237. రెండువందల ముప్పది ఏడవ అధ్యాయము
పాండవుల దగ్గరకు వెళ్లుమని కర్ణశకునులు దుర్యోధనుని ప్రోత్సహించుట.
వైశంపాయన ఉవాచ
ధృతరాష్ట్రస్య తద్ వాక్యం నిశమ్య శకునిస్తదా ।
దుర్యోధనమిదం కాలే కర్ణేన సహితోఽబ్రవీత్ ॥ 1
వైశంపాయనుడిలా అన్నాడు.
ధృతరాష్ట్రుని ఆ మాటలను విని, కర్ణునితో కూడి అదను చూసి, దుర్యోధనుడితో ఇలా అన్నాడు. (1)
ప్రవ్రాజ్య పాండవాన్ వీరాన్ స్వేన వీర్యేణ భారత ।
భుంక్ష్వేమాం పృథివీమేకః దివి శంబరహా యథా ॥ 2
భారతా! నీవు నీ పరాక్రమంతో వీరపాండవులను వెడలగొట్టావు. ఇప్పుడు స్వర్గలోకంలో ఇంద్రునివలె నీవు ఒక్కడవే ఈ రాజ్యాన్ని అనుభవించు. (2)
(తవాద్య పృథివీ రాజన్ అఖిలా సాగరాంబరా ।
సపర్వతవనారామా సహ స్థావరజంగమా ॥)
రాజా! పర్వతాలు, అరణ్యాలు, తోటలు, స్థావరజంగమప్రాణులు - వీటితో కూడిన, సముద్రపర్యంతమైన ఈ భూమి నేడు నీ అధీనంలో ఉన్నది.
ప్రాచ్యాశ్చ దాక్షిణాత్యాశ్చ ప్రతీచ్యోదీచ్యవాసినః ।
కృతాః కరప్రదాః సర్వే రాజానస్తే నరాధిప ॥ 3
రాజా! తూర్పు, దక్షిణం, పడమర, ఉత్తరం - ఈ దిక్కులలో రాజ్యా లేలుతున్న రాజులంతా ఇప్పుడు నీకు కప్పం కడుతున్నారు. (3)
యా హి సా దీప్యమానేవ పాండవానభజత్ పురా ।
సాద్య లక్ష్మీస్త్వయా రాజన్ అవాప్తా భ్రాతృభిః సహ ॥ 4
రాజా! గతంలో కళాకాంతులతో పాండవులను సేవించిన లక్ష్మి నేడు ధర్మజుని సోదరులతో సహా నీకు వశ మయింది. (4)
ఇంద్రప్రస్థగతే యాం తాం దీప్యమానాం యుధిష్ఠిరే ।
అపశ్యామ శ్రియం రాజన్ దృశ్యతే సా తవాద్య వై ॥ 5
రాజా! ఇంద్రప్రస్థానికి వెళ్లినపుడు యుధిష్ఠిరుని సన్నిధిలో వెలుగుతున్న ఏ రాజశ్రీని చూశామో అది నేడు నీదగ్గర ప్రకాశిస్తుంటే చూస్తున్నాం. (5)
శత్రవస్తవ రాజేంద్ర న చిరం శోకకర్శితాః ।
సా తు బుద్ధిబలేనేయం రాజ్ఞస్తస్మాద్ యుధిష్ఠిరాత్ ॥ 6
త్వయాఽఽక్షిప్తా మహాబాహో దీప్యమానేవ దృశ్యతే ।
రాజేంద్రా! నీ దాయాదులు అప్పుడే శోకంతో కృశించిపోయారు. మహాబాహూ! ఈ రాజ్యలక్ష్మిని నీవు యుధిష్ఠిరరాజు నుండి బుద్ధిబలంతో లాగుకొన్నావు. అందువల్ల ఇప్పుడది నీ దగ్గర వెలుగుతోంది. (6 1/2)
తథైవ తవ రాజేంద్ర రాజానః పరవీరహన్ ॥ 7
శాసనేఽధిష్ఠితాః సర్వే కిం కుర్మ ఇతి వాదినః ।
శత్రుసంహారా! రాజేంద్రా! అట్లే రాజులందరూ "ఏం చేయమంటారు" అంటూ నీ ఏలుబడిలో నీ కధీనులై ఉన్నారు. (7 1/2)
తవేయం పృథివీ రాజన్ నిఖిలా సాగరాంబరా ॥ 8
సపర్వతవనా దేవీ సగ్రామనగరాకరా ।
నానావవోద్దేశవతీ పర్వతైరుపశోభితా ॥ 9
రాజా! రకరకాల తోటలతో, పర్వతాలతో శోభిస్తూ సముద్రవసన అయిన భూదేవి ఇప్పుడు పర్వతాలతో, వనాలతో, గ్రామాలతో, నగరాలతో, కందకాలతో సహా నీ అదుపులోనికి వచ్చి ఉన్నది. (8,9)
(నానాధ్వజపతాకాంకా స్ఫీతరాష్ట్రా మహాబలా।)
వివిధధ్వజపతాకాలు చిహ్నాలుగా గలిగి సమృద్ధిగా ఉన్న ఈ రాష్ట్రంలో విశాలసేన వ్యవస్థీకృతమై ఉన్నది.
వంద్యమానో ద్విజై రాజన్ పూజ్యమానశ్చ రాజభిః ।
పౌరుషాద్ దివి దేవేషు భ్రాజసే రశ్మివానివ ॥ 10
రాజా! నీవు నీ పౌరుషం ద్వారా ద్విజులచే సత్కరింపబడుతూ, రాజులచే పూజింపబడుతూ స్వర్గంలో దేవతలలో సూర్యునివలె ప్రకాశిస్తున్నావు. (10)
రుద్రైరివ యమో రాజా మరుద్భిరివ వాసవః ।
కురుభిస్త్వం వృతో రాజన్ భాసి నక్షత్రరాడివ ॥ 11
రాజా! రుద్రులలో యమునివలె, దేవతలలో ఇంద్రునివలె, నక్షత్రాలలో చంద్రునివలె నీవు కౌరవుల మధ్య ప్రకాశిస్తున్నావుడ్. (11)
యైః స్మ తే నాద్రియేతాజ్ఞా న చ యే శాసనే స్థితాః ।
పశ్యామస్తాన్ శ్రియా హీనాన్ పాండవాన్ వనవాసినః ॥ 12
నీ ఆదేశాలను లెక్కచేయకుండా, నీ అదుపులో లేకుండా ప్రవర్తించిన పాండవుల పరిస్థితిని చూస్తూనే ఉన్నాం. వారు రాజ్యలక్ష్మిని కోల్పోయి వనవాసం చేస్తున్నారు. (12)
శ్రూయతే హి మహారాజ సరో ద్వైతవనం ప్రతి ।
వసంతః పాండవాః సార్ధం బ్రాహ్మణైర్వనవాసిభిః ॥ 13
మహారాజా! పాండవులు ద్వైతవనంలో, సరోవర తీరంలో, వనవాసులైన బ్రాహ్మణులతో కలిసి జీవిస్తున్నారని వింటున్నాం. (13)
స ప్రయాహి మహారాజ శ్రియా పరమయా యుతః ।
తాపయన్ పాండుపుత్రాంస్త్వం రశ్మివానివ తేజసా ॥ 14
కాబట్టి మహారాజా! పరమశోభాయుతుడవై కిరణాలతో సూర్యుడు జగత్తును తపింపజేసినట్లు పాండుపుత్రులను తపింపజేస్తూ అక్కడకు వెళ్ళు. (14)
స్థితో రాజ్యే చ్యుతాన్ రాజ్యాత్ శ్రియా హీనాన్ శ్రియా వృతః ।
అసమృద్ధాన్ సమృద్ధార్థః పశ్య పాండుసుతాన్ నృప ॥ 15
రాజా! నీవు రాజ్యాధికారంలో ఉన్నావు. వారు రాజ్యభ్రష్టులు. నీవు సంపన్నుడవు. వారు శ్రీవిహీనులు. నీవు ధనవంతుడవు. వారు ధనహీనులు. ఈ స్థితిలో వెళ్ళి వారిని చూడు. (15)
మహాభిజనసంపన్నం భద్రే మహతి సంస్థితమ్ ।
పాండవాస్త్వాభివీక్షంతాం యయాతిమివ నాహుషమ్ ॥ 16
గొప్పవంశంలో పుట్టి, ఎన్నో శుభాలతో వెలుగొందుతున్న నిన్ను నహుషనందనుడైన యయాతినిగా పాండవులు చూడగలరు. (16)
యాం శ్రియం సుహృదశ్చైవ దుర్హృదశ్చ విశాంపతే ।
పశ్యంతి పురుషే దీప్తా సా సమర్థా భవత్యుత ॥ 17
రాజా! పురుషనియందున్న సంపదను అతని మిత్రులు, శత్రువులు కూడా చూచినప్పుడే ఆ సంపద సమర్థమవుతుంది. (17)
సమస్థో విషమస్థాన్ హి దుర్హృదో యోఽభివీక్షతే ।
జగతీస్థానివాద్రిస్థః కిమతః పరమం సుఖమ్ ॥ 18
కొండపై నున్నవాడు నేలపై నున్న వారిని తక్కువగా చూచినట్టు, సుఖాలతో నున్నవాడు కష్టాలలో ఉన్న శత్రువులను చూస్తుంటే అంతకన్న గొప్ప సుఖ మేముంటుంది? (18)
న పుత్రధనలాభేన న రాజ్యేవాపి విందతి ।
ప్రీతిం నృపతిశార్దూల యామమిత్రాఘదర్శనాత్ ॥ 19
కిం ను తస్య సుఖం న స్యాద్ ఆశ్రమే యో ధనంజయమ్ ।
అభివీక్షేత సిద్ధార్థః వల్కలాజినవాససమ్ ॥ 20
రాజశ్రేష్ఠా! శత్రువుల దుఃస్థితిని చూస్తుంటే కలిగే ఆనందం పుత్రలాభం వలన కానీ, ధనలాభం వలన కానీ, రాజ్యలాబం వలన కానీ కలగదు.
మనలో ఎవడో ఒకడు సిద్ధమనోరథుడై నారచీరలను, మృగచర్మాన్ని ధరించిన అర్జునుని చూడగలిగితే అతని ఆనందం ఎంతని చెప్పగలం? (19,20)
సువాససో హి తే భార్యాః వల్కలాజినసంవృతామ్ ।
పశ్యంతు దుఃఖితాం కృష్ణాం సా చ నిర్విద్యతాం పునః ॥ 21
మంచి మంచి చీరలు ధరించిన నీ రాణులు నారచీరలను, మృగచర్మాలను ధరించి బాధలు పడుతున్న ద్రౌపదిని చూడాలి. ఆమె కూడా వారిని చూచి మరలా బాధపడాలి. (21)
వినిందతాం తథాఽఽత్మానం జీవితం చ ధనచ్యుతమ్ ।
న తథా హి సభామధ్యే తస్యా భవితుమర్హతి ।
వైమనస్యం యథా దృష్ట్వా తవ భార్యాః స్వలంకృతాః ॥ 22
ధనాన్ని కోల్పోయిన తనజీవితాన్ని పదేపదే నిందించుకోవాలి. చక్కగా అలంకరించుకొనిన నీ రాణులను చూస్తే ఆమెలో కలిగే బాధ నాటి కొలువుకూటంలోని బాధకన్న ఎక్కువ కావాలి. (22)
వైశంపాయన ఉవాచ
ఏవముక్త్వా తు రాజానం కర్ణః శకునివా సహ ।
తూష్ణీం బభూవతురుభౌ వాక్యాంతే జనమేజయ ॥ 23
వైశంపాయనుడిలా అన్నాడు. జనమేజయా! కర్ణుడూ, శకునీ కలిసి దుర్యోధనునితో ఆరీతిగా పలికి మౌనాన్ని వహించారు. (23)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి ఘోషయాత్రాపర్వణి కర్ణశకునివాక్యే సప్తత్రింశదధికశతతమోఽధ్యాయః ॥ 237 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున ఘోషయాత్రాపర్వమను ఉపపర్వమున కర్ణశకునివాక్యమను రెండు వందల ముప్పది యేడవ అధ్యాయము. (237)
(దాక్షిణాత్య అధికపాఠం 1 1/2 శ్లోకంతో కలిపి మొత్తం 24 1/2 శ్లోకాలు.)