
రాజా! ధనుస్సుచేతబట్టి సత్యం మీద ఒట్టువేసి చెప్తున్నాను. పదమూడవ సంవత్సరం పూర్తికాగానే పాండవులను తెచ్చి నీ వశం చేస్తాను. (43)
ఏవముక్తస్తు కర్ణేన దైత్యానాం వచనాత్ తథా ।
ప్రణిపాతేన చాప్యేషామ్ ఉదతిష్ఠత్ సుయోధనః ॥ 44
కర్ణుడు అలా అనగా దుర్యోధనుడు దైత్యులమాటలను కూడా తలచుకొని, సోదరులు తన కాళ్ళపై పడటాన్ని మన్నించి ప్రాయోపవేశాన్ని వీడి లేచాడు. (44)
దైత్యానాం తద్ వచః శ్రుత్వా హృది కృత్వా స్థిరాం మతిమ్ ।
తతో మమజశార్దూలః యోజయామాస వాహినీమ్ ॥ 45
దైత్యులు చెప్పిన ఆ మాటలను తలచుకొని, మనస్సులో స్థిరనిర్ణయానికి వచ్చి, మనుజశ్రేష్ఠుడైన దుర్యోధనుడు అప్పుడు సేనను సన్నద్ధం చేయించాడు. (45)
రథనాగాశ్వకలిలాం పదాతిజనసంకులామ్ ।
గంగౌఘప్రతిమా రాజన్ సా ప్రయతా మహాచమూః ॥ 46
రాజా! రథాలు, ఏనుగులు, గుర్రాలు, సైనికులతో కల్లోలితమయిన ఆ మహాసేన గంగాప్రవాహంలా సాగిపోయింది. (46)
శ్వేతచ్ఛత్రైః పతాకాభిః చామరైశ్చ సుపాండురైః ।
రథైర్నాగైః పదాతైశ్చ శుశుభేఽతీవ సంకులా ॥ 47
వ్యపేతాభ్రఘనే కాలే ద్యౌరివావ్యక్తశారదీ ।
కల్లోలితమయిన ఆ సేన తెల్లగొడుగులతో, పతాకాలతో, తెల్లని వింజామరలతో, రథాలతో, ఏనుగులతో, సైనికులతో వెన్నెల కొంచెం కనిపిస్తున్న శరత్కాలగగనం వలె శోభించింది. (47 1/2)
జయాశీర్భిర్ద్విజేంద్రైః స స్తూయమానోఽధిరాజవత్ ॥ 48
గృహ్ణన్నంజలిమాలాశ్చ ధార్తరాష్ట్రో జనాధిపః ।
సుయోధనో యయావగ్రే శ్రియా పరమయా జ్వలన్ ॥ 49
ధృతరాష్ట్రసుతుడైన దుర్యోధనమహారాజు చక్రవర్తి వలె ద్విజశ్రేష్ఠుల జయాశీస్సులనూ, స్తుతులనూ వింటూ జనుల నమస్సులను స్వీకరిస్తూ, పరమశోభతో ప్రకాశిస్తూ, ముందుకు సాగిపోయాడు. (48,49)
కర్ణేన సార్థం రాజేంద్ర సౌబలేన చ దేవినా ।
దుఃశాసనాదయశ్చాస్య భ్రాతరః సర్వ ఏవ తే ॥ 50
భూరిశ్రవాః సోమదత్తః మహారాజశ్చ బాహ్లికః ।
రథైర్నానావిధాకారైః హయైర్గజవరైస్తథా ॥ 51
ప్రయాంతం నృపసింహం తమ్ అనుజగ్ముః కురూద్వహాః ।
కాలేనాల్పేన రాజేంద్ర స్వపురం వివిశుస్తదా ॥ 52
రాజేంద్రా! కర్ణుడు, జూదగాడైన శకుని, దుశ్శాసనాది
సమస్త సోదరులు, భూరిశ్రవుడు, సోమదత్తుడు, మహారాజైన బాహ్లికుడు - ఈ కురువీరులంతా వివిధాకారాలు గల రథాలపై, గుర్రాలపై, ఏనుగులపై నిలిచి రాజసింహమైన దుర్యోధనుని వెంట వచ్చారు. (50-52)
ఇతి శ్రీమహాభారతే నిర్వన ఘోషయాత్రాపర్వణి దుర్యోధనపురప్రవేశే ద్విపంచాశదధికద్విశతతమోఽధ్యాయః ॥ 252 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున ఘొషయాత్రా పర్వమను ఉపపర్వమున దుర్యోధనపురప్రవేశమను రెండు వందల యేబది రెండవ అధ్యాయము. (252)
(దాక్షిణాత్య అధికపాఠం 1 1/2 శ్లోకంతో కలిపి మొత్తం 53 1/2 శ్లోకాలు.)