236. రెండువందల ముప్పది ఆరవ అధ్యాయము

(ఘోషయాత్రా పర్వము)

పాండవులను గురించి విని ధృతరాష్ట్రుడు చింతించుట.

జనమేజయ ఉవాచ
ఏవం వనే వర్తమానా నరాగ్ర్యాః
శీతోష్ణవాతాతపకర్శితాంగాః ।
సరస్తదాసాద్య వనం చ పుణ్యం
తతః పరం కిమకుర్వంత పార్థాః ॥ 1
జనమేజయుడిలా అన్నాడు.
ఈ రీతిగా వనంలో సంచరిస్తూ చలి, వేడి, గాలి, ఎండలకు కృశించిన ఆ నరోత్తములైన పాండవులు ద్వైతవనంలోని ఆ పవిత్రసరస్సు దగ్గరకు చేరి ఏం చేశారు? (1)
వైశంపాయన ఉవాచ
సరస్తదాసాద్య తు పాండుపుత్రాః
జనం సముత్సృజ్య విధాయ వేశమ్ ।
వనాని రమ్యాణ్యథ పర్వతాంశ్చ
నదీప్రదేశాంశ్చ తదా విచేరుః ॥ 2
వైశంపాయనుడిలా అన్నాడు.
ఆ సరస్సు దగ్గరకు చేరిన పాండుసుతులు జనాన్ని వీడి, కుటీరం నిర్మించుకొని రమ్యవనాలలో, పర్వతాలలో నదీప్రవేశాల్లో సంచరించసాగారు. (2)
తథా వనే తాన్ వసతః ప్రవీరాన్
స్వాధ్యాయవంతశ్చ తపోధనాశ్చ ।
అభ్యాయయుర్వేదవిదః పురాణాః
తాన్ పూజయామాసురథో నరాగ్ర్యాః ॥ 3
ఆ ఈతిగా వనంలో సంచరిస్తున్న ఆ వీరుల దగ్గరకు స్వాధ్యాయతత్పరులు, తపోధనులు, వేదవేత్తలు అయిన ప్రాచీనమునులు వచ్చారు. ఆ నరోత్తములు వారిని పూజించారు. (3)
తతః కదాచిత్ కుశలః కథాసు
విప్రోఽభ్యగచ్ఛద్ భువి కౌరవేయాన్ ।
స తైః సమేత్యాథ యదృచ్ఛయైవ
వైచిత్రవీర్యం నృపమభ్యగచ్ఛత్ ॥ 4
ఆపై ఒకప్పుడు కథాప్రసంగాలలో నేర్పు గల ఒక విప్రుడు పాండవుల దగ్గరకు వచ్చాడు. వారితో కలిసి సంచరిస్తూ ఆ విప్రుడు అనుకోకుండా ధృతరాష్ట్రుని దగ్గరకు వెళ్ళాడు. (4)
అథోపవిష్టః ప్రతిసత్కృతశ్చ
వృద్ధేన రాజ్ఞా కురుసత్తమేన ।
ప్రచోదితః సంకథయాంబభూవ
ధర్మానిలేంద్రప్రభవాన్ యమౌ చ ॥ 5
కురువంశశ్రేష్ఠుడూ, వృద్ధుడూ అయిన ధృతరాష్ట్రునిచే సత్కరింపబడి, ఆసీనుడై ఆ విప్రుడు ధృతరాష్ట్రుని ప్రేరణచే పంచపాండవులను గురించి చెప్పసాగాడు. (5)
కృశాంశ్చ వాతాతపకర్శితాంగాన్
దుఃఖస్య చోగ్రస్య ముఖే ప్రపన్నాన్ ।
తాం చాప్యనాథామివ వీరనాథాం
కృష్ణాం పరిక్లేశగుణేన యుక్తామ్ ॥ 6
గాలికీ ఎండకూ కృశించి, తీవ్రదుఃఖాన్ని ముఖాన నింపుకొన్న పాండవులను గూర్చి, వీరపత్ని అయి కూడా అనాథవలె కష్టాలనుభవిస్తున్న ద్రౌపదిని గూర్చి చెప్పాడు. (6)
తతః కథాస్తస్య నిశమ్య రాజా
వైచిత్రవీర్యః కృపయాభితప్తః ।
వనే తథా పార్థివపుత్రపౌత్రాన్
శ్రుత్వా తథా దుఃఖనదీం ప్రపన్నాన్ ॥ 7
ప్రోవాచ దైన్యాభిహతాంతరాత్మా
నిఃశ్వాసవాతోపహతస్తదానీమ్ ।
వాచం కథంచిత్ స్థిరతాముపేత్య
తత్ సర్వమాత్మప్రభవం విచింత్య ॥ 8
అప్పుడు పాండవుల వృత్తాంతాన్ని విన్న ధృతరాష్ట్రుడు జాలితో తపించాడు. రాజుకొడుకులు, మనవళ్ళు అయి కూడా అరణ్యంలో దుఃఖనదిలో మునిగిపోయిన పాండవులను గూర్చి విన్న ధృతరాష్ట్రుని మనసు కరుణతో నిండిపోయింది. దీర్ఘనిశ్శ్వాసాలు విడుస్తూ, ఎట్టకేలకు కుదుటపడి, అదంతా తనవల్లనే జరిగిందని భావించి ఇలా అన్నాడు. (7,8)
కథం ను సత్యః శుచిరార్యవృత్తో
జ్యేష్ఠః సుతానాం మమ ధర్మరాజః ।
అజాతశత్రుః పృథివీతలే స్మ
శేతే పురా రాంకవకూటశాయీ ॥ 9
ధర్మరాజు సత్యవాది, పవిత్రుడు, పెద్దరికంతో ప్రవర్తించేవాడు. నాకొడుకులలో పెద్దవాడు. అజాతశత్రువు. ఉన్నిపరువులపై గతంలో శయనించిన అతడు ఇప్పుడు నేలపై ఎలా పడుకొంటున్నాడు? (9)
ప్రబోధ్యతే మాగధసూతపూగైః
నిత్యం స్తువద్భిః స్వయమింద్రకల్పః ।
పతత్ర్తిసంఘైః స జఘన్యరాత్రే
ప్రబోధ్యతే నూనమిడాతలస్థః ॥ 10
తాను ఇంద్రునితో సమానుడు. నిత్యమూ మాగధసూతుల స్తోత్రపాఠాలతో నిదురలేచేవాడు. ఇప్పుడు నేలపై పరుండి వేకువజామున పక్షుల కిలకిలారావాలతో నిదురలేస్తున్నాడు. (10)
కథం ను వాతాతపకర్శితాంగః
వృకోదరః కోపపరిప్లుతాంగః ।
శేతే పృథివ్యామతథోచితాంగః
కృష్ణాసమక్షం వసుధాతలస్థః ॥ 11
వృకోదరుడు గాలి, ఎండల తాకున కృశించి ఉంటాడు. శరీరాంగాలన్నింటా కోపం నిండి ఉంటుంది. అటువంటివాడు ద్రౌపది సమక్షంలో నేలపై ఎలా శయనిస్తున్నాడు? ఆ శరీరళ్ ఆ కష్టాలకు తగదు. (11)
తథార్జునః సుకుమారో మనస్వీ
వశే స్థితో ధర్మసుతస్య రాజ్ఞః ।
విదూయమానైరివ సర్వగాత్రైః
ధ్రువం న శేతే వసతీరమర్షాత్ ॥ 12
అలాగే అర్జునుడు అభిమానవంతుడు, సుకుమారుడు. ధర్మజుని అదుపులో ఉండేవాడు. అమర్షంతో శరీరమంతా బాధ నిండి ఉంటుంది. అటువంటి అర్జునునికి కుటీరంలో నిద్ర పట్టదనుకొంటాను. (12)
యమౌ చ కృష్ణాం చ యుధిష్ఠిరం చ
భీమం చ దృష్ట్వా సుఖవిప్రయుక్తమ్ ।
వినిఃశ్వసన్ సర్ప ఇవోగ్రతేజాః
ధ్రువం న శేతే వసతీరమర్షాత్ ॥ 13
అర్జునుడు ఉగ్రతేజస్సు గలవాడు. సుఖానికి దూరమయిన నకుల సహదేవులను, ద్రౌపదిని, ధర్మరాజును, భీముని చూసి పామువలె బుసకొడుతూ అసహనంతో నిద్రకు దూరమై ఉంటాడనుకొంటాను. (13)
తథా యమౌ చాప్యసుఖౌ సుఖార్హౌ
సమృద్ధరూపావమరౌ దివీవ ।
ప్రజాగరస్థౌ ధ్రువమప్రశాంతౌ
ధర్మేన సత్యేన చ వార్యమాణౌ ॥ 14
నకులసహదేవులు కూడా సుఖాల ననుభవించవలసినవారే. అశ్వినీదేవతల వంటి చక్కని రూపంగలవారు. వారికి కూడా అశాంతితో నిదురపట్టదనే భావిస్తున్నాను. ధర్మసత్యాలే వారిని నిరోధిస్తున్నాయి. (14)
సమీరణేనాథ సమో బలేన
సమీరణస్యైవ సుతో బలీయాన్ ।
స ధర్మపాశేన సితోఽగ్రజేన
ధ్రువం వినిఃశ్వస్య సహత్యమర్షమ్ ॥ 15
వాయుసుతుడు భీముడు బలవంతుడు. బలంలో వాయువుతో సమానుడు. అన్నకారణంగా ధర్మపాశబద్ధుడు. అందువలననే నిట్టూర్పులు విడుస్తూ, క్రోధాన్ని భరిస్తుంటాడనుకొంటాను. (15)
స చాపి భూమౌ పరివర్తమానో
వధం సుతానాం మమ కాంక్షమాణః ।
సత్యేన ధర్మేణ చ వార్యమాణః
కాలం ప్రతీక్షత్యధికో రణేఽన్యైః ॥ 16
ఆ భీముడు కూడా నా కుమారులను చంపాలని కోరుతూ శయ్యపై అటు ఇటు పొర్లుతుంటాడు. సత్యం, ధర్మం అతనిని ఆపుతున్నాయి. యుద్ధభూమిలో అందరినీ మించగలవాడు. కానీ కాలానికై ఎదురుచూస్తున్నాడు. (16)
అజాతశత్రౌ తు జితే నికృత్యా
దుఃశాసనో యత్ పరుషాణ్యవోచత్ ।
తాని ప్రవిష్టాని వృకోదరాంగం
దహంతి కక్షాగ్నిరివేంధనాని ॥ 17
ధర్మరాజు జూదంలో వంచనతో ఓడిపోయినపుడు దుఃశాసనుడు పలికిన పరుషవాక్యాలు వృకోదరుని శరీరంలో ప్రవేశించి అగ్ని ఇంధనాన్ని తగులబెట్టినట్టు అతనిని దహిస్తున్నాయి. (17)
న పాపకం ధ్యాస్యతి ధర్మపుత్రః
ధనంజయశ్చాప్యనువర్త్స్యతే తమ్ ।
అరణ్యవాసేన వివర్ధతే తు
భీమస్య కోపోఽగ్నిరివానిలేన ॥ 18
ధర్మరాజు నా పాపాలను పట్టించుకోడు. అర్జునుడు కూడా ఆయననే అనుసరిస్తాడు. కానీ అరణ్యవాసంతో భీమునికోపం మాత్రం గాలిసోకిన అగ్నిలా పెరుగుతూనే ఉంటుంది. (18)
స తేన కోపేన విదహ్యమానః
కరం కరేణాభినిపీడ్య వీరః ।
వినిఃశ్వసత్యుష్ణమతీవ ఘోరం
దహన్నివేమాన్ మమ పుత్రపౌత్రాన్ ॥ 19
ఆ కోపంతో మండుతున్న వీరుడు - భీముడు చేతులు అప్పళిస్తూ నాకొడుకులనూ, మనవళ్ళనూ దహిస్తున్నట్లు భీకరంగా, వేడిగా నిట్టూర్పులు విడుస్తుంటాడు. (19)
గాండీవధన్వా చ వృకోదరశ్చ
సంరంభిణావంతకకాలకల్పౌ ।
న శేషయేతాం యుధి శత్రుసేనాం
శరాన్ కిరంతావశనిప్రకాశాన్ ॥ 20
అర్జునుడు, భీముడు క్రోధావిష్టులయితే యమునితో, మృత్యువుతో సమానులు. పిడుగుల వంటి బాణాలను వెదజల్లుతూ రణరంగంలో శత్రుసేనను మిగల్చరు. (20)
దుర్యోధనః శకునిః సూతపుత్రో
దుఃశాసనశ్చాపి సుమందచేతాః ।
మధు ప్రపశ్యంతి న తు ప్రపాతం
యద్ ద్యూతమాలంబ్య హరంతి రాజ్యమ్ ॥ 21
దుర్యోధనుడు, శకుని, కర్ణుడు, దుఃశాసనుడు - వీరు మూర్ఖులు. జూదాన్ని ఆశ్రయించి రాజ్యాన్ని అపహరించారు. తేనెమీదనే దృష్టిపెట్టారు కానీ లోయలో పడతామేమో అని ఆలోచించలేదు. (21)
శుభాశుభం కర్మ నరో హి కృత్వా
ప్రతీక్షతే తస్య ఫలం స్మ కర్తా ।
స తేన ముహ్యత్యవశః ఫలేన
మోక్షః కథం స్యాత్ పురుషస్య తస్మాత్ ॥ 22
నరుడు కర్తయై శుభాశుభకర్మలను చేసి, ఫలితం కోసం ఎదురు చూస్తుంటాడు. ఆ ఫలంతో వ్యామోహితుడవుతాడు. ఆ వ్యామోహం నుండి ఎలా బయటపడగలుగుతాడు? (22)
క్షేత్రే సుకృష్టే హ్యుపితే చ బీజే
దేవే చ వర్షత్యృతుకాలయుక్తమ్ ।
న స్యాత్ ఫలం తస్య కుతః ప్రసిద్ధిః
అన్యత్ర దైవాదితి చింతయామి ॥ 23
పొలాన్ని చక్కగా దున్నాం. గింజలు నాటాం. ఋతుకాలంలోనే వర్షం కురిసింది. అయితే ఫలించటం లేదంటే ప్రారబ్ధం తప్ప మరోకారణ మక్కడుండే అవకాశం లేదు. (23)
కృతం మతాక్షేణ యథా న సాధు
సాధుప్రవృత్తేన చ పాండవేన ।
మయా చ దుష్పుత్రవశానుగేన
తథా కురూణామయమంతకాలః ॥ 24
ద్యూతప్రియుడయిన శకుని సరిగా ప్రవర్తించలేదు. సాధుస్వభావంతో ధర్మరాజు కూడా సరిగా ప్రవర్తించలేదు. చెడ్డకొడుకులకు లోబడి నేను కూడా సరిగా ప్రవర్తించలేదు. వీటి ఫలితమే నేడు కౌరవులకు పోయేకాలం. (24)
ధ్రువం ప్రవాస్యత్యసమీరితోఽపి
ధ్రువం ప్రజాస్యత్యుత గర్భిణీ యా ।
ధ్రువం దినాదౌ రజనీప్రణాశః
తథా క్షపాదౌ చ దినప్రణాశః ॥ 25
గాలిని ఎవరూ కదిలించకపోయినా అది ప్రసరిస్తుంది. గర్భవతి తగిన కాలంలో ప్రసవిస్తుంది. పగటి ప్రారంభంలో రాత్రి నశిస్తుంది. రాత్రి ప్రారంభంలో పగలు నశిస్తుంది. (25)
క్రియేత కస్మాదపరే చ కుర్యుః
విత్తం న దద్యుః పురుషాః కథంచిత్ ।
ప్రాప్యార్థకాలం చ భవేదనర్థః
కథం న తత్ స్యాదితి తత్ కుతః స్యాత్ ॥ 26
అయినా లోభంతో చేయరాని పనులు చేస్తూనే ఉంటాం. ఇతరులూ చేస్తుంటారు. బుద్ధిమంతులు కూడా ఆర్జించిన దానిని ఎందుకు దానం చేయరో? అవసరపడినపుడు ఉపయోగపడని అర్థం అనర్థకమే. ఆ ధనం ఎందుకు ఉపయోగపడటం లేదో ఎలా ఉపయోగపడుతుందో ఆలోచించాలి. (26)
వి॥సం॥ ప్రాణులకు ధనసంపాదన, ధనసంరక్షణల విషయంలో స్వాభావికంగానే బుద్ధిపుడుతుంది. దానిని పరిహరించలేము. (నీల)
కథం న భిద్యేత న చ స్రవేత
న చ ప్రసిచ్యేదితి రక్షితవ్యమ్ ।
అరక్ష్యమాణం శతధా ప్రకీర్యేద్
ధ్రువం న నాశోఽస్తి కృతస్య లోకే ॥ 27
ధనాన్ని దానం చేయకపోతే దాన్ని ముక్కలు కాకుండా, జారిపోకుండా, వ్యర్థం కాకుండా కాపాడుకోవాలి.
కాపాడుకోకపోతే నూరురకాలుగా అది చెదిరిపోతుంది. చేసిన కర్మఫలం ఎప్పుడూ నశించదు. (27)
గతో హ్యరణ్యాదపి శక్రలోకం
ధనంజయః పశ్యత వీర్యమస్య ।
అస్త్రాణి దివ్యాని చతుర్విధాని
జ్ఞాత్వా పునర్లోకమిమం ప్రపన్నః ॥ 28
అర్జునుని పరాక్రమాన్ని చూడు. అరణ్యవాసం చేస్తూ, కూడా ఇంద్రలోకానికి వెళ్ళగలిగాడు. అక్కడ నాల్గువిధాలయిన దివ్యాస్త్రాలను పొంది, మరలా ఈ లోకాన్ని చేరగలిగాడు. (28)
స్వర్గం హి గత్వా సశరీర ఏవ
కో మానుషః పునరాగంతుమిచ్ఛేత్ ।
అన్యత్ర కాలోపహతాననేకాన్
సమీక్షమాణస్తు కురూన్ ముమూర్షూన్ ॥ 29
శరీరంతో స్వర్గానికి వెళ్ళగలిగితే తిరిగిరావాలని ఎవరికి అనిపిస్తుంది? కాలోపహతులై మృత్యువునకు దగ్గరవుతున్న కౌరవులందరినీ చక్కగా చూడాలనేదే అర్జునుని రాకకు కారణమై ఉంటుంది. (29)
ధనుర్ర్గాహశ్చార్జునః సవ్యసాచీ
ధనుశ్చ తద్ గాండివం భీమవేగమ్ ।
అస్త్రాణి దివ్యాని చ తాని తస్య
త్రయస్య తేజః ప్రసహేత కోఽత్ర ॥ 30
అర్జునుడు సవ్యసాచి అయిన విలుకాడు. గాండీవం తీవ్రవేగం గల ధనుస్సు. అర్జునుని అస్త్రాలు దివ్యాలూ. ఈ మూడింటి కలయికతో ఏర్పడిన తేజస్సును ఎవడు సహించగలడు. (30)
నిశమ్య తద్ వచనం పార్థివస్య
దుర్యోధనం రహితే సౌబలోఽథ ।
అబోధయత్ కర్ణముపేత్య సర్వం
స చాప్యహృష్టోఽభవదల్పచేతాః ॥ 31
ఏకాంతంలో ధృతరాష్ట్రుడు పలికిన ఈ మాటలు విని, శకుని రహస్యంగా కర్నదుర్యోధనుల ధగ్గరకుపోయి మొత్తం వివరంగా చెప్పాడు. దానితో మందమతి అయిన దుర్యోధనుడు అసంతృప్తికి గురి అయ్యాడు. (31)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి ఘోషయాత్రాపర్వణి ధృతరాష్ట్రఖేదవాక్యే షట్త్రింశదధికద్విశతతమోఽధ్యాయః ॥ 236 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున ఘోషయాత్రాపర్వమను ఉపపర్వమున ధృతరాష్ట్రభేదవాక్యమను రెండు వందల ముప్పది యారవ అధ్యాయము. (236)