230. రెండువందల ముప్పదియవ అధ్యాయము
కృత్తికలకు నక్షత్ర మండలస్థానప్రాప్తి; కష్టప్రద గ్రహములు.
మార్కండేయ ఉవాచ
శ్రియా జుష్టం మహాసేనం దేవసేనాపతిం కృతమ్ ।
సప్తర్షిపత్న్యః షడ్ దేవ్యః తత్సకాశమథాగమన్ ॥ 1
మార్కండేయుడిలా అన్నాడు.
మహాసేనుడు శోభాసంపన్నుడై దేవసేనాపతి కావటం చూచి సప్తర్షులూ వారి ఆరుగురు పత్నులూ ఆయన వద్దకు వచ్చారు. (1)
ఋషిభిః సంపరిత్యక్తాః ధర్మయుక్తా మహావ్రతాః ।
ద్రుతమాగమ్య చోచుస్తాః దేవసేనాపతిం ప్రభుమ్ ॥ 2
పూర్వం మహర్షులు విడిచిపెట్టిన ఆ పతివ్రతలు దేవసేన భర్త యగు కుమారుని వద్దకు త్వరగా వచ్చి ఇలా అన్నారు. (2)
వయం పుత్ర పరిత్యక్తాః భర్తృభిర్దేవసమ్మితైః ।
అకారణాద్ రుషా తైస్తు పుణ్యస్థానాత్ పరిచ్యుతాః ॥ 3
వత్సా! దైవసమానులయిన మా భర్తలు కుపితులై నిష్కారణంగా మమ్ము వదిలివేశారు. అందుచే మేము ఉత్తమలోకాలను దూరమైనాము. (3)
అస్మాభిః కిల జాతస్త్వమ్ ఇతి కేనాప్యుదాహృతమ్ ।
తత్ సత్యమేతత్ సంశ్రుత్య తస్మాన్నస్త్రాతుమర్హసి ॥ 4
నీవు మా కడుపున పుట్టావని ఎవరో వారికి చెప్పారు. అది వాస్తవం కాదు. మేము చెప్పే నిజాన్ని విని, ఈ ఆపద నుంచి మమ్ములను కాపాడు. (4)
అక్షయశ్చ భవేత్ స్వర్గః త్వత్ర్పసాదాద్ధి నః ప్రభో ।
త్వాం పుత్రం చాప్యభీప్సామః కృత్వైతదనృణో భవ ॥ 5
దేవా! నీదయ వలన మాకు శాశ్వత స్వర్గప్రాప్తి కలుగుతుంది గదా! ఇంతేకాక మేము నిన్ను మాపుత్రుని చేసుకోవాలని కోరుకొంటున్నాము. ఇది చేసి నీవు ఋణవిముక్తుడివి కావలసినది. (5)
స్కంద ఉవాచ
మాతరో హి భవత్యో మే సుతో వోఽహమనిందితాః ।
యద్వాపీచ్ఛత తత్ సర్వం సంభవిష్యతి వస్తథా ॥ 6
కుమారస్వామి అన్నాడు. పరమపవిత్రలారా! మీరు నాతల్లులే. నేను మీ అందరి పుత్రుడను. ఇదే కాక ఇంకా మీకు ఏమైనా కోరిక ఉంటే దాన్నీ తీరుస్తాను. (6)
మార్కండేయ ఉవాచ
వివక్షంతం తతః శక్రం కిం కార్యమితి సోఽబ్రవీత్ ।
ఉక్తః స్కండేన బ్రూహీతి సోఽబ్రవీత్ వాసవస్తతః ॥ 7
మార్కండేయుడన్నాడు - రాజా! అప్పుడు ఇంద్రుడు ఏదో చెప్పవలెనని అనుకొంటున్నట్లు తెలుసుకొని స్కందుడు ఏమితో చెప్పమని అడగగా ఆయన ఇలా అన్నాడు - (7)
అభిజిత్ స్పర్ధమానా తు రోహిణ్యా అనుజా స్వసా ।
ఇచ్ఛంతీ జ్యేష్ఠతాం దేవీ తప్తస్తప్తుం వనం గతా ॥ 8
రోహిణి చెల్లెలు అభిజిద్దేవి అసూయతో తాను పెద్దతనం సంపాదించటానికి తపస్సు చేయాలని వనానికి వెళ్లింది. (8)
తత్ర మూఢోఽస్మి భద్రం తే నక్షత్రం గగనాచ్చ్యుతమ్ ।
కాలం త్విమం పరం స్కంద బ్రహ్మణా సహ చింతయ ॥ 9
నీకు మేలు కలుగుతుంది. ఆకాశం నుంచి ఈ నక్షత్రం ఒకటి పతన మయింది. ఈ స్థానం ఎలా పూర్తి అవుతుంది? ఈ ప్రశ్నతో ఏం చేయాలో నాకు తోచలేదు. కాబట్టి కుమారా! ఈ సమయంలో ఏం చేయాలో బ్రహ్మతో నీవే ఆలోచించు. (9)
ధనిష్ఠాదిసదా కాలః బ్రహ్మణా పరికల్పితః ।
రోహిణ్యా హ్యభవత్ పూర్వమ్ ఏవం సంఖ్యా సమాభవత్ ॥ 10
అభిజిన్నక్షత్రం పడిపోవటం వలన బ్రహ్మధనిష్ఠానక్షత్రమే ఆదిగా (కృతయుగాది) కాలగణానాక్రమం నిశ్చయించాడు. (అదే సమయంలో యుగాది నక్షత్రం) దీనికి పూర్వం రోహిణినే యుగాదినక్షత్రంగా భావించేవారు. రోహిణి ప్రారంభకాలంలో చంద్రుడు, సూర్యుడు, గురుగ్రహాల యోగం ఉండేది. ఈ రీతిగా నక్షత్రమాస దినసంఖ్య ఆ రోజులలో సమంగా ఉండేది. (10)
ఏవముక్తే తు శక్రేణ త్రిదివం కృత్తికా గతాః ।
నక్షత్రం సప్తశీర్షాభం భాతి తద్ వహ్ని దైవతమ్ ॥ 11
ఇంద్రుడు ఆ విధంగా ప్రస్తావించగా ఆయన ఉద్దేశం తెలిసికొని ఆరుకృత్తికలు అభిజిత్తు నక్షత్రస్థానాన్ని పూర్తిచేయటానికి ఆకాశంలోకి వెళ్ళాయి. అగ్నిదేవతాకమయిన కృత్తికా నక్షత్రం ఏడు శిరస్సుల ఆకారంలో ప్రకాశిస్తున్నది. (11)
వివతా చాబ్రవీత్ స్కందం మమ త్వం పిండదః సుతః ।
ఇచ్ఛామి నిత్యమేవాహం త్వయా పుత్ర సహాసితుమ్ ॥ 12
గరుడజాతిలోని దగు వినత స్కందునితో "వత్సా! నీవు నాకు పిండదాతవు (రక్షకుడవు) కావలసినది. ఎల్లప్పుడు నీతోపాటు ఉండాలని నాకోరిక' అన్నది. (12)
స్కంద ఉవాచ
ఏవమస్తు నమస్తేఽస్తు పుత్ర స్నేహాత్ ప్రశాధి మామ్ ।
స్నుషయా పూజ్యమానా వై దేవి వత్స్యసి నిత్యదా ॥ 13
స్కందుడిలా అన్నాడు.
'అమ్మా! అలాగే. నీకు నమస్కారం. నీవు పుత్రప్రేమతో నాకు కర్తవ్యాన్ని ఉపదేశిస్తూ ఉండు. ఇక్కడ ఎల్లప్పుడు నీకోడలు దేవసేనచే పూజింపబడుతూ ఉండు.' (13)
మార్కండేయ ఉవాచ
అథ మాతృగణః సర్వః స్కందం వచనమబ్రవీత్ ।
వయం సర్వస్య లోకస్య మాతరః కవిభిః స్తుతాః ।
ఇచ్ఛామో మాతరస్తుభ్యం భవితుం పూజయస్వ నః ॥ 14
మార్కండేయుడు ఇలా అన్నాడు - తరువాత మాతృగణం స్కందుని వద్దకు వచ్చి 'వత్సా! విద్వాంసులు మమ్ములను లోకమాతలు అని స్తుతించారు. ఇప్పుడు మేము నీకు మాతలుగా ఉండాలని అనుకొంటున్నాము. మమ్ము మాతృభావనతో పూజించు.' అన్నారు. (14)
స్కంద ఉవాచ
మాతరో హి భవత్యో మే భవతీనామహం సుతః ।
ఉచ్యతాం యన్మయా కార్యం భవతీనామథేప్సితమ్ ॥ 15
స్కందుడిలా అన్నాడు.
'మీరు నాతల్లులు. నేను మీపుత్రుడను. మీకు కావలసినది నేను చేయవలసినది ఏమిటో చెప్పండి.' (15)
మాతర ఊచుః
యాస్తు తా మాతరః పూర్వం లోకస్యాస్య ప్రకల్పితాః ।
అస్మాకం తు భవేత్ స్థానం తాసాం చైవ న తద్ భవేత్ ॥ 16
మాతలు ఇలా అన్నారు - పూర్వం మాతృస్థానంలో ఉన్న (బ్రాహ్మి మహేశ్వరి మొదలైన) సుప్రసిద్ధ సప్తమాతల స్థానంలో మాఅధికారం ఇకముందు ఉండాలి. వారికి దానిమీద ఎలాంటి అధికారం ఉండరాదు. (16)
భవేమ పూజ్యా లోకస్య న తాః పూజ్యా సురర్షభ ।
ప్రజాఽస్మాకం హృతాస్తాభిః త్వత్కృతే తాః ప్రయచ్ఛ నః ॥ 17
దేవశ్రేష్ఠా! జగత్తుకు అంతటికి మేము పూజనీయులం కావాలి. ఇక వారికి ఆ గౌరవం దక్కరాదు. వారు నీ కోసమని మామీద అసత్యమైన అపవాదును చేసి మాభర్తలకు కోపం కల్గించి మా సంతానసౌభాగ్యాన్ని లాగేశారు. కనుక నీవు ఆ సుఖాన్ని మాకు ప్రసాదించు. (17)
స్కంద ఉవాచ
వృత్తాః ప్రజా న తాః శక్యాః భవతీభిర్నిషేవితుమ్ ।
అన్యాం వః కాం ప్రయచ్ఛామి ప్రజాం యాం మనసేచ్ఛథ ॥ 18
స్కందుడు ఇలా అన్నాడు.
'మాతలారా! సంతానోత్పత్తి ఆవశ్యకత తీరిపోయిన ఆ భర్తలను మీరు ఇప్పుడు పొందలేరు. ఇంకొకరీతిగా సంతతి పొందాలనే కోరిక ఉంటే చెప్పండి. దాన్ని తీరుస్తా! (18)
మాతర ఊచుః
ఇచ్ఛామ తాసాం మాతౄణాం ప్రజా భోక్తుం ప్రయచ్ఛ నః ।
త్వయా సహ పృథగ్భూతా యే చ తాసామథేశ్వరాః ॥ 19
మాతలు అన్నారు - అలాగైతే మాకు ఆ లోకమాతల సంతానాన్ని ఇవ్వు. దాన్ని తింటాం. ఆ సంతాన సంరక్షకులలో నిన్ను తప్ప మిగిలినవారిని కూడా తినాలనుకొంటున్నాం. (19)
స్కంద ఉవాచ
ప్రజా వో దద్మి కష్టం తు భవతీభిరుదాహృతమ్ ।
పరిరక్షత భద్రం వః ప్రజాః సాధు నమస్కృతాః ॥ 20
స్కందుడు అన్నాడు - మీరు కష్టసాధ్యమైనది అడిగారు. అయినా మీకు పూర్వమాతల సంతానాన్ని అర్పిస్తాను. దాన్ని మీరు భక్షించకుండా రక్షిస్తే మీకు మేలు జరుగుతుంది. మీకు భక్తితో నమస్కరిస్తున్నాను. (20)
మాతార ఉవాచ
పరిరక్షామ భద్రం తే ప్రజాః స్కంద యథేచ్ఛసి ।
త్వయా నో రోచతే స్కంద సహవాసశ్చిరం ప్రభో ॥ 21
మాతలు ఇలా అన్నారు.
స్కందా! నీకు మేలు కలుగుతుంది. నీ ఇష్టప్రకారం ప్రజారక్షణ చేస్తాం. ప్రభూ! సర్వకాలమూ నీతో కలిసి ఉండటం మాకు చాలా ఇష్టం' (21)
స్కంద ఉవాచ
యావత్ షోడశ వర్షాణి భవంతి తరుణాః ప్రజాః ।
ప్రబాధత మనుష్యాణాం తావద్రూపైః పృథగ్విధైః ॥ 22
స్కందుడు అన్నాడు - లోకంలో జనం పదహారు సంవత్సరాల యువకులు అయ్యేదాకా మానవులను భిన్నభిన్నరూపాలను ధరించి బాధించండి. (22)
అహం చ వః ప్రదాస్యామి రౌద్రమాత్మానమవ్యయమ్ ।
పరమం తేన సహితాః సుఖం వత్స్యథ పూజితాః ॥ 23
నేను మీకు భయంకరమై వినాశరహితమై నన్ను పోలిన రూపంగల పురుషుని ప్రసాదిస్తాను. ఆతనితో కలిసి పూజలందుకొని మీరు చిరకాలం సుఖపడండి. (23)
మార్కండేయ ఉవాచ
తతః శరీరాత్ స్కందస్య పురుషః పావకప్రభః ।
భోక్తుం ప్రజాః స మర్త్యానాం నిష్పపాత మహాప్రభః ॥ 24
మార్కండేయముని అన్నాడు - తరువాత కుమారస్వామి శరీరం నుంచి అగ్నితో సమానమైన తేజస్సు, కాంతి కల, పురుషుడు అవతరించాడు. అతడు సమస్త మానవసంతతిని తినవలెననే కోరిక గలవాడు. (24)
అపతత్ సహసా భూమౌ విసంజ్ఞోఽథ క్షుధార్దితః ।
స్కందేన సోఽభ్యనుజ్ఞాతః రౌద్రరూపోఽభవద్ గ్రహః ॥ 25
అతడు పుట్టిన వెంటనే ఆకలితో బాధపడుతూ, మూర్ఛతో నేలమీద పడ్డాడు. స్కందుని ఆజ్ఞానుసారం ఆతడు భయంకరరూపం గల గ్రహం అయినాడు. (25)
స్కందాపస్మారమిత్యాహుః గ్రహం తం ద్విజసత్తమాః ।
వినతా తు మహారౌద్రా కథ్యతే శకునిగ్రహః ॥ 26
బ్రాహ్మణశ్రేష్ఠులు ఆయనను స్కందాపస్మారగ్రహం అంటారు. వినతను మహాభయంకరమైన శకుని గ్రహం అంటారు. (26)
పూతనాం రాక్షసీం ప్రాహుః తం విద్యాత్ పూతనాగ్రహమ్ ।
కష్టా దారుణరూపేణ ఘోరరూపా నిశాచరీ ॥ 27
పూతనను రాక్షసి అంటారు. దాన్ని పూతనాగ్రహం అని తెలుసుకోవాలి. భయంకర రూపాన్ని ధరించే ఆ నిశాచరి చాల క్రూరత్వంతో బాలకులను బాధిస్తుంటుంది. (27)
పిశాచీ దారుణాకారా కథ్యతే శీతపూతనా ।
గర్భాన్ సా మానుషీణాం తు హరతే ఘోరదర్శనా ॥ 28
ఈమెయే కాక భయంకరమైన ఆకారం గల ఒక పిశాచి ఉన్నది. దానిని శీత పూతనాగ్రహం అంటారు. అది చూడటానికి చాలా భయంకరంగా ఉంటుంది. అది మానవస్త్రీల గర్భాలను పోగొడుతుంది. (28)
అదితిం రేవతీం ప్రాహుః గ్రహస్తస్యాస్తు రైవతః ।
సోఽపి బాలాన్ మహాఘోరః బాధతే వై మహాగ్రహః ॥ 29
అదితీదేవిని లోకంలో రేవతి అంటారు. ఆ రేవతి గ్రహం లేరు రైవతం. భయంకరమైన ఆ మహాగ్రహం కూడా బాలకులను బాధిస్తుంది. (29)
దైత్యానాం యా దితిర్మాతా తామాహుర్ముఖమండికామ్ ।
అత్యర్థం శిశుమాంసేన సంప్రహృష్టా దురాసదా ॥ 30
దైత్యుల తల్లి అయిన దితిని 'ముఖమండిక' అంటారు. దానికి చిన్నపిల్లల మాంసం అంటే చాలా ఇష్టం. ఆ గ్రహాన్ని జయించటం మిక్కిలి కష్టం. (30)
కుమారాశ్చ కుమార్యశ్చ యే ప్రోక్తాః స్కందసంభవాః ।
తేఽపి గర్భభుజః సర్వే కౌరవ్య సుమహాగ్రహాః ॥ 31
కురువంశీయా! ధర్మజా! స్కందుని శరీరం నుంచి జనించిన కుమార కుమారీగ్రహాలు అన్నీ తల్లికడుపులో ఉన్న పిల్లలను భక్షించే మహాగ్రహాలు. (31)
తాసామేవ తు పత్నీనాం పతయస్తే ప్రకీర్తితాః ।
ఆజాయమానాన్ గృహ్ణంతి బాలకాన్ రౌద్రకర్మిణః ॥ 32
ఈ కుమారీ గ్రహాలకు కుమారగ్రహాలు భర్తలు అని చెపుతారు. భయంకర కార్యాలు చేసే ఈ గ్రహాలు అన్నీ పుట్టకముందే పిల్లలను పట్టుకొంటాయి. (32)
గవాం మాతా తు యా ప్రాజ్ఞైః కథ్యతే సురభ్భిర్నృప ।
శకునిస్తామథారుహ్య సహ భుంక్తే శిశూన్ భువి ॥ 33
రాజా! గోవులకు తల్లి అయిన సురభిని ఎక్కి పక్షి గ్రహం అయిన వినత ఇతరగ్రహాలతోపాటు భూమండలంలో పిల్లలను తింటుంది. (33)
సరమా నామ యా మాతా శునాం దేవీ జనాధిప ।
సాపి గర్భాన్ సమాదత్తే మానుషీణాం సదైవ హి ॥ 34
రాజేంద్రా! కుక్కలకు తల్లి అయిన సరమ దేవజాతీయురాలు. ఆమె కూడా ఎల్లప్పుడు మానవ స్త్రీల గర్భాలలో ఉండే బాలకులను అపహరిస్తుంది. (34)
పాదపానాం చ యా మాతా కరంకనిలయా హి సా ।
వరదా సా హి సౌమ్యా చ నిత్యం భూతానుకంపినీ ॥ 35
వృక్షాల తల్లి కానుగు చెట్టుమీద ఉంటుంది. ఆమె వరాలు ఇచ్చే దేవి. సౌమ్యురాలు. సమస్తప్రాణులపైనా దయ చూపుతుంది. (35)
కరంజే తాం నమస్యంతి తస్మాత్ పుత్రార్థినో నరాః ।
ఇమే త్వష్టాదశాన్యే వై గ్రహా మాంసమధుప్రియాః ॥ 36
ద్విపంచరాత్రం తిష్ఠంతి సతతం సూతికాగృహే ।
కద్రూః సూక్ష్మవపుర్భూత్వా గర్భిణీం ప్రవిశత్యథ ॥ 37
భుంక్తే సా తత్ర తం గర్భం సా తు నాగం ప్రసూయతే ।
ఇందువల్ల కొడుకులు కావాలి అని కోరేవారు కానుగు చెట్టుమీద ఉండే ఆమెను పూజిస్తారు. వీరు, ఇంకా పదునెమిదిగ్రహాలకు మద్యం, మాంసం అంటే చాలా ఇష్టం. ఇవి పదిరోజులు పురిటింటిలో మకాం వేస్తాయి. తరువాత కద్రువ సూక్ష్మరూపం ధరించి గర్భిణీ స్త్రీల గర్భంలో ప్రవేశిస్తుంది. అక్కడి శిశువును తినేస్తుంది. ఆ స్త్రీ సర్పాన్ని ప్రసవిస్తుంది. (36,37)
గంధర్వాణాం తు యా మాతా సా గర్భం గృహ్య గచ్ఛతి ॥ 38
తతో విలీనగర్భా సా మానుషీ భువి దృశ్యతే ।
గంధర్వుల మాత అయిన గ్రహం గర్భవతుల గర్భాన్ని అపహరిస్తుంది. అందువల్ల ఆ మానవస్త్రీ గర్భం అక్కడే లీనమైనట్లు కన్పిస్తుంది. (38 1/2)
యా జనిత్రీ త్వప్సరసాం గర్భమాస్తే ప్రగృహ్య సా ॥ 39
ఉపనష్టం తతో గర్భం కథయంతి మనీషిణః ।
అప్సరసల తల్లి అయిన గ్రహం గూడా గర్భాన్ని పట్టుకొంటుంది. అందువల్ల మేధావులయిన మానవులు ఫలానా స్త్రీ కడుపు పోయింది అని అంటారు. (39)
లోహితస్యోదధేః కన్యా ధాత్రీ స్కందస్య సా స్మృతా ॥ 40
లోహితాయనిరిత్యేవం కదంబే సా హి పూజ్యతే ।
అరుణ సముద్రకన్యక పేరు లోహితాయని. ఆమెను కుమారస్వామి తల్లి అని చెవుతారు. ఆమెను కడిమిచెట్టులో పూజిస్తారు. (40 1/2)
పురుషేషు యథా రుద్రః తథాఽఽర్యా ప్రమదాస్వపి ॥ 41
ఆర్యా మాతా కుమారస్య పృథక్ కామార్థమిజ్యతే ।
ఏవమేతే కుమారాణాం మయా ప్రోక్తా మహాగ్రహాః ॥ 42
యావత్ షోడశ వర్షాణి శిశూనాం హ్యశివాస్తతః ।
పురుషులలో రుద్రునివలె స్త్రీలలో ఆర్యాదేవి శ్రేష్ఠురాలు. ఆమె కార్తికేయుని తల్లి. జనులు తమకోరికలు తీరటానికి పైన చెప్పిన గ్రహాలకంటే విడిగా ఆమెను పూజిస్తారు. ఈ రీతిగా కుమారుని మహాగ్రహాలను గురించి చెప్పాను. పదహారేండ్లు నిండని పిల్లలకు ఈ గ్రహాలు కీడు కలిగిస్తాయి. (41, 42 1/2)
యే చ మాతృగణాః ప్రోక్తాః పురుషాశ్చైవ యే గ్రహాః ॥ 43
సర్వే స్కందగ్రహా నామ జ్ఞేయా నిత్యం శరీరిభిః ।
ఇంతవరకు చెప్పిన మాతృగణ, పురుషగ్రహాలు అన్నీ స్కంద గ్రహాలు అని శరీరధారులైన మానవులు అందరూ తెలుసుకోవాలి. (43)
తేషాం ప్రశమనం కార్యం స్నానం ధూపమతాంజనమ్ ।
బలికర్మోపహారాశ్చ స్కందస్యేజ్యావిశేషతః ॥ 44
కుమారస్వామికి స్నానం, ధూపం, గంధాదుల పూత, పుష్పాదిపూజ, కానుకలు అర్పించి స్కందగ్రహశాంతి చేయాలి. (44)
ఏవమభ్యర్చితాః సర్వే ప్రయచ్ఛంతి శుభం నృణామ్ ।
ఆయుర్వీర్యం చ రాజేమ్ద్ర సమ్యక్పూజానమస్కృతాః ॥ 45
రాజేంద్రా! ఈ విధంగా పూజించి, యథావిధిగా పూజాస్తుత్యాదులతో నమస్కరిస్తే ఈ గ్రహాలు అన్నీ మేలు చేస్తాయి. పూజించే వారికి ఆయువును, బలాన్ని కలిగిస్తాయి. (45)
ఊర్ధ్వం తు షోడశాద్ వర్షాద్ యే భవంతి గ్రహా నృణామ్ ।
తానహం సంప్రవక్ష్యామి నమస్కృత్య మహేశ్వరమ్ ॥ 46
పదునారేండ్ల తరువాత మానవులకు అనిష్టాలను కలిగించే గ్రహాలను గురించి - ముందుగా పరమేశ్వరునకు నమస్కరించి - చెపుతాను. (46)
యః పశ్యతి నరో దేవాన్ జాగ్రద్ వా శయితోఽపి వ ।
ఉన్మాద్యతి స తు క్షిప్రం తం తు దేవగ్రహం విదుః ॥ 47
మనుష్యుడు మేలుకొన్నప్పుడుగాని, నిద్రిస్తున్నప్పుడుగాని దేవతలను చూస్తే వెంటనే పిచ్చివాడు అవుతాడు. ఆ అనిష్టాన్ని కలిగించే గ్రహాన్ని దేవగ్రహం అంటారు. (47)
ఆసీనశ్చ శయానశ్చ యః పశ్యతి నరః పితౄన్ ।
ఉన్మాద్యతి స తు క్షిప్రం స జ్ఞేయస్తు పితృగ్రహః ॥ 48
కూర్చుని ఉన్నప్పుడు గాని, పడుకొన్నప్పుడుగాని పితృదేవతలను చూస్తే వెంటనే పిచ్చివాడు అయితే ఆ బాధ కలిగించే గ్రహాన్ని పితృగ్రహం అని తెలుసుకోవాలి. (48)
అవమన్యతి యః సిద్ధాన్ క్రుద్ధాశ్చాపి శపంతి యమ్ ।
ఉన్మాద్యతి స తు క్షిప్రం జ్ఞేయః సిద్ధగ్రహస్తు సః ॥ 49
సిద్ధపురుషులను అవమానిస్తే వారు కోపించి శపిస్తారు. ఆ శాపం కారణంగా పిచ్చివాడయితే అది సిద్ధగ్రహ ప్రభావంగా గ్రహించాలి. (49)
ఉపఘ్రాతి చ యో గంధాన్ రసాంశ్చాపి పృథగ్విధాన్ ।
ఉన్మాద్యతి స తు క్షిప్రం స జ్ఞేయో రాక్షసో గ్రహః ॥ 50
అనేకవిధాలైన సుగంధద్రవ్యాలను వాసనచూసి, వాటిరసాలను ఆస్వాదించినంతనే ఒకవ్యక్తి ఉన్మత్తుడు అయితే అతని మీద ఆ ప్రభావం చూసిన గ్రహాన్ని రాక్షసగ్రహం అని తెలుసుకోవాలి. (50)
గంధర్వాశ్చాపి యం దివ్యాః సంవిశంతి నరం భువి ।
ఉన్మాద్యతి స తు క్షిప్రం గ్రహః పైశాచ ఏవ సః ॥ 52
పిశాచ గ్రహావేశం నిత్యమూ జరగటం వల్ల ఒకవ్యక్తి పిచ్చివాడైతే ఆబాధను పైశాచగ్రహబాధ అంటారు. (52)
అవిశంతి చ యం యక్షాః పురుషం కాలపర్యయే ।
ఉన్మాద్యతి స తు క్షిప్రం జ్ఞేయో యక్షగ్రహస్తు సః ॥ 53
కాలక్రమాన యక్షావేశం జరగటం వల్ల ఒకవ్యక్తి పిచ్చివాడు అయితే దానిని యక్ష గ్రహబాధగా భావించాలి. (53)
యస్య దోషైః ప్రకుపితం చిత్తం ముహ్యతి దేహినః ।
ఉన్మాద్యతి స తు క్షిప్రం సాధనం తస్య శాస్త్రతః ॥ 54
ఒకవ్యక్తి మనస్సు వాత పిత్త కఫాలనే మూడుదోషాల వల్ల ప్రకోపిస్తే త్వరగా మతితప్పి పిచ్చివాడు అవుతాడు. వానికి వైద్యశాస్త్ర ప్రకారం చికిత్స చేయాలి. (54)
వైక్లవ్యాచ్చ భయోచ్ఛైవ ఘోరాణాం చాపి దర్శనాత్ ।
ఉన్మాద్యతి స తు క్షిప్రం సాంత్వం తస్య తు సాధనమ్ ॥ 55
గాబరావల్ల గాని, భయం వల్ల గాని, ఘోరమైన వాటిని చూడటం వల్ల గాని వెంటనే పిచ్చివాడయ్యే వ్యక్తికి ధైర్యం చెప్పటమే తగిన చికిత్స అవుతుంది. (55)
కశ్చిత్ క్రీడితుకామో వై భోక్తుకామస్తథాపరః ।
అభికామస్తథైవావ్యః ఇత్యేష త్రివిధో గ్రహః ॥ 56
ఒక విధమైన గ్రహానికి ఆడుకోవాలి అని, ఇంకొక గ్రహానికి తినాలి అని, మరొకగ్రహానికి సంయోగం పొందాలి అని కోరిక ఉంటుంది. ఈరీతిగా గ్రహాలప్రకృతి మూడురకాలు. (56)
యావత్ సప్తతివర్షాణి భవంత్యేతే గ్రహా నృణామ్ ।
అతః పరం దేహినాం తు గ్రహతుల్యో భవేజ్జ్వరః ॥ 57
డెబ్బది సంవత్సరాలు నిండేదాకా ఈ గ్రహాలు మానవులను బాధిస్తాయి. ఆ తరువాత అందరు శరీరధారులను గ్రహాలతో సమానంగా జ్వరం బాధిస్తుంది. (57)
అప్రకీర్ణేంద్రియం దాంతం శుచిం నిత్యమతంద్రితమ్ ।
ఆస్తికం శ్రద్ధధానం చ వర్జయంతి సదా గ్రహాః ॥ 58
ఇంద్రియోద్వేగం లేనివానిని, జితేంద్రియుని, పవిత్రుని, పరాకులేనివానిని, ఆస్తికుని, శ్రద్ధగలవానిని ఏ గ్రహమూ సమీపించదు. గ్రహాలన్నీ దూరంగా నిలుస్తాయి. (58)
ఇత్యేష తే గ్రహోద్దేశః మానుషాణాం ప్రకీర్తితః ।
న స్పృశంతి గ్రహా భక్తాన్ నరాన్ దేవం మహేశ్వరమ్ ॥ 59
రాజా! ఈరీతిగా నేను మానవులకు కలిగే గ్రహబాధను సంక్షేపంగా, వివరంగా చెప్పాము. పరమేశ్వరునీ ఆయన భక్తులయిన మానవులను ఈ గ్రహాలు తాకలేవు. (59)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి మార్కండేయసమాస్యాపర్వణి ఆంగిరసే మనుష్య గ్రహకథనే త్రింశదధికద్విశతతమోఽధ్యాయః ॥ 230 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున మార్కండేయ సమస్యాపర్వమను ఉపపర్వమున ఆంగిరసోపాఖ్యానమున మనుష్యగ్రహకథనము అను రెండు వందల ముప్పదవ అధ్యాయము. (230)