225. రెండువందల ఇరువది అయిదవ అధ్యాయము
కుమారస్వామి జననము, క్రౌంచ పర్వత ఖండనము.
మార్కండేయ ఉవాచ
శివా భార్యా త్వంగిరసః శీలరూపగుణాన్వితా ।
తస్యాః సా ప్రథమం రూపం కృత్వా దేవీ జనాధిప ॥ 1
జగామ పావకాభ్యాశం తం చోవాచ వరాంగనా ।
మామగ్రే కామసంతప్తాం త్వం కామయితుమర్హసి ॥ 2
కరిష్యసి న చేదేవం మృతాం మాముపధారయ ।
అహ మంగిరసో భార్యా శివా నామ హుతాశన ।
శిష్టాభిః ప్రహితా ప్రాప్తా మంత్రయిత్వా వినిశ్చయమ్ ॥ 3
మార్కండేయుడు చెప్పసాగాడు.
రాజా! అంగిరసుని భార్య శివ చక్కని శీలమూ, సౌందర్యమూ, సద్గుణసంపద కలది, స్వాహాదేవి మొదట ఆమె రూపం ధరించింది.
ఆ ఉత్తమ స్త్రీ అగ్నిదేవుని వద్దకు వెళ్లి "కామ సంతప్తనైన నన్ను నీవు మొదట అంగీకరింపవలసినది.
నీవు ఇట్లు చేయనిచో నేను ప్రాణత్యాగం చేయటం నిశ్చయం. మిగిలిన సప్తర్షుల భార్యలు ఆలోచించుకొని, ఒక నిర్ణయానికి వచ్చి, నన్ను ఇక్కడికి పంపించారు" అని ఆమె అన్నది. (1-3)
అగ్నిరువాచ
కథం మాం త్వం విజానీషే కామార్తమితరాః కథమ్ ।
యాస్త్వయా కీర్తితాః సర్వాః సప్తర్షీణాం ప్రియాః స్త్రియః ॥ 4
అగ్ని ఇలా అన్నాడు - నీవు చెప్పిన సప్తర్షుల భార్యలకూ, నీకూ నేను కామార్తుడనైతి నని ఎల్ తెలిసింది? (4)
శివోవాచ
అస్మాకం త్వం ప్రియో నిత్యం బిభిమస్తు వయం తవ ।
త్వచ్చిత్తమింగితైర్ జ్ఞాత్వా ప్రేషితాస్మి తవాంతికమ్ ॥ 5
శివాదేవి అన్నది - 'అగ్నిదేవా! ఎల్లప్పుడు మాకు నీవు అంటే ఇష్టమే. కాని మేము నీకు భయపడుతూ ఉంటాము. ఇవ్వేళ నీచేష్టల వలన నీ మనస్సు తెలుసుకుని వారు నన్ను నీవద్దకు పంపారు. (5)
మైథునాయేహ సంప్రాప్తా కామం ప్రాప్తం ద్రుతం చర ।
జామయో మాం ప్రతీక్షంతే గమిష్యామి హుతాశన ॥ 6
నీతో సంగమించవలెననే కోరికతో నీవద్దకు వచ్చాను. నన్ను త్వరగా పొందు. ఆ నా సోదరీమణులు నారాకకోసం ఎదురుచూస్తున్నారు.' (6)
మార్కండేయ ఉవాచ
తతోఽగ్నిరుపమేమే తాం శివాం ప్రీతిముదాయుతః ।
ప్రీత్యా దేవీ సమాయుక్తా శుక్రం జగ్రాహ పాణినా ॥ 7
మార్కండేయ మహర్షి అన్నారు - రాజా! అప్పుడు అగ్ని సంతోషంతో ఆమెను స్వీకరించాడు. శివారూపంలో ఉన్న స్వాహాదేవి అగ్నితో సమాగమంలో ఆయన తేజస్సును చేత ధరించింది. (7)
అచింతయన్మమేదం యే రూపం ద్రక్ష్యంతి కాననే ।
తే బ్రాహ్మణీనామనృతం దోషం వక్ష్యంతి పావక ॥ 8
తరువాత ఆమె కొంచెం ఆలోచించి "అగ్నికులనందనా! ఈ అరణ్యంలో నా ఈ రూపాన్ని చూచినవారు బ్రాహ్మణ భార్యలందరిమీద అసత్యదోషాన్ని ఆరోపిస్తారు. (8)
తస్మాదేతద్ రక్ష్యమాణా గరుడీ సంభవామ్యహమ్ ।
వనాన్నిర్గమనం చైవ సుఖ మమ భవిష్యతి ॥ 9
కాబట్టి నేను ఈ రహస్యాన్ని దాచటం కోసం ఆడ గరుడ పక్షి రూపాన్ని ధరిస్తాను. ఇందువలన ఈ అడవినుంచి నేను సుఖంగా వెళ్ళటానికి వీలు అవుతుంది." (9)
మార్కండేయ ఉవాచ
సుపర్ణీ సా తదా భూత్వా నిర్జగామ మహావనాత్ ।
అపశ్యత్ పర్వతం శ్వేతం శరస్తంబైః సుసంవృతమ్ ॥ 10
మార్కండేయ మహర్షి అన్నాడు - ఇలా ఆమె చెప్పి వెంటనే ఆడ గరుడ పక్షిరూపం ధరించి, ఆ మహారణ్యం నుంచి బయటపడింది. ముందరికి పోయి రెల్లుపొదలతో కప్పబడిన శ్వేతపర్వతశిఖరాన్ని చూచింది. (10)
దృష్టీవిషైః సప్తశీర్షైః గుప్తం భోగిభిరద్భుతైః ।
రాక్షసీభిః పిశాచైశ్చ రౌద్రైర్భూతగణైస్తథా ॥ 11
రాక్షసీభిశ్చ సంపూర్ణమ్ అనేకైశ్చ మృగద్విజైః ।
(చూపులలోనే విషమున్న) ఏడు తలలు గల అద్భుతమైన సర్పాలు ఆ పర్వతాన్ని రక్షిస్తున్నాయి. ఇవేకాక రాక్షసులు పిశాచాలు, భయంకర భూతగణాలు, రాక్షస సముదాయంతో అది నిండిపోయింది. (11 1/2)
(నదీప్రస్రవణోపేతం నానాతరుసమాచితమ్ ।)
సా తత్ర సహసా గత్వా శైలపృష్ఠం సుదుర్గమమ్ ॥ 12
ప్రాక్షిపత్ కాంచనే కుండే శుక్రం సా త్వరితా శుభా ।
అనేకమైన నదులతో, సెలయేళ్లతో, నానావిధ పుష్పాలతో, వృక్షాలతో అడుగు పెట్టటానికి వీలులేనంత దట్టంగా ఆ పర్వతం ఉంది.
మంగళమయి అయిన స్వాహాదేవి వేగంగా ఆ దుర్గమ పర్వతశిఖరం మీద ఉన్న ఒక బంగారుకుండంలో ఆ వీర్యం వదలింది. (12 1/2)
సప్తానామపి సా దేవీ సప్తర్షీణాం మహాత్మనామ్ ॥ 13
పత్నీసరూపతాం కృత్వా కామయామాస పావకమ్ ।
దివ్యరూపమరుంధత్యాః కర్తుం న శకితం తయా ॥ 14
తస్యాస్తపః ప్రభావేణ భర్తృశుశ్రూషణేన చ ।
షట్కృత్వస్తత్ తు నిక్షిప్తమ్ అగ్నే రేతః కురూత్తమ ॥ 15
అలాగే సప్తమహర్షుల భార్యలరూపం ధరించి అగ్నిని పొందవలె ననుకొన్న ఆమె తపస్సు, పతిసేవా ప్రభావంతో విరాజిల్లే అరుంధతీరూపాన్ని ధరించలేకపోయింది.
తక్కిన ఆరుగురు మునిపత్నుల స్వరూపాలను ధరించి గ్రహించిన రేతస్సును ఆ కుండలో వదలింది. (13-15)
తస్మిన్ కుండే ప్రతిపది కామిన్యా స్వాహయా తదా ।
తత్ స్కన్నం తేజసా తత్ర సంవృతం జనయత్ సుతమ్ ॥ 16
ఋషిభిః పూజితం స్కన్నమ్ అన్యత్ స్కందతాం తతః ।
షట్శిరా ద్విగుణ శ్రోత్రః ద్వాదశాక్షిభుజక్రమః ॥ 17
స్వాహాదేవి ప్రతిపత్తు (పాడ్యమి)నాడు ఆ వీర్యాన్ని ఆ కుండలో వదలింది. స్ఖలితమయిన ఆ తేజస్సు ఒక తేజస్వి అయిన కుమారుని గాంచినది.
మహర్షుల పూజించి స్కందితమయిన దానివలన ఏర్పడడం చేత ఆ కుమారుని పేరు స్కందుడు అయినది. ఆరుతలలు, పన్నెండు చెవులు, పన్నెండు కన్నులు, పన్నెండు భుజాలు ఉన్నవి. (16,17)
ఏకగ్రీవైకజఠరః కుమారః సమపద్యత ।
ద్వితీయాయామభివ్యక్తః తృతీయాయాం శిశుర్బభౌ ॥ 18
కాని ఆ కుమారునికి మెడ, పొట్ట మాత్రం ఒకటే ఉన్నది. విదియనాడు వ్యక్తమైన ఆయన మూడవరోజున శిశువు అయ్యాడు. (18)
అంగప్రత్యంగసంభూతం చతుర్థ్యామభవద్ గుహః ।
లోహితాభ్రేణ మహతా సంవృతః సహ విద్యతా ॥ 19
లోహితాభ్రే సుమహతి భాతి సూర్య ఇవోదితః ।
నాల్గవనాడు ఆ స్కంద కుమారునికి అంగాలు, ఉపాంగాలు (చేతులు, కాళ్ళు, వ్రేళ్ళు మొదలగునవి) కలిగాయి.
అప్పుడు కుమారస్వామి ఎర్రని విశాలమైన మేఘంతో కప్పబడి ఉన్నాడు. అందువల్ల ఎర్రని విశాల మేఘంలో వెలిగే సూర్యునివలె అయిన ప్రకాశించాడు. (19 1/2)
గృహీతం తు ధనుస్తేన విపులం లోమహర్షణమ్ ॥ 20
న్యస్తం యత్ త్రిపురఘ్నేన సురారివినికృంతనమ్ ।
తద్ గృహీత్వా ధనుః శ్రేష్ఠం ననాద బలవాంస్తదా ॥ 21
త్రిపురనాశకుడైన పరమేశ్వరుడు దేవశత్రువులను నాశనం చేయటానికి ఒక వింటిని సిద్ధం చేశాడు. అది పెద్దది. చూస్తేనే గగుర్పాటు కల్గించేది. మహాబలుడైన ఆ స్కందుడు ఆ మహాధనుస్సు నెత్తి, సింహనాదం చేశాడు. (20,21)
సమ్మోహయన్నివేమాన్ సః త్రీంల్లోకాన్ సచరాచరాన్ ।
తస్య తం నినదం శ్రుత్వా మహామేఘౌఘనిఃస్వనమ్ ॥ 22
ఉత్పేతతుర్మహానాగౌ చిత్ర శ్చైరావతశ్చ హ ।
తావాపతంతౌ సంప్రేక్ష్య స బలోఽర్కసమద్యుతిః ॥ 23
ద్వాభ్యాం గృహీత్వా పాణిభ్యాం శక్తిం చాన్యేన పాణినా ।
అపరేణాగ్నిదాయాదః తామ్రచూడం భుజేన సః ॥ 24
మహాకాయముపశ్లిష్టం కుక్కుటం బలినాం వరమ్ ।
గృహీత్వా వ్యనదద్ భీమం చిక్రీడ చ మహాభుజః ॥ 25
మహామేఘగర్జన వలె ఉన్న ఆ సింహనాదాన్ని విని, స్థావరజంగమ ప్రాణులతో గూడిన ముల్లోకాలు మూర్ఛ పొందినట్లైనవి.
చిత్రం, ఐరావతం అనేపేర్లు గల ఏనుగులు పరుగులెత్తాయి. మహాబలిష్ఠుడై, సూర్యసమానకాంతి గల ఆయన వాటిని రెండింటిని రెండుచేతులతో గ్రహించాడు. ఇంకొక చేతితో శక్తి అనే ఆయుధాన్ని, మరోచేతితో పెద్దశరీరం, ఎర్రటి శిఖ గల కోడిపుంజును పట్టుకొని పెద్దగా సింహనాదం చేసి వాటితో ఆ మహాభుజుడు ఆడుకొన్నాడు. (22-25)
ద్వాభ్యాం భుజాభ్యాం బలవాన్ గృహీత్వా శంఖముత్తమమ్ ।
ప్రాధ్మాపయత భూతానాం త్రాసనం బలినామపి ॥ 26
రెండుచేతులతో ఆయన ఉత్తమశంఖాన్ని పట్టుకొని బలిష్ఠమైన ప్రాణులకు కూడా భయంకలిగిస్తూ ఊదాడు. (26)
ద్వాభ్యాం భుజాభ్యామాకాశం బహుశో నిజఘాన హ ।
క్రీడన్ భాతి మహాసేనః త్రీన్ లోకాన్ వదనైః పిబన్ ॥ 27
ఆ మహాసేనుడు మూడులోకాలను మ్రింగుతున్నట్లు రెండుచేతులతో ఆకాశాన్ని కొడుతున్నాడు. ఇలా ఆయన ఆడుకొంటున్నాడు. (27)
పర్వతాగ్రేఽప్రమేయాత్మా రశ్మిమానుదయే యథా ।
స తస్య పర్వతస్యాగ్రే నిషణ్ణోఽద్భుతవిక్రమః ॥ 28
వ్యలోకయదమేయాత్మా ముఖైర్నానావిధైర్దిశః ।
స పశ్యన్ వివిధాన్ భావాన్ చకార నినదం పునః ॥ 29
తస్య తం నినదం శ్రుత్వా న్యపతన్ బహుధా జనాః ।
భీతాశ్చోద్విగ్నమనసః తమేవ శరణం యయుః ॥ 30
అపరిమిత ఆత్మబలమూ, అద్భుతపరాక్రమమూ గల స్కందుడు ఉదయపర్వత శిఖరం మీద కిరణమాలికలతో కూడిన సూర్యభగవానుని వలె విరాజిల్లుతున్నాడు.
అనేక ముఖాలతో సంపూర్ణ విశాలప్రపంచాన్ని చూస్తున్నాడు. నానావిధాలయిన వస్తువులను చూచి మహాత్ముడైన స్కందుడు మళ్ళీ కేకలు పెడుతున్నాడు.
తీవ్రమయిన ఆ గర్జనను విని అనేకప్రాణులు నేలమీద పడ్డాయి. భయంతో వణికిపోయే మనస్సుతో అన్నీ ఆయనను శరణు పొందాయి. (28-30)
యే తు తం సంశ్రితా దేవం నానావర్ణాస్తదా జనాః ।
తానప్యాహుః పారిషదాన్ బ్రాహ్మణాః సుమహాబలాన్ ॥ 31
ఆ సమయంలో నానావర్ణాల జీవులు ఆ స్వామిని శరణుకోరారు. వారందరినీ బాహుబలసంపన్నులైన వారి పారిషదులు అని బ్రాహ్మణులు చెప్పారు. (31)
స తూత్థాయ మహాబాహుః ఉపసాంత్వ్య చ తాన్ జనాన్ ।
ధనుర్వికృష్య వ్యసృజద్ బాణాన్ శ్వేతే మహాగిరౌ ॥ 32
మహాబాహువైన స్కందస్వామి లేచి ఆ ప్రాణులన్నిటికీ ఊరట కలిగించాడు. తరువాత శ్వేతపర్వతం మీద నిలచి అల్లె త్రాటిని లాగి బాణాలను వర్షించాడు. (32)
బిభేద స శరైః శైలం క్రౌంచం హిమవతః సుతమ్ ।
తేన హంసాశ్చ గృధ్రాశ్చ మేరుం గచ్ఛంతి పర్వతమ్ ॥ 33
ఆ బాణాలతో ఆయన హిమవంతుని పుత్రుడైన క్రౌంచమనే పర్వతాన్ని చీల్చివేశాడు. ఆ రంధ్రం నుంచి హంసలు, గ్రద్దలు మేరుపర్వతానికి వెళ్ళుతున్నాయి. (33)
స విశీర్ణోఽపతచ్ఛైలః భృశమార్తస్వరాన్ రువన్ ।
తస్మిన్ నిపతితే త్వన్యే నేదుః శైలా భృశం తదా ॥ 34
స్కందుని బాణాల వల్ల ఛిన్నాభిన్నం అయిన క్రౌంచపర్వతం పెద్దగా ఆర్తనాదం చేస్తూ నేలగూలింది. అది పడటంతోనే ఇతరపర్వతాలు కూడా తీవ్రంగా ఆర్తనాదం చేశాయి. (34)
స తం నాదం భృశార్తానాం శ్రుత్వాపి బలినాం వరః ।
న ప్రాచ్యవదమేయాత్మా శక్తిముద్యమ్య చానదత్ ॥ 35
అమితమైన ఆత్మబలం గల కుమారస్వామి వాటి నాదం విని కూడా తొణకలేదు. అంతేకాక చేతిలోకి శక్త్యాయుధాన్ని తీసికొని సింహనాదం చేశాడు. (35)
సా తదా విమలా శక్తిః క్షిప్తా తేన మహాత్మనా ।
బిభేద శిఖరం ఘోరం శ్వేతస్య తరసా గిరేః ॥ 36
అప్పుడు ఆయన విమలమైన శక్త్యాయుధాన్ని ప్రయోగించి శ్వేతపర్వతశిఖరాన్ని చాలావేగంగా ముక్కలు చేశాడు. (36)
స తేనాభిహతో దీర్ణః గిరిః శ్వేతోఽచలైః సహ ।
ఉత్పపాత మహీం త్యక్త్వా భీతస్తస్మాన్మహాత్మనః ॥ 37
కార్తికేయుని శక్త్యాయుధం దెబ్బకు చీలిపోయిన శ్వేతపర్వతం ఆ మహాత్ముని భయంతో వణికిపోయింది. ఇతరపర్వతాలతో పాటు భూమిని వదలి ఆకాశంలోకి ఎగిరిపోయింది. (37)
తతః ప్రవ్యథితా భూమిః వ్యశీర్యత సమంతతః ।
ఆర్తా స్కందం సమాసాద్య పునర్బలవతీ బభౌ ॥ 38
తరువాత భూమి అన్నిపైపులా పగిలిపోయి, ఆర్తురాలై కుమారస్వామిని శరణంది, మళ్ళీ బలంగలిగి శోభించినది. (38)
పర్వతాశ్చ నమస్కృత్య తమేవ పృథివీం గతాః ।
అథైనమభజల్లోకః స్కందం శుక్లస్య పంచమీమ్ ॥ 39
తరువాత పర్వతాలు కూడా ఆయనకు నమస్కరించి, మళ్ళీ భూమి పైకి వచ్చాయి. అప్పటి నుంచి జనులు అందరూ ప్రతిమాసంలో శుక్లపక్ష పంచమి నాడు కుమారస్వామిని పూజింపసాగారు. (39)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి మార్కండేయసమాస్యాపర్వణి ఆంగిరసే కుమారోత్పత్తౌ పంచవింశత్యధికద్విశతతమోఽధ్యాయః ॥ 225 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున మార్కండేయ సమాస్యాపర్వమను ఉపపర్వమున
ఆంగిరసోపాఖ్యానమున కుమారస్వామి జననాదిక మను రెండు వందల ఇరువది అయిదవ అధ్యాయము. (225)
(దాక్షిణాత్య అధికపాఠము 1/2 శ్లోకంతో కలిపి మొత్తం 39 1/2 శ్లోకాలు).