250. రెండు వందల ఏబదియవ అధ్యాయము
దుర్యోధనుని ప్రాయోపవేశ విరమణకై విఫలయత్నము.
కర్ణ ఉవాచ
రాజన్నాద్యావగచ్ఛామి తవేహ లఘసత్త్వతామ్ ।
కిమత్ర చిత్రం యద్ వీర మోక్షితః పాండవైరసి ॥ 1
సద్యో వశం సమాపన్నః శత్రూణాం శత్రుకర్శన ।
కర్ణుడిలా అన్నాడు.
'రాజా! నీవింతగా చిన్నబుచ్చుకోవటానికి కారణం నాకర్థం కావటం లేదు. శత్రుసంహారా! వీరా! ఒక్కమారు శత్రువుల వశమై పాండవులచే విడిపించబడ్డావు. దీనిలో మునిగిపోయే దేముంది? (1 1/2)
సేనాజీవైశ్చ కౌరవ్య తథా విషయవాసిభిః ॥ 2
అజ్ఞాతైర్యది వా జ్ఞాతైః కర్తవ్యం నృపతేః ప్రియమ్ ।
కౌరవ్యా! రాజులసేనలో ఉండి బ్రతుకు గడుపుకొనేవారూ, రాజ్యంలోని ప్రజలూ తెలిసి అయినా, తెలియకుండా అయినా రాజుకు ప్రియమైన పనిని చేయవలసినదే! (2 1/2)
ప్రాయః ప్రధానాః పురుషాః క్షోభయంత్యరివాహినీమ్ ॥ 3
నిగృహ్యతే చ యుద్ధేషు మోక్ష్యంతే చైవ సైనికైః ।
సాధారణంగా ప్రధానవీరులు శత్రుసేనలను కలతపెడుతుంటారు. యుద్ధంలో ఒకవేళ వారు పట్టుబడితే సైనికులు విడిపిస్తుంటారు. (3 1/2)
సేనాజీవాశ్చ యే రాజ్ఞాం విషయే సంతి మానవాః ॥ 4
తైః సంగమ్య నృపార్థాయ యతితవ్యం యథాతథమ్ ।
రాజు కొలువులోనివారు, రాజ్యప్రజలు కలిసి రాజు కోసం యథాశక్తి ప్రయత్నం చేస్తూనే ఉండాలి. (4 1/2)
యద్యేవం పాండవైః రాజన్ భవద్విషయవాసిభిః ॥ 5
యదృచ్ఛయా మోక్షితోఽసి తత్ర కా పరిదేవనా ।
రాజా! ఆ నీతితో నీ రాజ్యంలో ఉన్న పాండవులు దైవికంగా నిన్ను విడిపించారు. దీనిలో బాధపడవలసిన దేముంది? (5 1/2)
న చైతత్ సాధు యద్ రాజన్ పాండవాస్త్వాం నృపోత్తమమ్ ॥ 6
స్వసేనయా సంప్రయాంతం నానుయాంతి స్మ పృష్ఠతః ।
రాజా! నీవు నీ సేనలతో బయలుదేరినపుడు పాండవులు కూడా నృపశ్రేష్ఠుడవైన నిన్ను అనుసరించి ఉండవలసినది. వాళ్ళు అలా చేయలేదు. అదేమంత బాగాలేదు. (6 1/2)
శూరాశ్చ బలవంతశ్చ సంయుగేష్వపలాయినః ॥ 7
భవతస్తే సహాయా వై ప్రేష్యతాం పూర్వమాగతాః ।
పాండవులు శూరులు, బలవంతులు, యుద్ధంలో వెనుకంజవేయనివారు. అంతకుముందే వారు నీకు దాసులై ఉన్నారు. కాబట్టి నీకు సహకరించి తీరాలి. (7 1/2)
పాండవేయాని రత్నాని త్వమద్యాప్యుపభుంజసే ॥ 8
సత్త్వస్థాన్ పాండవాన్ పశ్య న తే ప్రాయముపావిశన్ ।
(తదలం తే మహాబాహో విషాదం కర్తుమీదృశమ్ ।)
ఉత్తిష్ఠ రాజన్ భద్రం తే న చిరం కర్తుమర్హసి ॥ 9
పాండవుల రత్నాల నన్నింటినీ ఇప్పటికీ నీవే అనుభవిస్తున్నావు. అంతమాత్రాన వారు ప్రాయోపవేశం చేయలేదు చూడు. ఇప్పటికీ స్థిరంగానే ఉన్నారు. కాబట్టి మహాబాహూ! నీవు ఈ విధంగా దుఃఖించనవసరం లేదు. రాజా! లే! నీకు మేలే జరుగుతుంది. ఇంకా జాగుచేయదగదు. (8,9)
అవశ్యమేవ నృపతే రాజ్ఞో విషయవాసిభిః ।
ప్రియాణ్యాచరితవ్యాని తత్ర కా పరిదేవనా ॥ 10
మద్వాక్యమేతద్ రాజేంద్ర యద్యేవం న కరిష్యసి ।
స్థాన్యామీహ భవత్పాదౌ శుశ్రూషన్నరిమర్దన ॥ 11
అరిమర్దనా! రాజేంద్రా! ఈ నా మాటను మన్నించకపోతే నీ పాదసేవ చేస్తూ ఇక్కడే నిలిచిపోతాను. (11)
నోత్సహే జీవితుమహం త్వద్విహీనో నరర్షభ ।
ప్రాయోపవిష్టస్తు నృప రాజ్ఞాం హాస్యో భవిష్యసి ॥ 12
నరోత్తమా! రాజా! నీవు లేకుండా నేను బ్రతకాలనుకోవటం లేదు. ఇలా ప్రాయోపవేశం చేస్తే రాజులు నవ్వుకొంటారు.' (12)
వైశంపాయన ఉవాచ
ఏవముక్తస్తు కర్ణేన రాజా దుర్యోధనస్తదా ।
నైవోత్థాతుం మనశ్చక్రే స్వర్గాయ కృతనిశ్చయః ॥ 13
వైశంపాయనుడిలా అన్నాడు.
కర్ణుడు ఆ రీతిగా పలికినా దుర్యోధన నరపతి లేవటానికి మనసు పడలేదు. స్వర్గానికి వెళ్ళటానికే నిశ్చయించుకొన్నాడు. (13)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి ఘోషయాత్రాపర్వణి దుర్యోధనప్రాయోపవేశే కర్ణవాక్యే పంచాశదధికద్విశతతమోఽధ్యాయః ॥ 250 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున ఘోషయాత్రా పర్వమను ఉపపర్వమున దుర్యోధనప్రాయోపవేశమను రెండు వందల యేబదియవ అధ్యాయము. (250)
(దాక్షిణాత్య అధికపాఠం 1/2 శ్లోకంతో కలిపి మొత్తం 1 1/2 శ్లోకాలు.)