229. రెండు వందల ఇరువది తొమ్మిదవ అధ్యాయము

స్కందుని దేవసేనాపతిత్వము - దేవసేనతో వివాహము.

మార్కండేయ ఉవాచ
ఉపవిష్టం తు తం స్కందం హిరణ్యకవచస్రజమ్ ।
హిరణ్యచూడముకుటం హిరణ్యాక్షం మహాప్రభుమ్ ॥ 1
మార్కండేయముని ఇలా అన్నాడు.
రాజా! స్కందుడు బంగారు కవచాన్ని, స్వర్ణమాలికను, బమ్గరుతురాయి గల కిరీటాన్ని ధరించి సుందరాసనం మీద కూర్చొని యున్నాడు. ఆయన కన్నుల నుండి బంగరు వెలుగు వెలువడుతోంది. ఆయన శరీరం నుండి తేజఃపుంజం బయల్పడుతోంది. (1)
లోహితాంబరసంవీతం తీక్ష్ణదంష్ట్రం మనోరమమ్ ।
సర్వలక్షణసంపన్నం త్రైలోక్యస్యాపి సుప్రియమ్ ॥ 2
ఆయన అరుణవస్త్రం ధరించి ఉన్నాడు. ఆయన దంతాలు చాలా పదునుగా ఉన్నాయి. చక్కని ఆకృతి, మిక్కిలి శుభలక్షణాలు గల ఆయన ముల్లోకాలకు చాల ఇష్టుడై ఉన్నాడు. (2)
తతస్తం వరదం శూరం యువానం మృష్టకుండలమ్ ।
అభజత్ పద్మరూపా శ్రీః స్వయమేవ శరీరిణీ ॥ 3
వరదాత, శూరుడు, యువకుడు , అందమైన కుండలాలతో అలంకృతుడైన కార్తికేయుని తామరపూవుతో సమానమైన కాంతిగల లక్ష్మి సాకారయై సేవిస్తోంది. (3)
శ్రియా జుష్టః పృథుయశాః స కుమారవరస్తదా ।
నిషణ్ణో దృశ్యతే భూతైః పౌర్ణమాస్యాం యథా శశీ ॥ 4
తేజస్సంపన్నుడై అక్కడ కూర్చున్న యశస్వి అయిన ఆ సుందర కుమారస్వామిని ఆ సమయంలో సమస్తప్రాణులు పూర్ణిమాచంద్రునివలె దర్శించారు. (4)
అపూజయన్ మహాత్మానః బ్రాహ్మణాస్తం మహాబలమ్ ।
ఇదమాహుస్తదా చైవ స్కందం తత్ర మహర్షయః ॥ 5
మహాత్ములైన బ్రాహ్మణులు బలిష్ఠుడైన కుమారస్వామిని పూజించారు. మహర్షులు అక్కడికి వచ్చి ఆయనను ఇలా స్తుతించారు. (5)
ఋషయ ఊచుః
హిరణ్యగర్భ భద్రం తే లోకానాం శంకరో భవ ।
త్వయా షడ్ రాత్రజాతేన సర్వలోకా వశీకృతాః ॥ 6
మహర్షులు ఇలా అన్నారు - హిరణ్యగర్భా! నీకు మేలుకలుగుగాక. లోకములకు సుఖం కలిగించు. ఆరురోజులకు ముందు పుట్టిన నీవు లోకాలు అన్నింటినీ వశం చేసుకొన్నావు. (6)
అభయం చ పునర్దత్తం త్వయైవేషాం సురోత్తమ ।
తస్మాదింద్రో భవానస్తు త్రైలోక్యస్యాభయంకరః ॥ 7
దేవశ్రేష్ఠా! నీవే ఈ అన్నిలోకాలకు అభయం ఇచ్చావు. కాబట్టి నీవు ఈ రోజే ఇంద్ర పదవిని అధిష్ఠించి మూడులోకాల భయాన్ని పారద్రోలు! (7)
స్కంద ఉవాచ
కిమింద్రాః సర్వలోకానాం కరోతీహ తపోధనాః ।
కథం దేవగణాంశ్చైవ పాతి నిత్యం సురేశ్వరః ॥ 8
కుమారస్వామి అన్నాడు - తపోధనులారా! ఇంద్రుడు ఈ పదవిలో ఉండి లోకాలు అన్నింటికి ఏ మేలు చేస్తుంటాడు? ఆ దేవాధిపతి నిత్యమూ, దేవసమూహాన్ని ఎలా రక్షిస్తుంటాడు? (8)
ఋషయ ఊచుః
ఇంద్రో దధాతి భూతానాం బలం తేజః ప్రజాః సుఖమ్ ।
తుష్టః ప్రయచ్ఛతి తథా సర్వాన్ కామాన్ సురేశ్వరః ॥ 9
మునీంద్రులు అన్నారు - దేవేంద్రుడు సంతోషిస్తే సమస్తప్రాణులకు బలాని, తేజస్సును, సంతతిని, సుఖాన్ని ఇస్తాడు. వారికోరికలను అన్నిటినీ తీరుస్తాడు. (9)
దుర్వృత్తానాం సంహరతి వ్రతస్థానాం ప్రయచ్ఛతి ।
అనుశాస్తి చ భూతాని కార్యేషు బలసూదనః ॥ 10
ఆయన దుష్టులను సంహరిస్తాడు. మంచి నియమాలను పాటించి జీవించేవారికి బ్రతుకుతెరువు చూపిస్తాడు. బలాసురుని సంహరించిన ఆయన ప్రాణులన్నిటిని అవసరమైన పనులు ఆచరించమని ఆదేశిస్తాడు. (10)
అసూర్యే చ భవేత్ సూర్యః తథాచంద్రే చ చంద్రమాః ।
భవత్యగ్నిశ్చ వాయుశ్చ పృథివ్యాపశ్చ కారణైః ॥ 11
సూర్యుడు లేనిచో సూర్యుడవుతాడు. చంద్రుడు లేనిచో చంద్రుడవుతాడు. అవసరాన్ని అనుసరించి అగ్ని, వాయు, భూమి, జల స్వరూపాలు ధరిస్తాడు. (11)
ఏతదింద్రేణ కర్తవ్యమ్ ఇంద్రే హి విపులం బలమ్ ।
త్వం చ వీర బలీ శ్రేష్ఠః తస్మాదింద్రో భవస్వ నః ॥ 12
ఇవి అన్నీ ఇంద్రుడు చేయవలసినవి. ఆయన మహాబలశాలి. కాబట్టి నీవే ఇంద్రుడివి కావాలి. నీవు అందరిలోకి శ్రేష్ఠుడవు. (12)
శక్ర ఉవాచ
భవస్వేంద్రో మహాబాహో సర్వేషాం నః సుఖావహః ।
అభిషిచ్యస్వ చైవాద్య ప్రాప్తరూపోఽసి సత్తమ ॥ 13
ఇంద్రుడన్నాడు - మహాభుజా! నీవే ఇంద్రుడివి అయి మాకు అందరికీ సుఖం కలిగించు. మహాత్మా! నీవే ఈ పదవికి అన్నివిధాలా యోగ్యుడివి. కాబట్టి నేడే ఈ పదవిలో పట్టాభిషిక్తుడవు కావాలి. (13)
స్కంద ఉవాచ
శాధి త్వమేవ త్రైలోక్యమ్ అవ్యగ్రో విజయే రతః ।
అహం తే కింకరః శక్ర న మమేంద్రత్వమీప్సితమ్ ॥ 14
కుమారస్వామి అన్నాడు - ఇంద్రా! పరాకులేకుండా నీవే ముల్లోకాలను పరిపాలించు. విజయాసక్తుడవగుము నేను నీకు సేవకుడను. నాకు ఇంద్రపదవీ కాంక్ష లేదు. (14)
శక్ర ఉవాచ
బలం తవాద్భుతం వీర త్వం దేవానామరీన్ జహి ।
అవజ్ఞాస్యంతి మాం లోకాః వీర్యేణ తవ విస్మితాః ॥ 15
ఇంద్రత్వే తు స్థితుం వీర బలహీనం పరాజితమ్ ।
ఆవయోశ్చ మిథో భేదే ప్రయతిష్యంత్యతంద్రితాః ॥ 16
ఇంద్రుడు అన్నాడు. వీరశ్రేష్ఠా! నీబలం అద్భుతం. కనుక నీవే దేవశత్రువులను జయించు. నీచేతిలో ఓడిపోవటం చేత దుర్బలుడనని స్పష్టమయినది. (నీబలానికి ఆశ్చర్యపడి లోకులు నన్ను గేలి చేస్తారు. నేను ఇంద్రపదవిలో ఉన్నా మాకు పరాజయం తప్పదు) మనమధ్య భేదం కలిగించాలని ఇతరులు చాలా జాగ్రత్తగా ప్రయత్నిస్తారు. (15,16)
భెదితే చ త్వయి విభో లోకో ద్వైధముపేష్యతి ।
ద్విధాభూతేషు లోకేషు నిశ్చితేష్వావయోస్తథా ॥ 17
విగ్రహః సంప్రవర్తేత భూతభేదాన్మహాబలః ।
తత్ర త్వం మాం రణే తాత యథాశ్రద్ధం విజేష్యసి ॥ 18
తస్మాదింద్రో భవానేవ భవితా మా విచారయ ।
నీలో భేదం ఏర్పడితే లోకమంతా రెండుగా చీలిపోతుంది. వెంటనే మనమధ్య యుద్ధం ప్రారంభం అవుతుంది. ఆయుద్ధంలో నీవే తప్పక జయిస్తావని నా దృఢవిశ్వాసం. కాబట్టి నీవే ఇంద్రుడివి కావలసింది. ఈ విషయంలో ఇంకోవిధంగా ఆలోచించవద్దు. (17,18)
స్కంద ఉవాచ
త్వమేవ రాజా భద్రం తే త్రైలోక్యస్య మమైవ చ ॥ 19
కరోమి కిం చ తే శక్ర శాసనం తద్ బ్రవీహి మే ।
కుమారస్వామి ఇలా అన్నాడు - ముల్లోకాలకు, నాకు కూడా నీవే రాజువు. నీకు మేలు కలుగుగాక. ఇంద్రా! నేను ఏమి చేయాలో ఇక చెప్పు. (19)
ఇంద్ర ఉవాచ
అహమింద్రో భవిష్యామి తవ వాక్యాన్మహాబల ॥ 20
యది సత్యమిదం వాక్యం నిశ్చయాద్ భూషితం త్వయా ।
యది వా శాసనం స్కంద కర్తుమిచ్ఛసి మే శృణు ॥ 21
అభిషిచ్యస్వ దేవానాం సైనాపత్యే మహాబల ।
ఇంద్రుడు అన్నాడు -
మహాబలా! నీమాట తప్పక నిజమయితే ఇంద్రపదవిలో నిలుస్తాను. యథార్థంగా నీవు నా ఆజ్ఞను పాటించాలనుకొనేటట్టయితే ఈ నామాట విను. మహాబలా! దేవతలకు సేనాపతివిగా నీవు పట్టాభిషిక్తుడివి కావాలి. (20, 21 1/2)
స్కంద ఉవాచ
దానవానాం వినాశాయ దేవానామర్థసిద్ధయే ॥ 22
గోబ్రాహ్మణహితార్థాయ సైనాపత్యేఽభిషించ మామ్ ।
స్కందుడు ఇలా అన్నాడు - ఇంద్రా! రాక్షసులు నాశనం కావటానికి, దేవతల కార్యసిద్ధికి, గోవులకు బ్రాహ్మణులకు మేలు కలగటానికి నన్ను దేవసేనాధిపతిగా అభిషేకించు.(22)
మార్కండేయ ఉవాచ
సోఽభిషిక్తో మఘవతా సర్వై ర్దేవగణైః సహ ॥ 23
అతీవ శుశుభే తత్ర పూజ్యమానో మహర్షిభిః ।
తత్ర తత్ కాంచనం ఛత్రం ధ్రియమాణం వ్యరోచత ॥ 24
యథైవ సుసమిద్ధస్య పావకస్యాత్మమండలమ్ ।
మార్కండేయముని అన్నాడు - అటు తరువాత సమస్తదేవతలతో గూడి ఇంద్రుడు కుమారస్వామిని దేవతల సేనాపతిగా అభిషేకించాడు. అప్పుడు అక్కడ మహర్షుల పూజలందుకొని కుమారస్వామి మిక్కిలి మంగళకరుడయినాడు. ఆయనకు పైన బట్టిన స్వర్ణమయమయిన ఛత్రం అగ్నిమండలం వలె ప్రకాశిస్తున్నది. (23,24 1/2)
విశ్వకర్మకృతా చాస్య దివ్యా మాలా హిరణ్మయీ ॥ 25
ఆబద్ధా త్రిపురఘ్నేన స్వయమేవ యశస్వినా ।
ఆగమ్య మనుజవ్యాఘ్ర సహ దేవ్యా పరంతపః ॥ 26
శత్రునాశకా! ధర్మజా! త్రిపురాలను నాశనం చేసిన పరమేశ్వరుడు, పరమేశ్వరి అక్కడికి వచ్చి కుమారస్వామి మెడలో విశ్వకర్మ తయారుచేసిన బంగారు దివ్యమాలికను వేశారు. (25,26)
అర్చయామాస సుప్రీతః భగవాన్ గోవృషధ్వజః ।
రుద్రమగ్నిం ద్విజాః ప్రాహుః రుద్రసూనుస్తతస్తు సః ॥ 27
వృషభధ్వజుడయిన పరమేశ్వరుడు బాగా ప్రసన్నుడై కుమారస్వామిని ఆదరించాడు. బ్రాహ్మణులు అగ్నిని రుద్రస్వరూపునిగా చెపుతారు. కాబట్టి స్కందుడు రుద్రపుత్రుడే. (27)
వి॥సం॥ రుద్రోహ ఏష యదగ్నిః = ఈ అగ్నియే రుద్రుడు. (నీల) కాలాగ్ని రుద్రుడు కనుక (లక్షా)
రుద్రేన శుక్రముత్సృష్టం తచ్ఛ్వేతః పర్వతోఽభవత్ ।
పావకస్యేంద్రియం శ్వేతే కృత్తికాభిః కృతం నగే ॥ 28
రుద్రుడు త్యజించిన వీర్యం శ్వేత పర్వతమైంది. తరువాత కృత్తికలు అగ్నివీర్యాన్ని శ్వేతపర్వతం పైకి చేర్చారు. (28)
పూజ్యమానం తు రుద్రేన దృష్ట్వా సర్వే దివౌకసః ।
రుద్రసూనుం తతః ప్రాహుః గుహం గుణవతాం వరమ్ ॥ 29
గుణగణ్యుడైన కుమారస్వామిని రుద్రుడు ఆదరించటం చూసిన దేవతలు 'ఈయన రుద్రపుత్రుడే' అన్నారు. (29)
అనుప్రవిశ్య రుద్రేణ వహ్నిం జాతో హ్యయం శిశుః ।
తత్ర జాతస్తతః స్కందః రుద్రసూనుస్తతోఽభవత్ ॥ 30
రుద్రుడు అగ్నిదేవునిలో ప్రవేశించి ఈ శిశువుకు జన్మనిచ్చాడు. రుద్రస్వరూపుడయిన అగ్ని వల్ల కలగటం చేత ఈయనను రుద్రపుత్రుడే అనాలి. (30)
వి॥సం॥ అగ్నిశరీరంలో ప్రవేశించిన రుద్రునివలన పుట్టినవాడు. (నీల)
రుద్రస్య వహ్నేః స్వాహాయాః షణ్ణాం స్త్రీణాం చ భారత।
జాతః స్కందః సురశ్రేష్ఠః రుద్రసూనుస్తతోఽభవత్ ॥ 31
భరతవంశీయా! ధర్మజా! దేవశ్రేష్ఠుడైన స్కందుడు రుద్రస్వరూపుడయిన అగ్నివలన, స్వాహావలన, ఆరుగురు స్త్రీల వలన జన్మించాడు. అందుచేత రుద్రపుత్రుడయినాడు. (31)
అరజే వాససీ రక్తే వసానః పావకాత్మజః ।
భాతి దీప్తవపుః శ్రీమాన్ రక్తాభ్రాభ్యామివాంశుమాన్ ॥ 32
అగ్నిపుత్రుడయిన స్కందుడు స్వచ్ఛమైన ఎఱ్ఱని వస్త్రద్వయం ధరించి కాంతిమంతమయిన శరీరంతో రెండు ఎర్రనిమేఘాలతో గూడిన సూర్యభగవానుని వలె తేజరిల్లుతున్నాడు. (32)
కుక్కుటశ్చాగ్నినా దత్తః తస్య కేతురలంకృతః ।
రథే సముచ్ర్ఛితో భాతి కాలాగ్నిరివ లోహితః ॥ 33
అగ్నిదేవుడు స్కందునికి కోడి గుర్తుగల ఎత్తైన జెండాను బహూకరించాడు. అది రథం మీద అరుణకాంతితో ప్రళయాగ్నివలె ధగధగ ప్రకాశిస్తున్నది. (33)
యా చేష్టా సర్వభూతానాం ప్రభా శాంతిర్బలం తథా ।
అగ్రతస్తస్య సా శక్తిః దేవానాం జయవర్ధినీ ॥ 34
సర్వప్రాణులలో ఉన్న చైతన్యం కాంతి, శాంతి, బలం - ఇవి అన్నీ కలిసి కార్తికేయుని ముందు శక్తిరూపంలో నిలిచాయి. అవి దేవతల విజయలక్ష్మిని పెంపొందిచేవిగా ఉన్నాయి. (34)
వివేశ కవచం చాస్య శరీరే సహజం తథా ।
యుధ్యమానస్య దేవస్య ప్రాదుర్భవతి తత్సదా ॥ 35
అలాగే ఆ స్కందుని శరీరంలో సహజకవచం ప్రవేశించింది. అది యుద్ధసమయంలో ఎల్లప్పుడూ వ్యక్తమవుతుంది. (35)
శక్తిర్ధర్మో బలం తేజః కాంతత్వం సత్యమున్నతిః ।
బ్రహ్మణ్యత్వమసమ్మోహః భక్తానాం పరిరక్షణమ్ ॥ 36
నికృంతనం చ శత్రూణాం లోకానాం చాభిరక్షణమ్ ।
స్కందేన సహ జాతాని సర్వాణ్యేవ జనాధిప ॥ 37
రాజేంద్రా! శక్తి, ధర్మం, బలం, తేజస్సు, సత్యం, సమున్నతి, రక్షణ, శత్రునాశనం, సమస్తలోకపాలనం అనే సమస్త గుణాలు స్కందునితోనే ఆవిర్భవించాయి. (36,37)
ఏవం దేవగణైః సర్వైః సోఽభిషిక్తః స్వలంకృతః ।
బభౌ ప్రతీతః సుమనాః పరిపూర్ణేందుమండలః ॥ 38
ఈ విధంగా సమస్త దేవతల చేత దేవడేనాపతిగా అభిషిక్తుడై, నానావిధాలంకార శోభితుడై, పవిత్రమూ, ప్రసన్నమూ ఐన హృదయం గల స్కందుడు సంపూర్ణచంద్రుని వలె విరాజిల్లాడు. (38)
ఇష్టైః స్వాధ్యాయఘోషైశ్చ దేవతూర్యవరైరపి ।
దేవగంధర్వగీతైశ్చ సర్వైరప్సరసాం గణైః ॥ 39
ఏతైశ్చాన్యైశ్చ బహుభిః తుష్టైర్హృష్టైః స్వలంకృతైః ।
సుసంవృతః పిశాచానాం గణైర్దేవగణైస్తథా ॥ 40
ఆ సమయంలో చాలా ఇష్టమైన వేదమంత్రధ్వనులు ప్రతిధ్వనించాయి. దేవవాద్యాలు మ్రోగసాగాయి. దేవతలు, గంధర్వులు గానం చేయసాగారు. ఇంకా అనేక దేవతాగణాలు, పిశాచ సమూహాలు నానాలంకార భూషితులై, సంతోషపరవశులై స్కందుని చుట్టూ నిలిచారు. (39,40)
క్రీడన్ భాతి తదా దేవైః అభిషిక్తశ్చ పావకిః ।
అభిషిక్తం మహాసేనమ్ అపశ్యంత దివౌకసః ॥ 41
వినిహత్య తమః సూర్యం యథేహాభ్యుదితం తథా ।
అగ్నినందనుడైన కుమారస్వామి దేవతల చేత అభిషిక్తుడై వివిధక్రీడామగ్నుడై విలసిల్లాడు. పట్టాభిషిక్తుడైన మహాసేనుని దేవతలు అంధకారాన్ని ధ్వంసం చేస్తూ ఉదయించిన సూర్యునివలె చూశారు. (41 1/2)
అథైనమభ్యయుః సర్వాః దేవసేనాః సహస్రశః ॥ 42
అస్మాకం త్వం పతిరితి బ్రువాణాః సర్వతో దిశః ।
ఆ తరువాత వేలసంఖ్యలో దేవతల సేనలు అన్నిదిక్కుల నుంచి వచ్చి 'మాకు నీవే సేనాపతివి!' అని చెప్పసాగాయి. (42 1/2)
తాః సమాసాద్య భగవాన్ సర్వభూతగణైర్వృతః ॥ 43
అర్చితస్తు స్తుతశ్చైవ సాంత్వయామాస తా అపి ।
సమస్త భూతగణాలు సేవిస్తున్న స్కందుడు దేవతల సైన్యాలు అన్నీ తనవద్దకు రాగా వాటికి ధైర్యం చెప్పాడు. వాటిపూజలను ప్రశంసలను అందుకున్నాడు. (43 1/2)
శతక్రతుశ్చాభిషిచ్య స్కందం సేనాపతిం తదా ॥ 44
సస్మార తాం దేవసేనాం యా సా తేన విమోక్షితా ।
ఇంద్రుడు స్కందుని సేనాపతిగా అభిషేకించిన తరువాత తాను కేశి అనే రాక్షసుని నుంచి విముక్తురాలిని చేసిన దేవసేనను తెచ్చుకొన్నాడు. (44 1/2)
అయం తస్యాః పతిర్నూనం విహితో బ్రహ్మణా స్వయమ్ ॥ 45
విచింత్యేత్యానయామాస దేవసేనాం హ్యలంకృతామ్ ।
'బ్రహ్మదేవుడు కార్తికేయునే ఈమెకు భర్తగా నిశ్చయించాడు. ఇది యథార్థం!' అని నిర్ణయించుకొని దేవసేనను నూతన వస్త్రాభరణాలతో అలంకరించి తీసికొని వచ్చాడు ఇంద్రుడు. (45 1/2)
స్కందం ప్రోవాచ బలభిద్ ఇయం కన్యా సురోత్తమ ॥ 46
అజాతే త్వయి నిర్దిష్టా తవ పత్నీ స్వయంభువా ।
తస్మాత్ త్వమస్యా విధివత్ పాణిం మంత్రపురస్కృతమ్ ॥ 47
గృహాణ దక్షిణం దేవ్యాః పాణినా పద్మవర్చసా ।
ఏవముక్తః స జగ్రాహ తస్యాః పాణిం యథావిధి ॥ 48
"దేవశ్రేష్ఠా! నీవు పుట్టక ముందే బ్రహ్మదేవుడు ఈ కన్యను నీభార్యగా నిశ్చయించాడు. కాబట్టి నీవు వేద మంత్రాలను ఉచ్చరిస్తూ యథావిధిగా ఈమెను వివాహం చేసుకో. పద్మారుణకాంతితో విరాజిల్లే నీచేతితో ఈ దేవసేన దక్షిణహస్తాన్ని గ్రహించు' అని ఇంద్రుడు చెప్పగా ఆ కుమార స్వామి ఆమెను యథావిధిగా వివాహం చేసుకున్నాడు. (46-48)
బృహస్పతిర్మంత్రవిద్ధి జజాప చ జుహావ చ ।
ఏవం స్కందస్య మహిషీం దేవసేనాం విదుర్జనాః ॥ 49
ఆ సమయంలో మంత్రవేత్త అయిన బృహస్పతి వేదమంత్రాలను జపిస్తూ హోమం చేశాడు. ఇది జరిగిన తరువాత జనులందరూ దేవసేన కార్తికేయుని పట్టపురాణి అని తెలుసుకొన్నారు. (49)
షష్ఠీం యాం బ్రాహ్మణాః ప్రాహుః లక్ష్మీమాశాం సుఖప్రదామ్ ।
సినీవాలీం కుహూం చైవ సద్ వృత్తిమపరాజితామ్ ॥ 50
ఆమెను బ్రాహ్మణులు షష్ఠి, లక్ష్మి, ఆశ, సుఖప్రద, సినీవాలి, కుహు, సద్వృత్తి, అపరాజిత అని చెపుతారు. (50)
యదా స్కందః పతిర్లబ్ధః శాశ్వతో దేవసేనయా ।
తదా తమాశ్రయల్లక్ష్మీః స్వయం దేవీ శరీరిణీ ॥ 51
దేవసేన స్కందుని తన సనాతనపతిగా స్వీకరించినపుడు శోభాస్వరూపిణి అయిన లక్ష్మీదేవి స్వయంగా ఆకారం ధరించి ఆమెను ఆశ్రయించింది. (51)
శ్రీజుష్టః పఞ్చమీం స్కందః తస్మాచ్ర్ఛీపంచమీ స్మృతా ।
షష్ఠ్యాం కృతార్థోఽభూద్ యస్మాత్ తస్మాత్ షష్ఠీ మహాతిథిః ॥ 52
పంచమీ తిథినాడు కుమారస్వామి లక్ష్మీశోభాసేవితుడు అయినాడు. అందువల్ల ఆ తిథిని శ్రీపంచమి అన్నారు. షష్ఠీ తిథినాడు కృతకృత్యుడయినాడు. కాబట్టి షష్ఠిని మహాతిథి అన్నారు. (52)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి మార్కండేయసమాస్యాపర్వణి ఆంగిరసే స్కందోపాఖ్యానే ఏకోనత్రింశదధికద్విశతతమోఽధ్యాయః ॥ 229 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున మార్కండేయ సమాస్యాపర్వమను ఉపపర్వమున ఆంగిరసమున స్కందోపాక్యానమున రెండు వందల ఇరువది తొమ్మిదవ అధ్యాయము. (229)