238. రెండువందల ముప్పది ఎనిమిదవ అధ్యాయము
ఘోషయాత్రానుమతికై దుర్యోధనుడు ధృతరాష్ట్రునికడ కేగుట.
వైశంపాయన ఉవాచ
కర్ణస్య వచనం శ్రుత్వా రాజా దుర్యోధనస్తతః ।
హృష్టో భూత్వా పునర్దీనః ఇదం వచనమబ్రవీత్ ॥ 1
వైశంపాయనుడిలా అన్నాడు.
కర్ణునిమాట విని దుర్యోధన నరపాలుడు ఆనందించి, మరల దీనుడై ఈ మాట పలికాడు. (1)
బ్రవీషి యదిదం కర్న సర్వం మనసి మే స్థితమ్ ।
న త్వభ్యనుజ్ఞాం లప్స్యామి గమనే యత్ర పాండవాః ॥ 2
కర్ణా! నీవన్నదంతా నా మనస్సులో నున్నదే. కానీ పాండవులున్న తావునకు వెళ్ళటానికి తండ్రి అనుమతిని పొందలేను. (2)
పరిదేవతి తాన్ వీరాన్ ధృతరాష్ట్రో మహీపతిః ।
మన్యతేఽభ్యధికాంశ్చాపి తపోయోగేన పాండవాన్ ॥ 3
ధృతరాష్ట్రమహారాజు ఆ వీరులపై జాలిచూపుతున్నాడు. తపశ్శక్తి కారణంగా వారు మనకన్న గొప్పవారని భావిస్తున్నాడు. (3)
అథవాప్యనుబుధ్యేత నృపోఽస్మాకం చికీర్షితమ్ ।
ఏవమప్యాయతిం రక్షన్ నాభ్యనుజ్ఞాతుమర్హతి ॥ 4
అక్కడకు వెళ్లాక మనం చేయదలచుకొన్న పనిని ఆయన గ్రహిస్తే, కలుగబోయే కష్టాల నుండీ మనలను రక్షించాలన్న తలపుతోనైనా అనుమతిని నిరాకరించవచ్చు. (4)
న హి ద్వైతవనే కించిద్ విద్యతేఽన్యత్ ప్రయోజనమ్ ।
ఉత్సాదనమృతే తేషాం వనస్థానాం మహాద్యుతే ॥ 5
మహాతేజస్వీ! వనవాసం చేస్తున్న ఆ పాండవులను కలతపెట్టడం తప్ప ద్వైతవనంలో మరొక ప్రయోజనం లేదు. (5)
జానాసి హి యథా క్షత్తా ద్యూతకాల ఉపస్థితే ।
అబ్రవీద్ యచ్చ మాం త్వాం చ సౌబలం వచనం తదా ॥ 6
జూదమాడబోయే సమయంలో విదురుడు నాతో, నీతో, శకునితో ఏమన్నాడో తెలుసు కదా! (6)
తాని సర్వాణి వాక్యాని యచ్చాన్యత్ పరిదేవితమ్ ।
విచింత్య నాధిగచ్ఛామి గమనాయేతరాయ వా ॥ 7
ఆ మాటలనూ, పాండవులకై విలపించుటను ఆలోచిస్తుంటే ద్వైతవనానికి వెళ్ళాలో, అవసరం లేదో తెలియటం లేదు. (7)
మమాపి హి మహాన్ హర్షః యదహం భీమఫాల్గునౌ ।
క్లిష్టావరణ్యే పశ్యేయం కృష్ణయా సహితావితి ॥ 8
ద్రౌపదితోపాటు అరణ్యమ్లో కష్టాలుపడుతున్న భీమార్జునులను చూడాలన్న ముచ్చట నాకూ ఉంది. (8)
న తథా హ్యాప్నుయాం ప్రీతిమ్ అవాప్య వసుధామిమామ్ ।
దృష్ట్వా యథా పాండుసుతాన్ వల్కలాజినవాసనః ॥ 9
నారచీరలు, మృగచర్మాలు ధరించిన పాండవులను చూస్తుంటే కలిగే ఆనందం ఈ భూమండలాన్నంతా పొందినా కలుగదు. (9)
కిం ను స్యాదధికం తస్మాద్ యదహం ద్రుపదాత్మజామ్ ।
ద్రౌపదీం కర్న పశ్యేయం కాషాయవసనాం వనే ॥ 10
కర్ణా! ద్రుపదుని పుత్రిక అయిన ద్రౌపదిని అరణ్యంలో కాషాయవస్త్రాలలో చూస్తుంటే అంతకన్న కావలసిన దేముంటుంది? (10)
యది మాం ధర్మరాజశ్చ భీమసేనశ్చ పాండవః ।
యుక్తం పరమయా లక్ష్మ్యా పశ్యేతాం జీవితం భవేత్ ॥ 11
పాండుకుమారులయిన ధర్మరాజ, భీముడు పరమోత్కృష్ట మయిన రాజ్యలక్ష్మితో కూడిన నన్ను చూసినప్పుడే నా జీవితం సఫలమవుతుంది. (11)
ఉపాయం న తు పశ్యామి యేన గచ్ఛేమ తద్ వనమ్ ।
యథా చాభ్యనుజానీయాద్ గచ్ఛంతం మాం మహీపతిః ॥ 12
ఆ అరణ్యానికి ఎలా వెళ్ళాలో అర్థం కావటం లేదు. అనుమతి పొందే ఉపాయం కూడా కనిపించటం లేదు. (12)
స సౌబలేన సహితః తథా దుఃశాసనేన చ ।
ఉపాయం పశ్య నిపుణం యేన గచ్ఛేమ తద్ వనమ్ ॥ 13
నీవు శకునితో, దుఃశాసనునితో కలిసి ఆ అరణ్యానికి వెళ్ళే ఉపాయాన్ని జాగ్రత్తగా ఆలోచించు. (13)
అహమప్యద్య నిశ్చిత్య గమనాయేతరాయ చ ।
కల్యమేవ గమిష్యామి సమీపం పార్థివస్య హ ॥ 14
నేను వెళ్ళటమో, మానటమో ఈ రోజు నిశ్చయించు కొంటాను. రేపు ఉదయమే మహారాజు దగ్గరకు వెళదాము. (14)
మయి తత్రోపవిష్టే తు భీష్మే చ కురుసత్తమే ।
ఉపాయో యో భవేద్ దృష్టః తం బ్రూయాః సహసౌబలః ॥ 15
నేను అక్కడే కూర్చుంటాను. కురుసత్తముడైన భీష్ముడు కూడా ఉంటాడు. అప్పుడు నీవూ, శకునీ కలిసి మీ మనస్సులలోని ఉపాయాన్ని చెప్పాలి. (15)
వచో భీష్మస్య రాజ్ఞశ్చ నిశమ్య గమనం ప్రతి ।
వ్యవసాయం కరిష్యేఽహమ్ అనునీయ పితామహమ్ ॥ 16
ప్రయాణ విషయంలో మహారాజూ, భీష్ముడూ ఏమంటారో విని, భీష్ముని ఏదో ఒకరీతిగా అంగీకరింపజేసి ద్వైతవనప్రయాణాన్ని నిర్ణయిస్తాను. (16)
తథేత్యుక్త్వా తు తే సర్వే జగ్మురావసథాన్ ప్రతి ।
వ్యుషితాయాం రజన్యాం తు కర్ణో రాజానమభ్యయాత్ ॥ 17
అలాగే అనుకొని అందరూ ఎవరి భవనానికి వారు వెళ్ళిపోయారు. రాత్రి గడవగానే కర్ణుడు దుర్యోధనుని దగ్గరకు వెళ్ళాడు. (17)
తతో దుర్యోధనం కర్ణః ప్రహసన్నిదమబ్రవీత్ ।
ఉపాయః పరిదృష్టోఽయం తం నిబోధ జనేశ్వర ॥ 18
వెళ్ళి నవ్వుతూ కర్ణుడు దుర్యోధనునితో ఇలా అన్నాడు - రాజా! ఉపాయం దొరికింది. విను. (18)
ఘోషా ద్వైతవనే సర్వే త్వత్ర్పతీక్షా నరాధిప ।
ఘోషయాత్రాపదేశేన గమిష్యామో న సంశయః ॥ 19
రాజా! ద్వైతవనంలో గొల్లపల్లెలన్నీ నీకోసం ఎదురు చూస్తున్నాయి. ఘోషయాత్ర అన్న నెపంతో వెళదాము. అనుమానించనక్కరలేదు. (19)
ఉచితం హి సదా గంతుం ఘోషయాత్రాం విశాంపతే ।
ఏవం చ త్వాం పితా రాజన్ సమనుజ్ఞాతుమర్హతి ॥ 20
రాజా! ఘోషయాత్ర అన్నది ఎప్పుడయినా సరే తగిన పనియే. ఈ పద్ధతిలో నీ తండ్రి కూడా నీకు అనుమతి ఇవ్వగలడు. (20)
తథా కథయమానౌ తౌ ఘొషయాత్రావినిశ్చయమ్ ।
గాంధారరాజః శకునిః ప్రత్యువాచ హసన్నివ ॥ 21
ఘొషయాత్రను నిశ్చయింపగోరి, ఆ రీతిగా సంభాషిస్తున్న కర్ణదుర్యోధనులను చూచి గాంధారరాజైన శకుని నవ్వుతూ ఇలా అన్నాడు. (21)
ఉపాయోఽయం మయా దృష్టః గమనాయ నిరామయః ।
అనుజ్ఞాస్యతి నో రాజా బోధయిష్యతి చాప్యుత ॥ 22
ద్వైతవనానికి వెళ్ళటానికి ఈ ఉపాయం ఇబ్బందిలేనిదిగా
నాకనిపిస్తోంది. ధృతరాష్ట్రుడు అనుమతించటంతోపాటు మన కర్తవ్యాన్ని కూడా నిర్దేశించవచ్చు. (22)
ఘోషా ద్వైతవనే సర్వే త్వత్ర్పతీక్షా నరాధిప ।
ఘోషయాత్రాపదేశేన గమిష్యామో న సంశయః ॥ 23
రాజా! గొల్లపల్లెలన్నీ నీకోసం ద్వైతవనంలో నిరీక్షిస్తున్నాయి. కాబట్టి ఘోషయాత్ర అన్న నెపంతో అక్కడకు వెళదాం. సంశయించనవసరం లేదు. (23)
తతః ప్ర్రహసితాః సర్వే తేఽన్యోన్యస్య తలాన్ దదుః ।
తదేవ చ వినిశ్చిత్య దదృశుః కురుసత్తమమ్ ॥ 24
అప్పుడు వారంతా ఆనందంగా నవ్వుకొంటూ కరచాలనం చేసికొన్నారు. ఆ నిశ్చయంతోనే కురుశ్రేష్ఠుడైన ధృతరాష్ట్రుని సందర్శించారు. (24)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి ఘోషయాత్రాపర్వణి ఘోషయాత్రామంత్రణే అష్టాత్రింశదధికశతతమోఽధ్యాయః ॥ 238 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున ఘోషయాత్రాపర్వమను ఉపపర్వమున ఘోషయాత్రామంత్రణమను రెండు వందల ముప్పది యెనిమిదవ అధ్యాయము. (238)