224. రెండువందల ఇరువది నాల్గవ అధ్యాయము
దేవసేనతో ఇంద్రుడు బ్రహ్మసన్నిధికి, బ్రహ్మర్షుల సన్నిధికి వెళ్ళుట; అగ్ని కాముక వృత్తాంతము.
కన్యోవాచ
అహం ప్రజాపతేః కన్యా దేవసేనేతి విశ్రుతా ।
భగినీ దైత్యసేనా మే సా పూర్వం కేశినా హృతా ॥ 1
కన్య ఇలా అన్నది.
"నేను దక్ష ప్రజాపతి పుత్రికను. నా పేరు దేవసేన. నా సోదరి పేరు దైత్యసేన. ఆమెను మొదట కేశి అపహరించాడు. (1)
సదైవావాం భగిన్యౌ తు సఖీభిః సహ మానసమ్ ।
ఆగచ్ఛావేహ రత్యర్థమ్ అనుజ్ఞాయ ప్రజాపతిమ్ ॥ 2
అక్క చెల్లెళ్ళం మేము ఇద్దరం చెలికత్తెలతో గూడి ప్రజాపతి అనుమతి తీసుకొని, విహరించటానికి ఎప్పుడూ ఈ మానవపర్వతం మీదికి వస్తుంటాము. (2)
నిత్యం చావాం ప్రార్థయతే హర్తుం కేశీ మహాసురః ।
ఇచ్ఛత్యేనం దైత్యసేనా న చాహం పాకశాసన ॥ 3
ఇంద్రదేవా! మహాసురుడు కేశి ప్రతిరోజూ ఇక్కడికి వచ్చి మమ్ములను అపహరించటాన్ని కాంక్షిస్తుంటాడు. దైత్యసేనకు అతనంతే ఇష్టం ఉంది. కాని నాకు లేదు. (3)
సా హృతానేన భగవన్ ముక్తాహం త్వద్బలేన తు ।
త్వయా దేవేంద్ర నిర్దిష్టం పతిమిచ్ఛామి దుర్జయమ్ ॥ 4
స్వామీ! దైత్యసేనను కేశి అపహరించాడు. నీ శక్తితో నేను బయటపడినాను. దేవేంద్రా! నీవు సూచించిన దుర్జయునే నేను పతిగా స్వీకరిస్తాను. (4)
ఇంద్ర ఉవాచ
మమ మాతృష్వసేయీ త్వం మాతా దాక్షాయణీ మమ ।
ఆఖ్యాతుం త్వహమిచ్ఛామి స్వయమాత్మబలం త్వయా ॥ 5
ఇంద్రుడు అన్నాడు - "నీవు నా పినతల్లి కూతురివి. మా అమ్మ గూడా దక్షప్రజాపతి పుత్రిక. నీబలం ఏమిటో నీవు చెప్పితే వినాలి అని నాకోరిక." (5)
కన్యోవాచ
అబలాహం మహాబాహో పతిస్తు బలవాన్ మమ ।
వరదానాత్ పితుర్భావీ సురాసురనమస్కృతః ॥ 6
కన్య ఇలా అన్నది - "మహాత్మా! నేను అబలము. మాతండ్రి వరం వలన నాకు కాబోయే భర్త దేవదానవులకు వంద్యుడు అవుతాడు." (6)
ఇంద్ర ఉవాచ
కీదృశం తు బలం దేవి పత్యుస్తవ భవిష్యతి ।
ఏతదిచ్ఛామ్యహం శ్రోతుం తవ వాక్యమనిందితే ॥ 7
ఇంద్రుడు అన్నాడు - 'దేవీ! నీకాబోయే భర్తకు బలం ఎంతగా - ఎలా ఉంటుంది? పవిత్రురాలా! నీవు చెబితే వినాలని నాకోరిక.' (7)
కన్యోవాచ
దేవదానవయక్షాణాం కిన్నరోరగరక్షసామ్ ।
జేతా యో దుష్టదైత్యానాం మహావీర్యో మహాబలః ॥ 8
కన్య అన్నది - 'దేవతలను, దానవులను, యక్షులను, కిన్నరులను, రాక్షసులను, దుష్టులైన దానవులను జయించగలవాడు , మహాపరాక్రమవంతుడు, అసాధారణమైన బలం కలవాడు' (8)
యస్తు సర్వాణి భూతాని త్వయా సహ విజేష్యతి ।
స హి మే భవితా భర్తా బ్రహ్మణ్యః కీర్తివర్ధనః ॥ 9
నీతో కలిసి సమస్తప్రాణులను జయించగలిగేవాడు, బ్రాహ్మణుల మేలు కోరేవాడు, తన కీర్తిని పెంపొందించుకొనేవాడు, మహావీరపురుషుడు నాభర్త అవుతాడు.' (9)
మార్కండేయ ఉవాచ
ఇంద్రస్తస్యా వచః శ్రుత్వా దుఃఖితోఽచింతయద్ భృశమ్ ।
అస్యా దేవ్యాః పతిర్నాస్తి యాదృశం సంప్రభాషతే ॥ 10
మార్కండేయ మహర్షి అన్నాడు.
ధర్మజా! ఇంద్రుడు దేవసేన మాటలు విని చాలా విచారంలో పడి ఈమె కోరుకొనే భర్త దొరకటం కష్టం అనుకొన్నాడు. (10)
అథాపశ్యత్ స ఉదయే భాస్కరం భాస్కరద్యుతిః ।
సోమం చైవ మహాభాగం విశమానం దివాకరమ్ ॥ 11
ఇంతలో సూర్యసమాన తేజస్సు గల ఆయన సూర్యుడు ఉదయించటాన్ని, మహాత్ముడైన చంద్రుడు సూర్యునిలో ప్రవేశించటాన్నీ చూశాడు. (11)
అమావాస్యాం ప్రవృత్తాయాం ముహూర్తే రౌద్ర ఏవ తు ।
దేవాసురం చ సంగ్రామం సోఽపశ్యదుదయే గిరౌ ॥ 12
అమావాస్యనాడు రౌద్ర(భయంకర)మైన ముహూర్తంలోనే ఉదయపర్వతశిఖరంపైన ఆయనకు దేవాసురుల యుద్ధలక్షణం కనిపించింది. (12)
లోహితైశ్చ ఘనైర్యుక్తాం పూర్వాం సంధ్యాం శతక్రతుః ।
అపశ్యల్లోహితోదం చ భగవాన్ వరుణాలయమ్ ॥ 13
ప్రభాతసమయంలో తూర్పు దిక్కున ఆకాశంలో ఎర్రటిమేఘాలు వ్యాపిస్తున్నవి. సముద్రజలం కూడా ఎర్రగానే కనిపిస్తున్నది. ఐశ్వర్యవంతుడైన ఇంద్రుడు అది చూశాడు. (13)
భృగుభిశ్చాంగిరోభ్యశ్చ హుతం మంత్రైః పృథగ్విధైః ।
హవ్యం గృహీత్వా వహ్నిం చ ప్రవిశంతం దివాకరమ్ ॥ 14
భృగుగోత్రులు, అంగిరసునిగోత్రం వారు భిన్నభిన్న మంత్ర్రాలను ఉచ్చరిస్తూ హోమం చేసిన హవిస్సును గ్రహించి అగ్నిదేవుడు కూడా సూర్యునిలో ప్రవేశిస్తున్నాడు. (14)
పర్వ చైవ చతుర్వింశం తదా సూర్యముపస్థితమ్ ।
తథా ధర్మగతం రౌద్రం సోమం సూర్యగతం చ తమ్ ॥ 15
అప్పుడు సూర్యుని వద్దకు ఇరవై నాల్గవ పర్వం వచ్చింది. అంటే... అంతకుముందు దేవాసుర యుద్ధం జరిగిన సంవత్సరం నిండిన తరువాత మళ్ళీ అటువంటిస్థితి వచ్చింది. హోమసంధ్యాసమయంలో ఆరుద్రముహూర్తం వచ్చింది. ఆ సమయంలో చంద్రుడు సూర్యరాశిలో ఉన్నాడు. (15)
సమాలోక్యైకతామేవ శశినో భాస్కరస్య చ ।
సమవాయం తు తం రౌద్రం దృష్ట్వా శక్రోఽన్వచింతయత్ ॥ 16
ఇలా సూర్యచంద్రుల ఏకత్వం - అంటే ఒకేరాశిలో ఉండటం, రౌద్రముహూర్తంతో కలియటం చూసి ఇంద్రుడు మనస్సులో ఇలా అనుకొన్నాడు. (16)
సూర్యాచంద్రమసోర్ఘోరం దృశ్యతే పరివేషణమ్ ।
ఏతస్మిన్నేవ రాత్ర్యంతే మహద్ యుద్ధం తు శంసతి ॥ 17
ఈ సమయంలో సూర్యచంద్రుల మీద భయంకరమైన పరివేషం కనిపిస్తున్నది. తెల్లవారుజాముననే మహాయుద్ధం జరుగుతుంది అనే విషయాన్ని ఇది సూచిస్తోంది. (17)
సరిత్సింధురపీయం తు ప్రత్యసృగ్వాహినీ భృశమ్ ।
శృగాలిన్యగ్నివక్ర్తా చ ప్రత్యాదిత్యం విరావిణీ ॥ 18
ఈ సిందినది గూడా విపరీతమైన ధారతో రక్తప్రవాహంతో ప్రవహిస్తున్నది. ఆడనక్క నోటినుండి నిప్పులు కురుస్తున్నతు సూర్యునివైపు మోర ఎత్తి అరుస్తున్నది. (18)
ఏష రౌద్రశ్చ సంఘాతః మహాన్ యుక్తశ్చ తేజసా ।
సోమస్య వహ్నిసూర్యాభ్యామ్ అద్భుతోఽయం సమాగమః ॥ 19
అనేకయోగాలతో ఈ మహాభయంకరమైన యోగం తేజస్సుతో గూడి కన్పడుతున్నది. అగ్ని, సూర్యులతో చంద్రుని ఈ మహాద్భుతమైన యోగం అద్భుతంగా కన్పిస్తున్నది. (19)
జనయేద్ యం సుతం సోమః సోఽస్యా దేవ్యాః పతిర్భవేత్ ।
అగ్నిశ్చైతైర్గుణైర్యుక్తః సర్వైరగ్నిశ్చ దేవతా ॥ 20
ఈ సమయంలో చంద్రుడు ప్రసాదించే వ్యక్తియే ఈ దేవికి భర్త అవుతాడు. అలాగే అగ్ని కూడా ఈ గుణాలు అన్నిటితో కూడి ఉన్నాడు. ఆయన దేవతాసమూహంలో ఉన్నాడు. (20)
ఏష చేజ్జనయేద్ గర్భం సోఽస్యా దేవ్యాః పతిర్భవేత్ ।
ఏవం సంచింత్య భగవాన్ బ్రహ్మలోకం తదా గతః ॥ 21
గృహీత్వా దేవసేనాం తామ్ అవదత్ స పితామహమ్ ।
ఉవాచ చాస్యా దేవ్యాస్త్వం సాధుశూరం పతిం దిశ ॥ 22
కాబట్టి ఈ అగ్ని ఒకబాలకుని కనినచో ఆయనే ఈ దేవికి భర్త అవుతాడు" అని ఆ దేవాధిపతి ఆలోచిస్తూ బ్రహ్మలోకానికి వెళ్ళాడు.
ఆయన దేవసేనతో బ్రహ్మలోకానికి వెళ్ళి, చతుర్ముఖునితో "దేవేశ్వరా! ఈమెకు మంచిస్వభావం, పరాక్రమం గల మహాశూరుడైన భర్తను అనుగ్రహించండి." అన్నాడు. (21,22)
బ్రహ్మోవాచ
మయైతచ్చింతితం కార్యం త్వయా దానవసూదన ।
తథా చ భవితా గర్భః బలవానురువిక్రమః ॥ 23
బ్రహ్మదేవుడు ఇలా అన్నాడు - "రాక్షస నాశకా! ఈ విషయంలో నీవు అనుకొన్నదే నాకూ తోచింది. అలా జరిగితేనే మహాపరాక్రమవంతుడు, బలవంతుడు అయిన వీరుడు ఆవిర్భవిస్తాడు. (23)
స భవిష్యతి సేనానీః త్వయా సహ శతక్రతో ।
అస్యా దేవ్యాః పతిశ్చైవ స భవిష్యతి వీర్యవాన్ ॥ 24
ఇంద్రా! ఆయనయే నీకు తోడై ఉండే వీరుడు. నీసేనకు సహాయం అవుతాడు. ఆయనయే ఈమెకు భర్త అవుతాడు. (24)
ఏతచ్ఛ్రుత్వా నమస్తస్మై కృత్వాసౌ సహ కన్యయా ।
తత్రాభ్యగచ్ఛద్ దేవేంద్రః యత్ర దేవర్షయోఽభవన్ ॥ 25
వసిష్ఠప్రముఖా ముఖ్యాః విప్రేంద్రా సుమహాబలాః ।
ఈ మాటలు విని దేవేంద్రుడు బ్రహ్మదేవునికి నమస్కరించి, ఆ కన్యను తీసికొని, మహాశక్తి శాలులైన వశిష్ఠాది శ్రేష్ఠబ్రాహ్మణులు, దేవర్షులు గల వారి ఆశ్రమానికి వెళ్ళాడు. (25 1/2)
భాగార్థం తపసో ధాతుం తేషాం సోమం తథాధ్వరే ॥ 26
పిపాసవో యయుర్దేవాః శతక్రతుపురోగమాః ।
ఆ కాలంలో ఆ మహర్షులు చేసే యజ్ఞంలో భాగం గ్రహించటానికి, సోమపానం చేయటానికి ఇంద్రాది సమస్త దేవతలు అక్కడికి వెళ్ళారు. వారందరికి సోమపానం చేయవలెననే కోరిక బాగా ఉంది. (26 1/2)
ఇష్టిం కృత్వా యథాన్యాయం సుసమిద్ధే హుతాశనే ॥ 27
జుహువుస్తే మహాత్మానః హవ్యం సర్వదివౌకసామ్ ।
మహాత్ములయిన ఆ మహర్షులు ప్రజ్వరిల్లుతున్న అగ్నిలో శాస్త్రానుసారం ఇష్టిని చేసి దేవతలందరికీ హవిస్సుతో ఆహుతులు ఇచ్చారు. (27 1/2)
సమాహుతో హుతవహః సోఽద్భుతః సూర్యమండలాత్ ॥ 28
వినిః సృత్య యయౌ వహ్నిః వాగ్యతో విధివత్ ప్రభుః ।
ఆగమ్యాహవనీయం వై తైర్ద్విజైర్మంత్రతో హుతమ్ ॥ 29
స తత్ర వివిధం హవ్యం ప్రతిగృహ్య హుతాశనః ।
ఋషిభ్యో భరతశ్రేష్ఠ ప్రాయచ్ఛత దివౌకసామ్ ॥ 30
భారత వంశశ్రేష్ఠా! మంత్రాలతో ఆవాహనం జరిగిన తరువాత అద్భుతుడు అనే అగ్ని సూర్యమండలం నుంచి బయలుదేరి, మౌనంతో అక్కడికి వచ్చాడు.
బ్రహ్మర్షులు మంత్రోచ్ఛారణతో యథావిధిగా హోమం చేయటానికి అనేకమైన హోమద్రవ్యాలను గ్రహించారు.
అద్భుతుడు ఆ మహర్షుల వల్ల ప్రాప్తించిన హవ్యములన్నీ దేవతలందరికి సమర్పించాడు. (28-30)
నిష్ర్కామంశ్చాప్యపశ్యత్ సః పత్నీ స్తేషాం మహాత్మనామ్ ।
స్వేష్వాసనేఘాపవిష్టాః స్వపంతీశ్చ తథా సుఖమ్ ॥ 31
అగ్నిదేవుడు అక్కడినుంచి వెళ్ళుతూ ఉన్నప్పుడు ఆయన దృష్టి మహాత్ములైన సప్తర్షులభార్యలమీద పడింది. వారిలో కొందరు తమ ఆసనాల మీద కూర్చొని ఉన్నారు. కొంతమంది హాయిగా నిద్రిస్తున్నారు. (31)
రుక్మవేదినిభాస్తాస్తు చంద్రలేఖా ఇవామలాః ।
హుతాశనార్చిప్రతిమాః సర్వాస్తారా ఇవాద్భుతాః ॥ 32
బంగారువేదికవలె శరీరకాంతితో మనోహరంగా ఉన్నారు. చంద్రకళవలె కాంతులు వెదజల్లుతున్నారు. తారకలవలె అద్భుతమైన సౌందర్యంతో వెలుగుతున్నారు. (32)
స తత్ర తేన మనసా బభూవ క్షుభితేంద్రియః ।
పత్నీర్దృష్ట్వా ద్విజేంద్రాణాం వహ్నిః కామవశం యయౌ ॥ 33
వారి పై మనసుపడి చూస్తున్న అద్భుతాగ్ని యొక్క ఇంద్రియాలు అన్నీ క్షోభించిపోయాయి. ఆయన కామదేవునికి లొంగినాడు. (33)
భూయః సంచింతయామాస న న్యాయ్యం క్షుభితో హ్యహమ్ ।
సాధ్వ్యః పత్న్యో ద్విజేంద్రాణామ్ అకామాః కామయామ్యహమ్ ॥ 34
మళ్ళీ ఆయన మనస్సులో ఇలా అనుకొన్నాడు. "ఈ మహర్షుల భార్యలు పతివ్రతలు. నాపని సరైనది కాదు. వీరికి నాయందు ఏమాత్రం కోరిక లేదు. అయినా వీరియందు నాకు కోరిక కలిగినది. (34)
నైతాః శక్యా మయా ద్రష్టుం స్ర్పష్టుం వాప్యనిమిత్తతః ।
గార్హపత్యం సమావిశ్య తస్మాత్ పశ్యామ్యభీక్ష్ణశః ॥ 35
నిష్కారణంగా నేను వీరిని చూడలేను. వారిని తగలలేను. కాబట్టి గార్హపత్యాగ్నిలో ప్రవేశిస్తే మాటిమాటికి వీరిని చూసే అవకాశం లభిస్తుంది." (35)
మార్కండేయ ఉవాచ
సంస్పృశన్నివ సర్వాస్తాః శిఖాభిః కాంచనప్రభాః ।
పశ్యమానశ్చ ముముదే గార్హపత్యం సమాశ్రితః ॥ 36
మార్కండేయ మహర్షి ఇలా అన్నారు.
అలా నిశ్చయించుకొని అగ్నిదేవుడు గార్హపత్యాగ్నిని ఆశ్రయించి, తనజ్వాలలతో బంగారు కాంతిగల ఆ ఋషిపత్నులను చూస్తూ, స్పృశిస్తూ చాలా సంతోషిస్తున్నాడు. (36)
నిరుష్య తత్ర సుచిరమ్ ఏవం వహ్నిర్వశం గతః ।
మనస్తాసు వినిక్షిప్య కామయానో వరాంగనాః ॥ 37
ఇలా చాలాసేపు అక్కడ నిలచి ఉండి అగ్నిదేవుడు కామవశుడయినాడు. తనమనస్సును ఆ సుందరులపై నిలిపి పరవశించాడు. (37)
కామసంతప్తహృదయః దేహత్యాగవినిశ్చితః ।
అలాభే బ్రాహ్మణస్త్రీణామ్ అగ్నిర్వనముపాగమత్ ॥ 38
కామసంతప్తమనస్కుడైన ఆయన ఆ మునిపత్నుల సమాగమం కలగకపోవటం వలన శరీరాన్ని విడిచిపెట్టాలని అడవిలోనికి వెళ్ళాడు. (38)
స్వాహా తం దక్షదుహితా ప్రథమం కామయత్ తదా ।
సా తస్య ఛిద్రమన్వైచ్ఛత్ చిరాత్ర్పభృతి భావినీ ॥ 39
ప్రజాపతి ఐన దక్షుని కూతురు స్వాహాదేవి అంతకు ముందు నుంచే అగ్నిదేవుని (తను భర్తగా) పొందాలి అని చాలాకాలం నుంచి ఆయనలో లోపాలను వెదకుతున్నది. (39)
అప్రమత్తస్య దేవస్య న చ పశ్యత్యనిందితా ।
సా తం జ్ఞాత్వా యథావత్ తు వహ్నిం వనముపాగతమ్ ॥ 40
అప్పటి దాకా చాలా జాగ్రత్తగా ఉన్న అగ్నిలో ఆమెకు ఏ దోషమూ కనిపించలేదు. అగ్ని కామసంతప్తుడయి ఉన్నాడని తెలిసిన వెంటనే ఆమె మనస్సులో ఇలా అనుకొన్నది. (40)
తత్త్వతః కామసంతప్తం చింతయామాస భావినీ ।
అహం సప్తర్షిపత్నీనాం కృత్వా రూపాణి పావకమ్ ॥ 41
కామయిష్యామి కామార్తా తాసాం రూపేణ మోహితమ్ ।
ఏవం కృతే ప్రీతిరస్య కామావాప్తిశ్చ మే భవేత్ ॥ 42
కామార్తురాలనయిన నేను వారి రూపం దాల్చి అగ్నిని మోహింపజేస్తాను - అలా చేస్తే ఆయన మనస్సూ సంతోషిస్తుంది. నా కోరికా తీరుతుంది. (41,42)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి మార్కండేయసమాస్యాపర్వణి ఆంగిరసోపాఖ్యానే స్కందోత్పత్తౌ చతుర్వింశత్యధికద్విశతతమోఽధ్యాయః ॥ 224 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున మార్కండేయ సమాస్యాపర్వమను ఉపపర్వమున ఆంగీరసోపాఖ్యానమున స్కందోత్పత్తి అను రెండు వందల ఇరువది నాలుగవ అధ్యాయము. (224)