231. రెండు వందల ముప్పది ఒకటవ అధ్యాయము
స్కందుడు స్వాహాదేవిని గౌరవించుట, శివదేవగణసహిత స్కందుని భద్రవటగమనము.
మార్కండేయ ఉవాచ
యదా స్కందేన మాతౄణామ్ ఏవమేతత్ ప్రియం కృతమ్ ।
అథైనమబ్రవీత్ స్వాహా మమ పుత్రస్త్వమౌరసః ॥ 1
మార్కండేయ ముని ఇలా అన్నాడు - యుధిష్ఠిరా! స్కందుడు ఇలా మాతృగణాల కోరిక తీర్చిన తరువాత స్వాహాదేవి వచ్చి ఇలా అంది. "నీవు నాకు పుట్టిన కుమారుడవు. (1)
ఇచ్ఛామ్యహం త్వయా దత్తాం ప్రీతిం పరమదుర్లభామ్ ।
తామబ్రవీత్ తతః స్కందః ప్రీతిమిచ్ఛసి కీదృశీమ్ ॥ 2
అందువల్ల నీవు నాకు పరమదుర్లభమైన సంతృప్తిని సమకూర్చాలి." 'అమ్మా! నీకున్న కోరిక ఏమి?" అని స్కందుడు ప్రశ్నించాడు. (2)
స్వాహో వాచ
దక్షస్యాహం ప్రియా కన్యా స్వాహా నామ మహాభుజ ।
బాల్యాత్ర్పభృతి నిత్యం చ జాతకామా హుతాశనే ॥ 3
స్వాహాదేవి అన్నది - మహాభుజా! దక్షప్రజాపతికి మిక్కిలి ఇష్టురాలైన పుత్రికను నేను. నాపేరు స్వాహ. చిన్ననాటి నుంచి నాకు అగ్ని దేవునియందు కోరిక ఉంది. (3)
న స మాం కామినీం పుత్ర సమ్యక్ జానాతి పావకః ।
ఇచ్ఛామి శాశ్వతం వాసం వస్తుం పుత్ర సహాగ్నినా ॥ 4
వత్సా! నాకు తనమీద ప్రేమ ఉన్నదని ఆయన బాగా ఎరుగడు. ఆయనతో శాశ్వతంగా కలిసి ఉండాలని నాకోరిక. (4)
స్కంద ఉవాచ
హవ్యం కవ్యం చ యత్కించిద్ ద్విజానాం మంత్రసంస్తుతమ్ ।
హోష్యంత్యగ్నౌ సదా దేవి స్వాహేత్యుక్త్వా సముద్ధృతమ్ ॥ 5
అద్యప్రభృతి దాస్యంతి సువృత్తాః సత్పథే స్థితాః ।
ఏవమగ్నిస్త్వయా సార్ధం సదా వత్స్యతి శోభనే ॥ 6
స్కందుడన్నాడు - దేవీ! ఇవ్వాళ నుంచి మంచి మార్గాన నడిచేవారు, సదాచారులు, ధర్మాత్ములు అయిన మనుజులు దేవతలకు, పితృదేవతలకు హవ్యకవ్యరూపంగా బ్రాహ్మణుల వేదమంత్రోచ్చారణతో అగ్నిలో వేసే ఆహుతులను స్వాహాకారంతో అర్పిస్తారు. కాంతిమూర్తీ! ఇందువలన అగ్నిదేవుడు నిరంతరమూ నీతో కూడి ఉంటాడు. (5,6)
మార్కండేయ ఉవాచ
ఏవముక్తా తతః స్వాహా తుష్టా స్కందేన పూజితా ।
పావకేన సమాయుక్తా భర్ర్తా స్కందమపూజయత్ ॥ 7
మార్కండేయుడన్నాడు - ఇలా స్కందుడు స్వాహాదేవికి చెప్పి పూజించాడు. తరువాత అగ్నిదేవునితో కలిసి స్వాహాదేవి స్కందుని ఆదరించింది. (7)
తతో బ్రహ్మా మహాసేనం ప్రజాపతిరథాబ్రవీత్ ।
అభిగచ్ఛ మహాదేవం పితరం త్రిపురార్దనమ్ ॥ 8
అపుడు ప్రజాపతి అయిన బ్రహ్మ మహాసేనునితో ఇలా అన్నాడు - త్రిపురాలను ధ్వంసం చేసిన నీ తండ్రి పరమేశ్వరుని దర్శించు. (8)
రుద్రేణాగ్నిం సమావిశ్య స్వాహామావిశ్య చోమయా ।
హితార్థం సర్వలోకానాం జాతస్త్వమపరాజితః ॥ 9
రుద్రదేవుడు అగ్నిలో, పార్వతీ దేవి స్వాహాదేవిలో ప్రవేశించి లోకాలు అన్నింటికీ మేలుచేయాలని పరాజయం ఎరుగని మహావీరుడైన నిన్ను కన్నారు. (9)
ఉమాయోన్యాం చ రుద్రేణ శుక్రం సిక్తం మహాత్మనా ।
అస్మిన్ గిరౌ నిపతితం మింజికామింజికం యతః ॥ 10
సంభూతం లోహితోదే తు శుక్రశేషమవాపతత్ ।
సూర్యరశ్మిషు చాప్యన్యద్ అన్యచ్చైవాపతద్ భువి ॥ 11
ఆసక్తమన్యద్ వృక్షేషు తదేవం పంచధాపతత్ ।
తత్ర తే వివిధాకారాః గణా జ్ఞేయా మనీషిభిః ।
తవ పారిషదా ఘోరాః య ఏతే పిశితాశినః ॥ 12
పరమేశ్వరుడు ఉమాదేవి గర్భంలో నిక్షేపించిన వీర్యంలో కొంతభాగం ఈ పర్వతం మీద పడినది. మింజికామింజికలు అనే జంట జన్మించారు.
మిగిలిన వీర్యంలోని ఒక చిన్నభాగం రక్తసాగరంలోను, ఇంకాకొంత సూర్యకిరణాలలోను, ఇంకా కొంత భూమి మీద, మరికొంత అంశ చెట్ల మీద పడింది. ఈరీతిగా ఆయన తేజస్సు ఐదుభాగాలుగా విడిపోయి పడిపోయింది. దానివలననే విభిన్నాకారాలు గల మాంసభక్షకులు ఆయన అనుచరులు అయ్యారు. వారిని విద్వాంసులే తెలుసుకోగలరు. (10-12)
ఏవమస్త్వితి చాప్యుక్త్వా మహాసేనో మహేశ్వరమ్ ।
అపూజయదమేయాత్మా పితరం పితృవత్సలః ॥ 13
అపరిమితమైన ఆత్మబలం గల్గి, పితృభక్తుడు అయిన స్కందుడు 'అలాగే జరగనీ' అని తన తండ్రి అయిన పరమశివుని పూజించాడు. (13)
మార్కండేయ ఉవాచ
అర్కపుష్పైస్తు తే పంచ గణాః పూజ్యా ధనార్థిభిః ।
వ్యాధిప్రశమనార్థం చ తేషాం పూజాం సమాచరేత్ ॥ 14
మార్కండేయముని అన్నాడు - రాజా! ధనం కావాలి అనుకొనే వ్యక్తి జిల్లేడుపూలతో ఆ అయిదుగణాలను పూజించాలి. రోగాలు తగ్గటానికి గూడా ఆ గణాల పూజ చేయాలి. (14)
మింజికామింజికం చైవ మిథునం రుద్రసంభవమ్ ।
నమస్కార్యం సదైవేహ బాలానాం హితమిచ్ఛతా ॥ 15
పరమశివుని వలన జన్మించిన మింజికామింజికలనేజంటకు తమ పిల్లల మేలు కోరేవారు ఎల్లప్పుడూ నమస్కరించాలి. (15)
స్త్రియో మానుషమాంసాదాః వృద్ధికా నామ నామతః ।
వృక్షేషు జాతాస్తా దేవ్యః నమస్కార్యాః ప్రజార్థిభిః ॥ 16
వృక్షాల మీద నుంచి పడిన శుక్రం వలన వృద్ధిక అనేపేరు గల స్త్రీలు జన్మించారు. వీరు మానవమాంసాన్ని తినేవారు. సంతానం కావాలి అని కోరుకొనేవారు ఈ దేవతల ముందు తలవంచి నమస్కరించాలి. (16)
ఏవమేతే పిశాచానామ్ అసంఖ్యేయా గణాః స్మృతాః ।
ఘంటాయాః సపతాకాయాః శృణు మే సంభవం నృప ॥ 17
ఈ రీతిగా లెక్కలేనన్ని పిశాచగణాలను చెప్పినారు. 'రాజా! ఇప్పుడు నీకు కుమారుని గంట, జెండా పుట్టిన వృత్తాంతం చెపుతాను. విను. (17)
ఐరావతస్య ఘంటే ద్వే వైజయంత్యావితి శ్రుతే ।
గుహస్య తే స్వయం దత్తే క్రమేణానాయ్య ధీమతా ॥ 18
ఇంద్రుని ఐరావతం అనే ఏనుగుకు అమర్చే 'వైజయంతి' అనే పేరు గల రెండు గమ్టలు ఉండేవి. వానిని మేధావి అయిన ఇంద్రుడు తెచ్చి కుమారస్వామికి అర్పించాడు. (18)
ఏకా తత్ర విశాఖస్య ఘంటా స్కందస్య చాపరా ।
పతాకా కార్తికేయస్య విశాఖస్య చ లోహితా ॥ 19
ఆ గంటలు రెండింటిలో ఒక దానిని విశాఖుడు' ఇంకొక దానిని స్కందుడు తీసికొన్నారు. కార్తికేయుడు, విశాఖుడు అని వారి ఇద్దరి పతాకలు అరుణవర్ణం గలవి. (19)
యాని క్రీడనకాన్యస్య దేవైర్దత్తాని వై తదా ।
తైరేవ రమతే దేవః మహాసేనో మహాబలః ॥ 20
మహాబలుడైన మహాసేనుడు దేవతలు ఇచ్చిన బొమ్మలతోనే ఆడుకొనేవాడు. (20)
స సంవృతః పిశాచానాం గణైర్దేవగణైస్తథా ।
శుశుభే కాంచనే శైలే దీప్యమానః శ్రియా వృతః ॥ 21
మహత్తరతేజఃపుంజంతో వెలుగొందే తేజస్వియైన కార్తికేయుడు ఆ సమయంలో బంగారు కొండమీద పిశాచాలు, దేవసమూహాలు చుట్టూ ఉండగా విరాజిల్లాడు. (21)
తేన వీరేణ శుశుభే స శైలః శుభకాననః ।
ఆదిత్యేనేవాంశుమతా మందరశ్చారుకందరః ॥ 22
కిరణసమూహంతో విరాజిల్లే సూర్యోదయం వలన సుందరమైన గుహలు గల మేరుపర్వతం ప్రకాశించినట్లు, మహావీరుడైన కుమారస్వామి నివసించటం వలన సుందరమైన వనమున్న ఆ శ్వేతపర్వతం వెలుగొందినది. (22)
సంతానకవనైః ఫుల్లైః కరవీరవనైరపి ।
పారిజాతవనైశ్చైవ జపాశోకవనైస్తథా ॥ 23
కదంబతరుషండైశ్చ దివ్యైర్మృగగణైరపి ।
దివ్యైః పక్షిగణైశ్చైవ శుశుభే శ్వేతపర్వతః ॥ 24
చక్కగా వికసించిన కల్పవృక్షవనాలతో, గన్నేరు వనాలతో, పారిజాతవనాలతో, దాసాని వనాలతో, అశోకవనాలతో కదంబ వృక్షసమూహాలతో, దివ్య మృగాలతో, దివ్య పక్షిసమూహాలతో ఆ శ్వేతపర్వతం శోభిల్లింది. (23,24)
తత్ర దేవగణాః సర్వే సర్వే దేవర్షయస్తథా ।
మేఘతూర్యరవాశ్చైవ క్షుభ్ధోదధిసమస్వనాః ॥ 25
అక్కడికి సమస్తదేవగణాలు దేవర్షుల సమూహాలు వచ్చి నివసించేవి. సముత్తుంగ తరంగాలతో పెద్దగా ధ్వనించే సముద్రఘోషవలె నున్న మేఘాల దివ్య వాద్యాల ధ్వనులు అన్నివైపుల నుంచి వినిపిస్తున్నవి. (25)
తత్ర దివ్యాశ్చ గంధర్వా నృత్యంతేఽప్సరసస్తథా ।
హృష్టానాం తత్ర భూతానాం శ్రూయతే నినదో మహాన్ ॥ 26
అక్కడ దేవజాతీయ గంధర్వులు, అప్సరసలు నృత్యం చేస్తున్నారు. సంతోషపూర్ణులైన సమస్తప్రాణుల కోలాహలం వినిపిస్తున్నది. (26)
ఏవం సేంద్రం జగత్ సర్వం శ్వేతపర్వతసంస్థితమ్ ।
ప్రహృష్టం ప్రేక్షతే స్కందం న చ గ్లాయతి దర్శనాత్ ॥ 27
ఈ రీతిగా ఇంద్రునితో కూడ జగత్తు అంతా శ్వేతపర్వతం మీద స్కందుని దర్శింపసాగింది. ఆయనను ఎంతసేపు దర్శించినా ఆప్రాణులకు తృప్తి కలగటం లేదు. (27)
మార్కండేయ ఉవాచ
యదాభిషిక్తో భగవాన్ సైనాపత్యేన పావకిః ।
తదా సంప్రస్థితః శ్రీమాన్ హృష్టో భద్రవటం హరః ॥ 28
రథేనాదిత్యవర్ణేన పార్వత్యా సహితః ప్రభుః ।
(అనుయాతః సురైః సర్వైః సహస్రాక్షపురోగమైః ।)
సహస్రం తస్య సింహానాం తస్మిన్ యుక్తం రథోత్తమే ॥ 29
మార్కండేయ మహర్షి అన్నాడు - అగ్నిపుత్రుడైన కార్తికేయుడు దేవసేనాపతిగా పట్టాభిషిక్తుడయినప్పుడు పరమశివుడు పార్వతీదేవితో గూడి, సూర్యసమానమైన రథాన్ని ఎక్కి, ప్రసన్నుడై, భద్రవటంవైపు వచ్చాడు. అప్పుడు ఇంద్రాది దేవతలు ఆయన వెనక వచ్చారు. శివుడు అధిరోహించిన ఆ రథానికి వేయి సింహాలను కట్టారు. (28,29)
ఉత్పపాత దివం శుభ్రం కాలేనాభిప్రచోదితమ్ ।
తే పిబంత ఇవాకాశం త్రాసయంతశ్చరాచరాన్ ॥ 30
సింహా నభస్యగచ్ఛంత నదంతశ్చారుకేసరాః ।
సాక్షాత్తుగా కాలుడు నడుపుతున్న ఆ రథం ఆకాశంలో పరుగులు తీస్తున్నది. దానికి సింహాలను కట్టారు. అందమైన జూలుతో శోభిల్లే ఆ సింహాలు చరాచరప్రాణులను భయపెడుతూ, ఆకాశాన్నే మ్రింగుతున్నట్లు గర్జన చేస్తూ, పోతున్నవి. (30 1/2)
తస్మిన్ పథే పశుపతిః స్థితో భాత్యుమయా సహ ॥ 31
విద్యుతా సహితః సూర్యః సేంద్రచాపే ఘనే యథా ।
ఇంద్రధనుస్సుతో గూడిన మేఘసమూహాలలోని మెరుపు తీగతో ఉన్న సూర్యుని వలె ఆ రథంలో పార్వతీదేవితో గూడిన శివుడు ప్రకాశించాడు. (31 1/2)
అగ్రతస్తస్య భగవాన్ ధనేశో గుహ్యకైః సహ ॥ 32
ఆస్థాయ రుచిరం యాతి పుష్పకం నరవాహనః ।
ఆయన రథానికి ముందు నరవాహనుడైన కుబేరుడు యక్షులతో కూడ అందమైన పుష్పకవిమానాన్ని అధిరోహించి వెళ్ళుతున్నాడు. (32 1/2)
ఐరావతం సమాస్థాయ శక్రశ్చాపి సురైః సహ ॥ 33
పృష్ఠతోఽనుయయౌ యాంతం వరదం వృషభధ్వజమ్ ।
వృషభధ్వజుడైన పరమేశ్వరుని రథానికి వెనుకగా ఇంద్రుడు ఐరావతాన్ని ఎక్కి దేవతలతో గూడ వెళ్ళుతున్నాడు. (33 1/2)
జృంభకైర్యక్షరక్షోభిః స్రగ్విభిః సమలంకృతః ॥ 34
యాతృమోఘో మహాయక్షః దక్షిణం పక్షమాస్థితః ।
పూలమాలలను ధరించిన జృంభకగణం, యక్షులు, రాక్షసులతో వెలుగొందే మహాయక్షుడు అమోఘుడై దక్షిణం వైపున వెళ్ళుతున్నాడు. (34 1/2)
తస్య దక్షిణతో దేవాః బహవశ్చిత్రయోధినః ॥ 35
గచ్ఛంతి వసుభిః సార్ధం రుద్రైశ్చ సహ సంగతాః ।
ఆయనకు కుడివైపున విచిత్రమైన యుద్ధం చేసే అనేక దేవతలు, వసువులు, రుద్రులతో కలసి వెళ్ళుతున్నారు. (35)
యమశ్చ మృత్యునా సార్ధం సర్వతః పరివారితః ॥ 36
ఘోరైర్వ్యాధిశతైర్యాతి ఘోరరూపవపుస్తథా ।
మృత్యుదేవతతో గూడిన యముడు మహాభయంకరాకారాన్ని ధరించి, దేవతలతో కూడా వెళ్ళుతున్నాడు. ఆయనకు నాలుగువైపులా భయంకరమైన రోగాలు ఆకారం దాల్చి వెళ్ళుతున్నవి. (36 1/2)
యమస్య పృష్ఠతశ్చైవ ఘోరస్త్రిశిఖరః శితః ॥ 37
విజయో నామ రుద్రస్య యాతి శూలః స్వలంకృతః ।
యమునికి వెనుక విజయమనే పేరు గల శంకరుని త్రిశూలం మూడుకొనలు గలిగి తీక్షణమై భయంకరంగా ఉంది. ఆ త్రిశూలాన్ని సింధూరం మున్నగువాటితో అలంకరించారు. (37 1/2)
తముగ్రపాశో వరుణః భగవాన్ సలిలేశ్వరః ॥ 38
పరివార్య శనైర్యాతి యాదోభిర్వివిధైర్వృతః ।
జలాధిపతి యైన వరుణుడు భయంకరశూలాన్ని ధరించి, ఆ త్రిశూలానికి ప్రదక్షిణంగా వెళ్తున్నాడు. ఆయన చుట్టూ అన్ని రకాల జలజంతువులూ ఉన్నాయి. (38 1/2)
పృష్ఠతో విజయస్యాపి యాతి రుద్రస్య పట్టిశః ॥ 39
గదాముసలశక్త్యాద్యైః వృతః ప్రహరణోత్తమైః ।
ఆ విజయం అనే ఆయుధం వెంట శివుని ఇంకొక ఆయుధం పట్టిశం (అడ్డం కత్తి) వెళ్ళుతున్నది. దానికి గద, ముసలం (రోకలి), శక్తి మున్నగు ఉత్తమాయుధాలు చుట్టూ ఉన్నవి. (39 1/2)
పట్టిశం త్వన్వగాద్ రాజన్ ఛత్రం రౌద్రం మహాప్రభమ్ ॥ 40
కమండలుశ్చాప్యను తం మహర్షిగణసేవితః ।
రాజా! పట్టిశం వెనకాల కాంతిమంతమైన పరమశివదేవుని వెల్లగొడుగు వెళ్ళుతున్నది. దాని వెనుక మహర్షుల సమూహంతో సేవితమైన కమండలం వెళ్ళుతున్నది. (40 1/2)
తస్య దక్షిణతో భాతి దండో గచ్ఛన్ శ్రియా వృతః ॥ 41
భృగ్వంగిరోభిః సహితః దైవతైశ్చానుపూజితః ।
కమండలానికి కుడి ప్రక్కన వెళుతున్న తేజోవంతమైన దండం చక్కని కాంతితో ప్రకాశిస్తున్నది. దానితోపాటు భృగువు, అంగిరసుడు మున్నగు మహర్షులు ఉన్నారు. దేవతలు దాన్ని పూజిస్తున్నారు. (41 1/2)
ఏషాం తు పృష్ఠతో రుద్రః విమలే స్యందనే స్థితః ॥ 42
యాతి సంహర్షయన్ సర్వాన్ తేజసా త్రిదివౌకసః ।
వీటికి అన్నింటికి వెనక ప్రకాశవంతమైన రథాన్ని ఎక్కి, రుద్రదేవుడు వెళ్ళుతున్నాడు. ఆయన తేజస్సు వల్ల అందరి దేవతల సంతోషం అధికమవుతున్నది. (42 1/2)
ఋషయశ్చాపి దేవాశ్చ గంధర్వా భుజగాస్తథా ॥ 43
నద్యో హ్రదాః సముద్రాశ్చ తథైవాప్సరసాం గణాః ।
నక్షత్రాణి గ్రహాశ్చైవ దేవానాం శిశవశ్చ యే ॥ 44
ఋషులు, దేవతలు, గంధర్వులు, నాగులు నదులు, లోతైన సరస్సులు, సముద్రాలు, అప్సరసలు, నక్షత్రాలు, గ్రహాలు, దేవపుత్రులు వెళ్ళుతున్నారు. (43,44)
స్త్రియశ్చ వివిధాకారాః యాంతి రుద్రస్య పృష్ఠతః ।
సృజంత్యః పుష్పవర్షాణి చారురూపా వరాంగనాః ॥ 45
మనోహరసౌందర్యం కలిగి నానావిధాలైన ఆకారాలు ధరించిన అందమైన స్త్రీలు పూలవర్షం కురిపిస్తూ పరమేశ్వరుని వెనక వెళ్ళుతున్నారు. (45)
పర్జన్యశ్చాప్యనుయయౌ నమస్కృత్య పినాకినమ్ ।
ఛత్రం చ పాండురం సోమః తస్య మూర్ధన్యధారయత్ ॥ 46
పినాకధన్వియగు శంకరునికి నమస్కరించి పర్జన్యదేవుడూ వెంటవచ్చాడు. చంద్రుడు ఆ దేవునికి గొడుగు పట్టాడు. (46)
చామరే చాపి వాయుశ్చ గృహీత్వాగ్నిశ్చ ధిష్ఠితౌ ।
శక్రశ్చ పృష్ఠతస్తస్య యాతి రాజన్ శ్రియా వృతః ॥ 47
సహ రాజర్షిభిః సర్వైః స్తువానో వృషకేతనమ్ ।
అగ్నిదేవ వాయుదేవులు వింజామరలను గైకొని రెండు ప్రక్కల ఉండి వీస్తున్నారు. తేజస్వియగు ఇంద్రుడు రాజర్షులతో గూడి పరమాత్మ అయిన శివుని స్తుతిస్తూ వెనుక వచ్చాడు. (47 1/2)
గౌరీ విద్యాథ గాంధారీ కేశినీ మిత్రసాహ్వయా ॥ 48
సావిత్ర్యా సహ సర్వాస్తాః పార్వత్యా యాంతి పృష్ఠతః ।
తత్ర విద్యాగణాః సర్వే యే కేచిత్ కవిభిః కృతాః ॥ 49
గౌరి, విద్య, గాంధారి, కేశిని, మిత్ర, సావిత్రి అనేవారూ పార్వతీదేవి వెనుక వైపున నడచారు. విద్వాంసులు స్మరించిన విద్యాసమూహాలు కూడా వారితోపాటు ఉన్నారు. (48,49)
తస్య కుర్వంతి వచనం సేంద్రా దేవాశ్చమూముఖే ।
గృహీత్వా తు పతాకాం వై యాత్యగ్రే రాక్షసో గ్రహః ॥ 50
ఇంద్రాదిదేవతలు సేనకుముందున్న పరమేశ్వరుని ఆజ్ఞలను నిర్వర్తిస్తున్నారు. నవగ్రహాలలో నొకడగు నిర్ ఋతి పతాకను పట్టుకొని ముందు వెళ్ళుతున్నాడు. (50)
వ్యాపృతస్తు శ్మశానే యః నిత్యం రుద్రస్య వై సఖా ।
పింగలో నామ యక్షేంద్రః లోకస్యానందదాయకః ॥ 51
పరమేశ్వరుని మిత్రుడు, శ్మశానంలో ఆయనకు రక్షకుడూ అయిన పింగళుడు అనే యక్షరాజు జగత్తుకు ఆనందం కలిగిస్తూ ఆ యుద్ధయాత్రలో శివునితోపాటు ఉన్నాడు. (51)
ఏభిశ్చ సహితో దేవః తత్ర యాతి యథాసుఖమ్ ।
అగ్రతః పృష్ఠతశ్చైవ న హి తస్య గతిర్ర్ధువా ॥ 52
వీరందరితో శివుడు సుఖంగా భద్రవటానికి వెళ్ళుతున్నాడు. ఆయన ఒకసారి సేనకు ముందుగాను, ఇంకొకప్పుడు సేనకు వెనుకగాను నిశ్చితగతిలేకుండా వెళ్ళుతున్నాడు. (52)
రుద్రం సత్కర్మభిర్మర్త్యాః పూజయంతీహ దైవతమ్ ।
శివమిత్యేవ యం ప్రాహుః ఈశం రుద్రం పితామహమ్ ॥ 53
భావైస్తు వివిధాకారైః పూజయంతి మహేశ్వరమ్ ।
మరణధర్మం గల మానవులు ఈ లోకంలో మంచిపనులు చేస్తూ పరమేశ్వరారాధనలు చేస్తూంటారు. ఈయనను శివుడు, ఈశానుడు, రుద్రుడు, పితామహుడు అని వ్యవహరిస్తారు. జనులు నానావిధాలుగా ఈయనను పూజిస్తారు. (53 1/2)
దేవసేనాపతిస్త్వేవం దేవసేనాభిరావృతః ।
అనుగచ్ఛతి దేవేశం బ్రహ్మణ్యః కృత్తికాసుతః ॥ 54
ఈ రీతిగా బ్రాహ్మణుల మేలుకోరేవాడు, దేవసేనాపతి, కృత్తికాపుత్రుడైన కుమారస్వామి కూడా దేవసైన్యం చుట్టూ ఉన్న శివునికి వెనక వెళ్ళుతున్నాడు. (54)
అథాబ్రవీన్మహాసేనం మహాదేవో బృహద్ వచః ।
సప్తమం మారుతస్కంధం రక్ష నిత్యమతంద్రితః ॥ 55
ఆ తరువాత మహాదేవుడు 'వత్సా! నీవు చాలా మెలకువతో మరుత్ స్కంధాలనే దేవతలలో ఏడవవ్యూహాన్ని రక్షిస్తూ ఉండు.' అని కుమారస్వామితో అన్నాడు. (55)
స్కంద ఉవాచ
సప్తమం మారుతస్కంధం పాలయిష్యామ్యహం ప్రభో ।
యదన్యదపి మే కార్యం దేవ తద్ వద మాచిరమ్ ॥ 56
స్కందుడిలా అన్నాడు. దేవా! నేను సప్తమస్కంధాన్ని తప్పక రక్షిస్తాను. ఈపనేకాక ఇంకేదయినా కర్తవ్యం ఉంటే ఆలస్యం లేకుండా చెప్పవలసింది. (56)
రుద్ర ఉవాచ
కార్యేష్వహం త్వయా పుత్ర సందష్టవ్యః సదైవ హి ।
దర్శనాన్మమ భక్త్యా చ శ్రేయః పరమవాప్స్యసి ॥ 57
రుద్రుడు అన్నాడు - కుమారా! పనివచ్చినప్పుడు నీవు నన్ను తప్పక కలవాలి. నాదర్శనం వల్లా, నాభక్తివల్లా నీకు మంచి జరుగుతుంది. (57)
మార్కండేయ ఉవాచ
ఇత్యుక్త్వా విససర్జైవం పరిష్వజ్య మహేశ్వరః ।
విసర్జతే తతః స్కందే బభూవౌత్పాతికం మహత్ ॥ 58
మార్కండేయుడన్నాడు - ఇలా అని, పరమశివుడు కార్తికేయుని గాఢంగా కౌగిలించుకొని, పంపించాడు. కుమారుడు వెళ్ళినవెంటనే గొప్ప అపశకునాలు కనిపించసాగాయి. (58)
సహసైవ మహారాజ దేవాన్ సర్వాన్ ప్రమోహయత్ ।
జజ్వాల ఖం సనక్షత్రం ప్రమూఢం భువనం భృశమ్ ॥ 59
వెంటనే సమస్తదేవతలను కలవరపరుస్తూ నక్షత్రాలతో గూడా ఆకాశం మండసాగింది. లోకం అంతా పరవశం అయిపోయింది. (59)
చచాల వ్యనదచ్చోర్వీ తమోభూతం జగద్ బభౌ ।
తతస్తద్ దారుణం దృష్ట్వా క్షుభితః శంకరస్తదా ॥ 60
ఉమా చైవ మహాభాగా దేవాశ్చ సమహర్షయః ।
భూమి కంపింపసాగింది. జగత్తు అంతా చీకటిలో మునిగింది. భూమిలో నుండి ధ్వనులు రాసాగాయి. అప్పుడు ఆ తీవ్రమయిన ఉత్పాతాలను చూసి శంకరుడు, పార్వతి, దేవతలు, మహర్షులు క్షోభిల్లారు. (60 1/2)
తతస్తేషు ప్రమూఢేషు పర్వతాంబుదసంనిభమ్ ॥ 61
నానాప్రహరణం ఘోరమ్ అదృశ్యత మహద్ బలమ్ ।
తద్ వై ఘోరమసంఖ్యేయం గర్జచ్చ వివిధా గిరః ॥ 62
వారంతా మోహపరవశులయ్యారు. అపుడే పర్వతాల్లా, మేఘసమూహంలా విశాలంగా భయంకరంగా ఉన్న దానవసైన్యం కనిపించింది. అది అస్త్రశస్త్రాలతో కూడి ఉంది. ఆ సైన్యసంఖ్య లెక్కింప వీలుగాకుండా ఉన్నది. ఆ సేన నానావిధాలుగా మాట్లాడుతూ తీవ్రగర్జనలు చేస్తున్నది. (61,62)
అభ్యద్రవద్ రణే దేవాన్ భగవంతం చ శంకరమ్ ।
తైర్విసృష్టాన్యనీకేషు బాణజాలాన్యనేకశః ॥ 63
ఆ దైత్యసైన్యం యుద్ధరంగంలో దేవతల మీదా, శివుని మీద దండయాత్రకై హెచ్చరికలు చేసింది. రాక్షసులు దేవతాసైన్యం మీద చాలా సార్లు బాణవర్షం కురిపించారు. (63)
పర్వతాశ్చ శతఘ్న్యశ్చ ప్రాసాసిపరిఘా గదాః ।
నిపతద్భిశ్చ తైర్ఘోరైః దేవానీకం మహాయుధైః ॥ 64
క్షణేన వ్యద్రవత్ సర్వం విముఖం చాప్యదృశ్యత ।
రాళ్ళు, ఫిరంగులు, ప్రాసాలు, ఖడ్గాలు, పరిఘలు, గదలతో యుద్ధం జరుగుతున్నది. ఈ భయంకరమైన మహాస్త్రాల దెబ్బలతో దైవసైన్యం అంతా ఒక్కక్షణంలో వెన్నుచూపి పారిపోయింది. సైన్యం అంతా యుద్ధానికి పెడముఖం అయినట్లు కనిపించింది. (64)
నికృత్తయోధనాగాశ్వం కృత్తాయుధమహారథమ్ ॥ 65
దానవైరర్దితం సైన్యం దేవానాం విముఖం బభౌ ।
అనేకయోధులు, ఏనుగులు, గుఱ్ఱాలు ముక్కలు ముక్కలు అయ్యాయి. లెక్కలేనన్ని ఆయుధాలు, పెద్దపెద్ద రథాలు ముక్కలయినాయి. ఇలాగా రాక్షసుల బాధ తట్టుకోలేక దేవతలసేన యుద్ధంలో వెనుదిరిగింది. (65)
అసురైర్వధ్యమానం తత్ పావకైరివ కాననమ్ ॥ 66
అపతద్ దగ్ధభూయిష్ఠం మహాద్రుమవనం యథా ।
రాక్షసుల ధాటికి తట్టుకోలేక అగ్నిజ్వాలలకు ఆహుతియైన దేవసైన్యం విరిగిపోయి నాశనమైన మహావృక్షాలు గల వనం లాగా అయింది. (66)
తే విభిన్నశిరోదేహాః ప్రాద్రవంతో దివౌకసః ॥ 67
న నాథమధిగచ్ఛంతి వధ్యమానా మహారణే ।
శిరస్సులు, శరీరాలు పగిలిపోయి చీలిపోగా పారిపోతున్న దేవతలు మహాయుద్ధంలో రాక్షసులు గాయపరుస్తూండగా దిక్కులేనివారయ్యారు. (67)
అథ తద్ విద్రుతం సైన్యం దృష్ట్వా దేవః పురందరః ॥ 68
ఆశ్వాసయన్నువాచేదం బలభిద్ దానవార్దితమ్ ।
భయం త్యజత భద్రం వః శూరాః శస్త్రాణి గృహ్ణత ॥ 69
కురుధ్వం విక్రమే బుద్ధిం మా వః కాచిద్ వ్యధా భవేత్ ।
జయతైనాన్ సుదుర్వృత్తాన్ దానవాన్ ఘోరదర్శనాన్ ॥ 70
అభిద్రవత భద్రం వో మయా సహ మహాసురాన్ ।
శక్రస్య వచనం శ్రుత్వా సమాశ్వస్తా దివౌకసః ॥ 71
తరువాత తనసైన్యం రాక్షసబాధతో పారిపోతుండగా చూచి ధైర్యం కలగటానికి ఇంద్రుడు ఇలా అన్నాడు - 'మహావీరులారా! భయం వదిలేయండి. అందువల్ల మీకు మేలు కలుగుతుంది. ఆయుధాలను మళ్ళీ తీసుకోండి.
పరాక్రమించండి. మీరు ఏ మాత్రం బాధపడకూడదు. భయంకరంగా కన్పించే ఈ దానవసైన్యాన్ని మట్టుపెట్టండి. మీరంతా నాతో కూడా మహాశరీరులైన రాక్షసుల మీదికి దూకండి.' ఇంద్రుడి మాటలు విన్న దేవసైన్యానికి కొంత ఊరట కలిగింది. (69)
దానవాన్ ప్రత్యయుధ్యంత శక్రం కృత్వా వ్యపాశ్రయమ్ ।
తతస్తే త్రిదశాః సర్వే మరుతశ్చ మహాబలాః ॥ 72
ప్రత్యుద్యయుర్మహాభాగాః సాధ్యాశ్చ వసుభిః సహ ।
ఇంద్రుని తమకు ఆశ్రయంగా తలంచి దైవసైన్యం దానవసైన్యంతో మళ్ళీ యుద్ధం ప్రారంభించింది. తరువాత దేవతలు, మహుబలులైన మరుద్గణాలు సాధ్యగణాలతో కలిసి యుద్ధరంగంలో ముందుకు దూకాయి. (72)
తైర్విసృష్టాన్యనీకేషు క్రుద్ధైః శస్త్రాణి సంయుగే ॥ 73
శరాశ్చ దైత్యకాయేషు పిబంతి రుధిరం బహు ।
వారు యుద్ధభూమిలో కుపితులై దానవుల మీద శస్త్రాలను బాణాలను కురిపించారు. అవి దానవుల శరీరాల్లో దూరి రక్తపానం చేయసాగాయి. (73 1/2)
తేషాం దేహాన్ వినిర్భిద్య శరాస్తే నిశితాస్తదా ॥ 74
నిపతంతోఽభ్యదృశ్యంత నగేభ్య ఇవ పన్నగాః ।
వృక్షాలను పాములు చుట్టివేస్తున్నట్లు ఆ తీవ్రబాణాలు రాక్షస సైన్యశరీరాలను చీల్చివేస్తూ కన్పించాయి. (74 1/2)
తాని దైత్యశరీరాణి నిర్భిన్నాని స్మ సాయకైః ॥ 75
అపతన్ భూతలే రాజన్ ఛిన్నాభ్రాణీవ సర్వశః ।
దేవతల బాణాలతో చీలిపోయిన రాక్షసశరీరాలు అన్నివిధాల ఛిన్నభిన్నాలైన మేఘాల వలె నేలగూలాయి. (75 1/2)
తతస్తద్ దానవం సైన్యం సర్వైర్దేవగణైర్యుధి ॥ 76
త్రాసితం వివిధైర్భాణైః కృతం చైవ పరాఙ్ముఖమ్ ।
తరువాత దేవతలు అందరూ కలిసి ఆ యుద్ధంలో దానవసైన్యాన్ని బాణాల దెబ్బలకు భయపడి పారిపోయేటట్లు చేశారు. (76 1/2)
అథోత్కృష్టం తదా హృష్టైః సర్వై ర్దేవైరుదాయుధైః ॥ 77
సంహితాని చ తూర్యాణి ప్రావాద్యంత హ్యనేకశః ।
ఆ సమయంలో దేవతలు అస్త్రశస్త్రాలను పైకెత్తి పట్టుకొని సంతోషంతో సింహనాదాలు చేయసాగారు. దేవతల విజయమంగళవాద్యాలు ఎన్నో మ్రోగసాగాయి. (77 1/2)
ఏవమన్యోన్యసంయుక్తం యుద్ధమాసీత్ సుదారుణమ్ ॥ 78
దేవానాం దానవానాం చ మాంసశోణితకర్దమమ్ ।
అనయో దేవలోకస్య సహసైవాభ్యదృశ్యత ॥ 79
తథా హి దానవా ఘోరాః వినిఘ్నంతి దివౌకసః ।
ఇలా దేవదానవయుద్ధం భయంకరంగా సాగింది. రక్తమాంసాలతో అక్కడి భూమి బురద-బురదగా మారింది. మళ్ళీ దృశ్యం మారింది. దేవతల పరాజయం మొదలయింది. భయంకరదానవులు దేవతలను హింసించసాగారు. (78, 79 1/2)
తతస్తూర్యప్రణాదాశ్చ భేరీణాం చ మహాస్వనః ॥ 80
బభూవుర్దానవేంద్రాణాం సింహనాదాశ్చ దారుణాః ।
అప్పుడు దానవుల భయంకర సింహనాదాలు వినపడసాగాయి. వారి యుద్ధవాద్యాల ఘోష అన్నిదిక్కుల మార్ర్మోగింది. (80 1/2)
అథ దైత్యబలాద్ ఘోరాత్ నిష్పపాత మహాబలః ॥ 81
దానవో మహిషో నామ ప్రగృహ్య విపులం గిరిమ్ ।
అప్పుడు మహిషుడు అనే మహాబలవంతుడైన దానవుడు పెద్దబండను తీసికొని ఘోరమైన రాక్షససైన్యం నుంచి ముందుకు దూకాడు. (81 1/2)
తే తం ఘనైరివాదిత్యం దృష్ట్వా సంపరివారితమ్ ॥ 82
తముద్యతగిరిం రాజన్ వ్యద్రవంత దివౌకసః ।
యుధిష్ఠిరా! మేఘాలు చుట్టూ ఉన్న సూర్యునిలాగా పర్వతశిఖరాలను ఎత్తి ఉన్న రాక్షసుని చూసి దేవతలు పారిపోసాగారు. (82 1/2)
అథాభిద్రుత్య మహిషః దేవాంశ్చిక్షేప తం గిరిమ్ ॥ 83
పతతా తేన గిరిణా దేవసైన్యస్య పార్థివ ।
భీమరూపేణ నిహతమ్ అయుతం ప్రాపతద్ భువి ॥ 84
అయినా మహిషుడు దేవతలను వెంబడిస్తూ వారి మీద మహాశిలాఖండాన్ని విసరివేశాడు. ఆ భయంకర శిల పడేసరికి దేవసైన్యంలోని పదివేలమంది వీరులు నుజ్జునుజ్జు అయి నేల మీద పడిపోయారు. (83,84)
అథ తైర్దానవైః సార్ధం మహిషస్త్రాసయన్ సురాన్ ।
అభ్యద్రవద్ రణే తూర్ణం సింహః క్షుద్రమృగానివ ॥ 85
అప్పుడు సింహం క్షుద్రమృగాలకు భీతి కలిగిస్తూ, వాటిమీద పడినట్టు మహిషాసురుడు తనదానవ సైన్యంతో వారిమీదికి దూకాడు. (85)
తమాపతంతం మహిషం దృష్ట్వా సేంద్రా దివౌకసః ।
వ్యద్రవంత రణే భీతాః వికీర్ణాయుధకేతనాః ॥ 86
ఆ మహిషాసురుడు తమమీదికి వస్తూఉండటం చూసి ఇంద్రాది దేవతలందరూ భయపడి తమ వద్ద ఉన్న
శస్త్రాస్త్రధ్వజాదులను క్రిందపడవేసి యుద్ధభూమి నుండి పారిపోసాగారు. (86)
తతః స మహిషః క్రుద్ధః తూర్ణం రుద్రరథం యయౌ ।
అభిద్రుత్య చ జగ్రాహ రుద్రస్య రథకూబరమ్ ॥ 87
కోపపరవశుడైన మహిషుడు వేగంగా రుద్రదేవుని రథంవైపు వెళ్ళాడు. రథంనొగను గట్టిగా పట్టుకొన్నాడు. (87)
యదా రుద్రరథం క్రుద్ధః మహిషః సహసా గతః ।
రేసతూ రోదసీ గాఢం ముముహుశ్చ మహర్షయః ॥ 88
కోపంతో మహిషారుడు రథాన్ని సమీపించగానే భూమి మీద, ఆకాశంలోనూ అధికంగా కోలాహలం వ్యాపించింది. మహర్షులు కూడా కలతచెందారు. (88)
అనదంశ్చ మహాకాయాః దైత్యా జలధరోపమాః ।
ఆసీచ్చ నిశ్చితం తేషాం జితమస్మాభిరిత్యుత ॥ 89
ఇటువైపు మహాశరీరులైన దైత్యులు మేఘాల లాగా గంభీరంగా గర్జించారు. "మనం తప్పక గెలుస్తాం' అని వారికి గట్టి నమ్మకం కలిగింది. (89)
తథాభూతే తు భగవాన్ నావధీన్మహిషం రణే ।
సస్మార చ తదా స్కందం మృత్యుం తస్య దురాత్మనః ॥ 90
ఆ పరిస్థితిలో గూడా పరమశివుడు ఆ మహిషాసురుని సంహరింపలేదు. ఆ దుర్మార్గునికి కుమారస్వామి చేతిలో మరణం ఉందని తెలుసు కాబట్టి కుమారుని స్మరించాడు. (90)
మహిషోఽపి రథం దృష్ట్వా రౌద్రో రుద్రస్య చానదత్ ।
దేవాన్ సంత్రాసయంశ్చాపి దైత్యాంశ్చాపి ప్రహర్షయన్ ॥ 91
భయంకరుడైన మహిషాసురుడు రుద్రుని రథాన్ని చూసి, దేవతలకు భయాన్ని దానవులకు సంతోషాన్ని కలిగిస్తూ పలుమారులు సింహనాదం చేశాడు. (91)
తతస్తస్మిన్ భయే ఘోరే దేవానాం సముపస్థితే ।
ఆజగామ మహాసేనః క్రోధాత్ సూర్య ఇవ జ్వలన్ ॥ 92
దేవతలకు ఈ రీతిగా భయంకరపరిస్థితి కలుగగానే మహాసేనుడు కోపంతో సూర్యునిలాగా వెలుగొందుతూ అక్కడికి వచ్చాడు. (92)
లోహితాంబరసంవీతః లోహితస్రగ్విభూషణః ।
లోహితాశ్వో మహాబాహుః హిరణ్యకవచః ప్రభుః ॥ 93
ఆయన రక్తవస్త్రధరుడు, ఎఱ్ఱని పూలమాలలు, ఆభరణాలు ధరించినవాడు, అరుణాశ్వాలు కట్టిన రథం మీద బంగారు కవచం దాల్చి అక్కడికి వచ్చాడు. (93)
రథమాదిత్యసంకాశమ్ ఆస్థితః కనకప్రభమ్ ।
తం దృష్ట్వా దైత్యసేనా సా వ్యద్రవత్ సహసా రణే ॥ 94
సూర్యుని వలె బంగారు రంగుతో వెలిగిపోతున్న రథం మీద ఉన్న ఆయనను చూసి, ఆ రాక్షససైన్యం రణరంగం నుంచి త్వరగా పారిపోసాగింది. (94)
స చాపి తాం ప్రజ్వలితాం మహిషస్య విదారిణీమ్ ।
ముమోచ శక్తిం రాజేంద్ర మహాసేనో మహాబలః ॥ 95
రాజేంద్రా! మహాబలిష్ఠుడైన కుమారస్వామి మహిషాసురునిమీద వెలిగిపోతున్న శక్తి ఆయుధాన్ని ప్రయోగించాడు. అది ఆతని శరీరాన్ని చీల్చివేసేదిగా ఉన్నది. (95)
సా ముక్తాభ్యహరత్ తస్య మహిషస్య శిరో మహత్ ।
పపాత భిన్నే శిరసి మహిషస్త్యక్తజీవితః ॥ 96
కుమారస్వామి చేతిలో నుంచి వెళ్ళిన ఆ శక్తి మహిషాసురుని శిరస్సును ఖండించింది. శిరస్సు తెగిపోగా మహిషాసురుడు నేలగూలాడు. (96)
పతతా శిరసా తేన ద్వారం షోడశయోజనమ్ ।
పర్వతాభేన పిహితం తదాగమ్యం తతోఽభవత్ ॥ 97
పర్వతం లాగా చాలా పెద్దదైన అతని శరీరం ఈశాన్యదిక్కుగా పడేసరికి పదహారు యోజనాల పొడవు గల ద్వారం మూసుకుపోయింది. అందుచేత ఆ దేశం మామూలుగా వెళ్ళటానికి వీలుకాకపోయింది. (97)
ఉత్తరాః కురవస్తేన గచ్ఛంత్యద్య యథాసుఖమ్ ।
క్షిప్తాక్షిప్తా తు సా శక్తిః హత్వా శత్రూన్ సహస్రశః ॥ 98
స్కందహస్తమనుప్రాప్తా దృశ్యతే దేవదానవైః ।
ఉత్తరకురుదేశంలో నివసించేవారు ఇప్పుడు ఆ మార్గంలో సుఖంగా వెళ్ళుతున్నారు. దేవదానవులను చూచిన కుమారస్వామి పలుమారులు శత్రువుల మీద శక్త్యాయుధాన్ని ప్రయోగింపసాగాడు. దానివల్ల వేలకొలది శత్రువులను సంహరించి తిరిగి స్కందుని చేతికి వచ్చేది. (98 1/2)
ప్రాయః శరైర్వినిహతాః మహాసేనేన ధీమతా ॥ 99
శేషా దైత్యగణా ఘోరాః భీతాస్త్రస్తా దురాసదైః ।
స్కందపారిషదైర్హత్వా భక్షితాశ్చ సహస్రశః ॥ 100
మహామేధావి ఐన మహాసేనుడు బాణాలతో దానవసైన్యంలో ఎక్కువ భాగాన్ని హతమార్చాడు. మిగిలిన రాక్షసులు భయగ్రస్తులై ధైర్యం కోల్పోయారు. స్కందుని అనుచరగణం ఆ వేలకొలది రాక్షసులను చంపి తినివేసింది. (99, 100)
దానవాన్ భక్షయంతస్తే ప్రపిబంతశ్చ శోణితమ్ ।
క్షణాన్నిర్దానవం సర్వమ్ అకార్షుర్భృశహర్షితాః ॥ 101
స్కందగణాలు అన్నీ అధిక సంతోషంతో దానవులను తింటూ, వారి రక్తాన్ని త్రాగుతూ ఒక్కక్షణంలో యుద్ధరంగం అంతా రాక్షసరహితం చేశాయి. (101)
తమాంసీవ యథా సూర్యః వృక్షా నగ్నిర్ఘనాన్ ఖగః ।
తథా స్కందోఽజయచ్ఛత్రూన్ స్వేన వీర్యేణ కీర్తిమాన్ ॥ 102
సూర్యుడు చీకటిని పోగొట్టినట్లు, అగ్ని చెట్లను కాచినట్లు, ఆకాశంలో తిరిగే గాలి మేఘాలను ఛిన్నభిన్నం చ్సినట్లు కీర్తిశాలి అయిన కార్తికేయుడు పరాక్రమంతో రాక్షసనాశం చేసి విజయం పొందాడు. (102)
సంపూజ్యమానస్త్రిదశైః అభివాద్య మహేశ్వరమ్ ।
శుశుభే కృత్తికాపుత్రః ప్రకీర్ణాంశురివాంశుమాన్ ॥ 103
అప్పుడు కుమారస్వామి దేవతలు స్తుతించారు. ఆయన తండ్రి పరమేశ్వరునికి నమస్కరించాడు. కిరణాలను అంతటా ప్రసరింపజేసే సూర్యునివలె విరాజిల్లాడు. (103)
నష్టశత్రుర్యదా స్కందః ప్రయాతస్తు మహేశ్వరమ్ ।
తదాబ్రవీన్మహాసేనం పరిష్వజ్య పురందరః ॥ 104
శత్రునాశం చేసి, స్కందుడు పరమేశ్వరుని దగ్గరకు వచ్చినప్పుడు ఇంద్రుడు ఆయనను కౌగిలించుకొని ఇలా అన్నాడు. (104)
బ్రహ్మదత్తవరః స్కంద త్వయాయం మహిషో హతః ।
దేవాస్తృణసమా యస్య బభువుర్జయతాం వర ॥ 105
సోఽయం త్వయా మహాబాహోశమితో దేవకంటకః ।
శతం మహిషతుల్యానాం దానవానాం త్వయా రణే ॥ 106
నిహతం దేవశత్రూనాం యైర్వయం పూర్వతాపితాః ।
తావకైర్భక్షితాశ్చాన్యే దానవాః శతసంఘశః ॥ 107
విజయం సాధించే వీరులలో శ్రేష్ఠుడా! కుమారా! ఈ మహిషాసురునికి బ్రహ్మదేవుడు వరం ఇవ్వటం వలన ఈతని ముందు దేవతలు గడ్డిపోచలతో సమానమయినారు. అలాంటివానిని నీవు ఈనాడు సంహరించావు. వీరా! ఇతడు దేవతలకు నీచశత్రువు. అలాంటివాడిని నీవు చంపావు. ఈ వేళ రణరంగంలో ఈ మహిషాసురునితో సమానమైన పరాక్రమం గల దేవశత్రువులు అయిన నూర్గురు దైత్యులను నేలగూల్చావు. వారు అందరూ మాకు పూర్వం చాలా బాధలు కలిగించారు. నీ అనుచరులు కూడా లెక్కలేనంతమంది రాక్షసులను తినివేశారు. (105-107)
అజేయస్త్వం రణేఽరీణామ్ ఉమాపతిరివ ప్రభుః ।
ఏతత్ తే ప్రథమం దేవ ఖ్యాతం కర్మ భవిష్యతి ॥ 108
త్రిషు లోకేషు కీర్తిశ్చ తవాక్షయ్యా భవిష్యతి ।
వశగాశ్చ భవిష్యంతి సురాస్తవ మహాభుజ ॥ 109
దేవా! నీవు పరమశివునివలె యుద్ధంలో శత్రువులకు జయింప శక్యంకానివాడవు. నీవు సంపాదించిన ఈ విజయం లోకప్రసిద్ధం అవుతుంది. అక్షయమైన నీకీర్తి ముల్లోకాలలో వ్యాపిస్తుంది. మహాభుజా! దేవతలు అందరూ నీకు లోబడతారు. (108,109)
ఏవముక్త్వా మహాసేనం నివృత్తః సహ దైవతైః ।
అనుజ్ఞాతో భగవతా త్ర్యంబకేణ శచీపతిః ॥ 110
అని మహాసేనునితో పలికి శచీభర్త అయిన యింద్రుడు శంకరుని అనుమతి తీసికొని దేవతలతో కలిసి స్వర్గలోకానికి వెళ్ళాడు. (110)
గతో భద్రవటం రుద్రః నివృత్తాశ్చ దివౌకసః ।
ఉక్తాశ్చ దేవా రుద్రేణ స్కందం పశ్యత మామివ ॥ 111
'మీరంతా కుమారస్వామిని నన్ను చూసినట్లే చూసి గౌరవించండి' అని చెప్పి శంకరుడు భద్రవటానికి వెళ్ళాడు. (111)
స హత్వా దానవగణాన్ పూజ్యమానో మహర్షిభిః ।
ఏకాహ్నైవాజయత్ సర్వం త్రైలోక్యం వహ్నినందనః ॥ 112
అగ్నిపుత్రుడు దానవులను అందరిని నాశనం చేసి మహర్షులు పూజిస్తుండగా ఒకరోజులోనే ముల్లోకాలను జయించాడు. (112)
స్కందస్య య ఇదం విప్రః పఠేజ్జన్మ సమాహితః ।
స పుష్టిమిహ సంప్రాప్య స్కందసాలోక్యమాప్నుయాత్ ॥ 113
స్కందుని ఈ జన్మవృత్తాంతాన్ని ఏకాగ్రమైన మనస్సుతో పారాయణం చేసే బ్రాహ్మణుడు ఈ లోకంలో సుఖసంపదలు కలిగి తుదకు స్కందలోకానికి వెళ్ళుతాడు. (113)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి మార్కండేయసమాస్యాపర్వణి ఆంగిరసోపాఖ్యానే స్కందోత్పత్తౌ మహిషాసురవధే ఏకత్రింశత్యధికద్విశతతమోఽధ్యాయః ॥ 231 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున మార్కండేయ సమాస్యాపర్వమను ఉపపర్వమున ఆంగీరసమున స్కందోత్పత్తిలోని మహిషాసురవధ అను రెండు వందల ముప్పది యొకటవ అధ్యాయము. (231)
(దాక్షిణాత్య అధికపాఠం 1/2 శ్లోకంతో కలిపి మొత్తం 113 1/2 శ్లోకాలు)