214. రెండువందల పదునాల్గవ అధ్యాయము.

మాతాపితరులసేవ - ఫలితము.

మార్కండేయ ఉవాచ
ఏవం సంకథితే కృత్స్నే మోక్షధర్మే యుధిష్ఠిర ।
దృఢప్రీతమనా విప్రః ధర్మవ్యాధమువాచ హ ॥ 1
మార్కండేయుడు చెపుతున్నాడు - యుధిష్ఠిరా! ధర్మవ్యాధుడు ఈ ప్రకారం పూర్తిగా మోక్షధర్మాన్ని వివరించగా కౌశికుడు బాగా ప్రసన్నమనస్కుడై అతనితో ఇలా అన్నాడు. (1)
న్యాయయుక్తమిదం సర్వం భవతా పరికీర్తితమ్ ।
న తేఽస్త్యవిదితం కించిద్ ధర్మేష్విహ హి దృశ్యతే ॥ 2
నీవు నాకు చెప్పింది అంతా న్యాయయుక్తంగా, ఉచితంగా ఉన్నది. ధర్మవిషయంలో నీకు తెలియనిది ఏదీ లేదని నాకు అనిపిస్తున్నది. (2)
వ్యాధ ఉవాచ
ప్రత్యక్షం మమ యో ధర్మః తం చ పశ్య ద్విజోత్తమ ।
యేన సిద్ధిరియం ప్రాప్తా మయా బ్రాహ్మణపుంగవ ॥ 3
ధర్మవ్యాధుడు చెప్పాడు. బ్రాహ్మణశ్రేష్ఠా! నాకు ఈ సిద్ధి కలగటానికి కారణమైన ప్రత్యక్షధర్మాన్ని కూడా నీవు చూడు. (3)
ఉత్తిష్ఠ భగవన్ క్షిప్రం ప్రవిశ్యాభ్యంతరం గృహమ్ ।
ద్రష్టుమర్హసి ధర్మజ్ఞ మాతరం పితరం చ మే ॥ 4
ధర్మం తెలిసిన మహాత్మా! లేచి మా లోపలి ఇంట్లోకి రా. నా తల్లిదండ్రులను చూడు. (4)
మార్కండేయ ఉవాచ
ఇత్యుక్తః స ప్రవిశ్యాథ దదర్శ పరమార్చితమ్ ।
సౌధం హృద్యం చతుఃశాలమ్ అతీవ చ మనోరమమ్ ॥ 5
దేవతాగృహసంకాశం దైవతైశ్చ సుపూజితమ్ ।
శయనాసనసంబాధం గంధైశ్చ పరమైర్యుతమ్ ॥ 6
మార్కండేయుడు అన్నాడు - వ్యాధుడు ఇలా చెప్పిన తరువాత కౌశికుడు అతనితో పాటు లోపలికి వెళ్ళాడు. అది ఒక అందమైన నాలుగిండ్ల భవంతి. చాలా శుభ్రంగా ఉన్నది. సున్నం వేయటం వల్ల తెల్లగా ఉన్నది. మనోహరంగా ఉంది. దేవాలయంలాగా ఉన్నది. దేవతలు గూడా ఆదరించే విధంగా ఉన్నది. ఒకవైపు పడుకోవటానికి మంచాలు వేసి ఉన్నవి. ఇంకొక వైపు కూర్చోటానికి ఆసనాలు ఉన్నాయి. ఆ ఇల్లు అంతా సువాసనలతో నిండి ఉంది. (5,6)
తత్ర శుక్లాంబరధరౌ పితరావస్య పూజితౌ ।
కృతాహారౌ తు సంతుష్టౌ ఉపావిష్టౌ వరాసనే ।
ధర్మవ్యాధస్తు తౌ దృష్ట్వా పాదేషు శిరసాపతత్ ॥ 7
ధర్మవ్యాధుని తల్లిదండ్రులు శుభ్రమైన తెల్లని వస్త్రాలు ధరించి, భోజనం చేసి, ఒక అరుగుమీద కూర్చుని ఉన్నారు. వారు పుష్పాదులతో పూజితమై ఉన్నారు. ధర్మవ్యాధుడు వారిని చూచిన వెంటనే వారి పాదాలు పట్టుకొని నమస్కారం చేశాడు. (7)
వృద్ధావూచతుః
ఉత్తిష్ఠోత్తిష్ఠ ధర్మజ్ఞ ధర్మస్త్వామభిరక్షతు ।
ప్రీతౌ స్వస్తవ శౌచేన దీర్ఘమాయురవాప్నుహి ॥ 8
తల్లిదండ్రులు ఆదరంతో ఇలా అన్నారు - ధర్మం తెలిసిన కుమారా! లే. లే. ధర్మం నిన్ను అన్ని విధాలా రక్షించుగాక. మేము నీ ఆచార వ్యవహారాలు చూచి సేవను పొందుతూ చాలా సంతోషిస్తున్నాము. చిరంజీవిని కమ్ము. (8)
గతిమిష్టాం తపో జ్ఞానం మేధాం చ పరమాం గతః ।
సత్పుత్రేణ త్వయా పుత్ర నిత్యం కాలే సుపూజితౌ ॥ 9
పూజ్యమైన ఉత్తమస్థితిని, తపస్సును, జ్ఞానాన్ని, వివేకాన్ని సంపాదించావు. ఉత్తమపుత్రుడవైన నీవు నిత్యమూ సముచితసమయంలో నియమపూర్వకంగా మమ్ములను ఆదరిస్తున్నావు. (9)
(సుఖమావాం వసావోఽత్ర దేవలోకగతావివ)
న తేఽన్యద్ దైవతం కించిద్ దైవతేష్వపి వర్తతే ।
ప్రయతత్వాద్ ద్విజాతీనాం దమేనాసి సమన్వితః ॥ 10
మేము దేవలోకంలో ఉన్నంత ఆనందంగా, సుఖంగా ఈ ఇంట్లో ఉన్నాము. నీకు మాకంటే ఇతరమైన దైవం దేవతల్లో కూడా లేదు. మనస్సును పవిత్రమూ, స్వాధీనమూ చేసుకోవటం వల్ల బ్రాహ్మణోచితమైన శమదమాదులు కలిగిఉన్నావు. (10)
పితుః పితామహా యే చ తథైవ ప్రపితామహాః ।
ప్రీతాస్తే సతతం పుత్ర దమేనావాం చ పూజయా ॥ 11
కుమారా! నా తండ్రి తాతముత్తాతలు అందరూ ఎల్లప్పుడూ నీ ఇంద్రియనిగ్రహం చూసి సంతోషిస్తుంటారు. నీవు చూపించే గౌరవాదుల వల్ల మేము గూడ ఆనందపడుతుంటాము. (11)
మనసా కర్మణా వాచా శూశ్రూషా నైవ హీయతే ।
న చాన్యా హి తథా బుద్ధిః దృశ్యతే సాంప్రతం తవ ॥ 12
నీవు మనస్సుతో, మాటలతో, పనులతో ఎప్పుడూ మాసేవ వదలకుండా చేస్తుంటావు. ఇప్పుడు గూడా నీ ఆలోచనలు ఇందుకు వ్యతిరేకంగా లేవు. (12)
జామదగ్న్యేన రామేణ యథా వృద్ధౌ సుపూజితౌ ।
తథా త్వయా కృతం సర్వం తద్విశిష్టం చ పుత్రక ॥ 13
పరశురాముడు వృద్ధులైన తల్లిదండ్రులను సేవిమ్చినట్లు, ఇంకా అంతకంటే ఎక్కువగాను మాకు అన్ని సేవలు చేస్తున్నావు. (13)
తతస్తం బ్రాహ్మణం తాభ్యాం ధర్మవ్యాధో న్యవేదయత్ ।
తౌ స్వాగతేన తం విప్రమ్ అర్చయామాసతుస్తదా ॥1 4
తరువాత ధర్మవ్యాధుడు కౌశికుని వారికి పరిచయం చేశాడు. వారు ఆయనకు స్వాగతసత్కారం చేశారు. తగిన రీతిగా గౌరవించారు. (14)
ప్రతిపూజ్య చ తాం పూజాం ద్విజః ప్రపచ్ఛ తావుభౌ ।
సుపుత్రాభ్యాం సభృత్యాభ్యాం కచ్చిద్ వం కుశలం గృహే ॥ 15
అనామయం చ వాం కచ్చిత్ సదైవేహ శరీరయోః ।
కౌశికుడు వారిపూజను స్వీకరించాడు. 'యోగ్యుడైన కుమారుడితో సేవకులతో ఈ ఇంట్లో క్షేమంగా ఉన్నారా? మీ శరీరారోగ్యం ఎప్పుడూ బాగానే ఉంటుందా?' అని అడిగాడు. (15 1/2)
వృద్ధావూచతుః
కుశలం నౌ గృహే విప్ర భృత్యవర్గే చ సర్వశః ।
కచ్చిత్ త్వమప్యవిఘ్నేన సంప్రాప్తో భగవన్నితి ॥ 16
వృద్ధులు ఇలా అన్నారు.
బ్రాహ్మణోత్తమా! ఈ ఇంట్లో మాకు, మాసేవకులకు క్షేమమే. నీవు కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా ఇక్కడికి వచ్చావా? (16)
మార్కండేయ ఉవాచ
బాఢమిత్యేవ తౌ విప్రః ప్రత్యువాచ ముదాన్వితః ।
ధర్మవ్యాధో నిరీక్ష్యాథ తతస్తం వాక్యమబ్రవీత్ ॥ 17
మార్కండేయుడన్నాడు - ఆ బ్రాహ్మణుడు సంతోషంతో 'నాకు ఏ ఇబ్బంది కలగలేదు'. అని వారితో చెప్పాడు. తరువాత ధర్మవ్యాధుడు ఆయనను చూచి తనతల్లిదండ్రులను చూస్తూ కౌశికునితో ఇలా అన్నాడు. (17)
వ్యాధ ఉవాచ
పితా మాతా చ భగవన్ ఏతౌ మద్ధైవతం పరమ్ ।
యద్ దైవతేభ్యః కర్తవ్యం తదేతాభ్యాం కరోమ్యహమ్ ॥ 18
ధర్మవ్యాధుడన్నాడు - మహాత్మా! ఈ తల్లిదండ్రులే నాకు ప్రధానదేవతలు. దేవతలకు చేయవలసిన పూజాదులను నేను వీరికే చేస్తుంటాను. (18)
త్రయస్త్రింశద్ యథా దేవాః సర్వే శక్రపురోగమాః ।
సంపూజ్యాః సర్వలోకస్య తథా వృద్ధావిమౌ మమ ॥ 19
సమస్తలోకానికి ఇంద్రాదులైన ముప్పది ముగ్గురు (33) దేవతలు పూజనీయులైనట్లే ఈ వృద్ధపితరులు నాకు పూజింపదగినవారు. (19)
వి॥సం॥ 8 మంది వసువులు, 11 మంది రుద్రులు, 12 మంది ఆదిత్యులు, ఇంద్రుడు, ప్రజాపతి అనేవారు (33) ముప్పది ముగ్గురు దేవతలు.
ఉపాహారానాహరంతః దేవతానాం యథా ద్విజః ।
కుర్వంతి తద్వదేతాభ్యాం కరోమ్యహమతంద్రితః ॥ 20
ద్విజులు దేవతలకు పూజాద్రవ్యాదులను సమర్పించినట్లు పరాకులేకుండా నేను నా తల్లిదండ్రులకు సేవను చేస్తుంటాను. (20)
ఏతౌ మే పరమం బ్రహ్మన్ పితా మాతా చ దైవతమ్ ।
ఏతౌ పుష్పైః ఫలై రత్నైః తోషయామి సదా ద్విజ ॥ 21
నా తల్లిదండ్రులే నాకు సర్వశ్రేష్ఠులైన దేవతలు. వీరికి పూలను, పండ్లను, రత్నాలను ఇచ్చి ఎల్లప్పుడూ సంతోషపరుస్తుంటాను. (21)
ఏతావేవాగ్నయో మహ్యం యాన్ వదంతి మనీషిణః ।
యజ్ఞా వేదాశ్చ చత్వారః సర్వమేతౌ మమ ద్విజ ॥ 22
విద్వాంసులు చెప్పే అగ్నులు నాకు వీరే. యజ్ఞాలు, నాలుగువేదాలు అన్నీ నాకు వీరే. (22)
ఏతదర్థం మమ ప్రాణాః భార్యా పుత్రః సుహృజ్జనః ।
సపుత్రదారః శ్రుశ్రూషాం నిత్యమేవ కరోమ్యహమ్ ॥ 23
నా ప్రాణాలు, భార్యాపుత్రులు, మిత్రులు అందరినీ వీరిసేవకే సమర్పిస్తాను. నేను నిత్యమూ భార్యాపుత్రులతో వీరినే సేవిస్తుంటాను. (23)
స్వయం చ స్నాపయామ్యేతౌ తథా పాదౌ ప్రధావయే ।
ఆహారం చ ప్రయచ్ఛామి స్వయం చ ద్విజసత్తమ ॥ 24
ద్విజశ్రేష్ఠా! నేను వీరికి స్వయంగానే స్నానం చేయిస్తాను. వీరిపాదాలు కడుగుతాను. స్వయంగానే ఆహారం వడ్డిస్తాను. (24)
అనుకూలం తథా వచ్మి విప్రియం పరివర్జయే ।
అధర్మేణాపి సంయుక్తం ప్రియమాభ్యాం కరోమ్యహమ్ ॥ 25
అనుకూలంగా మాట్లాడతాను. వీరికి ఇష్టం లేని విషయాలు మాట్లాడను. వీరికి ఇష్టమైతే అధర్మకార్యం ఐనా చేస్తాను. (25)
ధర్మమేవ గురుం జ్ఞాత్వా కరోమి ద్విజసత్తమ ।
అతంద్రితః పదా విప్ర శుశ్రూషాం వై కరోమ్యహమ్ ॥ 26
పితృశుశ్రూషాధర్మమే గొప్పదని తెలిసి నాకర్తవ్యాన్ని నెరవేరుస్తుంటాను. ఆలస్యం లేకుండా ఎప్పుడూ వీరసేవ చేస్తుంటాను. (26)
పంచైవ గురవో బ్రహ్మన్ పురుషస్య బుభూషతః ।
పితా మాతాగ్నిరాత్మా చ గురుశ్చ ద్విజసత్తమ ॥ 27
ద్విజసత్తమా! ఆత్మోన్నతిని కోర్ వ్యక్తికి తండ్రి, తల్లి, అగ్ని, పరమాత్మ, గురువు అనే ఐదుగురే గురువులు. (27)
ఏతేషు యస్తు సర్తేత సమ్యగేవ ద్విజోత్తమ ।
భవేయురగ్నయస్తస్య పరిచీర్ణాస్తు నిత్యశః ।
గార్హస్థ్యే వర్తమానస్య ఏష ధర్మః సనాతనః ॥ 28
బ్రాహ్మణోత్తమా! వీరి అందరి విషయంలో చక్కగా ప్రవర్తిస్తూ, గృహస్థధర్మాన్ని సరిగా అనుష్ఠించేవానికి ఎప్పుడూ అగ్నిపరిచర్య చేసినఫలం దక్కుతుంది. ఇది సనాతనధర్మం. (28)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి మార్కండేయసమాస్యాపర్వణి బ్రాహ్మణవ్యాధసంవాదే చతుర్దశాధికద్విశతతమోఽధ్యాయః ॥ 214 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున మార్కండేయసమాస్యాపర్వమను ఉపపర్వమున బ్రాహ్మణవ్యాధసంవాదమను రెండువందల పదునాల్గవ అధ్యాయము. (214)