213. రెండువందల పదమూడవ అధ్యాయము
ప్రాణవాయుస్థితి - పరమాత్మ సాక్షాత్కారము.
బ్రాహ్మణ ఉవాచ
పార్థివం ధాతుమాసాద్య శారీరోఽగ్నిః కథం భవేత్ ।
అవకాశవిశేషేణ కథం వర్తయతేఽనిలః ॥ 1
బ్రాహ్మణుడు అడిగాడు - శరీరంలో ఉండే అగ్ని స్వరూపమైన ప్రాణం పార్థివమైన ధాతువును ఆధారం చేసుకుని ఎలా ఉంటుంది? ప్రాణవాయువు నాడీమార్గం ద్వారా రక్తాదులను ఎలా కదిలించగలుగుతుంది? (1)
మార్కండేయ ఉవాచ
ప్రశ్నమేతం సముద్దిష్టం బ్రాహ్మణేన యుధిష్ఠిర ।
వ్యాధస్తు కథయామాస బ్రాహ్మణాయ మహాత్మనే ॥ 2
మార్కండేయుడు చెపుతున్నాడు - ధర్మజా! బ్రాహ్మణుడు వేసిన ఈ ప్రశ్నను విని ధర్మవ్యాధుడు ఆ మహాత్మునకు ఇలా చెప్పాడు. (2)
వ్యాధ ఉవాచ
మూర్ధానమాశ్రితో వహ్నిః శరీరం పరిపాలయన్ ।
ప్రాణో మూర్ధని చాగ్నౌ చ వర్తమానో విచేష్టతే ॥ 3
బ్రాహ్మణా! ప్రాణి శరీరాన్ని సురక్షితంగా ఉంచే అగ్ని స్వరూపమైన ఉదానవాయువు శిరస్సును ఆశ్రయిమ్చి శరీరంలో ఉంటుంది. ముఖ్యప్రాణం శిరస్సు, ఉదానవాయువు - రెండింటిలో ఉండి సంచరిస్తుంటుంది. (3)
భూతం భవ్యం భవిష్యం చ సర్వం ప్రాణే ప్రతిష్ఠితమ్ ।
శ్రేష్ఠం తదేవ భూతానాం బ్రహ్మయోనిముపాస్మహే ॥ 4
భూత భవిష్యత్ వర్తమానాలు మూడూ ప్రాణాన్ని ఆశ్రయించి ఉంటాయి. ఆ ప్రాణం సమస్తభూతాల్లో శ్రేష్ఠం, పరబ్రహ్మనుంచి ఏర్పడే ఆ ప్రాణాన్ని మనమంతా ఉపాసిస్తాము. (4)
స జంతుః సర్వభూతాత్మా పురుషః స సనాతనః ।
మహాన్ బుద్ధిరహంకారః భూతానాం విషయశ్చ సః ॥ 5
ఆ ప్రాణమే జీవుడు. సమస్తజీవులకు అదే ఆత్మ, అదే సనాతనం. మహత్తు, బుద్ధి, అహంకారం, పంచభూతాల కార్యరూపాలయిన ఇంద్రియాలు, వాటి విషయాలు అదే. (5)
(అవ్యక్తం సత్త్వసంజ్ఞం చ జీవః కాలః స చైవ హి ।
ప్రకృతిః పురుషశ్చైవ ప్రాణ ఏవ ద్విజోత్తమ ॥
జాగర్తి స్వప్నకాలే చ స్వప్నే స్వప్నాయతే చ సః ।
(బ్రాహ్మణశ్రేష్ఠా! ఆ ప్రాణమే అవ్యక్తం, సత్త్వం, జీవం, కాలం, ప్రకృతి, పురుషుడు అయి ఉన్నది. అదే జాగ్రదవస్థలో మేలుకొని ఉంటుంది. స్వప్నావస్థలో కలలు కంటుంది.
జాగ్రత్సు బలమాధత్తే చేష్టత్సు చేష్టయత్యపి ॥
తస్మిన్ నిరుద్ధే విప్రేంద్ర మృత ఇత్యభిధీయతే ।
త్యక్త్వా శరీరం భూతాత్మా పునరన్యత్ ప్రపద్యతే ॥)
అదే మేలుకొన్నప్పుడు బలాన్ని చేకూరుస్తుంది. కాళ్ళు, చేతులు కదిలించే ప్రాణులలో కదలికలను కలిగిస్తుంది. ఆ ప్రాణసంచారం ఆగిపోతే ప్రాణి మరణించింది అని అంటారు. భూతాత్మకమైన ప్రాణమే ఒక శరీరాన్ని వదలి ఇంకొక శరీరాన్ని ప్రవేశిస్తుంది.
ఏవం త్విహ స సర్వత్ర ప్రాణేన పరిపాల్యతే ।
పృష్ఠతస్తు సమానేన స్వాం స్వాం గతిముపాశ్రితః ॥ 6
ఈ రీతిగా లోకం అంతటిని ప్రాణమే పరిపాలిస్తుంది. తరువాత ఆ ప్రాణమే శరీరంలో ప్రవేశించి సమాన వాయువు అయినప్పుడు తన తన గమనాన్ని ఆశ్రయిస్తుంది. (6)
బస్తిమూలం గుదం చైవ పావకం సముపాశ్రితః ।
వహన్ మూత్రం పురీషం వాప్యపానః పరివర్తతే ॥ 7
సమానవాయురూపంగా జఠరాగ్నిని ఆశ్రయించి ఆ ప్రాణం మూత్రవిసర్జనేంద్రియాన్ని, మల విసర్జనేంద్రియాన్ని చేరినప్పుడు మలమూత్రాలను వహిస్తుంది. కాబట్టి అది అపాన వాయువుగా మారుతుంది. (7)
ప్రయత్నే కర్మణి బలే స ఏష త్రిషు వర్తతే ।
ఉదానమితి తం ప్రాహుః అధ్యాత్మవిదుషో జనాః ॥ 8
అదే ప్రాణం పనిచేసే ప్రయత్నంలో, పైకి ఎత్తటం వెళ్లటం, బరువు నెత్తటం అనేదాంట్లో ప్రవర్తించినప్పుడు అధ్యాత్మవేత్తలు దాన్ని ఉదానం అంటారు. (8)
సంధౌ సంధౌ సంనివిష్టః సర్వేష్వపి తథానిలః ।
శరీరేషు మనుష్యాణాం వ్యాన ఇత్యుపదిశ్యతే ॥ 9
మానవశరీరంలోని అన్ని కీళ్ళలో వ్యాపించినపుడు ఆ వాయువును వ్యానం అంటారు. (9)
ధాతుష్వగ్నిస్తు వితతః స తు వాయుసమీరితః ।
రసాన్ ధాతూంశ్చ దోషాంశ్చ వర్తయన్ పరిధావతి ॥ 10
చర్మం మొదలైన ధాతువులలో జఠరాగ్ని వ్యాపించి ఉంటుంది. ప్రాణాదివాయుప్రేరితమై అది అన్నాది రసాలలో, చర్మాది ధాతువులలో పిత్తాది దోషాలను పరిపక్వం చేస్తూ శరీరం అంతటా పరుగెత్తుతూ ఉంటుంది. (10)
ప్రాణానాం సంనిపాతాత్ తు సంనిపాతః ప్రజాయతే ।
ఊష్మా చాగ్నిరితి జ్ఞేయః యోఽన్నం పచతి దేహినామ్ ॥ 11
ప్రాణాది వాయువులు పరస్పరం కలియటం వల్ల సంఘర్షణ కలుగుతుంది. దానివల్ల వ్యక్తం అయ్యే వేడిమినే జఠరాగ్ని అని తెలుసుకోవాలి. అదే ప్రాణులు తిన్న ఆహారాన్ని అరిగిస్తుంది. (11)
సమానోదానయోర్మధ్యే ప్రాణాపానౌ సమాహితౌ ।
సమర్థితస్త్వధిష్ఠానం సమ్యక్ పచతి పావకః ॥ 12
సమానం, ఉదానం అనే వాయువుల మధ్యలో ప్రాణాపాన వాయువులు ఉంటాయి. వాటి ఒరిపిడివలన కలిగే జఠరాగ్ని ఆహారాన్ని అరిగిస్తుంది. దాని రసం వల్ల ఈ శరీరం బాగా పుష్టిని పొందుతుంది. (12)
అస్యాపి పాయుపర్యంతః తథా స్యాద్ గుదసంజ్ఞితః ।
స్రోతాంసి తస్మాజ్జాయంతే సర్వప్రాణేషు దేహినామ్ ॥ 13
ఈ జఠరాగ్ని స్థానం బొడ్డు దగ్గర నుంచి పాయువు దాకా ఉంటుంది. దీన్నే గుదం అంటారు. దానినుంచే దేహధారుల నాడీమార్గం ఏర్పడుతుంది. (13)
అగ్నివేగవహః ప్రాణః గుదాంతే ప్రతిహన్యతే ।
స ఊర్ధ్వమాగమ్య పునః సముత్ క్షిపతి పావకమ్ ॥ 14
గుదం నుంచి ప్రాణం అగ్నివేగాన్ని వహించి గుదంచివరను తాకుతుంది. అక్కడి నుంచి పైకి లేచి అది జఠరాగ్నిని కూడా పైకి లేపుతుంది. (14)
పక్వాశయస్త్వధో నాభ్యామ్ ఊర్ధ్వమామాశయః స్థితః ।
నాభిమధ్యే శరీరస్య ప్రాణాః సర్వే ప్రతిష్ఠితాః ॥ 15
నాభి కింది భాగంలో పక్వాశయం (పక్వమైన ఆహారం ఉండే చోటు) ఉంటుంది. దానిపైన ఆమాశయం (అపక్వాహారం) ఉంటుంది. శరీరంలో ఉండే సమస్తప్రాణాలు నాభిమధ్యలో నిలిచి ఉంటాయి. అదే వాటికి కేంద్రస్థానం. (15)
ప్రవృత్తా హృదయాత్ సర్వే తిర్యగూర్ధ్వమధస్తథా ।
వహంత్యన్నరసాన్ నాడ్యః దశప్రాణప్రచోదితాః ॥ 16
హృదయాన్నుంచి కిందికి, పైకి నిలువుగా, అడ్డంగా, వ్యాపించి ఉన్ననాడులు పదివాయువులచే ప్రేరితాలై శరీరంలోని అన్నిభాగాల్లోకి అన్న రసాన్ని పంపుతాయి. (16)
యోగినామేష మార్గస్తు యేన గచ్ఛంతి తత్ పరమ్ ।
జితక్లమాః సమా ధీరాః మూర్ధన్యాత్మానమాదధుః ।
ఏవం సర్వేషు వితతౌ ప్రాణాపానౌ హి దేహిషు ॥ 17
సమస్తక్లేశాలను జయించినవారు, సమదర్శనులు, ధీరులు, (సుషుమ్నా నాడి ద్వారా) తమ ప్రాణమయమయిన ఆత్మను శిరస్సు (లో ఉండే సహస్రారచక్రం) లోకి తీసికొనిపోయిన యోగులు శిరస్సు నుంచి గుదం దాకా సుషుమ్నామయమార్గం ద్వారా పరమాత్మను పొందుతారు. ఈ విధంగా సమస్త జీవాత్మల శరీరాల్లో ప్రాణాపానవాయువులు వ్యాపించి ఉన్నాయి. (17)
(తావగ్నిసహితౌ బ్రహ్మన్ విద్ధి వై ప్రాణమాత్మని ।)
ఏకాదశవికారాత్మా కలాసంభారసంభృతః ।
మూర్తిమంతం హి తం విద్ధి నిత్యం యోగజితాత్మకమ్ ॥ 18
ప్రాణాపాన వాయువులు జఠరాగ్నితో కూడి ఉంటాయి. ప్రాణం అపానంలో ఉంటుంది అని తెలుసుకో. ఆత్మ పదకొండు ఇంద్రియాలు అనే వికారాలు కలది. పదహారు కళలు కలది, శరీరాన్ని ధరించేది, నిత్యమైనది. అది యోగబలంతో మనోబుద్ధులను స్వాధీనం చేసుకుంటుంది అని తెలుసుకో. (18)
తస్మిన్ యః సంస్థితో హ్యగ్నిః నిత్యం స్థాల్యామివాహితః ।
ఆత్మానం తం విజానీహి నిత్యం యోగజితాత్మకమ్ ॥ 19
పాత్రలో ఉంచిన అగ్నివలె వెనకచెప్పిన కళాస్వరూపమైన శరీరంలో ప్రకాశస్వరూపమైన ఆత్మ ఎప్పుడూ ఉంటుంది. దానిని ఆత్మగా తెలుసుకో. అది నిత్యమూ, యోగ శక్తితో మనోబుద్ధులను స్వాధీనం చేసుకొంటుంది. (19)
దేవో యః సంస్థితస్తస్మిన్ అబ్బిందురివ పుష్కరే ।
క్షేత్రజ్ఞం తం విజానీహి నిత్యం యోగజితాత్మకమ్ ॥ 20
పద్మపత్రం మీద నీటి బిందువు నిర్లిప్తంగా ఉన్నట్లు ఆత్మదైవం కళాత్మకశరీరంలో అసంగమై ఉంటుంది. దానిని క్షేత్రజ్ఞునిగా తెలుసుకో. అది యోగశక్తితో తన మనోబుద్ధులపై అధికారం కలది, నిత్యమైనది. (20)
జీవాత్మకాని జానీహి రజః సత్త్వం తమస్తథా ।
జీవమాత్మగుణం విద్ధి తథాఽఽత్మానం పరాత్మకమ్ ॥ 21
సత్త్వం, రజస్సు, తమస్సు అనే మూడు గుణాలు జీవాత్మకాలని తెలుసుకో. అంటే జీవాత్మ అంతఃకరణ వికారాలు, జీవుడు ఆత్మగుణం. ఆత్మయే పరమాత్మ. (21)
అచేతనం జీవగుణం వదంతి
స చేష్టతే చేష్టయతే చ సర్వమ్ ।
తతః పరం క్షేత్రవిదో వదంతి
ప్రకల్పయద్ యో భువనాని సప్త ॥ 22
మహాత్ములు జడమైన శరీరాదులను జీవునికి భోగ్యమైనవానినిగా చెపుతారు. ఆ జీవుడు శరీరంలో ఉండి, తాను చేష్టాశీలుడై, శరీరేంద్రియాదులను అన్నింటిని ఆయా క్రియలలో కర్తవ్మోన్ముఖాలను చేస్తాడు. సప్తభువనాలను నిర్మించిన పరమాత్మను తెలుసుకొన్నవారు జీవునికంటె ఆయన ఉత్కృష్టుడని చెపుతారు. (22)
ఏవం సర్వేషు భూతేషు భూతాత్మా సంప్రకాశతే ।
దృశ్యతే త్వగ్ర్యయా బుద్ధ్యా సూక్ష్మయా జ్ఞానవేదిభిః ॥ 23
సర్వభూతాత్మకుడైన పరమేశ్వరుడు అన్ని ప్రాణులలో వెలుగొందుతున్నాడు. జ్ఞానులు శ్రేష్ఠమైన సూక్ష్మబుద్ధితో ఆయనను దర్శిస్తారు. (23)
చిత్తస్య హి ప్రసాదేన హంతి కర్మ శుభాశుభమ్ ।
ప్రసన్నాత్మాఽఽత్మని స్థిత్వా సుఖమానంత్యమశ్నుతే ॥ 24
మానవుడు నిర్మలచిత్తంతో సత్కర్మలను, అసత్కర్మలను ఫలాన్ని ఇవ్వలేని వానినిగా చేస్తాడు. నిర్మలమైన అంతఃకరణం గలవాడు తనలో తాను ఉండి అక్షయసుఖాన్ని (మోక్షాన్ని) పొందుతాడు. (24)
లక్షణం తు ప్రసాదస్య యథా తృప్తః సుఖం స్వపేత్ ।
నివాతే వా యథా దీపో దీప్యేత్ కుశలదీపితః ॥ 25
ఆహారాదులతో తృప్తినందినవాడు సుఖంగా నిద్రించినట్లు, గాలి లేనిచో నిపుణుడు వెలిగించిన దీపం నిశ్చలంగా ప్రకాశించినట్లుగానే మనస్సు ప్రసన్నంగా ఉంటుంది. (25)
పూర్వరాత్రే పరే చైవ యుంజానః సతతం మనః ।
లఘ్వాహారో విశుద్ధాత్మ పశ్యన్నాత్మానమాత్మని ॥ 26
ప్రదీప్తేనేవ దీపేన మనోదీపేన పశ్యతి ।
దృష్ట్వాఽఽత్మానం నిరాత్మానం స తదా విప్ర ముచ్యతే ॥ 27
సాధకుడు నిత్యమూ తేలికైన ఆహారం తింటూ అంతః కరణాన్ని నిర్మలం చేసుకొంటూ రాత్రి మొదటి జాములో, చివరి జాములో పరమాత్మ ధ్యానంలో ఉండాలి. ఇలా నిరంతరం తన హృదయంలో పరమేశ్వర సాక్షాత్కారానికి అభ్యాసం చేసేవాడు వెలుగులు వెదజల్లే దీపంలాగా ప్రకాశించే తన ప్రకాశవంతమైన మనోమయ దీపంతో నిరాకార పరమాత్మను సాక్షాత్కరింపజేసుకొని ముక్తుడు అవుతాడు. (26,27)
సర్వోపాయైస్తు లోభస్య క్రోధస్య చ వినిగ్రహః ।
ఏతత్ పవిత్రం లోకానాం తపో వై సంక్రమో మతః ॥ 28
అన్ని ఉపాయాలతో లోభక్రోధాలను అణచివేయటమే లోకంలో పవిత్రమైన తపస్సు. ఇదే సంసార సముద్రాన్ని దాటించే వంతెన అని చెపుతారు. (28)
నిత్యం క్రోధాత్ తపో రక్షేద్ ధర్మం రక్షేచ్చ మత్సరాత్ ।
విద్యాం మానాపమానాభ్యామ్ ఆత్మానం తు ప్రమాదతః ॥ 29
తపస్సును క్రోధాన్నుంచి, ధర్మాన్ని ద్వేషాన్నుంచి, విద్యను మానావమానాల నుంచి, తనను ప్రమాదం నుంచి ఎల్లప్పుడూ రక్షించుకోవాలి. (29)
ఆనృశంస్యం పరో ధర్మః క్షమా చ పరమం బలమ్ ।
ఆత్మజ్ఞానం పరం జ్ఞానం సత్యం వ్రతపరం వ్రతమ్ ॥ 30
దయ అన్నిటినీ మించిన ధర్మం. ఓర్పే గొప్ప బలం. సత్యం చెప్పటమే ఉత్తమవ్రతం. తత్త్వజ్ఞానమే అన్ని జ్ఞానాలను మించిన జ్ఞానం. (30)
సత్యస్య వచనం శ్రేయః సత్యం జ్ఞానం హితం భవేత్ ।
యద్ భూతహితమత్యంతం తద్ వై సత్యం పరం మతమ్ ॥ 31
సత్యాన్ని చెప్పటం శ్రేయస్కరం. యథర్థజ్ఞానమే మేలు కలిగిస్తుంది. ప్రాణులకు చాలా హితమైనదే ఉత్తమ సత్యం. (31)
యస్య సర్వే సమారంభాః నిరాశీర్బంధనాః సదా ।
త్యాగే యస్య హుతం సర్వం స త్యాగీ స చ బుద్ధిమాన్ ॥ 32
ప్రయత్నాలు అన్నీ కోరికలకు ఎప్పుడూ కట్టుబడకుండా చేసుకొని, త్యాగమనే అగ్నిలో తన సర్వస్వాన్ని హోమంచేసిన వాడే త్యాగవంతుడు, వివేకవంతుడు అవుతాడు. (32)
యతో న గురురప్యేనం శ్రావయేదుపపాదయేత్ ।
తం విద్యాద్ బ్రహ్మణో యోగం వియోగం యోగసంజ్ఞితమ్ ॥ 33
కాబట్టి కనబడే ప్రపంచం దూరం చేసేది, యోగం అనే పేరుగలది అయిన ఈ బ్రహ్మయోగాన్ని తానే తెలుసుకోవాలి, సంపాదించుకోవాలి. గురువు కూడా అపాత్రుడైన శిష్యుడికి వినిపించగూడదు కాని యుక్తిపూర్వకంగా తెలియచెప్పాలి. (33)
న హింస్యాత్ సర్వభూతాని మైత్రాయణగతశ్చరేత్ ।
నేదం జీవితమాసాద్య వైరం కుర్వీత కేనచిత్ ॥ 34
ఏ ప్రాణినీ హింసించగూడదు. అన్నిటియందు స్నేహంతో ప్రవర్తించాలి. దుర్లభమైన ఈ మానవజీవితాన్ని పొంది ఎవరితోనూ వైరం పెట్టుకోకూడదు. (34)
ఆకించన్యం సుసంతోషః నిరాశిత్వమచాపలమ్ ।
ఏతదేవ పరం జ్ఞానం సదాత్మజ్ఞానముత్తమమ్ ॥ 35
ఏమీ కూడబెట్టుకోకపోవటం, అన్ని పరిస్థితుల్లోను సంతోషంగా ఉండటం, కోరికలను ఆసక్తిని వదలటం - అనేవే పరమజ్ఞానం. ఇదే సత్యస్వరూపమైనది. ఉత్తమమైన ఆత్మజ్ఞానం. (35)
పరిగ్రహం పరిత్యజ్య భవేద్ బుద్ధ్యా యతవ్రతః ।
అశోకం స్థానమాశ్రిత్య నిశ్చలం ప్రేత్య చేహ చ ॥ 36
ఇహలోక పరలోకాలకు సంబంధించిన భోగాలను, అన్ని రకాల సంపాదనలను వదలి, అచంచలమైన స్థానాన్ని లక్ష్యంగా చేసుకొని, బుద్ధితో మనస్సును, ఇంద్రియాలను వశం చేసుకోవాలి. (36)
తపోనిత్యేన దాంతేన మునినా సంయతాత్మనా ।
అజితం జేతుకామేన భావ్యం సంగిష్వసంగినా ॥ 37
ఇంద్రియాలను జయించినవాడు, మనస్సును లొంగదీసుకొన్నవాడు, జయించని వాటిని జయించే కోరికకలవాడు, ఎల్లప్పుడు తపస్సులో మునిగినవాడు అయిన ముని ఆసక్తి కలిగించే భోగాలకు దూరంగా ఉండాలి. (37)
గుణాగునమనాసంగమ్ ఏకకార్యమనంతరమ్ ।
ఏతత్ తద్ బ్రహ్మణే వృత్తమ్ ఆహురేకపదం సుఖమ్ ॥ 38
గుణాలను అగుణములుగా చేసుకోన్నది. నిస్సంగమైనది. అంతరాత్మతో మాత్రమే సాధించదగినది, అజ్ఞానం తప్ప ఇంకేమీ ఆటంకం లేనిది, ఒకటిగా తెలియబడేది. అదే నిరతిశయసుఖం. (38)
పరిత్యజతి యో దుఃఖం సుఖం చాప్యుభయం నరః ।
బ్రహ్మ ప్రాప్నోతి సోఽత్యంతమ్ అసంగేన చ గచ్ఛతి ॥ 39
సుఖదుఃఖాలను రెండింటిని వదలినవాడే అనంతమైన బ్రహ్మపదాన్ని పొందుతాడు. నిస్సంగంతో గూడా దాన్ని పొందవచ్చు. (39)
యథాశ్రుతమిదం సర్వం సమాసేన ద్విజోత్తమ ।
ఏతత్ తే సర్వమాఖ్యాతం కిం భూయః శ్రోతుమిచ్ఛసి ॥ 40
ద్విజశ్రేష్ఠా! నేను విన్నది అంతా ఉన్నది ఉన్నట్టుగా సంగ్రహంగా నీకు చెప్పాను. ఇంక మళ్ళీ నీవు ఏమి వినాలి అని అనుకొంటున్నావు? (40)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి మార్కండేయ సమాస్యాపర్వణి బ్రాహ్మణవ్యాధసంవాదే త్రయోదశాధికశతతమోఽధ్యాయః ॥ 213 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున మార్కండేయసమాస్యాపర్వమను ఉపపర్వమున బ్రాహ్మణవ్యాధసంవాదమను రెండువందల పదమూడవ అధ్యాయము. (213)
(దాక్షిణాత్య అధికపాఠం 3 1/2 శ్లోకాలు కలిసి 43 1/2 శ్లోకాలు)