228. రెండు వందల ఇరువది యెనిమిదవ అధ్యాయము

కుమారస్వామి అనుయాయుల వర్ణన.

మార్కండేయ ఉవాచ
స్కందపారిషదాన్ ఘోరాన్ శృణుష్వాద్భుతదర్శనాన్ ।
వజ్రప్రహారాత్ స్కందస్య జజ్ఞుస్తత్ర కుమారకాః ॥ 1
మార్కండేయ మహర్షి ఇలా అన్నారు - రాజా! ఇప్పుడు స్కందుని అనుచరగణాన్ని గురించి చెపుతాను. విను. వారు భయంకరులు, విలక్షణంగా ఉంటారు. ఇంద్రుని వజ్రపు దెబ్బ తగిలిన తరువాత కుమారుని శరీరం నుంచి అనేక కుమారగ్రహాలు కలిగాయి. (1)
యే హరంతి శిశూన్ జాతాన్ గర్భస్థాంశ్చైవ దారుణాః ।
వజ్రప్రహారాత్ కన్యాశ్చ జజ్ఞిరేఽస్య మహాబలాః ॥ 2
క్రూరస్వభావం గల ఆ కుమారగ్రహాలు అప్పుడే పుట్టిన పిల్లలను, తల్లికడుపులో ఉన్న శిశువులను కూడ హరించగలవు.
వజ్రప్రహారం వల్ల కుమారుని శరీరం నుండి మహాబలం కల కన్యలు కూడా ఆవిర్భవించారు. (2)
కుమారాస్తే విశాఖం చ పితృత్వే సమకల్పయన్ ।
స భూత్వా భగవాన్ సంఖ్యే రక్షంశ్ఛాగముఖస్తదా ॥ 3
వృతః కన్యాగణైః సర్వైః ఆత్మీయైః సహపుత్రకైః ।
మాతౄణాం ప్రేక్షమాణానాం భద్రశాఖశ్చ కౌసలః ॥ 4
ఆ కుమారగ్రహాలు కుమారుని తమతండ్రిని చేసికొన్నవి. మేషముఖుడైన కుమారుడు కన్యాసమూహంతో, తనపుత్రులతో గూడి మాతృగణం చూస్తూండగా యుద్ధంలో తన పక్షంవారిని రక్షిస్తుంటాడు. ఆయనయే భద్రశాఖుడు, కౌసలుడు అనే పేర్లతో ప్రసిద్ధుడైనాడు. (3,4)
తతః కుమారపితరం స్కందమాహుర్జనా భువి ।
రుద్రమగ్నిముమాం స్వాహాం ప్రదేశేషు మహాబలామ్ ॥ 5
యజంతి పుత్రకామాశ్చ పుత్రిణశ్చ సదా జనాః ।
అందువల్ల భూలోకంలోని మనుష్యులు స్కందుని 'కుమారగ్రహాల తండ్రి' అని అంటారు. పుత్రులు వివిధ ప్రాంతాలలో ఉన్నవారు పుత్రకాంక్ష గల వారు అగ్నిని రుద్రుని, స్వాహాస్వరూపురాలు, బలిష్ఠ అయిన ఉమాదేవిని ఉపాసిస్తూ ఉంటారు. (5 1/2)
యాస్తాస్త్వజనయత్ కన్యాః తపో నామ హుతాశనః ॥ 6
కిం కరోమీతి తాః స్కందం సంప్రాప్తాః సమభాషయన్ ।
తపుడు అనే అగ్ని కనిన కన్యలు అందరు స్కందుని వద్దకు వచ్చి 'మేము ఏమి చేయాలి.' అని అడుగసాగారు. (6)
కుమార్య ఊచుః
భవేమ సర్వలోకస్య మాతరో వయముత్తమాః ॥ 7
ప్రసాదాత్ తవ పూజ్యాశ్చ ప్రియమేతత్ కురుష్వ నః ।
మేము జగత్తుకంతటికి శ్రేష్ఠమాతలం కాగలగాలి. మీ దయవలన పూజలందుకొన గలగాలి. మా కోరిక ఇదే. మీరు తీర్చాలి. (7 1/2)
సోఽబ్రవీద్ బాఢమిత్యేవం భవిష్యధ్వం పృథగ్విధాః ॥ 8
శివాశ్చైవాశివాశ్చైవ పునః పునరుదారధీః ।
తతః సంకల్ప్య పుత్రత్వే స్కందం మాతృగణోఽగమత్ ॥ 9
అప్పుడు గొప్ప మనస్సు గల స్కందుడు 'అలాగే మీరు అందరూ విడివిడిగా పూజించదగిన మాతలుగా లోకం భావిస్తుంది. మీరు శివ, అశివ అని రెండు వర్గాలుగా అవుతారు' అన్నాడు. తరువాత స్కందుని తమపుత్రునిగా అంగీకరించి మాతృకలు అక్కడ నుండి వెళ్ళారు. (8,9)
కాకీ చ హలిమా చైవ మాలినీ బృంహతా తథా ।
ఆర్యా పలాలా వైమిత్రా సప్తైతాః శిశుమాతరః ॥ 10
కాకి, హలిమ, మాలిని, బృంహత, ఆర్య, పలాల, వైమిత్ర అనేవారు ఏడుగురు శిశువులకు మాతలు. (10)
ఏతాసాం వీర్యసంపన్నః శిశుర్నామాతిదారుణః ।
స్కందప్రసాదజః పుత్రః లోహితాక్షో భయంకరః ॥ 11
కుమారస్వామి అనుగ్రహం వలన వీరికి శిశువు అనే పేరుగల మహపరాక్రమవంతుడయినపుత్రుడు కలిగాడు. ఆయన చాలా దారుణమయినవారు - ఎర్రటి కన్నులు గలవాడు. (11)
ఏష వీరాష్టకః ప్రోక్తః స్కందమాతృగణోద్భవః ।
ఛాగవక్త్రేణ సహితః నవకః పరికీర్త్యతే ॥ 12
శిశువులు మాతృగణాలు కలిసి అష్టవ్యక్తులు అవుతారు. వీరిని 'వీరాష్టకం' అంటారు. మేషముఖ స్కందునితో కలిపి వీరిని మొత్తాన్ని వీరనవకం అని అంటారు. (12)
షష్ఠం ఛాగమయం వక్ర్తం స్కందస్యైవేతి విద్ధి తత్ ।
షట్శిరోఽభ్యంతరం రాజన్ నిత్యం మాతృగణార్చితమ్ ॥ 13
ధర్మజా! స్కందుని ఆరవముఖం మేషముఖం అని తెలుసుకో. అది ఆరుముఖాల మధ్యలో ఉంటుంది. మాతృగణం నిత్యం దాన్ని పూజిస్తుంటుంది. (13)
షణ్ణాం తు ప్రవరం తస్య శీర్షాణామిహ శబ్ద్యతే ।
శక్తిం యేనాసృజద్ దివ్యాం భద్రశాఖ ఇతి స్మ హ ॥ 14
స్కందుని ఆరుముఖాలలో అదే సర్వశ్రేష్ఠం అంటారు. ఆయన దివ్యశక్తిని సృష్టించాడు. అందువల్ల ఆయనకు భద్రశాఖుడు అనే ప్రసిద్ధి కలిగింది. (14)
ఇత్యేతద్ వివిధాకారం వృత్తం శుక్లస్య పంచమీమ్ ।
తత్ర యుద్ధం మహాఘోరం వృత్తం షష్ఠ్యాం జనాధిప ॥ 15
రాజేంద్రా! ఈ రీతిగా శుక్లపక్షంలో పంచమీతిథినాడు వివిధాకారాలు గల అనుచరుల సృష్టి జరిగింది. షష్ఠినాడు చాలాభయంకరమైన యుద్ధం జరిగింది. (15)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి మార్కండేయసమాస్యాపర్వణి ఆంగిరసే కుమారోత్పత్తౌ అష్టావింశత్యధికద్విశతతమోఽధ్యాయః ॥ 228 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున మార్కండేయ సమస్యాపర్వమను ఉపపర్వమున ఆంగిరసోపాఖ్యానమున కుమారజననము అను రెండు వందల ఇరువది యెనిమిదవ అధ్యాయము. (228)