249. రెండువందల నలువది తొమ్మిదవ అధ్యాయము
దుర్యోధన ప్రాయోపవేశము.
దుర్యోధన ఉవాచ
చిత్రసేనం సమాగమ్య ప్రహసన్నర్జునస్తదా ।
ఇదం వచనమక్లీబమ్ అబ్రవీత్ పరవీరహా ॥ 1
దుర్యోధనుడిలా అన్నాడు.
అప్పుడు శత్రుసంహారకుడైన అర్జునుడు చిత్రసేనుని సమీపించి, నవ్వుతూ ఇలా గంభీరంగా పలికాడు. (1)
భ్రాతౄనర్హసి మే వీర మోక్తుం గంధర్వసత్తమ ।
అనర్హధర్షణా హీమే జీవమానేషు పాండుషు ॥ 2
గంధర్వశ్రేష్ఠా! వీరా! ఈ మా సోదరులను విడిపించాలి. పాండవులు బ్రతికి ఉండగా వీరిని పరాభవించటం తగదు. (2)
ఏవముక్తస్తు గంధర్వః పాండవేన మహాత్మనా ।
ఉవాచ యత్ కర్ణ వయం మంత్రయంతో వినిర్గతాః ॥ 3
ద్రష్ఠారః స్మ సుఖాద్ధీనాన్ సదారాన్ పాండవానితి ।
కర్ణా! మహాత్ముడైన అర్జునుడు అలా అనగానే చిత్రసేనుడు మన ఘోషయాత్రలోని మంత్రాంగాన్ని చెప్పేశాడు. సుఖహీనులై ఉన్న ద్రౌపదిని, పాండవులను చూడటంకోసమే మనం బయలుదేరినట్లు చెప్పేశాడు. ( 1/2)
తస్మిన్నుచ్చార్యమాణే తు గంధర్వేణ వచస్తథా ॥ 4
భూమేర్వివరమన్వైచ్ఛం ప్రవేష్టుం వ్రీడయాన్వితః ।
చిత్రసేనుడు ఆ మాటను చెప్తుండగానే నేను సిగ్గుపడి, భూమిలోనికి కూరుకొని పోవాలనుకొన్నాను. (4 1/2)
యుధిష్ఠిరమథాగమ్య గంధర్వాః సహ పాండవైః ॥ 5
అస్మద్దుర్మంత్రితం బద్ధాంశ్చాస్మాన్ న్యవేదయన్ ।
అప్పుడు గంధర్వులు పాండవులతోపాటు ధర్మరాజు దగ్గరకు వచ్చి, మన దురాలోచనను చెప్పి, బందీలమైన మమ్ము ఆయన కప్పగించారు. (5 1/2)
స్త్రీసమక్షమహం దీనః బద్ధః శత్రువశం గతః ॥ 6
యుధిష్ఠిరస్యోపహృతః కిం ను దుఃఖమతః పరమ్ ।
నేను దీనుడనై, బంధింపబడి, శత్రువుల కధీనుడనై, స్త్రీల సమక్షంలో యుధిష్ఠిరునకు అప్పగించబడ్డాను. ఇంతకన్న బాధాకరమేముంటుంది? (6 1/2)
యే మే నిరాకృతా నిత్యం రిపుర్యేషామహం సదా ॥ 7
తైర్మోక్షితోఽహం దుర్బుద్ధిః దత్తం తైరేవ జీవితమ్ ।
నేను దుర్మతిని. పాండవులనెప్పుడూ తిరస్కరించేవాడిని. వారికి నిత్యశత్రువును. అయితే వారే నన్ను విడిపించారు. వారే నాకు బ్రతుకునిచ్చారు. (7 1/2)
ప్రాప్తః స్యాం యద్యహం వీర వధం తస్మిన్ మహారణే ।
శ్రేయస్తద్ భవితా మహ్యం నైవంభూతస్య జీవితమ్ ।
వీరా! ఆ మహాయుద్ధంలో నేను చచ్చిపోయినా ఇంతకన్నా బాగుండేది. ఈవిధంగా బ్రతకటం నాకు మేలుకాదు. ( 8 1/2)
భవేద్ యశః పృథివ్యాం మే ఖ్యాతం గంధర్వతో వధాత్ ॥ 9
ప్రాప్తాశ్చ పుణ్యలోకాః స్యుః మహేంద్రసదనేఽక్షయాః ।
గంధర్వుల చేత చచ్చి ఉంటే లోకంలో కీర్తి లభించేది. ఇంద్రసన్నిధిలో అక్షయపుణ్యలోకాలను పొందగలిగేవాడిని. (9 1/2)
యత్ త్వద్య మే వ్యవసితం తచ్ఛృణుధ్వం నరర్షభాః ॥ 10
ఇహ ప్రాయముపాసిష్యే యూయం వ్రజత వై గృహాన్ ।
నరశ్రేష్ఠులారా! ఇప్పుడు నా నిర్ణయ మొక్కటే, వినండి. ఇక్కడే ప్రాయోపవేశం చేస్తాను. మీరు ఇంటికి వెళ్ళండి. (10 1/2)
భ్రాతరశ్చైవ మే సర్వే యాంత్వద్య స్వపురం ప్రతి ॥ 11
కర్ణప్రభృతయశ్చైవ సుహృదో బాంధవాశ్చ యే ।
దుఃశాసనం పురస్కృత్య ప్రయాంత్వద్య పురం ప్రతి ॥ 12
నా సోదరులందరూ నగరాన్కి వెళ్ళిపొండి. కర్ణుడు మొదలయిన మిత్రులు, బంధువులు దుశ్శాసనుని నేతృత్వంలో నగరానికి వెళ్ళిపొండి. (11,12)
న హ్యహం సంప్రయాస్యామి పురం శత్రునిరాకృతః ।
శత్రుమానాపహో భూత్వా సుహృదాం మానకృత్ తథా ॥ 13
ఇప్పటివరకు శత్రువులను పరాభవించి, మిత్రులను సత్కరించిన నేను శత్రువుల చేత పరాభవాన్ని పొంది నగరానికి రాలేను. (13)
స సుహృచ్ఛోకదో జాతః శత్రూణాం హర్షవర్ధనః ।
వారణాహ్వయమాసాద్య కిం వక్ష్యామి జనాధిపమ్ ॥ 14
అటువంటి నేను మిత్రులకు శోకాన్నీ, శత్రువులకు హర్షాన్నీ కల్గిస్తూ హస్తినాపురానికి వచ్చి మహారాజుతో ఏం చెప్పగలను? (14)
భీష్మద్రోణౌ కృపద్రౌణీ విదురః సంజయస్తథా ।
బాహ్లీకః సౌమదత్తిశ్చ యే చాన్యే వృద్ధసమ్మతాః ॥ 15
బ్రాహ్మణాః శ్రేణిముఖ్యాశ్చ తథోదాసీనవృత్తయః ।
కిం మాం వక్ష్యంతి కిం చాపి ప్రతిచాక్ష్యమి తానహమ్ ॥ 16
భీష్ముడు, ద్రోణుడు, కృపుడు, అశ్వత్థామ, విదురుడు, సంజయుడు, బాహ్లీకుడు, భూరిశ్రవుడు మొదలయిన పెద్దలు, బ్రాహ్మణులు, ప్రముఖ వైశ్యులు, తటస్థులైన ప్రజలు నాతో ఏమనగలరు? వారికి నేనేం బదులివ్వగలను. (15,16)
రిపూణాం శిరసి స్థిత్వా తథా విక్రమ్య చోరసి ।
ఆత్మదోషాత్ పరిభ్రష్టః కథం వక్ష్యామి తానహమ్ ॥ 17
పరాక్రమతో శత్రువుల మస్తకాలపై, గుండెలపై నిలువగలిగిన నేను స్వయంకృతాపరాధంతో భ్రష్టుడనైనట్లు వారి కెలా చెప్పగలను. (17)
దుర్వినీతాః శ్రియం ప్రాప్య విద్యా మైశ్వర్యమేవ చ ।
తిష్ఠంతి న చిరం భద్రే యథాహం మదగర్వితః ॥ 18
మదగర్వితులయిన నా వంటి దుర్మార్గులు సంపదను, విద్యను, అధికారాన్ని పొంది కూడా చిరకాలం ఆ సుప్రతిష్ఠలో నిలువలేరు. (18)
అహో నార్హమిదం కర్మ కష్టం దుశ్చరితం కృతమ్ ।
స్వయం దుర్బుద్ధినా మోహాద్ యేన ప్రాప్తోఽస్మి సంశయమ్ ॥ 19
అయ్యో! ఆ పని చేయకుండానే ఉండవలసినది. చాలా చెడ్డపని చేశాను. మోహంతో దుర్బుద్ధితో స్వయంగా దీని కుపక్రమించాను. ఇప్పుడు బ్రతుకే సంశయగ్రస్త మయింది. (19)
తస్మాత్ ప్రాయముపాసిష్యే న హి శక్ష్యామి జీవితుమ్ ।
చేతయానో హి కో జీవేత్ కృచ్ర్ఛాచ్ఛత్రుభిరుద్ధృతః ॥ 20
కాబట్టి ప్రాయోపవేశమే చేస్తాను. నేను బ్రతుకలేను. శత్రువులచే కష్టాల నుండి రక్షింపబడినవాడు బుద్ధి ఉన్నవాడయితే బ్రతకాలనుకోడు. (20)
శత్రుభిశ్చావహసితః మానీ పౌరుషవర్జితః ।
పాండవైర్విక్రమాఢ్యైశ్చ సావమానమవేక్షితః ॥ 21
శత్రువులు నన్ను పరిహసించారు. నేను అభిమానవంతుడిని. కానీ ఇప్పుడు పౌరుషహీనుడనయ్యాను. పరాక్రమసంపన్నులైన పాండవులు నన్ను హేళనగా చూశారు. (21)
వైశంపాయన ఉవాచ
ఏవం చింతాపరిగతః దుఃశాసనమథాబ్రవీత్ ।
దుఃశాసన నిబోధేదం వచనం మమ భారత ॥ 22
వైశంపాయనుడిలా అన్నాడు.
ఈరీతిగా చింతించి దుశ్శాసనునితో ఇలా అన్నాడు. భారతా! దుశ్శాసనా! నామాటను అర్థం చేసుకో. (22)
ప్రతీచ్ఛ త్వం మయా దత్తమ్ అభిషేకం నృపో భవ ।
ప్రశాధి పృథివీం స్ఫీతాం కర్ణసౌబలపాలితామ్ ॥ 23
నేను నిన్ను అభిషేకిస్తున్నాను. అంగీకరించు. రాజువు కమ్ము. కర్ణశకునుల సహకారంతో ఈ విశాల రాజ్యాన్ని పరిపాలించు. (23)
భ్రాతౄన్ పాలయ విస్రబ్ధం మరుతో వృత్రహా యథా ।
బాంధవాశ్చోపజీవంతు దేవా ఇవ శతక్రతుమ్ ॥ 24
దేవతలను దేవేంద్రుడు పరిపాలించినట్లు నీ సోదరులను నమ్మకంగా పరిపాలించు. దేవేంద్రుని ఆశ్రయించి దేవతలు జీవించినట్లు నీ ఆశ్రయంలో బాంధవులను జీవించనీ. (24)
బ్రాహ్మణేషు సదా వృత్తిం కుర్వీథాశ్చాప్రమాదతః ।
బంధూనాం సుహృదాం చైవ భవేథాస్త్వం గతిః సదా ॥ 25
ఏమరుపాటు లేకుండా బ్రాహ్మణులకు జీవికను ఏర్పాటుచేయి. బంధువులకు, మిత్రులకు ఎప్పుడూ నీవే ఆశ్రయంగా నిలు. (25)
జ్ఞాతీంశ్చాప్యనుపశ్యేథాః విష్ణుర్దేవగణాన్ యథా ।
గురవః పాలనీయాస్తే గచ్ఛ పాలయ మేదినీమ్ ॥ 26
నందయన్ సుహృదః సర్వాన్ శాత్రవాంశ్చావభర్త్సయన్ ।
కంఠే చైనం పరిష్వజ్య గమ్యతామిత్యువాచ హ ॥ 27
విష్ణువు దేవగణాలను రక్షించినట్లు జ్ఞాతులను జాగ్రత్తగా చూచుకో. గురువులను కాపాడు. మిత్రులను ఆనందింపజేస్తూ, సర్వశత్రువులను అణచివేస్తూ రాజ్యపాలన చేయి. ఇలా పలికి దుశ్శాసననుని కంఠాన్ని కౌగిలించుకొని 'ఇకవెళ్ళు' అన్నాడు. (26,27)
తస్య తద్ వచనం శ్రుత్వా దీనో దుఃశాసనోఽబ్రవీత్ ।
అశ్రుకంఠః సుదుఃఖార్తః ప్రాంజలిః ప్రణిపత్య చ ॥ 28
సగద్గదమిదం వాక్యం భ్రాతరం జ్యేష్ఠమాత్మనః ।
ప్రసీదేత్యపతద్ భూమౌ దూయమానేన చేతసా ॥ 29
దుఃఖితః పాదయోస్తస్య నేత్రజం జలముత్సృజన్ ।
ఉక్తవాంశ్చ నరవ్యాఘ్రః నైతదేవం భవిష్యతి ॥ 30
సుయోధనుని మాటను విని దుశ్శాసనుడు దీనుడై, దుః ఖితుడై, చేతులు జోడించి, నమస్కరించి కన్నీరు కంఠాన్ని చేరగా బొంగురు పోయిన గొంతుతో, కలతపడిన మనస్సుతో తన అన్నతో "ప్రసన్నుడవు క"మ్మని పలికి నేలపై పడిపోయాడు.
బాధపడుతూ తన కన్నీటిని ఆయన పాదాలపై విడుస్తూ నరశ్రేష్ఠుడైన దుశ్శాసనుడు "ఇది ఇలా జరగదు" అని అన్నాడు. (28-30)
విదీర్యేత్ సకలా భూమిః ద్యోశ్చాపి శకలీభవేత్ ।
రవిరాత్మప్రభాం జహ్యాత్ సోమః శీతాంశుతాం త్యజేత్ ॥ 31
వాయుః శైఘ్య్రమథో జహ్యాత్ హిమవాంశ్చ పరివ్రజేత్ ।
శుష్యేత్ తోయం సముద్రేషు వహ్నిరప్యుష్ణతాం త్యజేత్ ॥ 32
న చాహం త్వదృతే రాజన్ ప్రశాసేయం వసుంధరామ్ ।
పునః పునః ప్రసీదేతి వాక్యం చేదమువాచ హ ॥ 33
సమస్తభూమి బ్రద్దలయినా, ఆకాశం ముక్కలయినా, సూర్యుడు తేజస్సును వీడినా, చంద్రుడు శీతకిరణత్వాన్ని వదలినా, గాలి వేగాన్ని విడనాడినా, హిమాలయం చలించినా, సముద్రజలం ఎండి పోయినా, అగ్ని వెచ్చదనాన్ని పరిత్యజించినా నీవు లేని రాజ్యాన్ని నేను పరిపాలించలేను. 'రాజా! ప్రసన్నుడవు' కమ్మని మాటిమాటికి అనునయించి ఇలా అన్నాడు. (31-33)
త్వమేవ నః కులే రాజా భవిష్యసి శతం సమాః ।
ఏవముక్త్వా స రాజానం సుస్వరం ప్రరురోద హ ॥ 34
పాదౌ సంస్పృశ్య మానార్హౌ భ్రాతుర్జ్యేష్ఠస్య భారత ।
"మనవంశంలో నూరేళ్ళూ నీవే రాజువు కావాలి" - "భారతా! ఆ రీతిగా పలికి దుశ్శాసనుడు పూజార్హాలయిన అన్నపాదాలను స్పృశించి వెక్కి వెక్కి ఏడువసాగాడు. (34 1/2)
తథా తౌ దుఃఖితౌ దృష్ట్వా దుఃశాసనసుయోధనౌ ॥ 35
అధిగమ్య వ్యథావిష్టః కర్ణస్తౌ ప్రత్యభాషత ।
ఆ రీతిగా దుఃఖపడుతున్న దుశ్శాసనసుయోధనులను చూసి, కలతపడి, కర్ణుడు వారి దగ్గరకు వచ్చి ఇలా అన్నాడు. (35 1/2)
విషీదథః కిం కౌరవ్యౌ బాలిశ్యాత్ ప్రాకృతావివ ॥ 36
న శోకః శోచమానస్య వినివర్తేత కర్హిచిత్ ।
'కౌరవ్యులారా! అజ్ఞానంతో అనాగరికులవలె బాధపడుతారెందుకు? ఏడ్చినంతమాత్రాన బాధలు తొలగిపోవు. (36 1/2)
యదా చ శోచతః శోకః వ్యసనం నాపకర్షతి ॥ 37
సామర్థ్యం కిం తతః శోకే శోచమానౌ ప్రపశ్యథః ।
ధృతిం గృహ్ణీత మా శత్రూన్ శోచంతౌ నందయిష్యథః ॥ 38
ఏడుస్తున్న వాడి ఏడుపు ఇబ్బందులను తొలగించలేకపోతే ఎందుకది? మీరిద్దరూ ఏడుస్తూ కనిపిస్తున్నారు. ధైర్యంగా ఉండండి. ఏడ్చి, శత్రువులను సంతోషపెట్టకండి. (37,38)
కర్తవ్యం హి కృతం రాజన్ పాండవైస్తవ మోక్షణమ్ ।
నిత్యమేవ ప్రియం కార్యం రాజ్ఞో విషయవాసిభిః ॥ 39
రాజా! పాండవులు నిన్ను విడిపించటం వారి కర్తవ్యం. అది చేశారు. రాజ్యంలోని ప్రజలు ఎప్పుడూ రాజు కిష్టమయిన పనిని చేయాలి. (39)
పాల్యమానాస్త్వయా తే హి నివసంతి గతజ్వరాః ।
నార్హస్యేవంగతే మన్యుం కర్తుం ప్రాకృతవద్ యథా ॥ 40
వారు నీపాలనలో ఉండి గదా నిశ్చింతగా జీవిస్తున్నారు. ఈ స్థితిలో నీవు సాధరణ వ్యక్తి వలె దుఃఖింపతగదు. (40)
విషణ్ణాస్తవ సోదర్యాః త్వయి ప్రాయం సమాస్థితే ।
(తదలం దుఃఖితానేతాన్ కర్తుం సర్వాన్ నరాధిప ॥)
ఉత్తిష్ఠ వ్రజ భద్రం తే సమాశ్వాసయ సోదరాన్ ॥ 41
రాజా! నీవు ప్రాయోపవేశానికి సిద్ధపడితే చూడు నీ సోదరులంతా విషణ్ణలై ఉన్నారు. వీళ్ళనందరినీ కష్టపెట్టి ఏం లాభం? లేచి పద! అంతా మంచే జరుగుతుంది. తమ్ముళ్ళను ఓదార్చు. (41)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి ఘోషయాత్రాపర్వణి దుర్యోధన ప్రాయోపవేశే ఏకోనపంచాశదధికశతతమోఽధ్యాయః ॥ 249 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున ఘోషయాత్రా పర్వమను ఉపపర్వమున దుర్యోధనప్రాయోపవేశమను రెండు వందల నలువది తొమ్మిదవ అధ్యాయము. (249)
(దాక్షిణాత్య అధికపాఠం 1/2 శ్లోకంతో కలిపి మొత్తం 41 1/2 శ్లోకాలు.)