223. రెండువందల ఇరువది మూడవ అధ్యాయము

ఇంద్రుడు కేశిదానవుని నుండి దేవసేనను విడిపించుట.

వైశంపాయన ఉవాచ
(శ్రుత్వేమాం ధర్మసంయుక్తాం ధర్మరాజః కథాం శుభామ్ ।
పునః పప్రచ్ఛ తమృషిం మార్కండేయం తపస్వినమ్ ॥
వైశంపాయనుడు ఇలా అన్నాడు.
ధర్మంతో కూడిన మంచి కథను విని, ధర్మరాజు తపస్వి ఐన మార్కండేయ మహర్షిని ఇలా అడిగాడు.
యుధిష్ఠిర ఉవాచ
కుమారస్తు యథా జాతః యథా చాగ్నేః సుతోఽభవత్ ।
యథా రుద్రాశ్చ సంభూతః గంగాయాం కృత్తికాసు చ ॥
ధర్మరాజు అన్నాడు 'మహర్షీ! కుమారస్వామి ఏవిధంగా జన్మించాడు? అగ్నికి పుత్రుడు ఎలా అయినాడు? శివుని వల్ల ఎలా జన్మించాడు? గంగకు కృత్తికలకు పుత్రుడు ఎందుకయినాడు?
ఏతదిచ్ఛామ్యహం శ్రోతుం కౌతుహలమతీవ మే ॥)
ఇది వినాలి అనుకొంటున్నాను. నాకు చాలా కుతూహలంగా ఉంది.)
మార్కండేయ ఉవాచ
అగ్నీనాం వివిధా వంశాః కీర్తితాస్తే మయానఘ ।
శృణు జన్మ తు కౌరవ్య కార్తికేయస్య ధీమతః ॥ 1
మార్కండేయుడు ఇలా అన్నాడు - అనఘా యుధిష్ఠిరా!
నేను నీకు అగ్నిదేవుని వివిధ వంశాలను వివరించాను. ఇప్పుడు మహామేధావి అయిన కార్తికేయుని జన్మవృత్తాంతాన్ని చెపుతాను, విను. (1)
అద్భుతస్యాద్భుతం పుత్రం ప్రవక్ష్యామ్యమితౌజసమ్ ।
జాతం బ్రహ్మర్షిభార్యాభిః బ్రహ్మణ్యం కీర్తివర్ధనమ్ ॥ 2
విలక్షణమైన అగ్నికి ఆశ్చర్యజనకుడైన పుత్రుడు కార్తికేయుడు. అతని బలం, తేజస్సు అమితమైనవి. ఆయన బ్రహ్మర్షుల భార్యలకు జన్మించాడు. కీర్తిని పెంపొందించుకొనే ఆయన బ్రాహ్మణ భక్తుడు. ఆయన జన్మవృత్తాంతం చెపుతాను. విను. (2)
దేవాసురాః పురా యత్తాః వినిఘ్నంతః పరస్పరమ్ ।
తత్రాజయన్ సదా దేవాన్ దానవా ఘోరరూపిణః ॥ 3
పూర్వకాలంలో దేవతలు, దానవులు సంసిద్ధులై పరస్పరం యుద్ధానికి తలపడుతుండేవారు. ఆ యుద్ధంలో భయంకరరూపులైన దానవులు దేవతలను ఎల్లప్పుడు జయిస్తుండేవారు. (3)
వధ్యమానం బలం దృష్ట్వా బహుశస్తైః పురందరః ।
స సైన్యనాయకార్థాయ చింతామాప భృశం తదా ॥ 4
దానవులు మాటిమాటికి దేవత్ల సైన్యాన్ని వధించటం చూసి తనసైన్యానికి నాయకుడు ఎలా లభిస్తాడా అని ఆలోచించాడు ఇంద్రుడు. (4)
దేవసేనాం దానవైర్హి భగ్నాం దృష్ట్వా మహాబలః ।
పాలయేద్ వీర్యమాశ్రిత్య స జ్ఞేయః పురుషో మయా ॥ 5
దానవుల చేతిలో ఓడిపోతున్న తనసైన్యాన్ని చూసి ఆయన తనపరాక్రమంతో దేవతల సైన్యాన్ని రక్షించే మహాబలుడైన మహావ్యక్తిని గురించి నేను తెలుసుకోవాలి అని అనుకొన్నాడు. (5)
స శైలం మానసం గత్వా ధ్యాయన్నర్థమిదం భృశమ్ ।
శుశ్రావార్తస్వరం ఘోరమ్ అయం ముక్తం స్త్రియా తదా ॥ 6
ఈ విషయాన్నే బాగా ఆలోచిస్తూ ఇంద్రుడు మానసపర్వతానికి వెళ్ళాడు. అప్పుడు ఆయన ఒక తీవ్రమైన స్త్రీ ఆర్తస్వరాన్ని విన్నాడు. (6)
వి॥సం॥ స్త్రియా = దేవసేనాభిమాన దేవతచేత (నీల)
అభిధావతు మాం కశ్చిత్ పురుషస్త్రాతు చైవ హ ।
పతిం చ మే ప్రదిశతు స్వయం వా పతిరస్తు మే ॥ 7
"ఎవరైనా మహావీరుడైన పురుషుడు త్వరగా పరుగెత్తుకొని వచ్చి నన్ను రక్షించవలసింది. నాకు ఆయన భర్తను ప్రసాదించవచ్చు. లేక ఆ వ్యక్తియే నన్ను వరించవచ్చు" అని ఆమె అరిచింది. (7)
పురందరస్తు తామాహ మా భైర్నాస్తి భయం తవ ।
ఏవముక్త్వా తతోఽపశ్యత్ కేశినం స్థితమగ్రతః ॥ 8
ఇంద్రుడు ఆమెతో "భయపడవద్దు. నీకు ఎలాంటి భయమూ లేదు" అని పలికి ఆ వైపు చూశాడు. అప్పుడు కేశి అనే దానవుడు ఎదురుగా కన్పడినాడు. (8)
కిరీటినం గదాపాణిం ధాతుమంతమివాచలమ్ ।
హస్తే గృహీత్వా కన్యాం తామ్ అథైనం వాసవోఽబ్రవీత్ ॥ 9
ఆ వ్యక్తికి తలపై కిరీటం ఉన్నది. చేతిలో గద ఉన్నది. గైరికాది ధాతువులతో గూడిన మహాపర్వతంలాగా అతడు ఉన్నాడు. ఇంద్రుడు ఆ కన్యను చేతితో తీసికొని ఇలా అన్నాడు. (9)
అనార్యకర్మన్ కస్మాత్ త్వమ్ ఇమాం కన్యాం జిహీర్షసి ।
వజ్రిణం మాం విజానీహి విరమాస్యాః ప్రబాధనాత్ ॥ 10
"నీచమైన పనిని చేసే దానవా! ఈమెను నీవు ఎందుకు అపహరిస్తున్నావు? నేను ఇంద్రుడిని. తెలుసుకో. నా చేతిలోనిది వజ్రాయుధం. ఈమెను బాధించటం ఇక మానుకో.' (10)
కేశ్యువాచ
విసృజస్వ త్వమేవైనాం శక్రైషా ప్రార్థితా మయా ।
క్షమం తే జీవతో గంతుం స్వపురం పాకశాసన ॥ 11
కేశి ఇలా అన్నాడు. 'ఇంద్రా! నీవే విడిచిపెట్టు. ఇలా చేస్తేనే నీవు బతికి బట్టకడతావు. నీ నివాసం అమరావతికి వెళ్ళగలవు." (11)
ఏవముక్త్వా గదాం కేశీ చిక్షేపేంద్రవధాయ వై ।
తామాపతంతీం చిచ్ఛేద మధ్యే వజ్రేణ వాసవః ॥ 12
అని పలికి కేశి ఇంద్రుని వధించటానికి గదను విసిరాడు. ఆ వచ్చే గదను మధ్యలోనే ఇంద్రుడు వజ్రాయుధంతో ముక్కలు చేశాడు. (12)
అథాస్య శైలశిఖరం కేశీ క్రుద్ధో వ్యవాసృజత్ ।
తదా పతంతం సంప్రేక్ష్య శైలశృంగం శతక్రతుః ॥ 13
బిభేద రాజన్ వజ్రేణ భువి తన్నిపపాత హ ।
పతతా తు తదా కేశీ తేన శృంగేణ తాడితః ॥ 14
అప్పుడు బాగా కోపించిన కేశి ఇంద్రునిపైకి ఒక పర్వతశిఖరాన్ని విసిరాడు. ఆయన తనమీద పడబోయే పర్వతశిఖరాన్ని చూశాడు.
రాజా! వెంటనే ఇంద్రుడు దాన్ని వజ్రాయుధంతో ఖండించాడు. అది నేల మీద పడింది. ఆ పడిపోయే శిఖరశిలలు తగిలి కేశికి గాయాలు అయినాయి. (13,14)
హిత్వా కన్యాం మహాభాగాం ప్రాద్రవద్ భృశపీడితః ।
అపయాతేఽసురే తస్మిన్ తాం కన్యాం వాసవోఽబ్రవీత్ ।
కాసి కస్యాసి కిం చేహ కురుషే త్వం శుభాననే ॥ 15
వెంటనే అతడు సౌభాగ్యవతి యైన కన్య చేతిని వదిలి పరుగెత్తాడు. రాక్షసుడు తొలగిపోగా ఇంద్రుడు "సుందరీ! నీవు ఎవరివి? ఎవరి పుత్రికవు? ఇక్కడ ఏం చేస్తున్నావు?" అని అడిగాడు. (15)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి మార్కండేయ సమాస్యాపర్వణి ఆంగిరసోపాఖ్యానే స్కందోత్పత్తౌ కేశిపరాభవే త్రయోవింశత్యధికద్విశతతమోఽధ్యాయః ॥ 223 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున మార్కండేయ సమాస్యాపర్వమను ఉపపర్వమున స్కందుని ఉత్పత్తిలో కేశిపరాభవమను రెండు వందల ఇరువది మూడవ అధ్యాయము. (223)
(దాక్షిణాత్యప్రతి అధికపాఠం 2 1/2 శ్లోకాలు కలిపి మొత్తం 17 1/2 శ్లోకాలు.)